Siva Maha Puranam-3    Chapters   

అథ పంచదశో%ధ్యాయః

గృహపతి తపస్సును చేయుట

నందీశ్వర ఉవాచ|

విశ్వానరస్సపత్నీ కస్తచ్ఛ్రుత్వా నారదేరితమ్‌ | తదేవం మన్యమానో%భూద్వజ్రపాతం సుదారుణమ్‌ | 1

హా హతో%స్మీతి వచసా హృదయం సమతాడయత్‌ | మూర్ఛామవాప మహతీం పుత్ర శోకసమాకులః || 2

శుచిష్మత్యపి దుఃఖార్తా రురోదాతీవ దుస్సహమ్‌ | అతిస్వరేణ హారావైరత్యంతం వ్యాకులేంద్రియా || 3

శ్రుత్వార్త నాదమితి విశ్వనరోపి మోహం హిత్వోత్థితః కిమితి కిం త్వితి కిం కిమేతత్‌ |

ఉచ్చైర్వదన్‌ గృహపతిః క్వ సమే బహిస్థ్స ః ప్రాణోంతరాత్మ నిలయస్సకలేంద్రియేశః ||

4

తతో దృష్ట్వా స పితరౌ బహుశోక సమావృతౌ | స్మిత్వోవాచ గృహపతిస్స బాలశ్శంకరాంశజః || 5

నందీశ్వరుడిట్లు పలికెను-

విశ్వానరుడు భార్యతో గూడి నారదుని పలుకులను విని, ఆ పలుకులు మిక్కిలి దారుణమగు వజ్రపు దెబ్బవంటివని భావించెను (1). 'అయ్యో! నేను హతుడనైతిని' అని పలికి ఆతడు గుండెలను బాదుకొనెను. పుత్ర శోకముచే పీడితుడై ఆతడు గాఢమగు మూర్ఛను పొందెను (2). శుచిష్మతి కూడ సహింప శక్యము కాని దుఃఖముచే పీడింపబడి మిక్కిలి వ్యాకులమైన ఇంద్రియములు గలదై బిగ్గరగా హాహారావముతో ఏడ్చెను (3). ఆమె యొక్క ఇట్టి ఆర్తనాదమును విని విశ్వానరుడు మోహమునుండి బయటకు వచ్చి లేచి నిలబడి ' ఇట్లు అగుటకు కారణమేమి ? నాకు బహిః ప్రాణమైనవాడు, నా అంతరాత్మలో సర్వదా ఉండువాడు, ఇంద్రియములన్నింటికి ప్రభువు అగు ఆ నా గృహపతి ఎక్కడ ఉన్నాడు?' అని బిగ్గరగా పలుక జొచ్చెను (4). శంకరుని అంశవలన జన్మించిన గృహపతియను ఆబాలుడు మిక్కిలి దుఃఖముతో గూడియున్న తల్లిదండ్రులను గాంచి చిరునవ్వుతో అపుడు ఇట్లనెను (5).

గృహపతిరువాచ |

హే మాతస్తాత కిం జాతం కారణం తద్వధునా | కిమర్థం రుదితో%త్యర్థం త్రాసస్తాదృక్కు తో హి వామ్‌ || 6

న మాం కృతవపుస్త్రాణం భవచ్చరణరేణుభిః | కాలః కలయితుం శక్తో వరాకీ చంచలాల్పికా || 7

ప్రతిజ్ఞాం శృణుతాం తాతౌ యది వాం తనయో హ్యహమ్‌ | కరిష్యే%హం తథా యేన మృత్యుస్త్ర స్తో భవిష్యతి || 8

మృత్యుంజయం సమారాధ్య సర్వజ్ఞం సర్వదం సతామ్‌ | జయిష్యామి మహాకాలం సత్యం తాతౌ వదామ్యహమ్‌ || 9

గృహపతి యిట్లు పలికెను-

ఓ తల్లీ! తండ్రీ! ఏమైనది? ఇపుడీ స్థితికి కారణమేమి? చెప్పుడు. మీరు అధికముగా ఏల దుంఖించుచున్నారు? మీకీ భయమునకు కారణమేమి? (6) మీ పాదధూళిచే రక్షణ కల్పించబడిన దేహముగల నన్ను కాలుడు స్పృశించుటకైననూ సమర్థుడు కాడు. అల్ప తుచ్ఛ చంచల మృత్యువు గురించి చెప్పునదేమున్నది? (7) తల్లితండ్రులారా! నా ప్రతిజ్ఞను వినుడు. నేను మీపుత్రుడనైనచో, మృత్యువు కూడ భయపడునట్లు నేను చేయగలను (8). తల్లి దండ్రులారా! సర్వజ్ఞుడు, సత్పురుషులకు సర్వమునిచ్చువాడు అగు మృత్యుంజయుని ఆరాధించి నేను మహాకాలుని కూడ జయించెదను. నేను సత్యమును పలుకుచున్నాను (9).

