Sri Jayendravani    Chapters    Last Page

31. రామనామం లిఖించుట

రామనామ జపంకంటే రామనామం వ్రాయటం విశేషమైందని నా అభిప్రాయం. రామనామం వ్రాసే సమయంలో కళ్లు, చేతులు, మనస్సు ఆ పనిలో నిమగ్నమౌతాయి. నామజపంలో అలాగాక ఒక్కమనస్సు మాత్రమే దానిలో లగ్నమైయుంటుంది. కళ్లు, చేతులు ఇతర విషయాలలోను, కార్యాలలోను పరిభ్రమించవచ్చు.

రామనామం వ్రాయటంవల్ల అనేకమైన ప్రయోజనకరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఎవరి గృహాల్లో వారు తమ పూజా మందిరంలో రామనామం వ్రాసి వుంచుకొని ప్రతిదినం పూజలు చేయవచ్చు. తమ గృహాల్లో అలా పూజచేయటానికి వసతులు లేనివారి కొరకు మాత్రమే వాటిని మా మఠాల్లో ఉంచుతాం. శ్రీ నారాయణజియ్యర్‌ వారు ఒకప్పుడు రామనామం వ్రాతల సముదాయాన్ని సమీకరించి వారి మఠమందుంచి ఆరాధించే ఏర్పాట్లు చేశారు. మా మఠం తరుపున మేము పిల్లలను రామనామం వ్రాయుటకు ప్రోత్సహించే వుద్దేశ్యంతో వారికొక్కొక్కరికి ఒక నాణాన్ని ఇచ్చే నియమం పెట్టాం. పైమఠాలు రెండూ ఒకేపనిని నిర్వహించటంలో పోటిపడ్డట్టు కన్పించినా మా లక్ష్యం మాత్రం రామభక్తివైపు ప్రజలను మరల్చటం, అందరూ రామనామ స్మరణతో, రాముడనుసరించిన ధర్మాలను పాటించేటట్లు చేయటం మాత్రమే. ప్రజలందరూ అలాంటి ప్రవర్తనపై ఆసక్తి చూపి నడచుకుంటే రామరాజ్యావతరణ సుగమం కావటంలో ఆశ్చర్యంలేదు.

Sri Jayendravani    Chapters    Last Page