Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

దేవాసురసంగ్రామే బలయోజనమ్‌.

తారకః : శృణుధ్వమనురాస్సర్వే వాక్యంమమ మహాబలాః | స్థేయసీక్రియతాంబుద్ధి స్సర్వైః కృత్యన్యసంవిధౌ.

వంశక్షయకరాదేవా స్సర్వేషామేవదానవాః | అస్మాకంజాతిధర్మోవై విరూఢంవైరమక్షయమ్‌. 2

వయమద్యగమిష్యామః సురాణాంనిగ్రహాయతు | స్వబాహుబలమాశ్రిత్య సర్వమేవ ససంశయః. 3

కింతు నాతపసాయుక్తో మన్యేహంసురసజ్గరమ్‌ | అహమాదౌ కరిష్యామి తపోఘోరం దితేస్సుతాః. 4

తతస్సురా న్విజేష్యామో భోక్ష్యామో థజగత్త్రయమ్‌ | స్థిరోపాయోహి పురుష స్థ్సిరశ్రీరపిజాయతే. 5

రక్షితుం నైవశక్తోస్మి చపల శ్చపలాంశ్రియమ్‌ | తచ్ఛ్రుత్వాదానవాస్సర్వే వాక్యం తస్యాసురస్యతు. 6

సాధుసాధ్వి త్యవోచంస్తే తత్రదైత్యా స్సవిస్మయాః |

తపఃకరణార్థం తారకస్య పారియాత్ర పర్వతగమనమ్‌.

సోగచ్ఛత్పారియాత్రస్య గిరేఃకన్దరముత్తమమ్‌. 7

సర్వర్తుకుసుమాకీర్ణం నానౌషధివిదీపితమ్‌ | నానాధాతురసస్రావి చిత్రం నానాగుహాగృహమ్‌. 8

గహనైస్సర్వతోగూఢం చిత్రకల్పద్రుమాశ్రయమ్‌ | అనేకాకారబహుళ నృత్యత్పక్షికులాకులమ్‌. 9

నానాప్రస్రవణోపేతం నానావిధజలాశ్రయమ్‌ | ప్రాప్యతత్కన్దరేదైత్య శ్చచారవిపులంతపః. 10

నిరాహారఃపఞ్ఛతపాం పత్రభుగ్వారిభోజనః | శతంశతంనమానాంతు తపాంస్యేతాని సోకరోత్‌. 11

తతస్స్వదేహాదుత్కృత్య కర్షంకర్షందినేదినే | మాంసాన్యగ్నౌ జుహావాసౌ తతో నిర్మాంసతాంగతః. 12

నూట నలువది ఏడవ అధ్యాయము.

యుద్ధమునకై దేవాసురులు బలముల కూర్చుకొనుట.

తారకుడిట్లు పలికెను: మహాబలులగు అసురులారా! అందరును నామాట వినుడు. మీరందరును కార్యాచరణ మందు మిగుల స్థిరబుద్ధి నిలుపుడు. దానవులారా! దేవతలు మనకు వంశక్షయకరులు. మనకు జాతిధర్మముగా వారితో అక్షయమగు వైరము నెలకొని యున్నది. మనము ఇపుడు సురలదండించుటకుగా స్వభుజ బలము సర్వమును అవలంబనముగా చేసికొని పోవుదము. ఇందు సందేహము వలదు. కాని తపస్సు లేక దేవతలతో సంగరము యుక్తము కాదను కొందును. దితిసుతులారా! మొదట నేను ఘోర తపమొనరింతును. తరువాత దేవతలను జయింతము; జగత్త్రయమును అనుభవింతము. స్థిరోపాయముగల పురుషుడే స్థిరశ్రీని పొందును. చపలుడనయియుండి నేను సహజ చపల యగు లక్ష్మిని కాపాడజాలను. అనగా దైత్యదాతనవు లందరును ఆ తారకాసురుని వచనమువిని విస్మయమంది 'బాగు బాగ'నిరి. తారకుడును పారియాత్రగిరి గుహకు పోయెను. అది ఉత్తమము. సర్వఋతు కుసుమములతో వ్యాప్తము; నానా విధములగు ఓషధులతో (ధాన్యాదులతో) దీపించుచున్నది. నానాగైరికధాతువులను స్రవించునది. చిత్రమయినది; అనేక గుహాగృహములుఅందు గలవు. దాని కన్నివైపుల దట్టములగు అడవులు కలవు; చిత్రములగు కల్పవృక్షములు అందుగలవు. అనేకాకారములు కలిగి నృత్యమొనర్చు అనేక పక్షులతో కల్లోలితముగానున్నది. ఎన్నో సెలయేళ్లందు గలవు. ఎన్నో జలాశయములును గలవు. అచటచేరి ఆదైత్యుడు విస్తృతమగు తపమాచరించెను. పంచాగ్నిమధ్యతుడై నిరాహారుడై ఆకులాహారముగా నీరాహారముగా ఇట్లు వేరువేరు విధముల నూరేసి ఏండ్లు తపమాచరించెను. తరువాత దినదినమున తన దేహమునుండి మాంసము ఖండించి మాంసమునగ్నియందు వేల్చి వేల్చి మాంసరహితుడయ్యెను.

ఉద్విగ్నా7థసురాస్సర్వే తపసాతస్యభీషితాః |

తారకాసుర వరప్రదానాయ బ్రహ్మావిర్భావః.

