Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకపంచాశత్తమో%ధ్యాయః

యోగ నిరూపణము

మునయ ఊచుః |

వ్యాసశిష్య మహాభాగ సూత పౌరాణికోత్తమ | అపరం శ్రోతుమిచ్ఛామః కిమప్యాఖ్యానమీశతుః || 1

ఉమయా జగదంబాయాః క్రియాయోగమనుత్తమమ్‌ | ప్రోక్తం సనత్కుమారేణ వ్యాసాయ చ మహాత్మనే || 2

మునులు ఇట్లు పలికిరి -

ఓ వ్యాసశిష్యా! మహాత్మా ! సూతా! నీవు పురాణములను చెప్పువారిలో ఉత్తముడవు. ఈశ్వరుని మరియొక గాథను దేనినైననూ మేము వినగోరుచున్నాము (1). సనత్కుమారుడు మహాత్ముడగు వ్యాసునకు జగన్మాతయగు ఉమాదేవియొక్క సర్వశ్రేష్ఠమగు క్రియాయోగమును గురించి చెప్పియున్నాడు (2).

సూత ఉవాచ |

ధన్యా యూయం మహాత్మానో దేవీభక్తి దృఢవ్రతాః | పరాశ##క్తేః పరం గుప్తం రహస్యం శృణుతాదరాత్‌ || 3

సూతుడిట్లు పలికెను -

మహాత్ములు, దేవీ భక్తియందు దృఢమగు నిష్ఠగలవారు అగు మీరు ధన్యులు. పరాశక్తి యొక్క అత్యంతరహస్యమగు ఉపనిషత్‌ జ్ఞానమును గురించి సాదరముగా వినుడు (3).

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ బ్రహ్మపుత్ర మహామతే | ఉమాయాశ్ర్శోతుమిచ్ఛామి క్రియాయోగం మహాద్భుతమ్‌ || 4

కీదృక్చ లక్షణం తస్య కిం కృతే చ ఫలం భ##వేత్‌ | ప్రియం యచ్చ పరాంబాయాస్తదశేషం వదస్వ మే || 5

వ్యాసుడు ఇట్లు పలికెను -

ఓ సనత్కుమారా ! సర్వజ్ఞా ! బ్రహ్మపుత్రుడవగు నీవు మహాబుద్ధిశాలివి. ఉమాదేవియొక్క గొప్ప అద్భుతమగు క్రియాయోగమును నేను వినగోరుచున్నాను (4). దాని లక్షణమెట్టిది ? దాని ఫలమెట్టిది ? జగన్మాతకు ప్రీతిపాత్రమైనది యేది ? ఈ విషయమును నిశ్శేషముగా నాకు చెప్పుడు (5).

సనత్కుమార ఉవాచ |

ద్వైపాయన యదేతత్త్వం రహస్యం పరిపృచ్ఛసి | తచ్ఛృణుష్వ మహాబుద్ధే సర్వం మే వర్ణయిష్యతః || 6

జ్ఞానయోగః క్రియాయోగో భక్తియోగస్తథైవ చ | త్రయో మార్గాస్సమాఖ్యాతాశ్ర్శీమాతుర్భుక్తిముక్తిదాః || 7

జ్ఞానయోగస్తు సంయోగశ్చిత్తసై#్యవాత్మనా తు యః | యస్తు బాహ్యార్థ సంయోగః క్రియాయోగస్స ఉచ్యతే || 8

భక్తియోగో మతో దేవ్యా ఆత్మనశ్చైక్యభావనమ్‌ | త్రయాణామపి యోగానాం క్రియాయోగస్స ఉచ్యతే || 9

కర్మణా జాయతే భక్తిర్భక్త్యా జ్ఞానం ప్రజాయతే | జ్ఞానాత్ర్పజాయతే ముక్తిరితి శాస్త్రేషు నిశ్చయః || 10

ప్రధానం కారణం యోగో విముక్తేర్మునిసత్తమ | క్రియాయోగస్తు యోగస్య పరమం ధ్యేయసాధనమ్‌ || 11

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయావి బ్రహ్మ శాశ్వతమ్‌ | అభిన్నం తద్వపుః జ్ఞాత్వా ముచ్యతే భవబంధనాత్‌ || 12

యస్తు దేవ్యాలయం కుర్యాత్పాషాణం దారవం తథా | మృన్మయం వాథ కాలేయ తస్య పుణ్యఫలం శృణు |

అహన్యహని యోగేన జయతో యన్మహాఫలమ్‌ || 13

ప్రాప్నోతి తత్ఫలం దేవ్యా యః కారయతి మందిరమ్‌ | సహస్రకులమాగామి వ్యతీతం చ సహస్రకమ్‌ |

సతారయతి ధర్మాత్మా శ్రీ మాతుర్ధామ కారయన్‌ || 14

కోటిజన్మకృతం పాపం స్వల్పం వా యది వా బహు | శ్రీ మాతుర్మందిరారంభక్షణాదేవ ప్రణశ్యతి || 15

