Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బది ఏడవ అధ్యాయము - శత్రు ప్రత్యభిగమనము

రామ ఉవాచ ః-

సాంగ్రామిక మహం త్వత్తః శ్రోతుమి చ్ఛామి భూభుజః | సర్వం వేత్సి మహాభాగ త్వందేవ పరమే ష్ఠివత్‌ ||

పుష్కర ఉవాచ ః-

ద్వితీయే7హని సంగ్రామో భవిష్యతి యదా తదా | గజాశ్వాన్‌ స్నాపయే ద్రాజా సర్వౌషధి జలైః శుభైః ||

గంధమాల్యైరలం కుర్యా త్పూజయే చ్చ యథావిధి | నృసింహం పూజయే ద్విష్ణుం రాజలింగా న్యశేషతః ||

ఛత్రం ధ్వజం పతాకాశ్చ ధర్మాం శ్చైవ మహాభుజః | ఆయుధాని చ సర్వాణి తథా పూజ్యాని భూభుజా ||

తేషాం సంపూజనం కృత్వా రాత్రౌ ప్రమథ పూజనమ్‌ | కృత్వాతు ప్రార్తయే ద్రాజా విజయా యేతరో యథా ||

ప్రమథాంశ్చ సహాయార్థే ధరణీం చ మహాభుజ ! | భిషక్పు రోహితామాత్య మంత్రిమధ్యే తథా స్వపేత్‌ ||

సంయతో బ్రహ్మ చారీ చ నృసింహం సంస్మరన్‌ హరిమ్‌ | రాత్రౌ దృష్టే శుభే స్వప్నే సమరారంభ మాచరేత్‌ ||

రాత్రి శేషే సముత్థాయ స్నాతః సర్వౌషధీ జలైః | పూజయిత్వా నృసింహంతు వాహనాఢ్యమ శేషతః ||

పురోధసా హుతం పశ్యే జ్జ్వలితం జాతవేదసమ్‌ | పురోధాః పూర్వవత్తత్ర మంత్రాస్తు జుహుయాత్తతః ||

దక్షిణాభిః శుచి ర్విప్రాన్‌ పూజయే త్పృథివీ పతిః | తతో 7 నులిం పేద్గాత్రాణి గంధద్వారేతి పార్థివః ||

చందనాగరు కర్పూర కాంతా కాలీయకైః శుభైః | మూర్తిం కంఠే సమాలభ్య రోచనాం చ తథా శుభామ్‌ ||

ఆయుష్యం వర్చసం చైవ మంత్రేణా7నేన మంత్రితమ్‌ | అలంకరణ మాబధ్యా చ్ఛ్రియం ధాతు రితి స్రజమ్‌ ||

యాఓషధయ ఇత్యేవం ధారయేదోషధీః శుభాః | నవో నవేతి వస్త్రం చ కార్పాసం బిభృయాచ్ఛుభమ్‌ ||

ఐంద్రాగ్నేతి తతో చర్మ ధన్వ నాగేతి వైధనుః | తతో రాజ్ఞః సమాదద్యా త్సశరం న్త్వభి మంత్రి తమ్‌ ||

కుంజరంవా రథం చాశ్వ మారుహే దభిమంత్రితమ్‌ | ఆరుహ్య శిబిరా ద్రాజా నిష్క్రమ్య సమయే శుభే||

దేశే త్వదృశ్యః శత్రూణాం కుర్యా త్ర్పకృతి కల్పనామ్‌ | సంహృతాన్యోధయే దల్పా & మం విస్తారయే ద్బహూన్‌ ||

పరశురాముడనియెః- యుద్ధ విషయము నీవలన వినగోరెదను. బ్రహ్మవలె నీవు సర్వజ్ఞుడవు అన పుష్కరుండనియె. రెండవ రోజు యుద్ధము జరుగనున్న తరి నేనుగులను గుఱ్ఱములను అన్ని రకాల యోషధులు నింపిన శుభజలములచే స్నానము సేయింపవలెను. గంధము పూయవలెను. పూలమాలలు వేయవలెను. యథావిధిగ నరసింహస్వామి నర్చింపవలెను. రాజ చిహ్నములయిన ఛత్త్రచామర పతాక ధ్వజాదులను ధనుస్సులను ఆయుధములన్నిటిని రాజు పూజింపవలెను.

ఇదిసేసి రాత్రి ప్రమథ గణములను గొలిచి సామాన్యుడట్లు ప్రమథులను భూదేవిని తనకు సహాయపడవలెనని ప్రార్థించ వలెను. సామాన్య జీవుడట్లు అహంకారమువిడిచి వైద్యులు పురోహితులు అమాత్యులు మంత్రుల నడుమ నిదురపోవలెను ఆనిద్రపోవునపుడు బ్రహ్మచర్య నియమమూని నరసింహస్వామిని ధ్యానింపవలెను. ఆరాత్రిశుభస్వప్నము వచ్చిన యెడల సమర మారంభింపవలెను.