ఏతస్మిన్నన్తరేబ్రహ్మా పరమంతోషమాగతః. 13

తారకస్యవరందాతుం జగామత్రిదశాలయాత్‌ | ప్రాప్యతంశైలరాజానం సరసస్యన్దనే స్థితః. 14

ఉవాచతారకందేవో గిరామధురయాతతః | బ్రహ్మా: పుత్త్రాలంతపసాతే7స్తు నాస్త్యసాధ్యంతవాధునా. 15

వరంవృణీష్వరుచిరం యత్తేమనసివర్తతే | ఇత్యుక్తస్తారకోదైత్యః ప్రణమ్యాత్మభువం విభుమ్‌. 16

ఉవాచ ప్రాఞ్జలిర్భూత్వా ప్రణతః పృథువిగ్రహః | తారకః : దేవ!భూతమనోవాసి న్వేత్సిజన్తువిచేష్టితమ్‌. 17

కృతప్రతికృతాకాఙీక్ష జిగీషుఃప్రాయశోజనః | వయంచజాతిధర్మేణ కృతవైరాస్సహామరైః. 18

తైశ్చనిశ్శేషితాదైత్యాః క్రూరైస్సస్త్యజ్యధర్మతామ్‌ | తేషామహం సముద్ధర్తా భ##వేయమితిమేమతిః. 19

అవధ్యస్సర్వభూతానా మస్త్రాణాంచమహౌజసామ్‌ | స్యామహం పరమోహ్యేష వరోయంమేహృ దీప్సితః. 20

ఏతంమేదేహిదేవేశ నాన్యోమే రోచతేవరః | తమువాచతతోదైత్యం విరిఞ్చో7మరనాయకః. 21

బ్రహ్మా: నయుజ్యతేవినామృత్యుం దేహినో దైత్యసత్తమ | యత స్తతోపివరయ మృత్యుం యస్మాన్నశఙ్కసే.

తతః సంచింత్య దైత్యేంద్రః శిశోర్వై సప్తవాసరాత్‌ | వవ్రేమహాసురో మృత్యు మవలేప విమోహితః. 23

బ్రహ్మా చాసై#్మ వరం దేవో దత్వా తన్మనసేప్సితమ్‌ | జగామ త్రిదివం దేవో దైత్యోపిస్వకమాలయమ్‌. 24

ఉత్తీర్ణం తపసస్తంతు దైత్యం దైత్వేశ్వరా స్తథా | పరివప్రు స్సహస్రాక్షం దివిదేవగణాయథా. 25

వానితపస్సుతో దేవతలు అందరును భయమందిరి. ఇంతలో బ్రహ్మ వానితపస్సునకు సంతృప్తుడై వరమీయ దేవలోకము నుండి పోయెను. నరసమగు రథమునెక్కి ఆ దేవుడు ఆపారియాత్రశైల రాజమునుచేరి మధురవాక్కుతో తారకునితో ఇట్లనెను: పుత్త్రా! తపము చాలించుము; నీకిపుడు అసాధ్యములేదు. నీ సంకల్పమందున్న ఇష్టవరము కోరుము. ఇట్లనగా తారకుడు విభుడగు స్వయంభూబ్రహ్మను నమస్కరించి విశాల దేహుడయ్యును వినయముతో వంగి ప్రాంజలియై ఇట్లనెను: దేవా! నీవు సర్వభూతముల మనస్సుయం దుండువాడవు. సర్వప్రాణుల చర్యల నీవు ఎరుగుదువు. ప్రాయికముగా జనుడు ప్రతియొకడును తనకు ఇతరులు చేసిన అపకారమునకు ప్రతీకారముచేసి పగవానిని గెలువగోరును. మాకు జాతిధర్మముగామేము అమరులకు వైరులము. వారు ధర్మము విడిచి దైత్యుల నిఃశేషుల జేసిరి. నేను వారిని నిర్మూలించ గోరుచున్నాను. నేను సర్వభూతములకును మహా తేజోవంతములగు అస్త్రములకును అవధ్యుడ గావలయును. ఇది నా హృదయమునకు ఈప్సితమగు పరమవరము; దేవేశా! ఇదియే నాకిమ్ము; మరేవరమును నాకింపుగాదు. అనగా అమరనాయకుడగు బ్రహ్మ తారకునితో ఇట్లనెను: దైత్యనత్తమా! ఏదేహియు మృత్యువు నందకుండ జాలదు. కనుక ఏదోయొక దానినుండి మరణమును కూడ సంశయింపక కోరుము; అనగా వాడును గర్వ మోహితుడయి ఆలోచించి ఏడుదినముల శిశువు వలన మృత్యువు కోరెను. బ్రహ్మ వానికా వరములనిచ్చి దేవలోక మేగెను. దైత్యేంద్రుడు తారకుడును తన గృహమునకు పోయెను. తపస్సు నుండి ఉత్తీర్ణుడయి వచ్చిన ఆదైత్యుని దైత్యేశ్వరు లందరును స్వర్గమున దేవతలు సహస్రాక్షునివలె సేవించసాగిరి.