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ వ్యాసా ! నీవు మహాబుద్ధిశాలివి. నీవు ప్రశ్నించిన రహస్యమునంతనూ నేను వర్ణించెదను. వినుము (6). శ్రీ మాతను చేరే మార్గములు మూడు అనియు, అవి జ్ఞాన-కర్మ-భక్తి యోగములనియు, అవి భుక్తిని మరియు ముక్తిని ఇచ్చుననియు చెప్పబడినది (7). మనస్సు ఆత్మతో కలియుట జ్ఞానయోగమనియు, బాహ్యవస్తువులతో కలియుట క్రియాయోగమనియు చెప్పబడుచున్నది (8). దేవికి, ఆత్మకు ఐక్యమును భావన చేయుట భక్తి యోగమనబడును. ఈ మూడు యోగములలో క్రియోయోగమును నేనిప్పుడు చెప్పుచున్నాను (9). కర్మ వలన భక్తి పుట్టును. భక్తిచే జ్ఞానము కలుగును. జ్ఞానము వలన ముక్తి కలుగునని శాస్త్రములు నిశ్చయించుచున్నవి (10). ఓ మహర్షీ ! మోక్షమునకు ప్రధానహేతువు యోగము. యోగముయొక్క ధ్యేయమును పొందుటకు క్రియాయోగము సర్వోత్తమమగు సాధనము (11). సర్వజగత్కారణము మాయ. ఆ మాయను వశము చేసుకొని యున్న శాశ్వత తత్త్వము బ్రహ్మ. ఆ దేవియొక్క రూపము బ్రహ్మ కంటె భిన్నము కాదని తెలుసుకున్నవాడు సంసారబంధమునుండి విముక్తుడగును (12). ఓ వ్యాసా ! రాళ్లతో గాని, చెక్కలతో గాని, మట్టితో నైననూ దేవియొక్క ఆలయమును నిర్మించువానికి లభించే పుణ్యఫలమును వినుము. దేవీ మందిరమును నిర్మించే ధర్మాత్ముడు గడచిన వేయి తరములను, రాబోయే వేయి తరములను తరింపజేయును (13, 14). శ్రీ మాతయొక్క మందిరమును కట్టుట ఆరంభించిన క్షణములో, కోటి జన్మలలో చేసి పాపము అల్పము గాని, అధికము గాని నిశ్చితముగా పూర్ణముగా నశించును (15).

నదీషు చ యథా గంగా శోణస్సర్వనదేషు వా | క్షమాయాం చ యథా పృథ్వీ గాంభీర్యే చ యథోదధిః || 16

గ్రహాణాం చ సమస్తానాం యథా సూర్యో విశిష్యతే | తథా సర్వేషు దేవేషు శ్రీపరాంబా విశిష్యతే || 17

సర్వదేవేషు సా ముఖ్యా యస్తస్యాః కారయేద్గృహమ్‌ | ప్రతిష్ఠాం సమవాప్నోతి స చ జన్మని జన్మని || 18

వారాణస్యాం కురుక్షేత్రే ప్రయాగే పుష్కరేతథా | గంగాసముద్రతీరే చ నైమిషే% మరకంటకే || 19

శ్రీపర్వతే మహాపుణ్య గోకర్ణే జ్ఞానపర్వతే | మథురాయామయోధ్యాయాం ద్వారావత్యాం తథైవ చ || 20

ఇత్యాది పుణ్యదేశేషు యత్ర కుత్ర స్థలే%పి వా | కారయన్మాతురావాసం ముక్తో భవతి బంధనాత్‌ || 21

ఇష్టకానాం తు విన్యాసో యావద్వర్షాణి తిష్ఠతి | తావద్వర్షసహస్రాణి మణిద్వీపే మహీయతే || 22

ప్రతిమాః కారయేద్యస్తు సర్వలక్షణలక్షితాః | స ఉమాయాః పరం లోకం నిర్భయో వ్రజతి ధ్రువమ్‌ || 23

దేవీమూర్తిం ప్రతిష్ఠాప్య శుభర్తుగ్రహతారకే | కృతకృత్యో భ##వేన్మర్త్యో యోగమాయాప్రసాదతః || 24

యే భవిష్యంతి యే%తీతా ఆకల్పాత్పురుషాః కులే | తాంస్తాంస్తారయతే దేవ్యా మూర్తిం సంస్థాప్య శోభనామ్‌ || 25

త్రిలోకే స్థాపనాత్పుణ్యం యద్భవేన్మునిపుంగవ | తత్కోటి గుణితం పుణ్యం శ్రీ దేవీస్థాపనాద్భవేత్‌ || 26

