Kathakanchiki    Chapters    Last Page

 

''మానవుడు డెంత పురాతనుడో అంతపురాతనులు వారు.''

ప్రబలుతున్న భౌతికవాదం వల్లగానీ, విస్తరిస్తున్న పారిశ్రామికీకరణం వల్లగానీ. సంకీర్ణంగావున్న ఆధునిక జీవనపద్దతుల వల్ల గానీ, భారతదేశంలోని ఆధ్యాత్మికతకు ఎలాంటి హాని కలగదని శ్రీ కంచి కామకోటి పీఠాదిపతులు చంద్రశేఖర యతీంద్ర సరస్వతీ పరమాచార్య స్వామివారన్నారు. మతంలో ఔత్సుక్యమూ, నిష్టా ప్రస్తుతం తగ్గిపోతున్నట్లు కనబడినప్పటికీ యోగులూ, బుషులూ పుట్టి హిందూమతాన్ని తప్పక సముద్దరిస్తారని తమ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పారు.

రెండవ ఆగమసదస్సు సందర్భంగా మధుర సమీపంలోని నారాయణవరంలో స్వామివారు విడిదిచేసి వున్నప్పుడు ఒక సోమవారం రాత్రి మద్రాసులోని అమెరికా కాన్సల్‌ జనరల్‌గా ఉద్యోగం చేస్తున్న డాక్టర్‌ ఆల్బర్ట్‌ డి. ఫ్రాన్ల్కిన్‌తో సంభాషిస్తూ ప్రసంగవశాన వారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.

అమెరికా కాన్సల్‌ జనరల్‌ స్వామి విడిదికి వచ్చి సంభాషించారు. వారి గోష్ఠి దాదాపు అరగంటసేపు సాగింది. ఆ గోష్ఠిలో శ్రద్ధాళువైన ఒక వ్యక్తికి ఆధునిక జీవన విధానాల్లోని అనేకానేక సంకీర్ణతలవల్ల మతసంప్రదాయాలకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందోనని సహజంగా కలిగే భయాన్ని డాక్టర్‌ ప్రాన్ల్కిన్‌ వ్యక్తం చేశారు. కాని, చివరకు వారు తమ భయాలన్నీ విడిచి తృప్తిగా, నిశ్చింతగా సెలవు తీసుకున్నారు.

పళ్లూ, కొబ్బరికాయలూ స్వామివారికి సమర్పించి వారిని దర్శించే భాగ్యం తనకు కలిగి నందుకు ఎంతటి ధన్యతా భావకతో మనస్సంతా నిండి పోయిందో ఫ్రాన్ల్కిన్‌ వ్యక్తం చేశారు.స్వామివారు ఉదారంగా నవ్వి ఊరుకున్నారు.

డాక్టర్‌ ఫ్రాన్ల్కిన్‌ స్వామివారిని నిశితంగా ప్రశ్నించి అనేక విషయాల మీద వారి ఉపదేశాన్ని అర్థించారు. ముందుగా క్రైస్తవుడైనా తన కితర మతాల మీద గౌరవం వుందనీ, యితర మత సిద్ధంతాలు అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాననీ అన్నారు. తమకున్న కొన్ని సందేహాలు తీర్చవలసిందిగా స్వామివారిని కోరారు.

మానవుల శ్రేయస్సు కోసమే ప్రవక్తలందరూ మతాలు స్ధాపించారనీ అందువల్ల సర్వమతాలకు లక్ష్యం ఒకటేనని ఇతర మతాల మీద డాక్టర్‌ ఫ్రాన్ల్కివ్‌ ఆసక్తి చూపటం తనకు సంతోషం కలిగిస్తున్నదనీ స్వామివారన్నారు.