తస్మిన్నహని రాజ్యస్థ స్తారకో దైత్యనన్దనః | ఋతవోమూ ర్తిమన్తశ్చ స్వకాలగుణబృంహితాః. 26

అభవన్కిఙ్కరాస్తస్య లోకపాలాశ్చసర్వశః | కాన్తి ర్ధృతిః కీ ర్తిర్‌మేధా7 ఖణ్డాచ దానపమ్‌. 27

పరివవ్రు ర్గుణాకీర్ణా నిశ్చిద్రా స్సర్వఏవహి | కాలాగురువిలిప్తాఙ్గం మహామకుటభూషణమ్‌. 28

రుచిరాఙ్గదనద్ధాఙ్గం మహాసింహాసనస్థితమ్‌ | వీజయన్త్యప్సరశ్రేష్ఠాః భృశంముఞ్చన్తి దైవతాః. 29

చన్ద్రార్కౌ దీపమార్గేషు వ్యజనేషుచ మారుతః | కృతాన్తోగ్రేసర స్తస్య బభూవ మునిసత్తమాః. 30

ఏవం ప్రయాతి కాలేతు విదితస్తారకాసురః | బభాషే సచివాన్దైత్యః ప్రావృత్తబలదర్పితః. 31

అమర విజయాయ తారకకృతయుద్ధ సన్నాహః.

తారకః : రాజ్యేన కారణం కింమే యేనాక్రమ్య త్రివిష్టపమ్‌ |

అనిర్వాప్య సురైర్వైరం కా శాన్తిర్హృదయే మమ. 32

భుఞ్జతే7ద్యాపి యజ్ఞాంశా న్త్సురాస్త్రిదివ ఏవహి | విష్ణుశ్శ్రియం నత్యజతి తిష్ఠతే జగతశ్శ్రయః. 33

స్వస్థాభి స్స్వర్గనారీభిః పీడ్యన్తేచ స్వవల్లభాః | మదిరాస్సోత్పలామోదా దివి క్రీడాయనేషుచ. 34

లబ్ధ్వాజన్మ న యఃకశ్చి ద్ఘటతే పౌరుషంనరః | జన్మతస్య వృథాభూత మజన్మాతు విశిష్యతే. 35

మాతాపితృభ్యాం న కరోతి కామా న్బన్ధూంశ్చ కాన్తా న్నకరోతియోవా |

కీర్తించవా నార్జయతేహి మాన్యాంపుమా న్త్సజాతోపి మృతోమృతశ్చ. 36

తదద్యయామ స్సురపుఙ్గవానాం త్రైలోక్యలక్ష్మీహరణాయ శృఘ్రమ్‌ |

సంయోజ్యతాం మేరథమష్టచక్రం బలంచ మే దుర్జయదైత్యచక్రమ్‌. 37

ధ్వజంచమే కాఞ్చనరత్ననద్ధం ఛత్రంచమే మౌక్తికజాలబద్ధమ్‌ |

దైత్యనందనుడా తారకు డానాడే రాజ్యస్థుడయ్యెను. నాటినుండి ఋతువులు తమకాలపు లక్షణములతో నిండి వాని సేవింపవచ్చెను. లోకపాలురందరు వానికింకరులయిరి. కాంతి ధృతి కీర్తి మేధా ఆఖండమగు సిరి తమ తమగుణములతో నిండినవై ఏలోపమును లేక అన్నియు ఆదానవుని ఆశ్రయించెను. అతడు కాలాగురు(సుగంధద్రవ్యము) లేపనము పూసికొని మహాకిరీటము మనోహరములగు భుజకీర్తులు ధరించి మహాసింహాసనమధిష్ఠించి యుండ అప్సరః శ్రేష్ఠ లాతనిని విడువక వీవనలతో మిగుల వీచుచుందురు. అతని దీపమార్గములందు చంద్రసూర్యులును నీవనలయందు వాయువును యముడాతని ముందుగాను ఉండెడివారు.

చాలకాలమిట్లు గడచిన మీదట మహావర గర్వితుడగు ఆ తారకాసురుడు ఒకనాడు సచివులతో ఇట్లనెను: స్వర్గ మాక్రమించనిదే రాజ్యముతో నాకేమి తృప్తి? దేవతలతోడి పగ తీర్చుకొననిదే నా హృధయమునకు శాంతి ఎక్కడిది? ఇప్పటికిని దేవతలు యజ్ఞాంశముల ననుభవించుచునే యున్నారు. స్వర్గమందే నివసించుచున్నారు. విష్ణువు లక్ష్మిని విడువక ఏ తడబాటును లేక సుఖమున్నాడు. స్వర్గస్త్రీలు ఇప్పటికిని తమ ప్రియులను శృంగార క్రీడలందు పీడించుచున్నారు. స్వర్గమున విహార స్థానములందు ఇంకను మద్యములు కలువల వాసనతో కూడియున్నవి. జన్మమునందియు పౌరుషమును సాధించని వాని జన్మము వ్యర్థము; వానికంటె పుట్టనివాడే మేలు. తల్లిదండ్రుల కోరకలను తీర్చనివాడును బంధువులను సంతోషపెట్టనివాడును మాన్యమగు కీర్తి నార్జించనివాడును మృతుడేయని నాయభిప్రాయము. కావున మనము నేడే సురపుంగవుల త్రైలోక్య లక్ష్మిని హరించుటకై శీఘ్రముగా యుద్ధ యాత్ర చేయుదము. అష్ట చక్రమగు నారథమును దుర్జయమగు దైత్య సేనా చక్రమును సిద్ధపరచబడుగాక! కాంచనముతో రత్నములతో కూర్చిన నా ధ్వజమును మౌక్తిక జాలముతో బద్ధమయిన ఛత్త్రమును సిద్ధమగుగాక!

