Shaktipatamu    Chapters    Last Page

పరిచయము

వ్యాకరణ శిరోమణి, భాషాప్రవీణ

శ్రీహరి సాంబశివశాస్త్రి యం.ఎ.

శక్తిపాతమను నీ గ్రంథ మాకారమన జిన్నది; కాని యిందు బ్రతిపాదింపబడిన విషయము మహత్త్వపూర్ణము. శక్తిపాతమను నొక విశిష్టమైన యోగసాధన ప్రక్రియచే నుత్తమదేశికులు అధికారులగు శిష్యుల ననుగ్రహించుచుందురను విషయము దాదాపు ప్రాతగిల్లిన యీరోజులలో సాధక పాఠకలోకమున కీగ్రంథము కనువిప్పు కాగలదు. ఈ గ్రంథమునుగూర్చిన శ్రీ శ్రియానందనాధాపరనామధేయులు బ్రహ్మశ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మగారు పరమేశ్వరీ కృపాపాత్రులై యుత్తమకవులుగా, శాక్తశైవతంత్రాగమాదుల యందును నిష్ణాతులుగా, అపూర్వ సంప్రదాయ రహస్యప్రఖ్యాపక గ్రంథ రచయితలుగా, సాధకోత్తములై యథాసంప్రదాయ దీక్షా దాన సమర్థులగు నుత్తమ దేశికులుగా సాధక పాఠకలోకమునకు జిరపరిచితులు, ఎనుబదేడులకుం బైబడిన వయస్సున 'ముదిమి రాకాసి సందిటనొదిగి' వెలికనుచూపు కఱవైనను సాధనభ్యాస పాటవ పరిపక్వమతులగుటజేసి వారికి లోగను జూపు గఱవు లేదనుటకు వీరి యీరచనయే తార్కాణము.
గ్రంథ గతవిషయ మొక విశిష్టమైన ¸°గిక సాధన ప్రక్రియకు సంబంధించినది. బ్రహ్మాత్మైక్యజ్ఞానము ఈశ్వరప్రసాదము వలనను, గురువుయొక్క సాక్షాన్నిరీక్షణ స్పర్శనాదుల వలనను నధికారులగు శిష్యులకు మహావాక్యోపదేశ పూర్వకముగా శక్తిపాతము చేయుటచేతను గలుగుట యిందుం బ్రతిపాద్యమైన విషయము. ఇది కేవల మొక దర్శనమునో తంత్రమునో యధారముగ గొనినది కాదు; లేక యేదేని యన్య భాషాగ్రంథమున కనువాదరూపమును గాదు. ప్రధానముగా సాంఖ్య పాతంజల యోగదర్శనములు, తరువాత యథోచితముగా షట్చక్రములు, తద్వేధస్వరూపము, తరువాత యథోచితముగా షట్చక్రములు, తద్వేధస్వరూపము, కర్మభక్తి జ్ఞానయోగ స్వరూపము, తంత్రాగమములయందును, ఉపనిషదాదులయందు నెడ నెడ గానవచ్చు ప్రాణ-శక్తి - శక్తిమత్స్వరూపము, శక్తిపాతవిధానము, దానికై వలయు సాధనాభ్యాసము-మున్నగు వివిధవిషయములు సంప్రదాయానుగుణముగ సమన్వయపఱచి సిద్ధపఱచిన స్వతంత్ర గ్రంథము. ఇందు శాస్త్రీయవిషయముల సరళముగం బ్రతిపాదించుటయే కాక శ్రీ శర్మగారు స్వానుభవములగూడ నిందు జతపరచుటచే నీ గంథముయొక్క వైశిష్ట్య మినుమడించినది.
మిగిలినశాస్త్రము లోకయెత్తు; యోగశాస్త్ర మొక యెత్తు. ఇతర శాస్త్రములకు బుద్ధిప్రతిభా వైశిష్ట్య మావశ్యకము. యోగశాస్త్రమున కంతమాత్రమే కాదు; దానికి సాధనాభ్యాసముల యావశ్యకత యెంతేనిగలదు. అంతియే కాదు; యోగదర్శనము నాదరింపని దర్శనమే లేదు.
గౌతమ మహర్షి న్యాయదర్శనమున 'సమాధి విశేషాభ్యాసాత్‌' (4-2-38) అను సూత్రము మొదలుకొని తొమ్మిది సూత్రములచే యోగదర్శనావశ్యకత నిరూపించినాడు, వాత్స్యాయనుడును న్యాయసూత్ర భాష్యమున -
''యోగశాస్త్రాచ్చాధ్యాత్మవిధిః ప్రతిపత్తవ్యః| న పున స్తవః ప్రాణాయామః ప్రత్యహారః ధారణా ధ్యానమితి... ఉపాయస్తు యోగాచారవిధానమితి''--
అని స్పష్టముగా అధ్యాత్మవిధి ప్రతిపత్తి కొఱకు యోగ సాధనాభ్యాసమావశ్యకమని పేర్కొనినాడు.
కణాదమహర్షియు వైశేషిక దర్శనమున 'యోగజప్రత్యక్షము' ను అంగీకరించినాడు. యోగజప్రత్యక్షము నంగీకరించుచో యోగశాస్త్రప్రామాణ్యము నంగీకరించినట్లే యగును.
భర్తృహరియు వాక్యపదీయమున 'యోగప్రత్యక్షము' నంగీకరించి యది ప్రత్యక్షానుమాన ప్రమాణములకంటె బలవత్తరమైనదని సోపపత్తికముగ నిరూపించినాడు.
'ఆవిర్భూత ప్రకాశానాం అనుపప్లుతచేతసామ్‌ |
అతీతానాగతజ్ఞానం ప్రత్యక్షా న్న విశిష్యతే ||

అతీంద్రియానసంవేద్యా
& పశ్యన్త్యార్షేణచక్షుషా |
యే భావాన్‌, వచనం తేషాం నానుమానేన బాధ్యతే ||
వాక్యపదీయ - బ్రహ్మకాండ 37, 38.
శ్రీ శంకరభగవత్పాదులు గూడ యోగదర్శనము నందలి శ్రుతివిరుద్ధాంశములను మాత్రమే ఖండించి శ్రుత్య విరుద్ధములయిన యమనియమాదులన్నియు జిత్తశుద్ధికై యావశ్యకమనిరి.
'యేన త్వంశేన విరుధ్యేతే తేనేష్టమేవ సాంఖ్య యోగ
దర్శనస్మృత్యోఃసావకాశత్వమ్‌.' బ్ర.సూ.2-1-3.
అంతియే కాదు యోగ శాస్త్రముయొక్క యావశ్యకతను, ఉత్కృష్టతనుగూడ నచటచట నిరూపించుచు వచ్చిరి.
'తస్మాద్ధర్మోత్కర్షవశా చ్చిరంతనా దేవాదిభిః ప్రత్యక్షం వ్యవజహ్రు రితిశ్లిష్యతే. అపిచస్మరన్తి- 'స్వాధ్యాయా దిష్టదేవతాసంప్రయోగః' (యో.సూ. 2-4-4) ఇత్యాది. యోగో
ప్యణి మాద్యైశ్వర్య ప్రాప్తిఫలః స్మర్యమాణో నశక్యతే సాహసమాత్రేణ ప్రత్యాఖ్యాతుమ్‌. శ్రుతిశ్చ యోగ మాహాత్మ్యం ఖ్యాపయతి--
పృథివ్యప్తేజో
నిలభే సముత్థితే పంచాత్మకే యోగగుణ ప్రవృత్తే |
న తస్య రోగో నజరా న మృత్యుః
ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరమ్‌ || శ్వేతాశ్వతర 2-12
ఋషీణాం మంత్రబ్రాహ్మణ దర్శినాం సామర్థ్యం నాస్మదీయేన
సామర్థ్యేనోపమాతుం యుక్తమ్‌ | తస్మాత్సమూల మితిహాసపురాణమ్‌ ||''
బ్ర. సూ. దేవతాధికరణము శంకరభాష్యము.
తత్త్వావబోధమునకు వేదాంతదర్శనము (ఉపనిషద్విద్య) ఆవశ్యకము, అయినను తత్ర్పాప్తికై వలయు యోగ్యత (అధికారము) సంపాదించుకొనుటకు వేదవిహిత కర్మానుష్ఠానముతో పాటు యమనియమాద్యష్టాంగ యోగ సంపత్తియు, నావశ్యకము. యోగవిద్య యోగాగ్నిమయ దేహమును, అణిమాద్య ష్టైశ్వర్యములను బ్రసాదించి దైవీశక్తి సంపన్నుని గావించునని శ్వేతాశ్వతరశ్రుతి చెప్పుచున్నది. మన ప్రాచీన ఋషులట్టి దైవీశక్తి సంపన్నులు మంత్రబ్రాహ్మణద్రష్టలునయి వెలుగొందిరి. అట్లు స్వాధ్యాయతపోయోగనిష్ఠితులయిన మహర్షుల సామర్ధ్యమును మన సామర్ధ్యముతో పోల్చి చూచికొనుట యెంతమాత్రము సమంజసము గాదు. వారు తత్తద్దేవతామంత్రధ్యాన పారవశ్యమున నుండి యాయా దేవతలతో బ్రత్యక్షముగా మాటలాడిరనుట యుక్తమే. కాన నట్టి గాథా దికమును వివరించు నితిహాసపురాణములు సప్రమాణములే కాని నిష్ప్రమాణములు కావు. అందుచే యోగశాస్త్ర మత్యంత మాదరణీయమని భావము.
ఇట్లు దర్శనకారులందఱును చిత్తవృత్తి నిరోధము ద్వారా యాత్మశుద్ధికి గారణమై మహామహిమ ప్రఖ్యాపకమైన యీ యోగదర్శనము నాదరించిరి. మన ప్రాచీనాచార్యులును వేదవిహితకర్మానుష్ఠానపరులు మాత్రమేకాక యోగశక్తి సంపన్నులునగుచు దర్శన స్పర్శనాదులచేతనే శిష్యులకు సకలవేదములు శాస్త్రములు భాసించునట్లనుగ్రహింప గలిగిరి. ఈ సంప్రదాయమును భాగవతమునందలి మొదటి శ్లోకమే భంగ్యంతరముగా సూచించుచున్నది.
'తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే.'
యోగేశ్వరుడగు పరమేశ్వరుడు ఆదికవియగు బ్రహ్మకు వేదములను 'మనసా' అనుగ్రహించెనని యర్థము. ఈ సంప్రదాయమునే మహాభారతము పౌష్యపర్వమున ధౌమ్య శిష్యగాథారూపమున వెలయించినది. అందు ధౌమ్యుడు శిష్యులం బరీక్షించి వారుత్తమాధికారులని తెలిసికొని వారిని- 'సర్వేవేదాస్తే ప్రతిభాస్యంతి ధర్మశాస్త్రాణి చ' -- యని యనుగ్రహించుట కాననగును. ఇట్లీ సంప్రదాయ మనూచానముగ భారతదేశమున నెలకొని యున్నట్లు పార్వతీ విద్యాభ్యాసవర్ణనా వ్యాజమున మహాకవి కాళిదాసు కుమారసంభవ కావ్యమున వివరించినాడు.
'తాం హంసమాలా శ్శరదీవ గంగాం
మహౌషధి నక్తమివాత్మభాసః |
స్థిరోపదేశా ముపదేశకాలే
ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః ||'
''హంసశ్రేణులు శరత్కాలమున గంగానదిని బొందు నట్లును, రాత్రులయందు మహౌషధులు తమ కాంతులను బొందునట్లు గురూపదేశ కాలమున బార్వతిని ప్రాక్తనజన్మ విద్యలు పొందినవి - అని అర్థము.
ఇట గమనింపదగిన యంశమొకటగి గలదు. హంస లన్నియు నొక్కమారుగా గంగానదిని జేరవు. ఒకశ్రేణి వెంట మఱియొక శ్రేణి క్రమముగ వచ్చి చేరుచుండును. అట్లే సంస్కారాతిశయక్రమము ననుసరించి పార్వతియందు విద్యలు నొకదానివెంట నొకటి వచ్చి భాసించినవి. అయితే హంసల యునికిపట్టు గంగ కాదు. అవి వేఱొక చోటునుండి గంగకడకు రావలయును. రెండవ దృష్టాంత మిలోటునుకూడ దీర్చినది. మహౌషధులు సహజముగా కాంతిమంతములు. ఆ కాంతులు వేఱొక చోటునుండి రానక్కఱలేదు. కాని యవి పగలు సూర్యకాంతి పరాహతములై భాసింపవు. అట్లు పగలు అనభివ్యక్తములై యణగియుండిన యాకాంతులు రాత్రులయందు ప్రతిబంధకము లేనందున సహజదీప్తులతో నభివ్యక్తములగు చుండును. అట్లే పార్వతియం దణగియున్నట్లున్న యావిద్యలు ఉపదేశకాలమున (ఉపదేశమను వ్యాజముచే) నావరణము దొలగినంతనే సహజ తేజస్సులతో భాసించినవి యని భావము.
మఱియు హంసశ్రేణీ సమాగమమునకు శరత్కాలము, మహౌషధులు సహజదీప్తులతో
c దేజరిల్లుటకు రాత్రులును యుక్తకాలములు ; అట్లే యాత్మభాస స్వరూపములగు విద్యలు భాసించుటకు అనుగ్రహపూర్ణ గురూపదేశకాలుమ యుక్త సమయము-అనియు నిట సూచితము. అనగా ఆచార్యుడు శిష్యునియందలి యజ్ఞానావరణమును దొలగించి యాతనియందణగియున్న విద్యల భాసింపజేయునను సంప్రదాయమును కాళిదాసు గుర్తింపజేయుచున్నాడు. అంతియే కాదు. పార్వతి పరాదేవత. అయ్యును గురూపదేశ కాలముననే విద్యలు భాసిల్లినవి. అట్లే శిష్యు డెంతటి ప్రజ్ఞాశాలియైనను గురూపదేశపూతచిత్తుడు గానిచో నాతని యందున్న విద్య భాసింపదు. అనగా నావిద్య యాతనికి పురుషార్థసాధకము గాదు. అందుచేతనే --
''యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ |
తసై#్యతే కథితా హ్యర్థాః ప్రకాశ##న్తే మహాత్మనః ||
శ్వేతాశ్వతరోపనిషత్తు.
అని శ్రుతి గురు- దేవతాభక్తి వైశిష్ట్యమును బ్రతిపాదించినది, గురు-ఈశ్వరానుగ్రహ పాత్రులగువారికే నేర్చిన విద్యలనుభూతికి వచ్చును అని భావము. తదనుగుణముగా --
గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః గురు ర్దేవో మహేశ్వరః |
గురు స్సాక్షా త్పరం బ్రహ్మ తసై#్మ శ్రీ గురవే నమః ||
అనుచు నేటికిని గుర్వనుగ్రహమును గాంక్షించువారు గురువును బ్రహ్మవిష్ణు శివాత్మకమగు ప్రత్యక్షదైవముగా భావించెడి సంప్రదాయము గలదు. మన యదృష్టవశమున నేటికిని అచ్చటచ్చట యోగశక్తి సంపన్నులయిన యట్టి మహాత్ములు గలరు. అట్టి సాధకోత్తముల శ్రేణికి జెందిన వారే యీ గ్రంథమును గూర్చిన శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారు. వారు సాధనాభ్యాస పాటవపరినిష్ఠితులు గావుననే శాస్త్రీయ విషయ సమన్వయముతోపాటు స్వానుభవమునుగూడ నిందు జేర్చి గ్రంథమును సుగంధితము చేయగలిగిరి. ఈ గ్రంథమే కాదు; వారి రచనలన్నిటియందలి విశిష్టత యిదియే.
మఱియు శ్రీ శర్మగారి రచన సామాన్యముగా సాధకుల హెచ్చరించుచు, అడుగడుగన వారిని దృష్టిలోనుంచుకొని వారికి దను పండిన యనుభవమును బంచియిచ్చుచున్నట్లు సాగిపోవుచుండును.
'అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః' యో. నూ. 1-12
అభ్యాసముచేతను, వైరాగ్యముచేతను చిత్తవృత్తి నిరోధమగునని యర్థము. కాని శ్రీశర్మగారు - 'అభ్యాసమువల్లను ఆయభ్యాసముచేనగు వైరాగ్యము వల్లను చిత్తవృత్తి నిరోధమగును' - అని చెప్పుట సమంజసమనిరి. ఇది సాధకుల దృష్టిలో నుంచుకొని చేసిన సవరణము. కొందఱకు వైరాగ్య మాజన్మ సిద్ధముగా వచ్చును. వైరాగ్య సిద్ధికై వారి కభ్యాస మావశ్యకము గాక పోవచ్చును. సాధకుల పరిస్థితి వేరు. వారికి అభ్యాసము వల్లనే వైరాగ్యము సిద్ధించుననుట యుక్తిసహము.
'అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే||
భగవద్గీత 6-36.
అను గీతాశ్లోక గత శ్రీశంకరభగవత్పాద భాష్యము నందును తద్వివరణ రూపమగు ఆనందగిరి టీకయందును- 'అభ్యాసహేతుక వైరాగ్యముచే చిత్తవృత్తి నిరోధము గలిగి మనస్సు విషయ విముఖమై యంతర్ముఖ మగును-' అని వివిరింప బడినది.
'ఆభ్యాసహేతుక వైరాగ్యద్వారా చిత్తప్రచార నిరోధే నిరుద్ధవృత్తికం మనో విషయవిముఖ మంతర్నివిష్టం భవతీత్యర్థః' - ఆనందగిరిటీక. కనుక పై వివిరణము సంప్రదాయానుగుణము గూడ.
ఇక అభ్యాసపద వివిరణము జూతము 'తత్ర స్థితౌయత్నోభ్యాసః' అని యభ్యాస స్వరూపము యోగసూత్రములందు వివరింపబడినది. కాని శ్రీ శర్మగారు సూత్రార్థమును దృష్టియం దిడుకొని సూత్రకర్త యుద్దేశించిన యా యర్థమును అభ్యాసపదముయొక్క ¸°గికాద్యర్థాను శీలనము జేసి సిద్ధింపంజేసిరి. (చూ. శక్తిపాతము పే. 19) ఇట్టి వివరణము సాధకులు మననము చేయుట కెంతయు తోడ్పడును. ఇక వైరాగ్యము. ''వైరాగ్యమున కర్ధము త్యాగము గాదు... వైరాగ్యమన నాసక్తి లేకపోవుట యను నర్థమునే తీసికొనదగును.'' అని వివరించిరి. ఈ వివరణమున 'ఆసక్తః సుఖమస్వ భూత్‌' - అనురీతిగా కర్మయోగపథమున నుండియే సాధకుని యభ్యాస ప్రయత్నములు కొనసాగుట శ్రేయస్కరముగాని యపరిపక్వతులు త్వరపడి కర్మత్యాగ వైరాగ్య పథమున నడుగిడుట ప్రమాదకరమను హెచ్చరిక యిమిడి యున్నది. ప్రణవ - మంత్ర శబ్దాది నిర్వచనముగూడ నిందుకుదార్కాణము. (చూ. పే. 46) ఇట్లు జూపిన గ్రంథ మంతయు నుదాహరణయే యగును.
శక్తి స్వరూపమును ఆనందలహర్యాది గ్రంథవివరణములయందు విపులముగ వివరించుటచే గాబోలు సాధకుల యుపయోగార్థమిట సంగ్రహముగా వివరింపబడినది. శక్తి యనునది బ్రహ్మయే యని వీరు వివరించుట యెంతయు యుక్తముగా నున్నది. బ్రహ్మస్వరూపముచే నిష్కలుడు (నిర్గుణుడు) అయ్యును ఆబ్రహ్మయే సృష్ట్యాది కార్యోన్ముఖుడై మాయా రూప వస్త్వంతర కార్య నిరూపణీయ స్వరూపుడగు నప్పుడు శక్తియని వ్యవహరింపబడును. కాన శక్తి శక్తి మంతుల కభేద మనుట యుక్తమే. ఈ విషయమును శ్రీ మాధవాచార్యులు నూతసంహిత వ్యాఖ్యయం దిట్లు వివరించిరి.
'ఉక్తాత్‌ పరాదపి పరో నిష్కలో యః (పరమేశ్వరః) పరతరః |
స యథా స్వప్రతిష్ఠేన రూపేణ నిష్కలః శివః ; కార్యాభిముఖేన తు
శక్య ప్రతియోగి నిరూప్యేణ రూపేణ శక్తిరితి ద్విరూపో జాతః ||''
మాదవీయవ్యాఖ్య సూతసంహిత. యజ్ఞ. 4-21
అయితే వెలికనుచూపు కఱవగుటచే వ్రాయసమునకై యొదులమీద నాధారపడుట జేసి యిందు నాంతరీయకములుగా నెడ నెడ ప్రమాదములు దొరలినవి. వానిని లేఖక ప్రమాదములుగ నే సహృదయులు గుర్తింపగలరు. పరమేశ్వరీ కృపాపాత్రులైన శ్రీ శర్మగారింకను సాధకలోకమునకు గనువిప్పు గాగల యిట్టి యద్గ్రంథముల వెలయింతురుగాక! సంప్రదాయ రహస్యముల నుద్బోధించుచు నాధ్యాత్మికొన్నత్యమును గలిగించెడి యిట్టి గ్రంథముల సుందరముగా సాధన గ్రంథమండలి యందు ముద్రించి యాంధ్రలోకమున కందించుచున్న శ్రీబులుసు సూర్యప్రకాశశాస్త్రిగారి కృషి యెంతయు శ్లాఘ్యము.
తెనాలి
శోధకాగృహము
1-6-70
ఇట్లు హరి సాంబశివశాస్త్రి

శ్రీ మాత్రే నమః

ఓం హ్రీం నమః

కృతి సమర్పణము

శ్రీ వ్యాసభగవానుండు దేని నుద్దేశించి ''జన్మాద్యస్యయతః'' అని సూతించెనో; తద్ధర్మ స్వరూప జగద్ధాత్రినిగూర్చి ''ఆథాతో ధర్మజిజ్ఞాసా'' యనుచు నొక విద్యయే వెలసినదో, పంచకృత్యపరాయణయై, ఆ, ఈ, మ, బీజవర్ణసంజ్ఞితయై, శక్తి హృల్లేఖా కుండలినీ భువనేశ్వరీత్యాది నామప్రసిద్ధయై ఉభయాత్మక ప్రణవ హ్రీంకార జపసుప్రీతయై సాధక స్వర్గాపవర్గ ప్రదానదక్షయైన ఏ పరశివశక్తి నారాయణియై యడరునో, ఏ పరశివస్వరూప స్వప్రకాశ విమర్శచరణద్వంద్వము నాధారము చేసికొని యోగీంద్రులు కుంభసంభవులై నిశ్చయజ్ఞానవల్లికి నూటుకొయ్యనాటి నిష్ఖేదబ్రహ్మపదావలంబనగతింగ్రీడింతురో, ఈ కారాక్షరోద్ధారయు, సారాత్సారయుఁ 'బరాత్పరయుఁ'బర మానంద స్వరూపిణియునైన ఏ మహాదేవి, ఏ శివగురుశక్తి, లలితనాc బరcగుచున్నదో, హంసమంత్రార్థరూపిణి యోవ్వతెయో, హంసిని యెవ్వతయో, వ్యష్టిసమష్టుల యందంతటను సకల కార్యనిర్వహణ సామర్ధ్యముతో నే పరాశక్తి వెలయుచున్నదో, అక్షరయు, బ్రహ్మసమ్మితయు, ఛందోమాతయు, గాయత్రియు, సర్వస్వరూపయు, సర్వేశియు, సర్వశక్తి సమన్వితయునైన ఏశక్తిని బలునామములతో నోరారc బిలిచి బ్రాహ్మణులు తమ బ్రహ్మము నామెకే యర్పింతురో, ఆ జగత్పూజ్యశక్తి యందేయీశక్తి పాతరచనమునర్పించుచున్నాcడు.

శాక్తబంధు పాదపాంసుపు శ్రీకాకుళవాపి

శ్రీ శ్రియానంద నాథుండు

ఈశ్వర సత్యనారాయణశర్మ

 

 

 

Shaktipatamu    Chapters    Last Page