తెల్లవారగట్ల లేచి సర్వౌషధీజలమ్ములం దానమాడి వాహన మెక్కియున్న నరసింహుని పూర్తిగ సర్వోపచారములతో బూజించి పురోహితునిచే హోమము సేయబడిన యగ్ని హోత్రుని ప్రజ్వలించుచున్న వానిని దర్శింపవలెను. అపుడు పురోహితుడింతమున్ను జెప్పిన మంత్రములతో హోమము గావింపవలెను. శుచియైఱడు విప్రులను దక్షిణల నొసంగి పూజింపవలెను. "గంధద్వారాం" అను మంత్రము సెప్పి శరీరమునకు చందనము అగరు పచ్చకరూరము కాంతము కాలేయకము నను మంగళ కరములైన పరిమళ ద్రవ్యముల కలప వలెను. విగ్రహము కంఠముంజేత పట్టుకొని శుభకరమగు గోరోచనమును దాకి బూసికొనివలెను. 'ఆయుష్యం వర్చసం' అను మంత్రముచేత నభిమంత్రించి ఆభరణములను "శ్రియంధాతు" అను దాన పూలమాలను "యాఓషధయః" అను మంత్రముతో శుభౌషధులను "నవోనవో" అని క్రొత్త నూలు వస్త్రమును "ఇంద్రాగ్నే" అని చర్మను "ధన్వనా గ" అను దాన ధనస్సును బాణములతో గూడ యభిమంత్రించి స్వామిని ధరింప జేయవలెను.

అవ్వల నభిమంత్రితమయిన ఏనుగుగాని రథమునుగాని గుర్రమునుగాని యెక్కి శుభ సమయమున తన శిబిరము నుండి రాజు వెడలి శత్రువులకు కనబడని చోట వ్యూహ కల్పనము గావింపవలెను. ప్రకృతి వ్యూహములు నాలుగు. అవిః- 1. దండము 2. బోధము 3. మండలము 4. అసంహితము అనునవి. సేనలో నల్పబలులను దగ్గరగా చేర్చి పోరింపవలయును. వారి సంఖ్య గూడ విస్తారముగ నుండవలెను.

వ్యూహ భేధాః

సూచీముఖ మనీకం స్యాత్‌ అల్పానాం బహుభిః సహ | వ్యూహాః ప్రాణ్యంగ రూపాశ్చ ద్రవ్యరూపాశ్చ కల్పితాః ||

గారుడో మకర వ్యూహ శ్చక్రం శ్యేన స్తథైవ చ | అర్థచంద్రశ్చ చంద్రశ్చ శకట వ్యూహ ఏవచ ||

వ్యూహశ్చ సర్వతోభద్రః సూచీ వ్యూహ స్తథైవ చ | పద్మశ్చ మండల వ్యూహః ప్రాధాన్యేన వ్రకీర్తితాః ||

వ్యూహా నామథ సర్వేషాం పంచధా సైన్యకల్పనా | ద్వౌ పక్షౌ బంధమోక్షౌద్వౌ వైరస్యః పంచమో భ##వేత్‌ ||

అనేన యది వా ద్వాభ్యామ్‌ భాగాభ్యాం యుద్ధమాచరేత్‌ | భాగత్రయం స్థాపయేత్తు తేషాం రక్షార్థమేవ చ ||

నవ్యూహే కల్పనా కార్యా రాజ్ఞోభవతి కర్హిచిత్‌ | పత్రచ్ఛేదే ఫల చ్ఛేదే వృక్షచ్ఛేదా7వకల్పనే ||

పునః ప్రరోహ మాయాతి మూలచ్ఛేదే వినశ్యతి | స్వయం రాజ్ఞా నయోద్ధవ్య మపి సర్వాస్త్రశాలినా ||

నిత్యం లోకేహి దృశ్యంతే శ##క్తేభ్యః శక్తి మత్తరాః | సైన్యస్య పశ్చా త్తిష్ఠేత్తు క్రోశమాత్రే మహీపతిః ||

భగ్న సంధారణం తత్ర యోధానాం పరికీర్తితమ్‌ | ప్రధాన భంగే సైన్యస్య నావస్థానం విధీయతే ||

-ః వ్యూ హ భే ద ము లు ః-

పెక్కు మంది అల్ప బలులు కూడి యుద్ధ మొనరించిన నది సూచీ ముఖమను పేర వ్యూహము. వ్యూహములు రెండు రకములు. 1. ప్రాణ్యంగ రూపము అనగా గజ తురగ పదాతులను ప్రాణులతో బన్నిన పన్నుగడ. 2. ద్రవ్య రూపము. రథాది పదార్థములచే గల్పితము. 1. గారుడము 2. మకరము 3. చక్రము 4. శ్యేనము (డేగ) 5. అర్థ చంద్రము 6. చంద్రము 7. శకటము 8. సర్వతోభద్రము 9. సూచీవ్యూహము 10. పద్మము 11. మండలము ననునవి ప్రధాన వ్యూహములుగా బేర్కొన బడినవి. అన్ని వ్యూహములందు సైన్య కల్పన మైదు విధములు. రెండు పక్షములు (పార్శ్వములు) బంధము మోక్షములు రెండు వైరస్యమైదవ రకము. ఈయైదు రకాల సేనా కల్పనలోను రెండు రకములతో యుద్ధము సేయవచ్చును. మిగిలిన మూడు రకములను వాని రక్షణకొరకు పన్నవలెను. ఈ చెప్పిన యే వ్యూహమందుగాని రాజును మాత్రమెన్నడును కల్పింప గూడదు. ఆకులు పండ్లు చెట్టును నరకిన జెట్టు తిరిగి యంకురించునుగాని మొదలు నరకిననది నశించును. ఎంత సర్వాస్త్ర కుశలుడయినను రాజు స్వయముగా పోరగూడదు. లోకమం దెల్లపుడు బలవంతులకు పై బలవంతు లుండనే యుందురు. కావున రాజు సేన కొక క్రోసు దూరముననే యుండవలెను. రణమందు యోధులు బెండువడినప్పుడు వారిని తిరిగి ధారణము చేయుట. కూడగట్టుకొనుట యుద్ధ తంత్రములందు పేర్కొనబడినది. కాని ప్రధాన (నృపతి) భంగమందు (రాజు బెండువడినప్పుడు) అది పనికిరాదు. అప్పుడు యోధులు నిలువక పారిపోవలసినదే .

-ః యుద్ధనీతిః-

న భగ్నాన్పీడయే చ్ఛత్రూ నేకాయన గతా హితే | మరణ నిశ్చితా స్సర్వే హన్యు శ్శత్రూం శ్చమూరపి ||

శఠా భంగ చ్ఛలేనా7పి నయంతి స్వభువం పరామ్‌ | తేషాం స్వభూమి సంస్థానాం వధస్స్యాత్సుకరస్తథా ||

న సంహతార్తా విరళా న్యోధాన్వ్యూహే ప్రకల్పయేత్‌ | ఆయుధానాం తు సమ్మర్దో యథాన స్యాత్పరస్పరమ్‌ ||

తథా తు కల్పనా కార్యా యోధానాం భృగునందనః | భేత్తు కామః పరానీకం సంహతై రేవ భేదయేత్‌ ||

భేద రక్షా పరేణా7పి కర్తవ్యా సంహతా తథా | స్వేచ్ఛయా కల్పయేద్య్వూహం జ్ఞాత్వా వా రిపుకల్పితమ్‌ ||

వ్యూహే భేదావహం కుర్యా ద్రిపువ్యూహస్య పార్థివః | గజస్య దేయా రక్షార్థం చత్వారస్తు రథాద్విజః ||

రథస్య చాశ్వా శ్చత్వారో7శ్వస్య తస్య చ వర్మిణః | వర్మిభిశ్చ సమాస్తత్ర ధన్వినః పరికీర్తితాః ||

పురస్తా ద్వర్మిణోదేయా దేయా స్తదను ధన్వినః | ధన్వినా మను చాశ్వీయం రథాం స్తదను యోజయేత్‌ ||

రథానాం కుంజరశ్చాను దాతవ్యాః పృథివీక్షితా | పదాతి కుంజరాశ్వానాం వర్మ కార్యం ప్రయత్నతః ||

అవర్మయి త్వా యోవాహం చాత్మానం వర్మయే న్నరః | సరామః నరకం యాతి స్వకృతే నాపి కర్మణా ||

శూరాః ప్రముఖతో దేయా నదేయా భీరవః క్వచిత్‌ | శూరా న్వా ముఖతో దత్వా స్కంద మాత్ర ప్రదర్శనీమ్‌ ||

కర్తవ్యం భీరు సంఘేన శత్రు విద్రావ కారకమ్‌ | దారయంతి పురస్తాత్తు విద్రుతా భీరవః పురః ||

ప్రోత్సారయంతే వర్మాణి భీరూఞ్‌ శూరాన్‌ పురః స్థితాః | ప్రాంశవశ్శుక నా సాశ్చయే చ జిహ్వేక్షణా నరాః ||

సంహత భ్రూయుగా శ్చై వ క్రోధనాః కలహప్రియాః | నిత్యం హృష్టాశ్చ హ్రస్వాశ్చ శూరాజ్ఞేయాశ్చ కామినః ||

-ః యు ద్ధ నీ తి ః-

యుద్ధ నీతి ప్రకారము ఓటువడిన శత్రువులను బీడింపరాదు. రెండవదారి లేనివారు గావున పారిపోవుట లేక యుద్ధమున నిలువబడి కూలిపోవుట యను నొక్కటి తప్ప వారికి వేరు గతి లేదు. గనుక. అదిగాక ఓటుపడిన వారెల్ల చావునకు దెగించి పోరి శత్రువులను సేనలను జించి చెండాడుదురు. శఠులు (అన్నిటికి తెగించివాండ్రు) ఏదో మిషవెట్టి శత్రుసేనలోని తమ రాజ్యమూలకమైన యెంతో దెబ్బ తిన్న (బాధలోనున్న) ఎడమెడమై యున్న యోధులను వ్యూహమందు నిలుపరాదు. ఒండొరులకు ఆయుధముల నమ్మర్దము లేని విధముగా (ఒకరి చేతి యాయుధము లొకరికి దగులకుండ) వ్యూహమును బన్నవలెను. శత్రు వ్యూహమును భేదింప దలచిన రాజు ఒండొరు లెడవడుకుండ నున్న యోధులచేతనే దానిం భేదింపగలడు. ఇది భేద తంత్రి విషయము.

శత్రు వ్యూహము భేదించుటకు లేదా తన వ్యూహమును శత్రువునుండి రక్షించుకొనుటకును బూనిన రాజు ఒండొరు లెడవడకుండ నున్న యోదులు మూలముననే చేయవలయును. తనకు దాను వ్యూహము పన్నవచ్చును. లేదా శత్రువు పన్నిన వ్యూహ ముందెలిసి దానిం ద్రిప్పి కొట్టుటకయిన వ్యూహము పన్నవచ్చును ; ఏనుగు రక్షణకు నాలుగు రథములను, రథ రక్షణకు నాలుగు గుర్రములను, గుర్రము రక్షణకు కవచధారులు, వారి రక్షణకు విలుకాండ్రను నదే సంఖ్యలే నిలుపవలెను. ముందు కవచధారులను వారి వెనుక విలుకాండ్రను, వారి వెంట నాశ్వికులను, వారివెంట రథములను నిలుపవలెను. రథములకు వెంట సేనల నుంచ వలెను. కాల్బలము, ఏనుగులు, గుర్రములు సేన వెంబడి కవచధారులను (రక్షణము) ఇవ్వవలెను.

ఎవ్వడు గజాదివాహనములకు రక్షణయీయకుండ తనను మాత్రమే రక్షణకొని కాపాడుకొనునో వాడు తానుజేసిన దుష్కర్మచే నరకమందును, సేనకుముందు శూరులను నిల్పవలెను. పిరికివాండ్రను వెనుకబెట్టవలెను. శూరులను ముందుంచి భీరువులు (పిరికివాండ్రు) స్కంధమాత్ర ప్రదర్శనము (సేనముందుకు దుముకుట మాత్రమే) ప్రదర్శనము సేయవలెను. అది శత్రువులు పారిపోవుటకు కారణమగును. భీరువులు సేనకు ముందు నిలిచి రేని ముందే బెదరిపారిపోయి మొత్తము సేనను బెదరగొట్టుదురు. కావున భీరువులను సేన పురోభాగమందు నిలువరాదు. ఎత్తరిగా నుండువారు (దీర్ఘకాయులు) చిలుకముక్కువారు జిహ్వేక్షణులు నాలుకను కంటివైపు మీదికి చాచువారులు కనుబొమలు ముడివడు వారు క్రోధశీలురు కయ్యమునకు కాలుద్రవ్వువారు ఎప్పుడును హర్షించువారు కాముకులు (హ్రస్వాః) చిన్నవయసులో నున్నవారును (యువకులును) శూరులనియెఱుంగవలెను.

దాక్షిణాత్యాశ్చ విజ్ఞేయాః కుశలాః ఖడ్గ వర్మిణః | వంకలా ధన్వినో జ్ఞేయాః పార్వతీయా స్తథైవ చ ||

పాషాణ యుద్ధకుశలా స్తథా పర్వత వాసినః | పాం చాలా శ్శూరసే నా శ్చ రధేషు కుశలా నరాః ||

కాంబోజా యే చ గాంధారాః కుశలాస్తే హయేషు చ | ప్రాయశ శ్చ తథా వ్లుె చ్ఛా విజ్ఞేయాః పాశయోధినః ||

అంగా వంగాః కళింగా శ్చ జ్ఞేయా మాతంగ యోధినః | ఆహతానాం హతానాంచ రణాపనయనక్రియా ||

పత్తియోధగజానాం చ తోయదానాదికం చ యత్‌ | ఆయుధానాం చ నయనం పత్తి కర్మ విధీయతే ||

రిపూణాం భేదకామానాం స్వసైన్యస్య తు రక్షణమ్‌ | భేదనం సంహతానాం చ చర్మిణాం కర్మ కీర్తితమ్‌ ||

విముఖీకరణం యుద్ధే ధన్వినాం చ తథోచ్యతే | చర్మిభిః క్రియతే శూరై ర్భిన్నానామపి సంహతిః ||

శూరాపసరణం యావత్‌ సాశ్వీయస్య తథోచ్యతే | త్రాసనే రిపు సైన్యానాం రథ కర్మ తథోచ్యతే ||

ప్రాకార గోముఖాట్టాల ద్రుమ భంగా శ్చ భార్గవః | గజానాం కర్మ నిర్దిష్టం యదసహ్యం తథా పరైః ||

పత్తి భూర్విషమాజయ్యా రథాశ్వస్య తథా సమా | శర్మాద్రుమా చ నాగానాం యుద్ధభూమి రుదాహృత్‌ ||

ఏవం విరచితవ్యూహః కృత పృష్ఠ దివాకరః | తథా7నులోమ శుక్రోవా దిక్పాలబుధ మారుతాః ||

యోధా నుత్తేజయేత్సర్వా న్నామగోత్రాపదానతః | భోగప్రాప్తి శ్చ విజయే స్వర్గ ప్రాప్తిర్మృతస్య చ ||

కత్తి పూని యదే తమకు వర్మముగా (కవచముగా) రక్షకముగా యుద్ధము చేయుటలో కుశలురు దాక్షిణాత్యులు. వంకలులు బంగాళ దేశస్థులు (వంకలమను దేశమువారు) మేటి విలుకాండ్రు పార్వతీయులు (కొండజాతులు) నంతే; వారు షాషాణ యుద్ధమందును నేర్పరులు. పాంచాలులు (పంజాబు దేశమువారు) శూరసేనులు (మధురాపుర ప్రాంత దేశమువారు) రథ కుశలురు. కాంభోజ, గాంధార దేశముల వారు అశ్వనిపుణులు. వ్లుెచ్ఛులు= తురుష్కులు ఎక్కువగా పాశములతో యుద్ధము చేయువారు. బాగా దెబ్బతిన్న వాండ్రను జచ్చినవండ్రను రణరంగమునుండి తొలగించుట మొదలైన పనులు కాలి బంట్లకు నేనుగులకు దాహము వేసినపుడు నీరందించుట ఆయుధములను గొనివచ్చి అందించుటయు పదాతిబలమువారి వనిగా విధింపబడినది. శత్రువులు తమ సైన్యమును జెల్లాచెదరు చేయదలచినపుడు తనసైన్యమును గాపాడుకొనుట ఎదిరిసైన్యము ఒండొరులు కూడియున్నపుడు వారిని భేదింపజేయుట చర్మిణుల డాలుపట్టుకొని యుద్ధము చేయుపనిగా బేర్కొనబడినది.