తారకస్య వచశ్శ్రుత్వాగ్రసనోనామ దానవః. 38

సేనానీర్ధైత్యరాజస్య తథాచక్రే బలాన్వితః | ఆహత్య భేరీంగమ్భీరాం దైత్యా నాహూయ సత్వరః. 39

గరుడానాం సహస్రేణ చక్రాష్టకవిభూషితమ్‌ | శుక్లామ్బరపరిష్కారం చతుర్యోజనవిస్తృతమ్‌. 40

నానాక్రీడాగృహయుతం గీతవాద్యమనోహరమ్‌ | విమానమివదేవస్య సురభర్తు శ్శతక్రతోః. 41

దశకోటీశ్వరా దైత్యా దైత్యానాం చణ్డవిక్రమాః | నానాయుధప్రహరణా నానాశస్త్రాస్త్రపారగాః. 42

తారకస్యాభవత్కేతూ రౌద్రః కమలభూషణః | కేతునామకరేణాపి సేనానీర్‌గ్రసనస్త్విహ. 43

పైశాచం యస్యవదనం జమ్భస్యాసీ దయోమయమ్‌ | ఖరంవిధూతలాఙ్గూలం కుజమ్భస్యాభవ ద్ధ్వజే. 44

మహిషస్యతు గోమాయుః కేతోర్హైమస్తదాభవత్‌ | ధ్వాంక్షోధ్వజేతు శుమ్భస్య కృష్ణాయోమయ ఉచ్ఛ్రితే. 45

అనేకాకారచిహ్నాని హ్యన్యేషాంతు ధ్వజానితు | శ##తేన శీఘ్రవేగానాం వ్యాఘ్రాణాం హేమమాలినామ్‌. 46

గ్రసనస్య రథో యుక్తః కిఙ్కిణీజాలమాలినామ్‌ | శ##తేనచాథ సింహానాం రథోజమ్భస్య దుర్జయః. 47

కుజమ్భస్య రథోయుక్తః పిశాచవదనైః ఖరైం | రథస్తుమహిషస్యోష్ట్రై ర్గజస్యతు తురఙ్గమైః. 48

మేఘస్య ద్వీపిభిర్భీమైః కూష్మాణ్డౖః కాలనేమినః | పర్వతాభై స్సమారూఢో నిమిర్మత్తైర్మహాగజైః. 49

చతుర్దంష్ట్రై ర్గన్ధవద్భిశ్శిక్షితై ర్మేఘభైరవైః | శతహస్తా యతైః కృష్ణైఃసురఙ్గైర్‌ హేమభూషణౖః. 50

సితచామరజాలేన శోభితేదక్షిణాందిశమ్‌ | సితచన్దనచర్చాఙ్గో నానాపుష్పస్రజోజ్జ్వలః. 51

తారకుని మాటవిని అతని సేనాపతియగు గ్రసనుడను దానవుడు తన సేనతోకూడి అదేవిధముగా చేసెను. అతడు గంభీరమగు భేరిని మ్రోగించి త్వరితముగా దైత్యులను యుద్ధమునకై పిలిచెను. వేయి గుర్రములు ఎనిమిది చక్రములు శుక్ల వస్త్రాలంకారములు నానా క్రీడాగృహములు మనోహర గీతవాద్యపు ఏర్పాటులు కలిగి చతుర్యోజన వైశాల్యము కలిగి దేవపతియు శతక్రతుడునగు ఇంద్రుని విమానమో యనునట్లున్న రథమును సిద్ధపరచెను. దైత్యులలో చండ విక్రములును పదికోట్ల దైత్యులకు నాయకులును అగు అసురులును సంసిద్ధులైరి. వారందురును నానా శస్త్రములతో యుద్ధము చేయగలవారు; నానా శస్త్రాస్త్ర విద్యాపారంగతులు.

వారిలో తారకుని ధ్వజము రౌద్రమయి పద్మాలంకృతమయి యుండెను. గ్రసనుడు మకరధ్వజము దాల్చెను. జంభుని ధ్వజము అయోమయమయి పిశాచ ముఖమయి యుండెను. కుజంభుని ధ్వజమందు తోక ఆడించుచున్న గాడిద ఉండెను. మహిషుని ధ్వజమందు బంగారు నక్క యుండెను. శుంభుని అత్యున్నతమగు ధ్వజమందు అయోమయమగు కాకి యుండెను. ఇతర దానవుల ధ్వజములును అనేకాకార చిహ్నములతో నుండెను.

గ్రసనుని రథము శీఘ్రవేగము కలవి బంగరుమాలికలు కలవియగు నూరు పులులు పూంచినది. జంభుని రథము చిరుగజ్జెల సమూహముల మాలికలుకల నూరు సింహములను పూంచినదై దుర్జయమయినది. పిశాచ ముఖములు గల గర్దభములు కుజంభుని రథమును లాగుచుండెను. మహిషుని రథమును ఉష్ట్రములును గజుని రథమును తురంగములును మేఘుని రథమును భయంకరములగు చిరుతపులులును కాలనేమి రథమును ఏనుగులును లాగుచుండెను. ఆ మదపుటేనుగులు పర్వతములవలె దృఢములయి ఎత్తయి నాలుగు దంతములు కలవయి మదము కార్చుచు సుశిక్షితములయి మేఘములవలె భయంకరములయి యుండెను. వానికి తోడుగ నూరు మూరల ఎత్తయినవి బంగరు సొమ్ములుగల నల్లని గుర్రములునుండెను. కాలనేమి తెల్లని చందనము పూసికొనిన మనోహర దేహముతో నానా పుష్పమాలలతో ప్రకాశించుచున్నవాడయి తెల్లని చామరములతో ప్రకాశించుచు దక్షిణదిశకు బయలుదేరెను.

మథనోనామ దైత్యేన్ద్రః పాశహస్తో వ్యరాజత | జమ్భకఃకిఙ్కిణీజాలమాలాముష్ట్రం సమాస్థితః. 52

కాలశుక్లమహామేష మారూఢ శ్శుమ్భదానవః | అన్యేపి దానవా వీరా నానావాహనగామినః. 53

ప్రచణ్డచిత్రవర్మాణః కుణ్డలోష్ణీషభూషణాః | నానావిధోత్తరాసఙ్గా నానామాల్యవిభూషణాః. 54

నానావర్ణసుగన్ధాఢ్యా నానావన్దిజనస్తుతాః | నానావాద్యపరిష్వజ్గా అగ్రేసరమహారథాః. 55

నానాశౌర్యకథాసక్తా స్తస్మిన్సైన్యే మహాసురాః | తద్బలం దైత్యసింహస్య భీమరూపమజాయత. 56

ప్రమత్తచణ్డమాతఙ్గం ప్రమత్తరథిసఙ్కులమ్‌ | ప్రతస్థే7మరయుద్ధాయ బహుపత్తిపతాకి తత్‌. 57

ఏతస్మిన్నన్తరే వాయు ర్దేవదూతో7మ్బరాలయః | దృష్ట్వాతు దానవబలం జగామేన్ద్రస్య శంసితుమ్‌. 58

తారకయుద్ధ సన్నాహ విజ్ఞాపనాయ వాయోరిన్ద్రసభా ప్రవేశః.

స గత్వాతు సభాం దివ్యాం మహేన్ద్రస్య మహాత్మనః | అశంసన్మధ్యేదేవానా మిదం కార్య ముపస్థితమ్‌. 59

తచ్ఛ్రుత్వా దేవరాజస్తు నిమీలితవిలోచనః | బృహస్పతిమువాచేదం వాక్యం కాలే మహభుజః. 60

ఇన్ద్రః: సమ్ప్రాప్తోతివిమర్దోయం దేవానాం దానవై స్సహ |

కార్యంకిమత్ర తద్బ్రూహి ఇత్యుపాయ సమన్వితమ్‌. 61

ఏతచ్ఛ్రుత్వాతు వచనం మహేన్ద్రస్య మహాత్మనః | ఇత్యువాచ మహాభాగో బృహస్పతి రుదారధీః. 62

మథనుడను దైత్యేంద్రుడు పాశహస్తుడై ప్రకాశించెను. జంభకుడు చిరుగంట రాసుల మాలలుగల ఒంటె నెక్కెను. శుంభ దానవుడు నల్లని తెల్లని పెద్దగొర్రె పొట్టేలు నెక్కెను. ఇతరులగు దానవ వీరులును నానా వాహన గాములయి భయంకర చిత్రకృత్యములు చేయుచు కవచములు దాల్చి కుండలములు తలపాగలు సొమ్ములుగా నానా విధోత్తరీయములతో నానామాల్య విభూషణములతో నానా సుగంధములతో నానాస్తోత్ర పాఠకుల స్తోత్త్రములతో నానా వాద్యముల మ్రోతలతో మహారథులు తమముందు నడువగా నానా వీరాలాపములాడుచు- ఇట్లా మహాసురులు ఆ సేన యందుండిరి. ఇట్లా దైత్యసింహుడగు తారకుని సేన భయంకర రూపముతో ఒప్పెను. అది భయంకరములగు మదపుటేనుగులతో ప్రమత్తులగు రథికులతో సంకులమయి అనేక పదాతులతో జెండాలతో దేవతలతో యుద్ధమునకు బయలు దేరెను.

ఇంతలో దేవదూతయగు వాయువు అంతరిక్ష ప్రదేశమందుండి దానవ బలమును చూచి ఇంద్రునకు తెలుపుటకు పోయెను. అతడు మహాత్ముడగు ఇంద్రుని దివ్య సభకు పోయి దేవతల నడుమ ఉన్న అతనితో ఈ యుద్ధము సంప్రాప్తించినమాట తెలిపెను. అది విని మహాభుజుడగు దేవరాజు కనులు మూసికొని (ఆలోచించి) తగిన సమయమున బృహస్పతితో ఇట్లనెను: దేవతలకు దానవులతో ఈ మహాయుద్ధము వచ్చిపడినదిగదా! ఇందు నీత్యుపాయముతో కూడిన కార్యము ఏదియో తెలుపుము. మహేంద్రుని ఈ వచనము విని వాక్పతియు మహాబుద్ధిశాలియు అగు మహాభాగుడు బృహస్పతి ఇట్లనెను:

ఇన్ద్రస్య బృహస్పతి కృత సామాద్యుపాయ వ్యవస్థా.