నదులలో గంగవలె, పశ్చిమ వాహినులగు నదములన్నింటిలో శోణము వలె, క్షమ గలవాటిలో పృథివి వలె, లోతైన సరస్సులలో సముద్రము వలె (16), గ్రహములన్నింటిలో సూర్యుని వలె, దేవతలందరిలో శ్రీ పరాంబ ఉత్కృష్టురాలు (17). ఆమె దేవతలందరిలో ముఖ్యురాలు. ఆమెకు దేవళమును కట్టించు వ్యక్తి జన్మ జన్మలలో ప్రతిష్ఠను పొందును (18). వారాణసి, కురుక్షేత్రము, ప్రయాగ, పుష్కరము, శ్రీశైలము, గొప్ప పవిత్రమగు గోకర్ణము, జ్ఞాన పర్వతము, మథుర, అయోధ్య, ద్వారావతి మొదలైన పుణ్యతీర్థములలో గాని, లేదా ఏదో ఒక స్థలములో గాని తల్లికి ఆలయమును కట్టించువాడు బంధ విముక్తుడగును (19-21). ఆలయములో ఇటుకల అమరిక ఎన్ని ఏళ్లు నిలబడి యుండునో, అన్ని వేల సంవత్సరములు ఆలయనిర్మాత మణిద్వీపములో మహిమను గాంచును (22). సర్వశుభలక్షణములతో కూడియున్న దేవీ ప్రతిమలను ఎవడు చేయించునో, వాడు నిర్భయుడై నిశ్చయముగా శ్రేష్ఠమగు ఉమా లోకమును పొందును (23). శుభకరమగు ఋతువులో మంచి లగ్నములో శుభ నక్షత్రములో దేవీ మూర్తిని ప్రతిష్ఠించే మానవుడు ఆ యోగమాయయొక్క అనుగ్రహముచే కృతార్ధుడగును (24). సుందరమగు దేవీ మూర్తిని స్థాపించు వ్యక్తి కల్పాదినుండి ఆ కులములో గడచిన తరముల వారందరిని, మరియు రాబోవు తరముల వారందరినీ తరింప జేయును (25). ఓ మహర్షీ ! ముల్లోకములను సృష్టించుట వలన కలిగే పుణ్యమునకు కోటి రెట్లు పుణ్యము శ్రీదేవీ ప్రతిష్ఠ వలన కలుగును (26).

మధ్యే దేవీం స్థాపయిత్వా పంచాయతన దేవతాః | చతుర్దిక్షు స్థాపయేద్యస్తస్య పుణ్యం న గణ్యతే || 27

విష్ణోర్నామ్నాం కోటిజపాద్గ్రహణ చంద్ర సూర్యయోః | యత్ఫలం లభ్యతే తస్మాచ్ఛతకోటి గుణోత్తరమ్‌ || 28

శివనామ్నో జపాదేవ తస్మాత్కోటి గుణోత్తరమ్‌ | శ్రీదేవీ నామజపాత్తు తతః కోటిగుణోత్తరమ్‌ || 29

దేవ్యాః ప్రాసాదకరణాత్పుణ్యం తు సమవాప్యతే | స్థాపితా యేన సా దేవీ జగన్మాతా త్రయీమయీ || 30

న తస్య దుర్లభం కించిచ్ఛ్రీమాతుః కరుణావశాత్‌ | వర్థంతే పుత్ర పౌత్రాద్యా నశ్యత్యఖిల కశ్మలమ్‌ || 31

మనసా యే చికీర్షంతి మూర్తి స్థాపనముత్తమమ్‌ | తేత్యుమాయాః పరం లోకం ప్రయాంతి మునిదుర్లభమ్‌ || 32

క్రియమాణం తు యః ప్రేక్ష్య చేతసా హ్యనుచింతయేత్‌ | కారయిష్యామ్యహం యర్హి సంపన్మే సంభవిష్యతి || 33

ఏవం తస్య కులం సద్యోయాతి స్వర్గం న సంశయః | మహామాయాప్రభావేణ దుర్లభం కిం జగత్త్ర యే || 34

శ్రీ పరాంబాం జగద్యోనిం కేవలం యే సమాశ్రితాః | తే మనుష్యా న మంతవ్యాస్సాక్షాద్దేవీగణాశ్చ తే || 35

యే వ్రజంతస్స్వపంతశ్చ తిష్ఠంతో వాప్యహర్నిశమ్‌ | ఉమేతి ద్వ్యక్షరం నామ బ్రువతే తే శివా గణాః || 36

నిత్యే నైమిత్తికే దేవీం యే యజంతి పరాం శివామ్‌ | పుషై#్పర్ధూపైస్తథా దీపైస్తే ప్రయాస్యంత్యుమాలయమ్‌ || 37

