Paramacharya pavanagadhalu    Chapters   

77. లీలా తాండవ పండితః

స్వాములవారు ఆనంద తాండవపురంలో ఒక రోజు అనుగ్రహభాషణ చేశారు. ఆయన ఉపన్యాసం సంస్కృతంలో అద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ అద్భుతంగా సాగింది. ఆ సభలో కూర్చున్న శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి స్వామి ప్రసంగం వింటుంటే అది ఉపన్యాసంగా కాక నటరాజ స్వామి చేసే లీలా తాండవంగా భాసించింది. ఆయన తన మనసులోనే ఆరాధనా పూర్వకంగా 'లీలా తాండవ పండితః' అనుకున్నారు. శ్రీవారిని చిదంబరంలో వెలసివున్న నటరాజ స్వామి (నృత్త తాండవం చేసే భంగిమలో వుండే శివుని మూర్తి)తో పోల్చుకుని ఆనందిస్తున్నారు.

ఉపన్యాసం అయింది శ్రీవారు గోడకు చేరబడి, అటూ యిటూ వూగుతూ అందరికీ వినబడేట్లు మూడు సార్లు 'లీలా తాండవ పండితః' అన్నారు. దీక్షితులుగారంతకు ముందు నుంచీ తాను స్మరిస్తున్న దానినే స్వామి కూడ ఉచ్చరించటం విని ఆశ్చర్యపోయారు, తన ఊహ స్వామి కెలా తెలిసిందా? అని. ఆయన కన్నుల వెంట ఆనందంతో నీరు దారకట్టింది. అంత మంది సభ్యులలో తన మనసులో మాటను గ్రహించి, తనపై ప్రత్యేక వాత్సల్యం చూపిన స్వామికి ఆయన వెంటనే వెళ్లి సాగిల పడ్డారు.

మరునాడు స్వాములవారి ఆదేశంపై దీక్షితులు గారు అక్కడి సభలో సంస్కృతంలో ప్రసంగిస్తూ...

'నటరాజస్థితే సాక్షాత్‌

గురువానంద తాండవే

తండుర్యది భ##వేయం మే

లీలా తాండవ మస్తుతత్‌'

అన్న శ్లోకం చదివారు. 'సాక్షాత్‌ గురుమూర్తి యిప్పుడు నటరాజై ఆనందతాండవంలో ఉండగా నేను తండువు (శివుని పరివారంలో ఒక పరిచారకుని పేరు) నైతే, నాయీ ఉపన్యాస రూపమైన లీల నిజంగా తాండవమే అగు గాక! అని దాని అర్థం.

అది వింటూ స్వాముల వారు సంస్కృతంలో పక్కనున్న సుబ్బుశాస్త్రి గారనే పండితునితో 'విన్నావా, సుబ్బుశాస్త్రి! తాండవ శబ్దానికి వ్యుత్పత్తి యిచ్చాడు!', అని ప్రశంసా పూర్వకంగా వ్యాఖ్యానించారు.

Paramacharya pavanagadhalu    Chapters