బృహస్పతిః: సామపూర్వా స్మృతానీతి శ్చతురఙ్గాపతాకినీ | జిగీషతా సురశ్రేష్ఠ స్థితిరేషా సనాతనీ. 63

సామభేదౌ తథా దానం దణ్డశ్చాఙ్గచతుష్టయమ్‌ | నీతౌ క్రమాద్దేశకాలం రిపుయోగ్యక్రమాదిదమ్‌. 64

నసాంత్వగోచరో లుబ్ధః క్రూరో లుబ్ధసమాశ్రయః | సన్తాపితబలోజాతిసాధితోభ్రష్టసంశ్రయః. 65

సామ దైత్యేషువై నాస్తి యతస్తే లుబ్ధసంశ్రయాః | దానధర్మేణచాభేద్యా దానంప్రాప్తశ్రియేచ కిమ్‌. 66

ఏకోహ్యుపాయో దణ్డోస్తి భవతాం యది మన్యతే | దుర్జనేషుకృతం సామ మహత్వానిచబద్ధ(?)తామ్‌. 67

భయాదితి వ్యవస్యన్తే క్రూరా స్సామ మహాత్మనామ్‌ | ఋజుతా మార్జబుద్ధిత్వందయాం నీతివ్యతిక్రమమ్‌. 68

మన్యన్తేదుర్జనానిత్యం సామచారిభయోదయాత్‌ | తస్మా ద్దుర్జన మాక్రాన్త శ్శ్రేయా న్పౌరుషసంశ్రయః. 69

ఆక్రాన్తేతు క్రియాయుక్త స్సత్యమేత న్మహావ్రత | దుర్జనస్సుజనత్వాయ కల్పతే న కదాచన. 70

సుజనోపి స్వభావస్య యోగమిచ్ఛే న్న కర్హిచిత్‌ | ఏవంమే విద్యతే బుద్ధి ర్భవన్తో నావ్యవస్థితాః. 71

ఏవముక్త స్సహస్రాక్ష ఏవమేవేత్యువాచహ | కర్తవ్యతాం స వై చిన్త్య ప్రోవాచామరసంసది. 72

ఇన్ద్రః : సావధానేన మే వాచం శృణుధ్వం నాకవాసినః | భవన్తో యజ్ఞభోకార్త స్త్సుత్యాత్మానో7తిసాత్వ్వికాః.

స్వమహిమ్ని స్థితా నిత్యం జగతః పాలనే రతాః | భవతాంచ నిమిత్తేన వధ్యన్తే దానవైస్సురాః. 74

తేషాం సామ నచైవాస్తి దణ్డఏవ విధీయతామ్‌ | సమన్తాచ్చ తథోద్యోగం సైన్యం సంయోజ్యతాం మమ. 75

ఆద్రియన్తాంచ శస్త్రాణి యుజ్యతామస్త్రదైవతమ్‌ | అహతానితు వర్మాణి యోజయస్తు మమామరాః. 76

యమం సేనాపతింకృత్వా శీఘ్రమేవ దివౌకసః |

సేన చతురంగమయినట్లే నీతికిని చతురంగములు కలవు. సురశ్రేష్ఠా! జయము కోరువారికి ఈ చతుర్విధ నీతి సనాతనమయినది. సామదాన బేధదండములు అనునవి ఆ నాల్గు నిత్యంగములు. దేశకాల శత్రువులను బట్టి క్రమముగా వీనిని ప్రయోగించవలెను. బలమగు ఆశ్రయము కలవారు కావున దైత్యులందు సామము పనికిరాదు. జాతి ధర్మము చేతనే వారు భేదమునకు లొంగరు. ధనవంతులయందు దానమేమి ఉపయోగించును? మీకిష్టమయినచో దండోపాయము మాత్రమే ఇక మిగిలియున్నది. అదియుకాక సామోపాయము గొప్పదేకాని దుర్జనుల విషయమున మనము అది ప్రయోగించి నింద పొందుదుము. మహాత్ములు ప్రయోగించిన సామమును క్రూరులు ఇది భయముచేత అని తలంతురు. ఋజుత్వము ఆర్యమగు బుద్ధితో నడుచుట దయ సామము-ఇవి భయముచే చూపు గుణములనియు నీతికి లోపమనియు దుర్జనులనుకొందురు. కావున దుర్జనుల నణగద్రొక్కుటకు పౌరుషమాశ్రయించుటయే మేలు. మనలనే వాడాక్రమించినపుడును ప్రతిక్రియయే మహాకార్యము. దుర్జనుడు ఎన్నడును సుజనుడుకాడు. సుజనుడును తన స్వభావమును ఎన్నడును విడువరాదు. నాకు ఇట్లు తోచుచున్నది. మీరును ఆలోచించుడు.

బృహస్పతి ఇట్లనగా ఇంద్రుడును 'ఇదిఇంతే;' అని తానును కర్తవ్యమాలోచించి సభయందలి దేవతలతో ఇట్లనెను: లోకపాలకులారా! మనము యజ్ఞభాగ భోక్తలము-అతి సాత్త్వికులము; మనమందరమును మన అధికారము లందుండగా దానవేశ్వరులు అనిమిత్తముగా మనలను (దేవతలను) బాధించుచున్నారు. వారి మీద సామాదికము పనికిరాదు. దండమే పూనవలెను. యుద్ధమునకు ఉద్యుక్తులము కావలెను. నాసేనను సంయోజనపరచుడు. శస్త్రములను (స్థానములందు) నిలుపుడు. అస్త్ర దేవతల నారాధించుడు. అమరులారా ! వాహనములను యాన సాధనములను సిద్ధపరచుడు. యముని సేనాపతిగా చేసికొని స్వర్గవాసులారా ! ఇట్లు చేయుడు. అనగానే దేవతలలో ప్రధానులు అందులకయి ఉద్యుక్తులు కాసాగిరి.

తారక విజయాయ ఇన్ద్ర కృతయుద్ధ సన్నాహః.

