Siva Maha Puranam-3    Chapters   

అథ షట్‌ త్రింశో%ధ్యాయః

శివ సహస్రనామ ఫలము

సూత ఉవాచ|

శ్రుత్వా విష్ణుకృతం దివ్యం పరనామవిభూషితమ్‌ | సహస్రనామస్వస్తోత్రం ప్రసన్నో%భూన్మహేశ్వరః || 1

పరీక్షార్థం హరేరీశః కమలేషు మహేశ్వరః | గోపయామాస కమలం తదైకం భువనేశ్వరః || 2

పంకజేషు తదా తేషు సహస్రేషు బభూవ చ | న్యూనమేకం తదా విష్ణుర్విహ్వలశ్శివపూజనే || 3

హృదా విచారితం తేన కుతో వై కమలం గతమ్‌ | యాతం యాతు సుఖేనైవ మన్నేత్రం కమలం న కిమ్‌ || 4

జ్ఞాత్వేతి నేత్రముద్ధృత్య సర్వసత్త్వావలంబనాత్‌ | పూజయామాస భావేన స్తవయామాస తేన చ || 5

తతః స్తుతమథో దృష్ట్వా తథాభూతం హరో హరిమ్‌ | మా మేతి వ్యాహరన్నేవ ప్రాదురాసీజ్జగద్గురుః || 6

తస్మాదవతతారాశు మండలాత్మార్థివస్య చ | ప్రతిష్ఠితస్య హరిణా స్వలింగస్య మహేశ్వరః || 7

యథోక్తరూపిణం శంభుం తేజోరాశిసముత్థితమ్‌ | నమస్కృత్య పురః స్థిత్వా స తుష్టావ విశేషతః || 8

తదా ప్రాహ మహాదేవః ప్రసన్నః ప్రహసన్నివ | సంప్రేక్ష్య కృపయా విష్ణుం కృతాంజలిపుటం స్థితమ్‌ || 9

సూతుడు ఇట్లు పలికెను-

దివ్యమైనది, శ్రేష్ఠమగు నామములతో కూడియున్నది, విష్ణువుచే చేయబడినది అగు తన స్తోత్రమును విని మహేశ్వరుడు ప్రసన్నుడాయెను (1). అప్పుడు లోకములకు అధిపతి, మహేశ్వరుడు అగు శివుడు విష్ణువును పరీక్షించుటకై కమలములలోని ఒక కమలమును దాచి పెట్టెను (2). అపుడు శివపూజను చేయవలెననే కంగారులోనున్న విష్ణువు వేయి పద్మములలో ఒకటి తక్కువైనదని గమనించెను (3). అపుడాతడు తన మనస్సులో ఇట్లు ఆలోచించెను: కమలము ఎచటకు పోయినదో? అది సుఖముగా తన దారిని తాను చూచుకొనుగాక! నా నేత్రకమలము లేదా యేమి? (4) ఇట్లు భావించి కన్నును ఊడబెరికి, ఆఖరి నామమగు సర్వసత్త్వావలంబనః అను నామముతో స్తుతించి దానితో భక్తిపూర్వకముగా పూజించెను (5). ఆ విధముగా సుత్తించిన విష్ణువును గాంచి జగద్గురువగు శివుడు, వద్దు, వద్దు అని పలుకుతూనే వెంటనే ఆవిర్భవించెను (6). విష్ణువుచే ప్రతిష్ఠించబడిన ఆ పార్థివ లింగమండలమునుండి వెంటనే మహేశ్వరుడు అవతరించెను (7). ఆ విష్ణువు పైన వర్ణించబడిన రూపముతో తేజోరాశియై ఆవిర్భవించిన శంభుని నమస్కరించి ఎదుట నిలబడి విశేషముగా స్తుతించెను (8). అప్పుడు మహాదేవుడు ప్రసన్నుడై చిరునవ్వుతో మరియు దయాదృష్టితో, చేతులను కట్టుకొని నిలబడియున్న విష్ణువును చూచి ఇట్లు పలికెను (9).

శంకర ఉవాచ |

జ్ఞాతం మయేదం సకలం తవ చిత్తేప్సితం హరే | దేవకార్యం విశేషేణ దేవకార్యరతాత్మనః || 10

దేవకార్యస్య సిద్ధ్యర్థం దైత్యనాశాయ చాశ్రమమ్‌ | సుదర్శనాఖ్యం చక్రం చ దదామి తవ శోభనమ్‌ || 11

యద్రూపం భవతా దృష్టం సర్వలోకసుఖావహమ్‌ | హితాయ తవ దేవేశ ధృతం భావయ తద్ధ్రు వమ్‌ || 12

రణాజిరే స్మృతం తద్వై దేవానాం దుఃఖనాశనమ్‌ | ఇదం చక్రమిదం రూపమిదం నామసహస్రకమ్‌ || 13

యే శృణ్వంతి సదా భక్త్యా సిద్ధిస్స్యాదనపాయినీ | కామానాం సకలానాం చ ప్రసాదాన్మమ సువ్రత || 14

శంకరుడు ఇట్లు పలికెను-

ఓ హరీ! నీ మనస్సులోని కోరిక నాకు పూర్తిగా తెలియును. దేవకార్యమును సాధించుటయందు విశేషశ్రద్ధ గల నీవు దేవకార్యముకొరకై కోరుచున్నావు (10). శ్రమ లేకుండగా రాక్షసులు నశించి దేవ కార్యము సిద్ధించుటకొరకై నీకు శోభనమైన సుదర్శనమనే చక్రమును ఇచ్చుచున్నాను (11). ఓ దేవాధిపతీ! నేను నీ హితము కొరకై ధరించిన, ఈ సర్వజీవులకు సుఖమునిచ్చే రూపమును నీవు చూచియుంటివి. దానిని నీవు నిశ్చయముగా ధ్యానించుము (12). యుద్ధరంగములో ఈ చక్రమును, ఈ రూపమును మరియు ఈ సహస్రనామములను స్మరించినచో, దేవతల దుఃఖము అంతమగును (13). ఓ గొప్ప వ్రతము గలవాడా! ఎవరైతే దీనిని సర్వదా భక్తితో వినెదరో, వారికి శాశ్వతమగు సిద్ధి లభించుటయే గాక నా అనుగ్రహముచే సకలకామనలు ఈడేరును (14).

సూత ఉవాచ |

ఏవముక్త్వా దదౌ చక్రం సూర్యాయుతసమప్రభమ్‌ | సుదర్శనం స్వపాదోత్థం సర్వశత్రువినాశనమ్‌ || 15

విష్ణుశ్చాపి సునంస్కృత్య జగ్రాహోదఙ్ముఖస్తదా | నమస్కృత్య మహాదేవం విష్ణుర్వచనమబ్రవీత్‌ || 16

సూతుడు ఇట్లు పలికెను -

ఇట్లు పలికి ఆయన తన పాదమునుండి పుట్టినట్టియు, పదివేల సూర్యులతో సమమగు కాంతిగల, సర్వశత్రుసంహారకమగు సుదర్శనచక్రమును ఇచ్చెను (15). అప్పుడు విష్ణువు కూడ తనను తాను చక్కగా సంస్కరించుకొని ఉత్తరముఖముగా నున్నవాడై మహాదేవునకు నమస్కరించి దానిని స్వీకరించి ఇట్లు పలికెను (16).

విష్ణురువాచ |

శృణు దేవ మయా ధ్యేయం పఠనీయం చ కిం ప్రభో | దుఃఖానాం నాశనార్థం హి వద త్వం లోకశంకర || 17

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ దేవా! ప్రభూ! వినుము. నేను దుఃఖవినాశముకొరకై దేనిని ధ్యానించవలెను? దేనిని పఠించవలెను? లోకములకు కల్యాణమును చేయువాడా! నీవు చెప్పుము (17).

సూత ఉవాచ |

ఇతి పృష్టస్తదా తేన సంతుష్టస్తు శివో%బ్రవీత్‌ | ప్రసన్నమానసో భూత్వా విష్ణుం దేవసహాయకమ్‌ || 18

సూతుడు ఇట్లు పలికెను -

అప్పుడు విష్ణువు ఇట్లు ప్రశ్నించగా, శివుడు సంతోషించి ప్రసన్నమగు మనస్సు గలవాడై దేవతలకు సహాయకుడగు విష్ణువుతో ఇట్లనెను (18).

శివ ఉవాచ |

రూపం ధ్యేయం హరే మే హి సర్వానర్థప్రశాంతయే | అనేకదుఃఖనాశార్థం పఠ నామసమస్రకమ్‌ || 19

ధార్యం చక్రం సదా మే హి సర్వాభీష్టస్య సిద్ధయే | త్వయా విష్ణో ప్రయత్నేన సర్వచక్రవరం త్విదమ్‌ || 20

అన్యే చ యే పఠిష్యంతి పాఠయిష్యంతి నిత్యశః | తేషాం దుఃఖం న స్వప్నే%పి జాయతే నాత్ర సంశయః || 21

రాజ్ఞా చ సంకటే ప్రాప్తే శతావృత్తిం చరేద్యదా | సాంగం చ విధిసంయుక్తం కల్యాణం లభ##తే నరః || 22

రోగనాశకరం హ్యేతద్విద్యావిత్తదముత్తమమ్‌ | సర్వకామప్రదం పుణ్యం శివభక్తిప్రదం సదా || 23

యదుద్దిశ్య ఫలం శ్రేష్ఠం పఠిష్యంతి నరాస్త్విహ | లప్స్యంతే నాత్ర సందేహః ఫలం తత్సత్యముత్తమమ్‌ || 24

యశ్చ ప్రాతస్సముత్థాయ పూజాం కృత్వా మదీయకామ్‌ | పఠేత మత్సమక్షం వై నిత్యం సిద్ధిర్న దూరతః || 25

ఐహికీం సిద్ధిమాప్నోతి నిఖిలాం సర్వకామికామ్‌ | అంతే సాయుజ్యముక్తిం వై ప్రాప్నోత్యత్ర న సంశయః || 26

శివుడు ఇట్లు పలికెను-

ఓ విష్ణూ! సర్వాపదలనుండి విముక్తిని పొందుటకై నా రూపమును ధ్యానించుము. వివిధదుఃఖములు నశించుటకొరకై సహస్రనామములను పఠించుము (19). ఓ విష్ణూ! నీవు సకలకామనలు సిద్ధించుట కొరకై చక్రములన్నింటిలో శ్రేష్ఠమగు ఈ నా చక్రమును సర్వదా ప్రయత్నపూర్వకముగా ధరించుము (20). నీవు మాత్రమే గాక, ఇతరులు ఎవరైతే దీనిని నిత్యము పఠించెదరో మరియు పఠింపజేసెదరో, వారికి కలలోనైననూ దుఃఖము దరికి రాదు. సందేహము లేదు (21). ఆపదను పొందిన రాజు దీనిని సాంగముగా యథావిధిగా వందసార్లు పఠించినచో, కల్యాణమును పొందును (22). ఈ ఉత్తమమగు పవిత్రస్తోత్రము రోగములను నాశనము చేసి విద్యను, ధనమును, సర్వకామనలను మరియు నిత్యశివభక్తిని ఇచ్చును (23). మానవులు ఇహలోకములో ఆ ఉత్తమమగు స్తోత్రమును ఏ శ్రేష్ఠఫలమును ఉద్దేశించి పఠించెదరో, ఆ ఫలమును పొందెదరనుటలో సందేహము లేదు (24). ఎవడైతే ఉదయమే లేచి నన్ను పూజించి నా సమక్షములో నిత్యము దీనిని పఠించునో, వానికి సిద్ధి దూరములో లేదు (25). అట్టి వానికి ఈ లోకములో సకలకార్యములు సిద్ధించి సర్వకామనులు ఈడేరుట మాత్రమే గాక, దేహపాతానంతరము సాయుజ్యముక్తి లభించుననుటలో సందేహము లేదు (26).

సూత ఉవాచ |

ఏవముక్త్వా తదా విష్ణుం శంకరః ప్రీతమానసః | ఉపస్పృశ్య కరాభ్యాం తమువాచ గిరిశః పునః || 27

సూతుడు ఇట్లు పలికెను-

అప్పుడు కైలాసవాసియగు శంకరుడు సంతసించిన మనస్సు గలవాడై ఆ విష్ణువును చేతులతో స్పృశించి మరల ఇట్లు పలికెను (27).

శివ ఉవాచ |

వరదో%స్మి సురశ్రేష్ఠ వరాన్‌ వృణు యథేప్సితాన్‌ | భక్త్యా వశీకృతో నూనం స్తవేనానేన సువ్రత || 28

శివుడు ఇట్లు పలికను --

ఓ దేవోత్తమా! నేను నీకు వరములనిచ్చెదను. నీకు నచ్చిన వరములను కోరుకొనుము. ఓ గొప్ప వ్రతము గలవాడా! నీవు భక్తితో ఈ స్తోత్రమును పఠించి నిశ్చయముగా నన్ను వశము చేసుకొంటివి (28).

సూత ఉవాచ |

ఇత్యుక్తో దేవదేవేన దేవదేవం ప్రణమ్య తమ్‌ | సుప్రసన్నతరో విష్ణుస్సాంజలిర్వాక్యమబ్రవీత్‌ || 29

సూతుడు ఇట్లు పలికెను-

దేవదేవుడగు శివుడు ఇట్లు పలుకగా, విష్ణువు మిక్కిలి సంతోషించి ఆయనకు ప్రణమిల్లి అంజలి జోడించి ఇట్లు పలికెను (29).

