Nadayadu Daivamu  Chapters  

 

మనోనిగ్రహం

రాత్రిపూట చీకటిగా వున్నప్పుడు ఒక రకమైన వెలుతురు కనిపిస్తుంది. చీకటిగావున్నప్పుడే వెలుగు అవసరపడుతుందిగదా! దివ్వె వెలుగుతోంది అంటే దానికి కారణం చీకటే. పగలు ఆకాశంలో నక్షత్రాలున్నాయి. కానీ అవి కనబడవు. మఱి ఇప్పుడు మనం చూచే ఈసూర్యుడున్నాడు గదా! దీనికి కూడా చీకటి వెనుక వుండి తీరాలి గదా! రాత్రి పూట చీకటి అలముకున్నప్పుడు ఆ నక్షత్రాలన్నీ కనిపిస్తవి. అప్పుడు యీ సూర్యుడు కనిపిస్తున్నాడంటే వెనకాల చీకటి వుండవద్దూ? మనకు వేదాంతం చెప్పేది యిదే. శివుడు వ్యక్తమైనప్పుడు లోకం అవ్యక్తమౌతుంది. లోకం వ్యక్తమైనప్పుడు శివస్వభావం మరుగున పడుతుంది. శ్రీకృష్ణుడు గీతలో ఇల్లా చెప్పినాడు.

యానిశా సర్వ భూతానాం తస్యాంజా గ్రతిసంయమి

యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతో మునేః||

నిశ అంటే రాత్రి. జాగ్రతి అంటే మేలుకుని ఉండటం. భూతాని అంటే ప్రాణికోటి. అంతేగాని దయ్యాలుభూతాలు కావు. ఈ శ్లోకంతాత్పర్యం ఏమిటంటేఅన్ని ప్రాణులకు ఏది రాత్రో, చీకటో అప్పుడు మునేః అంటే మనోనిగ్రహం కలవాడు మేలుకుని వుంటాడు. సంయమి అంటే ఇట్లాంటి ఆత్మనిగ్రహం కలవాడు. యమి, యమము కలవాడు యమి. 'సం'బాగుగా. యముడు అనే మాటలోకూడా యమ్‌ అనగా ఆత్మనిగ్రహము. అది కలవాడు యముడు. ప్రతి జీవుణ్ణి అదుపులో వుంచేవాడు యముడు. మఱి వీడుసంయమి. అందుచేత తన్నుతానుసంపూర్ణంగా నిగ్రహించుకున్నవాడు అని అర్థం. కామక్రోధాల్ని నిశ్శేషంగా అదుపులో పెట్టుకున్నవాడు అన్నమాట. కోపాన్ని జయించటం చాలా కష్టం. కోపాన్ని జయించాలని చెప్పటం తేలికే కాని సమయం వచ్చినప్పుడు ఆ పని ఎంత కష్టమో తెలుస్తుంది. ఈ సందర్భంలో ఒక కథ గుర్తుకు వస్తోంది. ఒకాయనికి అన్నీ మంచి గుణాలు వున్నాయి. కానీ బాగా చిరాకు మనిషి. చీటికి మాటికి చిర్రుబుస్సులాడుతుంటాడు. ఒక రోజున అతని మిత్రులిద్దరు అతని యింటి అరుగుమీద కూర్చుని ఇంట్లో అతను లేడనుకుని అతన్ని గూర్చే మాట్లాడుకుంటున్నారు. ''ఇతడి దగ్గర చాలా మంచి గుణాలున్నాయయ్యా. కానీ యీ కోపాన్ని చంపుకో లేకుండా వున్నాడు'' అన్నాడొకడు. మనవాడు ''యీ మాట ఇంట్లోనుండి విన్నాడు. అమాంతం బయటికి వచ్చి ఎవడయ్యా ఆ మాట అన్నది. ఆ మాట అన్న మనిషెవడూ అంట'' అని అరిచాడు. అరుగుమీద కూర్చున్న వారిలో రెండోవాడన్నాడు గదా, ''నాయనా ఇంకోడి సాక్ష్య మెందుకయ్యా? నువ్వు అరిచే తీరునుబట్టి మనవాడు అన్నమాట నిజమని తేలటం లేదా'' అని. నల చరిత్రంలో ఒక సంఘటన వుంది. ఇది చెప్పినతరువాత ప్రస్తుతాంశానికి వస్తాను. నలుని కథ అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో ప్రతి యింట్లోను తల్లి తెల్లవారు ఝాము నాల్గింటికి నిద్రలేచేది. లేచి మన పురాణ పురుషులను గుఱించిన పాటలు పాడటం మొదలు పెట్టేది. పిల్లలు యీ పాటలు విని పురాణ కథలను తెలుసుకొనేవాళ్లు. వాళ్లు పెద్ద వాళ్ళయిన తరువాత పురాణాలు చెప్పే పండితులవల్ల వినేవాళ్లు. ఇవన్నీ ప్రాచీన సంప్రదాయాలు. ఇదెప్పుడూ పోయేవి గాదు. ఐనా కూడా నాటకానికీ సినిమాలకు పోయి యీ పురాణాల్ని గుఱించిన జ్ఞానాన్ని కొంతమంది సంపాదిస్తారు. దీంట్లోవున్న చెడ్డల్లా ఏమిటంటే ఆనాటకాలాడేవాళ్ళ గుణశీలాలు కూడా వీళ్ళు గ్రహిస్తారు. పెద్ద పండితుడు పురాణాలు చెప్తుంటే విన్న వాళ్ళు ఆ గ్రంధాల్లో చెప్పిన సద్గుణాలు అలవాటు చేసుకుంటారు. నాటకశాలల్లో అయితే కథకు ప్రాధాన్యం తక్కువానున్నూ, చవకబారు పాటలకు ఎక్కువానున్నూ. భాగవతుల ఆటల్లోకూడా ఇంత కంటే వుపకరించవు. భాగవతాలు ఆడేవాళ్ళు, హరి కథలు చెప్పేవాళ్ళు మందిని ఆకర్షించటానికి ప్రయత్నం చేస్తారు. చవకబారు పద్దతులకు దిగుతారు. పూర్వకాలంలో అట్లాకాదు. కాలక్షేపాలవల్ల మంచి ఫలితం వుండేది. ఇప్పుడు యీ భాగవతాలు కూడా కాలంతో బాటు మారుతూవచ్చినాయి. పెద్దపండితులు చెప్తుంటే పురాణాలు వినడం చాలా అవసరం. కొంతమంది పురాణాలు అన్నీనూ కల్పితాలు, కట్టుకథలు అని చెప్తారు. ఆ మాటవప్పుకున్నప్పటికీ ఫరవాలేదు. అవ్వి కట్టుకథలైతేమటుకేం! అవి వింటే మనకు శాంతి ప్రసాదాలు కలగడంలేదా? కొట్టుకువెళ్ళింది వస్తువులుకొనుకోవటానికి. అమ్మేవారు ఎట్లావుంటే మనకేం? శ్రాద్ధం పెట్టించటానికి ఓ బ్రాహ్మణ్ణి పిలిచాం. ఆయనకి జాగ్రఫీ, ఎస్ట్రానమీ రాకపోతేనేమి? పురాణాల్లో చెప్పిన తేదీలు తప్పయితేనేం? ఒప్పయితేనేం! వాటి ప్రాధాన్యం మనకేమి? మదరాసు పార్కు టవున్లో స్కంద మందిరం ఏ తేదీన కట్టిందీ మనకెందుకు? అక్కడుండే దేవుడు మన దుఃఖాన్ని తొలగించి మనపైన దయకురిపిస్తే చాలదూ? పురాణాలు మనోనైశ్చల్యానికి తోడ్పడతాయి. వాటిని వింటే మనస్సు ఏకాగ్రమౌతుంది. ఇప్పుడు మళ్లానలునికధకువద్దాం.

నిద్ర లేవగానే మనం స్మరింపదగిన పేరులతో నలుని పేరు మొదటిది. ''పుణ్యశ్లోకోనలోరాజా'' అనే మాటవుంది. నలుడు మంచి ప్రతిష్టావంతుడు. ఆయన పేరు వుచ్ఛరించినంతమాత్రం చేత పుణ్యం వస్తుందన్నారు. అల్లాంటి మహాపురుషుడు నలుడు.