ఇత్యుక్తా స్సమయుజ్యన్త దేవానాం యే ప్రధానతః. 77

వాజినామయుతేనాజౌ హేమఘణ్టాపరిష్కృతం | నానాశ్చర్యగుణోపేతం సమ్ప్రాప్తం సర్వదైవతైః. 78

రథోమాతలినా77నీతో దేవరాజస్య దుర్జయః | యమో మహిషమాస్థాయ సేనాగ్రే సమవర్తత. 79

చణ్డకిఙ్కరబృన్దేన సర్వతః పరివారితః | కల్పకాలోద్ధతజ్వాలాపూరితామ్బరగోచరః. 80

హుతాశో మేషమారూఢ శ్శక్తిహేతివ్యవస్థితః | వవనోఙ్కుశపాణిస్తు విస్తారితమహాజవః. 81

భుజగేన్ద్రరథారూఢో జలేశో భగవాన్త్స్వయమ్‌ | నరయుక్తే రథే దేవో రాక్షసేశో వియచ్చరః. 82

తీక్షణఖడ్గయుతో వీరో భీమ స్సమమవస్థితః | మహాసింహరథో దేవో ధనాధ్యక్షో గదాయుధః. 83

చన్ద్రాదిత్యావశ్వినౌతు తురఙ్గసమధిష్ఠితౌ | వాజిభిన్సహితా స్తస్థు ర్గన్ధర్వా హేమభూషణాః. 84

హేమయుతోత్తరాసఙ్గా శ్చిత్రవర్మకథాయుధాః | నాకపృష్ఠశిఖణ్డాస్తు వైడూర్యమకరధ్వజాః. 85

తథా రక్తోత్తరాసఙ్గా రాక్షసా రక్తమూర్ధజాః | గృధ్రధ్వజా మహావీర్యా నిర్మలాయోవిభూషణాః. 86

ముసలాసిగదాహస్తా రథై శ్చోష్ణీషదంశితాః | మహామేఘరవా నాగా భీమోల్కాశనిహేతయః. 87

యక్షాఃకృష్ణామ్బరధరా భీమబాణధనుర్ధరాః | తమ్రోలూకధ్వజా రౌద్రా హేమరత్నవిభూషణాః. 88

ద్వీపిచర్మోత్తరాసఙ్గం పిశాచబలమాబభౌ | గార్ధ్రపత్రధ్వజప్రాయ మస్థి భూషణభూషితమ్‌. 89

ముసలాయుధదుష్ప్రేక్ష్యం నానాప్రాణిమహారథమ్‌ | కిన్నరాఃశ్వేతవసనా స్సితపత్రిపతాకినః. 90

మత్తేభవాహనప్రాయా స్తీక్షణతోమరహేతయః | ముక్తాజాలపరిష్కారో హంసో రజతనిర్మితః. 91

మాతలి పదివేల గుర్రములను పూన్చిన ఇంద్ర రథము సిద్దపరచి తెచ్చెను. దానికి బంగరు గంటలు అలంకరించబడెను. అది ఆశ్చర్యకర నానా లక్షణములతో నుండెను. సర్వదేవతలు దాని వెంటనుండిరి. దానినెవరును జయింపజాలరు. యముడు మహిషమెక్కి సేనకు ముందుండెను. అతని చుట్టును చండులగు కింకరుల బృందముండెను. అతని వస్త్రములును కనులును ఉద్ధత ప్రళయకాలాగ్ని జ్వాలలవలె నుండెను. అగ్నియు శక్తి ఆయుధముగా దాల్చి మేషము నెక్కెను. వాయువు విస్తార మహావేగముగల లేడినెక్కి అంకుశము ధరించెను. వరుణ భగవానుడు సర్పములు పూంచిన రథమారోహించెను. ఆకాశగామియగు నిరృతి మనుజులులాగు రథమెక్కెను. ధనాధిపుడగు కుబేరుడు తీక్షణఖడ్గమును గదను దాల్చి భయంకరవీరుడుగా మహా సింహరథమును కూర్చుండెను. చంద్రసూర్యులు అశ్విదేవతలు అశ్వములనెక్కి నిలిచిరి. గంధర్వులు బంగరు సొమ్ములుదాల్చి బంగరు అంచుల ఉత్తరాయములు ధరించి చిత్రములగు కవచములు రథములు ఆయుధములు కలవారయి బంగరుతో జుట్టుల నలంకరించుకొని వైదూర్యములతో చేసిన మకరముల ధ్వజములతో నుండిరి. రాక్షసులు ఎర్రని ఉత్తరీయములు దాల్చి ఎర్రని కేశములతో గ్రద్దలు ధ్వజములుగా ఇనుప సొమ్ములు ధరించియు మహావీర్యులు నిర్మలులు నయియుండిరి. నాగులు ముసల ఖడ్గ గదలాయుధములుగా హస్తముల దాల్చి తలపాగలు కవచములు ధరించి రథముల నారోహించి మహామేఘధ్వనులతో మహోల్కలు పిడుగులు ఆయుధములుగా నుండిరి. యక్షులు నల్లని వస్త్రములు దాల్చి భయంకర బాణ ధనుర్ధరులయి రాగి గ్రుడ్లగూబలు ధ్వజములుగా బంగరు సొమ్ములు దాల్చియు భయంకరులై యుండిరి. చిరుతపులుల చర్మములు త్తరీయములుగా పిశాచబలముండెను. వారిలో చాలమందికి గ్రద్దల ఈకలు ధ్వజములు-ఎముకలు సొమ్ములు-గా ఉండెను. ఆసేన ముసలాద్యాయుధములతో నానా ప్రాణులతో చూడరానంత భయంకరముగా నుండెను.