విష్ణురువాచ |

యథేదానీం కృపా నాథ క్రియతే చాన్యతః పరా | కార్యా చైవ విశేషేణ కృపాలుత్త్వాత్త్వయా ప్రభో || 30

త్వయి భక్తిర్మహాదేవ ప్రసీద వరముత్తమమ్‌ | నాన్యమిచ్ఛామి భక్తానామార్తయో నైవ యత్ర్ప భో || 31

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ నాథా! నీవు దయాసముద్రుడవు. ఓ ప్రభూ! నీవు ఇప్పుడు ఎట్లైతే గొప్ప దయను చూపితివో, అదే విధముగా ఇతర సందర్భములలో కూడ విశేషమగు దయను చూపవలెను (30). ఓ మహాదేవా! నీయందు భక్తి అనే ఉత్తమమగు వరమును నాకు ఇమ్ము. ఓ ప్రభూ! నీ భక్తులకు కష్టములు లేనే లేవు. కావున నేను మరియొక వరమును కోరుట లేదు (31).

సూత ఉవాచ |

తచ్ఛ్రు త్వా వచనం తస్య దయావాన్‌ సుతరాం భవః | పస్పర్శ చ తదంగం వై ప్రాహ శీతాంశు శేఖరః || 32

సూతుడు ఇట్లు పలికెను-

విష్ణువుయొక్క ఆ వచనమును విని పరమదయామూర్తి, చంద్రశేఖరుడు అగు శివుడు ఆయనయొక్క దేహమును స్సృశించి ఇట్లు పలికెను (32).

శివ ఉవాచ |

మయి భక్తిస్సదా తే తు హరే స్యాదనసాయినీ | సదా వంద్యశ్చ పూజ్యశ్చ లోకే భవ సురైరపి || 33

విశ్వంభ##రేతి తే నామ సర్వపాపహరం పరమ్‌ | భవిష్యతి న సందేహో మత్ర్ప సాదాత్సురోత్తమ || 34

శివుడు ఇట్లు పలికెను-

ఓ విష్ణూ! నీకు నాయందు సర్వకాలములయందు స్థిరముగా నుండే భక్తి కలుగును. నీవు లోకములో దేవతలకు కూడ సర్వదా వందనీయుడవు మరియు పూజనీయుడవు అగుము (33). ఓ దేవోత్తమా! నీకు నా అనుగ్రహముచే సకలపాపములను పోగొట్టే విశ్వంభరః అనే శ్రేష్ఠనామము కలుగుననుటలో సందేహము లేదు (34).

సూత ఉవాచ|

ఇత్యుక్త్వాంతర్దధే రుద్రస్సర్వదేవేశ్వరః ప్రభుః | పశ్యతస్తస్య విష్ణోస్తు తత్రైవ చ మునీశ్వరాః || 35

జనార్దనో%పి భగవాన్‌ వచనాచ్ఛంకరస్య చ | ప్రాప్య చక్రం శుభం తద్వై జహర్షాతి స్వచేతసి || 36

కృత్వా ధ్యానం చ తచ్ఛంభోః స్తోత్రమేతన్నిరంతరమ్‌ | పపాఠాధ్యాపయామాన భ##క్తేభ్యస్తదుపాదిశత్‌ || 37

ఇతి పృష్టం మయాఖ్యాతం శృణ్వతాం పాపహారకమ్‌ | అతః పరం చ కిం శ్రేష్ఠాః ప్రష్టుమిచ్ఛథవై పునః || 38

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం శివసహస్రనామస్తోత్రఫల వర్ణనం నామ షట్‌ త్రింశో%ధ్యాయః (36).

సూతుడు ఇట్లు పలికెను --

ఓ మహర్షులారా! సర్వదేవాధీశ్వరుడు, లోకప్రభువు అగు రుద్రుడు ఇట్లు పలికి ఆ విష్ణువు చూచుచుండగనే అక్కడనే అంతర్ధానమును చెందెను (35). విష్ణుభగవానుడు కూడ శంకరుని వచనమును పాటించి శుభమగు చక్రమును పొంది తన మనస్సులో చాల సంతసించెను (36). ఆయన శంభుని ధ్యానించి ఈ స్తోత్రమును నిరంతరముగా పఠించి, దానిని భక్తులకు ఉపదేశించే వారిచే పఠింపజేసెను (37). ఈ విధముగా మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానమును చెప్పితిని. దీనిని విన్నవారికి పాపములు తొలగిపోవును. ఓ మహాత్ములారా! ఈ పైన మీరు ఇంకనూ ఏమి తెలియగోరుచున్నారు? (38)

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు శివసహస్రనామఫల వర్ణనమనే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).

Siva Maha Puranam-3    Chapters