Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకచత్వారింశో%ధ్యాయః

ఏడ్గురు కిరాతుల గాథ

సనత్కుమార ఉవాచ |

సప్తతే తపతాం శ్రేష్ఠ స్వర్గే పితృగణాస్స్మృతాః | చత్వారో మూర్తిమంతో వైత్రయశ్చైవ హ్యమూర్తయః || 1

తాన్‌ యజంతే దేవగణా ఆద్యా విప్రాదయస్తథా | ఆప్యాయయంతి తే సర్వే సోమం యోగబలేన వై || 2

తస్మాచ్ఛ్రాద్ధాని దేయాని యోగినాం తు విశేషతః | సర్వేషాం రాజతం పాత్రమథ వా రజతాన్వితమ్‌ || 3

దత్తం స్వధాం పురోధాయ శ్రాద్ధే ప్రీణాతి వై పితౄన్‌ | వహ్నేరాప్యాయనం కృత్వా సోమస్య తు యమస్య వై || 4

ఉదగాయనమప్యగ్నా వగ్న్య భావే%ప్సు వా పునః | పితౄన్‌ ప్రీణాతి యో భక్త్యా పితరః ప్రీణయంతి తమ్‌ || 5

యచ్ఛంతి పితరఃపుష్టిం ప్రజాశ్చ విపులాస్తథా | స్వర్గమారోగ్య వృద్ధిం చ యదన్య దపి చేప్సితమ్‌ || 6

దేవకార్యాదపి మునే పితృకార్యం విశిష్యతే | పితృభక్తో%సి విప్రర్షే తేన త్వ మజరామరః || 7

న యోగేన గతిస్సా తు పితృభక్తస్య యా మునే | పితృభక్తిర్విశేషేణ తస్మాత్కార్యా మహామునే || 8

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

ఓ తపశ్శాలులలో శ్రేష్ఠమైనవాడా ! స్వర్గములో ఏడు పితృగణములు గలవనియు, వాటిలో నాల్గు గణములకు రూపము గలదనియు, కాని మూడు గణములు అరూపములనియు చెప్పబడినది (1). సృష్టికి మొదటివారైన దేవగణములు మరియు బ్రాహ్మణులు మొదలగు వారు వారిని ఆరాధించెదరు. వారందరు యోగబలముచే సోమునకు పుష్టిని కలిగించెదరు (2). కావున, మానవులు శ్రాద్ధకర్మలను చేసి పిండాదికమును యోగులగు ఆ పితరులకు సమర్పించవలెను. పితరులకు అందరికీ స్వధాపూర్వకముగా పిండములను సమర్పించి వెండి పాత్రను గాని, వెండిని కలిగియున్న పాత్రను గాని సమర్పించినచో పితృదేవతలు చాల సంతోషించెదరు.ఉత్తరాయణ కాలములో అగ్నిని వ్రేల్చి హోమములను చేసి, సోమునకు, యమునకు అగ్నిలో హవిస్సును అర్పించవలెను. అగ్ని లేనిచో జలములయందు సమర్పించవలెను. భక్తితో మానవుడు ఈ విధముగా ఆచరించినచో, పితృదేవతలు సంతసిల్లి, అట్టి మానవుని సంతోషపెట్టెదరు (3-5). అట్టి వారికి పితరులు పుష్టిని, అధిక సంతానమును, స్వర్గమును, ఆరోగ్యములో వృద్ధిని, మరియు మనస్సులోని ఇతరములగు కోరికలను కూడ ఇచ్చెదరు (6). ఓ మునీ! పితృశ్రాద్ధము దేవపూజ కంటె కూడ గొప్పది. ఓ మహర్షీ! నీవు తండ్రియందు భక్తి గలవాడవు. అందువలననే నీకు జరామరణములు లేవు (7). ఓ మునీ! పితృదేవతలయందు భక్తి గలవానికి లభించే గతి యోగము వలన లభించదు. ఓ మహర్షీ! కావున, మానవులు విశేషించి పితృభక్తిని కలిగి యుండవలెను. (8).