ఎవడైతే మధ్యలో దేవిని స్థాపించి నాల్గు దిక్కులయందు ఇతరపంచాయతన దేవతలను (శివ విష్ణు సూర్య గణపతులు ) స్థాపించునో, వాని పుణ్యమునకు గణన లేదు (27). చంద్రసూర్య గ్రహణ సమయములలో కోటి విష్ణునామములను జపించుట వలన ఏ ఫలము లభించునో, శివనామ జపమాత్రముచే దానికి వంద కోట్ల రెట్లు ఫలము లభించును. శ్రీదేవీ నామమను జపించుట వలన దానికి కోటి రెట్లు. దేవీ ఆలయమును నిర్మించుట వలన దానికి కోటి రెట్లు పుణ్యఫలము లభించును. వేద స్వరూపురాలు, జగన్మాత అగు ఆ దేవిని స్థాపించిన వానికి ఆ శ్రీమాతయొక్క కరుణా ప్రభావముచే దుర్లభ##మైనది ఏదీ ఉండదు. వానికి పుత్రపౌత్రాదులు వృద్ధిలోనికి వచ్చెదరు. వాని పాపములన్నియు నశించును (28-31). ఎవరైతే ఉమాదేవియొక్క ఉత్తమమగు మూర్తిని స్థాపించవలెనని మనస్సులో కోరుకొనెదరో, వారు మునులకు కూడ దుర్లభ##మైన, శ్రేష్ఠమగు ఉమాలోకమును పొందెదరు (32). దేవాలయ నిర్మాణము జరుగుచుండగా చూచి, ఎవడైతే తన మనస్సులో, 'నేను కూడ ఇట్టి నిర్మాణమును చేయించెదను; అపుడు నాకు సంపద లభించగలదు' అని తలపోయునో (33), వాని కులము వారు నిస్సందేహముగా స్వర్గమును పొందెదరు. మహామాయయొక్క ప్రభావముచే ముల్లోకములలో దుర్లభ##మైనది యేది గలదు ? (34) జగత్కారణమగు శ్రీ పరాంబను మాత్రమే ఎవరు ఆశ్రయించెదరో, వారు సామాన్యమానవులు అని తలంచరాదు. వారు సాక్షాత్తుగా దేవీ గణములే (35). ఎవరైతే నడుస్తూ, నిద్రిస్తూ, లేదా నిలబడి గాని రాత్రింబగళ్లు 'ఉమ' అనే రెండు అక్షరముల నామమును పలికెదరో వారు దేవీ గణములు అగుదురు (36). ఎవరైతే నిత్యనైమిత్తిక కర్మలలో సర్వోత్కృష్టురాలగు శివాదేవిని పుష్పములతో, మరియు ధూపదీపములతో ఆరాధించెదరో, వారు ఉమాలోకమును పొందగలరు (37).

యే దేవీమండపం నిత్యం గోమయేన మృదాథ వా | ఉపలింపంతి మార్జంతి తే ప్రయాస్యంత్యుమాలయమ్‌ || 38

యైర్దేవ్యా మందిరం రమ్యం నిర్మాపితమనుత్తమన్‌ | తత్కులీనాన్‌ జనాన్మాతా హ్యాశిషస్సంప్రయచ్ఛతి || 39

మదీయాశ్శతవర్షాణి జీవంతు ప్రేమభాగ్జనాః | నాపదామయనానీత్థం శ్రీమాతా వక్త్యహర్నిశమ్‌ || 40

యేన మూర్తిర్మహాదేవ్యా ఉమాయాః కారితా శుభా | నరాయుతం తత్కులజం మణిద్వీపే మహీయతే || 41

స్థాపయిత్వా మహామాయామూర్తిం సమ్యక్‌ ప్రపూజ్య చ | యం యం ప్రార్థయతే కామం తం తం ప్రాప్నోతి సాధకః || 42

యస్స్నాపయతి శ్రీమాతుస్థ్సా పితాం మూర్తిముత్తమామ్‌ | ఘృతేన మధునాక్తేన తత్ఫలం గణయేత్తు కః || 43

చందనాగురు కర్పూరమాంసీ ముస్తాదియుగ్జలైః | ఏకవర్ణగవాం క్షీరైస్స్నా పయేత్పరమేశ్వరీమ్‌ || 44

ధూపేనాష్టాదశాంగేన దద్యాదాహుతిముత్తమామ్‌ | నీరాజనం చరేద్దే వ్యాస్సాజ్యకర్పూరవర్తిభిః || 45

కృష్ణాష్టమ్యాం నవమ్యాం వామాయాం వా పంచదిక్తిథౌ | పూజయేజ్జగతాం ధాత్రీం గంధపుషై#్పర్విశేషతః || 46

సంపఠన్‌ జననీసూక్తం శ్రీ సూక్తమథవా పఠన్‌ | దేవీ సూక్తమథో వాపి మూలమంత్రమథాపి వా || 47

విష్ణుక్రాంతాం చ తులసీం వర్జయిత్వాఖిలం సుమమ్‌ | దేవీప్రీతికరం జ్ఞేయం కమలం తు విశేషతః || 48

అర్పయేత్స్వర్ణపుష్పం యో దేవ్యై రాజతమేవ వా | సయాతి పరమం ధామ సిద్ధకోటిభిరన్వితమ్‌ || 49