నందీశ్వర ఉవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్య జారితౌ ద్విజదంపతీ | అకాలామృత వర్షౌమైర్గతతాపౌ తదోచతుః || 10

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ బాలుని ఈ మాటలను విని, నీరసపడి యున్న ఆ బ్రాహ్మణ దంపతులు అకాలములో సంభవించిన అమృతవర్షధారలచే తొలగిన దుఃఖముగలవారై అపుడు ఇట్లు పలికిరి (10).

పునర్ర్బూహి పునర్ర్బుహి కీ దృక్‌ కిదృక్‌ పునర్వద | కాలః కలయితుం నాలం వరాకీ చంచలాస్తి కా || 11

ఆవయోస్తాపనాశాయ మహోపాయస్త్వ యేరితః | మృత్యుంజయాఖ్య దేవస్య సమారాధానలక్షణః || 12

తద్వచ్చ శరణం శంభోర్నాతః పరతరం హి తత్‌ | మనోరథ పథాతీత కారిణః పాపహారిణః || 13

కిం న శ్రుతం త్వయా తాత శ్వేతకేతుం యథా పురా | పాశితం కాల పాశేన రరక్ష త్రిపురాంతకః || 14

శిలాదతనయం మృత్యుగ్రస్తమష్టాబ్దమాత్రకమ్‌ | శివో నిజజనం చక్రే నందినం విశ్వనందినమ్‌ || 15

క్షీరోద మథనోద్భూతం ప్రలయానలసన్నిభమ్‌ | పీత్వా హాలాహలం ఘోరమరక్షద్భువనత్రయమ్‌ || 16

జలంధర మహాదర్పం హృతత్రైలోక్య సంపదమ్‌ | రుచిరాంగుష్ఠరేఖోత్థ చక్రేణ నిజఘాన యః || 17

య ఏకేషు నిపాతోత్థ జ్వలనైస్త్రిపురం పురా | త్రైలోక్యైశ్వర్యసమ్మూఢం శోషయామాస భానునా || 18

కామం దృష్టి నిపాతేన త్రైలోక్య విజయోర్జితమ్‌ | నినాయానంగపదవీం వీక్ష్యమాణష్వజాదిషు || 19

తం బ్రహ్మాద్యైక కర్తారం మేఘవాహనమచ్యుతమ్‌ | ప్రయాహి పుత్ర శరణం విశ్వరక్షామణిం శివమ్‌ || 20

బ్రాహ్మణ దంపతులిట్లు పలికిరి-

మరల చెప్పుము. అది యెట్లు? మరల చెప్పుము. ఏమది? కాలుడు నిన్ను నశింపజేయుటకు సమర్థుడు కాడా? తుచ్ఛము, చంచలము అయినది ఏది? (11) మా ఇద్దరి దుఃఖమును తొలగించుటకు నీవు గొప్ప ఉపాయమును చెప్పితివి. మృత్యుంజయుడను ఈశ్వరుని కొలుచుట అనునది శ్రేష్ఠమగు ఉపాయము (12). మనకు శంభుడే శరణు. మనోరథమునకు కూడా అందని కార్యములను చేయువాడు, పాపములను హరింపజేయువాడునగు శంభుని కంటే గొప్ప దైవము లేదు (13). పుత్రా! నీవు వినలేదా యేమి? పూర్వము మృత్యుపాశముచే బంధింపబడిన శ్వేతకేతువును త్రిపురాంతకుడగు శివుడు రక్షించియున్నాడు (14). ఎనిమిది సంవత్సరముల వయస్సులో మృత్యువుచే కబళింపబడుటకు సిద్ధముగా నున్న శిలాదపుత్రుని శివుడు రక్షించెను. జగత్తునకు ఆనందము నిచ్చే ఆ నంది శివుని గణములకు అధిపతి యైనాడు (15). క్షీరసముద్రమును మథించగా పుట్టిన, ప్రలయకాలాగ్నిని బోలియున్న ఘోరమగు హాలా హల విషమును భక్షించి ఆయన ముల్లోకములను రక్షించినాడు (16). ముల్లోకముల సంపదను అపహరించి మిక్కిలి గర్వించియున్న జలంధరుని శివుడు తన అందమైన అంగుష్ఠముతో చక్రమును ప్రయోగించి సంహరించెను (17). శివుడు పూర్వము ముల్లోకముల ఐశ్వర్యముతో మోహమును పొందియున్న త్రిపురాసురులను ఒకే బాణమును ప్రయోగించి దానినుండి పుట్టిన అగ్ని జ్వాలలలో దహించివేసెను (18). ముల్లోకములను జయించి గర్వితుడైయున్న మన్మథుని శివుడు బ్రహ్మాదులు చూచుచుండగా తన కంటి నుండి ఉద్భవించిన జ్వాలతో దహించి శరీరము లేనివానిగా చేసెను (19). ఓ పుత్రా! బ్రహ్మాది స్తంబపర్యంతమునకు ఏకైక స్రష్ట, ఇంద్ర-ఉపేంద్రులకు తండ్రి, వినాశము లేని వాడు, విశ్వమును రక్షించే శ్రేష్ఠదైవము అగు శివుని శరణు పొందుము (20).

నందీశ్వర ఉవాచ|

పిత్రోరనుజ్ఞాం ప్రాప్యేతి ప్రణమ్య చరణౌ తయోః | ప్రాదక్షిణ్యముపావృత్య బహ్వాశ్వాస్య వినిర్య¸° || 21

సంప్రాప్య కాశీం దుష్ర్పాపాం బ్రహ్మ నారాయణాదిభిః | మహాసంవర్త సంతాప హంత్రీం విశ్వేశపాలితామ్‌ || 22

స్వర్ధున్యా హరయష్ట్యేవ రాజితాం కంఠ భూమిషు | విచిత్రగుణశాలిన్యా హరపత్న్యా విరాజితామ్‌ || 23

తత్ర ప్రాప్య స విప్రేశః ప్రాగ్య¸° మణి కర్ణికామ్‌ | తత్ర స్నాత్వా విధానేన దృష్ట్వా విశ్వేశ్వరం ప్రభుమ్‌ || 24

సాంజలిర్నతశీర్షో%సౌ మహానందాన్వితస్సుధీః | త్రైలోక్యప్రాణ సంత్రాణ కారిణం ప్రణనామ హ || 25

ఆలోక్యాలోక్య తల్లింగం తుతోష హృదయే ముహుః | పరమానంద కందాఢ్యం స్ఫుటమేతన్న సంశయః || 26

అహో న మత్తో ధన్యో%స్తి త్రైలోక్యే సచరాచరే | యదద్రాక్షిషమద్యాహం శ్రీ మద్విశ్వేశ్వరం విభుమ్‌ || 27

మమ భాగ్యోదయాయైవ నారదేన మహర్షిణా | పురాగత్య తథోక్తం యత్‌ కృతకృత్యో%స్మ్యహం తతః || 28

నందీశ్వరుడిట్లు పలికెను -

ఈ విధముగా ఆతడు తల్లి దండ్రుల అనుమతిని పొంది వారి పాదములకు నమస్కరించి, ప్రదక్షిణము చేసి వారిని చాలాసేపు ఓదార్చి బయలుదేరెను (21), బ్రహ్మ, నారాయణుడు మొదలగు వారికై ననూ పొంద శక్యము కానిది. మహాప్రలయ తాపమును పోగొట్టునది, విశ్వేశ్వరునిచే పాలింపబడునది (22). కంఠప్రదేశమునందలి హారమువలె శోభిల్లు గంగానదితో కూడి యున్నది, విచిత్ర గుణములతో ప్రకాశించు పార్వతీదేవితో కూడియున్నది (23) అగు కాశీ నగరమును చేరుకొని ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు ముందుగా మణికర్ణికకు వెళ్లి, అచట యథావిధిగా స్నానము చేసి, విశ్వేశ్వర ప్రభుని దర్శించి (24), చేతులు జోడించి తలవంచి మహానందముతో, ముల్లోకములలోని ప్రాణులను రక్షించే ఆ దేవునకు ప్రణమిల్లెను (25). ఆ లింగమును అనేక పర్యాయములు దర్శించి ఆ విద్వాంసుడు హృదయములో చాల ఆనందించెను. ఈ లింగము పరమానందఘనము అను విషయము స్పష్టమగుచున్నది. దీనిలో సంశయము లేదు (26). స్థావరజంగమములగు ప్రాణులతో గూడిన ఈ ముల్లోకములలో నాకంటే గొప్ప ధన్యుడు లేడు గదా! ఏలయన, నేనీనాడు శ్రీ మద్విశ్వేశ్వర విభుని దర్శించగల్గితిని (27). నా భాగ్యము పండుట చేతనే నారదమహర్షి మా ఇంటికి వచ్చి అట్లు చెప్పినాడు. అట్లు చెప్పుట వలన నేను ఇపుడు కృతార్థుడ.నైతిని (28)

ఇత్యానందామృతరసైర్విధాయ స హి పారణమ్‌ | తతశ్శుభే%హ్ని సంస్థాప్య లింగం సర్వహితప్రదమ్‌ || 29

జగ్రాహ నియమాన్‌ ఘోరాన్‌ దుష్కరానకృతాత్మభిః | అష్టోత్తరశ##తైః కుంభైః పూర్ణైర్గంగాంభసా శుభైః || 30

సంస్నాప్య వాససా పూతైః పూతాత్మా ప్రత్యహం శివమ్‌ | నీలోత్పలమయీం మాలాం సమర్పయతి సో%న్వహమ్‌ || 31

అష్టాధికసహసై#్రస్తు సుమనోభిర్వినిర్మితామ్‌ | స పక్షే వాథ వా మాసే కందమూల ఫలాశనః || 32

శీర్ణపర్ణాశ##నైద్ధీరః షణ్‌మాసం సంబభూవ సః | షణ్మాసం వాయుభక్షో%భూత్‌ షణ్మాసం జలబిందుభుక్‌ || 33

ఏవం వర్ష వయస్తస్య వ్యతిక్రాంతం మహాత్మనః | శివైకమనసో విప్రాస్తప్యమానస్య నారద || 34

జన్మతో ద్వాదశే వర్షే తద్వచో నారదేరితమ్‌ | సత్యం కరిష్యన్నివ తమభ్యగాత్కులిశాయుధః || 35

ఉవాచ చ వరం బ్రూహి దద్మి త్వన్మనసి స్థితమ్‌ | అహం శతక్రతుర్విప్ర ప్రసన్నో%స్మి శుభవ్రతైః || 36

ఇత్యాకర్ణ్య మహేంద్రస్య వాక్యం మునికుమారకః | ఉవాచ మధురం ధీరః కీర్త యన్మధురాక్షరమ్‌ || 37

ఆతడీ తీరున ఆనందమనే అమృతరసమునే ఆహారముగా స్వీకరించి, తరువాత శుభముహూర్తమునందు సర్వులకు హితమును కలిగించే లింగమును స్థాపించి (29), ఇంద్రియజయము లేని మానవులు స్వీకరింప శక్యము కాని నియమములను చేపట్టెను. మంగళకరమగు నూటయెనిమిది కుంభములలో వస్త్ర పూతమైన గంగా జలమును నింపి (30), ఆతడు ప్రతిదినము పవిత్రమగు అంతఃకరణ గలవాడై శివునకు అభిషేకమును చేసెను. ఆతడు ప్రతిదినము నల్ల కలువల మాలను సమర్పించెడివాడు (31). మరియు వెయ్యి ఎనిమిది పుష్పములతో కట్టిన మాలను సమర్పించెడివాడు. ఆతడు పదిహేను రోజులకు, లేదా నెలకు ఒక సారి దుంపలను, పళ్లను తినెడివాడు (32). ఆ ధీరుడు ఆరుమాసములు ఎండుటాకులను భక్షించెను. ఆరు మాసములు గాలిని, ఆరు మాసములు నీటి బిందువులను మాత్రమే స్వీకరించెను (33). ఓ నారదా! ఓ బ్రాహ్మణులారా! ఆ మహాత్ముడు ఇట్లు శివునియందు మనస్సును దృఢముగా నిలిపి తపస్సు చేయచుండగా ఒక సంవత్సరము గడిచెను (34). పుట్టిన నాటినుండి పన్నెండవ సంవత్సరమునందు గండమున్నదని నారదుడు చెప్పిన వచనమును సత్యము చేయుట కొరకాయున్నట్లు వజ్రము ఆయుధముగా గల ఇంద్రుడు ఆతనిని సమీపించెను (35). 'ఓయీ! బ్రాహ్మణా! నీ శుభకరమగు వ్రతములచే నేను ప్రసన్నుడైతిని. నేను ఇంద్రుడను. నీ మనసులోని వరమును కోరుకొనుము. ఇచ్చెదను' అని అతడు పలికెను (36). మహేంద్రుని ఈ వాక్యమును విని ధీరుడగు ఆ మునికుమారుడు మధురమగు వచనమును ఈ తీరున మధురముగా పలికెను(37).

గృహపతిరువాచ |

మఘవన్‌ వృత్రశత్రో త్వాం జానే కులిశపాణినమ్‌ | నాహం వృణ వరస్త్వత్త శ్శంకరో వరదో%స్తిమే || 38

గృహపతి ఇట్లు పలికెను-

ఓ ఇంద్రా! వృత్ర సంహారకా! వజ్రాయుధుడవగు నిన్ను నేను ఎరుంగుదును. నేను నీ నుండి వరమును కోరను. నాకు శంకరుడు వరము నీయగలడు (38).

ఇంద్ర ఉవాచ |

న మత్త శ్శంకరస్త్వన్యో దేవదేవో%స్మ్యహం శిశో | విహాయ బాలిశత్వం త్వం వరం యాచస్వ మా చిరమ్‌ || 39

ఇంద్రుడిట్లు పలికెను-

ఓయీ! బాలకా! శంకరుడు నాకంటే భిన్నముగా లేడు. నేనే దేవదేవడను. నీవు ఈ చిన్నతనపు లక్షణములు విడనాడి శీఘ్రముగా వరమును కోరుకొనుము (39).

గృహపతి రువాచ |

గచ్ఛాహల్యాపతే%సాధో గోత్రారే పాకశాసన | న ప్రార్థయే పశుపతేరన్యం దేవాంతరం స్ఫుటమ్‌ || 40

గృహపతి ఇట్లు పలికెను-

ఓయీ! అహల్యా జారా ! దుష్టా! పర్వత శత్రూ! దానవశిక్షకా! వెళ్లుము. పశుపతి తక్క మరియొక దైవమునుండి నేను వరమును కోరను. ఇది స్పష్టము (40).

నందీశ్వర ఉవాచ |

ఇతి తస్య వచశ్ర్శుత్వా క్రోధసంరక్తలోచనః | ఉద్యమ్య కులిశం ఘోరం భీషయామాస బాలకమ్‌ || 41

స దృష్ట్వా బాలకో వజ్రం విద్యుజ్జ్వాలాసమాకులమ్‌ | స్మరన్నారదవాక్యం చ ముమూర్ఛ భయవిహ్వలః || 42

అథ గౌరీపతి శ్శంభురావిరాసీత్తమోనుదః | ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే స్పర్శైస్సంజీవయన్నివ || 43

ఉన్మీల్య నేత్రకమలే సుప్తే ఇవ దినక్షయే | అపశ్యదగ్రే చోత్థాయ శంభుమర్క శతాధికమ్‌ || 44

భాలే లోచనమాలోక్య కంఠేకాలం వృషధ్వజమ్‌ | వామాంగసన్నివిష్టాద్రితనయం చంద్రశేఖరమ్‌ || 45

కపర్దేన విరాజంతం త్రిశూలాజగవాయుధమ్‌ | స్ఫురన్‌ కర్పూరగౌరాంగం పరిణద్ధగజాజినమ్‌ || 46

పరిజ్ఞాయ మహాదేవం గురువాక్యత ఆగమాత్‌ | హర్ష బాష్పాకులాసన్న కంఠ రోమాంచకంచుకః || 47

క్షణం చ గిరివత్తస్థౌ చిత్రకూట త్రిపుత్రకః | యథా యథా సుసంపన్నో విస్మృత్యాత్మానమేవచ | 48

