Sruthi Sourabham    Chapters    Last Page

6. వేదాలలో స్త్రీలు

వేదాలలో స్త్రీలకు ప్రాధాన్యం లేదని, వారిని లోక నాయికలుగా గౌరవించ లేదని, సహగమనం పేరుతో వారిని బలవంతంగా చంపేసే వారని వింటూంటాం. ప్రస్తుతం స్త్రీవాద కవిత్వ భావాలుద్ధృతంగా ఉన్న కాలంలో వేదాలలో స్త్రీ స్థానాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.

నిజానికి వేదాలు దేవతా స్తోత్రాలు, దేవతా యజ్ఞాలు ప్రధానంగా కలిగినవి కనుక వీటిలో స్త్రీల స్థానం అంటూ వివరంగా ఉండే అవకాశం లేదు. అలాగే కర్మ సంబంధం లేకుండా పురుషులను గురించి కూడా వాటిలో తక్కువగానే ఉంటుంది. అయినా దేవతలలో గూడా స్త్రీ లుంటారు. కనుక వారిని గురించి, వివాహాది ధార్మిక ప్రక్రియలలో స్త్రీల గురించి కొంత తెలిసే అవకాశం ఉన్నది గదా! ఆ విషయాలు పరిశీలిద్దాం.

ఋగ్వేదంలో ఉన్న స్త్రీ దేవతలలో ఉషాదేవి ప్రధానురాలు. ఆ తల్లి 20 సూక్తాలలో స్తుతింపబడింది. ఉష తేజస్విని. ఆమె నభోదేవి కుమార్తె. రాత్రి దేవికి సోదరి. సూర్యుని వల్లభ. ఆయన తేజస్సుతో ప్రకాశిస్తోంది. యువతి వెంట వెళ్ళే యువకునిలా సూర్య భగవానుడామె ననుసరిస్తాడు. ఆమె ఎల్లరకూ ఆత్మ, ప్రాణము. ఆమె ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నదై ముసలి తనానికి మృత్యువుకు వశపడదు. ఆమె రక్షః పిశాచాదికాన్ని పారద్రోలుతుంది. ఆమె ప్రాణులను మేల్కొల్పుతుంది. ఉషాదేవి అవ్యక్త మధురనాదాలు జనించేలా ప్రేరేపిస్తుంది.

ఉషాదేవి త్రికాలా బాధ్యత్వాన్ని ఈ క్రింది ఋక్కు చెబుతుంది.

ఈయుష్టేయే పూర్వతరా మపశ్యన్‌ వ్యుచ్ఛన్తీముషసంమర్త్యాసః

అస్మాభి రూను ప్రతి చక్ష్యాభూదోతే యంతి యే అపరీషు పశ్యాన్‌

(ఋ 1-113-11)

మర్త్యాసః = మరణ ధర్మాణో మనుష్యాః

వ్యుచ్ఛన్తీం = వివాసయన్తీం, పూర్వతరాం = అతిశ##యేన పూర్వాం విప్రకృష్టామపశ్యన్‌ = దృష్టవన్తః తేమనుష్యాః

ఈయుః = గతాః, తథా అస్మాభిరపిను = ఇదానీం

ప్రతిచక్ష్యా = ప్రకర్షేణ ద్రష్టవ్యాభూత్‌

తథాపరీషు = భావినీషు రాత్రిషు యే మనుష్యా ఏతా ముషసం,

పశ్యాన్‌ = పశ్యన్తి, తే ఆఉ = తేఏవ, యన్తి ఆగచ్ఛన్త్యేవ, కాలత్రయేప్యేషా వ్యాప్య వర్తత ఇత్యర్థః.

(అతి ప్రాచీనురాలైన ఉషాదేవిని గతించిన మానవులు చూశారు. ఇపుడు మనం చూస్తున్నాం. భావిలోవారు గూడ ఈమెను చూస్తారు.)

శుక్ల యజుస్సంహితలు దర్శించిన వారిలో బ్రహ్మవాదినులయిన స్త్రీలు కూడా ఉన్నారు. ఇది స్త్రీలకు వేదాలలో గల ఉన్నత స్థానానికి గుర్తుగా చెప్పవచ్చు.

ఉశన భృగువు భార్య. మేధి ధరణీ దక్షుల కుమార్తె, లోపాముద్ర అగస్త్యుని భార్య, సర్పరాజ్ఞి, కద్రువ, నాగమాత, ఇంకా గౌరివీతి, చైలకి, జయ, ప్రాదురాక్షి, భరద్వాజ పుత్రి, రమ్యాక్షి, లౌగాక్షి, వసుశ్రుత, వారుణి, విదర్భ, విశ్వవార, వృష, సునీతి, ఆసురి హైమ, శిరింబిఠ మొదలయిన భాగ్యవతులు బ్రహ్మవాదినులు.

రుద్రదేవునికి అంబిక అనే చెల్లెలు కూడా ఉంది.

'ఏషతే రుద్ర భాగస్సహ స్వస్రామ్బికయా తం జుషస్వ' అనే మంత్రంలో ఆ విషయం ఉంది. (శుక్ల. 3-57)

అదితి దేవమాత. ఆ తల్లి ప్రశంస కమనీయంగా ఉంది.

మం. మహీమూషు మాతరం సువ్రతానా మృతస్య పత్నీ మవసే హువేమ

తువిక్షత్రా మజరన్తీ మురూచీగ్‌ం సుశర్మాణ మదితిగ్‌ం సుప్రణీతమ్‌

(21-5 శు.య.)

మాతరం = నిర్మాత్రీం సాధు వ్రతానామ్‌

ఋతస్య = యజ్ఞస్య, పత్నీం = జాయాం పాలయిత్రీం

అవసే = రక్షణాయ, తర్పణాయవా

హువేమ = ఆహ్వయామ

తువిక్షత్రాం = బహురక్షణాం, బహుక్షతత్రాణాం వా

అజరన్తీం = జరా రహితాం, ఉరూచీం = బహువ్యంజనాం

సుశర్మాణం = కల్యాణాశ్రయాం, సాధుసఖ్యాం

అదితిం = అదీనాం, సుప్రణీతిం = సుప్రణీత్రీం

(మంచి వ్రతాల నేర్పరచేది, యజ్ఞాన్ని రక్షించేది, పలు గాయాలను మాన్పేది, ముసలితనం లేనిది, ఎన్నో అలంకారాలను ధరించిందీ, శుభాలకు నెలవైనదీ, మంచి స్నేహం కలదీ, దైన్యం లేనిదీ, మంచి నాయకురాలూ అయిన అదితిని రక్షణం కోసం ఆహ్వానిస్తున్నాం.)