రణమందు విలుకాండ్రను విముఖులగావించు పని కూడ శూరలయిన చర్మధారులయొక్క (డాలుపట్టుకొని పోరాడు వారి పనియే; చెల్లా చెదరై నవారి తిరిగి కూడ గట్టుకొనుటయు వారికృత్యమే. శూరులను రణరంగమందుండి తప్పించి (క్లిష్ట సమయములందు ) దూరముగ దొలగించుట అశ్వికులపని. శత్రు సేనలను హడలగొట్టుట రథికులయొక్కయు అంగరక్షకుల యొక్కయు కార్యము; పదాతిబలమునిలుచు భూమి విషమముగానుండిన శత్రులకు లొంగదు. రథములకు గుఱ్ఱములకు సమముగా నుండవలెను. గజ యుద్ధమునకు చెట్లు లేనిదిగా నుండవలెను.

ఇట్లు వ్యూహముగా బన్నబడి సూర్యుడు వెనుకగా గాని శుక్రుడు అనులోమముగా యుద్ధమునకు జనువాని వెంబడించిగాని యుండవలెను. అట్లే దిక్పాలురు బుధగ్రహము వాయువుగూడ అనులోమముగానే యుండవలెను. దిక్పాలురగు నాయా ఇంద్రాది దేవత లధిదేవతలుగా గల నక్షత్రము లిక్కడ దిక్పాలురనగా. యుద్ధమునకు నడచు యోధులను వారివారి నామగోత్రములను గొనియాడుట ద్వారా వారి నుత్తేజపరుపవలెను. ప్రోత్సహింపవలెను. గెలుచునా భోగలాభము అనింగూలునా స్వర్గలాభము.

యోధప్రోత్సాహనమ్‌ - ఉద్ఘోషణమ్‌ .

ధన్యాతి తు నిమిత్తాని వదంతి విజయం ద్విజాః | స్పందనం శుభ గాత్రాణాం శుభస్వప్న నిదర్శనమ్‌ ||

నిమిత్తం తు గజా శ్వస్య సర్వతో దృశ్యతే శుభమ్‌ | శకునా మంగళా శ్చైవదృశ్యంతే హి మనోనుగాః .

విపరీత సరీసర్పా న్మృత్యుః స్పృ శతి నాన్యథా | భవంతో7పి కులే జాతాః సర్వ శస్తాస్త్ర పారగాః ||

గాంధర్వే చ పరా నిత్యం సన్మార్గ మాశ్రితాః | అనాహార్యాః పరై ర్నిత్యం కథం న స్యాజ్జయో మమ ||

రాజశ్రీ ర్బవతామేవ భవద్భిః కేవలం మమ | ద్వే చామరే7ధికే శూరా శ్ఛత్రం చర్మాభ##మేవ చ ||

జిత్వా7రీన్‌ భోగసంప్రాప్తి ర్మృతస్య చ పరా గతిః | నిష్కృతిః స్వామి పిండస్య నాస్తి యుద్ధసమా గతిః ||

శూరాణాం యద్విని ర్యాతి రక్తమా బాధతః క్వచిత్‌ | తేనైవ సహ పాప్మానం సర్వం త్యజతి ధార్మికః ||

తథా7బాధ చికిత్సాయాం వేదనా సహితే తథా | తతో నాస్త్య ధికం లోకే కించిత్పరమదారుణమ్‌ ||

మృతస్య నాగ్ని సంస్కారో నా 77శౌ చ న్నోదకక్రియా | కర్తు మిచ్ఛంతి యస్యేహ సంగ్రామా దధికన్ను కిమ్‌ ||

తపస్వినో దానపరా యజ్వానో బహు దక్షిణాః | శూరాణాం గతిమిచ్ఛంతి దృష్ట్వా భోగననుత్తమా& ||

వరా7ప్సరస్స హస్రాణి శూరమాయోధనే హతమ్‌ | అభిద్రవంతి కామార్తా మమ భర్తా భవిష్యతి ||

స్వామీ సుకృత మాదత్తే భగ్నానాం వినివర్తతామ్‌ | బ్రహ్మహత్యాఫలం తేషామ్‌ తథా ప్రోక్తం పదే పదే||

యస్సహాయాన్‌ పరిత్యజ్య స్వస్తి మాన్గంతు మిచ్ఛతి | అస్వస్తి తస్యకుర్వంతి దేవాః శక్రపురోగమాః ||