డాక్టర్‌ ప్రాన్ల్కిన్‌: కాలం గడిచేకొలది ప్రపంచ ప్రజలు దగ్గరౌతున్నారు. రేడియోలాంటి ఆధునిక సమాచార సాధనాల మూలంగా ఈనాడు ఒక క్రైస్తవుడు తన హైందవ సోదరునితో సులభంగా మాట్లాడగలుగుతున్నాడు. దీనివల్ల ప్రపంచమతాలు ఒకదాని కొకటి క్రమేణా సన్నిహితం కావా?

స్వామివారు: ఈనాడు ప్రపంచమంతటా అనేక రాజకీయ సిద్ధాంతాలు కనబడుతున్నాయి. ప్రతిసిద్ధాంతమూ తానే సర్వోత్తమమైన సిద్ధాంతమనీ, ఇతర సిద్ధాంతాలనుండి తాను నేర్చుకోవలసిందేమీలేదని అంటున్నది. చైనా వంటి దేశాలు తమదే అత్యుత్తమమైన రాజకీయ వ్యవస్థ అని చాటుకుంటున్నాయి. కాని మత విషయంలో అలాంటి అరమరికలకు తావులేదు. ఏ మతంనుండైనా, ఎవరైనా ఏదైనా గ్రహించవచ్చు. అలా గ్రహించటాన్ని ఏమతమూ నిషేధించదు. మతోన్మాదులుమాత్రమే ఇతర మతాల అధ్యయనం మీద ఆంక్షలు విధించేది! కాని శ్రధ్ధాళువులైన మతాభిమానులు ఈ ఆంక్షలు పాటించరు. ఈనాటి సమాచార సాధనాలవల్ల ఒక మతస్థుడు మరొక మతానికి చెందిన విషయాలు సులభంగా గ్రహించగలుగుతున్నాడు.

డాక్టర్‌ ప్రాన్ల్కిన్‌: ఆధునిక జీవితం ఎంతో సంకీర్ణమై పోయింది. వాణిజ్యంగానీ, సమాచార ప్రసారాలుగానీ అతివేగంగా జరుగుతున్నాయి. వ్యామోహాలెక్కువైనాయి. హిందూమతం కొన్ని వేల సంవత్సరాలనాటిదని విన్నాను. తన మౌలిక లక్షణాలు వదలక, పెద్దగా మారక పురాతన కాలంనుంచీ యిప్పటివరకూ అది అలాగే నిలిచివుందనికూడా విన్నాను. స్వామివారు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారనీ, అతి సామాన్యమైన ఆహారం తీసుకుంటారనీ, పాదచారులై ప్రయాణిస్తారనికూడా విన్నాను. అయితే అనుక్షణం పెరుగుతున్న రద్దీ, జీవనవేగం, వ్యామోహాలూ, హిందూమతానికీ అధ్యాత్మికతకూ ప్రమాదం కలిగించవంటారా? సామాన్యుడు వీటి ప్రలోభాలకు లోబడకుండా మనగలడంటారా?

స్వామివారు:- పురాతన కాలంలోనూ ప్రలోభాలు లేకపోలేదు. కాని మతాభినివేశంకల సత్పురుషులు ఎన్నో త్యాగాలు చేసి వచ్చే ఆపదలు తప్పించారు. అప్పటికన్నా ఇప్పుడు ప్రలోభా లెక్కువయ్యాయి. వాటినుండి తప్పించుకోవాలంటే ప్రజలు ఇంకా గొప్ప త్యాగాలు చెయ్యాలి.

డాక్టర్‌ ఫ్రాన్ల్కిన్‌:- ఎప్పటినుండో భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది, భౌతికమైన ఈ పురోగతివల్ల దాని ఆధ్యాత్మికత సడలిపోదా? ప్రజల జీవిత విధానంలో ఇంతవరకూ మతం వహిస్తున్న పాత్రలో మార్పురావాలా?