న స్తోతుం న నమస్కర్తుం కించిద్విజ్ఞప్తిమేవ చ | యదా స న శశాకాలం తదా స్మిత్వాహ శంకరః || 49

నందీశ్వరుడిట్లు పలికెను-

వాని ఈ మాటను విని కోపముతో ఎర్రనైన కన్నులు గలవాడై భయంకరమగు వజ్రాయుధమును పైకెత్తి ఆ బాలకుని భయపెట్టెను (41). మెరుపుల మంటలతో భయమును గొల్పు ఆ వజ్రమును చూచి ఆ బాలకుడు నారదుని వాక్యమును స్మరించి భయపీడితుడై మూర్ఛనొందెను (42). అపుడు తమోగుణమును పోగొట్టువాడు, గౌరీపతియగు శంభుడు ఆవిర్భవించి, 'లెమ్ము, లెమ్ము, నీకు మంగళమగుగాక!' అని పలుకుతూ ప్రాణమును పోయుచున్నాడా యన్నట్లు ఆ బాలుని పలుపర్యాయములు స్పృశించెను (43). రాత్రి నిద్రించి ఉదయమే లేచినాడా యన్నట్లు ఆ బాలుడు కలువకన్నులను తెరచి లేచి ఎదుట వంద సూర్యుల కంటే అధికముగా ప్రకాశించుచున్న శంభుని గాంచెను (44). లలాటమునందు నేత్రము, కంఠమునందు నల్లని మచ్చ గలవాడు, వృషభధ్వజుడు, వామ పార్శ్వమునందు పార్వతితో ప్రకాశించువాడు, చంద్రుని శిరముపై ధరించువాడు (45), జటాజూటముతో ప్రకాశించువాడు, త్రిశూలము, ధనస్సు ఆయుధములుగా గలవాడు, కర్పూరమువలె పచ్చని దేహకాంతితో ప్రకాశించువాడు, గజచర్మను వస్త్రముగా ధరించినవాడు (46) అగు మహాదేవుని గాంచి గురువాక్యమును బట్టి, వేదవచనములను బట్టి గుర్తుపట్టి ఆనందముతో కంఠము బొంగురు పోగా, కళ్లవెంబడి నీరు గారుచుండగా, శరీరమునందు రోమాంచము కలుగగా (47), ఆతడు క్షణకాలము చిత్రకూట త్రిపుత్రక పర్వతములవలె కదలిక లేకుండగా తనను తాను మరచి నిలబడెను. అకస్మాత్తుగా ధనలాభమును పొందనవానివలె స్తబ్ధుడాయెను (48). ఆతడు స్తోత్రమును చేయుటకు గాని,నమస్కరించుటకు గాని, ఏదైననూ విన్నవించుటకు గాని సమర్థుడు కాలేకపోయెను. అపుడు శంకరుడు చిరునవ్వుతో నిట్లనెను (49).

శంకర ఉవాచ|

శిశో గృహపతే శక్రాద్వజ్రోద్యతకరాదహో | జ్ఞాతం భీతో%సి మా భైషీర్జిజ్ఞాసా తే మయా కృతా || 50

మమ భక్తస్య నో శక్రో న వజ్రం చాంతకో%పి చ | ప్రభ##వేదింద్రరూపేణ మయైవ త్వం విభీషితః || 51

వరం దదామి తే భద్ర త్వమగ్నిపదభాగ్భవ | సర్వేషామేవ దేవానాం వరదస్త్వం భవిష్యసి || 52

సర్వేషామేవ భూతానాం త్వమగ్నేంతశ్చరో భవ | ధర్మరాజేంద్రయోర్మధ్యే దిగీశో రాజ్యమాప్నుహి || 53

త్వయేదం స్థాపితం లింగం తవ నామ్నా భవిష్యతి | అగ్నీశ్వర ఇతి ఖ్యాతం సర్వతేజోవిబృంహణమ్‌ || 54

అగ్నీశ్వరస్య భక్తానాం న భయం విద్యుదగ్నిభిః | అగ్నిమాంద్యభయం నైవ నాకాలమరణం క్వచిత్‌ || 55

అగ్నీశ్వరం సమభ్యర్చ్య కాశ్యాం సర్వసమృద్ధి దమ్‌ | అన్యత్రాపి మృతో దైవా ద్వహ్నిలోకే మహీయతే || 56