-ః యోధులను ప్రోత్సహించుట ః-

యాత్రా శకునములు శుభ సూచకములుగా నున్నవి; విప్రులు విజయము గల్గునని చెప్పుచున్నారు. కన్నులు మొదలైన వాని అదరులు శుభసూచకముగా నున్నవి. మంచిని శుభమును సూచించు కలలు వచ్చుచున్నవి. ఏనుగులు గుఱ్ఱములందంతట శుభ నిమిత్తము గనబడుచున్నవి. శుభ శకునములు మనస్సున కను కూలముగనున్నవి. విరుద్ధములయిన సర్పాదులు కనిపించినచో మృత్యువగునుగాని లేనిచో గలుగదు. మీరో యుత్తమకులములం బుట్టినవారు. సర్వశస్త్రాస్త్రపారగులు. నిత్యము గుఱ్ఱపుస్వారి చేయుచుండువారు; నిరంతరము సన్మార్గమునే యనుసరించువారు; శత్రువుల భేదతంత్రమునకు లొంగనివారు. నాకు గెలుపేల కలుగదు. రాజ్యలక్ష్మిమీదే. అదనముగా మీకులేనివి నాకున్నవి - కేవలము రెండు వింజామరలు గొడుగు వట్టితోలు వంటిదే. నిష్ప్రయేజనమనుమాట. శత్రులంగెలిచిన భోగము; చచ్చిన పరమగతి; రాజుపెట్టిన తిండికి మారు చెల్లింప వలసినది. యుద్ధముతో సమమైన గతి యింకొకటి లెదు. సమరమున దెబ్బతిని పొందిన బాధవలన వెడలు రక్తముతో పాటు యోధుడు తాజేసిన పాపము నంతను నెడలించుకొనును.

రణ రంగమందెవ్వడైన వేదనతో గూడియున్నపుడు వాని బాధకు చికిత్స చేయని యెడల నంతకంటె మించిన పరమదారుణ మింకొకటిలేదు. అనిలో జనిపోయినవాని కగ్ని సంస్కారము మైల ఉదకక్రియ తర్పణము జ్ఞాతులు సేయవలయునని కోరరు. అట్టితరి యుద్ధమును మించిన దింకేమున్నది. తపశ్శాలురు దాతలు బహుదక్షిణలిచ్చి యజ్ఞములు సేసిన మహానుభావులు గూడ యుద్ధమునందు మడిసిన శూరులు పొందు నుత్తమ భోగములు తమకు గావలెనని కోరుకొందురు. వేలకొలది యప్సరసలు కామార్తలై యనిలో గూలిన శూరుని వెంట నీతడు నాకు భర్త కావలెనని పరువు లెత్తుదురు. యుద్ధమునం దోడి వెనుదిరిగి పారివచ్చిన యోధులపురాకృతపుణ్యమును రాజులాగికొనును. అట్లు పారి పోయిననూ యోధుల కడుగడుగున బ్రహ్మహత్య చేసిన పాపఫలము వచ్చును. సహాయులయినవారిని విడిచి యెవడు సుఖపడవలెనని వెనుదిరిగిపోవునో వాని కింద్రాదిదేవతలు అశుభముంగావింతురు.

అశ్వమేధఫలం ప్రోక్తం భగ్నామ మనివర్తతామ్‌ | పదే పదే మహాభాగ ః సమ్ముఖానాం మహాత్మనామ్‌ ||

దేవస్త్రియ స్తథా లక్ష్మీః పాప్మాన మయశ స్తథా | ప్రతీక్షంతే మహాభాగ! సంగ్రామే సముపస్థితే ||

పరాజ్ముఖా మయా గ్రాహ్యా జీవంతో ప్యథవా మృతాః | పరాఙ్ముఖా మయా గ్రాహ్యా పాప్మనా సహతిష్ఠతి ||

లక్ష్మీః సంతిష్ఠతే తస్య జీవతః కృత కర్మణః ||

మృతస్య చా7పి తిష్ఠంతి విమానస్థాః సురస్త్రియః | ఏవ ముద్ఘోషణం కృత్వా ధర్మేణచ్ఛేజ్జయం రణ ||

అనిలో నోడి పారిపోనివారి కున్ముఖులయిన మహాత్ముల కడుగడుగునందును అశ్వమేధ ఫలితము చెప్పబడినది. యుద్ధము తటస్థించినప్పుడు యుద్ధభూమిలో నేలకొరిగిన వారి వంక దేవతా సుందరులు లక్ష్మియు పారిపోయిన పాపాత్ముని వంక పాపము అపకీర్తియు నెదురుచూచుచుందురు. ఆమె ఎదురుచూచుట యెట్లు అనగా యుద్ధమునందు పెడమొగము పెట్టినవాండ్రు బ్రతికియున్నను జచ్చినను నాచే బట్టుకొనదగిన వాడని పాపము అట్లే పలుకుచు పాపముతోచు నపకీర్తియు నుండును. అతడు జీవించియున్నంతకాలము నాకృతార్థుని లక్ష్మి గూడియుండును; చనిపోయినను నతని కొరకు విమానము లెక్కి దేవతాస్త్రీలు ఎదురు చూచెదరు. అని రాజు చాటింపు వేయించి ధర్మముచేతనేజయమును గోరవలెను.