స్వామివారు:- భారతదేశంలో ఇంతకన్నా ఎక్కువమంది యోగులూ, మతాచార్యులూ వుండివుంటే, ఆధ్యాత్మికతకు కలిగిన ముప్పు సులభంగా తొలగిపోయేది. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులనూ, పొలాల్లో పనిచేసే కర్షకులనూ సహితం ఉత్తేజ పరచగల మహానుభావులు ఇప్పుడెందరో అవసరం. అలాంటి మహానుభావులు సామాన్య జనాన్నికూడా భగవంతుని వైపు మళ్ళించగలరు. అప్పుడు పారమార్థికతకు ఏ అపాయమూ వాటిల్లదు.

పారిశ్రామికీకరణం వల్ల గ్రామాలూ, పట్టణాలూ, నగరాలూ ఎంతగా మారినా ప్రజల్లో రక్తగతమైవున్న పారమార్దికత అలాగేవుంది. మతాచారాలు పాటించటంలో ప్రస్తుతం కొన్ని మార్పులు వచ్చాయి. కాని మౌలికమైన మత సిద్ధాంతాల్లో ఏమార్పూ రాలేదు. ఈ వాస్తవం ఒక్క హిందూ మతంలోనేకాదు, అన్ని మతాల్లోనూ కనబడుతుంది.

డాక్టర్‌ ప్రాన్ల్కిన్‌: హిందూమతం ఒకప్పుడు ఉచ్ఛస్థితిలో వుండేదనీ, హిందువులు ఉదాత్తంగా జీవించేవారనీ, కలిపురుషుడు ప్రవేశించాక పతనం ప్రారంభ##మైందనీ విన్నాను. కల్కి అవతారానికి ఇంకెంతకాలం పడుతుంది?

స్వామివారు: మతానికి మళ్ళీ మళ్ళీ ప్రాణంపోసిన మహానుభావులు భారతదేశంలో ఎందరో పుట్టారు. ముఖ్యంగా గడచిన మూడునాలుగు శతాబ్దాల్లో అలాంటి వారవతరించి ప్రజల్లో మత చైతన్యాన్ని కలిగించారు. వచ్చే శతాబ్దాల్లోకూడా ఇది సంభవించవచ్చు.

పూర్వయుగాల్లో భగవంతుడు సాక్షాత్కరించాలంటే తపస్సు చేయవలసి వుండేది. కాని కలియుగంలో భగవత్‌ సాక్షాత్కారానికి నామజపం చాలు. భగవత్‌ భక్తివుంటే చాలు.

కృష్ణ చైతన్య స్వామి గాఢమైన మధురభక్తి ప్రతిపాదించారు. భగవంతుణ్ణి ప్రేమించమన్నారు. భగవంతునికోసం తపించమన్నారు. భగవంతునకు సర్వస్వమూ అర్పించుకోమన్నారు.

ఇలాటిభక్తి ఎంతో కోమలమైంది. సులభ##మైంది. ఇదికూడా అలవరచుకోని వారున్నారు. ఆచారపరంగా కొంత శైథిల్యం కనబడుతున్నా మొత్తంమీద ఆధ్యాత్మికానికి భంగం కలగదు. ఈ యుగానికి సంబంధించిన సులువులు ఈ యుగానికున్నాయి. ఒక వైపు సముద్రం భూమిని కోసేస్తుంటే మరొకవైపు భూమి సముద్రంలోకి చొచ్చుకుపోతోంది.

డాక్టర్‌ ఫ్రాన్ల్కిన్‌: మిమ్ము దర్శించే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగా వుంది. మీ ఆశీర్వాదాలు పొందాను. మీ సన్నిధిలో ఇంత సేపున్నాను. ఎంతో ధన్యుణ్ణి.

స్వామివారు: శ్రద్దాళువులైనవారు అరుదు, శ్రద్ధాళువులైన కొంతమంది నన్ను చూడటానికి వస్తారు. వారిలో మీరొకరు. మీకూ మీ శ్రీమతికీ నా అశీస్సులు, మీరు నన్నెప్పుడు కలుసుకోవాలనిపించినా వచ్చి కలుసుకోవచ్చు.

ఆగమ శిల్ప సదస్సు సందర్భంగా ఏర్పాటైన శిల్పాల, పంచలోహ విగ్రహాల, దేవాలయ ఛాయాచిత్రాల ప్రదర్శనా విభాగాన్ని ఫ్రాన్త్కీన్‌ దంపతులు సందర్శించారు.

మధురలో జరిగిన మీనాక్షి దేవాలయ కుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానింపబడిన వారిలో అప్పుడే మద్రాసులో అమెరికా కాన్సల్‌ జనరల్‌గా పదవీస్వీకారం చేసిన డాక్టర్‌ ఆల్బర్ట్‌ బి. ఫ్రాన్త్కీన్‌కూడా ఒకరు. 1963వ సంవత్సరం డిసెంబరు మాసంలో వెలువడిన ''స్పాన్‌'' అనే అమెరికన్‌ పత్రికలో కుంభాభిషేకాన్ని గురించి వారిలా వ్రాశారు.

మీనాక్షీదేవి కోసం అపరంజి పూతపూసిన ఒక క్రొత్త విమానాన్ని నిర్మించారు. అందులోకి దేవి వెళ్లవలసివుంది. విమాన గోపురం ముందు బహిరంగ ప్రదేశంలో జనం క్రిక్కిరిసి వున్నారు. వున్నట్లుండి వారిలో ఒక సంచలనం బయలుదేరింది. గుమిగూడిన ప్రముఖ వ్యక్తులు ప్రక్కకు తప్పుకుని గౌరవంగా దారియిస్తున్నారు. ఒక వృద్ధుడు పలితశ్మశ్రుముఖుడు చేతిలో దీర్ఘదండం పుచ్చుకుని వారి మధ్యగుండా నడిచి విమాన గోపురానికి వేసిన నిచ్చెన దగ్గరకు వెళ్ళారు. వారే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులవారు. మధ్యమధ్య ఆగుతూ చుట్టూచూస్తూ పరిసరాలలో వున్న వ్యక్తులనూ గమనిస్తూ వెళ్ళారు వారు. వారెవరు? వారి కొక పేరుంది. ఒక నివాసస్ధానముంది. ఒక వయస్సుంది. కాని నిజానికి వారు ప్రతిమనిషీ, మానవుడెంత పురాతనుడో అంత పురాతనులు వారు. మానవుడి ఆలోచన ఎంత పురాతనమైందో వారి ఆలోచనలూ అంత పురాతనమైనవి. వారొక మతశాఖకు ప్రతినిధి. తన సర్వస్వమూ వదలి ఆ మతశాఖ చూపిన దారిలో పయనిస్తున్నవారు. ప్రతి మతమూ కోరే సర్వసంగపరిత్యాగానికి వారు చిహ్నం. క్రీస్తంతటివారు సంపన్నుడైన యువకు డొకడు తన దగ్గరకు వచ్చి ''రక్షణకోసం నే నెవరి నాస్రయించాలి'' అని అడిగినప్పుడు సర్వసంగపరిత్యాగా న్నాశ్రయించాలని ఆదేశించారు.

ఇక్కడ ఈ సమయంలో, ఈ దేవాలయంలో ప్రముఖ వ్యక్తులందరికన్నా వారే ప్రముఖ వ్యక్తి. ఆ వయసులో వున్న వారిలో కనబడనంత చైతన్యంతో, ఉత్సాహంతో సన్నటి పొడుగాటి చేతివేళ్ళ మధ్య నిచ్చెన గట్టిగా పట్టి చురుగ్గా ఏడెనిమిది మెట్లు క్షణంలో ఎక్కేశారు. తన హస్తదండంతో విమాన శిఖరాన్ని అందుకోదగినంత ఎత్తుకు అందరూ చూస్తుండగానే ఇట్టే చేరారు. ఆనాటి కార్యక్రమంలో అంతమంది జనంలోనూ, అందరు ప్రముఖుల మధ్యా వారే వా రొక్కరే కేంద్రభూమిక వహించారు.

Kathakanchiki    Chapters    Last Page