Sri suktha Rahasyardha pradeepika    Chapters   

అభిప్రాయము

శ్రీ కర్రా అగ్నిహోత్రశాస్త్రి

లూటుకుర్రు.

శ్రీకాకుల నివాసులు - మరియూ శ్రియానందదీక్షా నామదీక్షితులు - తదుపనత సమాససంధియోగ సమమధురో పనతా వాఖ్యేయ పరమార్థవిరాజిత కావ్యగానకలాకలాప విశారదులు - శ్రీసూక్త మహాసౌరమంత్రార్థ దేవీపంచస్తవీ సౌందర్యలహర్యాది దివ్యాంతరిక్షభౌమ సారమర్ష భావసము ద్రము నంతనూ అగస్త్యుడువలె ఆ చమనమును చేసిన కుక్షింభరి. ఇట్టి శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మగారి ఆంధ్రానువాద గ్రంథములకు ఇప్పటి ఆంధ్రవాగమ శాసకుల శాస్త్రీయభాషా నియమములకే గాక అరసున్నలకు కూడ ముక్కెచ్చటనో ముఖమెచ్చటనో తెలియని నావంటి వాని అభిప్రాయము అంధతముడను మహర్షి చరిత్రకు స్మారకచిహ్నమై సూర్యుని జూపుటకు దీపమును పోలియుండునని కూడ నే నెరుగుదును. ఐననూ వైదికమంత్ర యంత్ర తంత్ర యోగులకు చతుశ్శతీ శాస్త్ర యోగినీహృదయమందు చెప్పినట్టు ''కామపూర్ణ జకారాఖ్య శ్రీపీఠాంతర్ని వాసినీం | చతురాజ్ఞాకోశభూతాం నౌమి శ్రీత్రిపరామహం'' అనెడి చతురామ్నాయ కోశభూతయగు త్రిపురా గాయత్రీ పరామంత్రార్థరహస్యము నెరుగ నట్టి మంత్రుల దృష్టికి ప్రకృత రాజకీయ మంత్రుల దృష్టికివలె హాస్యాస్పదమై తోచిననూ మిథ్యాదృష్టి వలలో చిక్కక సత్యాన్వేషులగువారు భారతభూమిలో నున్న యడల అట్టి వారిని ఈ గ్రంథకర్తగారి గ్రంథములవలె నా వ్రాయబోవు అభిప్రాయముకూడ కొంతవరైనా సత్యము వైపుకు చిత్తముతో ఆకర్షించునని హృదయపూర్వకముగా నమ్ము చున్నాను. ఇందుకు కారణము యాజ్ఞవల్క్యమహర్షి భాస్కరు నారాధించి అయాతయామ యజుర్గణములను ఆదివస్పతివల్ల పరలాభమును పొందిన విదముగా ఈశ్వర సత్యుండగు మన ఈ గ్రంథకర్త ఈశ్వరకృష్ణునివలె షోడశాంతధ్రువ చంద్రకలకు ఔరసపుత్రుడై ప్రాచీనాంధ్రకవులకునూ నవీనాంధ్రకవులకునూ ''కవింకవీనాముపమశ్రవస్తమం'' అను గణశమంత్ర లింగప్రకారము బ్రహ్మణాం బ్రహ్మణస్పతియగు గణశ చంద్రునకుకూడ వర్థమానచంద్రునిబోలి మార్గదర్శకుడని ఈ మహామహుని ద్విజరాజనామద్వయముతో పాటు సహజ కవితాధారాశుద్ధిగల ఈయన యొక్క ఆంధ్రానువాద గ్రంథములన్నియూ ఏక పదీమార్గమును తప్పక దేవతల కమృతసంజీవినీ విద్యనువలె అసురులకు మృతసంజీవినీ విద్యను కూడ వారి వారి అధికారమునకు తగునట్లు ప్రకటించుచూ సాక్షిభూతములగుట వక కారణము. మరియూ ''అన్యధా వేదపాండిత్యం శాస్త్ర పాండిత్యమన్యధా! అన్యధావస్తునస్తత్వం లోకాః పశ్యంతి చాన్యధా'' అని చెప్పిన లౌకికాలౌకిక పాండిత్యా భాస చతుష్టయము ''ఏకం శాస్త్రమధీయానో నవిద్యాశాస్త్ర నిశ్చయం'' అనునట్లు వక మార్గముకూడ పూర్తికాక పరస్పర విరోధములను తలస్పర్శ చేయుచున్నట్టి కవిపండితుల కోలాహలమునకు ''మాతామహమహాశైలం మహస్తదపితామహం| కారణంజగతాంవందే కంఠాదుపరివారణం'' అని సకల జగత్కారణుండై శైవశాక్తాది యావత్కులగోత్రమతసూత్రీ యులకునూ ఆదౌపూజ్యుడగు గణశుని శక్తిమాతృకాతత్త్వ మందు మూలములను లేశ##మైననూ అతిక్రమించక చేసిన ఈ మహాకవి యొక్క ఆంధ్రానువాదములో నాసాగ్రముకువలె మూలమెచ్చటనో అగ్రమెచ్చటనో తెలిసినపుడు కాదా? వారి కోలాహలమునకు సావకాశము చిక్కుట. అట్టి సావకాశమును లేశ##మైననూ ఇవ్వక ప్రౌఢమార్గములో లలితకలా నృత్యముతో జగన్మోహనమగుచున్న ఈ మహాకవి పాండిత్య మభ్రంకషమనుటలో ఆశ్చర్యముగాని అతిశయోక్తిగాని యంతమాత్రమూ లేదు. ఆ కవిపండితుల షట్చక్రమూలా ధారాద్యనుభవము వారి లోకవేదానుభవమువలె అధోదృష్టి లోనే వారికి గోచరించుచుండును. ''అన్యధావస్తున స్తత్వం లోకాఃపశ్యంతి చాన్యధా'' అని లోగడ చెప్పినట్లు వస్తుత త్త్వము విజ్ఞుల కూర్ధ్వదృష్టిలోనే గోచరించుచుండును. ''పర్వతే పరమాణౌచ పదార్థత్వం వ్యవస్తితం'' అనునట్లు శుద్ధాశుద్ధ విద్యా విషయములకు పర్వత పరమాణువులకు వలె పరిమాణానుభవములయందు భేదమున్ననూ పదార్థత్వమాత్ర ధర్మము సమానమనుట నిర్వివాదమే. గాని నాలుగంగుళముల పరిమితిగల ఛాయాపటములోని స్త్రీ పురుషులయొక్క బాల్య¸°వనాది వయోవిశిష్టశరీర ప్రతిబింబములవలె లేక అంతపరిమాణములోనే చిత్రితములగు గృహ గ్రామ దేశారణ్యనదీ సముద్రాది ప్రతిబింబముల యందువలె భావుకుల అనుభవములో పర్వతపరమాణ్వాదులకువలె వారి వారి అనుభవములు వేర్వేరని తప్పనిసరిగా అంగీకరింపక తప్పదు. గావున సద్విద్యా సంప్రదాయము సద్గురూపదేశైక లభ్యమేగాని దానిని చిత్రకలానైపుణ్యముతో వ్రాసిచూపుట కెంతమాత్రమూ వీలుకాదని తెలియవలెను. గౌతమబుద్ధుని బౌద్ధమతగ్రంథ ములవలె దయతో వ్రాసిచూపి చెప్పుదమన్ననూ షడ్విధ బౌద్ధమతమువలె వారివారి తలలకు తగిన అపార్థములతో అనర్థకరమే యగునుగాని పరమపురుషార్థములిచ్చి సంసార సముద్రమును తరింపజేయుటకు సద్గురుచరణమువలె సమర్థ మెన్నటికినీ కానేరదని మరువకూడదని విజ్ఞాపిస్తూ ఇంతతతో విరమించుచున్నాను.

లూటుకుర్రు ఇట్లు బుధజనవిధేయుడు

21-4-1953 కర్రా అగ్నిహోత్రశాస్త్రి.

-*-

శ్రీః

నెల్లూరుజిల్లా ముత్తుకూరు హైస్కూలు ప్రధానపండితులును, విజయఘోషణ

గురుబ్రహ్మస్తవేత్యాది బహుగ్రంథకర్తలును, ఉభయకవితాప్రవీణ,

వైద్యరత్న, విశారదేత్యాది బిరుదాంకితులు నగు

బ్రహ్మశ్రీ ఆకిలి శ్రీరామశర్మగారి

అ భి ప్రా య ము

శ్రీమద్విద్వద్వరేణ్యలు, విద్యాగరిష్ఠులు, బ్రహ్మశ్రీ శ్రియానందనాథాపర నామధేయులు, శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారు రచించిన ''శ్రీసూక్తరహస్యార్థ'' మను గ్రంథము పీఠికాసహిత మామూలచూడము పఠించితిని.

శ్రీసూక్తమునకు, హేమవిద్యా (Alchemy) పరముగా విజయనగరము (ఏనుగులమహల్‌) వాస్తవ్యులు బ్రహ్మశ్రీ రాణీచయనులు అనువారు (వీరు విద్వద్వైద్యులు, శ్రీవిద్యా దీక్షితులు, ఉద్దండపండితులు, అపరవయసున ప్రవ్రజితులు) సంస్కృతమున వ్యాఖ్యానించి, దాదాపు ముప్పదియైదు వత్సరముల క్రితము 'రెడ్డిరాణి' పత్రికలో కాబోలు ప్రచురించిరి. అప్పుడు నాకు పదుమూడు పదునాలుగేండ్ల వయస్సు. ఆ వ్యాఖ్య చదివితిని గాని విషయము మనసున నిలువలేదు. ఇట్లే మేఘసందేశము గూడ హేమవిద్యాపరమే అని చెప్పు పండితులును గలరు. ఎవరెవరికి, ఏ యే విద్యలందు గాఢమగు అభినివేశముండునో వా రన్యవిషయక గ్రంథములందును తమ ఇష్టార్థమును గవేషించుట పరిపాటి.

'అచలవేదాంతము' అను నొకవిధమగు వేదాంతవిద్య సామాన్య జనులయందు వివేషప్రచారములో నున్నది. అందు వారికి పెద్ద పాండిత్య ముండుట అరుదు. అట్లయ్యు వారు ప్రతి గ్రంధమునకును వారి మార్గమున కనుకూలమగు రహస్యార్థములు చెప్పుకొనుట నే నెఱుఁగుదును. వారి విద్యా ప్రచారమునకు ముఖ్యసాధనములు, అచలవేదాంత కందార్థములు, కాలజ్ఞాన తత్వములు, కొన్ని మేమనపద్యములు, ఇత్యాదులు. ఇఁక వారు భారత. భాగవత, భగవద్గీతా, రామాయణములకు రహస్యార్థములు చెప్పుచుందురు. ఉదాహరణార్థ మిట నొండు రెండు మనవిచేసికొనుచున్నాను.

భాగవతమున కృష్ణజన్మ విషయకమగు ప్రశ్న రాగా - ''శీలము గల యదుకులమున, నేలపుట్టెను మహాత్ముడు''? అని శౌనకాదులు ప్రశ్నింతురు. దీని కొక అచలవేదాంతి వ్యాఖ్యానము - 'శీలముగల యదుకులమున కృష్ణుడేల పుట్టెను' అను ప్రశ్నలో అర్థము లేదు. శీలము లేని కులమందు పుట్టెనా? ప్రశ్నించుట కవకాశము గలదు కానీ, శీలము గల కులమందేల పుట్టెనని ప్రశ్నించుట యెట్లు? కావున దీనికి రహస్యార్థముండి తీరవలెను. ఆ రహస్యార్థ మెఱుఁగుటయే మనకు కావలసినది. శీలము - కలయదు - కులమున - అను పదచ్ఛేదముతో - ఆ యదుకులమున శీలములేదే. అట్టి కులమున కృష్ణు డెట్లు పుట్టెను? అని యర్థమని వ్యాఖ్యానించెను!

ఇట్లే గజేంద్ర మోక్షమునందు - ''పాదద్వంద్వము నేల మోపి'' అను పద్యమున ''బుద్ధిలతకున్‌ మారాకు హత్తించి'' అనుచోట - 'మా' అను అక్షరమును 'రా' అను అక్షర ముతో జోడించిన 'రామా' అని యగుననియు, బుద్ధికి, తారక మంత్రమగు రామమంత్రము హత్తించుట రహస్యార్థమనియు నిర్ణయించెను.

మఱియొకరు ''చెప్పులోనిరాయి, చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు కాలిముల్లు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ'' అను వేమనపద్యమున కిట్లు గూడార్థము వివరించిరి. 'లోనిరాయి' అంతర్గతుడై లింగ స్వరూపుడగు ఈశ్వరుని, చెప్పు - చెప్పమని శిష్యప్రశ్నము - గురువు చెప్పుచున్నాడు - ''చెవిలోని జోరీగ'' చెవియందు జోరుగా దశవిధ నాదుములు వినిన పిమ్మట ''కంటిలోని నలుసు'' అనగా భ్రూమధ్యమున దృష్టి నిలిపి సూక్ష్మతేజోబింబమును ''కంటి'' చూచితిని. అనఁగా చూచును పిమ్మట ''కాలిముల్లు'' ప్రపంచసంబంధములగు ద్వంద్వములు (ముండ్లు) కాలి నశించి పోవును. అంతట ''ఇంటిలోనిపోరు'' శరీరాంతర్గతమగు పోరు ఆనంద కోలాహలమున ఒడలు తెలియకుండుటయే జ్ఞానికి సమాధ్యవస్థ. దానిని ఇంత అని తెల్పుట కలవిగాదు అని సరహస్యముగ వివరించిరి.

ఇట్టివి సర్వసామాన్యముగ పల్లెలందు వినవచ్చు చుండును. ఈ యర్థనిర్ణయ మెంత సమంజసమో విజ్ఞు లూహింపక పోరు. పై వాని వలన సామాన్యముగ చదివినవాడు కూడ ఎట్టి గ్రంథమునైనను తమ అభినివిష్ట విషయపరముగ నన్వయించుకొనుట సహజమని తెలియవచ్చుచున్నది గదా!

ఇక చక్కని పాండిత్యముండి సిద్ధాంత పూర్వపక్షము లెఱిగి వాదింపగల నేర్పరులు - ఎట్టి గ్రంథమునకైనను - ఎట్టి వ్యాఖ్యానమైనను చేయ శక్తులనుటలో వింత యేమున్నది? శ్రీసూక్తమునకు ఇద్దఱు పండితులు రెండు విధములగు వ్యాఖ్యానము చేయుటచే పైవిషయము ప్రసక్తాను ప్రసక్త ముగ తెల్పితినేకాని, వ్యాఖ్యలను నిరసించుటకు గాదు.

వేదమంత్రములకు - ఆధునిక పండితులు (దయానంద సరస్వతి - మొ.) కొందఱు లైకి కార్థములు చెప్పుచున్నను శ్రీ సాయణులు మొదలగు పూర్వ వ్యాఖ్యాతలును - ధార్మికు లగు పండితులును - అవి భగవల్లీలా ప్రఖ్యాపకములే అని నమ్మి భజించుచున్నాడు.

శ్రీ శ్రియానంద నాథు లిట్టికోవకు చేరినవారు. వీరు రచించిన ఈ వ్యాఖ్యానము శ్రీదేవీపరముగ నున్నది. రహస్యార్థ వివరణమున వీరు క్లిష్టకల్పనకు దొరకొనలేదు. ''నామూలం లిఖ్యతే కించి న్నానపేక్షిత ముచ్యతే'' అన్నట్లు అమూలకమును - అనపేక్షితమును అగు రహస్యార్థ మిందొక ముక్క అయినను నాకు గనుపట్టలేదు. వీరు వ్యాఖ్యానవిషయము నెపమున పీఠికలో పెక్కు శాస్త్రరహస్యములు తెలిపియున్నారు. వ్యాఖ్య నామమాత్రముగ ఆధారము చేసికొని వీరు రచించిన గ్రంథపీఠికలలో వీరి అనుభవములు శాస్త్రచోదితములగు పెక్కు రహస్యములు తెలుపుచుండుట వీరికి పరిపాటి. వీరు చెప్పదలచి కొనిన విషయము లనంతములుగ చెప్పగలరు గాని, రచన బాహుళ్యమగునని సంగ్రహింతురు. దేవీస్వరూపు లగు వీరి రచనలలో వ్రేలుపెట్టి నెఱుసులు చూపుట సామాన్యులగు అస్మాదృశులకు సాధ్యమగునా? ఇట్టివే పెక్కు రచనలు లోకోపకారముగ రచించి ఆంధ్ర ముముక్షుజనము నుద్ధరింతురు గాత మని శ్రీవారిని శతశః వేడుకొనుచున్నాను. ఈ గ్రంథ మును ముద్రించి లోకమున కొసగిన శ్రీ గం|| భా|| సమానురాలగు కాకర్ల లక్ష్మమ్మ గారి ఔదార్యమును ఉచితజ్ఞతను మిక్కిలి కొనియాడుచున్నాను.

ముత్తుకూరు. ఇతిశమ్‌.

నెల్లూరుజిల్లా. ఆకిలి శ్రీరామశర్మ,

5-5-1953. శ్రీ శ్రియానంథనాథశిష్య పరమాణువు

-*-

ఓం

శ్రీ మహాగణాధిపతయేనమః

విజయవాడ S.R.R. and C.V.R. కాలేజి, సీనియర్‌ లెక్చరర్‌,

శ్రీయుత జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి M.A., B.L గారి

అమూల్యాభిప్రాయము

శ్రీ శ్రియానందనాథాపర (దీక్షా) నాములైన ఈశ్వర సత్యనారాయణశర్మగారీ గ్రంథమును రచించిరి. శ్రీ శర్మగా రాంధ్రలోకమున యశస్తిలకులు, బహుళగ్రంథములను రచించిన మహామేధావులు. నైసర్గిక ప్రతిభా సమన్వితులై, పవిత్ర జీవితమును గడపుచు, సనాతనధర్మమండలి పీయూషమును గ్రోలుచు, లోకసంగ్రహార్థము భాస్వదాశయసందీప్త గ్రంథము లను వీరు రచించుచున్నారు.

''శ్రీసూక్తరహస్యార్థము'' ముముక్షువులకు సత్యసంశోభిత మార్గమును చూపు మహాగ్రంథము. ఇది పదునేను ఋక్కులుగల గ్రంథము. శ్రీదేవిని, సావిత్రీదేవిని, గాయత్రీ దేవిని, శ్రీత్రిపురసుందరీదేవిని, శ్రీసరస్వతీదేవిని, శ్రీలలితా దేవిని ఉపాసించు విధు లిందు గలవు. ''శ్రీ'' శబ్దమునకు బ్రహ్మమనియే యర్థమని శ్రీవిద్యయన బ్రహ్మవిద్యయని, జ్ఞానానంద స్వరూపిణియైన దేవిని గుఱించిన విషయమే శ్రీసూక్త మనియు, శ్రీవిద్య స్త్రీవిద్య కాదనియు శ్రీశర్మగారు నిరూపించిరి. భయముగొలుపు వామాచార మిందు లేదు. ఈ యుపాసనమందలి ప్రకటార్థ రహస్యార్థములను తెలిపి శ్రీశర్మ గారు లోకోపకార మొనరించిరి.

విజయవాడ, ఇట్లు

6-వ జూన్‌ 1953 జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి.

-*-

ఓం

శ్రీమహాగణాధిపతయేనమః

విద్యాప్రవీణ - భాషాప్రవీణ - చతుర్వేదుల ఆంజనేయశాస్త్రి

Pandit S.R.R. & C.V.R. College గారి

అభిప్రాయము

శ్రీసూక్తమునకుఁగల గుప్తార్థమును సమగ్రముగా నెల్ల రెఱుంగుటకు వీలుగా శ్రీఈశ్వర సత్యనారాయణశర్మగారు రచించిన గ్రంథమును జూచితిని. శ్రీశర్మగారు తత్త్వార్థ మెఱింగిన శ్రీవిద్యోపాసకులు. కావున విద్వదుపాసకులు, ఆయీ విషయము ఈ గ్రంథమువలననే వారినిఁ జూడకున్నను వ్యక్తము కాఁగలదు.

శ్రీవిద్యను స్త్రీవిద్యయని వ్యవహరించు తదుపాసకులెందరో కలరు. వా రెల్లరికంటె వీరికిఁగల వైశిష్ట్యము గమనింపఁదగినది. గ్రంథకర్త తత్వార్థమును విప్రతిపత్తి లేని చక్కని సమన్వయమార్గమున వ్యక్తపరచెను. ఆ రీతిగా వ్యక్తముచేయుటకు స్వానుభూతి యున్నను లేకున్నను యోగశాస్త్ర విజ్ఞాన మవసరము. అనుభూతికూడ నున్నచో చెప్పవలసినది లేదు.

శ్రీ శర్మగారు పీఠికలో వ్యక్తము చేసినరీతిగా శ్రీసూక్తమును పారాయణము చేయువారు తన్మంత్ర తత్త్వార్థ మనన ముచే సత్ఫలమును పొందఁగల్గుదురు. కావునఁ దదుపాసనార్హులగువా రెల్ల రీగ్రంథమును చదివి తత్త్వార్థము నెఱుంగుదురు గాక.

ఈ గ్రంథమును రచించిన శ్రీ శర్మగారి కితోధిక గ్రంథరచనకు పరమేశ్వరి తోడ్పడుగాక.

విజయవాడ, ఇట్లు

19-6-53 చతుర్వేదుల ఆంజనేయశాస్త్రి

Sri suktha Rahasyardha pradeepika    Chapters