Kathakanchiki    Chapters    Last Page

 

''శైవంలో అద్వైతశాఖ ఒకటుంది''

జెపాన్‌ దేశం నుండి వచ్చిన ఒక యువసంస్కృత పండితుడు టోక్యో విశ్వవిద్యాలయంలో సంస్కృతభాషోపన్యాసకుడుగా ఉద్యోగం చేస్తున్న మినోరుహర అనేవారికి ఈ యేడు ఆగస్టు 12, సోమవారం రాత్రి స్వామివారు దర్శనమిచ్చారు. వారి సంభాషణ 90 నిముషాలపాటు జరిగింది. వచ్చిన పండితుణ్ణి స్వామివారికి పరిచయం చేసి డాక్టర్‌ వి. రాఘవన్‌ ఇరువురి ప్రశ్నోత్తరాలనూ వారివారి భాషల్లో వివరించి చెప్పారు. మినోరుహరహార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివారు. సంస్కృతసాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ శైవశాఖల పై పరిశోధన సాగిస్తున్నారు. సాంస్కృతిక వినిమయపథకం క్రింద భారతప్రభుత్వానికి అతిథిగా భారతదేశాన్ని సందర్శించటానికి వచ్చారు. పలుప్రాంతాలు సందర్శించి కంచికి వచ్చి స్వామివారిని సందర్శించారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృతాచార్యులుగా పనిచేస్తున్న శ్రీ.పి. తిరుజ్ఞానసంబందం కూడా మినోరుహర స్వామివారితో మాట్లాడినప్పు డక్కడే వున్నారు.

ముందు మినోరుహర మోకాళ్ళమీద వంగి చేతులు జోడించి జెపానీయుల పద్ధతిలో స్వామివారికి నమస్కారాలు తెలిపారు. 'హర' అనే పదంశివుని పేరంటూ స్వామివారే సంభాషణ ప్రారంభించారు.

శైవమతం దక్షిణాదికి ఎప్పు డెలా వచ్చిందో, అక్కడది వర్ధిల్లటానకి కారణాలేమిటో చెప్పండని మినోరుహర కోరారు.

''శైవం దక్షిణభారతంలో వర్థిల్లనికాలమంటూ లేదు. అనాదిగా నాగరికత కళ్ళు తెరిచినప్పటినుండీ అదిక్కడుంది. అని స్వామివారన్నారు.

&#అద్వైతానికీ శైవానికి వున్న సంబంధాన్ని వివరించండని మనోరుహర కోరారు.

''శైవశాఖలు చాలా వున్నాయి. అందులో ఏ శాఖను గురించి అడుగుతున్నా'' రని స్వామివారడిగారు. శైవంలోనే అద్వైత శైవం అనేది అంతర్భాగంగావుంది. అలాగే ద్వైత శైవాలూ అనేకా లున్నాయి. ఈరెండు రకాల శైవాలూ కాశ్మీరులోనూ దక్షిణభారతంలోనూ బాగా వృద్ధి చెందాయి. దక్షిణాది శైవశాఖల్లో ప్రసిద్దమైనవి. సిద్దాంతశైవం, వీర శైవం అనేవి సిద్దాంతశైవం తమిళ ప్రాంతంలోనూ, వీర శైవం కన్నడ, తెలుగుసీమలోనూ వ్యాపించాయి.

దక్షిణ భారతంలో వల్లాలారేశాస్త్రం అని అద్వైత సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్రవర్ధిల్లిన రచనలు కొందరు శైవసిద్దాంతులు చేశారు. సిద్ధాంత శైవశాఖలో కూడా శివాగ్రయోగి లాంటి అద్వైతులు చేసిన రచనలెన్నో వున్నాయి. మోక్షావస్థలో జీవుడు శివునిలో (పరమాత్మలో) లీనమై అభేదస్థితిని పొందుతాడని చెప్పే అద్వైతశైవశాఖ ఒకటీ, మోక్షస్థితిలో కూడా శైవునికీ శివునికీ భేదస్థితే గాని అభేదస్థితి లేదని ప్రతిపాదించే ద్వైతశాఖ ఒకటీ వున్నాయి. ఈ రెండోశాఖ శ్రీ రామానుజుల విశిష్టాద్వైతం అందులో జీవుడు ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొందిన తర్వాతకూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. భగవంతుని అనంత కళ్యాణ గుణాలవల్ల అపారమైన అనుగ్రహభాగ్యంవల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తూనే వుంటాడు.

కాని విశేష ప్రచారంలోవున్న శైవసిద్ధాంతం ప్రకారం జీవుని వ్యక్తిత్వం అనేది మాటవరసకు ప్రత్యేకంగా నిలిచివున్నప్పటికీ, అనుభవంలో మాత్రం పరమాత్ముని సర్వవ్యాపకమైన తేజస్సులో లీనమైపోతుంది. సూర్యోదయమయాక నక్షత్రాలు కనబడకపోవటం. పాలకుండలో జారిన నీటిబొట్టు అదృశ్యంకావటం లాంటి స్థితి అది'' అని స్వామివారు చెప్పారు.

స్వామివా రడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ మినోరుహర ''నే నద్యయనం చేసినంత మట్టుకు పాసుపతసూత్రాలు మతసంబంధమైన విషయాలను గురించి చెప్పినంతగా తత్త్వసంబంధమైన విషయాలను గురించి చెప్పలే దనుకుంటాను'' అన్నారు.

ఆమాటలు విని చిరునవ్వుతో ''మతవిషయాలు హృదయాన్ని కదిలిస్తాయి. వేదాంత విషయాలు బుద్ధికి వికాసం చేస్తాయి'' అన్నారుస్వామి.

తిరువాన్కూరు సంస్కృత గ్రంధమాలవారు కౌండిన్యభాష్యంతో కలిపి ప్రచురించిన పాశుపత సూత్రాలను ఆధారం చేసుకుని మినోరుహర మాట్లాడుతున్నారని డాక్టర్‌ రాఘవన్‌ స్వామివారికి విన్నవించారు.

అయితే పాశుపతసూత్రాలు భగవంతుణ్ణి ఉపాదానకారణంగా భావించాయా లేక నిమిత్తకారణంగా భావించాయా అని స్వామివారు ప్రశ్నించారు. దానికి రాఘవన్‌ ''ఇలాంటి వేదాంత విషయాల్లో దేశంలో ప్రచారంలో వున్న నాలుగు శాస్త్రీయ శైవశాఖలూ న్యాయశాస్త్రాన్నే అనుసరించాయి. ఉద్దోతనకారుల వంటి నైయాయికులు పాశుపతాచార్యులుగానే పరిగణింపబడ్డారు. వారందరూ నిమిత్త కారణవాదులే' అని సమాధానం చెప్పారు. ''ఈ విషయం గురించి మీవిద్యార్ధుల్లో కొందరిని పరిశోధన చేయమనండి'' అని స్వామివారు డాక్టర్‌ రాఘవన్‌తో అన్నారు.

మీరేనా మరెవరైనా జెపాన్‌దేశ పండితులు శైవాన్ని గురించి పరిశోధన చేస్తున్నారా? అని అచార్యులవారు మినోరుహరవైపు తిరిగి అడిగారు.

హర: నేనే ప్రస్తుతానికి

స్వామివారు అప్పుడు 'షింటోయిజం' గురించి ప్రస్తావించారు.

&#దానికీ సమాధానం చెబుతూ ''మినోరుహర షింటో మతం ప్రాచీనమైంది. క్రీస్తుశకం 2వ శతాబ్దంనుంచో, 3వ శాతాబ్దంనుంచో వస్తోంది. కాని దానిమీద వ్యాఖ్యానాలుమాత్రం 15, 16 శతాబ్దాలనాటివి. షింటోమత గ్రంథం బుగ్వేదంలాగా గేయమంత్రం. అందులోనుంచే వ్యాఖ్యాతలు మత సిద్ధాంతాలన్నీ రూపొందించారు. జెపానుకు బౌద్ధమతం 7వ శతాబ్దంలోగాని రాలేదు. ప్రాచీనమైన బౌద్ధగ్రంధాలు 8వ శతాబ్దంనాటివే అని చెప్పారు.

ప్రాచీన జెపనీస్‌ గ్రంధాల్లో ఎక్కడైనా వేదాల ప్రసక్తి కనపడుతుందా అని అడిగిన ప్రశ్నకు ''లే''దని సమాధానం చెప్పారు.

&#మరి సరస్వతి, గణశుడు వంటి హిందూ దేవతల విగ్రహాలు జెపాన్‌కెలా తరలివెళ్ళాయని స్వామివా రడిగినప్పుడు అవి బౌద్ధమతంతో పాటు వచ్చాయని మినోరుహర సమాధానం చెప్పారు. తాను భారతదేశానికి రావటం ఈ రెండుదేశాల సాంస్కృతిక సంబంధాలు పెంపొందించటంకోసం కూడానని వారన్నారు.

స్వామివారు: భారతదేశానికి రావటానికి ముందు ఈ దేశాన్ని గురించి మీకు మనస్సులో ఏదో ఒకబొమ్మ వుండివుండాలి. ఆ బొమ్మ యిక్కడకొచ్చాక ఏమైనా మారిందా?

మినోరుహర: భారతదేశం నేననుకున్న దానికన్నా ఆసక్తికరంగా వుందని మాత్రం చెప్పగలను. కొన్నివిషయాల్లో అది నా అంచనాలకు సరితూగలేదు. కాని మరికొన్ని విషయాల్లో అది నా అంచనాలకుదాటిపోయింది. మొత్తంమీద ఈ దేశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది.

స్వామివారు: ఇంతవరకు మీరు ఏ ఏ కేంద్రాలు సందర్శించారు?

హర: డిల్లీ, లక్నో, వారాణసి, కలకత్తా, మద్రాసు చూశాను. బాంబే, పూనాలకు కూడా వెళ్లాలని వుంది.

స్వామివారు: సంస్కృతభాషకూ ఆభాషలో జరుగుతున్న పరిశోధనకూ సంబంధించి ఏకేంద్రం మిమ్మిల్ని బాగా ఆకట్టుకుంది?

హర: నేను చూచినంతమట్టుకు వారాణసి, కలకత్తా, మద్రాసు, వారాణసిలో హిందూ విశ్వవిద్యాలయాన్ని సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించాను.

స్వామివారు: ఆ రెంటిలో ఏది మంచిది?

హర: దేని ప్రత్యేకత దానిదే. రెండూ మంచివే.

మరొక ప్రశ్నకు సమాధానంగా మినోరుహర ''జెపాన్‌లోని చాలా కుటుంబాల్లో షింటోమతమూ, బౌద్ధమతమూ రెండూ కనబడతాయి. మా యింట్లో షింటో మందిరం, బుద్దుని మందిరం రెండూ వున్నాయి. షింటో మతాన్ని అనుసరించేవారికీ, బౌద్ధమతాన్ని అనుసరించేవారికీ వివాహ సంబంధాలున్నాయి. జెపాన్‌ ప్రజలు ముఖ్యంగా షింటో మతస్థులు. షింటోమతం ''జెపనీస్‌ తనానికి'' చిహ్నం. షింటో మతం తరువాతే బౌద్ధమతం వచ్చింది. దానిప్రభావం షింటో మతంమీద కనబడుతుంది. జెపనీయుల సంస్కృతి యావత్తూ షింటో మతంతో ముడిపడివుంది'' అన్నారు.

హిందూవుల్లోవున్న శ్రాద్ధ సంప్రదాయాలు దృష్టిలో వుంచుకుని ''షింటోమతంలో పితృదేవతలకు జరిగే ప్రత్యాబ్ధిక క్రతుకాండ ఏవిధంగా వుంటుం''దని స్వామివారు ప్రశ్నించారు.

హర: ప్రతిఏడూ మార్చి 23 సెప్టెంబరు 23 మాకు శ్రాద్ధదినాలు. ఆరెండు రోజుల్లోమాత్రమే పగటికాలమూ, రాత్రికాలమూ సమానంగా వుంటాయి.

మా దేశంలో చనిపోయినవారికి దహనసంస్కారమే జరుగుతుంది. వారి అస్థులు ఒక పేటికలోవుంచి దానిమీద సమాధి కడతారు. ఆ రెండురోజులూ సమాధులకువెళ్ళి పుష్పగుచ్చాలుంచి పితృదేవతలను గౌరవించటం మా ఆచారం. ఇదికాక వేరే ప్రత్యాబ్దిక విధికూడా మాకుంది. ఆనాడు పురోహితుడు వచ్చి మంత్రాలు చదువుతాడు. బంధువులు వచ్చి విందారగిస్తారు. మాలో ఒకమనిషి మరణించాక 7వ, 14వ, 35వ, 49వ, 100వ రోజులు చాలా ముఖ్యమైనవి.''

''ఇంచుమించు షింటోమతం మా హిందూమతమే అని అనుకోవచ్చా?'' అని స్వామివారడిగిన ప్రశ్నకు ''ఈ రెంటికీ కొన్ని సామ్యాలున్నా అవి ఒకటే అనటానికి వీల్లేదు. అతి ప్రాచీనకాలంలో ఈ రెంటికీ ఏదో సంబంధం వుండివుండావచ్చు'' అని మినోరుహర సమాధానం చెప్పారు,

స్వామివారిదగ్గర సెలవు తీసుకునేముందు ''ధన్యోస్మి యన్మయా శ్రీ శంకరచార్య దర్శనం లబ్దం. కృతార్ధోస్మి. శ్రీ శంకరాచార్యులవారి దర్శనం దొరికినందుకు నేనెంతో ధన్యుణ్ణి, కృతార్ధుణ్ణి'' అని మినోరుహర పునర్నమస్కారం చేశారు.

Kathakanchiki    Chapters    Last Page