ఎవరైతే ప్రతిదినము దేవీమండపమును గోమయముతో గాని, మట్టితో గాని అలికి తుడిచెదరో వారు ఉమాలయమును పొందగలరు (38). ఎవరైతే సర్వోత్కృష్టమగు సుందరమైన దేవీ మందిరమును నిర్మించెదరో వారి కులస్థులగు జనులకు ఆ తల్లి ఆశీర్వచనములనిచ్చును (39). నా వారు, నా ప్రేమకు పాత్రులైన జనులు వంద సంవత్సరములు జీవించెదరు గాక ! వారికి ఆపదలు రాకుండు గాక ! అని ఈ విధముగా ఆ శ్రీమాత రాత్రింబగళ్లు పలుకుచుండును (40). ఎవడైతే ఉమాదేవియొక్క శుభకరమగు మూర్తిని చేయించునో, వాని కులమునందు జన్మించిన పదివేల మంది జనులు మణిద్వీపములో మహిమను గాంచెదరు (41). సాధకుడు మహామాయయొక్క మూర్తిని స్థాపించి, దానిని చక్కగా పూజించి ఏయే కోర్కెలనో కోరునో, వాటిని అన్నింటినీ పొందును (42). ఎవడైతే శ్రీమాత యొక్క ఉత్తమమగు మూర్తిని స్థాపించి తేనెను పూసి నేతితో అభిషేకించునో, వానికి లభించు ఫలమును ఎవ్వాడు లెక్క కట్టగల్గును ? (43) చందనము, అగరు, కర్పూరము, మాంసి, ముస్త గడ్డి మొదలైన సుగంధ ద్రవ్యములతో కూడియున్న నీటితో, మరియు ఒకే రంగు గల ఆవు యొక్క పాలతో పరమేశ్వరిని అభిషేకించవలెను (44). పద్ధెనిమిది పదార్ధములను కలిపి తయారు చేసిన ధూపద్రవ్యముతో ఉత్తమమగు ఆహుతినీయవలెను. దేవికి నేయి, కర్పూరము గల వత్తులతో నీరాజనమునీయవలెను (45). కృష్ణ పక్షములోని అష్టమి, నవమి, అమావాస్య, పంచమి, దశమి అను తిథులలో జగన్మాతను గంధముతో, పుష్పములతో విశేషముగా పూజించవలెను (46). రాత్రి సూక్తమును గాని, శ్రీసూక్తమును గాని, దేవీ సూక్తమును గాని చక్కగా పఠించి మూల మంత్రమును జపించవలెను (47). విష్ణుక్రాంతమును, తులసిని మినహాయిస్తే పుష్పములన్నియు దేవికి ప్రీతికరములనియు, కమలమునందు దేవికి విశేషప్రీతి అనియు తెలియదగును (48). ఎవడైతే దేవికి బంగారు పుష్పమును, లేదా వెండి పుష్పమును సమర్పించునో, వాడు కోట్లాది సిద్ధులతో కూడియున్న పరమధామమును పొందును (49).

పూజనాంతే సదా కార్యం దాసైరేనః క్షమాపనమ్‌ | ప్రసీద పరమేశాని జగదానందదాయిని || 50

ఇతి వాక్యైస్త్సు వన్మంత్రీ దేవీభక్తిపరాయణః | ధ్యాయేత్కంఠీరవారూఢాం వరదాభయపాణికామ్‌|| 51

ఇత్థం ధ్యాత్వా మహేశానీం భక్తాభీష్టఫలప్రదామ్‌ | నానా ఫలాని పక్వాని నైవేద్యత్వే ప్రకల్పయేత్‌ || 52

నైవేద్యం భక్ష యేద్యస్తు శంభుశ##క్తేః పరాత్మనః | స నిర్ధూయాఖిలం పంకం నిర్మలో మానవో భ##వేత్‌ || 53

చైత్రశుక్లతృతీయాయాం యో భవానీవ్రతం చరేత్‌ | భవబంధననిర్ముక్తః ప్రాప్నుయాత్పరమం పదమ్‌ || 54

అస్యామేవ తృతీయాయాం కుర్యాద్దోలోత్సవం బుధః | పూజయేజ్జగతాం ధాత్రీముమాం శంకరసంయుతామ్‌ || 55

కుసుమైః కుంకుమైర్వసై#్త్రః కర్పూరాగురుచందనైః | ధూపైర్దీపైస్సనైవేద్యైస్ర్సగ్గంధైరపరైరపి || 56

అందోలయేత్తతో దేవీం మహామాయాం మహేశ్వరీమ్‌ | శ్రీగౌరీం శివసంయుక్తాం సర్వకల్యాణకారిణీమ్‌ || 57

ప్రత్యబ్దం కురుతే యో%స్యాం వ్రత మాందోలనం తథా | నియమేన శివా తసై#్మ సర్వమిష్టం ప్రయచ్ఛతి || 58

మాధవస్య సితే పక్షే తృతీయా యా%క్షయాభిదా |తస్యాం యో జగదంబాయా వ్రతం కుర్యాదతంద్రితః || 59