ఉషాదేవతల స్తోత్రములు మనకు సామ వేదంలో కనబడతాయి.

మం. ఐతా ఉత్యా ఉషసః కేతుమ క్రత పూర్వే అర్థే

రజసో భానుమంజతే

నిష్మృణ్వానా ఆయుధానీవ ధృష్ణవః

ప్రతిగావోరుషీర్యన్తి మాతరః

(తేజస్వినులయిన ఉషాదేవతలు తూర్పున సగభాగం ప్రకాశంతో నింపుతారు. యోధులు ఆయుధాలకు పదును పెట్టి సంస్కారం చేసినట్లుగా తమ కాంతి ద్వారా ప్రపంచానికే ఒక శోభను కలిగిస్తూన్న ఈ ఉషఃకాల దేవతలు మమ్మల్ని రక్షించాలి.)

మం. ఉదప్తన్నరుణా భావోవృధా స్వాయుజో అరుషీర్గా అయుక్షత

అక్రన్నుషా సోవయునాని పూర్వథా రుశన్తం భాను మరుషా రశిశ్రయుః

(ప్రకాశంతో కూడిన అరుణ వర్ణం కలిగిన ఉషా దేవతలు ఉదయిస్తున్నారు. ఆ దేవతలు కిరణ రూప రథాన్ని అధిష్టించి జీవులందర్నీ జ్ఞానవంతుల్ని చేస్తున్నారు. ఈ ఉషా దేవతలు సూర్యుని సేవిస్తున్నారు.)

మం. అర్చన్తి నారీరపసోన విష్టిభిః సమానేన యోజనేనా పరావతః

ఇషం వహన్తీః సుకృతే సుదానవే విశ్వేదహ యజమానాయ సున్వతే

(ఉత్తమ కర్మ, శ్రేష్ఠదానం చేసే యజమానికి అన్నాన్ని ప్రసాదిస్తూ ప్రేరణాన్ని కలిగించే ఉషాదేవి తన తేజస్సుచే వ్యాపించి ఉంది.)

ఇలా ఉషా దేవత స్తుతి చాలా చోట్ల ఉంది.

సకల ద్విజ ప్రసిద్ధమూ, బహు మహిమోపేతము అయిన గాయత్రీ మంత్రానికి అధిష్ఠాత్రి పరబ్రహ్మ మహిషి. ఆ మంత్ర మహత్త్వాన్ని మనుస్మృతి ఇలా పేర్కొంది.

శ్లో. త్రిభ్య ఏవతు వేదేభ్యః పాదం పాదమదూదుహత్‌

తదిత్యృచోస్యా స్సావిత్ర్యాః పరమేష్ఠీ ప్రజాపతిః

ఏతదక్షర మేతాంచ జపన్‌ వ్యాహృతి పూర్వికాం

సంధ్యయోర్వేద విద్విప్రో వేద పుణ్యన యుజ్యతే

యో ధీతే హన్య హన్యేతాం త్రీణి వర్షాణ్య తంద్రితః

స బ్రహ్మపద మభ్యేత్య వాయుభూతః ఖమూర్తిమాన్‌

ప్రజాపతి మూడు వేదాల నుండి సారముగా మూడు పాదాల గాయత్రి స్వీకరించారు. వేద విదుడు వ్యాహృతి పూర్వకంగా ప్రణవాన్ని గాయత్రిని సంధ్యాకాలాల్లో జపిస్తే వేద పుణ్యాన్ని పొందుతాడు. ఎవరు దీనిని 3 సంవత్సరాలు ప్రతిదినం జపిస్తారో వారు వాయువువలె కామచారులై బ్రహ్మరూపు లగుచున్నారు. పరబ్రహ్మను పొందుచున్నారు.)

అంత గొప్పది సావిత్రీ మంత్రము.

ఋగ్వేదంలో రాత్రి సూక్తాన్ని భరద్వాజ సుత దర్శించిందని ఒక మతం. దుఃస్వప్నం కనబడినపుడు ఉపవాసం ఉండి పాయసంతో ఈ రాత్రి సూక్తం హోమం చేయాలని కల్పం చెబుతుంది.

రాత్రీ వ్యఖ్యదాయతీ పురుత్రా దేవ్య క్షభిః, విశ్వా అధి శ్రియోధిత

ఆయతీ = ఆగచ్ఛన్తీ, అక్షభిః = అక్షిస్థానీయైః, ప్రకాశమానైర్నక్షత్రైః, అక్షభి రంజకైస్తేజోభిః, పురుత్రా=బహుషు దేశేషు, దేవీ=దేవన శీలా, రాత్రీయం=రాత్రి దేవతా, వ్యఖ్యత్‌=విచష్టే, విశేషేణ పశ్యతి, అపిచైషా విశ్వాః సర్వాః, శ్రియః = శోభాః, అధ్యధిత అధిధారయతి

(క్రీడించే శీలం గల ఈ రాత్రి దేవి కంటి వంటి నక్షత్రాలతో, కంటిని రంజింపజేసే తేజస్సులతో విశేషంగా దర్శిస్తోంది. ఈమె ఎన్నో శోభలతో ఉంది.) అని ఆ రాత్రి దేవత స్తుతి సాగింది.

చండీ సప్తశతి పారాయణం చేసేవారు మొదట రాత్రి సూక్తం పారాయణం చేస్తారు.

శ్రీకృష్ణయజుర్వేదంలో సరస్వతీ స్తుతి బాగుంది.

మం. చోదయిత్రీ సూనృతానాం చేతన్తీ సుమతీనాం, యజ్ఞం దధే సరస్వతీ

(ప్రియ వాక్యాలను ప్రేరేపించేది, మంచి బుద్ధులను కలిగించేది కృత్యమును ఎరిగిన సరస్వతి యీ యజ్ఞాన్ని ధరిస్తోంది.)

మం. పావీరవీ కన్యా చిత్రాయు స్సరస్వతీ వీరపత్నీ ధియం ధాత్‌,

గ్నాభి రచ్ఛిద్రగ్‌ం శరణగ్‌ం సజోషా

దురాధర్షం గృణతే శర్మయుగ్‌ం సత్‌

పావీరవీ=రక్షించే వీరులను పుట్టిస్తుంది, కన్యా=కమనీయ, చిత్రాయుః = విచిత్రజీవనం కలది, వీరపత్నీ=వీరులను పాలిస్తుంది. గ్నాభిః = ఛందోభిర్యుక్తా, సజోషా = యజమానునితో సమాన ప్రీతి కలదై, గృణతే = స్తుతించు యజమానునికి, శర్మయగ్‌ం సత్‌ సుఖమిచ్చుగాక.

(రక్షించే వీరులను జనింపజేసేది, కమనీయమైనది, విచిత్ర జీవనము కలది, వీరులను పాలించేది, యజమానునితో సమాన ప్రీతి కలది, ఛందస్సులతో కూడినదై అయిన సరస్వతి తనను స్తుతించే యజమానునికి సుఖం ఇచ్చుగాక.)

వేదాలలో స్త్రీలు - ఉపనిషత్తులు

ఉపాసన ప్రధానంగా గలిగిన ఉపనిషత్తులలో స్త్రీ దేవతా మూర్తులకు గూడా మహోన్నత స్థానం ఉంది.

''తద్ర్బహ్మ సత్తా సామాన్యం సీతా తత్త్వ ముపాస్మహే''అని

(ఆ సీతా తత్త్వం సకల జీవులలో ఉండే బ్రహ్మసత్త. ఆమె నుపాసిస్తున్నాము.) సీతోపనిషత్తులో సీతామాతను బ్రహ్మసత్తగానే చెప్పారు. సీత మూల ప్రకృతి. ఆమె ప్రణవానికి ప్రకృతి.

''శ్రీరామ సాన్నిధ్య వశాత్‌ జగదానంద కారిణీ

ఉత్పత్తి స్థితి సంహార కారిణీ సర్వదేహినాం

సీతా భగవతీ జ్ఞేయా మూల ప్రకృతి సంజ్ఞితా''

''సా సర్వవేదమయీ, సర్వదేవమయీ, సర్వలోకమయీ, సర్వకీర్తిమయీ, సర్వధర్మమయీ, సర్వాధార కార్యకారణమయీ మహాలక్ష్మీః''

(సీత శ్రీరాముని సాన్నిధ్యం వల్ల జగత్తుకానందం కలిగిస్తుంది. శరీరధారులందరికీ సృష్టి, స్థితి, ప్రళయాలను కలిగిస్తుంది. ఆ సీతా భగవతే మూల ప్రకృతి అనే పేరుగలదని తెలుసుకోవాలి.

ఆమెయే సర్వవేదమయి, సర్వదేవమయి, సర్వలోకమయి, సర్వకీర్తిమయి, సర్వధర్మమయి, అన్నిటికీ ఆధారం. పుట్టిన సకల వస్తువులకు కారణమయిన మూలప్రకృతి ఆమెయే. సీతయే మహాలక్ష్మి.)

త్రిపురాతాపిన్యుపనిషత్తులో

''సవితా ప్రాణిన స్సూతే శక్తిస్సూతే త్రిపురా శక్తి రా ద్యేయం

త్రిపురా పరమేశ్వరీ మహాకుండలినీ దేవీ''

(సవిత ప్రాణులను కంటుంది. శక్తి కంటుంది. కనుక గాయత్రీ మంత్ర దేవత ఆద్య అయిన త్రిపురా శక్తి. త్రిపురా పరమేశ్వరి. మహాకుండలినీ దేవి.) అని ప్రసవ ధర్మము స్త్రీ లక్షణము కనుక గాయత్రిలోని 'సవిత' అంటూ త్రిపురా శక్తి అని వ్యాఖ్యానించడం జరిగింది. దాని కనుగుణంగానే గాయత్రీ మంత్రాధిష్ఠాత్రిగా స్త్రీ మూర్తిని స్మార్తులు ధ్యానం చేస్తున్నారు. తాంత్రిక సంధ్యావందనంలో శాక్తేయులు సవితృ మండలంలో దేవీ మూర్తిని ధ్యానిస్తున్నారు.

శ్రీ దేవ్యుపనిషత్తులో ఆ తల్లే తన తత్త్వం వెల్లడిస్తున్నది.

అహం బ్రహ్మ స్వరూపిణీ, మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్‌, ....

అహం బ్రహ్మా బ్రహ్మాణీ వేదితవ్యే ..... అహమఖిలం జగత్‌.... ''

(నేను బ్రహ్మ స్వరూపిణిని. నానుండే ప్రకృతి పురుషాత్మక మయిన జగత్తు బయలుదేరింది. నేనే బ్రహ్మను. సరస్వతిని. నేనే సమస్త జగత్తును.) ఆమె అందరినీ, సకల దేవతలను భరించేది.

''అహం మిత్రా వరుణా వుభాబిభర్మ్యహమిన్ద్రాగ్నీ అహమశ్వినా వుభౌ, అహగ్‌ం సోమం త్వష్టారం పూషణం భగం దధామ్యహమ్‌. విష్ణు మురుక్రమం బ్రహ్మాణ ముత ప్రజాపతిం దధామి''

(నేనే మిత్రా వరుణుల భరిస్తున్నాను. నేనే ఇంద్రాగ్నులను, అశ్వినీ దేవతలను, సోముని, త్వష్టను, పూషను, భగుణ్ణి వహిస్తున్నాను. నేనే ఉరుక్రముడైన విష్ణువును, బ్రహ్మను, ప్రజాపతిని ధరిస్తున్నాను.)

ఆ తల్లి తత్త్వాన్ని ఉపనిషత్తు ఇలా నిర్వచించింది.

''యస్యా స్స్వరూపం బ్రహ్మాదయో నజానంతి తస్మా దుచ్యతే

జ్ఞేయా. యస్యా అంతో నవిద్యతే తస్మాదుచ్యతే అనంతా.

యస్యా గ్రహణం నోపలభ్యతే తస్మా దుచ్యతే లక్ష్యా.

యస్యా జననం నోపలభ్యతే తస్మా దుచ్యతేజా. ఏకైవ

సర్వత్ర వర్తతే తస్మా దుచ్యత ఏకా''

ఆమె రూపాన్ని బ్రహ్మాదులెరుగరు కనుక ఆమెను అజ్ఞేయ అంటారు. ఆమె కంతం లేదు కాన 'అనంత' అంటారు. ఆమెను గ్రహింప లేరు గనుక 'అలక్ష్య' అని పిలుస్తారు. ఆమె పుట్టిన వైనం తెలియదు కనుక ఆమెను'అజ' అంటారు. ఒకతె అయిన ఆమె అంతటా ఉంటుంది కనుక 'ఏకా' అంటారు.)

భావనోపనిషత్‌ ప్రాణి హృదయంలో ఉండే ఆత్మయే లలితాదేవి అని ఉటంకిస్తుంది.

''కామేశ్వరీ సదానంద ఘనా పూర్ణా స్వాత్మైక్య రూపా దేవతా''

(ఆ కామేశ్వరి ఎల్లప్పుడు ఘనీభవించిన ఆనందం, పూర్ణురాలు, ప్రాణులలో ఉండే ఆత్మతో ఏకత్వం కలది.)

బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయి అనే బ్రహ్మవాదిని కథ ఉంది. యాజ్ఞవల్క్యుడు సన్యాసాన్ని తీసికొనబోతూ తన భార్య మైత్రేయి ''నీకు కాత్యాయినికి ధనాన్ని పంచు''తానని చెప్పాడు. కాత్యాయని ఆయనకు మరొక భార్య. అపుడు మైత్రేయి ''సర్వా పృథివీ విత్తేన పూర్ణాస్యాత్‌. కథం తేనామృతాస్యామ్‌''. ధనంతో నిండిన ఈ భూమి సమస్తము నాకు లభిస్తే నేను అమృతురాలు అవుతానా? అని ప్రశ్నించింది. ఆయన 'నేతి హోవాచ' కాలేవన్నాడు.

'యథైవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్‌

అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనేతి'

'అన్ని సాధనాలు కలవారి జీవితమెలా ఉంటుందో నీ జీవితం అలాగే ఉంటుం'దని అన్నాడు. 'ధనం వల్ల అమృతత్వానికి చెందిన ఆశగూడా లేదు' అని ఖండితంగా చెప్పాడు.

అపుడామె ''యేనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం?

యదేవ భగవాన్‌ వేద తదేవమే బ్రూహీతి''.

(అమృతత్వం కలిగించలేని ధనాన్ని ఏం జేసుకోను? భగవానుడమృతత్వమును బొందడానికి దేనిని తెలిసికొన్నారో అది నాకు చెప్పాలి.) అని కోరింది. ఆమె జిజ్ఞాసకు ఆయన సంతోషించి ''ప్రియా బతారేనః సతీప్రియం భాషసే. ఏహ్యాస్వ వ్యాఖ్యాస్యామి వ్యాచక్షాణస్యతుమే నిదిధ్యాయస్వ''ఇతి. ''రా కూర్చో వివరిస్తాను. నే చెప్పిన దానిని నిదిద్ధ్యానం చెయ్యి'' అని బ్రహ్మ తత్త్వోపదేశం చేశాడు.

''సహోవాచ నవా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి

ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి

నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి

ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి''

ఓ మైత్రేయీ! పతి కోరిక కోసం పతి ఇష్టుడవడు. తన కోరిక కోసం పతి ఇష్టుడవుతాడు. భార్య కోరిక కోసం భార్య ప్రియం కాదు. తన కోరిక కోసం భార్య ప్రియురాలవుతుంది. ఇలా సాగింది ఆయన ఉపదేశం.

''ఆత్మావా అరే ద్రష్టవ్య శ్ర్శోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః''

ఆత్మే చూడదగింది, వినదగింది మననం చేయదగింది. నిది ధ్యాసనం చేయదగింది.''

అనే ప్రసిద్ధమయిన ఉపదేశ వాక్యం ఆ ఉపదేశం లోనిదే.

ఇలా ధనాన్ని తిరస్కరించి బ్రహ్మవిద్యను వరించి దానిలో పారమ్యమును సాధించిన మైత్రేయి ఆదర్శప్రాయురాలు.

బృహదారణ్యకంలోనే మరొక బ్రహ్మవాదిని గార్గి. విదేహ రాజయిన జనకుడు గొప్ప దక్షిణలతో యజ్ఞాన్ని చేశాడు. దానికి కురు పాంచాల దేశాల బ్రాహ్మణులు వచ్చారు. ఆ సందర్భంలో ఆ మహారాజు ఒక గోశాలలో వేయి ఆవులను ఉంచాడు. వాటి కొమ్ములకు బంగారం అలంకరించాడు. మీలో బ్రహ్మవేత్త ఈ గోవులను తోలుకుని పోవచ్చునన్నాడు. ఆ మహాసభలో ఎవరికీ ధైర్యం చాలలేదు. యాజ్ఞవల్క్యుడు ముందుకు వచ్చి తన శిష్యునితో 'సామశ్రవా! ఈ గోవులను తోలుకొని వెళ్ళు' అని ఆదేశించాడు. సభలోని విద్వాంసులకు కోపమే వచ్చింది. ''ఇంతమందిలో ఇతడే బ్రహ్మవిదుడా'' అని. జనక మహారాజు హోత అశ్వలుడు ఉండబట్టలేక ''మనందరిలో నువ్వే బ్రహ్మవేత్తవా?'' అని అడిగేశాడు. దానికి యాజ్ఞవల్క్యుడు ''నమోవయం బ్రహ్మిష్ఠాయ కుర్మోగోకామా ఏవవయం'' (మేము బ్రహ్మవేత్తకు నమస్కారం చేస్తాము. మేము గోవులను కోరేవారము) అని చిత్రంగా సమాధానం చెప్పాడు.

తరువాత అశ్వలుడు అనేక ప్రశ్నలు వేశాడు. యాజ్ఞవల్క్యుడు ధైర్యంగా సమాధానాలు చెప్పాడు.

తరువాత ఆర్తభాగుడు, భుజ్యువు, ఉషస్తుడు, కహోలుడు, ఎన్నెన్నో ప్రశ్నలను వర్షించారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

ఆ మహాసభలో అంతమందిని నోరెత్తనివ్వకుండా జవాబులు చెప్పిన యాజ్ఞవల్క్యుణ్ణి వచక్నుని కుమార్తె గార్గి ప్రశ్నించింది.

గార్గి : అథహైనం గార్గీ వాచక్నవీ పప్రచ్ఛ ''యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వమప్స్వోతంచ ప్రోతంచ కస్మిన్నుఖల్వాప ఓతాశ్చ ప్రోతాశ్చేతి.

యాజ్ఞ : వా ¸° గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు వాయురోతశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : అంతరిక్ష లోకేషు గార్గీతి

గార్గి : కస్మిన్నుఖల్వంతరిక్ష లోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : గంధర్వ లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు గంధర్వలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : ఆదిత్య లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖల్వాదిత్య లోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : చంద్ర లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు చంద్రలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : నక్షత్ర లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు నక్షత్ర లోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : దేవ లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు దేవలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : ఇంద్ర లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖల్వింద్ర లోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : ప్రజాపతి లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు ప్రజాపతి లోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

యాజ్ఞ : బ్రహ్మ లోకేషు గార్గీతి

గార్గి : కస్మి న్ను ఖలు బ్రహ్మలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి

సహోవాచ గార్గిమాతి ప్రాక్షీః మాతే మూర్ధా వ్యపప్తత్‌, అనతి ప్రశ్య్నాంవై దేవతామతి పృచ్ఛసి. గార్గి! మాతి ప్రాక్షీరితి. తతోహ గార్గీ. వాచక్న వ్యుపరరామ.

వచక్నుని కుమార్తె అయిన గార్గి యాజ్ఞవల్క్యునిలా అడిగింది.

గార్గి : యాజ్ఞవల్క్య ! ఈ అఖిలము నీళ్ళయందు కలిసి మెలిసి ఉంది. నీళ్ళు దేనియందు పడుగుపేక వలె ఉన్నాయి ?

యాజ్ఞ : వాయువునందు.

గార్గి : వాయువు దేనియందు పడుగుపేకలా ఉంది ?

యాజ్ఞ : అంతరిక్ష లోకమందు.

గార్గి : అంతరిక్ష లోకము దేనియందు ఓతప్రోతంగా ఉంది ?

యాజ్ఞ : గంధర్వ లోకమందు.

గార్గి : గంధర్వ లోకం దేనియందు ఓతప్రోతంగా ఉంది ?

యాజ్ఞ : ఆదిత్య లోకమందు.

గార్గి : ఆదిత్య లోకం దేనియందు ఓతప్రోతంగా ఉంది ?

యాజ్ఞ : చంద్ర లోకమందు.

గార్గి : చంద్ర లోకం దేనియందు ఓతప్రోతంగా ఉంది ?

యాజ్ఞ : నక్షత్ర లోకమందు.

గార్గి : నక్షత్ర లోకం దేనియందు కలిసిమెలిసి ఉంది ?

యాజ్ఞ : దేవ లోకమందు.

గార్గి : దేవలోకం దేనియందు పడుగుపేకలా ఉంది ?

యాజ్ఞ : ఇంద్ర లోకమందు.

గార్గి : ఇంద్ర లోకం దేనియందు పడుగుపేకలా ఉంది?

యాజ్ఞ : ప్రజాపతి లోకమందు.

గార్గి : ప్రజాపతి లోకం దేనియందు ఓతప్రోతంగా ఉంది ?

యాజ్ఞ : బ్రహ్మ లోకమందు

గార్గి : బ్రహ్మలోకం దేనియందు పడుగుపేకలా ఉంది ?

యాజ్ఞ : బ్రహ్మలోకం అతిక్రమించి అడుగకు. నీ తల పగులకూడదు.

ప్రశ్నలకు అందని దేవతను అతిగా అడుగుతున్నావు. గార్గీ! అతిగా అడగకు. తరువాత గార్గి ఊరుకుంది.

- బృహ - 3 అ. -6 బ్రాహ్మణం

ఇచట గార్గి తరుముతూన్నట్లుగా ప్రశ్నపై ప్రశ్న అడగడంలో ఆమె సాహసం, విజ్ఞానం, చురుకుదనం వెల్లడవుతాయి.

వివాహ మంత్రాలు

వివాహానికి చెందిన మంత్రాలలో కొన్ని స్త్రీల విశేషాలు గోచరిస్తాయి. సవితృని కుమార్తె సూర్య.

మం. తుభ్యమగ్రే పర్యవహన్‌ సూర్యాం వహతునా సహ

పునః పతిభ్యో జాయాం దా అగ్నే ప్రజయా సహ (ఋ 10-85-38)

హే అగ్నే! తుభ్యమగ్రే వహతునాసహ సూర్యాం గంధర్వాః

ప్రాయచ్ఛన్‌. త్వం చతాం సూర్యాం వహతునా సహ

సోమాయ ప్రాయచ్ఛః. తద్వదిదానీమపి హే అగ్నే పునః

పతిభ్యో జాయాం ప్రజయా సహా దేహి. కన్యా ప్రియార్థం దాతవ్యో

గవాది పదార్థో వహతుః

(ఓ అగ్నీ! గంధర్వులు నీకు మొదట కానుకలతో సూర్యనిచ్చారు. నీవామెను కానుకలతో సోముని కిచ్చావు. అలాగే ఇపుడు వధువును సంతానముతో వరుని కిమ్ము.) కన్య ప్రీతి కోసం ఇచ్చే సొమ్ము వహతువు. దానికీ నేటి వరకట్నానికీ పోలిక లేదు.

చివరి వరకు సతీపతులు కలిసి ఉండే ఈ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి ఆదర్శమయింది. ఇది వేదంలోనే ఉన్నది.

మం. ఆనః ప్రజాం జనయతు ప్రజాపతి రాజరసాయ సమనక్త్వర్యమా

అదుర్మఙ్గలీః పతిలోక మావిశ శంనో భవ ద్విపదేశం చతుష్పదే

(ఋ 10-86-43)

ప్రజాపతిర్దేవోనో అస్మాకం ప్రజామా జనయతు అర్యమా ఆజ రసాయ=జరా పర్యన్తం జీవనాయ, సమనక్తు = సంగమయతు. సాత్వమదుర్మఙ్గలీః = దుర్మఙ్గల రహితా, సుమఙ్గలీ సతీపతిలోకం = పతి సమీపం, ఆవిశ = ప్రాప్నుహి, నఃఅస్మాకం, ద్విపదేశంభవ, తథా శం చతుష్పదే భవ.

(ప్రజాపతి మాకు సంతానం కలిగించుగాక. అర్యమ ముసలితనం వరకు జీవించేలా చేయాలి. ఓ వధువా! నీవు సుమంగళిగా పతిని పొందు. మా మనుష్యులకు, పశువులకు మేలును కలిగించు.)

ఇంటిలో వధువు స్థానాన్ని ఈ మంత్రం బాగా వెల్లడిస్తుంది.

మం. సమ్రాజ్ఞీ శ్వశురే భవ సమ్రాజ్ఞీ శ్వశ్ర్వాం భవ

ననాందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ అధి దేవృషు (ఋ 10-86-43)

(ఓ వధువా! అత్తమామలు, ఆడుబిడ్డ, మరది వీరి పట్ల మంచి రాణిలా ప్రవర్తించు.)

పైన ముసలితనం వరకు కలిసి జీవించాలనే భావం చూశాం.

అసలు సతీపతులకు వియోగం కలుగకూడ దంటుందీ మంత్రం.

మం. ఇహైవస్తం మావియోష్టం విశ్వమాయు ర్వ్యశ్నుతమ్‌

క్రీళంతౌ పుత్రై ర్నప్తృభిః మో దమానౌ స్వే గృహే

ఇహైవ అస్మిన్‌ లోకేస్తం మావియోష్టం = మాపృథగ్భూతం, విశ్వమాయుర్వ్యశ్నుతం = ప్రాప్నుతం, కించ పుత్రైః నప్తృభిః, స్వేగృహే క్రీళంతౌ స్వేగృహే మోదమానౌ భవతమ్‌

(ఈ లోకంలో కలిసి మెలసి పుత్ర పౌత్రులతో క్రీడిస్తూ సంతోషంతో పూర్ణాయుష్మంతులయి ఉండండి. వియోగం పొందకండి.)

మం. పూషా త్వేతోనయతు హస్త గృహ్యాశ్వినాత్వా ప్రవహతాం రథేన

గృహాన్గచ్ఛ గృహపత్నీ యథాసోవశినీ త్వం విదథమావదాసి

పూషాత్వామితోనయతు=ప్రాపయతు, అశ్వినా = అశ్వినౌ, త్వా = త్వాం, రథేన ప్రవహతాం = ప్రగమయతాం, గృహాన్‌ భర్తృసంబంధినః గచ్ఛ, త్వం గృహపత్నీ యథాసః = భవసి, వశినీ = సర్వేషాం గృహగతానాం వశం ప్రాపయిత్రీ పత్యుర్వశే వర్తమానా విదథం = పతిగృహం, ఆవదాసి = ఆవదసి గృహస్థితం భృత్యాది జనమావద.

(పూష నీ చేతిని పట్టుకుని ఇక్కడ నుండి నిన్ను తీసుకు వెళ్ళుగాక. అశ్వినులు రథం మీద తీసుకు వెళ్ళుదురు గాక. అత్తవారింటికి వెళ్ళి ఇల్లాలివి అగుము. పతికి అనుకూలంగా ఉంటూ పరిచారకులకు పనులు చెప్పి చేయించుకో.)

ఇప్పటికీ సాంప్రదాయిక భారతీయ మహిళ స్థితి యిది. కన్యాదాత దాత. వరుడు ప్రతిగ్రహీత. వరుని తరపువారు కన్యాదాతను యాచించి కన్యను పెళ్ళిచేసుకోవడం వైదిక సంప్రదాయం.

మం. అనృక్షరా ఋజవ స్సన్తు పంథా యేభి స్సఖాయో, యంతి నో వరేయమ్‌

హే దేవాః పంథాః = పంథానోమార్గాః, అనృక్షరాః = కంటక రహితాః, ఋజవః = అకుటిలాశ్చ సంతు, యేభిః = యైః పథిభిః, నః = అస్మాకం సఖాయః, వరప్రేషితాః, వరేయం = వరైర్యాచితవ్యం, పితరం ప్రతి, యంతి = గచ్ఛన్తి.

(ఓ దేవతలారా! మా స్నేహితులు నా కోసం వధువును కోరడానికి కన్యాదాత గారింటికి వెడుతున్నారు. వారికి ముళ్ళు మెలికలు లేని రీతిగా బాటలుండాలి.)

అథర్వణ వేదంలో సుఖ ప్రసూతి సూక్తం ఉంది. సుఖప్రసవం కోసం చేసే ఒక ప్రత్యేక ప్రక్రియలో ఆ సూక్తాన్ని పఠిస్తారు.

మం. సూషా వ్యూర్ణోతు వియోనిం హాపయామసి

శ్రథయా సూషణ త్వమవత్వంబిష్కలే సృజ

(ప్రజనయిత్రి దేవత సూష గర్భావరణాన్ని తొలగించు గాక. మేము సుఖ ప్రసవాని కనుకూలంగా గర్భ నిర్గమన మార్గాన్ని వివృతం చేస్తాము. ఓ సుఖప్రసవ దేవతా! నీవు కూడా మేము చేసే సుఖప్రసవ కర్మతో సుప్రీతురాలివై గర్భ నిర్గమన మార్గాన్ని విశ్లేషించు. గర్భాన్ని అవాఙ్ముఖం చెయ్యి.) ఇలాంటి ప్రార్థనలు ఈ సూక్తంలో ఉన్నాయి. వేదమాతకు కనే తల్లులపై ఎంత శ్రద్ధ ఉందో!

అతిగా స్రవించే స్త్రీ రజస్సును ఆపడానికి, గాయాన్నుంచి స్రవించే రక్తం ఆపడానికి ఒక సూక్తం ఉంది.

మం. శతస్య ధమనీనాం సహస్రస్య హిరాణామ్‌

అస్థురిన్మధ్యమా ఇమాః సాక మన్తా అరంసత

(శత సంఖ్యాకాలైన హృదయ గత ధమనులు, సహస్ర సంఖ్యాకాలైన శాఖానాడులు, మధ్య భాగంలో వ్యాధి వశం వల్ల రక్తం స్రవిస్తున్న నాడులు అలాగే ఆగిపోవాలి. రుధిరస్రావం ఆగిన తరువాత నాడులన్నీ యథాపూర్వంగా ఉండాలి.)

స్త్రీలకు సౌభాగ్యాన్ని పెంచడానికి సౌభాగ్య వర్ధన సూక్తం గూడా ఇక్కడ ఉంది.

మం. నిర్లక్ష్మ్యం లలామ్యం నిరరాతిం సువామసి

అథయా భద్రాతానినః ప్రజాయా అరాతిం నయామసి

(తిలక స్థానంలో ఉన్న దౌర్భాగ్యాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం. అనిష్ట కరమయిన అవయవాంతర్గత మయిన దుర్లక్షణాన్ని తొలగిస్తున్నాము. కల్యాణ చిహ్నాలు మా సంతానానికి ప్రాప్తించాలి.)

ఈ సూక్తాన్ని స్త్రీల దుర్లక్షణ నివారణ కోసం చేసే హోమాదులలో వినియోగిస్తారు.

పతి పత్నీ సమాగము సూక్తంలో ఏ కారణం చేతనైన భర్తకు విముఖంగా దూరంగా ఉండే భార్య, భర్త దగ్గరకు రావడానికి చేయదగిన కర్మ, మంత్రాలు ఉన్నాయి.

అథర్వణ వేదంలో మంచి పతి లభించాలనే భావంతో చేసే ఒక కర్మ ఉంది. ఆ సూక్తంలో

మం. ఆనో అగ్నే సుమతిం సంభలో గమే, దిమాం కుమారీల సహనో భ##గేన

జుష్టా వరేషు సమనేషు వల్గు, రోషం పత్యా సౌభగ మస్త్వసై#్య

(అగ్నీ! కన్యను కోరే పురుషుడు మాకు సద్బుద్ధి నివ్వాలి. భాగ్యంతో మా అమ్మాయిని పొందాలి. సమాన మనస్సు కలిగిన వారిలో ఈమె అతనికి ఇష్ట సఖురాలు కావాలి. పతితో సుఖంగా నివసించే సౌభాగ్యం ఈమెకు కలగాలి.)

ఈ సందర్భంలో ఏదో ఓషధిని కూడా ఉపయోగించేవారు.

మం. ''త్వమసై#్య ధేహ్యోషధే!''

(ఓ ఓషధీ! నీవీ కుమారికి పతిని ప్రసాదించు) అనే ప్రార్థన ఉంది.

భర్తృ ప్రేమకు నోచుకోని కాంత పతిని వశం చేసుకోవడానికి ఒక కర్మ ఉంది. అందులో ఒక మంత్రం.

మం. అభిత్వా మనుజాతేన దధామి మమ వాససా

యథా సోమమ కేవలో నాన్యాసాం కీర్తయాశ్చన

(నాథా! నిన్ను నా కొంగుకు ముడి వేసుకుంటున్నాను. నీవు నాకే దక్కాలి. ఇతర స్త్రీల పేర్లు ఉచ్చరించుకుందువు గాక.) ఈ సందర్భంలో చాలా ప్రక్రియ, మంత్రాలు ఉన్నాయి.

వంధ్యాత్వం పోవడానికి కూడా ప్రక్రియ, మంత్రాలు ఉన్నాయి.

మం. అన్విదనుమతే త్వం మం ససే శంచన స్మృధి

జుషస్వ హవ్యమా హుతం ప్రజాం దేవి రరాస్వనః

(ఓ అనుమతి దేవీ! అనుమతించు, సుఖాన్నియ్యి. హవ్యం సేవించు. మాకు సంతానాన్ని ప్రసాదించు.)

సహగమనం

సహగమనం బలాత్కారంగా చేయించే వారని చరిత్ర పుస్తకాల్లో చదువుతాం. అది శాస్త్రీయం కాదు. ధర్మావతారుడైన శ్రీరాముని తల్లులు సహగమనం చేయలేదు కదా! ధర్మమూర్తి ధర్మరాజు తల్లి సహగమనం చేయలేదు కదా! భర్త మరణానికి తాను కారణమనో, భర్తృ వియోగాన్ని భరించలేకనో మాద్రి చేసింది. దాన్నే మహాకవి బాణుడిలా వ్యాఖ్యానించాడు. ''స్వయంచే న్నజహతి నపరిత్యాజ్యాః'' (ప్రేమాతిశయం వల్ల తమంతట తాము ప్రాణాలు పోనపుడు ప్రాణత్యాగం చేయరాదు.)

మం. ఇయం నారీ పతిలోకం వృణానా నిపద్యత ఉపత్వా

మర్తృప్రేతమ్‌, విశ్వం పురాణ మనుపాలయన్తీ తసై#్య ప్రజాం

ద్రవిణం చేహ ధేహి

ఈ నారి పతిలోకాన్ని పొందాలని నీ దగ్గర ఉన్నది. ఆమెకు ఈ లోకంలో నివాసానికి అనుజ్ఞనిచ్చి సంతానాన్ని, ధనాన్ని అప్పగించు.

మం. ఉదీర్ష్వ నార్యభి జీవలోక మితాసు మేత ముపశేష ఏహి

హస్త గ్రాభస్య దిధిషో స్త్వమేత త్పత్యుర్జనిత్వ మభి సంబభూవ

ఇతాసుం = గత ప్రాణం, ఉదీర్ష్వ = ఈ పతి సమీపం నుండి లే. జీవలోకాభిముఖంగా రా, హస్త గ్రాభస్య = పాణిని గ్రహించే, దిధిషోః = పునర్వివాహాన్ని కోరే, పత్యుః ఏతజ్జనిత్వం = జాయాత్వం, అభిసంబభూవ = ఆభిముఖ్యేన సమ్యక్‌ ప్రాప్నుహి - ఇది పునర్వివాహాన్ని సూచించే మంత్రం.

(ఓ నారీ! ప్రాణాలు పోయిన ఈ పతిని చేరి పడుకున్నావు. ఇక్కడి నుండి లే. జీవ లోకానికి అభిముఖంగా రా. పునర్వివాహం కోరి నీ పాణిని గ్రహించే ఇతనికి భార్య అవడం కోసం ఇతనికి అభిముఖంగా వచ్చి పొందు.)

'తస్మాన్నైకాద్వౌపతీ విందతే' ఒక స్త్రీ ఇరువురు పతులను పొందరాదు.

-శ్రీకృష్ణయజుర్వేదం - 6 కాం. - 4 అ. - 16 ప.

అనే శ్రుతి ఒక స్త్రీ రెండవ పతిని స్వీకరించడం నిషేధిస్తోంది. వీటికి సమన్వయమెలా అని ప్రశ్న రెండు శ్రుతులకు వైరుధ్యం ఏర్పడితే వికల్పం చెప్పడం పూర్వ మీమాంసా సంప్రదాయం. ఆ వికల్పం వ్యవస్థితం చేస్తే అన్వయం కుదురుతుంది.

పునర్వివాహం వంశాచారంగా ఉన్న కొన్ని శూద్ర కుటుంబాల విషయం 'ఉదీర్ష్వ నారి' అనే మంత్రం సూచించిందనీ, పునర్వివాహం ఆచారంగా లేని కుటుంబాల విషయం 'తస్మాన్నైకా' అనే శ్రుతి చెప్పిందని చెప్పవచ్చు. ఇది ఒక పద్ధతి.

పూర్వ యుగాల్లో పునర్వివాహం ఉండేదనడానికి స్మృతి చంద్రికలోని క్రింది శ్లోకాలు నిదర్శనం.

శ్లో. విధవాయాం ప్రజోత్పత్తౌ దేవరస్య నియోజనమ్‌

బాలికాక్షతయోన్యోశ్చ పరేణాన్యేన సంస్కృతిః

కన్యానా మసవర్ణానాం వివాహశ్చ ద్విజాతిభిః

ఊఢాయాః పునరుద్వాహో జ్యేష్ఠాంశో గోవధ స్తథా

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

ఏతాని లోక గుప్త్యర్థం కలే రాదౌ మహాత్మభిః

నివర్తితాని సర్వాణి వ్యవస్థా పూర్వకం బుధైః

- పితృమేధసారప్రశ్నః - 110 పుట

(విధవా స్త్రీకి సంతానాన్ని కలిగించడం కోసం మరదిని నియోగించడం, బాలికకు క్షతయోని అయిన స్త్రీకి మరోపురుషునితో వివాహ సంస్కారము చేయుట, ఇతర వర్ణ స్త్రీలకు ద్విజులతో వివాహం, వివాహమయిన స్త్రీకి మరల రెండవ వివాహం, సోదరులతో పెద్దవాడికి మిగిలిన వారికంటే అధిక భాగం సంపద ఇవ్వడం, మొదలయిన వాటిని కలియుగానికి మొదట మహాత్ములయిన బుధులు లోక రక్షణ కోసం నిరాకరించారు.)

దీనిలో పూర్వయుగాల్లో ఉన్న పునరుద్వాహం కలియుగాదిలో స్మృతి కర్తలచే నిషేధింపబడిందని స్పష్టంగా ఉన్నది గదా! పునరుద్వాహాన్నే శ్రుతి పేర్కొందని చెప్పవచ్చు. ఇది రెండవ పద్ధతి.

అందువలన ధర్మశాస్త్ర నిబంధనకారులు 'అత్ర పత్నీముపనిపాతయతి ఇయంనారీ' ఇతి తాం పతిత్థ ఏక ధనేనోత్థాపయత్యన్యోవా బ్రాహ్మణ ఉదీర్ష్వనారి'' ఇతి సూత్రార్థః కలౌ నానుష్ఠేయ ఇత్యాహ.

నాత్ర పత్న్యుప నిపాతన పతిత్థోత్థాపనే. దేవరన్యాయాదేర్నిషిద్ధత్వాత్‌.

(ఇచట 'ఇయంనారీ' అనే మంత్రం చేత మరణించిన వాని భార్యను పతి శవం దగ్గర పడుకోబెడ్తారు. ఆమెను మరిదికాని ఇతర బ్రాహ్మణుడు కాని 'ఉదీర్ష్వనారి' అనే మంత్రంచే లేవదీస్తాడు)

- పితృమేధ సారప్రశ్నః - 33 పుట. - 2 ఖం. - 8 సూ.

అనేవి కలియుగంలో ఆచరింప రాదని సూత్రం ఇలా చెబుతోంది. ''దేవర న్యాయాదులు కలిలో నిషిద్ధాలు కనుక ఇచ్చట పత్నిని శవం ప్రక్కన పడుకోబెట్టడం, మరిది లేవదీయడం లేవు'' అని వ్రాశారు.

కనుక వేదంలో స్త్రీ పునర్వివాహం ఉందనీ, కలియుగాదిలో దానిని ధర్మశాస్త్రకారులు నిషేధించారని చెప్పాలి.

మొత్తంపై వేదాలలో స్త్రీకి మంచిస్థానమే ఉందని చెప్పాలి.

Sruthi Sourabham    Chapters    Last Page