Aathmabodha         Chapters          Last Page

2. అరుదైన కానుక

అనంత విశ్వాన్ని, సృష్టి రహస్యాన్ని, జనన మరణ వృత్తాన్ని, మానవుడు తన మేధస్సుతో ఎంతో కాలంనుంచి అనేక కోణాలలో సమూలంగా పరిశీలించి, ఆత్మానాత్మ విచక్షణ చేసి, తత్త్వ పరిశోధనలో ప్రగతిని సాధించాడు.

ప్రాచీన భారత తత్త్వం అనేక మత సిద్ధాంతాలకు మూలం. తనలోని ఆత్మచైతన్యం అందరిలోనూ - సర్వజీవరాసులలోను - ఉన్నదనే భావనయే, విశ్వమానవ ప్రేమకు, సత్యం అహింసలకు మూలాధారమైంది.

ఈ సత్యాన్వేషణలో అనేక మార్గాలున్నాయి- కాని, అన్ని దారులు ఒకే గమ్యానికి చేరుతాయి. ఆవుల రంగులు వేరైనా - వాటి పాలు తెలుపే- నదీనదాలు వేర్వేరు చోట్ల పుట్టినా, ఎక్కడెక్కడ పారినా, చివరకు చేరేది సముద్రంలోనే. నామరూపాలు వేరైనా సర్వజీవరాసుల్లో వెలిగే చైతన్య జ్యోతి- ఆత్మ, ఒక్కటే. అదే సత్యాన్ని విప్రులు అనేక విధాల చెప్పారు.

నాశరహితమైనది, శాశ్వతమైనది, సచ్చిదానందాన్ని ప్రసాదించే, సర్వవ్యాపకమైన చైతన్య జ్యోతిని, ఆదిశంకరులవారు వారి వివేకచూడామణిలో వివరించారు. అది కేవలం సిద్ధాంత చర్చలకై పండితులకు మాత్రమే పరిమితం కాకుండా, జ్ఞానపిపాసులయిన పామరులకు కూడా అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో చేసిన కృషి ఫలితం- ఈ కృతి. జగద్గురువులు తమ బోధనలో, వివేక ప్రాతిపదికపై, అరిషడ్వర్గాలను జయించి, ఆత్మశోధనలో 'నేనే ఆత్మనని గ్రహించి' అద్వైత సిద్ధిని పొందమన్నారు. తాత్త్విక చర్చకన్నా, సామాన్యుల కర్థమయ్యేటట్లు చెప్పడం చాలా కష్టం. ఆత్మజ్ఞానం అందరికి తెలియనప్పుడు ఆ తత్త్వంయొక్క సార్థకత పరిమితమైపోతుంది.

అర్థతాత్పర్యాలు, వివరణలే కాక, సందర్భోచితమైన సంగతులెన్నో కన్పిస్తాయి ఈ రచనలో. తత్త్వం చెప్పేవారు తత్త్వ దర్శినియై ఉండాలన్నారు. రచయిత తన ఆలోచనల్ని, అనుభవాల్ని విషయానికి సమన్వయించి చేసిన కృషి శ్లాఘనీయం. జగద్గురువుల దివ్యసందేశంతోపాటు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, భక్త కబీర్‌, భగవాన్‌ సత్యసాయిబాబా, షిర్డి సాయిబాబా, చిన్మయానంద, సుందరచైతన్యానంద, బాలయోగేశ్వర్‌ గురు మహరాజ్‌ జీ మొ||వార్ల ప్రవచనాలు పొందుపరచడం హర్షదాయకం.

మౌలికమైన ఆత్మ తత్త్వాన్ని పండితులకు చర్చాజనకంగా, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో చేసిన ఈ ప్రక్రియ ఆత్మజ్ఞాన పిపాసులకు అరుదైన కానుక.

1-6-96 -డా|| హేమలతాదేవి, M.A., Ph.D., (Lecturer)

హైదరాబాదు ఆచంట సద్గురు ప్రసాద్‌, Retired Judge

Aathmabodha         Chapters          Last Page