Sri Jayendravani    Chapters    Last Page

16. సగుణరూపంలో భగవదారాధన - (ii)

సనాతన ధర్మానుసారం లేక ప్రాచీనమైన హిందూమతం ప్రకారం భగవంతుని రెండు రూపాల్లో ఆరాధించవచ్చు. ఇతర మతాలవారు భగవంతుని ఒకే ఒక్క రూపంలో విశ్వ వ్యాప్తునిగా భావించి ఆరాధిస్తారు. హిందూమతం ప్రకారం పరమాత్మ సర్వవ్యాపకుడేకాదు, సృష్టిస్థితి లయకారకుడుకూడ. అంతేకాదు ఆయన అనేక అవతారాలను ఎత్తుతాడు. సర్వలక్షణ సమన్వితమైన సగుణరూపంలో ఆయన్ని మనం ఆరాధించవచ్చు. ఆ విధంగా గణశుడు, కార్తికేయుడు, పార్వతి, దుర్గ, శివుడు, విష్ణువు యొక్క 10 లేక 21 అవతారాలుగా మనకు భగవానుని ఆకృతులున్నాయి. భగవంతుడు ఒక్కొక్క రూపాన్ని ఒక ప్రత్యేకమైన పనికై ధరిస్తాడు. అలా రాముడుగా, కృష్ణునిగా అవతరించి మానవుల మధ్య ఒక మర్త్యునిగా జీవించాడు. ఆయన మహాపురుషుల రూపంలోకూడ అవతరిస్తాడు. మానవుల శ్రేయస్సుకై తన కరుణను ప్రసరింపచేయుటకే ఆయన అవతరిస్తాడు. ఇతర మతాల్లో ఈ సిద్ధాంతానికి చోటులేదు. ఇతరమతాలవారు ఆయన్ని విశ్వవ్యాప్తునిగానే ప్రకటించుకుంటారు. భగవానుని సగుణరూపంలోను, నిర్గుణరూపంలోను కూడ ఆరాధించే ప్రత్యేక లక్షణం హిందూమతం మాత్రమే కల్గివుంది.

నిర్గుణోపాసనలో అర్చనకు, అభిషేకానికి, కీర్తన మొదలైన వాటికి ఎక్కువ అవకాశంలేదు. కాని సగుణరూపారాధనలో అభిషేకానికి, అర్చనకు, భజనలకు, అవతారాల మహిమలను లేక లీలావిభూతులను కీర్తించుటకు విస్తృతమైన అవకాశం వున్నది. ఇతర మతాలవారు వారివారి అభీష్టసిద్ధికొరకు చిల్లర దేవుళ్లను, దేవతలను అర్చిస్తారు. కాని సగుణరూపంలో ఆరాధించే తత్వాన్ని వారు ఆమోదించారు.

హిందూమతంలో విగ్రహారాధన సిద్ధాంతం స్థిరపడింది. మన ఆరాధ్యదేవతను మన మనస్సులో మనం స్థిరీకరించుకొని ఆరూపాన్ని ఆరాధిస్తాం. ఆలయాల్లో విగ్రహాన్ని నెలకొల్పి, ప్రతిష్ఠించి ఆరాధించి ఆ దేవత యొక్క దీవెనలను స్వీకరిస్తాం. భగవంతుని విశ్వవ్యాపక మూర్తిగా లేక నిర్గుణ రూపునిగా ఆరాధించ కల్గటం సామాన్య గృహస్థునికి సాధ్యపడేదికాదు. నిమీలితనేత్రులై సర్వవ్యాపకస్థితిలో భగవానుని గురించి ధ్యానం చేయటం ఆరంభించగానే, కళ్లు, చెవులు, మనస్సు ఇతర విషయాలపై సంచరించటం మొదలుపెడతాయి. కనుక మామూలు గృహస్థులకు సర్వలక్షణ సమన్వితుడై సగుణరూపంలో వున్న దేవునిగాని, ప్రత్యేకమైన ఇతర దేవతామూర్తినిగాని ఎన్నుకొనుటే శరణ్యము.

నిజానికి ప్రపంచంలో మానవులెంతమంది కలరో అన్ని రూపాలు ఈశ్వరునకున్నాయి. మన అభీష్టాన్ని బట్టి, మనశక్తి ననుసరించి, మనం వాంఛించే ఫలితాల్ని బట్టి మనం ఆరాధించటానికి అనువైన ఈశ్వర రూపాన్ని ఎంచుకుంటాం.

శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు భక్తులను నాల్గు ప్రధాన వర్గాలుగా వభజించవచ్చు.

''ఆర్తో, జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ||'' రోగపీడితులైన ప్రజలు, ధనాపేక్ష కలవారు, కార్యార్థులు మరియు పరమాత్ముని గురించి తెలుసుకోదలచినవారు అందరూ వారివారి అభిరుచుల ప్రకారం వారి వారి అవసరాలననుసరించి భగవదారాధన చేస్తారు.

మామూలుగ లక్ష్మీదేవినో, సత్యనారాయణ స్వామినో ఆరాధిస్తే ఫలితం లభిస్తుందని ఎవరో సలహా ఈయగానే ఆ దేవతను ఆరాధించటం ఆరంభిస్తాం. మరొకరు వినాయకుడైతే నీకు సంభంవించే ఆటంకాల్ని నిర్మూలిస్తాడని చెప్పగానే వినాయకుని వైపు మరలుతారు. కాని భక్తుడైనవాడు ఏదో ఒకమూర్తిని ఎన్నుకొని ఆ మూర్తిపైనే దృష్టిని నిలిపి ఆరాధించటమే ప్రధానలక్ష్యంగా పెట్టుకోవాలి. అలా చేస్తే పరమాత్మను పొందగల్గుతాడు.

ఉదాహరణకు విద్యుత్‌ పంకా, విద్యుత్‌బల్బు, రేడియో, మైకు, టేపురికార్డరు మొదలైనవి వివిధములైన ఆకారాలతో భిన్నభిన్నమైన పనులను నిర్వర్తిస్తాయి. కాని వాటన్నిటిలోను విద్యుత్ర్పవాహమే చోదకశక్తి. అలాగే మనకొరకు భగవానుడు వివిధ రూపాల్ని ధరించినా అన్నిటిలోను వున్న పరమాత్మ ఒక్కడే.

దీనినే మరొక సామ్యంతో వివరించగలను. మన భారతదేశం ఈ రోజు ఒక ప్రధానమంత్రిచే పరిపాలింపబడుతోంది. ప్రధానమంత్రి క్రింద వివిధ శాఖలను నిర్వహిస్తూ అనేకమంది మంత్రులు, ఇతర అధికార్లు వుంటారు. అదే విధంగా దేవగణంలో ఇంద్రుడు మొదలు విష్ణువు శివుడువరకు పరిపాలకులు అనేకులున్నా వారందరిలోను ప్రవహించే విద్యుచ్ఛక్తి ఒక్కటే. దానినే పరమాత్మ అంటాము.

ఇంకా చెప్పాలంటే మైదా, పంచదార లేక గోధుమ, పంచదార వీటిని ఉపయోగించి తీపిపదార్థాల్ని తయారుచేయటం మనకు తెలుసు. అలా తయారుచేయబడ్డ తీపి పదార్థాలు భిన్నభిన్నమైన పేర్లతో ప్రచారంలో వున్నా అవన్నీ మౌలికంగా తీపి పదార్థాలే. సగుణరూపంలోని పరమాత్మకు కూడ ఇది వర్తిస్తుంది. మిఠాయి వస్తువులు భిన్నభిన్న రూపాల్లో వుండి, వేరువేరు రుచులను అందించినా అంతిమంగా తీపిదనమే మిగులుతుంది. అలాగే మనం భగవంతుని వివిధ మార్గల్లో ఆరాధించినా, భక్తిని ప్రదర్శించినా ఇవన్నియూ తుదకు పరమాత్మను చేరుటకే సహకరిస్తాయి. ఒక దేవతను ప్రత్యేకంగా ఆరాధించవచ్చు. ఆ దేవతయొక్క దర్శనాన్ని పొందవచ్చు. కాని అన్ని వేళల మనం పరమాత్మ తలంపులోనే నిమగ్నులమై యుండాలి. భగవంతుని ఆకృతులు కొన్ని అసాధారణమైన వాహనాలతో ఘనంగా వుండవచ్చు. కాని ప్రతి ఆకృతికి ఒకచరిత్ర వుంటుంది. అది దైవిక సత్యాల్ని కొన్నిటిని ప్రదర్శిస్తుంది కూడ. కాని అవి అన్నియు పరమాత్మ రూపాలే.

పరమాత్మునికి అసంఖ్యాకములైన రూపాల ఆవశ్యకత ఏమిటనే ప్రశ్న మనకు ఉదయించకపోదు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ వుంది. మనం ఆకలిగొన్నప్పుడు ఆహారం తీసుకుంటాం. ఆకలి గొన్నపొట్ట నింపుకొనుటకు అన్నంమాత్రం తిని నింపుకో వచ్చుగదా. అన్ని రకాల పదార్థాలతో పని ఏమి ? దానికి కారణం లేకపోలేదు. మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని చల్లార్చుకొనుటకేగాదు. జిహ్వ రుచులను కోరుతుంది. అట్లే కంటికి ఇంపుగా వున్న వస్తువుల్ని, అనుకూలమైన వాసన, రుచి గల వాటిని భుజించాలని కోరుకుంటాం. కనుక ఈ గుణాలన్నీ కల్గిన షడ్రసోపేతమైన ఆహారాన్ని తినాలని అందరం ఆకాంక్షిస్తాం. 'లోకోభిన్నరుచిః' అను లోకోక్తి ప్రకారం ప్రజలుకూడ దేవుని వివిధ రూపాలకు ఆకర్షితులై ఎవరికి నచ్చిన రూపాన్ని వారు ఎన్నుకొని ఆరాధిస్తారు. భగవంతుని ఏ రూపంలో కొలిచినా ఆయన సంతృప్తుడై మనల్ని దీవిస్తాడు. గీతలో శ్రీకృష్ణుడు ఈ క్రింది విధంగా చెప్తాడు.

శ్లో|| ''యో యో యాం యాం తను భక్త్యా శ్రద్ధయార్చితు మిచ్ఛతి |

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్‌ || ''

""INRP ˳ÏÁNRPVò²R…V ƒ«sƒ«sVõ INRP LRiWxmsLiÍÜ[ ALSµ³j…Li¿yÌÁ¬s NSLiOTPQ}qsò A ˳ÏÁNRPVòƒ«sNRPV A LRiWxmsLiÍÜ[®ƒs[ úxmsgS²³R…\®ªsVƒ«s „saS*xqsLi NRPVµj…lLi[ÍØ µk…„sLiÀÁ »R½LjiLixms ¿Á[ryòƒ«sV.''

శ్రీకృష్ణుడు గీతలో మరియొక విషయం కూడ చెప్పాడు ;

''యే యధా మాం ప్రపద్యన్తే తాంస్తధైవ భజామ్యహమ్‌''

''భక్తులు నన్ను చేరటానికి ఏ మార్గాన్ని అనుసరించినా, వారికి ఆ మార్గంలోనే విశ్వాసాన్ని కల్గజేసి వార్కి స్వాగతం పల్కుతాను.''

సగుణరూపాన్ని ఆరాధించటానికి మరొక ప్రబల కారణంకూడ వుంది. మానవులు విభిన్నమైన మనస్తత్వాలు గలవారుగా వుంటారు. కొందరు సత్వగుణప్రధానులు. మరికొందరిలో రజోగుణం ప్రబలంగా వుంటుంది. ఇంకా కొందరు తమోగుణ ప్రధానులు. కనుక వీరు ఎంచుకునే దైవస్వరూపం వారివారి మనస్తత్వాలను బట్టి మారుతుంది. అలా ప్రతివాడు తన మానసిక శక్తిని, తత్వాన్ని బట్టి దేవునో, దేవతనో తనకిష్టమైన రూపంలో ఆరాధిస్తాడు.

సగుణరూపంలో ఆరాధన మరొక విధంగాకూడ మనకు ఆవశ్యకం అనిపిస్తుంది. ఉదాహరణకు తీపిదనం అంటే ఏమిటో తెలిసికోవాలంటే ఆ రుచిని గురించి మనకు అవగాహన కావాలి. అందుకొరకు కలకండనుగాని, మామిడిపండుగాని, హల్వా లేక మరేదైనా తీపివస్తువు తీసికొని తినాలి. అప్పుడు దాని మాధుర్యం మనకు తెలుస్తుంది. దాన్నిబట్టి తీపిదనం అంటే రుచి ఇలావుంటుందని ఒక భావన మనకు స్థిరమౌతుంది. తీపివస్తువు భుజించకుండా తీపిదనం ఎలావుంటుందో చెప్పమంటే చెప్పటం కష్టం. అలాగే సగుణరూప ధ్యానాన్ని తెలుసుకోకుండా నిర్గుణ తత్వస్వరూపాన్ని నేరుగా చింతించటం, మనస్సును కేంద్రీకరించటం దుర్లభం. చపల చిత్తులైనవారికి ఒక బిందువుపై ఏకాగ్రతను సాధించుట కొరకు సగుణ రూప ఆరాధన అత్యవసరం. ఆ ఆరాధనలో అర్చన, అభిషేకం, హారతులు మొదలైన క్రియా కలాపం ఇమిడి వుంటుంది. కనుక ఆరాధ్య దేవతామూర్తిపై మనస్సును నిల్పటం సాధ్యమవుతుంది.

మన మతంలో భగవంతుని సగుణరూపాలు అనేకములున్నాయి. ఉదాహరణకు వినాయకుని ఆకృతిలోని భగవత్స్వరూప మొకటి. వినాయకుడు విఘ్నాలను నివృత్తి చేస్తాడు. అలాగని ఆయనకు ఆ శక్తి తప్ప మిగతా శక్తులు లేవనికాదు. ఆయనకు అన్ని శక్తులూ వున్నాయి. మోక్షాన్నికూడ ప్రసాదించగలడు. అయినా ప్రత్యేక నిపుణత్వంగల వైద్యుని వలె ఆయన ఆ శక్తిని ప్రదర్శిస్తాడు.

కొన్ని రోగాల్ని మాత్రమే నివారించే ప్రత్యేక నైపుణ్యంగల వారు వైద్యుల్లో వుంటారు. అలాగని వార్కి వైద్యశాస్త్రం యొక్క సామాన్య జ్ఞానం లేదనిగాదు. అదేవిధంగా వినాయకునకు కూడ అన్ని శక్తులు వున్నాయి. కాని ప్రజల్లో విశ్వాసాన్ని కల్గచేయటానికి, భగవంతుని వైపు వారిని ఆకర్షించటానికి ఆయన తన ప్రత్యేకమైన శక్తిని ప్రదర్శిస్తాడు. ఈశ్వరుడు కూడ సర్వశక్తిమంతుడు. ఐనా భక్తుల్ని తనవైపు ఆకర్షించుకోటానికి ఆశక్తిలో ఒక ప్రత్యేక అంశాన్ని ప్రదర్శిస్తాడు. అలాగే లక్ష్మీదేవి సంపదను ప్రసాదించే ప్రత్యేకతను కనబరుస్తుంది. ఆమె మిగతా శ్రేయస్సులను కూడ భక్తులకు అందిస్తుంది. వైష్ణవుల నమ్మిక ప్రకారం లక్ష్మీదేవి ప్రసన్నురాలు కానిచో విష్ణువు ప్రసన్నుడుకాడు. భక్తునిపై కటాక్షం చూపమని మాత విష్ణువుతో చెప్పనిచో విష్ణువు భక్తుని అనుగ్రహించడు.

ఈశ్వరుడు ఒక రూపంలో ఒక ప్రత్యేకశక్తిని ప్రదర్శించినా, ఆయన అన్ని రూపాలు అన్ని శక్తుల్ని కలిగివుంటాయి. మానవుల్లో భక్తిని ఉద్దీపింప చేయటానికి ఒక రూపం ఒకే ప్రత్యేకమైన శక్తిని ప్రదర్శిస్తుంది.

వేదవ్యాస విరచితమైన స్కందపురాణం, విష్ణుపురాణం, భాగవతం, దేవీభాగవతం మొదలైన 18 పురాణాలు, ఒక్కొక్కటి ఒక దేవతను గురించి ప్రస్తుతిస్తుంది. ఒక్కొక్క పురాణం ఒక దేవత యొక్క అధిపత్యాన్ని, ఇతర దేవతలతో పోలిస్తే ఆ దేవతకున్న అధిక మహనీయతను స్తుతిస్తుంది. ఉదాహరణకు స్కందపురాణం సుబ్రహ్మణ్యశ్వరుని యొక్క, విష్ణుపురాణం విష్ణువు యొక్క, శివపురాణం శివుని యొక్క మహిమల్ని స్తుతించుటకు అంకితమౌతాయి. ఈశ్వరుని యొక్క ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పురాణంలో విశ్లేషించి ప్రస్తుతించటమే దీని ఉద్దేశ్యం.

కాని ఈశ్వరుడు సర్వశక్తి సమన్వితుడు. ఆయన ఏ రూపంలో వున్నా అన్ని రూపాలు పరమాత్మకు సంబంధించినవే. అన్ని శక్తులు ప్రతిరూపంలోను సమీకృతమైయుంటాయి.

ప్రజలు మనస్సులో తాము ఏ దేవతను ఆరాధించాలా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కొంతమంది ఇంతమంది దేవతల యొక్క ఆవశ్యకత ఏమిటి అని ప్రశ్నిస్తారు. చాలమందికిది అనిశ్చిత పరిస్థితిని కూడ కల్పిస్తుంది. ఏ దేవతను ఆరాధించాలో నిర్ణయించుకోలేక ఒకే దేవతను స్థిరంగా ఆరాధించక, ఒక దేవతనుండి మరియొక దేవతకు తమ లక్ష్యాన్ని మారుస్తుంటారు. ఉదాహరణకు అంబను ఆరాధిస్తే మంచిదని ఎవరైన చెప్పగా అతడు అంబను ఆరాధించటం ఆరంభిస్తాడు. అలా చేసింతర్వాత అతని సమస్యలు పరిష్కరింపబడకపోతే మరియొకరు వినాయకుని ఆరాధిస్తే మంచిదని చెప్తారు. వినాయకుని ఆరాధించటం ప్రారంభిస్తాడు. అయినా అతనికి సంతృప్తి కలగదు. మరొకరు విష్ణువుని ఆరాధిస్తే సకల సుఖాలు ప్రాప్తిస్తాయని చెప్పగా అంతిమంగా విష్ణువును ఆరాధించటం సాగిస్తాడు.

ఈ విధంగా నెలకొక దేవుని మారుస్తూ ఆరాధన విధానాన్నీ, మంత్రజపాల్ని కూడ ఆ దేవతకనుకూలంగా పరివర్తింపచేస్తూ వుంటాడు. కాని ఇలా చేయటం చాలపొరపాటు. ఆరాధించే దేవతలను మారుస్తూపోవటం మంచిదికాదు. ఈశ్వరుని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు. ప్రతివాడు తన ఇష్ట దేవతను ఎన్నుకొని ఆ దేవతనే నిశ్చలమైన భక్తితో ఆరాధించటం ఉచితం. ఒకేదేవతపై మనస్సును నిలుపటమంటే ఇతర దేవతలజోలికి పోరాదని కాదు. అన్ని రూపాలలోని దేవతలను ఆరాధించవచ్చు. కాని ఒకే దేవతపై ఏకాగ్రతను నిలిపి ఆరాధించుట యుక్తము. వైష్ణవులలో ఆరాధన విషయంలో ఒక దేవతనుండి మరియొక దేవత కొరకు మార్చుకునే పద్ధతి యుండదు. విష్ణువొక్కడే ఆరాధ్యదైవంగా నిర్ణయించుకొని పూజించాలి యని నిర్థారించబడుతుంది. కనుక వైష్ణవుల కీ విషయంలో అనిశ్చిత పరిస్థితి ఎదురుగాదు. స్మార్తుల విషయంలో మాత్రమే ఈ వైకల్పికస్థితి సంచరించి, ఏ దేవతనూ స్థిరీకరించుకోలేని అవస్థ ఏర్పడుతుంది.

సగుణ రూపాలు బహుళంగా వుండటానికి కారణం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపానికి ఆకర్షితులౌటయే. రెండవదేమంటే ఒక్కొక్క రూపానికి వెనుక మనమతంలో ఒక్కొక్క ప్రత్యేకమైన ఇతిహాసం వుంటుంది. ఉదాహరణకు వినాయకుని జన్మవృత్తాంతం ఒక పురాణంలో వర్ణింపబడింది. అలాగే కృష్ణుని, రాముని అవతారాల్ని, వారి లీలావిభూతుల్ని మరికొన్ని పురాణాలు ప్రస్తుతించాయి. ఆయాకాలల్లో ఉద్భవించిన మహనీయుడైన ఆచార్యుల యొక్క చరిత్రలు వారి మహోపదేశాల వివరణలతో మనకు కథలు కూడ వున్నాయి. మనకు ఉత్తమమైన నీతిధర్మాల్ని బోధించటానికి, మన దైనందిన జీవితాలను సన్మార్గాల్లో నడుపుకోటానికి మాత్రమే ఈ సంపుటీకరణం జరిగింది. మొత్తం ఈ విషయ సమీకరణమే సగుణోపాసనగా ప్రవర్తిల్లుతోంది.

భగవానుని ప్రతిరూపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత వుంది. నిజానికి, ప్రతిదేవత యొక్క ఆకృతి ఒక ప్రత్యేక స్వారస్యాన్ని కల్గి మనకు దైనందిన వ్యవహారంలో కావాల్సిన ఉన్నత సత్యాలను, ఉజ్వలప్రమాణాల్ని సూచిస్తాయి. ఉదాహరణకు వినాయకుని రూపం పరబ్రహ్మ చిహ్నమైన ప్రణవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే విచ్ఛిన్నమైన ఆయన దంతం, ఆయన కుండబొజ్జ ఆకారం కొన్ని ప్రత్యేకమైన వాటికి చిహ్నాలుగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్యశ్వరుని యొక్క షణ్ముఖములు, ఆయన నెమలి వాహనం మొదలైనవి ఉత్తమమైన నైతిక ధర్మాల్ని గుర్తుచేస్తాయి.

కాని వినాయకుడు గాని, సుబ్రహ్మణ్యశ్వరుడు గాని పరమాత్మ యొక్కప్రతిరూపాలే. కొంతమంది భక్తుల కోర్కెలను తీర్చి వరాలు ప్రసాదించుట కొరకే వారు ఆయా రూపాలను స్వీకరించారు. ఇతరులు మనల్ని ఒక దేవతయొక్క రూపాన్ని, ఆయన వాహనాన్ని గురించి వివరణ అడిగినప్పుడు మన అజ్ఞానాన్ని వెల్లడిస్తాం. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గురించి తెలిసికోటానికి శ్రద్ధ చూపం. కాని ఇతర మతస్థులు ఇలాంటి విషయాలను చాల శ్రద్ధతో, భక్తితో తెలిసికొని అడిగిన వారికి సమాధానమిస్తారు.

వినాయకుడుగాని, సుబ్రహ్మణ్యస్వామిగాని, మరి యే ఇతర దేవత గాని అందరూ పరమాత్మ స్వరూపాలే. అలాంటి సగుణ మూర్తుల్ని ఆరాధించుటకే మనదేశంలో దేవాలయాలు ఏర్పడ్డాయి. వివిధములైన దేవతల కొరకు వివిధములైన ఆలయాలు ఏర్పడి వున్నాయి. అచ్చట అభిషేకం, అర్చన, నామావళి, నైవేద్యం మొదలైన పూజావిధానాలన్నీ ఒక క్రమపద్ధతిలో నిర్వహింపబడుతాయి. భక్తులక్కడకు వెళ్లి దేవతలనారాధించి, ప్రార్థనలు సల్పి, తమ బాధల్ని వెళ్లబోసుకొని ప్రశాంత మనస్కులై తమతమ ఇళ్లకు తిరిగి వెళ్తారు.

సగుణోపాసన భక్తునకు, భగవంతునకు ఆంతరంగిక బాంధవ్యాన్ని వ్యవస్థీకరిస్తుంది. మనకున్న దుఃఖాల్ని మన సహచరులతో ప్రస్తావిస్తే మనకేమీ ప్రయోజనం కల్గదు. కాని వాటినే భగవంతుని ముందు వుంచితే ఆయన ఓర్పుతో వింటాడు. మన మనస్సు తేలికౌతుంది.

ఆ విధంగా సగుణారాధన మనశ్శాంతిని ప్రసాదించేశక్తిని కల్గివుంటుంది. విగ్రహం చైతన్యవంతమైంది గనుక మనం భగవానునితో అన్యోన్యతను సాధించవచ్చు.

Sri Jayendravani    Chapters    Last Page