ఇదంతా కోపాన్ని గుఱించి నల కథలో ఏమి చెప్పివుందో నిరూపించటానికి పూర్వరంగంగా చెప్పాను. కామం అనేది మన శత్రువుల్లో మొదటిది. అది సంపాదించి పెట్టేది పాపం. ఇంతకంటే పెద్ద శత్రువు కోపం. దమయంతీ స్వయంవరానికి ఇంద్రుడుతో కూడానల్గురు దేవతలు వచ్చారు. దమయంతి నలుణ్ణి ప్రేమించి వున్నదని తెలుసుకొని ఆమె దగ్గరకు నలుణ్ణ దూతగా పంపారు. నలుడు వెళ్ళి దేవతలను వరించమని ఆమెకు సలహా చెప్పాడు. కాని అతని మాట వినటానికి దమయంతి సిద్ధపడలేదు. దేవతలేం చేస్తారు? వాళ్ళుకూడ నలుని వేషంలో స్వయంవరానికి వెళ్లారు. ఇది పంచనళీయం. వీళ్ళల్లో నలుడెవడో ఎలా గుర్తు పట్టేది? ఆమె సద్గుణముల వల్ల పాతివ్రత్యం వల్ల సరస్వతీదేవి ఆమెను అనుగ్రహించింది. ఆమె నిజమైన నలుణ్ణి గుర్తుపట్టి మెడలో పూలమాల వేసింది. దేవతలందరూనిరుపమానమైన. ఆమె సద్గుణాలకు మెచ్చుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. తరువాత కలి, ద్వాపరుడు స్వయంవరానికి వస్తున్నారు. వాళ్ళు దోవలో వుండగానే వీరి పెళ్ళి అయిపోయింది. దేవతలు కలికి యీ సంగతి చెప్పారు. కలికి కోపం వచ్చింది. విభీతక వృక్షంలో దాక్కున్నాడు. నలుడు ఏదో కొంచెం ఆచార లోపం చేయటంతో ఆయనను ఆవేశించాడు.

కథ ఇట్లా నడుస్తుంది. ఒక కవి యీనల చరిత్రమును పెంచి వ్రాశాడు. అందులో కలియొక్క సైన్యాధిపతులు కలిని స్తోత్రం చేస్తారు. ఆ సందర్భంలో ఆ కవి యీ కామక్రోధముల స్వభావాన్ని వివరంగా వర్ణిస్తాడు. కలికి సైన్యాధిపతులెవరంటే మనకున్న ఆరు దుర్గుణాలున్నూ, కామక్రోధమోహమద మాత్సర్యములు. ఈ ఆర్గురు సైన్యాధిపతులు వాళ్ళ వాళ్ళ పరాక్రమమెట్లాంటిదో వివరిస్తారు కాముడు చెపుతాడు. తాను ప్రజల్ని నరకానికిపంపించగలడు. మృగాలకంటే హీనంగా ప్రవర్తించేట్టుచేయగలడు. రెండో సైన్యాధిపతి క్రోథుడు. వాడంటాడు. వాడొక దుర్గాన్ని పట్టుకున్నాడట. కాముడి బాణం దానిలో చొరబడలేదట. దుర్గమంటే కోట. దుర్‌+గ చొచ్చుకొనిపోవుటకు కష్టమైనది. అనగా ప్రవేశించుటకు కష్టమైనది. యీసందర్భంలో కాముని బాణమంటానికి ఆశుగమని వాడాడు కవి. ఆశుగమంటే ఆశు గ ఆశు అంటే త్వరగా అని అర్థం. వంగదేశంలో మీరు వినే వుంటారు. ఆశుతోష్‌ ముఖర్జీ అనే వారుండేవారు. దాని సరియైన రూపము ఆశుతోష్‌ ముఖర్జీ. ఆశుతోషుడంటే పరమశివుడు. అది ఆయన నామముల్లో ఒకటి. అంటే వేగంగా సంతోషించేవాడని అర్ధం. కాబట్టి ఆశుగ అంటే తొందరగాపోయేది. మన క్రోథుడంటాడు గదా, యీ కాముడి బాణం చొరలేని ఓ దుర్గాన్ని పట్టుకున్నానయ్యా! అదేమిటంటే దుర్వాసుని హృదయం. కాముడు దూర్వాసుని హృదయానికి సమీపంగానైనా పోలేడు. అటువంటి చోట క్రోథుడు వెళ్ళి పీట పెట్టుకుని కూర్చున్నాడు. సంయమి అంటే యీ కామానికి క్రోథానికి కూడా తావు ఇవ్వనివాడు. మనకి చీకటి ఏదో ఆయనకి వెలుగు. అది ఎవరికీ? ఈ కామ క్రోధాల్ని జయించినవాడికి ''యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతో మునేః'' ప్రాణులంతా మేల్కొని వుండే స్థితి వివేకవంతులకి చీకటట. అంటే మనం చెట్టు నీడను కూర్చుని పుస్తకాన్ని చదువగలం. ఎండలో చదవటానికి ప్రయత్నిస్తే సూర్యకాంతికి కళ్లు చెదురుతాయి. అంటే కాంతి మనకు చీకటైందన్న మాట. ''తిరుములార్‌'' చాలా తేలిగ్గాను అందంగాను యీ విషయాన్ని చెప్పాడు. ''తిరుములార్‌'' మహాయోగీశ్వరుడు. శైవసిద్ధాంత శాస్త్రాలు పన్నెండు వున్నవి. ''తిరుములార్‌'' రచించిన తిరుమంత్రానికి ప్రధమస్థానం. అదే మొదటగా వ్యక్తమైంది. ''తిరుములార్‌'' 9 కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళకు ఒక పర్యాయం కళ్ళు తెరిచేవారు. అప్పుడొక పద్యం వ్రాసేవారు. ఆయన ఇట్లా అంటారు. ఒక దేవాలయానికి ఒక ఏనుగును చెక్కవలసిందని ఒక వడ్రంగిని నియమించారు. ఇంకో వడ్రంగి దాన్ని చూడటానికి వెళ్ళాడు. ఆ ఏనుగుకు ఇంకా రంగులు అవ్వీ వేయటం పూర్తికాలేదు. యీ చూట్టానికి వెళ్ళిన వాడితో ఆతని బిడ్డకూడా వెళ్ళింది. ఆ యేనుగును చూచి అది భయపడింది. అది తండ్రితో ''నాయనా ఆ ఏనుగు నిన్ను పొడుస్తుంది. దగ్గరకు వెళ్ళకు.'' అంది. కానీ వాడు దాని దగ్గరకు వెళ్ళి దాన్ని తయారు చేయటానికి వాడిన కలపను పరీక్షించాడు.

అది ఏనుగా? కొయ్యా? ఒకళ్ళకేమో అది ఏనుగు. ఇంకొకళ్ళకు కొయ్య కొయ్యకనపడనివానికి ఏనుగు కొయ్యలో దాగిఉంది. అసలు రెండువస్తువులంటూ లేవు. ఉన్న వస్తువు ఒకటే. కొయ్య ఏగుగూ రెండూ వేరైతే రెండు వస్తువులుండాలి, కానీ వున్నది ఒకటే గదా కళ్ళ ముందు కన్పించేది. అది ఒకడికి కొయ్య. మరొకడికి ఏనుగు. అలాగే యీ పంచభూతములు ఆసత్పదార్ధాన్ని దాచుకున్నవి. దాన్ని ప్రత్యక్షం చేసుకుంటే ఇవి దాంట్లో లీనమైపోతాయి. పృధివ్యావస్తేజో వాయురాకాశములు భూత పంచకములు. వాయువు వేరు. ఆకాశం వేరు. పరమాత్మ రూపమైనది చిదంబరం.

'తిరుములారు' చెప్పాడు. పృధివ్యాది భూత పంచకం సత్పదార్ధాన్ని మరుగు పరిచిందని. ఆ సత్పదార్థంకోసం మనమెక్కడ వెదకాలి. దాన్ని మరుగుపరచింది ఏమిటి? సత్పదార్ధము, యీ భూత పంచకము వేరుకావు. ఒకటే వస్తువు. యీ పంచకమంతా ఆత్మస్వరూపంగా ప్రత్యక్షం చేసుకుంటే ప్రపంచమే వుండదు. తిరోహితమైపోతుంది.