కిన్నరులకు వస్త్రములు తెల్లనివి; తెల్లని పక్షులు వారి పతాకములందుండెను. వారిలో చాలమందికి వాహనములు మత్తేభములు. వారి ఆయుధములు వాడితోమరములు; ముత్తెముల జాలరులతో అలంకరించబడిన వెండిహంసలు వారి ధ్వజములందుండెను.

కేతుర్‌ జలాధినాధస్య భీమ రూపధ్వజానలః | పద్మరాగమహారత్నవిటపం ధనదస్యతు. 92

ధ్వజం సముచ్ఛ్రితం భాతి గన్తుకామమివామ్బరమ్‌ | వృకేణ కార్షలోహేన యమస్యాభూ న్మహాధ్వజమ్‌. 93

రాక్షసేశస్య వదనం ప్రేతస్య ధ్వజమాబభౌ | హేమహంసధ్వజౌ దేవౌ చన్ద్రార్కా వమితుద్యుతీ. 94

కుమ్భేన రక్తచిత్రేణ కేతురశ్వినయోరభూత్‌ | మాతఙ్గం హేమరచితం చిత్రరత్నపరిష్కృతమ్‌. 95

ధ్వజంశతక్రతో రాసీ త్సితచామరమణ్డితమ్‌ | సనాగయక్షగన్ధర్వమహోరగనిశాచరా. 96

సేనా సా దేవరాజస్య దుర్జయా భువనత్రయే | కోటయ స్తా స్త్రయస్త్రింశ ద్దైవీదేవనికాయినామ్‌. 97

హిమాచలాభే సితకర్ణచామరే సువర్ణపద్మామలసున్దరప్ర(స)జే |

కృతాభిరామోజ్జ్వలకుఙ్కు రేకపోలలీనాళికదమ్బసఙ్కులే. 98

స్థిత స్తదైరావణనామకుఞ్జరే మహాబల శ్చిత్రవిభూషణామ్భరః |

విశాలవ జ్రాఙ్గవిమానభూషితః ప్రకీర్ణ కర్పూరభూజాగ్రమణ్డలః. 99

సహస్రదృగ్వన్దిసహస్రసంస్తుత స్త్రివిష్టపే7శోభత పాకశాసనః | తురఙ్గమాతఙ్గరథైఘసఙ్కులా సితాతపత్రధ్వజరాజశాలినీ. 100

చమూశ్చ సా దుర్జయప త్తిసంయుతా విభాతి నానాయుధయోధముద్యతా. 101

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురసఙ్గ్రామే బలయోజనం నామ సప్తచత్వారింశదుత్తరశతతమో7ధ్యాయః.

వరుణుని ధ్వజము భయంకరమగు ధూమముతో కూడిన అగ్ని. కుబేరుని ధ్వజము పద్మరాగ మహారత్నముతో చేసిన మొక్క. అది మిగుల ఎత్తయి ఆకాశములోనికి పోగోరుచున్నట్లుండెను. యముని ధ్వజము ఇనుప తోడేలు. నిరృతి ధ్వజము ప్రేతముఖము. రవిచంద్రుల ధ్వజములు అమిత కాంతిగల బంగరు హంసలు. అశ్విదేవతలధ్వజము ఎర్రనిదై వింత వన్నెలు గల కడవ. బంగారుతో చేయబడి మిశ్రితరత్నములతో చేయబడి తెల్లని వింజామరలతో అలంకృతమైన ఏనుగు ఇంద్రుని ధ్వజము. నాగ యక్ష గంధర్వ మహోరగ నిశాచరులతో అమరిన ఆ ఇంద్రసేన త్రిలోకములందును దుర్జయమయి యుండెను. ఆదేవ సేనయందు ముప్పదిమూడుకోట్ల దేవతలునుండిరి.

మంచుకొండవంటిదై తెల్లని కర్ణచామరములు బంగరు తామరలతో కూర్చిన అమల సుందర హారములు ఎర్రని కుంకుమపూవుపూత కపోలములందు క్రీడించు తుమ్మెదల గుంపులు కలిగిన ఐరావతమునందు మహాబలశాలియు చిత్ర వస్త్రాభరణధారియు విశాల వస్త్రపు కిరణములతో ఏర్పడిన వితానము (చాందనీ-అంబారి)తో అలంకృతుడును వ్యాప్తమయిన భుజకీర్తులుగల భుజాగ్రమండలము కలవాడును సహస్రనేత్రుడును వేలకొలదిగా స్తుతిపాఠకులచే సంస్తుతింప బడువాడును అగు పాకశాసనుడు ఇంద్రుడు స్వర్గమునందలి ఎల్లరకంటె మిక్కిలిగా ప్రకాశించెను.

గజతురగ బలరాశితో సంకులమయి శ్వేతచ్ఛత్త్ర ధ్వజ పంక్తితో ప్రకాశించుచు జయింపనలవికాని పదాతులు కలిగి నానాయుధులగు యోధులతో దుస్తరమయి ఆ దేవసేన ప్రకాశించుచుండెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున తారకాసుర వధమున

దేవాసుర సంగ్రామమున బలయోజనమను నూట నలుబది ఏడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters