Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోనషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ ఋగ్విధానమ్‌

అగ్ని రువాచః

ఋగ్యజుఃసామాథర్వం విధానం పుష్కరోదితమ్‌ | భుక్తిముక్తికరం జప్యాద్దోమాద్రామాయ తద్విదే.1

పుష్కర ఉవాచః

ప్రతివేదంతు కర్మాణి కార్యాణి ప్రవదామితే | ప్రథమం ఋగ్విధానం వై శృణుత్వం భుక్తిముక్తిదమ్‌.2

అంతర్జలే తథా హోమే జపతే మనసేప్సితమ్‌ | కామం కరోతి గాయత్రీ ప్రాణాయామాద్విశేషతః.3

గాయత్ర్యా దశసాహస్రో జపోనక్తాశినోద్విజ | బహున్నాతస్యతత్రైవ సర్వకల్మష నాశనః.4

దశాయుతాని జప్త్వా7థ హవిష్యాశీ సముక్తిభాక్‌ | ప్రణవో హి పరం బ్రహ్మ తజ్జపః సర్వపాపహా.5

ఓంకారం శతజప్తంతు నాభిమాత్రోదకస్థితః | జలం పిబేద్స సర్వైస్తు పాపైర్వైవిప్రముచ్యతే.6

మాత్రాత్రయం త్రయోవేదాస్త్రయే దేవాస్త్రయే7గ్నయః |

మహాహ్యహృతయః సప్తలోకాహోమా7ఖిలావహా.7

గాయత్రీ పరమాజప్యా మహావ్యాహృతయస్తథా | అంతర్జలే తథారామః ప్రోక్తశ్చైవాఘమర్షణః.8

అగ్నిమీలే పురోహితం సూక్తోయం వహ్ని దైవతః | శిరసా ధారయన్వహ్నిం యోజపేత్పరివత్సరమ్‌.9

హోమం త్రిషవణం భైక్ష్యమనగ్ని జ్వలనం చరేత్‌ | అంతఃపరమృచః సప్తవాయ్వాద్యాయాఃప్రకీర్తితాః.10

తాజపన్ప్రయేతో నిత్యమిష్టాన్కామాన్పమశ్నుతే | మేధాకామో జపేన్నిత్యం సదసస్పతిమిత్య్రుచమ్‌.11

అగ్నిదేవుడు పలికెను ; పుష్కరుడు పరశురామునకు చెప్పిన ఋగ్యజః సామథర్వ విధానమును చెప్పెదను. దీనిప్రకారము జపహోమములు చేసినచో భుక్తిముక్తులు లభించును. పుష్కరుడు పలికెను. ఒక్కొక్క వేదమునకు సంబంధించిన చేయవలసిన కర్మలను మీకు చెప్పెదను. ముందుగ భుక్తి ముక్తి ప్రదమగు ఋగ్విధానమును వినుము. జల మధ్యమునందు కాని హోమసమయమున గాని గాయత్రి జపము చేయు వానికి సకల మనో వాంఛితములు లభించును. ప్రాణాయామ పూర్వకముగా చేసినచో విశేషముగా లభించును. రాత్రిమాత్రమే భుజించుచు అనేక పర్యాయములు స్నానము చేసి దశసహస్రగాయత్రీ జపము చేయువని పాపములన్నియు నశించును. హవిస్సును భుజించుచు లక్ష గాయత్రీ జపము చేసిన వానికి ముక్తి లభించును. ప్రణవము పరబ్రహ్మ స్వరూపము, దాని జపము సర్వపాప వినాశకము. బొడ్డులోతు నీటిలో నిలచి ఓంకారమును నూరు పర్యాయమలు జపించి అభిమంత్రించిన జలమును త్రాగిన వాడు ముక్తుడగును. ఓంకారములో వున్న ఆ ఉ మ్‌ అను మూడు మాత్రలు మూడు వేదములు, ముగ్గురు దేవతలు, మూడు అగ్నులు, భూః మొదలైన మనోవ్యాహృతులే ఏడు లోకములు. వీటితో కలిసిన గాయత్రితో చేసిన హోమము సర్వఫలదాయకము. గాయత్రి మంత్రము మహావ్యాహృతులు ఇవన్నియు జపయోగ్యమైన మహామంత్రములు. ఓరామ! జలములో మునిగి అఘమర్షణ మంత్రమును జపించినచో సర్వపాపములు తొలగును. ''అగ్నిమీళేపురోహితం'' (ఋ-వే-1-1-1) అనుసూక్తము అగ్ని దేవతాకము. శిరస్సుపై అగ్నిని ధరించి ఒక సంవత్సరము పాటు ఈ సూక్తమును జపించుచు హోమము త్రికాల స్నానము హోమము చేయుచు భిక్షాన్నాము తినవలెను. ఈ ఋక్కునకు తరవాత వున్న వాయ్వాది దేవతా సూక్తములను ఏడింటిని నిత్యము నియమ పూర్వకముగా జపించువాడు. మనోవాంఛితములను పొందును. మేధాకాముడు '' సదసస్పతి (ఋ-1-18-6) ఇత్యాది ఋక్త్రయమును ప్రతిదినము జపించవలెను.

అన్వయో యన్నిమాః ప్రోక్తాః నవర్చో మృత్యునాశనః | శునః శేఫమృషిం బద్దః సన్నిరుద్దో7థవా జపేత్‌,

ముచ్యతే సర్వపాపేభ్యోగదీవాప్యగదో భ##వేత్‌ |

య ఇచ్ఛేచ్ఛాశ్వతం కామం మిత్రం ప్రాజ్ఞం పురందరమ్‌.13

ఋగ్భిః షోడశభిఃకుర్యాదిన్ద్రస్యేతి దినేదినే | హిరణ్య స్తూపమిత్యేతజ్ఞపఞ్ఛత్రూన్ప్రబాధతే.14

క్షేమీ భవతి చాధ్వానో యేతే పంథా జపన్నరః | రౌద్రీభిః షడ్భిరీశానం స్తుయాద్యో వైదినేదినే.15

చరుంవా కల్పయేద్రౌద్రం తస్యశాంతిః పరాభ##వేత్‌ | ఉదిత్యు దన్తమాదిత్యముపతిష్ఠన్‌ దినేదినే.16

క్షిపేజ్జలాఞ్జలీన్సప్త మనోదుఃఖ వినాశనమ్‌ | ద్విషన్తమిత్యథార్ధర్చం యద్విప్రాన్తం జపేత్స్మరేత్‌.17

అగస్కృత్సప్తరాత్రేణ విద్వేష మధిగచ్చతి| ఆరోగ్యకామీరోగీ వాప్రస్కన్నస్యోత్తమం జపేత్‌.18

ఉత్తమస్తస్యచార్దర్భో జపేద్వై వివిధాననే | ఉదయస్యాయురక్షయ్యం తేజో మధ్యన్దినే జపేత్‌.19

అన్తం ప్రతిగతే సూర్యే ద్విషన్తం ప్రతిబాధతే | నవయశ్చేతి సూక్తాని జపఞ్చత్రూన్ని యచ్ఛతి.20

ఏకాదశ సువర్ణస్య సర్వకామాన్వినిర్దిశేత్‌| ఆధ్యాత్మికీః క ఇత్యేతా జపన్మోక్ష మవాప్నుయాత్‌.21

''అంబయో యంత్యధ్వభిః''(ఋ.1-23-18) ఇత్యాది తొమ్మిది ఋక్కులు ఆకాల మృత్యువును తొలగించును. బద్ధుడుగాని, అడ్డుకొన బడిన వాడుగాని, '' శునశ్శేపోయమహ్వద్గృభీతః'' (ఋ 1-24-12) ఇత్యాది ఋక్త్రయమును జపించవలెను. వీటి జపముచే సర్వపాపవిముక్తుడగును. రోగి రోగ విముక్తుడగును. శాశ్వతకామముల సిద్ధిని, బుద్ధిమంతు డగు మిత్రుని కోరువాడు '' ఇందస్య'' ఇత్యాదికములగు పదునారు ఋక్కులను ప్రతిదినము జపించవలెను. ''హిరణ్యస్తూపః''(10-149-5-) ఇత్యాది మంత్రమున జపించు వాడు శత్రువులను బాధించును. ''ఏతే పంథాః'' (1-35-11) అను మంత్రమును జపించువాడు మార్గమున క్షేమవంతుడగును. రుద్ర సంబ్దములగు ఆరు ఋక్కులతో ప్రతిదినము ఈశ్వరుని స్తుతించువాడును రౌద్రచెరువును సమర్పించువాడును పరమ శాంతిని పొందును. జపించువాడను ''ఉద్వయస్తమసమః'' (1-50-10) ''ఉదుత్యంజాతవేదసం'' (1-50-1) అను ఋక్కులచే ప్రతిదినం అదిత్యుని ఉపస్థానము చెప్పువాడును సూర్యునుద్దేశించి ఏడు జలాంజలులను ఇచ్చువాడును మానసిక దుఃఖవిముక్తడగును. ''ద్విషంతం'' ఇత్యాది ఋక్కు మొదలు ''యద్విప్రాః'' అను మంత్రము వరకు జపధ్యానములు చేయవలెను. ఇట్లు చేయుటచే అపరాధి ఏడు రాత్రులలో ఇతరుల ద్వేషమునకు పాత్రుడగును. ఆరోగ్యము కోరువాడు '' పురీష్యాసో7 గ్నయః'' (3-22-4) అను ఋక్కును జపించవలెను. శత్రుబాధ నివారణార్థమై ఈ ఋక్కులోని అర్థభాగమును జపించవలెను. దీనిని సూర్యోదయ సమయమున జపించినచో దీర్ఘాయువు మధ్యాహ్నమున జపించినచో తేజస్సు సూర్యస్తమ సమయమున జపించినచో శత్రువినాశనము కలుగును. ''నవయః'' (ఋ-8-93-2) ఇత్యాది సూక్తములను జపించువాడు శత్రువిజేతయగును. పదకొండు సువర్ణసూక్తములను జపించువాడు సర్వకామములను పొందును. అధ్యాత్మికములగు ''క'' అను మొదలగు ఋక్కులను జపించువాడు మోక్షమును పొందును.

అనోభద్రా ఇత్యనేన దీర్ఘమాయురవాప్నుయాత్‌ | త్వం సోమేతిచ సూక్తేన నవం పశ్యేన్ని శాకరమ్‌.22

ఉపతిష్ఠేత్సమిత్పాణిర్వాసాంస్యాప్నోత్యసంశయమ్‌ | ఆయురీప్సన్నిమమితికైత్సం సూక్తం సదాజపేత్‌,

అపనఃశోశుచ దితిస్తుత్వా మధ్యే దివాకరమ్‌ | యథాముంచతి చేషీకా తథా పాపం ప్రముంచతి.24

జాతవేదస ఇత్యేతజ్జపేత్స్వస్తయనం పథి| భ##యైర్విముచ్యతే సర్వైః స్వస్తిమానాప్నుయాద్గృహాన్‌.25

ప్యుష్టాయాం చతథా రాత్య్రామేతద్దుఃస్నప్న నాశనమ్‌ | ప్రమందినేతి సూయన్త్యా జపేద్గర్భ విమోచనమ్‌,

ఉపన్నింద్రమితిస్నాతా వైశ్వదేవంతు సప్తకమ్‌ | ముంచత్వాజ్యం తథా జుహ్వన్సకలం కిల్బింషం నరః.27

ఇమామితి జపఞ్చశ్వత్కా మానాప్నోత్యభీస్నితాన్‌ | మానస్తోక ఇతి ద్వాభ్యాం త్రిరాత్రో పోషితః శుచిః.28

ఔదుంబరీశ్చ జుహుయాత్సమిధశ్చాజ్య సంస్కృతాః | ఛిత్వా సర్వన్మృత్యుపాశాన్‌ జీవేద్రోగవివర్జితః.

ఊర్ద్వబాహు రనేనైవ స్తుత్వాశంభుం తథైవచ | మానస్తోకేతి చ ఋచా శిఖాబందే కృతేనరః.30

అదృష్యః సర్వభూతానాం జాయతే సంశయుంవినా| చిత్రమిత్యుపతిష్ఠేత త్రిసంధ్యం భాస్కరం తథా.31

సమిత్పాణిర్నరో నిత్యమీప్నితం ధనమాప్నుయాత్‌ | అథ స్వప్నేతి చ జపన్ప్రాతర్మధ్యన్దినే దినే.32

దుఃస్వప్నం చార్దతే కృత్స్యం భోజనం చాప్నుయాచ్ఛుభమ్‌| ఉభే పుమానితి తథా రక్షోఘ్నఃపరికీర్తితః.

ఉభేవాసే ఇతిఋచో జనన్కామానవాప్నుయాత్‌ | నసాగన్నితి చ జపన్ముచ్యతే చాతతాయినః.34

''అనోభద్రాః'' (1-89-1) అను ఋక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. హస్తములో సమిధలు గ్రహించి ''త్వంసోమ'' (9-86-24) అను ఋక్కు చదువుచు శుక్లపక్షద్వితీయ చంద్రుని దర్శనము చేయవలెను. ఇట్టు చేయుటచే నిస్సంశయముగ వస్త్రము పొందును. దీర్ఘాయుర్ధాయమును కోరువాడు ''ఇమం'' (1-94)ఇత్యాది కౌత్ససూక్తమును సర్వదా జపించవలెను. మధ్యాహ్నసమయమున ''అపనఃశోశుచమం'' (1-97-1) ఇత్యాది ఋక్కుతో సూర్యస్తుతి చేయువాడు గడ్డినుండి ఇషీకమును వేరుచేసినట్లు (ఒకజాతిగడ్డి)తనను పాపమునుండి వేరుచేసుకొనును. యాత్రికుడు ''జాతవేదసే'' (1-19-1)అను మంగళ మయమగు ఋక్కును మార్గమునందు జపించవలెను. సర్వభయ విముక్తుడై క్షేమముగ ఇంటికి తిరిగివచ్చును. ప్రభాత కాలమున వీనిని జపించినచో దుఃస్వప్నములు నశించును. ''ప్రమందినే''(1-101-1) అను ఋక్కును జపించుటచే స్త్రీ సుఖముగా ప్రసవించును. ''ఇంద్రం'' (1-106-1) ఇత్యాది ఋక్కుజపించుచు ఏడు పర్యాయములు వైశ్వ దేవముచేసి ఆజ్యహోమం చేసినవాడు సమస్తపాపవిముక్తుడగును. ''ఇమాం''(10-85-45) అను ఋక్కును జపించువాడు సర్వదా అన్ని కామములను పొందును. మూడు దినములు ఉపవాసముచేసి పవిత్రుడై ''మానస్తోకో'' (1-114-8,9) ఇత్యాది ఋగ్ధ్వ యమును పఠించుచు నేతిచే సంస్కృతములగు ఉదుంబర సమిధనలు హోమము చేసినవాడు మృత్యుపాశములన్నింటిని ఛేదించి రోగ విహీనుడగను. రెండుచేతులు ఎత్తి ఈ ఋక్కుతో శివుని స్తుతించి శిఖ ముడివేసుకొనిన వాడు నిస్సంశయముగా సకల ప్రాణులకు అజేయుడగును. హస్తమున సమిధలు గ్రహించి ప్రతిదినము మూడు సంధ్యలయందును ''చిత్రందేవానాం'' (1-115-1) ఇత్యాది మంత్రముచే సూర్యోపస్థానము చేయువాడు మనోవాంచిత ధనమును పొందును. ''స్వప్నే నాభ్యుష్యా''(2-15-9) అను ఋక్కును ప్రాతఃకాలమధ్యాహ్న అపరాహ్నములందు జపించుటచే సర్వదుఃస్వప్నములు నశించును. మంచిభోజనము లభించును. ''ఉభేపునామిరోదసి'' (1-133-1) అను మంత్రము రాక్షస వినాసకము, ''ఉభయాసోజాతవేదః'' (2-2-12-13) అది ఋక్కులను జపించువాడు మనోవాంఛిత ఫలములను పొందును. ''తమాగమన్మసోమరయః'' (8-19-32) అను మంత్రమును జపించువాడు ఆతతాయి భయమునుండి విముక్తుడగును.

కయా శుభేతిచ జపఞ్జాతి శైష్ఠ్యమవాప్నుయాత్‌ | ఇమం నృసోమమిత్యేతత్సర్వాన్కామానవాప్నుయాత్‌.35

పితరిత్యు పతిష్ఠేత నిత్యమర్థ ముపస్థితమ్‌ | అగ్నేనయేతి సూక్తేన ఘృతహోమశ్చ మార్గగః.36

వీరాన్నయ మవాప్నోతి సుశ్లోకం యో జపేత్సదా | కంకతో నేతి సూక్తేన విషాన్నర్వాన్వ్యపోహతి.37

యేజాత ఇతిసూక్తేన సర్వాన్యామానవాప్నుయాత్‌| గణానమితి సూక్తేన స్నిగ్థమాప్నోత్య నుత్తమమ్‌.38

యో రాజన్నితీయాం తు దుఃస్వప్న శమనీ మృచమ్‌ | అధ్వని ప్రస్థితో యస్తు పశ్యేచ్ఛత్రుం సముత్థిమమ్‌.39

అప్రశస్తం ప్రశస్తం వా కువిదంగ ఇమం జపేత్‌| ద్వావింశకం జపన్సూక్త మాధ్యాత్మిక మనుత్తమమ్‌.40

పర్వసు ప్రయతో నిత్యమిష్టాన్కా మాన్సమశ్నుతే | శృణుష్వేతు జపస్సూక్తం జుహ్వదాజ్యం సమాహితః,

ఆరాతీనీం హరేత్ర్పాణా ప్రక్షాంస్యపి వినాశ##యేత్‌| ఉపతిష్ఠేత్స్వయం వహ్నిం పరిత్ర్యుచా దినేదినే.42

తం రక్షతి స్వయం వహ్నిర్విశ్వతో విశ్వతో ముఖః | హంసః శుచిషదిత్యేచ్ఛుచిరీ క్షేద్దివాకరమ్‌.43

''కయాశుభాసవయసః'' (1-165-1) అను ఋక్కును జపించువాడు తన జాతిలో శ్రేష్ఠత్వమును పొందును ''ఇమంనుసోయం'' (1-179-5) అను ఋక్కును జపించువాడు సర్వకామములను పొందును. ''పితుంనుస్తోషం'' (1-187-1) అను ఋక్కుతో నిత్యము ఉపస్థానము చేయువానికి అన్నము లభించును. ''అగ్నేయనుపథా'' (1-189-1) అను సూక్తముతో ఆజ్యహోమము చేసినచో పరలోకమున ఉత్తమమార్గము లభించును. సుశ్లోకమును సర్వదా జపించువాడు వీరమార్గమును పొందును. ''కంకతోన కంకతో'' (1-191-1) అను సూక్తము విషయములను పొగొట్టును ''యోజాతః ఏవ ప్రథమో'', (2-12)అను సూక్తమును జపించు వానికి సమస్తకామములు లభించును. ''గణానాంత్వా''(2-23-1)అను సూక్తమును జపించుటచే శ్రేష్ఠమైన స్నిగ్థ పదార్థములు లభించును. ''యోమేరాజన్‌'' (2-28-10) అను ఋక్కు దుఃస్వప్నము లను శమింపచేయు మార్గములో ప్రయాణమై వెళ్లువాడు ప్రశస్తుడుగాని అప్రశస్తుడు గానియగు శత్రువు కనబడినపుడు ''కువిదంగ'' ఇత్యాదిమంత్రములు జపించినచో ఆత్మరక్ష కలుగును. ఇరువది రెండు అధ్యాత్మిక సూక్తములను పర్వము లందు నియమపూర్వకముగ జపించువానికి సమస్తమనోరథములు సిద్ధించును. ''కృణుష్వపాజఃః'' (4-4-1) అను సూక్తము జపించుచు ఏకాగ్రచిత్తముతో ఆజ్యహోమము చేసినవాడు శత్రువులను సంహరించును. రాక్షసులను కూడ నశింపచేయును. ''పరి'' ఇత్యాది సూక్తముతో ప్రతిదినము ఈగ్న్యువస్థానము చేయువానిని విశ్వతో ముఖడగు అగ్ని స్వయముగ అన్నివైపుల నుండియు రక్షించును. ''హంసశ్శుచిషత్‌'' (4-40-5) ఇత్యాది మంత్రము చదువుచు సూర్యుని చూచినచో పవిత్రుడగును.

కృషిం ప్రపద్య మానస్తు స్థాలీపాకం యథావిది| జుహుయాత్షేత్ర యధ్యేతు స్వనీ స్వాహాస్తు పంచభిః.44

ఇంద్రాయచ మరుద్భ్యసక్తుపర్జన్యాయ భగాయచ| యథాలింగం తు విహరేల్తాంగలం తు కృషీవలః.45

యుక్తో ధాన్యయ సీతాయై సునాసీరమథో త్తరమ్‌ | గంధమాల్యైర్నమస్యారైర్యజేదేతాశ్చ దేవతాః.46

ప్రవాపనే ప్రలవనే ఖలసీతాప హారయోః | అమోఘం కర్మభవతి వర్ధతే సర్వాదా కృషిః.47

సముద్రాదితి సూక్తేన కామనాప్నోతి పావకాత్‌ | విశ్వానర ఇతిద్వాభ్యాం యఋగ్భ్యాం వహ్నిమర్హతి.48

స తరత్యాపదఃపర్వాయశః ప్రాప్నోతి చాక్షయమ్‌|

విపులాం శ్రియ మాప్నోతి జయం ప్రాప్నోత్యనుత్తమమ్‌.49

అగ్నే త్వమితి చస్తుత్వా ధనమస్నోతి వాంఛితమ్‌ | ప్రజాకామోజపేన్నిత్యం వరుణం దైవతత్రయమ్‌.50

స్వస్త్యాత్రయం జపేత్ర్పాతఃసదాస్వస్త్యయనం మహత్‌|

స్వస్తిపంథా ఇతి ప్రోచ్య స్వస్తిమాన్ప్రజతే 7ధ్వని.51

విజిగీషుర్వ (ష్వవ) నస్పతే శత్రూణాం వ్యాధితం భ##వేత్‌|

స్త్రియాగర్భ ప్రమూడాయా గర్భమోక్షణ ముత్తమమ్‌.52

ఆచ్ఛావదేతి సూక్తంచ వృష్టికామః ప్రయోజయేత్‌ | నిరాహారఃక్లిన్నవాసా నచిరేణ ప్రవర్షతి.53

మనసః కామ ఇత్యేతాం పశుకామో నరోజపేత్‌ | కర్దమేని ఇతిస్నాయాత్ర్పజాకామః శుచివ్రతః. 54

అశ్వపూర్వామితి స్నాయాద్రాజ్య కామస్తు మానవః|రోహితే చర్మణి స్నాయాద్బ్రాహ్మణస్తు యథావిధి.55

రాజా చర్మణి వైయాఘ్రే చాగే వైశ్యస్తథైవచ | దశసాహస్రికో హోమఃప్రత్యేకం పరికీర్తితః.56

ఆగార ఇతి సూక్తేన గోష్ఠేగాం లోకమాతరమ్‌ | ఉపతిష్ఠేద్వ్రజేచ్చైవ యదిచ్ఛేత్తాఃసదాక్షయాః.57

ఉవైతి తిసృభారాజ్ఞో దుందుబిమభి మంత్రయేత్‌ | తేజోబలం చ ప్రాప్నోతి శత్రుం చైవ నియచ్ఛతి.58

తృణపాణిర్జపూత్సూక్తం రక్షోఘ్నం దస్యుభిర్వృతః|

యేకేచ జ్మేత్యృచం జప్త్వా దీర్ఘమాయురవాప్నుయాత్‌.59

జీమూత సూక్తేన తథాసేనవాంగాన్యభి మంత్రయేత్‌ | యథాలింగం తతో రాజా వినమన్తిరణరిపూన్‌.60

అగ్నేయేతి త్రిభిఃసూక్తైర్దన మాప్నోతి చాక్షయమ్‌ | అమీవహేతి సూక్తేన భూతాని స్థాపయేన్ని శి.61

సంబాదే విషయే దుర్గే బంధోవానిర్గతః క్వచితః| పలాయన్వాగృహీతోవా సూక్తమేత త్తధాజపేత్‌.62

త్రిరాత్రం నియతోపోష్య శ్రపయేత్పాయసం చరుమ్‌ | తేనాహుతిశతం పూర్ణం జుహుయాత్‌త్ర్యంబకేత్సృచా.

సముద్ధిశ్యమహాదేవం జీవేదబ్ధశతం సుఖమ్‌ | తచ్చక్షురిత్యృచాస్నాత ఉపతిష్ఠేద్దివాకరమ్‌.64

ఉద్యస్తం మధ్యగం చైవ దీర్ఘమాయుర్జిజీవిషుః | ఇంద్రాసోమేతి సూక్తంతు కథితం శత్రునాశనమ్‌.65

యస్యలుప్తం వ్రతం మోహాద్ర్వాత్యైర్వాసంసృజేత్సహ | ఉపోష్యాజ్యం స జహుయాత్త్వమగ్నేవ్రతపాఇతి.

ఆదిత్యేత్యృ క్‌ చ సమ్రాజం జప్త్వావాదే జయీభ##వేత్‌ | మహీతి చ చతుష్కేణ ముచ్యతే మహతోభయాత్‌.

ఋచం జప్త్వాయది హ్యేతత్సర్వకామానవాప్నుయాత్‌ | ద్వాచత్వారి శతం చైంద్రం జప్త్వానాశయతేరిపూన్‌.

వాచం మహీతి జప్త్వాచ ప్రాప్నోత్యారోగ్యమేవచ | శన్నోభ##వేతి ద్వాఖ్యాంతు భుక్త్వాన్నం ప్రయతః శుచిః.

హృదయం పాణినా స్పృష్ట్వా వ్యాధిభిర్నాభి భూయతే |

ఉత్తమేద మితస్నాతో హుత్వాశత్రుం ప్రమాపయేత్‌. 70

శన్నోగ్న ఇతి సూక్తేన హులేనాన్నమవాప్నుయాత్‌ | కన్యావారర్షి సూక్తేన దిగ్ధోషా ద్విప్రముచ్యతే. 71

