Siva Maha Puranam-4    Chapters   

అథ నవమో%ధ్యాయః

సృష్టి స్థితి లయములు

మునయ ఊచుః |

కథం జగదిదం కృత్స్నం విధాయ చ నిధాయ చ | ఆజ్ఞయా పరమాం క్రీడాం కరోతి పరమేశ్వరః || 1

కింతత్ర్ప థమసంభూతం కేనేదమఖిలం తతమ్‌ | కేన వా పునరేవేదం గ్రస్యతే పృథుకుక్షిణా || 2

మునులు ఇట్లు పలికిరి -

పరమేశ్వరుడు ఈ జగత్తునంతనూ సృష్టించి తన ఆజ్ఞచే పాలించి, మరల ఉపసంహరించి గొప్ప క్రీడను చేయుచున్నాడు. ఆ విధమెట్టిది? (1) మున్ముందుగా ఏది సృష్టించబడినది? ఈ సర్వము దేనిచే వ్యాప్తమై యున్నది? ఎవడు మరల దీనినంతనూ కబళించి వేయును? వాని పొట్ట చాల పెద్దది అయి ఉండును! (2).

వాయురువాచ |

శక్తిః ప్రథమసంభూతా శాంత్యతీతపదోత్తరా | తతో మాయా తతో% వ్యక్తం శివాచ్ఛక్తిమతః ప్రభోః || 3

శాంత్యతీతపదం శ##క్తేస్తతశ్శాంతిపదం క్రమాత్‌ | తతో విద్యాపదం తస్మాత్ర్ప తిష్ఠాపదసంభవః || 4

నివృత్తిపదముత్పన్నం ప్రతిష్ఠాపదతః క్రమాత్‌ | ఏవముక్తా సమాసేన సృష్టిరీశ్వరచోదితా || 5

ఆనులోమ్యాత్తథైతేషాం ప్రాతిలోమ్యేన సంహృతిః | అస్మాత్పంచపదోద్దిష్టాత్ప రస్స్రష్టా సమిష్యతే || 6

కలాభిః పంచభిర్వ్యాప్తం తస్మాద్విశ్వమిదం జగత్‌ | అవ్యక్తం కారణం యత్తదాత్మనా సమనుష్ఠితమ్‌ || 7

మహదాదివిశేషాంతం సృజతీత్యపి సంమతమ్‌ | కిం తు తత్రాపి కర్తృత్వం నావ్యక్తస్య న చాత్మనః || 8

అచేతనత్వాత్ర్ప కృతేరజ్ఞత్వాత్పురుషస్య చ | ప్రధానపరమాణ్వాది యావత్కించిదచేతనమ్‌ || 9

తత్కర్తృకం స్వయం దృష్టం బుద్ధిమత్కారణం వినా | జగచ్చ కర్తృసాపేక్షం కార్యం సావయవం యతః || 10

తస్మాచ్ఛక్తస్స్వతంత్రో యస్సర్వశక్తిశ్చ సర్వవిత్‌ | అనాదినిధనశ్చాయం మహదైశ్వర్యసంయుతః || 11

స ఏవ జగతః కర్తా మహాదేవో మహేశ్వరః | పాతా హర్తా చ సర్వస్య తతః పృథగనన్వయః || 12

పరిణామః ప్రధానస్య ప్రవృత్తిః పురుషస్య చ | సర్వం సత్యవ్రతసై#్యవ శాసనేన ప్రవర్తతే || 13

వాయువు ఇట్లు పలికెను -

ముందుగా శక్తి ఉద్భవించెను. ఆ తరువాత శాంత్యతీతపదము (శాంతికి అతీతముగా నుండే ధామము) ఉద్భవించెను. తరువాత శక్తితో కూడియున్న ఆ పరమేశ్వరునినుండి మాయ, ఆ తరువాత అవ్యక్తము (వివిధరూపములలో ప్రకటమైన జగత్తుయొక్క బీజరూపము) పుట్టినవి (3). శక్తి నుండి శాంత్యతీతపదము, శాంతిపదము ఆ వరుసలో ప్రకటమైన వి. శాంతిపదమునుండి విద్యాపదము, దానినుండి ప్రతిష్ఠాపదము పుట్టినవి (4). అదే వరుసలో ప్రతిష్ఠాపదమునుండి నివృత్తిపదము పుట్టినది. ఈ విధముగా ఈ శ్వరుని ప్రేరణచే జరిగిన సృష్టి పైనుండి క్రిందికి వరుసలో సంగ్రహముగా చెప్పబడినది. దీనికి విరుద్ధమగు క్రమములో ప్రళయము జరుగును. ఈ అయిదు పదములకంటె ఉత్కృష్టుడగు సృష్టికర్త వీటిచే సూచించబడుచున్నాడు (5, 6). కావున, ఈ జగత్తు అంతయు ఈ అయిదు కళలచే వ్యాప్తమై యున్నది. సర్వకారణమగు ఆ అవ్యక్తము ఆయా రూపములలో తానే పరిణమించి ప్రకటమగుచున్నది (7). మాయాశక్తి మహత్తత్త్వమునుండి మొదలిడి పంచభూతములలోని విశేషగూణముల వరకు సృష్టించునని అంగీకారమే. కాని ప్రకృతి జడమగుట వలన, పురుషుడు అజ్ఞాని యగుట వలన, వాటి సృష్టి విషయములో కర్తృత్వము అవ్యక్తము (ప్రకృతి) నకు గాని, ఆత్మకు గాని లేదు. ప్రధానము (ప్రకృతి) నుండి పరమాణువుల వరకు సర్వము జడము. చైతన్యరూపమగు కారణము లేనిదే వాటియందు స్వయముగా కర్తృత్వము పొసగదు. జగత్తు కార్యము (పుట్టుక గలది), మరియు అవయములు గలది. కావున, దానికి కర్త ఒకడు అపేక్షించబడు చున్నాడు (8-10) . కావున, శక్తితో కూడియున్నవాడు, స్వతంత్రుడు, సకలశక్తులు గలవాడు, సర్వము తెలిసినవాడు, ఆది-అంతములు లేనివాడు, గొప్ప ఈశ్వరభావము గలవాడు (11), మహాదేవుడు అగు ఆ మహేశ్వరుడే జగత్తును అంతనూ సృష్టించి, పాలించి, సంహరించుచున్నాడు. ఆయన జగత్తుకంటె విలక్షణుడై, కేవలము మిథ్యారూపమగు జగత్తునకు అధిష్ఠానమై యున్నాడు (12). ప్రకృతి యొక్క పరిణామము, మరియు పురుషుని ప్రవృత్తి సత్యసంకల్పుడగు పరమేశ్వరుని శాసనము వలన మాత్రమే సంభవమగుచున్నవి (13).

ఇతీయం శాశ్వతీ నిష్ఠా సతాం మనసి వర్తతే | న చైనం పక్షమాశ్రిత్య వర్తతే స్వల్ప చేతనః || 14

యావదాదిసమారంభో యావద్యః ప్రలయో మహాన్‌ | తావదప్యేతి సకలం బ్రహ్మణశ్శరదాం శతమ్‌ || 15

పరమిత్యాయుషో నామ బ్రహ్మణో%వ్యక్తజన్మనః | తత్పరాఖ్యం తదర్ధం చ పరార్ధమభిధీయతే || 16

పరార్ధద్వయకాలాంతే ప్రలయే సముపస్థితే | అవ్యక్తమాత్మనః కార్యమాదాయాత్మని

తిష్ఠతి || 17

ఆత్మన్యవస్థితే%వ్యక్తే వికారే ప్రతిసంహృతే | సాధర్మ్యేణాధితిష్ఠేతే ప్రధానపురుషావుభౌ || 18

తమస్సత్త్వగుణావేతౌ సమత్వేన వ్యవస్థితౌ | అనుద్రిక్తావనంతౌ తావోతప్రోతౌ పరస్పరమ్‌ || 19

గుణసామ్యే తదా తస్మిన్న విభాగే తమోదయే | శాంతవాతైకనీరే చ న ప్రాజ్ఞాయత కించన || 20

అప్రజ్ఞాతే జగత్యస్మిన్‌ ఏక ఏవ మహేశ్వరః | ఉపాస్య రజనీం కృత్స్నాం పరాం మాహేశ్వరీం తతః || 21

ప్రభాతాయాం తు శర్వర్యాం ప్రధానపురుషావుభౌ | ప్రవిశ్య క్షోభయమాస మాయాయోగాన్మ హేశ్వరః || 22

తతః పునరశేషాణాం భూతానాం ప్రభవాప్యయాత్‌ | అవ్యక్తాదభవత్సృష్టిరాజ్ఞయా పరమేష్ఠినః || 23

విశ్వోత్తరోత్తరవిచిత్రమనోరథస్య యసై#్యకశక్తిశకలే సకలస్సమాప్తః |

ఆత్మానమధ్వపతిమధ్వవిదో వదంతి తసై#్మ నమస్సకలలోకవిలక్షణాయ || 24

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే సృష్టిక్రమవర్ణనం నామ నవమో%ధ్యాయః (9).

సత్పురుషుల మనస్సులో ఈ రకమగు నిష్ఠ (జ్ఞానమునందు నిలకడ) స్థిరముగా నుండును. కాని అల్పమగు ప్రజ్ఞగల వ్యక్తి ఈ పక్షమునాశ్రయించి ఉండడు (14). సృష్టి ఆరంభ##మై, తరువాత గొప్ప ప్రలయము వచ్చుసరికి బ్రహ్మగారి వంద సంవత్సరముల ఆయుర్దాయము అంతయు గడచిపోవును (15). అవ్యక్తమునుండి జన్మించిన బ్రహ్మగారి ఆయుర్దాయమునకు పరము అని పేరు. ఆ పరములో సగము కాలమునకు పరార్ధము అని పేరు (16). రెండు పరార్ధముల కాలము గడచిన తరువాత ప్రలయము వచ్చును. అపుడు అవ్యక్తప్రకృతి తననుండి పుట్టిన జగత్తును తనలోనికి ఉపసంహరించుకొని యుండును (17). అవ్యక్తము తననుండి పుట్టిన జగత్తును ఉపసంహరించి తన రూపములో నిలిచియుండగా, ప్రధానపురుషులిద్దరు సమానధర్మము గలవారై యుందురు (18). తమస్సు, సత్త్వము అనే గుణములు గల వినాశము లేని వీరిద్దరు సంక్షోభము (గుణముల పాళ్లలో మార్పు) లేని సామ్యావస్థలో ఒకరితోనొకరు పడుగు పేకవలె పెనవేసుకొని యుందురు (19). గుణముల సామ్యావస్థ గలది, విభాగములు లేనిది, చీకటితో నిండియున్నది, ప్రకృతి అంతయు ఉపశమించియున్నది, జలముల (చైతన్యము) లో కదలిక లేనిది అగు ఆ సమయములో ఏదియు విశిష్టముగా తెలియబడదు (20). జగత్తు అవ్యక్తములో విలీనమై యున్న ఈ సమయములో మహేశ్వరుడొక్కడే రాత్రి అంతయు సర్వజగత్తుకంటె ఉత్కృష్టమగు మహేశ్వరశక్తిని ఉపాసించి, తరువాత (21) రాత్రి తెల్లవారిన తరువాత ప్రధానపురుషులిద్దరియందు ప్రవేశించి, ఆ మహేశ్వరుడు మాయాసంబంధముచే వాటియందు సంక్షోభమును కలిగించును (22). అప్పుడు మరల పరమేశ్వరుని ఆజ్ఞచే సృష్టిలయములకు నిధానమగు అవ్యక్తప్రకృతినుండి సకల ప్రాణుల సృష్టి జరుగును (23). విశ్వమునకు అతీతమగు ప్రకృతికంటె అతీతుడు, విచిత్రమగు సంకల్పశక్తి గలవాడు. సగలజగత్తులకంటె విలక్షణమైనవాడు (అధిష్ఠానమగుచున్ననూ జగద్ధర్మములతో సంపర్కము లేనివాడు) అగు ఆ పరమేశ్వరునకు నమస్కారము. ఆయనయొక్క శక్తిలోని చిన్న అంశములో సర్వజగత్తు సమాప్తమగుచున్నది. మోక్షమార్గమును గురించి తెలిసిన జ్ఞానులు మోక్షమార్గమునకు ప్రభువు అగు ఆ ఈశ్వరుని ఆత్మరూపునిగా వర్ణించుచున్నారు (24).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో సృష్టిస్థితిలయములను వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Siva Maha Puranam-4    Chapters