భక్తులు పూజ అయిన తరువాత సర్వదా అపరాధక్షమాపనమును చెప్పువలెను. ఓ పరమేశ్వరీ ! ప్రసన్నురాలవు కమ్ము. నీవు లోకములకు ఆనందమునిచ్చెదవు (50). దేవీభక్తియందు నిష్ఠగల సాధకుడు ఈ వాక్యములచే స్తుతించి మంత్రమును జపిస్తూ, సింహమునధిష్ఠించి వరద-అభయ ముద్రలను చేతియందు దాల్చిన దేవిని ధ్యానించవలెను (51). భక్తులకు అభీష్టఫలములనిచ్చే మహేశ్వరిని ఈ విధముగా ధ్యానించి పండిన వివిధఫలములను నైవేద్యమిడవలెను (52). ఏ మానవుడైతే పరమాత్మ స్వరూపురాలు, శంభుని శక్తియగు దేవి యొక్క నైవేద్యమును భక్షించునో, ఆతడు సమస్త పాపములను పొగొట్టుకొని నిర్మలుడగును (53). ఎవడైతే చైత్ర శుక్ల తదియనాడు భవానీ వ్రతమును చేయునో, వాడు సంసార బంధమునుండి వినిర్ముక్తుడై పరమపదమును పొందును (54). ఆ తదియనాడే వివేకియగు భక్తుడు శంకరునితో కూడియున్న జగన్మాతయగు ఉమాదేవిని పవళింపు సేవతో ఆరాధించవలెను (55). అపుడు మహామాయ, మహేశ్వరి, శివునితో కూడియున్నది, మంగళముల నన్నింటినీ చేయునది అగు శ్రీ గౌరీదేవికి ధూపదీపనైవేద్యములు, పుష్పమాలలు, గంధము, పుష్పములు, కుంకుమ, వస్త్రములు, కర్పూరము, అగురుబత్తి, చందనము మొదలగు ద్రవ్యములతో పవళింపు సేవను చేయవలెను (56,57). ఎవడైతే ప్రతి సంవత్సరము ఆ తిథినాడు నియమముతో వ్రతమును, పవళింపు సేవను చేయునో, వానికి ఉమాదేవి సకలాభీష్టములనిచ్చును (58). వైశాఖ శుక్ల తదియకు అక్షయతృతీయ అనిపేరు. ఆనాడు సాధకుడు సోమరితనము లేనివాడై జగన్మాత యొక్క వ్రతమును చేయవలెను (59).

మల్లికామాలతీ చంపా జపాబంధూకపంకజైః | కుసుమైః పూజయేద్గౌరీం శంకరేణ సమన్వితామ్‌ || 60

కోటి జన్మకృతం పాపం మనో వాక్కాయసంభవమ్‌ | నిర్ధూయ చతురో వర్గానక్షయానిహ సో%శ్నుతే || 61

జ్యేష్ఠే శుక్లతృతీయాయాం వ్రతం కృత్వా మహేశ్వరీమ్‌ | యో%ర్చయేత్పరమప్రీత్యా తస్యాసాధ్యం న కించన || 62

ఆషాఢశుక్ల పక్షీయ తృతీయాయాం రథోత్సవమ్‌ | దేవ్యాః ప్రియతమం కుర్యాద్యథావిత్తానుసారతః || 63

రథం పృథ్వీం విజానీయాద్రథాంగే చంద్రభాస్కరౌ | వేదానశ్వాన్‌ విజానీయాత్సారథిం పద్మసంభవమ్‌ || 64

నానామణి గణాకీర్ణం పుష్పమాలావిరాజితమ్‌ | ఏవం రథం కల్పయిత్వా తస్మిన్‌ సంస్థాపయేచ్ఛివామ్‌ || 65

లోకసంరక్షణార్థాయ లోకం ద్రష్టుం పరాంబికా | రథమధ్యే సంస్థితేతి భావయేన్మతిమాన్నరః || 66

రథే ప్రచలితే మందం జయశబ్బముదీరయేత్‌ | పాహి దేవి జనానస్మాన్‌ ప్రపన్నాన్‌ దీనవత్సలే || 67

ఇతి వాక్యైస్తోషయేచ్చ నానావాదిత్రనిస్స్వనైః | సీమాంతే తు రథం నీత్వా తత్ర సంపూజయేద్రథే || 68

నానాస్తోత్రైస్తతస్త్సు త్వాస్యానయేత్తాం స్వవేశ్మని | ప్రణిపాతశతం కృత్వా ప్రార్థయేజ్జగదంబికామ్‌ || 69

మల్లెలు, జాజి, సంపెంగలు, దాసాని, మంకెన అనే పుష్పములతో, మరియు పద్మములతో శంకరుని కూడియున్న గౌరిని పూజించవలెను (60). అట్టివాడు మనస్సుతో, వాక్కుతో, దేహముతో కోటిజన్మలలో చేసిన పాపమును తొలగించుకొని, అక్షయములగు ధర్మార్ధకామమోక్షములను ఈ లోకములో పొందును (61). ఎవడైతే జ్యేష్ఠశుక్ల తదియనాడు వ్రతమును పూని మహేశ్వరిని మహానందముతో అర్చించునో, వానికి అసాధ్యము ఏదియు లేదు (62). భక్తుడు తన సంపదకు అనురూపముగా ఆషాఢశుక్ల తదియనాడు దేవికి మిక్కిలి ప్రియమగు రథోత్సవమును చేయవలెను (63). ఆ రథము భూమి అనియు, సూర్యచంద్రులే చక్రములనియు, గుర్రములు వేదములనియు, సారథి బ్రహ్మ అనియు భావన చేయవలెను (64). అనేక మణుల సమూహములతో అంతటా ఆ రథమును అలంకరించి పుష్పమాలలతో విరాజిల్లునట్లు చేసి, దాని యందు ఉమాదేవిని చక్కగా స్థాపించవలెను (65). బుద్ధిమంతుడగు మానవుడు, లోకములను రక్షించే ఉద్దేశ్యముతో ఆ జగన్మాత లోకులను చూచుట కొరకై రథమధ్యమునందు ఉన్నదని భావించవలెను (66). రథము కదలినప్పుడు మెల్లగా జయశబ్దమును పలుకవలెను. 'ఓదేవి! దీనులయందు వాత్సల్యము గల ఓ తల్లీ! నిన్ను శరణు పొందిన ఈ జనులను రక్షింపుము' అను వాక్యములతో దేవిని సంతోషపెట్టవలెను. అనేక వాద్యములను మ్రోగిస్తూ రథమును ఊరి బయట వరకు తీసుకు వెళ్లి అచట రథమునందు చక్కగా పూజించవలెను (67, 68). తరువాత అనేక స్తోత్రములతో ఆ జగన్మాతను స్తుతించి, మరల స్వస్థానమునకు గొనివచ్చి, వంద పర్యాయములు నమస్కరించి, ప్రార్థించవలెను (69).