వేదాంతాల్లో యీ సత్పదార్థం యొక్క స్వరూపాన్ని వుపదేశించారు. వీటిని ఉపనిషత్తులంటారు. ఆచార్య పాదులు వాటినివ్యాకరించటం కోసమే అవతరించారు. ఉపనిషత్తులను తొలుతగా భాష్యం వ్రాసింది వారే. వీటిల్లో ప్రధానమైనవి పది. యీ పదిలో మొదటిది ఈశా వాస్యోపనిషత్తు. దాంట్లో తొలుతగా చెప్పింది ఈశ్వరుడు యీ జగత్తునంతా కప్పివున్నాడు. అంటే అట్లా మనం చూడాలి. ఈశ్వరునిలో యీ భూతాలన్నీ లీనం కావాలి. ఏనుగు తిరోహితమైతే కొయ్య ప్రత్యక్షమౌతుంది. కొయ్యని చూసేటట్లయితే ఏనుగు కనపడదు. మొదటద్వైతం. తరువాత శివద్వైతం. సర్వమున్నూ శివమాయవల్ల భాసిస్తోంది. మనకు పరమాత్మ చీకటిలో వున్నాడు. యీ ప్రపంచమంతా వెలుగుతోంది. ఈ ప్రపంచమంతా చీకటైతే ఆత్మ వెలుగుతుంది. వేదం ''ఈశానస్సర్వభూతానం'' అని చెబుతోంది. ఇది అద్వైత వేదాంతం అంటే రెండు లేవు అని. ఇటువంటి వుపదేశాలవల్ల ప్రయోజనమేమిటి? ఆ ఆత్మ అంటూ వుంటే దాని గోలదాన్ని పడనీ. అది మనకెందుకు? మనకు కావలసింది తిండి తీర్ధాలూ భోగభాగ్యాలు. ఈ కష్ఠమంతా మనకెందుకు? యీ బాధంతా ఎందుకు? దుఃఖాన్ని తోసేసి మనం శాంతిని సంపాదించాలి. యీ విచారమంతా ఎందుకు?

సరే కాసేపు కష్ఠం లేకుండానే అందరూ భాగ్యవంతులౌతారనుకుందాం. (ఇది అసంభవమేననుకోండి) ప్రపంచ ప్రధాన కోశమంతా మన మఠంలో పంచిపెట్టే తీర్ధం లాంటిది. ప్రపంచపు సంపద ఎంతైనా దానికి ఒక పరపతి వున్నది. మఱి ప్రాణికోటి అనంతంగా వున్నది గదా! ప్రతి ప్రాణికి అపరిమితంగాకోరికలున్నాయి. కాబట్టి భాగ్యమెంత సంపాదించినా శాంతి అనేదుండదు. సరే మనమిది సంభవమేనని అనుకుందాం. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి కష్ఠాలన్నీ పోతేతరువాతమనమేమిచెయ్యాలి? ఇప్పుడు మనం కష్టాల్లో వున్నాంకాబట్టి రాజకీయాధికారం వస్తే మన కష్ఠాలన్నీ పోతాయని కలలు గంటున్నాము (ఈ వుపన్యాస కాలానికి మన దేశానికి స్వాతంత్యం రాలేదు.)

బాగా సంపదవుంటే ఇతరులకు హానిచేయాలని బుద్ధిపుడుతుంది. పాపాలు చేయాలనిపుడుతుంది. పతనాభి ముఖుడౌతాడు. కాబట్టి ప్రభుత్వం స్వరూపమెట్లువున్నా మనకి ఆచార్యపాదులను గ్రహించినౌషధం ఎప్పుడూ అవసరమే. బాగా భాగ్యవంతుడుకి దానం చేయమని, పేదవారికి క్రుంగి పోవద్దని ఆచార్యపాదులు చెప్తారు. ఏమిటీ. ఔషదం? శివాద్వైతం. శివమాయ. ఇది మరిచిపోతే ప్రపంచం బాగా కటిక చీకటిలో పడిపోతుంది. సూర్యుడస్తంగతుడైనా ఫరవాలేదు. నీ వెలుగు అస్తమించకుండా చూచుకోవాలి.

Nadayadu Daivamu  Chapters