శంకరుడిట్లు పలికెను-

ఓయీ బాలకా! గృహపతీ! వజ్రమును చేతబట్టిన ఇంద్రునిచూచి నీవు భయపడితివి. నాకు తెలిసినది. భయపడకుము. నిన్ను నేను పరీక్షించితిని (50). ఇంద్రుడు గాని, వజ్రము గాని,యముడు గాని నా భక్తునకు హానిని కలిగించలేరు. నేనే ఇంద్రరూపములో వచ్చి నిన్ను భయపెట్టితిని (51). ఓయీ వత్సా! నేను నీకు వరములిచ్చెదను. నీవు అగ్ని పదవిని పొందుము. నీవు దేవతలందరికీ వరములనిచ్చు వాడవు కాగలవు (52). ఓ అగ్నీ! నీవు సర్వప్రాణుల లోపల సంచరించువాడవు కాగలవు. ధర్మరాజునకు, ఇంద్రునకు మధ్యలో దిక్పాలక రాజ్యమును నీవు పొందుము (53). తేజస్సులనన్నిటిని మించి వ్యాపకమైన ఈ లింగము నీచే స్థాపించబడినది అగుటచే నీ పేర అగ్నీశ్వరుడని ఖ్యాతిని గాంచగలదు (54). అగ్నీశ్వరుని భక్తులకు విద్యుత్తు, అగ్ని, అజీర్ణవ్యాధి మరియు అకాలమరణముల భయము ఏ కాలమునందైననూ ఉండబోదు (55). సర్వ సమృద్ధులను ఇచ్చే అగ్నీశ్వరుని కాశీలో అర్చించి విధిబలముచే ఇతర ప్రదేశమునందు మరణించిననూ, అట్టి మానవుడు అగ్ని లోకములో మహిమను గాంచును (56).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వానీయ తద్బంధూన్‌ పిత్రోశ్చ పరిపశ్యతోః | దిక్పతిత్వే%భిషించ్యాగ్నిం తత్ర లింగే శివో%విశత్‌ || 57

ఇత్థమగ్న్యవతారస్తే వర్ణితో మే జనార్దనః | నామ్నా గృహపతిస్తాత శంకరస్య పరాత్మనః || 58

చిత్రహోత్రపురీ రమ్యా సుఖదార్చిష్మతీ వరా | జాతవేదసి యే భక్తాస్తే తత్ర నివసంతి వై || 59

అగ్నిప్రవేశం యే కుర్యుద్దృఢసత్త్వా జితేంద్రియాః | స్త్రియో వా సత్త్వసంపన్నాస్తే సర్వే%ప్యగ్ని తేజసః || 60

అగ్నిహోత్రరతా విప్రా స్థ్సాపితా బ్రహ్మచారిణః | పంచాగ్నివర్తినో%ప్యేవమగ్నిలోకే%గ్ని వర్చసః || 61

శీతే శీతాపనుత్యై యస్త్వేధోభాగాన్‌ ప్రయచ్ఛతి | కుర్యాదగ్నీష్టికాం వాథ స వసే దగ్ని సన్నిధౌ || 62

అనాథస్యాగ్ని సంస్కారం యః కుర్యాచ్ఛ్రద్ధయాన్వితః | అశక్తః ప్రేరయేదన్యం సో%గ్నిలోకే మహీయతే || 63

అగ్నిరేకో ద్విజాతీనాం నిశ్ర్శేయసకరః పరః | గురుర్దేవో వ్రతం తీర్థం సర్వమగ్నిర్వినిశ్చితమ్‌ || 64

నందీశ్వరుడిట్లు పలికెను-

శివుడు ఇట్లు పలికి ఆతని బంధువులను రప్పించి తల్లిదండ్రులు చూచుచుండగా ఆతనిని అగ్ని దిక్పాలక పదవియందు అభిషేకించి అచటి లింగములో ప్రవేశించెను (57). వత్సా! నేనీ తీరున దుష్టజనులను శిక్షించే, గృహపతియను పేరుగల, శంకరపరమాత్ముని యొక్క అగ్ని అవతారమును నీకు వివరించితిని (58). చిత్రహోత్రమను నగరము సుందరమైనది, సుఖమునిచ్చునది. అది ప్రకాశించే శ్రేష్ఠనగరము. అగ్ని హోత్రుని భక్తులు అచట నివసించెదరు (59). దృఢమగు అంతఃకరణము గలవారు, ఇంద్రియ జయము గలవారు అగు పురుషులు గాని, స్త్రీలు గాని ఎవరైతే అగ్నిని ప్రవేశించెదరో వారు అందరు సత్త్వగుణము గలవారై అగ్నితో సమానమగు తేజస్సును పొందెదరు (60). అగ్నిహోత్రమునందు శ్రద్ధ గల బ్రాహ్మణులు, బ్రహ్మచారులు, పంచాగ్ని మధ్యములో తపస్సునుచేయువారు అగ్నిలోకమును పొంది అగ్నితో సమమగు తేజస్సును పొందెదరు (61). ఎవడైతే శీతకాలములో చలిని పోగొట్టుట కొరకై ఇతరులకు కట్టెల మోపులను దానము చేయునో, మరియు ఎవడైతే అగ్నియందు ఇష్టిని చేయునో, అట్టివాడు అగ్ని సన్నిధిలో నివసించును (62). ఎవడైతే శ్రద్ధతో గూడినవాడై అనాథశవమునకు అగ్ని సంస్కారమును చేయునో, లేదా స్వయముగా అశక్తుడైనచో అట్లు చేయుటకు ఇతరుని ప్రోత్సహించునో, అట్టివాడు స్వర్గలోకములో మహిమను గాంచును (63). బ్రాహ్మణులకు మోక్షమునిచ్చే పరదైవము, గురువు, తీర్థము అగ్నిహోత్రుడొక్కడే. విద్వాంసునకు సర్వము అగ్నియేననుటలో సందేహము లేదు (64).

అపావనాని సర్వాణి వహ్ని సంసర్గతః క్షణాత్‌ | పావితాని భవంత్యేవ తస్మాద్యః పావకస్స్మృతః || 65

అంతరాత్మా హ్యయం సాక్షాన్నిశ్చయో హ్యాశుశుక్షణిః | మాంసగ్రాసాన్‌ పచేత్‌ కుక్షౌ స్త్రీణాం నో మాంసపేశికామ్‌ || 66

తైజసీ శాంభవీ మూర్తిః ప్రత్యక్షా దహనాత్మికా | కర్త్రీ హర్త్రీ పాలయిత్రీ వినైతాం కిం విలోక్యతే || 67

చిత్ర భానురయం సాక్షాన్నేత్రం త్రిభువనేశితుః అంధం తమోమయే లోకే వినైనం కః ప్రకాశనః || 68

ధూ పప్రదీపనైవేద్య పయోదధిఘృతైక్షవమ్‌ | ఏతద్భుక్తం నిషేవంతే సర్వే దివి దివౌకసః || 69

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం గృహపత్యవతారవర్ణనం నామ పంచదశో%ధ్యాయః (15)

అపవిత్ర వస్తువులన్నియు అగ్ని సోకి నంతనే క్షణములో పవిత్రములగును గనుక, అగ్నికి పావకుడని పేరు వచ్చినది (65). ఈ అగ్నిదేవుడు అందరికి నిశ్చయముగా అంతరాత్మయై ఉన్నాడు. అగ్ని జఠరమునందుండి మాంసాదులను పచనము చేయును. కాని ఈతడు స్త్రీల కండరములను జీర్ణము చేయలేడు (66?) శంభుని తేజోమయ, దహనస్వరూప ప్రత్యక్షమూర్తియగు అగ్ని లోకములను సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నది. ఈ మూర్తి లేనిచో దేనిని చూడగలము? (67) ఈ అగ్ని హోత్రుడు సాక్షాత్తుగా ముల్లోకములకు ప్రభువగు శివుని మూడవ కన్ను అగుచున్నాడు. చీకటితో నిండియున్న ఈ లోకములో చీకటిని పారద్రోలి ప్రకాశమునిచ్చునది అగ్నియే గదా! (68) అగ్ని భక్షించిన ధూపదీపనైవేద్యములను, పాలు పెరుగు నెయ్యి చెరుకురసము మొదలగు వాటిని మాత్రమే స్వర్గములోని దేవతలందరు సేవించుచున్నారు (69).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు గృహ పత్యవతార వర్ణనమనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).

Siva Maha Puranam-3    Chapters