ఏవం యః కురుతే విద్వాన్‌ పూజావ్రతరథోత్సవమ్‌ | ఇహ భుక్త్వాఖిలాన్‌ సో%ంతే దేవీపదం వ్రజేత్‌ || 70

శుక్లాయాం తు తృతీయాయామేవం శ్రావణభాద్రయోః | యో వ్రతం కురుతే%ంబాయాః పూజనం చ యథావిధి || 71

మోదతే పుత్రపౌత్రాద్యైర్థనాద్వైరిహ సంతతమ్‌ | సో%ంతే గచ్ఛేదుమాలోకం సర్వలోకోపరిస్థితమ్‌ || 72

అశ్వినే ధవలే పక్షే నవరాత్రవ్రతం చరేత్‌ | యత్కృతే సకలాః కామాస్సిద్ధ్యంత్యేవ న సంశయః || 73

నవరాత్రవ్రతస్యాస్య ప్రభావం వక్తుమీశ్వరః | చతురాస్యో న పంచాస్యో న షడాస్యో న కో%పరః || 74

నవరాత్రవ్రతం కృత్వా భూపాలో విరథాత్మజః | హృతం రాజ్యం నిజం లేభే సురథో మునిసత్తమాః || 75

ధ్రువసంధిసుతో ధీమానయోధ్యాధిపతిర్నృపః | సుదర్శనో హృతం రాజ్యం ప్రాపదస్య ప్రభావతః || 76

వ్రతరాజమిమం కృత్వా సమారాధ్య మహేశ్వరీమ్‌ | సంసారబంధనాన్ముక్తస్సమాధిర్ముక్తి భాగభూత్‌ || 77

తృతీయాయాం చ పంచమ్యాం సప్తమ్యామష్టమీతిథౌ | నవమ్యాం వా చతుర్దశ్యాం యో దేవీం పూజయేన్నరః || 78

అశ్వినస్య సితే పక్షే వ్రతం కృత్వా విధానతః | తస్య సర్వం మనోభీష్టం పూరయత్యనిశం శివా || 79

వివేకియగు ఏ మానవుడు ఈ విధముగా పూజను, వ్రతమును, రథోత్సవమును చేయునో, అట్టివాడు ఇహలోకములో భోగములన్నింటినీ అనుభవించి, మరణించిన తరువాత దేవీ లోకమును పొందును (70). శ్రావణ భాద్రపద మాసములలో శుక్ల తృతీయా తిథినాడు ఎవడైతే ఈ విధముగా అంబను యథావిధిగా వ్రతమును చేసి పూజించునో (71). అట్టివాడు ఇహలోకములో సర్వకాలములయందు పుత్రులు, పౌత్రులు మొదలగు వారితో, మరియు ధనము మొదలగు వాటితో ఆనందించి, మరణించిన పిదప లోకమున్నింటికీ పైన ఉన్న ఉమాలోకమును పొందును (72). అశ్వయుజ శుక్ల పక్షములో నవరాత్రవ్రతమును చేయవలెను. దానిని చేసినచో, కోర్కెలన్నియు సిద్ధించుననుటలో సంశయము లేశ##మైననూ లేదు (73). ఈ నవరాత్రవ్రతముయొక్క మహిమనుచెప్పుటకు బ్రహ్మగాని, శివుడు గాని, కుమారస్వామి గాని సమర్థులు కారన్నచో, ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (74). ఓ మహర్షులారా! విరథుని కుమారుడగు సురథమహారాజు నవరాత్రవ్రతమును చేసి, కోల్పోయిన తన రాజ్యమును పొందెను (75). దీని ప్రభావము వలన బుద్ధిశాలి, అయోధ్యకు ప్రభువు అగు ధ్రువసంధి పుత్రుడైన సుదర్శన మహారాజు కోల్పోయిన రాజ్యమును పొందెను (76). సమాధి ఈ శ్రేష్ఠవ్రతమును చేసి మహేశ్వరిని చక్కగా ఆరాధించి సంసారబంధమునుండి విముక్తుడై మోక్షమును పొందెను (77). ఏ మానవుడైతే తదియ, పంచమి, సప్తమి, అష్టమి, నవమి, చతుర్దశి అను తిథులలో ఒకనాడు దేవిని పూజించునో (78). ఆశ్వయుజ శుక్ల పక్షములో యథావిధిగా వ్రతమును చేయునో, వాని మనోభీష్టములనన్నింటినీ శివాదేవి ఎల్లవేళలయందు నెరవేర్చును (79).

యః కార్తికస్య మార్గస్య పౌషస్య తపసస్తథా | తపస్యస్య సితే పక్షే తృతీయాయాం వ్రతం చరేత్‌ || 80

లోహితైః కరవీరాద్యైః పుషై#్పర్ధూపైస్సుగంధితైః | పూజయేన్మంగలాం దేవీం స సర్వం మంగలం లభేత్‌ || 81

సౌభాగ్యాయ సదా స్త్రీభిః కార్యమేతన్మహావ్రతమ్‌ | విద్యాధనసుతాప్త్యర్థం విధేయం పురుషైరపి || 82

ఉమామహేశ్వరాదీని వ్రతాన్యన్యాని యాన్యపి | దేవీప్రియాణి కార్యాణి స్వ భ##క్త్యైవం ముముక్షుభిః || 83

సంహితేయం మహాపుణ్యా శివభక్తి వివర్ధినీ | నానాఖ్యానసమాయుక్తా భుక్తి ముక్తి ప్రదా శివా || 84

య ఏనాం శృణుయాద్భక్త్యా శ్రావయేద్వా సమాహితః | పఠేద్వా పాఠయేద్వాపి స యాతి పరమాం గతిమ్‌ || 85

యస్య గేహే స్థితా చేయం లిఖితా లలితాక్షరైః | సంపూజితా చ విధివత్సర్వాన్‌ కామాన్‌ స ఆప్నుయాత్‌ || 86

భూతప్రేతపిశాచాదిదుష్టేభ్యో న భయం క్వచిత్‌ | పుత్రపౌత్రాది సంపత్తిం లభ##త్యేవ న సంశయః || 87

తస్మాదియం మహాపుణ్యా రమ్యోమా సంహితా సదా | శ్రోతవ్యా పఠితవ్యా చ శివభక్తిమభీప్సుభిః || 88

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం క్రియాయోగ నిరూపణం నామ ఏక పంచాశత్తమో%ధ్యాయః (51).

|| సమాప్తేయం పంచమ్యుమాసంహితా ||

ఎవడైతే కార్తీక-మార్గశీర్ష-పుష్య-మాఘ-ఫాల్గుణ మాసములలో శుక్ల పక్ష తదియనాడు వ్రతమును చేయునో (80), మంగళాదేవిని ఎర్రగన్నేరు మొదలగు పుష్పములతో, ధూప గంధములతో పూజించునో, వానికి సకలమంగళములు కలుగును (81). స్త్రీలు సౌభాగ్యము కొరకై ఈ మహావ్రతమును సర్వదా చేయవలెను. పురుషలు కూడ విద్య, ధనము, పుత్రుడు అనువాటిని పొందుట కొరకై చేయదగును (82). మోక్షమును కోరువారు ఈ విధముగా మంచి భక్తితో ఉమామహేశ్వరవ్రతము మొదలగు, దేవికి ప్రీతిని కలిగించే వ్రతములను చేయవలెను (83). పరమపవిత్రమగు ఈ సంహిత శివభక్తిని విశేషముగా వర్ధిల్లజేయును. అనేక గాథలతో గూడిన, మంగళప్రదమగు ఈ సంహిత భుక్తిని ముక్తిని ఇచ్చును (84). ఎవడైతే దీనిని భక్తితో వినునో, ఏకాగ్ర మనస్కుడై వినిపించునో, చదువునో, చదివించునో, వాడు పరమగతిని పొందును (85). సుందరమగు అక్షరములతో వ్రాయబడిన ఈ పుస్తకము ఎవని ఇంటిలో ఉండి యథావిధిగా పూజింపబడునో, వాడు సకలాభీష్టములను పొందును (86). వానికి భూతప్రేతపిశాచాది దుష్టశక్తుల వలన ఎన్నడైననూ భయము ఉండదు. వాడు పుత్రపౌత్రాది సంపదలను నిస్సంశయముగా పొందును (87). కావున, మిక్కిలి పవిత్రమైనది, సుందరమైనది అగు ఈ ఉమాసంహితను శివభక్తిని కోరు మనుజులు సర్వదా పఠించవలెను. శ్రవణము చేయవలెను (88).

శ్రీ శివమహాపురాణములోని ఉమా సంహితయందు క్రియా యోగనిరూపణమనే ఏబది ఒకటవ అధ్యాయము ముగిసినది (51).

ఉమాసంహిత ముగిసినది.

హరిః ఓం తత్సత్‌ శ్రీ కృష్ణార్పణమస్తు.

Siva Maha Puranam-4    Chapters