Sri Jayendravani    Chapters    Last Page

2. మనదేశం,

దాని సంస్కృతీ నాగరికతలు

పురాతనమైన మతంతోను, నాగరికతతోను విలసిల్లు మనదేశం అతి ప్రాచీనమైంది. ఈ రోజు మరొకమారు మనది స్వాతంత్ర్య దేశంగా ప్రపంచ దేశ సముదాయంలో గౌరవస్థానాన్ని పొందింది. మానసిక ప్రశాంతత నిశ్చలతలను ప్రతివ్యక్తికి ప్రసాదించగలవి అనితర సాధ్యమైన మనదేశ ప్రాచీన సంస్కృతీ నాగరికతలే. ఇవే దేశ ఔన్నత్యానికి కారణం కాని మనం సాధించిన పారిశ్రామిక ప్రగతి కానేరదు. మనదేశంలో మాత్రమే ఆధ్యాత్మిక విలువలున్నాయి. ఇతర దేశాల్లో ఇది సాధ్యం కాదు.

మానసిక శాంతి మూల్యం చెల్లించి కొనుగోలు చేయటానికి లభించేదికాదు. వ్యక్తిగత ప్రయత్నంతోను, ఆంతరంగిక పరివర్తన తోను మాత్రమే ఇది లభిస్తుంది. మనదేశం పవిత్రమైంది, పాపరహితమైంది గనుక ఆంతరంగిక సంస్కరణలు సులభ సాధ్యమవుతాయి. ఆ కారణంగానే పరదేశీయులు మన దేశానికి ఆకర్షితులై వస్తూవుంటారు. వారి వారి దేశాల్లో లభ్యంకాని మానసిక శాంతిని, ఆధ్యాత్మిక పరివర్తనను అన్వేషిస్తూ వారు మనదేశం వస్తారు.

అదేవిధంగా మన ప్రాచీన భాషయైన సంస్కృతాన్ని అభ్యసించటానికి మన సంస్కృతీ నాగరికతలను గ్రహించటానికి మానసిక శాంతి పట్ల ఆసక్తి చూపుతూ దాన్ని పొందటానికి విదేశీయులు మనదేశానికి వస్తారు. విదేశీయులు మన ఆచారాల పట్ల, సంస్కృతి విషయంలోను శ్రద్ధ కనబరుస్తుంటే మనమేమో వారి అలవాట్లను గ్రుడ్డిగా అనుకరిస్తున్నాం. ఆ కారణంగా మనదేశంలో ప్రజలు ఒక విధమైన అశాంతికి, ఆవేదనకు గురి¸°తున్నారు. మనకే మానసిక ప్రశాంతత కరువైతే మనం ఇతరులకు శాంతిని ఎలా ఇవ్వగల్గుతాం !

మనకొక జాతీయజండా, జాతీయ పక్షి ఉన్నాయి. జాతీయ భాషకొరకు కూడా ఆందోళన సాగుతోంది. అదే ప్రమాణంలో మన ప్రాచీన సంస్కృతిని, నాగరికతను నిలుపుకొనుటకు మనం కష్టించాలి. ఈ బాధ్యత దేశ ప్రజలందరి పైన ఉంది. రాజకీయ నాయకులెటూ దీనిని పట్టించుకోరు గనుక ప్రజలమే ఈ విషయంలో శ్రద్ధ వహించాలి.

ఒక్కొక్కప్పుడు మనపిల్లల్ని చూస్తుంటే వారు మనదేశంలోనే జన్మించారా లేక మరొక చోట పుట్టారా అని ఆశ్చర్యపోతాము. వారు ఇతరత్రా ఎలావున్నా కనీసం ఇంటివద్ద నున్న సమయంలో నైన మన దుస్తులు ధరించి మన సంప్రదాయాలు మనసంస్కృతికి అనుగుణంగా సంచరించేటట్టు చేయాలి. బయట ఏ రకమైన దుస్తులు ధరించినా దేవాలయంలో ఉన్నంత సేపు ఆ సంప్రదాయానికి సంబంధించిన దుస్తులు మాత్రమే ధరించాలి. అలాగే భోజన సమయాల్లో కూడ మన సాంప్రదాయ పరమైన వస్త్రధారణ చేసేటట్లు చూడాలి. ఈ విషయాలు మన పిల్లలకు బాల్యం నుండి నేర్పాలి.

కాని ఈ బాధ్యత నిర్వర్తించుటకు తల్లిదండ్రులకు చాలినంత సమయం లేదనే వాదన తరచు వింటుంటాం. ఇది యదార్థంకాదు. ఆటలకు, వినోదాలకు, వార్తాపత్రికలు పఠించుటకు మనం ఎంతోకాలం వ్యయంచేస్తాం. కాని మత సంబంధమైన విధులు నిర్వహించటానికి మాత్రం సమయం చాలదనే నెపం కల్పించు కుంటాం. 24 గంటల్లో కనీసం 20 నిముషాలైన ఈ పనికి వినియోగించగల్గితే చాలు. ప్రజల జీవితాల్లో అదే చాల మంచి మార్పును సాధిస్తుంది. ఈ జన్మలో అది వీరిని రక్షించటమేగాక ఉత్తర జన్మలకు కూడ మంచిని సమకూరుస్తుంది.

మన ధర్మమేమిటో మన నాగరికత ఏమిటో, మన సంస్కృతి ఏమిటో తెలిసికొనుట ప్రతివాని ప్రథమ కర్తవ్యం. తల్లి కూతురు వలెను, తండ్రి కొడుకువలెను ప్రవర్తిస్తే కూతురు తల్లిపాత్రను, కొడుకు తండ్రి పాత్రను తీసుకునే ప్రమాదం ఏర్పడుతుంది. అందుమూలంగా కుటుంబ విలువలు తలక్రిందులై ఎవరికివారు తమ పరిధిని అతిక్రమించటం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులే మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రద్ధను లేక విశ్వాసాన్ని పెంచుకోవాలి.

అదేవిధంగా ఆచార్యుడు తాను గురువుగాను, శిష్యుడు తాను శిష్యుడుగాను ప్రవర్తించాలి. వారి స్థానాల్ని తారుమారు చేసి సంచరించరాదు. ఈ విధంగా మాత్రమే మనం మనదేశంలో ఒక గౌరవస్థాయిని, క్రమశిక్షణా స్థితిని నెలకొల్పగలం. తద్ద్వారా మనలోని అశాంతిని పారద్రోలగలం.

ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఇండ్లలో ఏదో పారాయణ చేయటం, పూజలు నిర్వహించటం, దేవతల్ని ఆరాధించటం చేస్తూ ఉంటారు. కాని భారతదేశ సజీవమైన సంస్కృతిపై ప్రగాఢ విశ్వాసం లేకుండా ఈ ప్రక్రియ లెన్ని చేసినా నిరుపయోగమే. స్వధర్మాన్ని విడనాడి ఎన్ని పూజలు చేసినా వృధాప్రయాసే. కనుక మన సంస్కృతిని, నాగరికతను, ఆచార వ్యవహారాలను, నడతను, ధర్మాన్ని, భక్తిని, సాంప్రదాయాలను పరిరక్షించుకోటానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వాటిని వాటి సహజ స్థితిలోనే కాపాడుకోవాలి.

ఇవన్నీ ప్రవహించుచున్న నదుల్లాంటివి. వీటిని జాగ్రత్తతో చూస్తూ వాటి ప్రవాహాల్ని భద్రపరుస్తే తప్ప ఆదిలో అమితవేగంతో పుష్కలమైన నీటితో ప్రవహించి రాను రాను నీరు ఇంకి ఇసుక మెట్టలుగ మారు నదులవలె పరిణమిస్తాయి. మన నాగరికతను, సంస్కృతిని, సాంప్రదాయాల్ని పరిరక్షించు కోగల్గితే ధర్మమనే నది నిత్యం ప్రవహిస్తూ సజీవంగా విలసిల్లుతుంది.

భారతీయ సంస్కృతిని, నాగరికతను, హిందూమతాన్ని, ధర్మాన్ని మన పిల్లలకు బోధించాలని మా సూచన. తల్లిదండ్రులే ఈ విషయాన్ని ప్రప్రథమంగా అలవరచుకొని తర్వాత వాటిని తమ సంతానానికి బోధించాలి. అలా వర్తించి మనం మన ధర్మాన్ని రక్షించుకోగల్గితే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షించకపోతే ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుంది ? దొంగల బారినుండి కాపాడుకోటానికి కొందరు కుక్కల్ని తమ ఇండ్లలో పెంచి పోషిస్తారు. కాని ఆ కుక్కల్ని జాగ్రత్తగా పోషించక పోతే అవి తమ యజమానులకు రక్షణ ఎలా కల్పిస్తాయి ? అదేవిధంగా ధర్మాన్ని మనం కాపాడగల్గితేనే ధర్మం మనల్ని కాపాడుతుంది.

''ధర్మో రక్షతి రక్షితః''

తల్లిదండ్రులు తమ పిల్లల్ని తగిన శ్రద్ధతో పెంచకపోతే వారు పెద్దవారై సంపాదించుకొను శక్తిరాగానే మాతాపితరులను, కుటుంబాన్ని వారి కష్టాలకు వార్ని వదలి విడిగాపోతారు. వృద్ధాప్యంలో కూడ తండ్రి తమను పోషించుకోటానికి తన జీవితమంతా శ్రమించి బాధలను భరించాల్సిందే.

భక్తిజ్ఞాన విషయాల్లో మనదేశంలో మన ప్రాచీనుల నుండి సంక్రమించిన గ్రంథసముచ్చయం వుంది. మనమహర్షుల యొక్క, మేధావుల యొక్క జీవిత చరిత్రల నుండి కొలదిగనైన మనపిల్లలకు బోధించాలి. ఈ విజ్ఞానమే వారికి బ్యాంకులో నిల్వచేసికొన్న అమూల్యమైన సంపద కాగలదు. ఇదే వారి భవిష్యత్తుకు మంచి మూలధనం కూడ అవుతుంది.

మన ధర్మాన్ని అనుష్ఠించటానికి తగ్గ వాతావరణం మనకు లేదనే వాదనను తరచుగా వింటూంటాం. అంతేగాక మన సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరించటానికి సహాయపడే పరిస్థితులు లేక మనం సత్ర్పవర్తనను అలవరచుకోజాలక చెడుమార్గాల్ని ఆశ్రయించి దుర్జనులుగ మారుతున్నామనే అపవాదుకూడ ప్రచారంలో ఉంది.

పరమాత్మ గడచిన యుగాల్లో రాముడు, కృష్ణుడుగ అవతరించాడు. కాని కలియుగంలో అలా అవతరించటానికి ఇంతవరకు అవకాశం కల్గలేదు. కలియుగం నాల్గుపాదాల్లోను ప్రస్తుతం ప్రథమచరణం నడుస్తోంది. నాల్గవ పాదాంతంలోగాని భగవానుడు కల్కిగా అవతరించడు. కాని ప్రస్తుతం పరిస్థితులు అంత విషమించాయా? 'లంచగొండితనం మితిమీరింది. క్రమశిక్షణా రాహిత్యం అన్ని రంగాల్లోను వ్యాపించి మిన్నంటింది. అధర్మమైతే విరివిగా విస్తరిల్లుతోంది. ప్రజలు శారీరక, మానసిక రుగ్మతలతో పీడింపబడుతున్నారు. ఈ విధంగా ప్రపంచం అంతా దుఃఖమయమైంది. స్వామిజీ ! ఈ సమస్యలకు పరిష్కారమేమిటి ?' అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు. నా అభిప్రాయంలో పరిస్థితులు మరీ అంత అధ్వాన్నంగా లేవు. అధర్మం విశృంఖలంగా విజృభించి, దుష్టశక్తులు పరిధులుదాటి వీరవిహారం చేస్తుంటే తప్ప కల్కి తన అవతారాన్ని ఆవిష్కరించడు. ప్రస్తుతమైతే మనం అంత నీచస్థితికి, అధర్మపుటంచులకు దిగజారలేదు. మన వాతావరణం, పరిసరాల ప్రభావంవల్ల మనం చెడుగా ప్రవర్తిస్తున్నాం. మనం మన చుట్టూ అనుకూల వాతావరణాన్ని కల్పించుకోగల్గితే మంచిని విడనాడకుండా ఉంటాము. సజ్జనులు, పవిత్రులు ఐనవారి సాంగత్యం వల్లను, దేవాలయాల్లో జరిగే సత్కాలక్షేపాల్లో పాల్గొనటం చేత మనకు సత్ర్పవర్తన అలవడుతుంది. దుష్టుల సాంగత్యంలోను, చెడు వాతావరణం లోను సంచరించినప్పుడే మనం దుష్ర్పవర్తనకు లోనౌతాం. కనుక మనమెప్పుడూ సజ్జన సాంగత్యాన్వేషణలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మన సచ్ఛీలాన్ని, గుణ సంపదను నిలబెట్టు కుంటాం.

గుల్జారీలాల్‌ నందా మన ఆర్షసాంప్రదాయాలను, సంస్కృతిని, నాగరికతను మనకు గుర్తుచేయటానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని సంకల్పించటం మనకు చాల సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ ఉద్యమాన్నే మానవ ధర్మ ప్రబోధ ఉద్యమమంటారు. ఇది ఇప్పటికే కార్యరూపందాల్చి సత్ఫలితాల్ని ఇస్తోంది. ఈ కార్యక్రమానికి మనమందరం సహకరించి అందులో భాగస్వాములమవటం మన ధర్మం. ఈ ఉద్యమం సఫలీకృతం కాగలదని ఆశిద్దాం.

ఆ విధంగా మళ్లీ మన సనాతన ధర్మం, సంస్కృతి, నాగరికతలు పునరుజ్జీవింపబడగలవు ఆదిశంకర భగవత్పాదులు జగద్గురువైన కృష్ణపరమాత్మను ప్రార్థించినట్లు మనం కూడ ఆ కృష్ణపరమాత్మ ఆశీస్సుల కొరకు ఆయన్ని ఆరాధిద్దాం. కృష్ణపరమాత్మ గీతలో మనకెన్నో విషయాలు బోధించారు. కాని కేవలం గీతాపారాయణం వల్ల, పఠనం ద్వారా మనకు ఏమీ లబ్థి ఉండదు. గీతాసందేశాన్ని దాని నిజమైన స్థితిలో మనలో జీర్ణించుకొని మన నిజజీవితంలో అసలైన సాధకుని వలె ఆ బోధనలను అమలుచేయాలి.

భగవానుడు తన శుభాశీస్సులను అందరిపై ప్రసరించి అందరికి అతిశయించిన సౌభాగ్యసంపన్నతకు, సుఖజీవనానికి దారి జూపు గాక!

Sri Jayendravani    Chapters    Last Page