Paramacharya pavanagadhalu    Chapters   

71. మరో మాతృభూతేశ్వరుడు!

అలహాబాదులో సహస్రలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని సంకల్పించారు కంచి స్వామి. ఆ లింగాన్ని తయారు చేసే బాధ్యత గణపతిస్థపతికి అప్ప చెప్పారు.

స్థపతి పూర్వులెవరూ ఆ పని చేయలేదు కనుక ఆయనకు ధైర్యం చాల లేదు. అయినా స్వామి ఆజ్ఞ మేరకు ఆ పని చేసే దానికి ఆయన అంగీకరించాడు. కాని చిన్న కోరికలు కోరాడు. స్వామి పని జరిగినంత సేపూ అక్కడే వుండాలి. పని జరిగినంత సేపూ వేద ఘోష వినిపిస్తుండాలి.

స్వాముల వారు ఆయనను తిరుచినాపల్లి పోయి తాయుమానవర్‌ (మాతృభూతేశ్వర స్వామి) కొలతలు తీసికొని ఆ విధంగా చెక్కమన్నారు.

శ్రీవారి జన్మనక్షత్రం అనురాథ. కనుక రాయి తీయటానికి అనురాథ నక్షత్రయుక్తంగా ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజు జోరున వర్షం. అంతా తడుస్తూ నిలబడ్డారు. రాత్రి పదిగంటలప్పుడు సురక్షితంగా లారీ నుంచి రాయి దింపారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. వర్షం వెంటనే ఆగిపోయింది. దింపినప్పుడు అప్రయత్నంగా ఆమ్రవృక్షం దగ్గిరే రాయి పడటం విశేషం.

తెల్లవారు ఝూమున శ్రీవారు వచ్చి వేదమంత్రాలు పఠిస్తుండగా కార్యక్రమం ప్రారంభ##మై నిర్విఘ్నంగా సాగింది. శివలింగం స్వామి సంకల్పించినట్లే పూర్తయింది.

శ్రీవారి ఆశీస్సులతో తరువాత చికాగోలో దేవాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేశారు స్థపతి. ఆ విధంగా ఆయనకు అంతర్జాతీయంగా కూడ గుర్తింపు లభించింది. 'శిల్పకళారంగంలో ఈ రోజు నేనీమాత్రం నిలబడటానికి మూలకారణం ఆచార్యుల వారి అనుగ్రహ బలమే కాని నాదేం లేదంటారు' ఆయన.

ఆనందమే పరమాత్మ స్వరూపం 'ఆనందో బ్రహ్మేతి వ్యజ్యాత్‌' - అన్న వేదవాక్యం యీ సంగతే చెబుతోంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters