Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

యంత్ర స్థాపనము

సురేశ్వరులు రచించిన నైష్కర్మ్యసిద్ధి ఏకార్యమూ లేక పరమేశ్వరసాయుజ్యం పొందడం ఎలా సాధ్యం? అనే విషయాన్ని చర్చిస్తుంది. 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌' అని వేదం 'ఆనందమే పరమాత్మస్వరూపం' అని చెబుతోంది.

ప్రేమ లేక ప్రీతి ఉత్తమమధ్యమఅదమ భేదములచే మూడు రకాలు. గుణములను అనుసరించి చెప్పిన వానినే సాత్త్విక రాజసిక తామసికములు అనవచ్చును.

మహాత్ములు, యోగులు, సత్యసంధులు, పరోపకార పారీణులు, జ్ఞానులు, అనుగ్రహదక్షులు ఇట్టివారిమీద మన కొక అనురాగము ప్రీతి ఏర్పడతూ ఉంటాయి.

అలా కాక సంపర్కంచేత కొందరియందు మనకు ప్రీతి ఉదయస్తూ ఉంటుంది. బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు మొదలగు వారిపై పుట్టే ప్రీతి సంపర్కకారణం వల్లనే జన్మిస్తుంది. కన్న తల్లియందు కంటె పెంచినతల్లియందే ఎక్కువ ప్రేమను ప్రీతిని కలిగి ఉండడంకూడా మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రేమకుకూడా సాంగత్యమే కారణం. సాంగత్యం కారణంగా వీరికంటె ఉత్తములు ఏందరోఉన్నా మన ప్రీతి వీరి యందు నిబద్దం అవుతోంది .

పై రెండు విధాలుగా కాకుండా ఏదేని ఒక కార్యాన్ని ఉద్ధేశించి మనం కొందరిని ప్రేమిస్తూ ఉంటాము. అక్కడ మన ప్రేమకు వారేదో చాలా గొప్ప మహాత్ములు కావడం కాని, లేదా వారితో మనకు అనవరతమైన సాంగత్యం ఏర్పడడం కాని కారణం కాదు. కేవలం మనకు వారివల్ల ఒక పని నెరవేరవలసి ఉండి మనం వారిని ప్రేమిస్తున్నాం.

సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే మూడు గుణాలనుండి పై మూడురకాల ప్రీతులు జనిస్తున్నాయి. మహాత్ములు యోగులు మొదలగు వారి యందుండే ప్రేమ సాత్త్విక ప్రేమ. సంపర్కంవల్ల ఏర్పడే ప్రేమ రాజసికప్రేమ. ఇక ఒక పనిని ఉద్దేశించి యజమానిపై సేవకుడు చూపే ప్రేమవంటిది తామసిక ప్రేమ.

ఇలా మూడు రకాలుగా ఉన్న యీ ప్రేమలో ఏ ఒక్కరకము కలకాలము నిలచిఉండదు. సత్యసంధులు, ఉత్తమ పురుషులు నగు వారిమీద మనకు ఏర్పడే సాత్త్వికప్రేమ కూడా నశించడానికి సావకాశం ఉంది. ఏమంటే ఈ ప్రేమకూడా నిర్వ్యాజమైనది కాదు. వారిలో ఏదో ఒక గొప్పగుణం ఉన్నది. అందుచేతనే వారియందు మనకు ప్రీతి జనించింది. వారిలోని ఏ గుణం హేతువుగా ఈ ప్రేమ పుట్టిందో ఆ గుణం వారిలో లోపిస్తే మన యీ ప్రేమకూడా హఠాత్తుగా అంతరించి పోతుంది.

ఇక సంపర్కంచే ఏర్పడిన ప్రేమ కొద్దికాలలో తనంత తానుగా నశించవచ్చు లేదా సాంగత్యానికి ఒక విఘాతం ఏర్పడినంతనే నశిస్తుంది. మనం బాగా ఎరిగినవారు చనిపోతే మనం దుఃఖిస్తాము. వారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండడం జరిగితే మరింత దుఃఖిస్తాము. పరిశీలిస్తే ఈ దు:ఖానికి అర్థం లేదనిపిస్తుంది. మనకు ప్రీతి పాత్రులైనవారు గతిస్తే మనకు కలిగే దుఃఖానికి వారి ఎడబాటే కారణం కాని, వారి యందలి ప్రీతి కారణం కాదు. ఎడబాటు కారణం దుఃఖిస్తున్నాము అంటే ఎంతకాలం వారితో ఎడబాటు ఏర్పడి ఉంటుందో అంతకాలమూ ఏడవవలసి ఉంటుంది. ఇరువది సంవత్సరములకు వెనుక నెవడో మనకు ప్రీతి పాత్రుడైనవాడు చనిపోయేడు. అప్పుడు మనకు దుఃఖం కలిగింది. ఆ దుఃఖానికి ఎడబాటే కారణం అనుకుంటే ఇర్వదేళ్ళు గడిచినమీదట నేడుకూడా ఆ ఎడబాటు అలాగే ఏర్పడి ఉన్నది గనుక ఆనాటి వలె ఈనాడుకూడా మనం దుఃఖించాలి. అంటే ఏడ్వడానికి కారణం ఆనాడెంత ఉన్నదో ఈనాడు కూడా అంత ఉన్నది. ఈ దుఃఖములు ప్రయోజన రహితములు. సాంగత్యంవల్ల పుట్టిన ప్రేమ మధ్యమమైనది.

సాత్త్వికప్రేమకూడా గుణములమీద ఆధారపడి ఉన్నందున గుణం లోపించగానే ప్రేమలోపిస్తుంది. అని చెప్పుకొన్నాం. పెద్దలను మనం ప్రేమిస్తాం. ఎందుకు? వారేదో మనలను తీర్చిదిద్ది బాగుచేస్తారనే ఉద్దేశ్యంతో వారిని ప్రేమిస్తున్నాం. అంటే ఒక కార్యాన్ని ఉద్దేశించియే పెద్దలనుకూడా మనం ప్రేమిస్తున్నాం. యజమానిపై సేవకునకు ఉండే ప్రేమ కేవలం కార్యాన్ని ఉద్దేశించి ఏర్పడినదని వెల్లడిగా తెలుస్తూనే ఉన్నది. ఏమంటే ఎంతవరకు అతడు జీతం ఇస్తాడో అంతవరకు వీడు ఆయనను సేవిస్తాడు. ఆయన జీతం ఈయడు; వీడు సేవించడు. ఈ విధంగా లోకంలోని ఉత్తమమధ్యమఅధమములైన మూడు ప్రేమలు నశ్వరములే. ఈ ప్రేమలు అనురాగములు, ప్రీతులు పరమ శివుని ప్రేమయొక్క ఆభాసమాత్రములు. ఈ ప్రేమలు ఒక వ్యాజముపై ఏర్పడినవే కాని నిర్వ్యాజములు కావు.

నిర్వ్యాజము వేదాంతోక్తమునగు ప్రేమయే ఈశ్వరస్వరూపం. ఆదిశంకరులు మండనమిశ్రులకు ఆ నిర్వ్యాజప్రేమస్వరూపాన్నే బోధించేరు. శ్రీరామచంద్రమూర్తి మహాసాధువు, దీనజనరక్షకుడు, సత్యసంధుడు, ఏకపత్నీవ్రతుడు, కల్యాణ గుణపరిపూర్ణుడుఅని మనం వారిని ప్రేమిస్తే మన యీ ప్రేమ వారి గుణాలను బట్టి ఏర్పడినదిగాన వ్యాజప్రేమయే కాని అవ్యాజప్రేమ కాదు.

అవ్యాజప్రేమయే ఈశ్వరస్వరూపం. ఆ ఈశ్వరుడు కారణం లేకుండానే మనలను ప్రేమిస్తున్నాడు. కారణాలకై వెదికే వాడైతే ఆయన మనకు ఒక్కనాడుకూడా అన్నం పెట్టడు. మనయందున్న మేలిగుణాలు అట్టివి. అందుచేతనే ఈశ్వరుడు అవ్యాజప్రేమస్వరూపుడు అనడం. అవ్యాజప్రేమ మనకు ఒక వ్యక్తియందు ఉంటే ఆవ్యక్తిని మనం నూరేళ్ళు చూడకపోయినా, అతడు అయోగ్యుడు అయినా, అతనివల్ల మనకు ఏ ప్రయోజనమూ లేకపోయినా మనం అతని ప్రేమిస్తూనే ఉండాలి, మన ప్రేమకు ఏ కొరతయు రాకూడదు.

కార్యమును, గుణమును ప్రేమించినట్లు వ్యక్తిని ప్రేమించాలి. రాముడు సత్యసంధుడు కనుక ఆయనను ప్రేమించుట కాక రామునికొరకే రాముని ప్రేమించుట అవ్యాజప్రేమ.

మనం అసత్యాలు పలుకుతాం, తప్పిదాలు చేస్తాం, అయినా మనం మనలను బహిష్కరించుకొనడం లేదు. యావజ్జీవము మనలోపాలను సవరించుకొనడానికే యత్నిస్తున్నాం! మనయందు మనకు ప్రేమ నశించడంలేదు. ఇతరులయందు సైతము యిట్టి సహనభావం ఏర్పరుచుకోవాలి. పాపాత్ముడని, దుష్టుడని గుణాలు కారణంగా ఎవరినీ ద్వేషించకూడదు. గుణాలు కారణంగా ప్రేమించుటయే జరిగినా ఆ ప్రేమ దొడ్డది కాదని చెప్పుకొన్నాం. కాగా నిర్వ్యాజంగా మనం యితరులను ప్రేమించాలి. కార్యం కారణంగా ప్రేమించడం కాదు, అవ్యాజప్రేమకుడైన పరమేశ్వరుని మనం అనుసరించాలి. అదియే భక్తి.

మనం ఒకరివద్ద పంచాక్షరీమంత్రం ఉపదేశం పొందేం అనుకొందాం. మంతప్రదాతయొక్క శీలనైర్మల్యంలో మనకు నమ్మిక ఉండాలి. భావికాలంలో మనకు సంశయం ఏర్పడకూడదు. సంశయం ఏర్పడితే వారియందు మనభక్తికి కొరత కలుగుతుంది. అందుచేతనే బాగా తెలిసినవారియొద్దనే మంత్రస్వీకారం చేయాలి అంటారు. ఒకవేళ వారి శీలనైర్మల్యంగూర్చి మనకు సంశయం ఏర్పడినా మనభక్తికి కొరత కలుగకూడదు. అలా కొరత ఏర్పడితే అది భక్తికాదు. ఇట్టి అవ్యాజభక్తిలేక అవ్యాజానురాగము సర్వవ్యాపకం కావాలి అంటే ఆది గురుభక్తితోడనే ఆరంభం కావాలి. మొదట గురువును అవ్యాజంగా ప్రేమించగలిగితే పిదపలోకాన్ని అంతను గురుస్వరూపంగా భావించి సమస్తప్రాణులయందు అకారణ ప్రేమ పెంచుకొనడం సాధ్యం అవుతుంది. ఇతరులు తప్పిదము చేసినప్పుడు, మనంకూడా ఇట్టి తప్పిదాలుచేస్తూ ఉంటాము అని మనస్సుకు నచ్చజెప్పి ప్రేమపథంనుండి మన మానసం వైదొలగకుండా ఉండేలా చూచుకొనాలి. అఖిలభూతముల యందు సమానమైన అనురాగం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాథ్యం అవుతుంది.

మనకు ఒక పని చేసిపెట్టేవాని యందేకాక, మనకు ఏ పనీ చేసిపెట్టని వానియందుకూడా ప్రేమ ఉండాలి. ఇతరుల గుణదోషాలను మన గుణదోషాలవలెనే ఎంచిదోషనివృత్తికై యత్నించుట అవసరం. అట్టి ప్రేమ లోకం అంతటా నిండినవాడు ఆనందానికి అవధి ఉండదు. అదియే 'పరిపూర్ణస్థితి, బ్రహ్మానందస్థితి' అని ఆచార్యులు మండనమిశ్రులకు ఉపదేశించేరు.

'అభయం సర్వభూతేభ్యో నుత్తః స్వాహా' అని సన్యాసం పుచ్చుకొంటారు. సన్యాసిని చూచి ఏ ప్రాణీకూడా భయపడరాదు. సన్యాసిని చూచినంతనే ఒక ఆనందం కలగాలి. అందుకొరకే సన్యాసులకు అహింసాధర్మం విధింపబడింది బౌద్ధం అందరికీ అహింసను విధించింది. కాని మన శాస్త్రాలు పూర్ణాహింసను కేవలం సన్యాసులకే విధించేయి. అందరను పోషించవలసిన గృహస్థుకు ధాన్యసేకరణలోను, వస్తుసేకరణలోను కొంత హింసాకార్యం తప్పనిసరి అవుతుంది. సన్యాసికి అలాకాదు. అతడు ఆకులనుకూడా గిల్లకూడదు. ఆకులు అతనికి అవసరం అయితే పండిరాలిన ఆకులనే అతడు గ్రహించాలి. పచనం చేయడంలో కూడ హింస ఉన్నది. అందుచే సన్యాసి వండుకోకూడదు. అందరిని హెచ్చు తగ్గులు లేకుండా సమంగా ప్రేమించాలి. ఆ ప్రేమ పరిపూర్ణమైన నాడు 'శివోహం' భావన అతని యందు ఉదయిస్తుంది.

మహాత్ములను ప్రేమించుట పెద్ద విశేషంకాదు. మహాపాపిని కూడా మహాత్మునివలె మనం ప్రేమించాలి. వాస్తవానికి పాపాత్మునియందే మనకు ప్రేమ ఎక్కువ ఉండాలి. ఈశ్వరకృపచే అనుగ్రహశక్తి ఉంటే వానియందలి పాపాలను నివారించడానికి యత్నించాలి. దీనికి మార్గం గురుభక్తి. జగత్తు యీ విధంగా ప్రేమ సంభరితమైనప్పుడు దివ్యశాంతి విరాజిల్లుతుంది.

ఇట్లు ప్రేమపూర్ణమైన సన్యాసాశ్రమాన్ని శంకరులు మండనమిశ్రులకు అనుగ్రహించేరు. పిమ్మట వారిని వెంటబెట్టుకొని శంకరులు కైలాసానికి పోయి అటనుండి ఐదు స్ఫటికలింగాలు తెచ్చేరు. శ్రీ ఆచార్యులే ఈశ్వరులు. అందుచే ఈ లింగములను వారికిచ్చినవారు, లింగాకారంలో ఉన్నవారు, లింగములను గ్రహించినవారు వారే. అన్నియు శివరూపములే, వేదాంతపరిభాషలో 'త్రిపుటి' ఒకటి ఉంది. చూచువాడు, చూపు, చూడబడునది, ఈ మూడిటికి త్రిపుటి అనిపేరు. అలాగే ధ్యాత, ధ్యానము, ధ్యేయముకూడా త్రిపుటియే. ఒకే పరమాత్మ ద్రష్టగా దృశ్యముగా దర్శనముగా ఉన్నాడని, ధ్యాతగా, ధ్యానముగా ధ్యేయముగా ఉన్నది ఒక్కడేనని వేదాంత సిద్ధాంతము. దీనిని తెలుపుటకే ఆచార్యులవారు కైలాసంనుండి ఈ పంచలింగాలను గ్రహించినారని తోస్తుంది.

ఆ పిమ్మట ఆచార్యులవారు బదరీకేదారాలను దర్శించి గౌడపాదులను కలిసికొన్నారు. మార్గంలో గోవింద భగవత్పాదులవారిని అనుసంధించి 'దక్షిణామూర్త్యష్టకం' చెప్పి వారికి నమస్కరించేరు. పిమ్మట దేశమంతటా సంచరిస్తూ పండితులను స్వయముగా ఆహ్వానించి, లేదావారిని తామే కలిసికొని వారి అభిప్రాయాలు తెలుసుకొంటూ, వేద విరుద్ధములైన అభిప్రాయాలను ఖండించి వారికి వానిలోని దోషాలను ఎత్తి చూపుతూ తమ అద్త్వెతసిద్ధాంతం వారికి వివరిస్తూ వచ్చేరు. పండితులు అందరూ వారి సిద్ధాంతాన్ని అంగీకరించగానే లోకం అంతా వారి సిద్ధాంతాన్ని అంగీకరించింది.

ఆచార్యులవారు ముమ్మూరు ఆసేతు శీతాచలం ప్రదక్షిణంగా పర్యటించేరు. శ్రీశైలము, రామేశ్వరము, తిరుపతి, జంబుకేశ్వరము, జగన్నాధము, ద్వారక, శృంగగిరి మొదలగు పెక్కు క్షేత్రాలకు వెళ్లేరు. నాలుగు చోట్ల మఠాలు స్థాపించేరు.

కాంచీపురంలో ఆచార్యులవారు శ్రీ చక్రాన్ని స్థాపించేరు. అంతకు పూర్వం ఉండే ఉగ్రశళను శాంతకళగా మార్చేరు. తిరుపతిలో ధనాకరణ యంత్రం, శ్రీరంగంలో జనాకరణయంత్రం నెలకొల్పేరు. మద్రాసుకు దగ్గరగా ఉన్న తిరువెట్రియూరులో ఒకదుష్టగ్రహాన్ని అణచి సంవత్సరానికి ఒకసారి అచ్చట పూజచేసే ఏర్పాటు గావించేరు. మూకాంబికా క్షేత్రంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించేరు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి ఉగ్రకళతో భయప్రదంగా ఉన్నందున శ్రీ చక్రాన్ని, శివచక్రాన్ని ఆమెకు తాటంకాలుగా ఏర్పాటు చేసి ఉగ్రకళను సౌమ్యకళగా మార్చేరు. ఇలా ఆచార్యులవారు చేసేరని ఎన్నో సంఘటనలు అక్కడక్కడ చెప్పుకొంటూ ఉంటారు. కాని శంకరవిజయాలలో ఇవి చెప్పబడలేదు.

ఇలా ఉండగా ఆచార్యులవారి తల్లికి నిర్యాణ సమయం ఆసన్నమై ఆమె వారిని తలచుకొన్నది. తామన్న మాటప్రకారము ఆచార్యులు తల్లి దగ్గరకు వచ్చేరు. ఆమెకు నిర్యాణకాలం ఆసన్నమైనదని ఆచార్యులు ఒక అద్త్వెత స్తోత్రం ఆమెకు వినిపించేరు. కాని అది ఆమెకు అంటలేదు. అందుచే ఆచార్యులవారు శివస్తుతి చేసేరు. అపుడు వచ్చిన ప్రమథగణాలను చూచి ఆమె భయపడింది. ఆకారణంగా ఆచార్యులవారు విష్ణుస్తోత్రం పఠించేరు. సుకుమార వేషధారులైన విష్ణుదూతలు తల్లిగారి ఆత్మను తోడ్కొని వేళ్లేరు.

పిమ్మట ఆచార్యులవారు తల్లి యొక్క దహన సంస్కారానికి పూనుకొన్నారు. అపుడు అక్కడ అరకొరచదువులు చదివిన ధర్మశాస్త్రజ్ఞలు 'సన్యాసి తల్లికి దహనసంస్కారము చేయకూడదని' చెప్పివారికి సాయపడలేదు. అందుచే తల్లి యొక్క మృతదేహాన్ని ఛేదించి ఆచార్యులు ఇంటిపెరటీలోనే దహనసంస్కారం చేసేరు.

ఈ కార్యానికి ముందే పద్మపాదులవారు రామేశ్వరమునకు పోవనెంచి ఆచార్యుల అనుమతిని వేడేరు. వారు పోయిరమ్మన్నారు. పద్మపాదులవారు ఆచార్యులభాష్యానికి ఒక వ్యాఖ్య వ్రాసేరు. దానిని ఆయన ఈ యాత్రలో తమవెంట తీసుకొని వెళ్లేరు. మార్గంలో 'తిరువానైక్కావల్‌' అనే ఊరీలో వారి మామగారు ఉంటూ వీరు అక్కడకు వెళ్లేరు. తాము రచించిన యీవ్యాఖ్యానం వారియింటిలో ఉంచి పద్మపాదులవారు రామేశ్వరం వెళ్లేరు. ఈ పద్మపాదుల మామగారు కర్మమార్గావలంబి. ఆయనకు రెండిళ్లు ఉన్నాయి. రెండు ఇండ్లసామాను ఒక యింటిలో చేర్చి గ్రంథం ఖాళీగృహంలో ఉంచి ఆయన యింటికి నిప్పంటించేడు. యాత్రానంతరం పద్మపాదులవారు అచటకు వచ్చి తనగ్రంథమ్మిమని అడుగగా ఆయన ఇల్లు కాలిపోయింది. గ్రంథమూ కాలిపోయింది. అని సమాధానం చెప్పేరు.

పద్మపాదులు రచించిన ఆ గ్రంథం నాలుగు అధ్యాయాలు కలది. ప్రతి అధ్యాయానికి నాల్గు పాదాలు ఉన్నాయి. ఆచార్యులవారు ఒకప్పుడు పద్మపాదులవారి యీ గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని, రెండవ అధ్యాయనంలో మొదటి పాదాన్ని వారు చదివి వినిపించగా ఆలకించి ఉన్నారు.

ఇంటికి తిరిగి వచ్చిన పద్మపాదులవారు ఆచార్య సన్నిధానంలో తాను రచించిన వ్యాఖ్యకు సంభవించిన దుఃస్థితిని విన్నవించగా ఆచార్యులవారు తామిదివరకు విని ఉన్న ఐదు పాదాల గ్రంథాన్ని యధావత్తు వినిపించేరట. ఆపుస్తకం 'పంచపాదిక' అనే పేరుతో ఈ నాటికిని వెలయు చున్నది.

ఆచార్యులవారి శిష్యులలో సురేశ్వరాచార్యుల వారిని గూర్చియు, పద్మపాదుచార్యులవారిని గూర్చియు కొంత తెలుసుకొన్నాం. ఈ యిద్దరేకాక హస్తామలకాచార్యులవారు, తోటకాచార్యులవారు అనే మరియిద్దరు శిష్యులు కూడా ఆచార్యులవారికి ఉన్నారు.

హస్తామలకులు పశ్చిమసముద్రతీరంలోని కర్ణాట దేశంలో జన్మించేరు. ఆచార్యులవారు ఆ దేశానికి వెళ్లినప్పుడు ఒక బ్రహ్మణుడు పుట్టుకనుండియు మాటలేక మందునివలె ఉన్న తనకుమారుని ఆచార్యుల సన్నిధికి అను గ్రహర్థియై తీసుకొని వచ్చేడు. ఆ పిల్లవానిని చూచి ఆచార్యులవారు - నాయనా! నీవెవరవు? అని ప్రశ్నించేరు. అపుడా బాలుడు - 'నేను భూమినికాను. ఆకాశమునుకాను, పురుషుడనుకాను, స్త్రీని కాను, కేవలమైన చైతన్యమే నేను' అని బదులు చెప్పేడట! తన కుమారుడు మాటలాడి నాడని సంతోషించి తండ్రి కుమారుని వెంటబెట్టుకొని యింటికి వెళ్లేడు. కాని యింటికి వెళ్లగానే బాలుడు యథాప్రకారం మౌనాన్నే అవలంబించేడు. అపుడు తల్లి దండ్రులు మరల ఆ బాలుని ఆచార్య సన్నిధానానికి తీసికొని వచ్చేరు. అపుడు బాలుడు మరల సంభాషించసాగేడు. దానితో ఆ తల్లిదండ్రులు ఆచార్యులతో స్వామీ! వీడు మీ బిడ్డయే కాని మా బిడ్డకాడు, అని ఆ బాలుని ఆచార్యసన్నిధానంలోనే వదలి తిరిగి పోయేరు. ఆయనయే హస్తామలకాచార్యులు వారు. వారు వ్రాసిన శ్లోకానికి శంకరులు 'హస్తామలకీయం' అనే భాష్యం రచించేరు.

ఆచార్యులవారిని తోటకవృత్తాలతో ఒక శిష్యుడు స్తుతించేడు. అందుచే వారికి తోటకాచార్యులు అని పేరు వచ్చింది. ఆయన యొక్క అసలు పేరు గిరి, పూవులు, బిల్వదళాలు ఆచార్యులపూజకు సేకరిస్తూ ఆచార్యుల వస్త్రాలు ఉతికి ఆరవేయడం ఆయన పని. ఆయన మందునివలె కనిపించేవాడు. ఒకనాడు ఆచార్యులవారు శిష్యులు ఆచార్యుల వారి వద్ద భాష్యపాఠం చెప్పుకొంటున్నారు. గిరి రాలేదు, గిరి రాలేదే, అని ఆచార్యులవారు గిరి కోసం ఎదురుచూస్తున్నారు. అపుడు కొందరు శిష్యులు- 'అతనికోసం నిరీక్షించడం అనవసరం, అతడు వచ్చినా రాకపోయినా ఒకటే'- అని చులకనగా మాటాడుకొన్నారు. శిష్యుల మాటలు విని ఆచార్యులవారు వారి అసూయను తొలగించాలనుకొన్నారు.

ఆ సమయంలో గిరి అనేపేరుగల ఆ శిష్యుడు బయట నుండి ఆనందంతో నర్తిస్తూ ఆచార్యసన్నిధికి చేరుకొన్నాడు. వస్తూనే ఆయన ఆచార్యులవారిని తోటక వృత్తాలలో స్తుతించనారంభించేడు. వారు రచించిన తోటక వృత్తాలనే 'తోటకాచార్యకృత జగద్గుర్వష్టకం' అంటారు.

విదితాఖిలశాస్త్ర సుధా జలధే! మహితోపనిషత్కధితార్థనిధే!

హృదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక మే శరణం 1

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖ విదూనహృదం

రచయాఖిల దర్శన తత్త్వవిదం భవశంకరదేశిక మే శరణం|| 2

భవతా జనతా సుహితా భవితా నిజ బోధవిచారణ చారుమతే|

కలయేశ్వరజీవ వివేకవిదం భవ శంకరదేశిక మే శరణం|| 3

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా|

మమ వారయ మోహమహాజలధిం భవ శంకరదేశిక మే శరణం| 4

సుకృతే2 ధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా

అతిదీన మిమం పరిపాలయ మాంభవశంకర దేశిక మే శరణం|| 5

జగతీ మవితుం కలితాకృతయోవిచరంతి మహామమస శ్ఛలతః

అహిమంశు రివాత్ర విభాసి గురో భవశంకరదేశిక మే శరణం|| 6

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహికో2పి సుధీః|

శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకరదేశిక మే శరణం|| 7

విదితా న మయా విశ##దైకకలా న చ కించన కాంచన మస్తి గురో,

ద్రుతమేవ విధేహి కృపాం సమజాం భవ శంకరదేశిక మే శరణం|| 8

ఇది వింటూ తోటకాచార్యులయొక్క ఆనందానుభవాన్ని గమనించగానే శిష్యులందరూ ఆయన గొప్పదనాన్ని గ్రహించేరు.

ఇలా శ్రీశంకారాచార్యులవారు లోకసంచారం గావించి దుర్మతాలను నివారించి, నాలుగు మఠాలను స్థాపించి, పిమ్మట ఉపాసనాక్రమానికై షణ్మతస్థాపన కావించేరు. అన్నిటికి శిఖరమైనది అద్త్వెతం.

ఆచార్యులవారు దిగ్విజయం చేసిన తరువాత కాంచీపురంలోని రాజుకోర్కెను మన్నించి అచ్చట పండితులతో మరల వాదించి జయించి సర్వజ్ఞ పీఠాన్ని ఆరోహించేరు. ఆ సందర్భంలో ఏడు సంవత్సరముల బాలుడొకడు స్వామితో ఏడురోజులు వాదించేడట! ఆచార్యులవారి చరిత్రలో సర్వజ్ఞ పీఠారోహణం చిట్టచివరి ప్రముఖ సంఘటన. అది రామచరిత్రలో రామపట్టభిషేకం వంటిది.

ఆచార్యులవారు ఎన్నో గ్రంథాలు రచించేరు. వానిలో శాస్త్రాలు చదివి బాగా జ్ఞానం గడించిన మీదట కాని తెలియని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. శిశువులకు సైతం అర్థం అయ్యే గ్రంథాలుకూడా ఎన్నో వారు రచించేరు. గోవిందాష్టకము, చంద్రశేఖరాష్టకము, భజగోవిందశ్లోకాలు ఇలా ఎన్నో తేలికగా తెలిసేస్తోతగ్రంథాలు ఎన్నో వారు రచించేరు. వివేకచూడమణి, ఉపదేశసాహస్రి, సర్వవేదాంతసిద్ధాంతసార సంగ్రహము మొదలైన సులభగ్రంథాలను పెక్కింటిని వారు రచించేరు. జ్ఞానాన్ని గూర్చి గంభీరమైన విషయాలు చెప్పే గ్రంథాలచే చదువాలన్న నియమంలేదు. వారు రచించిన ఏ చిన్న గ్రంథం చదివినా వారితో మాట్లాడుతూ ఉన్నట్లే ఉంటుంది. లక్ష్మీనృసింహస్తోత్రంలోని యీ క్రింది శ్లోకం చూడండి!

త్వత్ప్రభుజీవప్రియ మిచ్ఛసి చే న్నరహరిపూజాం కురు సతతం

ప్రతిబింబాలంకృతిదృశికుశలో బింబాలంకృతి మాతనుతే!

చేతోభృంగ భ్రమసి వృథా భవదురుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరిసింహానఘ పదసరసిజ మకరందం||

ఒ మానస భృంగమా! ఊరక ఏల యీ సంసారమనే ఎడారిలో తిరుగులాడుతావు! నరసింహుని పాదపద్మములలోని తీయని తేనియను ఆస్వాదించు అని భావం. మనస్సునకు ప్రభువు జీవుడు. జీవునకు మేలుకలుగవలె నంటే నృసింహుని పాదాలను శరణుపొందాలి.

అద్దంలో మన ముఖం ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబానికి తిలకం ఏర్పడవలెనంటే బింబమైన ముఖాన్ని అలంకరించాలే కాని ప్రతిబింబానికి తిలకం దిద్దకూడదు. అలా చేస్తే అద్దం నల్ల బడుతుందే కాని ప్రయోజనం ఉండదు. అలాగే మన శ్రేయంకోసం మనకుసౌఖ్యాన్ని ఆపాదించుకొనడం కూడ ప్రయోజన రహితమైన పని.

ఒక్కొక్క అంతఃకరణంలోనూ పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం ఉన్నది. ఆ ప్రతిబింబానికి కూడా కొంత శక్తిఉన్నది. సూర్యుడు జగత్తుకు వెలుగు ప్రసాదిస్తున్నాడు. ప్రతిబింబ సూర్యుని యందు కూడా కొంత ప్రకాశం ఉన్నది. అట్లే పరమాత్మ ప్రతిబింబమైన జీవునికి కూడా కొంతజ్ఞానం ఉన్నది. అద్దంలోని ముఖం మీద తిలకం గోచరించాలంటే బింబమైన ముఖాన్ని అలంకరించాలి. అట్లే నీకొక మేలుకలగాలంటే నీవు పరమాత్మను ఆ విధంగా సేవించు. అపుడు పరమాత్మ ప్రతిబింబరూపివైన నీకు మేలు కలుగుతుంది. అదీకాక పరమాత్మకు చేయబడిన కైంకర్యము సర్వమైన లోకమునకు చేయబడినట్లు అవుతుంది. జీవునకు ఆనందం కావాలి అంటే పరమాత్మ చరణాలచే శరణొందాలి. తక్కిన యత్నాలన్నీ వృథా.

'వృథా' అనే యీపదాన్ని ఆచార్యులవారు మాటి మాటికీ వాడుతూ ఉంటారు.

ఘటో వా మృత్పిండో2ప్యణురపిచ ధూమో2గ్నిరచలః

పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం|

'వృథా' కంఠక్షోభం వహసి తరసా తర్క వచసా

పదాంభోజం శంభో ర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః||

శివానందలహరీ.

ఎన్నో శాస్త్రగ్రంథాలు, సైన్సులు, తర్కగ్రంథాలూ చదువుతూ ఉంటాం. ఇవన్నీ చదివి ప్రయోజనం ఏమిటి? కడవను మట్టితో చేస్తారు, కాలుస్తారు, నూలుతో వస్త్రాన్ని నేస్తారు; ఇలా ఎన్నో తెలుసుకొంటాం, నేర్చుకొంటాం. కాని వీనిలో ఏ ఒక్కటైనా కడపటి కాలంలో కాలుని అడ్డుకొనగలవా? ఆ పని వీనివల్ల నయ్యేదికాదు. కాగా ఇవన్నీ వృథా! శివుని పాదాలను భజించు. అవి నీకు పరమ సౌఖ్యాన్ని ప్రసాదిస్తాయి. నీవు బుద్ధిమంతుడవైతే అనవసరంగా మాటలు పెంచకు. శివుని భజించు. ఇతరములు అన్నీ వృథా!

సంప్రాస్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్‌ కరణ్‌.

'కాలం ఆసన్నమైనపుడు వ్యాకరణం ఉపయోగించదు' అన్నారు. ఆచార్యులవారు భజగోవిందశ్లోకాలలో ఇది విష్ణుస్తుతి. వెనుకటిది శివస్తుతి. ఇక్కడ వ్యాకరణం వ్యర్థం అన్నారు. అక్కడ తర్కం వ్యర్థం అన్నారు. రెండూ ఉపయోగం లేనివే. ఉపయోగించే స్తుతులు రెండూ ఒకే విషయాన్ని చెప్పేయి. అవి పరమాత్మను భజించు మన్నాయి. అన్ని శాస్త్రాలకూ భక్తిని కలిగించుటయే ప్రయోజనం.

యముడు ఒక్కక్షణం కూడా గడువీయడు. ఆయువు గడచినకొలదీ వానిరాక సమీపిస్తుంది. అతడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ యముడు వచ్చినను రాకపోయినను కాలునికే కాలుడైన చంద్రశేఖరుని మనం యీనాడే ఆశ్రయిస్తే మనం కలవరపడనవసరం లేదు.

కాలకాలం ప్రపన్నానాం కాలః కింను కరిష్యతి?

గంభీరములైన వేదాంతశాస్త్రగ్రంథాలను రచించిన ఆచార్యులవారు- 'ఏమీ తెలియకపోయినా గోవింద! గోవింద! అని పలుకుమని' ఆదేశించేరు. భోజనసమయంలో మౌనంగా ఉండాలి. సంధ్యావందనసమయంలో కూడా మౌనంగానే ఉండాలి. భోజనకాలంలో గోవిందనామస్మరణం చేయాలి. గోవిదనామస్మరణచే పూతమైన అన్నం శరీరంలో ప్రవేశిస్తే అది పరమాత్మధ్యానానికి దోహదం చేస్తుంది. ఆ అన్నసారం దేహంలో చేరిచేరి అనవరతమైన దైవధ్యానాన్ని కలిగిస్తుంది. అనుదినమూ భోజనసమయంలో గోవిందనామస్మరణ ఒక అభ్యాసంగా చేసుకొంటే దానికి మరుపు ఏర్పడదు.

సంధ్యాసమయంలో పరమేశ్వరుని చరణారవిందాలను ధ్యానించాలి. అందరూ ఏకాదశీ వ్రతం ఆచరించాలి. మన మనస్సులోని కాలుష్యాన్ని తొలగించుకొని మనంకూడా దిగ్విజయం చేయుటయే శ్రీ ఆచార్యులవారి దిగ్విజయపఠనానికి ప్రయోజనం కావాలి. వారి ఉపదేశానుసారము పరమేశ్వరస్మరణ మనం ఎన్నడూ మరువరాదు. గోకులాష్ఠమి, దేవీనవరాత్రులు మొదలగు వానివలెనే శ్రీ ఆచార్యులవారి యందు భక్తిశ్రద్ధాదరములు కలవారమై వైశాఖ శుద్ధ పంచమినాడు శ్రీ శంకర జయంతిని ఆచరించాలి. నవరాత్రులయందు వలె శ్రీ శంకర జయంతి నాడు కూడా పదుగురొకచోటచేరి ఆచార్యుల జయంత్యుత్సవం వైభవంగా జరుపుకొనాలి. ఆచార్య పాదుకలు అర్చించాలి. ఇలా చేయడం వల్ల ఆచార్యుల అనుగ్రహం మనకు లభిస్తుంది. సకల సన్మంగళములు మనకు కలుగుతాయి.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page