Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

17. భగవత్పాదుల కైలాసయాత్ర

శంకరుల వారు కేదార క్షేత్రంలో విజయం చేసి యున్నప్పుడు వారికి కైలాసము పోయి, సాంబసదాశివుని దర్శనం చేయాలనే కోరిక కలిగింది. కేదారం నుండి యోగమార్గంలో అదృశ్యమయి కైలాసము చేరారు. పార్వతీపరమేశ్వరులను దర్శనం చేశారు. శివుని ఆపాదకేశాంతము, ఆకేశ పాదంతము రెండు స్తోత్రములు చేశారు. సాంబసదాశివుడు శంకరుని యందు అత్యంత సంతుష్టాంతరంగులై అయిదు స్పటికలింగములను, తానే స్వయంగా అంబికపై చేసిన సౌందర్యలహరీ స్తోత్రాన్ని ప్రసాదించారు. ఆనందగిరి శంకరవిజయము, శివరహస్యము, బ్రహ్మండ పురాణాంతర్గతమైన మార్కండేయ సంహిత ఈ విషయములను హృద్యంగా వివరిస్తున్నాయి. ఆ స్పటిక లింగములను, యోగ, భోగ, వర, ముక్తి, మోక్ష లింగములని విడి విడిగా పేర్లున్నప్పటికీ, అన్నీ చంద్రమౌళీశ్వర నామంతోనే పిలువబడతాయి. శంకరాచార్యాష్టోత్తర శతనామ స్తోత్రంలో శంకరులకు 'కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకుడు' అన్న నామమున్నది.

తిరిగి వస్తున్న శంకరులను నందీశ్వరుడడ్డగించి సౌందర్యలహరిలో కొంత భాగాన్ని వెనుకకు తీసుకొన్నాడు. నలభైఒకటి శ్లోకాలు శంకరుల వద్ద మిగిలినాయి. వారి అష్టోత్తర శతనామస్తోత్రంలో 'సౌందర్యలహరీ ముఖ్య బహుస్తోత్రవిధాయకుడు' అన్న పేరున్నది. శంకరులవారు మిగతా ఏభైతొమ్మిది శ్లోకాలనూ పూరించారు. ఈ పూరణ తిరుచ్చి సమీపంలోని సుగంధికుంతలాంబికాలయంలో జరిగిందనీ, అక్కడ రాళ్ళపై కన్పిస్తున్న మొదటి నలభై ఒకటి శ్లోకములు భగవత్పాదులవారే చెక్కించారని చెప్పబడుతోంది. కైలాసం నుండి వచ్చిన నలభై ఒకటి శ్లోకములు పూర్తిగా మంత్రశాస్త్రానికి సంబంధించినవిగా ఉన్నాయి. మిగతా ఏభైతొమ్మిది శ్లోకాలలో శంకరులు నేరుగా దర్శించి వచ్చిన అంబిక వర్ణనమున్నది - ఈ స్తోత్రంపైయంత్ర, ప్రయోగములతో సహా అనేక వ్యాఖ్యానాలున్నాయి. కంచి మహాస్వామివారు సౌందర్యలహరి విషయంలో ప్రసంగిస్తూ ఛలోక్తిగా 'ఆచార్యులవారిని అడ్డగించిన నందికేశ్వరులకు మనం కృతజ్ఞులముగా ఉండాలి. లేకుంటే ఇంతటి కవితాసౌందర్యమున్న భక్తి ప్రధానమైన స్తోత్రం మనకు లభించేదా? సౌందర్యము, భక్తి, కవిత్వములు పరాకాష్టకు చేరి ఒక చోట కూడుకొని

శంకరులు కైలాసం నుండి తీసుకొని వచ్చిన స్పటికలింగములలో ముక్తి లింగాన్ని కేదారంలోనూ, వరలింగాన్ని నేపాళంలోనూ ప్రతిష్టించి మిగతా మూడు లింగములతో దక్షిణాదికి తిరిగి వచ్చారు. శృంగేరిలో భోగలింగాన్ని ప్రతిష్టించి, మోక్షలింగాన్ని చిదంబరానికి పంపి తమ ఆశ్రమమైన కంచి కామకోటిపీఠములో తమ పూజలో యోగలింగాన్ని ఉంచుకొన్నారు. వారి పరంపరలో వచ్చిన బ్రహ్మచర్యంలోనే సన్యాసం తీసుకొన్న యతీశ్వరులచేత ఈనాటికీ ఈ యోగలింగం పూజింపబడుతోంది.

అద్వైతమందు మంచి అభినివేశమున్న శ్రీహర్షుడు తన శృంగారనైషధ కావ్యంలో ఈ యోగలింగపు ప్రస్తావన చేశాడు. దమయంతికి కాంచీప్రభువును పరిచయం చేస్తూ చెప్పబడిన శ్లోకంలో, అతడు త్రవ్వించిన సముద్రమంతటి తటాకం గురించి అభివర్ణిస్తూ, ఆ స్వచ్ఛజలాలతో అభిషేకం చేస్తూంటే స్పటికలింగమయిన యోగేశ్వరుడు కనిపించడు అంటూ వివరిస్తాడు. ఆయనపై శంకరాచార్యులచే అర్చించబడిన యోగేశ్వరుని ప్రభావం ఎంతటిదంటే పురాణకధ అయిన దమయంతీ స్వయంవరాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా కాంచీపురం ప్రస్తావన రాగానే ఆయనకు మొదట జ్ఞాపకం వచ్చింది ఈ యోగేశ్వరుడే. బహుశః శ్రీహర్షుడు అప్పటి కామకోటిపీఠాధీశ్వరులయిన యతులచే నిత్యము అభిషేకించబడే యోగలింగాన్ని దర్శించి ఉండాలి.

శంకరులు అద్వైత శాస్త్ర ఆచార్యులయినప్పటికీ యోగమార్గాన్ని, సమయాచార పూరితమైన మంత్రశాస్త్రాన్ని, పూజాది ఉపాసనా మార్గములు తాము స్వయంగా అనుష్టించి బోధ చేశారు. వైదిక మార్గములేవీ అద్వైతమునకు వ్యతిరేకం కాదు. సాధకములే!

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page