మార్కండేయ ఉవాచ |

ఏవముక్త్వా తు దేవేశో దేవానామపి దుర్లభమ్‌ | చక్షుర్దత్త్వా సవిజ్ఞానం జగామ ¸°గికీం గతిమ్‌ || 9

శృణు భీష్మ పురా భూయో భారద్వాజాత్మజా ద్విజాః | యోగధర్మమనుప్రాప్య భ్రష్టా దుశ్చరితేన వై || 10

వాగ్దుష్టః క్రోధనో హింస్రః పిశునః కవిరేవ చ | స్వసృషః పితృవర్తీ చ నామభిః కర్మభిస్తథా || 11

కౌశికస్య సుతాస్తాత శిష్యా గర్గస్య చా భవన్‌ | పితర్యుపరతే సర్వే ప్రవసంతస్తదాభవన్‌ || 12

వినియోగాద్గురోస్తస్య గాం దోగ్ధ్రీం సమకాలయన్‌ | సమానవత్సాం కపిలాం సర్వే%న్యాయాగతాస్తదా || 13

తేషాం పథి క్షుధార్తానాం బాల్యాన్మోహాచ్చ భారత | క్రూరా బుద్ధిస్సముత్పన్నా తాం గాం వై హింసితుం తదా || 14

తాన్‌ కవిస్స్వసృషశ్చైవ యాచేతే నేతి వై తదా | న చాశక్యాస్తు తాభ్యాం వా తదా వారయితుం నిజాః || 15

పితృవర్తీ తు యస్తేషాం నిత్యం శ్రాద్ధాహ్నికో ద్విజః | స సర్వాన బ్రవీత్కోపాత్పితృభక్తి సమన్వితః || 16

యద్యశక్యం ప్రకర్తవ్యం పితౄనుద్దిశ్య సాధ్యతామ్‌ | ప్రకుర్వంతో హి శ్రాద్ధం తు సర్వ ఏవ సమాహితాః || 17

ఏవమేషా చ గౌర్ధర్మం ప్రాప్స్యతే నాత్ర సంశయః | పితౄనభ్యర్చ్య ధర్మేణ నా ధర్మోనో భవిష్యతి || 18

మార్కండేయుడు ఇట్లు పలికెను -

దేవతలకు కూడ ప్రభువగు సనత్కుమారుడు ఈ విధముగా పలికి దేవతలకు కూడ దుర్లభమగు జ్ఞాననేత్రమును ప్రసాదించి యోగమార్గమును పొందెను (9). ఓ భీష్మా ! మరియొక వృత్తాంతమును వినుము. పూర్వము బ్రాహ్మణులగు భారద్వాజపుత్రులు యోగధర్మమును గురూపదేశముచే పొందియూ దుష్టమగు నడవడిచే భ్రష్టులైరి (10). వారికి వాగ్దుష్టుడు (చెడుగా మాటలాడువాడు), క్రోధనుడు (కోపిష్టి), హింస్రుడు (హింసించే స్వభావము కలవాడు), పిశునుడు (కొండెములను చెప్పువాడు), కవి (గ్రంథరచనాకుశలుడు), స్వసృషుడు (స్వయముగా సృష్టించువాడు), పితృవర్తి (పితరులను సేవించువాడు) అను సార్థకనామధేయములు గలవు (11). ఓ వత్సా ! కౌశికుని పుత్రులు గర్గునకు శిష్యులుగ నుండిరి. తండ్రి మరణించిన పిదప వారందరు యాత్రలకు పోయిరి (12). వారు గురువుయొక్క ఆదేశముచే చక్కగా పాలను ఇచ్చే కపిల గోవును, దాని దూడతో సహా మేపుచుండిరి. అపుడు వారి ప్రవృత్తి న్యాయబద్ధముగా లేకుండెను (13). ఓ భారతా ! మార్గములో వారికి తీవ్రమగు ఆకలి వేసెను. చిన్న వయస్సు అగుట వలన, మరియు భ్రాంతి వలన వారు అపుడుఆ గోవును హింసించవలెననే క్రూరమగు ఆలోచనను చేసిరి (14). అపుడు కవి మరియు స్వసృషుడు అట్లు చేయవద్దని వారిని ప్రార్థించిరి. కాని వారిద్దరు తమ సోదరులను ఆ పనినుండి నివారించలేకపోయిరి (15). వారిలో పితరులయందు భక్తిని కలిగియున్న పితృవర్తి అను బ్రాహ్మణుడు నిత్యము భక్తితోశ్రాద్ధమును చేసేడివాడు. అతడు కోపముతో వారినందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను (16). ఈ పనిని చేయుట తప్పని సరియైనచో, కనీసము పితృదేవతలను ఉద్దేశించి చేయుడు. మీరందరు మనస్సును లగ్నము చేసి శ్రాద్ధకర్మను అనుష్ఠించుడు (17). అట్లు చేయుట వలన ఈ గోవు నిస్సందేహముగా పుణ్యగతిని పొందగలదు. మనము ధర్మముననుసరించి పితృదేవతలను ఆరాధించినచో, మనకు పాపము చుట్టుకొనదు (18).

ఏవముక్తాశ్చ తే సర్వే ప్రోక్షయిత్వా చ గాం తదా | పితృభ్యః కల్పయిత్వా తు హ్యుపాయుంజత భారత || 19

ఉపయుజ్య చ గాం సర్వే గురోస్తస్య న్యవేదయన్‌ | శార్దూలేన హతా ధేనుర్వత్సా వై గృహ్యతామితి || 20

ఆర్తవత్స తు తం వత్సం ప్రతిజగ్రాహ వై ద్విజః | మిథ్యోపచారతః పాపముభూత్తేషాం చ గోఘ్నతామ్‌ || 21

తతఃకాలేన కియతా కాలధర్మముపాగతాః | తే సప్త భ్రాతరస్తాత బభూవుస్స్వాయుషః క్షయే || 22

తే వై క్రూరతయా హైంస్ర్యాత్స్వా నార్యత్వాద్గురోస్తథా | ఉగ్రహింసావిహారాశ్చ జాతాస్సప్త సహోదరాః || 23

లుబ్ధకస్య సుతాస్తావద్బలవంతో మనస్వినః | జాతా వ్యాధా దశార్ణేషు సప్త ధర్మవిచక్షణాః || 24

స్వధర్మ నిరతాస్సర్వే మృగయామోహవివర్జితాః | ఆసన్నుద్వేగసంవిగ్నా రమ్యే కాలంజరే గిరౌ || 25

తమేవార్థమనుధ్యాయ జ్ఞానం మరణసంభవమ్‌ | ఆసన్‌ వనచరాః క్షాంతా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః || 26

తే సర్వే శుభకర్మాణస్సద్ధర్మాణో వనేచరాః | విధర్మాచరణౖర్హీనా జాతిస్మరణసిద్ధయః || 27

పూర్వజాతిషు యో ధర్మః శ్రుతో గురుకులేషు వై | తథైవ చాస్థితా బుద్ధౌ సంసారే%ప్యనివర్తనే || 28

ఓ భరతవంశీయుడా ! ఆతడు వారితో నిట్లు చెప్పగా, వారందరు అపుడు ఆ గోవును సంప్రోక్షించి పితృదేవతలకు నివేదించి వినియోగించిరి(19). వారందరు ఆ విధముగా గోవును వినియోగించి, గురువునకు గోవును పెద్దపులి భక్షించినదనియు, దూడను స్వీకరించవలసినదనియు మనవి చేసిరి (20). ఆ బ్రాహ్మణుడు చాల దుఃఖించి ఆ దూడను స్వీకరించెను. గోవును సంహరించిన వారందరికి గురుసేవలో మోసమును చేయుటవలన పాపము చుట్టుకొనెను (21). ఓ వత్సా! తరువాత కొంత కాలమునకు ఆయుర్దాయములు పూర్తి అగుటచే ఆ ఏడుగురు సోదరులు మరణించిరి (22). క్రూరులై గురువును మోసగించి ఘోరమగు హింసకు పాల్పడిన కారణముచే ఆ ఏడ్గురు సోదరులు దశార్ణ దేశములో ఒక కిరాతునకు పుత్రులై జన్మించిరి. బలశాలురు, అభిమానవంతులు, ధర్మశాస్త్రపండితులు అగు ఆ ఏడ్గురు కిరాతులు తమ కర్తవ్యములను శ్రద్ధతో ఆచరించుచున్ననూ వేటయందలి వ్యామోహమును విడిచియుండిరి. వారు సుందరమగు కాలంజర పర్వతమునందు దుఃఖముతో నిండిన మనస్సు గలవారై నివసించిరి (23-25). తాము పూర్వజన్మలో చేసిన ఆ పాపకృత్యమును మరియు తమ మరణమును మాత్రమే ధ్యానిస్తూ ఆ కిరాతులు సహనము గలవారై, సుఖదుఃఖములయందు సమచిత్తులై, ఇంద్రియ సుఖములకు దూరముగా జీవించిరి (26). శుభకర్మలను చేయుచూ పవిత్ర ధర్మమును పాటిస్తూ ఆ కిరాతులు అందరు పూర్వజన్మను స్మరించగలిగే సిద్ధిని పొంది అధర్మమునకు దూరముగా నుండిరి (27). వారు పూర్వజన్మలలో గురుకులములయందు నేర్చిన ధర్మము వారి బుద్ధులలో యథాతథముగా నిలిచియుండెను. వారికి మరల సంసారములోనికి రాకూడదనే ఇచ్ఛ గలదు (28).

గిరిమధ్యే జహుః ప్రాణాన్‌ లబ్ధాహారాస్తపస్వినః | తేషాం తు పతితానాం చ యాని స్థానాని భారత || 29

తథైవాద్యాపి దృశ్యంతే గిరౌ కాలంజరే నృప | కర్మాణా తేన తే జాతుశ్శుభాశుభవివర్జకాః || 30

శుభాశుభతరాం యోనిం చక్రవాకత్వమాగతాః | శుభే దేశే శరద్వీపే సపై#్తవాసన్‌ జలౌకసః || 31

త్యక్త్వా సహచరీధర్మం మునయో ధర్మధారిణః | నిస్సంగా నిర్మమాశ్శాంతా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః || 32

నివృత్తి నిర్వృతాశ్చైవ శకునా నామతస్స్మృతాః | తే బ్రహ్మచారిణస్సర్వే శకునా ధర్మధారిణః || 33

జాతిస్మరాస్సుసంవృద్ధాస్సపై#్తవ బ్రహ్మచారిణః | స్థితా ఏకత్ర సద్ధర్మా వికారరహితాస్సదా || 34

విప్రయోనౌ తు యన్మోహాన్మిథ్యాపచరితం గురౌ | తిర్యగ్యోనౌ తథా జన్మ శ్రాద్ధాత్‌ జ్ఞానం చ లేభిరే || 35

తథా తు పితృకార్యార్థం కృతం శ్రాద్ధం వ్యవస్థితైః | తదా జ్ఞానం చ జాతిం చ క్రమాత్ర్పాప్తం గుణోత్తరమ్‌ || 36

పూర్వజాదిషు యద్ర్బహ్మ శ్రుతం గురుకులేషు వై | తథైవ సంస్థితజ్ఞానం తస్మాత్‌ జ్ఞానం సమభ్యసేత్‌ || 37

సుమనాశ్చ సువాక్‌ శుద్ధఃపశ్చిమశ్ఛిద్రదర్శకః | స్వతంత్రశ్చ సుయజ్ఞశ్చ కులీనా నామతస్స్మృతాః || 38

తేషాం తత్ర విహంగానాం చరతాం ధర్మచారిణామ్‌ | సువృత్తమభవత్తత్ర తచ్ఛృణుష్వ మహామునే || 39

వారు లభించిన ఆహారమును స్వీకరిస్తూ తపస్సును చేసి ఆ పర్వతమధ్యమునందు ప్రాణములను విడిచిరి. ఓ భరతవంశీయుడా ! మహారాజా ! వారు కాలంజరపర్వతముపై ప్రాణములను విడిచిన స్థానములు ఈ నాటికీ అటులనే కానవచ్చును. వారు ఆ జన్మలో శుభాశుభములను విడిచియున్నారు గనుక, దాని ప్రభావముచే శుభము మరియు అశుభము కాని జన్మను పొందిరి. శరద్వీపమనే పవిత్ర స్థానమునందు వారు ఏడ్గురు చక్రవాకములై జన్మించి నీటిలో నివసించిరి (29-31). వారు ఆడ పక్షులకు దూరముగా ధర్మనిష్ఠులగు మునులై, సంసారసంగమును మరియు మమకారమును విడిచిపెట్టి, ఇంద్రియభోగములకు దూరముగా, స్థిరచిత్తులై, సుఖదుఃఖములకు అతీతముగా జీవించిరి. మోక్షకాములగు ఆ ఏడ్గురు పేరుకు మాత్రమే పక్షులు. ధర్మవర్తనముగల ఆ పక్షులు అన్నీ బ్రహ్మచర్యమును పాటించెను (32,33). ఆ ఏడ్గురు బ్రహ్మచారులు పూర్వజన్మజ్ఞానము కలిగి పెద్ద వయస్సును పొందినవారై ఒకే స్థానములో నుండి సర్వకాలములలో వికారములకు దూరముగా నుండి మోక్షధర్మమును పాటించిరి ((34). వారు బ్రాహ్మణ జన్మను పొంది మోహముచే గురువు విషయములో అపరాధమును చేయుటచే పక్షిజన్మను పొందిరి. కాని శ్రాద్ధ ప్రభావముచే జ్ఞానమును కూడ పొందిరి. (35). వారు శ్రాద్ధమును యథావిధిగా చేసి పితృకార్యమును నిర్వర్తించి యుండుటచే పూర్వజన్మ జ్ఞానమును కలిగియుండుటయే గాక, క్రమముగా గుణములచే శ్రేష్ఠమగు జన్మను పొందిరి (36). పూర్వజన్మలలో వారు గురుకులములలో వినియున్న బ్రహ్మజ్ఞానము వారికి యథాతథముగా తెలియుచుండెను. కావున, మానవుడు జ్ఞానమును అభ్యసించవలెను (37). సత్కులమునందు పుట్టిన ఆ పక్షులకు సుమనస్కుడు, సువాక్‌, శుద్ధుడు, పశ్చిముడు, ఛిద్రదర్శకుడు, స్వతంత్రుడు, సుయజ్ఞుడు అను పేర్లు ఉండెను (38). ఓ మహర్షీ! ఆ పక్షులు ధర్మబద్ధముగా అచట జీవించుచుండగా ఒక చక్కని వృత్తాంతము ఘటిల్లినది. దానిని వినుము (39).

నీపానామీశ్వరో రాజా ప్రభావేణ సమన్వితః | శ్రీమానంతః పురవృతో వనం తత్రావివేశ హ || 40

స్వతంత్రశ్చ క్రవాకస్స స్పృహయామాస తం నృపమ్‌ | దృష్ట్వా యాంతం సుఖోపేతం రాజ్యశోభాసమన్వితమ్‌ || 41

యద్యస్తి సుకృతం కించిత్తపో వా నియమో%పి వా | ఖిన్నో%హముపవాసేన తపసా నిశ్చలేన చ || 42

తస్య సర్వస్య పూర్ణేన ఫలేనాపి కృతేన హి | సర్వసౌభాగ్యపాత్రశ్చ భ##వేయమహమీదృశః || 43

తతస్తు చక్రవాకౌ ద్వావాసతుస్సహచారిణౌ | ఆవాం వై సచివౌ స్యావ తవ ప్రియహి తైషిణౌ || 44

తథేత్యుక్త్వా తు తస్యాసీత్తదా యోగాత్మనో గతిః | ఏవం తౌ చక్రవాకౌ చ స్వవాక్యం ప్రత్యభాషతామ్‌ || 45

యస్మాత్కర్మ బ్రువాణ స్వం యోగధర్మమవాప్య తమ్‌ | ఏవం వరం ప్రార్థయసే తస్మాద్వాక్యం నిబోధ మే || 46

రాజా త్వం భవితా తాత కాంపిల్యే నగరోత్తమే | ఏతౌ తే సచివౌ స్యాతాం వ్యభిచార ప్రధర్షితౌ || 47

న తానూచుస్త్రయో రాజ్యం చతురస్సహచారిణః | స ప్రసాదం పునశ్చక్రే తన్మధ్యే సుమనాబ్రవీత్‌ || 48

అంతర్వో భవితా శాపః పునర్యోగమవాప్స్యథ | సర్వసత్త్వస్సుయజ్ఞశ్చ స్వతంత్రో%యం భవిష్యతి || 49

పితృప్రసాదాద్యుష్మాభిస్సంప్రాప్తం సుకృతం భ##వేత్‌ | గాం ప్రోక్షయిత్వా ధర్మేణ పితృభ్యశ్చోపకల్పితాః || 50

అస్మాకం జ్ఞానసం యోగస్సర్వేషాం యోగసాధనమ్‌ | ఇదం చ కార్యం సంరబ్ధం శ్లోకమేకముదాహృతమ్‌ || 51

పురుషాంతరితం శ్రుత్వా తతో యోగమవాప్స్యథ | ఇత్యుక్త్వా స తు మౌనో% భూద్విహంగస్సుమనా బుధః || 52

లోకానాం స్వస్తయే తాత శంతనుప్రవరాత్మజ | ఇత్యుక్తం తచ్చరిత్రం మే కిం భూయశ్ర్శోతు మిచ్ఛసి || 53

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం సప్తవ్యాధగతివర్ణనం నామ ఏకచత్వారింశో%ధ్యాయః (41).

ప్రభావశాలి, శ్రీమంతుడు అగు నీపదేశమహారాజు అంతఃపురముతో గూడి ఆ అడవిలోనికి వచ్చెను (40). రాజ్యశోభతో గూడి ఆనందముగా వచ్చుచున్న ఆ రాజును చూచి స్వతంత్రుడనే చక్రవాకము ఇట్లు కోరుకొనెను (41). నేను చేసిన పుణ్యము మిగిలియున్నదా ! నేను ఏదేని తపస్సును చేసియుంటినా ! నియమమును పాటించి యుంటినా ! నేను ఉపవాసములచే మరియు స్థిరమగు తపస్సుచే అలసి యుంటిని (42). వాటన్నింటియొక్క పూర్ణఫలముచే నేను ఈ రాజువలె పూర్ణసౌభాగ్యమునకు అర్హుడను అగుదును గాక ! (43). అపుడు దానికి తోడుగా నున్న రెండు చక్రవాకములు ఇట్లు పలికినవి. మేము ఇద్దరము నీకు మంత్రులమై నీకు ప్రియమును, హితమును చేకూర్చెదము గాక! (44). యోగముచే శుద్ధిని పొందియున్న ఆ చక్రవాకము 'అటులనే యగుగాక!' అని పలికెను. దానికి సద్గతి లభించెను. అపుడు ఆ రెండు చక్రవాకములు ఈ విధముగా ప్రత్యుత్తరమునిచ్చినవి (45). స్వకర్మల నాచరించి యోగధర్మమును పొందిన నీవు ఈ విధమగు వరమును కోరుచున్నావు. కావున నా మాటను తెలుసుకొనుము (46). ఓ వత్సా! నీవు కాంపిల్యమనే గొప్ప నగరములో రాజువు కాగలవు. వీరిద్దరు నీకు మంత్రులై నిశ్లమగు జీవితమును గడిపెదరు (47). ఆ ముగ్గురు మిగిలిన నల్గురు సహచరులకు ఆ విషయమును చెప్పలేదు. వారిపై ఈశ్వరుడు అనుగ్రహమును మరల చూపెను (?). వారి మధ్యలో సుమనస్కుడు ఇట్లు పలికెను (48). మీ శాపమునకు అంతము రానున్నది. మీరు మరల యోగులు కాగలరు. సర్వసమర్థుడగు ఈ సుయజ్ఞుడు, మరియు స్వతంత్రుడు కూడ యోగులు కాగలరు (49). మీరు పితృదేవతల అనుగ్రహముచే పుణ్యఫలమును పొందెదరు. మీరు గోవును సంప్రోక్షణ చేసి ధర్మబద్ధముగా పితృదేవతలకు సమర్పించినారు (50). మనలకు అందరికీ జ్ఞానము లభించి యోగము సిద్ధించును. ఈ కార్యముచాల గంభీరమైనది. ఈ విషయమును బోధించే ఒక శ్లోకము గలదు (51). మీరు మనుష్య జన్మను పొంది శ్రవణము చేసి తరువాత సిద్ధిని పొందగలరు. ఇట్లు పలికి వివేకియగు సుమనస్కుడనే ఆ పక్షి మిన్నకుండెను (52). ఓ వత్సా ! శంతను పుత్రా! శ్నేష్ఠపురుషా ! వారి చరిత్రమును మానవులకు మంగళమును కలిగించుట కొరకై చెప్పియుంటిని. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు ? (53).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు ఏడ్గురు కిరాతుల గాథను వర్ణించే నలుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

Siva Maha Puranam-4    Chapters