యుద్ధనీతిః

అధర్మ విజయో రాజ్ఞోనృప లోకే భయావహః | అధర్మవిజయా దర్థై ర్యచ్ఛిద్ర ముపధీయతే ||

ఛిద్రాదేవ పరం ఛిద్రం తస్య స్యా న్నాత్ర సంశయః | న కర్ణీ న తథా దిగ్ధః శరః స్యా ద్ధర్మ యోధినామ్‌ ||

నా7స్థిశల్యః పరః కార్యో దారు శల్యశ్చ భార్గవః | సమః సమేన యోద్ధవ్యో నా7పచారో రణ ద్విజ ||

సన్నద్ధేన చ సన్నద్ధః సాశ్వశ్చా శ్వగతేనతు | రథీ చ రథినా రామ ః పదాతి శ్చ పదాతినా ||

కుంజరస్థో గజస్థేన యోద్ధవ్యో భృగునందనః | విముఖో భగ్నశస్త్రశ్చ స్త్రీబాల పరి రక్షితా ||

వ్యాయుధో భగ్నగాత్రశ్చ తథైవ శరణా గతః | పరేణ యుధ్య మానశ్చ యుద్ధ ప్రేక్షక ఏవచ ||

ఆర్త స్తోయ ప్రదాతాచ దండపాణి స్తథైవచ | ఏతే రణ న హంతవ్యా క్షత్ర ధర్మమ భీప్సితా ||

పాపిష్ఠో కూటయుద్ధే చ కర్తవ్యమపి చా7హవే | శ్రాంతేన వా7భిభూతేన ఆర్థోత్తీర్ణ బలేన చ ||

-ః యుద్ధనీతిః-

రాజధర్మమున నొందిన గెలుపు లోకమందు భయముగూర్చును; అధర్మ విజయము వలన గలిగిన ధనములచేత ఛిద్రమును రాజు నేలోటును గప్పుకొనునో అలోటును మించిన లోటు (ఛిద్రము) వానికి తప్పక దాపురించును. సందియములేదు.

కర్ణీ=కర్ణములుగలది; చిల్లులుగలది, దిగ్ధః=విషాదులచే బూయబడిన బాణము; అస్థి= శల్యము ఎముకతో కట్టెతో చేసిన బాణాగ్రము; ధర్మయుద్ధమందు సమానునితో సమాను డని సేయవలెను. యుద్ధసన్నద్ధునితో సన్నద్ధుడు అశ్వికునితో అశ్వికుడు రథితోరథి పదాతితో పదాతి గజ మెక్కిన వానితో నేనుగెక్కిన వాడును దలపడవలయును.

క్షత్రధర్మముంగోరువాడు రణమునకు పెడమొగపెట్టినవానిని స్త్రీలను బాలురను కాపాడువానినిన చేత నాయుధము లేని వానిని ఒడలెల్ల తెగినవానిని శరణాగతుని ఇంకొకనితో దలపడిన వానిని యుద్ధమునూరక నిరీక్షింప వచ్చిన వానిని బాధకులోనగు వానిని మంచినీళ్ళందించువానిని చేత కఱ్ఱనూతగా గొనినవానిని యుద్ధమునందు జంపరాదు. ఇదిరాజనీతి.

దుర్దినే న చ యుద్ధాని కర్తవ్యాని మహాబల ||

ప్రవృత్తే సమరే రామః పరేషాం నామకారణాత్‌ | బాహూ ప్రగృహ్య విక్రోశే ద్భగ్నా భగ్నాః పరే త్వితి ||

ప్రాప్తం మిత్రబలం భూరి నాయకో7త్ర నిపాతితః |

సేనానీ ర్నిహతశ్చాయం సర్వా సేనా7పి విద్రుతా | ఏవం చిత్రాసనం కుర్యా త్పరేషాం భృగు నందనః ||

విద్రుతానాం తు యోధానాం సువిఘాతో విధీయతే | ధనుర్వేద విధానేన కల్పనా చ తథా భ##వేత్‌ ||

పాపాశ్చ దేయా ధర్మజ్ఞః తథైవ పరమోహనాః | పతాకా7భ్యుచ్ఛ్రయః కార్యంః స్వబలే చ తథా శుభః ||

సంస్కార శ్చైవ కర్తవ్యో వాదిత్రాణాం భయావహః | ఏతస్య వర్షం వక్ష్యామి తవోపనిషది ద్విజ ||

సంప్రాప్య విజయం యుద్ధే కార్యం దైవత పూజనమ్‌ | పూజయే ద్బ్రాహ్మణాంశ్చాత్ర గురూనపి చ పూజయేత్‌ ||

రత్నాని చర్మగామీని చర్మవాహన మాయుధమ్‌ | సర్వ మన్య ద్భవే త్తస్య యద్యేనైవ రణ హృతమ్‌ ||

కులస్త్రియస్తు విజ్ఞేయా స్తథారామః న కస్యచిత్‌ | స్వదేశే పరదేశే వా సాధ్వీం యత్నాన్న దూషయేత్‌ ||

అన్యథా సంకరో ఘోరో భవతీహ క్షయావహః | శత్రుః ప్రాప్య రణ ముక్తః పుత్త్రస్తస్య ప్రకీర్తితః ||

పుత్త్రేనా7స్యనయ్యోద్ధవ్యం తస్యధర్మం విజానతా | దేశేదేశే య ఆచారః పారం పర్య క్రమాగతః ||

సఏవ పరిపాల్య స్స్యా త్ర్పాప్య దేశం మహీక్షితా | నృణాం ప్రదర్శయే ద్రాజా సమరే7పి హతే రిపౌ ||

నమేప్రియం కృతం తేన యేనా7యం సమరేహతః | కింతు పూజాం కరో మ్యత్ర స్వచ్ఛంద మవిజానతః ||

హతో7యం మద్దితా ర్థాయ ప్రియం యద్యపి నో మమ | అపుత్రా శ్చస్త్రియ శ్చైవ నృపతిః పరి పాలయేత్‌ ||

తతస్తు స్వపురం ప్రాప్య నృపతిః ప్రవిశే ద్గృహమ్‌ | యాత్రా విధాన విహితం భూయో దైవత పూజనమ్‌ ||

పితౄణాం పూజనం చైవ తతా కుర్యా ద్విశేష వత్‌ | సంవిభాగం పురా 7వాప్తే కుర్యా ద్భృత్య జననస్య చ ||

అవాప్య ధర్మేణ నృపస్తు పృథ్వీ మారాయయూపాది సురాలయాంకామ్‌ |

కృత్వా తథాన్యాం ద్విజసాచ్చ శక్త్యా లోకం జయత్యస్య నరాధిపస్య ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే శత్రుప్రత్యభిగమనోనామ సప్త సప్త త్యుత్తర శతతమో7ధ్యాయః

మబ్బుపట్టినవాడు యుద్ధములు సేయరాదు. యుద్ధారంభమయిన తరి బాహువులొకదాన నొకటి పట్టుకొని బిగ్గరగా నిట్లరువవలెను. శత్రులోడిరోడిరి. మిత్రసేన పెద్దది నాకు సహాయముగ వచ్చినది. ఇక్కడ నాయకాదులు గూల్పబడినారు. సేనానియుం గూలినాడు. సేనయంతయు పారిపోయినది. అని శత్రువులకు వినబడునట్లల్లరి చేయవలెను. యుద్ధమునుండి పారిపోయి వచ్చిన యోధులకు మరణదండనము విధింపబడినది. అట్లే యుద్ధమందు వ్యూహకల్పన ధనుర్వేదమందుజెప్ప బడిన తీరున గావింపనగును. శత్రువులను మోహింప జేయు ప్రక్రియలు పాపములయినను (ఘోరములయినను) అభిచారికాదులనుగూడ చేయవలెను. యాత్రయందు తన సేనయందు శుభకరముగ జెండా నెత్తవలయును. యుద్ధభేరీలు మొదలయిన వాద్యములకు శత్రుభీతి గల్పించు సంస్కారము గూడ గావింపవలెను. సంగ్రామవాద్యములందు మంత్రౌషధుల పూయుట మొదలగు శత్రుభయంకర ప్రక్రియలు యుద్ధశాస్త్రమందున్నవి చెప్పబడినవి; యుద్ధమున గెలుపొంది రాజు దేవతా పూజనము గురుబ్రాహ్మణ పూజయుం జేయవలెను. ఇందువలన యుద్ధపరికరములత్యుత్తములైనవి వాహనములు ఆయుధములు మొదలగునవన్నియు శత్రువులచే యుద్ధమందు హరింపబడిన దింకనేదైన స్వాధీనమగును.

శత్రురాజుయొక్క రాజ్యమందున్న పతివ్రతలెవ్వరో తెలసికొనవలెను. తన దేశమందుగాని పరదేశమందుగానియున్న సాధ్విని జెఱచ గూడదు. అట్లుగాకున్న నీరాజ్యమందు సర్వనాశనము చేయు ఘోరమైన సంకర మేర్పడును. శత్రువుచేత జిక్కివానిచే విడువబడిన వాడతనికి పుత్రుడని శాస్త్రములందు జెప్పబడినది. ధర్మము నెఱింగినవాడు వానితో యుద్ధము సేయగూడదు. ఆయాదేశమందు పారంపర్యముగ వచ్చుచున్న యాచారమేదో దాని నాదేశమాక్రమించిన రాజు పాలింపవలెను. యుద్ధమందలి శత్రువు హతుడైనను నాతని దేశమందా సంప్రదాయమును ప్రదర్శింపవలెను గాని తన యాచారమునక్కడ ప్రవేశ##పెట్టరాదు. నాయిష్టము నొనరించనందున నీరాజును నేననిం గూల్చితిని కాని యెఱుగక తప్పిదము సేసినవాడుగావున వానిని నేను పూజింతును. గౌరవింతును. నాకిది (ఇతనింజంపుట) యిష్టము గాదు. అయినను నా హితవుగోరి నేను వీనిం జంపితిని అని - అపుత్రకలయిన స్త్రీలను గూడ రాజు గాపాడ వలెను. విజయము సేసిన రాజవ్వల తన రాజధానికి వచ్చి గృహప్రవేశము సేయవలెను. యాత్రా విధాన మైన (యాత్రా ప్రారంభమందు జేసిన) దేవతా పూజను పితృదేవతా పూజను అందలి విశేషమును (ఫలము) ఎరిగి గావింప వలెను. పురమునకు వచ్చి భృత్యజన విభాగము (ఏ నౌకరున కేపని యివలయునో) గావింపవలెను. రాజు ధర్రమముచేత పృథ్విని పొంది; ఉద్యానవనములు దేవాలయములు (యజ్ఞములందు చేయబడిన) యూవస్తంభముల శుభచిహ్నములు గల దానింగా వించి యింకనుంగల వసుంధరను యథాశక్తి బ్రాహ్మణవశము గావించి (అగ్రహారములిచ్చి) నరపతి సర్వోన్నతుడై రాణించును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున శత్రు ప్రత్యభిగమనమను నూటడెబ్బదియేడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters