Sri Jayendravani    Chapters    Last Page

ఐదవ భాగము

28. భారతదేశం యొక్క మూడు మహాకావ్యాలు

మన మతంలో అనేక ధార్మిక రచనలున్నాయి. మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవున్నాయి. వీటిలో మహాకావ్యాలుగా పేర్కొనతగ్గవి రామాయణం, భాగవతం, మహాభారతం.

రామాయణంలో రామునియొక్క, భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క, భారతంలో ధర్మపుత్రుని యొక్క కథలున్నాయి.

ఈ మూడు మహాకావ్యాలకు ప్రత్యేకమైన సామ్యంవుంది. శ్రీరామచంద్రుడు నారాయణుని అవతారమే. శ్రీకృష్ణుడు భగవానుని సారూప్యమే. ధర్మపుత్రుడు కూడ దేవతాంశగల అవతార పురుషుడే. రావణ వధకై రాముడు, కంస సంహారానికి కృష్ణుడు, దుర్యోధనాదులను నిర్మూలించుటకు ధర్మపుత్రుడు అవతరించారు.

దుష్టశక్తుల సంహరణ, శిష్టశక్తుల ఉద్ధరణ, సత్సాంగత్యాభివృద్ధి, ఈ మూడు ఈ అవతారాలయొక్క లక్ష్యాలు. అవతారాలు ఎప్పుడు సంభవించినా, ప్రపంచంలో మహాత్ములు ఎప్పుడు జన్మించినా ముఖ్యంగా రెండు విషయాలు ఒకే పర్యాయం జరుగుతాయి. 1) దుష్ఠశిక్షణ, 2) శిష్టరక్షణ. ఒక దీపం వెలిగించగానే మనకు వెలుగు ప్రాప్తించటంతోబాటు అంధకారం అస్తమిస్తుంది. అదే రీతిగా, భగవంతుని అవతారాలవల్ల శిష్టరక్షణతో బాటు దుష్టశక్తుల నిర్మూలనం కూడ సంభవిస్తుంది.

దుష్టశక్తుల సంహరణ ఈ మూడు మహాకావ్యాల్లోనూ వివరింప బడటం గమనిస్తాం. రామాయణంలోని రావణుని విషయంలోగాని, భాగవతంలోని కంసుని విషయంలోగాని ఆదిలో వారివారి శక్తులు విజృంభించి తుదకు క్షీణించి వారి నాశనానికి దారితీయటాన్ని గమనిస్తాం. అలాగే ఆరంభంలో అధర్మం విశృంఖలంగా విస్తరిస్తుంది. ధర్మం క్షీణిస్తుంది. కాని అంతిమంగా ధర్మం జయించి, అధర్మం నశింపబడుతుంది. ఈ రెండు పరిణామాలు ఒకే పర్యాయం సంభవిస్తాయి.

ఈ మహాకావ్యాల పఠనం వల్ల సత్ఫలితాలు అనేకం సమకూరుతాయి. ఈ గొప్ప అవతారాలు మన మధ్య జీవించి ధర్మాల్ని అనుసరించటంలోను, అభ్యసించటంలోను కూడ అత్యుత్తమ మార్గాల్ని వివరించాయి. ఈ మహాకావ్యాల నుంచి స్ఫూర్తిని సేకరించి స్వధర్మాల్ని అవలంబిస్తూ, అవతారాలు ప్రకటించిన ఆదర్శాలను అమలుజేస్తూ జీవితాల్ని సుఖమయం చేసుకుందాం.

Sri Jayendravani    Chapters    Last Page