కృషిచేయనున్నవాడు క్షేత్రమధ్యమగమును యథావిధిగా స్థాలీపాక హోమము చేయవలెను. ఇంద్ర, మరుత్‌, పర్జన్య, భగులకు, స్వాహాంతముగ హోమముచేయవలెను. కృషీవలుడు నాగలిని లింగమును విహరింపచేసినట్లు విహరింప చేయవలెను. ఆ సమయమున ''శునాసీరావిమాం'' 4-57-5 అను మంత్రమునుకూడ జపించవలెను. పిమ్మట గంధమాల్య నమస్కారాదులతో అచటనున్న అధిష్ఠాన దేవతలను పూజించవలెను. ఇట్లు చేయుటచే విత్తనములు చల్లుట, పంటకోయుట, కళ్లములోనికి తీసుకువచ్చుట మొదలగు కర్మలన్నియు అమోఘముగ జరిగిపోవును. కృషి సర్వదా వృద్ధిపొందును. ''సముద్రాదూర్మిర్మధుమాన్‌'' (4-58-1) అను సూక్తమును జపించుటచే ఆగ్నినుండి పూజించువాడు సమస్త ఆపదలును తొలగి అక్షయమగు కీర్తి పొందును. అత్యధికమగు లక్ష్మియు విజయముకూడ అతనికి లభించును. ''ఆగ్నేత్వం (5-24-1) అను ఋక్కుచే అగ్నిని స్తుతించువానికి మనోవాంఛిత ధనము లభించును. సంతానము కోరువాడు మూడు వరుణదేవతా ఋక్కులను నిత్యము జపించవలెను. ''స్వస్తినఇంద్రః'' (1-89-6-8) మొదలగు మూడు ఋక్కులను సర్వదా ప్రాతః కాలమున జపించినచో అది గొప్ప స్వస్త్యయనము. ''స్వస్తిపంథామనుచరేమ.'' (5-51-15) అను ఋక్కును చదువుటచే మార్గమున యాత్ర సుఖముగా జరుగును. ''విజిహీష్వవనస్పతే'' (5-78-5) అను మంత్రము జపించుటచే శత్రువులు రోగగ్రస్తులగుదురు. గర్భవేదనతో బాధపడు స్త్రీకి గర్భమోక్షణము కలుగును. వర్షము కోరువాడు ఉపవాసమునుండి తడి బట్టలు ధరించి ''అచ్ఛాపద'' (5-83) ఇత్యాది సూక్తమును ప్రయోగించినచో వెంటనే వర్షము వచ్చును. పశుధనము కోరు వాడు''మనసఃకామం'' శ్రీ సూక్తం (10) ఇత్యాది మంత్రమును జపించవలెను సంతానము కోరువాడు పవిత్రవ్రతమును అవలంబించి ''కర్దమేన'' (శ్రీ సూక్తం 11) అను మంత్రముతో స్నానము చేయవలెను. రాజ్యము కోరువాడు ''అశ్వపూర్వాం'' (శ్రీసూక్తం 3) అను మంత్రమును జపించుచు స్నానము చేయవలయును. బ్రాహ్మణుడు యథావిధిగా రోహితచర్మముపైనను క్షత్రియుడు వ్యాఘ్రచర్మముపైనను వైశ్యుడు ఛాగ (మేక) చర్మముపైనను స్నానము చేయవలయును. ఒక్కొక్క మంత్రమునకు పదివేలచొప్పున హోమములు చేయవలెను. అక్షయ గోధనము కోరువాడు గోశాలలో ''అగావః'' (6-28-21) అను ఋక్కును జపించుచు లోకమాతయైన గోవునకు నమస్కరించి గోచర భూమివరకు దాని వెనుక వెళ్లవలెను. రాజు''ఉప''ఇత్యాది ఋక్త్రయముతో తన దుంథుభులను అభిమంత్రించినచో తేజోబలసంపన్నుడై శత్రువును వశముచేసుకొనును. దస్యువులు చుట్టుముట్టినప్పుడు చేతిలో తృణము గ్రహించి రక్షోఘ్నసూక్తమును (10-87) జపించవలెను. ''యేకేచజ్మా'' (6-52-15) అను ఋక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. రాజు జీమూత సూక్తముతో సేనాంగములన్నింటిని వాటి వాటి చిహ్నములనుసరించి అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులను నశింపచేయకలుగును. ''ప్రాగ్నయే'' (7-5) ఇత్యాది సూక్తత్రయమును జపించుటచే అక్షయధనము లభించును. ''అమీవహా'' (7-55) అను సూక్తము పఠించి రాత్రి భూతముల స్థాపన చేయవలెను. సంకటములందును విషయమునందును దుర్గమస్థలములందును బంధనమునందును బంధయుక్తావస్థయందును పారిపోవునపుడును, పట్టుబడినపుడు సహాయము కోరువాడు ఈ సూక్తమును జపించవలెను. మూడు దినములు నియమపూర్వకముగా ఉపవాసముచేసి పాయసము బండించి ''త్ర్యంబకం యజామహే'' (7-59-12) అను మంత్రముతో మహాదేవుని ఉద్దేశించి అగ్నిలో నూరు హోమములుచేసి దానితోనే పూర్ణాహుతి ఇచ్చినచో నూరు సంవత్సరములు సుఖముగ జీవించును. దీర్ఘాయువు కోరువాడు స్నానముచేసి ''తచ్ఛక్షుర్దేవహితం'' (7-66-16) అను సూక్తముతో సూర్యుని ఉదయించునపుడును ఆకాశమధ్యమునందున్నపుడను ఉపస్థానము చేయవలెను. నహిఇత్యాది ఋక్చతుష్టయమును పఠించువాడు భయవిముక్తుడగును. ''ఇంద్రాసోమాతపతం'' (7-104) మొదలగు సూక్తము శత్రువినాశకరము. అజ్ఞానముచే వత్రభంగమైనను వ్రాత్యుల సంసర్గముచే పతితుడైనను ఉపవాసముచేసి ''త్వమగ్నవ్రతసా'' (8-11-1) అను ఋక్కుతో ఆజ్య హోమము చేయవలెను. ''ఆదిత్య'' ''సమ్రాజా'' అను రెండు ఋక్కులను జపించు వాడు వాదమునందు విజయముపొందును. మహీ ఇత్యాది ఋక్చతుష్టయమును జపించుటచే మహాభయ విముక్తుడగును ''యది'' ఇత్యాది ఋక్కును జపించుటచే సర్వకామసిద్ధి కలుగును. ఇంద్రునికి సంబంధించిన నలుబదిరెండు ఋక్కులను జపించుటచే శత్రువులు నశింతురు. ''వాచం మహి'' అను ఋక్కును జపించుటచే ఆరోగ్యము లభించును. పవిత్రుడిగా వుండి ''శంనోభవ'' (8-48-4-5) అను రెండు ఋక్కులను జపించుచు భోజనము చేసి హృదయమును హస్తముతో స్పృశించువాడు ఎన్నడును వ్యాధిగ్రస్తుడుకాడు స్నానముచేసి ''ఉతమేదం'' అను మంత్రముతో హోమముచేయువాడు శత్రువులను సంహరించును. ''శంనోఅగ్ని'' (7-35) అను సూక్తముతో హోమము చేసినవాడు ధనవంతుడగును. ''కన్యావాఖాయతి'' (8-91) అను సూక్తము జపించుటచే దిగ్ర్భమదోషము తొలగిపోవును.

యదన్త్య కవ్యే త్ముదితే జపే7వశ్యం జగద్భవేత్‌ |

యద్వాగితి చ జప్తేన వాణీభవతి సంస్కృతా. 72

వాచో విదమితి త్వేతాం జపన్వాచం సమశ్నుతే | పవి తాణాం పవిత్రం తుపావమాన్యోహ్యృచోమతాః. 73

వైఖానసా ఋచస్త్రింశత్పవిత్రాః పరమామతాః | ఋచో ద్విషష్టిః ప్రోక్తాశ్చ పరస్యేత్యృషిసత్తమ. 74

సర్వకల్మషనాశాయ పావనాయ శివాయచ | స్వాదిష్టయేతి సూక్తానాం సప్తషష్టి రుదాహృతా. 75

దశోత్తరాణ్యృఉచాం చైతాః పావమాన్యః శతానిషట్‌ |

ఏతజ్జపంశ్చ జహ్వంశ్చ ఘోరం మృత్యుభయం జయేత్‌. 76

అపోహిష్ఠేతి వారిస్థో జపేత్పాపభయార్దనే | ప్రదేవన్నేతి నియతోజపేచ్చ మరుధన్వసు. 77

ప్రాణాన్తికే భ##యేప్రాప్తే క్షిప్ర మాయుస్తు విన్దతి | ప్రావేయామిత్యృచమేకాం జపేచ్చమనసానిశి. 78

వ్యుష్టాయాముదితే సూర్యే ద్యూతేజయమవాప్నుయాత్‌ | మా ప్రగామేతి మూఢశ్చ పంథానం పథివిన్థతి. 79

క్షీణాయురితి మన్యేత యం కంచిత్సు హృదం ప్రియమ్‌ |

యత్తేయమితి తు స్నాతస్తస్య మూర్ధాన మాలభేత్‌. 80

సహస్రకృత్వః పంచాహం తేనాయుర్విన్దతే మహత్‌ | ఇదం మేధ్యేతి జహుయాద్ఘృతం ప్రాజ్ఞః సహస్రశః.

పశుకామో గవాం గోష్ఠే అర్థకామశ్చతుష్పథే | వయః సువర్ణ ఇత్యేతాం జపన్త్వై విన్దతేశ్రియమ్‌. 82

హవిష్యన్తీయ మభ్యస్య సర్వపాపైః ప్రముచ్యతే | తస్యరోగా వినశ్యంతి కాయాగ్నిర్వర్థతే తథా. 83

యా ఓషధయః స్వస్త్యయనం సర్వవ్యాధి వినాశనమ్‌ | బృహస్పతే అతీత్యేతద్దృష్టికామః ప్రయోజయేత్‌. 84

సర్వత్రేతిపరా శాంతిర్‌జ్ఞేయా ప్రతిరథస్తథా | సూత సాంకాశ్యపం నిత్యం ప్రజాకామస్య కిర్తితమ్‌. 85.

అహం రుద్రేతి ఇత్యేత ద్వాగ్మీ భవతి మానవః | నయోనౌ జాయతే విద్వాఞ్జపన్రాతీతి రాత్రిషు. 86

రాత్రిసూక్తం జపన్రాత్రౌ రాత్రిం క్షేమీనయేన్నరః | కల్పయన్తీతి చ జపన్నిత్యం కృత్వారినాశనమ్‌. 87

ఆయుష్యం చైవ వర్చస్యం సూక్తం దాక్షాయణం మహత్‌ | ఉతదేవాఇతి జపేదామయఘ్నం ధృతవ్రతః.

అయమగ్నే జనీత్యే తజ్జపేదగ్నిభ##యేసతి | అరణ్‌యా నీత్యరణ్యషు జపేత్తద్భయ నాశనమ్‌. 89

బ్రాహ్మీమాసాద్య సూక్తే ద్వే ఋచం బ్రాహ్మీ శతాపరీమ్‌ | పృథగద్భిర్ఘృతైర్వాథ మేధాం లక్ష్మీంచ విన్ధతి. 90

మాస ఇత్య సపత్నఘ్నం సంగ్రామం విజిగీషతః | బ్రహ్మణో7గ్నిః సంవిదానం గర్భమృత్యునివారణమ్‌. 91

సూర్యోదయ సమయమును ''యదద్యకచ్చ'' (8-94-4) అను ఋక్కును జపించుటచే సకల జగత్తు వశమగును. ''యద్వాక్‌'' (8-100-10) ఇత్యాది ఋక్కును జపించుటచే వాక్కు సంస్కృతమగును ''వాచోవిదాం'' (8-101-16) అను మంత్రమును జపించువాడు వాక్శక్తిని పొందును. పావమానీ ఋక్కులును వైశాసన ఋక్కులు ముప్పదియు, అతి పవిత్రమైనవి. ఓ ఋషిశ్రేష్ఠా! ''పరస్య'' మొదలగు అరువదిరెండు ఋక్కులుకూడ అతి పవిత్రమైనవి ''స్వాదిష్ట్యా'' మొదలగు అరువదిఏడు సూక్తములు సర్వ కల్మషములను నశింపచేయును మంగలముకల్గించును. ''పావమానీ'' ఋక్కులు ఆరువందలపది వున్నవి. వీటిని జపించువాడును, హోమము చేయువాడును మృత్యుభయమును జయించును పాపభయ వినాశము కోరువాడు ''అపోహిష్ఠాః'' (10-9-1-3) ఇత్యాది ఋక్కులను నీటిలో నిలబడి జపించవలెను. ఎడారిలో ప్రాణాంతకభయము ఏర్పడినపుడు నియమపూర్వకముగా ''ప్రదేవతా బహ్మణ'' (10-30-1) అను మంత్రమును జపించువాడు భయవిముక్తుడై దీర్ఘాయువును పొందును. ''ప్రావేపా'' (10-34-1) అను ఋక్కును సూర్యోదయ సమయమున మనసా జపించవలెను. దీనివలన ద్యూతమున విజయము లభించును. ''మాప్రగామ'' (10-57-1) అను ఋక్కును జపించుటచే దారితప్పినవాడు సరియైన దారిని పొందును. తన ప్రియమిత్రుని ఆయర్దాయము క్షీణమైనచో ''యత్తేయమం'' (10-58-1) అను మంత్రమును జపించుచు వాని శిరస్సును స్పృశించవలెను. ఐదు దినములు 1000 పర్యాయములు ఈ విధముగ చేయుటచే అతనికి దీర్ఘాయువు లభించును. ''ఇదమిత్థారౌద్రం'' (10-61-1) అను ఋక్కుతో వెయ్యి ఆజ్మహోమములు చేయవలెను. పశుకాముడు గోశాలయందును, ధనకాముడు చతుష్పథమునందును చేయవలెను. ''వయఃసుపర్ణా'' (10-73-11) అను ఋక్కు జపించువానికి లక్ష్మి లభించును. ''హవిష్యన్తం'' (10.88-1) అను మంత్రమును జపించువాడు పాపవిముక్తుడగును. అతని రోగములు నశించును. జఠరాగ్ని వృద్ధిపొందును. స్వస్త్యయనకరమగు ''యాఓషధయః'' అను మంత్రము సర్వవ్యాధివినాశకము వృష్టికాముడు ''బృహస్పతే అతి'' (2-23-15) అను మంత్రమును ప్రయోగించవలెను. 'సర్వత్ర' ఇత్యాది మంత్రముచే గొప్ప శాంతిలభించును సంతానకామునకు సాంకాశ్య సూక్తజపము మంచిది ''అహంరుద్రేభిః వసుభిః'' (10-125-1) అను ఋక్కు జపించువాడు ప్రవచనమునందు సమర్థుడగును. ''రాత్రీవ్యఖ్యదాయతి'' (10-127-1) అను మంత్రమును జపించువానికి పునర్జన్మ వుండదు రాత్రియందు ''రాత్రిసూక్తము''ను జపించువాడు రాత్రిని సుఖముగా గడుపును ''కల్పయంతీ'' ఇత్యాది మంత్రమును జపించు శత్రువినాశకుడగును. ''దాక్షయణ'' సూక్తము గొప్ప ఆయర్దాయమును, తేజస్సును ఇచ్చును. ''ఉతదేవాః'' (10-1?7-1) అను మంత్రమును రోగనాశకము. దీనిని వ్రతధారణ పూర్వకముగ జపించవలెను. అగ్నిభయము కలిగినపుడు ''ఆయమగ్నే జరితా'' (10-142-1) ఇత్యాది మంత్రమును జపించవలెను. అరణ్యములో ''అరణ్యాన్యరణ్యాని'' (10-146-1) అను మంత్రమును జపించుటచే భయము తొలగును. ''బ్రాహ్మణి'' తీసుకొని బ్రహ్మసంబంధమైన రెండు. సూక్తములను జపించవలెను. బ్రాహ్మీలతను. శతావరీలతను, వేరు వేరుగ ఉదకముతోగాని, ఘృతముతోగాని, తీసుకున్నచో మేధాక్ష్ములు లభించును. ''శాశఇత్థా'' (10-152-1) అను ఋక్కు శత్రువినాశకము. యుద్ధమున విజయము కోరువాడు దీనిని జపించవలెను. ''బ్రహ్మణాగ్నిః'' (10-162-1) అను ఋక్కు శత్రువినాశకము యుద్ధమున విజయము కోరువాడు దీనిని జపించవలెను. ''బ్రహ్మణాగ్నిః'' (10-162-) అను ఋక్కు గర్భమృత్యునివారకము.

అపైహీతి జపేత్సూక్తం శుచిర్దుః స్వప్ననాశనమ్‌ | యేనేదమితివై జప్త్వా సమాధిం విన్ధతేపరమ్‌. 92

మయో భూర్వాత ఇత్యేతద్గవాం స్వస్త్యయనం పరమ్‌ | శాంబరీ మింద్రజాలం వా మాయామేతేన వారయేత్‌.

మహీత్రీణా మవరోస్త్వితి పథిస్వస్త్యయనం జపేత్‌ | ఆగ్నయే విద్విషన్నేవం జపేచ్చ రిపునాశనమ్‌. 94

వాస్తోష్పతేన మంత్రేణ యజేత గృహదేవతాః | జపసై#్యష విధిః ప్రోక్తోహుతే జ్ఞేయో విశేషతః. 95

హోమాన్తే దక్షిణాదేయా పాపశాన్తిర్హుతేనతు | హుతం శామ్యతి చాన్నేన అన్న హేమ ప్రదానతః. 96

విప్రాశిషస్త్వమోఘాః స్యుర్బహిః స్నానంతు సర్వతః | సిద్ధార్థకా యవా దాన్యం పయో దధిఘృతం తథా.

క్షీర వృక్షాస్తతేధ్మంత హోమావై సర్వకామదాః | సమిధః కంటకిన్యశ్చ రాజికా రుధిరం విషమ్‌. 98

అభిచారే తథాశైలమశనం సక్తవః పయః | దధి భైక్ష్యం ఫలంమూల మృగ్విధాన ముదాహృతమ్‌. 99

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఋగ్విధానం నామైకోన షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

పవిత్రుడై ''అపేహి'' (10-164) అను సూక్తమును జపించినచో దుస్వప్నములు నశించును. ''యేనేదం' ఇత్యాది ఋక్కును జపించుటచే సమాధిస్థుడగును ''మయోర్భూర్వాతః'' (10-169-1) అను గోవునకు మంగళకరమగు ఋక్కుచే ఇంద్రజాలమాయనుకాని, శాంబరీమాయనుకాని, జయించవచ్చును. ''మహిత్రీణాం'' (10-185-1) అను కళ్యాణకరమగు ఋక్కును మార్గమునందు జపించవలెను. ''ప్రాగ్నయే'' (10-187-1) అను మంత్రమును జపించుటచే ద్వేషపాత్రుడగు శత్రువు నశించును. ''వాస్తోష్పతే'' మొదలైన నాలుగు మంత్రములతో గృహదేవతలను పూజించవలెను. ఇంతవరకు జపవిధానము చెప్పబడినది. ఇపుడు హోమవిధానమును తెలుసుకొనవలెను. హోమాంతమున దక్షిణ ఇవ్వవలెను. హోమముచే పాపశాంతి. అన్నముచే హోమశాంతి సువర్ణదానముచే అన్నశాంతి కలుగును. బ్రాహ్మణ ఆశీస్సులు ఎన్నడును వ్యర్థముకావు యజమానుడు అన్నివైపుల బయట స్నానము చేయవలయును. తెల్ల ఆవాలు, యవలు, ధాన్యము, పాలు, నెయ్యి, పెరుగు, పాలచెట్ల సమిధలు, వీటితో హోమము చేయుట సర్వకామప్రదము. అభిచార ప్రయోగమున ముళ్ళతోకూడిన సమిధలు, రాజికలు, రక్తము, విషము, హోమము చేయవలయును. హోమసమయమున శిలోంఛవృత్తులచే లభించిన అన్నమున సక్తవుల పాలు, పెరుగు, ఫలమూలములు భుజించవలెను. ఇంతవరకు ఋగ్విధానము చెప్పబడినది.

అగ్ని మహాపురాణమునందు ఋగ్విధానమను రెండువందల యేబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

అథ షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

అథ యజుర్విధానమ్‌

పుష్కర ఉవాచ :

యజుర్విధానం వక్ష్యామి భుక్తిముక్తి|పదం శృణు | ఓంకార పూర్వికారామ మహావ్యాహృతయో మతాః. 1

సర్వకల్మషనాశిర్యః సర్వకామప్రదాస్తథా | అజ్యాహుతి సహస్రేణ దేవానారాధయేద్బుధః. 2

మనసః కాంక్షితం రామ మనసేప్సిత కామదమ్‌ | శాంతికామో యవైః కుర్యాత్తిలైః పాపాసనుత్తయే. 3

ధానైః సిద్దార్థకైశ్చైవ సర్వకామకరైస్తథా | ఔదుంబరీభిరిధ్యాభిః పశుకామస్య శస్యతే. 4

దధ్నా చైవాన్న కామస్య పయసా శాన్తిమిచ్ఛతః | అపామార్గం సమిద్భిస్తు కామయన్కనకం బహు. 5

కన్యాకామో ఘృతాక్తాని యుగ్మశోగ్రథితానితు | జాతీ పుష్పాణి జుహుయాద్గ్రామార్థీతిలతండులాన్‌. 6

వశ్యకర్మణి శాఖోట వాసాపా మార్గమేవచ | విషాసృఙ్‌ మిశ్ర సమిధో వ్యాధిఘాతస్య భార్గవ. 7

క్రుద్ధస్తు జహుయాత్సమ్యక్ఛత్రూణాం వధకామ్యయా | సర్వవ్రీహిమయీం కృత్వా రాజ్ఞః ప్రతికృతింద్విజః.

సహస్రశస్తు జుహుయాద్రాజావశగతో భ##వేత్‌ | వస్త్రకామస్య పుష్పాణి దూర్వావ్యాధివినాశినీ. 9

బ్రహ్మవర్చస కామస్య వాసోగ్రంచ విధీయతే | ప్రత్యంగిరేషు జహుయాత్తుష కంటకభస్మభిః. 10

విద్వేషణ చ పక్ష్మాణి కాక కౌశికయోస్తథా | కాపిలంచ ఘృతం హుత్వా తథా చంద్రగ్రహేద్విజః 11

వచాచూర్ణేన సంపాతాత్స మానీయచతాం వచామ్‌ | సహస్రమంత్రితాం భుక్త్వా మేధావీ జాయతేనరః. 12

ఏకాదశాంగులం శంకుం లౌహం ఖాదిరమేవచ | ద్విషతోవధో7సీతి జపన్నిఖనేద్రి పువేశ్మని. 13

ఉచ్చాటన మిదం కర్మ శత్రూణాం కథితం తవ | చక్షుష్యా ఇతి జప్త్వాచ వినష్టం చక్షురాప్నుయాత్‌. 14

ఉపయుంజత ఇత్యేతదనువాకం తథాన్నదమ్‌ | తనూనపాగ్నే సదితి దూర్వాహుత్వార్తివర్జితః. 15

భేషజమసీతి దధ్యాజ్యైర్హోమః పశూపసర్గనుత్‌ | త్రియంబకం యజామహే హోమః సౌభాగ్యవర్ధనః. 16

కన్యానామ గృహీత్వాతు కన్యాలాభకరః పరః | భ##యేషుతు జపన్నిత్యం భ##యేభ్యో విప్రముచ్యతే. 17

ధుస్తూ (త్తూ) ర పుష్పం సఘృతం హుత్వా స్యాత్సర్వ కామభాక్‌ |

హుత్వాతు గుగ్గులం రామ స్వప్నే పశ్యతి శంకరమ్‌. 18

యుంజతే మనో7నువాకం జప్త్వా దీర్ఘాయురాప్నుయాత్‌ | విష్ణోరరాట మిత్యేతత్సర్వ బాధావినాశనమ్‌. 19

రక్షోఘ్నం చ యశస్యం చ తథైవ విజయప్రదమ్‌ | అయంనో అగ్నిరిత్యేతత్సంగ్రామే విజయప్రదమ్‌.20

ఇదమాపః ప్రవహత స్నానే పాపాపనోదనమ్‌ | విశ్వకర్మన్ను హవిషా సూచీం లౌహీం దశాం గులామ్‌.

కన్యాయా నిఖనే ద్ద్వారి సా7ప్యసై#్మ నప్రదీయతే | దేవ సవితరేతేన హుతేనైతేన చాన్నవాన్‌. 22

పుష్కరుడు పలికెను. పరశురామ ! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు యజుర్విధానమును చెప్పెదను వినుము. ఓంకార యుక్తములగు మహావ్యాహృతులు సకల పాపనాశకములు, సర్వకామప్రదములు. బుద్ధిమంతుడు వీటితో నూరు హోమములు చేసి దేవతలను ఆరాధించవలెను. దీని వలన మనోవాంఛితములగు కోరికలు తీరును శాంతికాముడు యవలతోను పాపవినాశనమును కోరువాడు తిలలతోను, హోమము చేయవలెను. ధాన్యములతోను తెల్లావాలతోను హోమము చేసినచో సర్వకామములు సిద్ధించును. పశుకాముడు ఉదుంబరమిధలతో హోమము చేయవలెను. అన్నకాముడు పెరుగుతోను శాంతి కాముడు పాలతోను, అధికసువర్ణకాముడు అపామార్గసమిధలతోను హోమము చేయవలెను. కన్యకను కోరువాడు రెండేసి చొప్పున కట్టిన, నేతితో తడిపిన జాతిపుష్పములను హోమము చేయవలెను. కామము కోరువాడు తిలలను తండులములను హోమము చేయవలెను. వశీకరణ కర్మయందు శాకోట - వస - అపామార్గ - సమిధలను హోమము చేయవలెను. ఓ భార్గవా! రోగనాశనిమిత్తము విషరక్తములతో తడిపిన సమిధలు హోమముచేయవలెను. శత్రువధ కోరువారు క్రోధపూర్వకముగ పైసమిధలను హోమము చేయవలెను. ద్విజుడు అన్నిధాన్యములతో ఒక రాజప్రతిమను నిర్మించి దానిని వేయిసార్లు హోమము చేసినచో రాజు వశమగును. వస్త్రకాముడు పుష్పములను హోమముచేయవలెను. ''దూర్వా'' హోమము వ్యాధి వినాశకము. బ్రహ్మతేజము కోరువాడు ఉత్తమ వస్త్రమును అర్పించవలెను. విద్వేషణకర్మయందు ప్రత్యంగిరోక్త విధానానుసారముగ స్థాపించిన అగ్నియందు పొల్లుముల్లు, భస్మము, కాకి ఈకలు, గుడ్లగూబ ఈకలు హోమము చేయవలెను. చంద్రగ్రహణసమయమున కపిలధేను ఘృతమును, హోమముచేసి అఘృతమునందు వసా చూర్ణమును కలిపి ''సంపాతము'' అనే ఆహుతినిచ్చి, మిగిలిన వసను తీసుకొని వెయ్యిసార్లు గాయత్రిచే అభిమంత్రించి, అవసను తిన్నచో మేధావియగును. పదకొండు అంగుళముల లోహశంకువుకాని ఖదిర వృక్షపు శంకువు కాని ''ద్విషతోవధో7సి'' (1.28) అను మంత్రమును జపించుచు శత్రువు ఇంటిలో పాతవలెను. ఈ విధముగా శత్రువినాశకమగు కర్మను నీకు చెప్పితిని. ''చక్షుష్యా'' (2.16) ఇత్యాది మంత్రమును జపించుటచే పోయిన చూపువచ్చును. ''ఉపయుంజతే'' ఇత్యాది అనువాకము అన్నమునుఇచ్చును. ''తనూనపాగ్నే7సి'' (3-17) ఇత్యాదిమంత్రముతో దూర్వాహోమము చేసినచో సంకలములు దూరమగును. ''ఖేషజమసి'' (3-59) ఇత్యాది మంత్రముతో పెరుగు, నెయ్యి హోమము చేసినచో పశువునకు వచ్చు మహామారి రోగములు తొలగిపోవును. ''త్రియంబకం యజామహే'' (3-60) అను మంత్రము చేత చేసినహోమము సౌభాగ్యవృద్ధికరము కన్య యొక్క పేరు చెప్పికాని కన్యనుద్దేశించికాని ఈ మంత్రముతో జపహోమములు చేసినచో ఇది కన్యాలాభమునకు ఉత్తమ సాధనము. భయములు వచ్చినపుడు నిత్యము ఈ మంత్రమును జపించువాడు భయవిముక్తుడగును. ఈ మంత్రముతో ఘృతమిశ్ర తత్తూర పుష్పములను హోమము చేసినవాడు సర్వకామములను పొందును. ఈ మంత్రముతో ''గుగ్గులు'' హోమము చేసిన వాడు స్వప్నమునందు శంకరుని చూచును. ''యుంజతేమనః'' (5-14) అను అనువాకమును జపించినవాడు దీర్ఘాయుర్దాయమును పొందును. ''విష్ణోరరాటమసి'' అను మంత్రము సకల బాధలను నివారించును. రాక్షసులను నశింపచేయును. ఇది కీర్తివర్ధకము విజయప్రదము. ''అయంనోఅగ్నిః'' (5-37) ఇత్యాది మంత్రము యుద్ధమునందు జయప్రదము. ''ఇదమాపః ప్రవహత'' (6-17) అను మంత్రము జపించుచు స్నానము చేసినచో పాపనాశకము. పది అంగుళముల పొడవైన ఇనుపఊచను ''విశ్వకర్మన్‌ హవిషా'' (17-22) అను మంత్రముచే అభిమంత్రించి యేకన్యకయొక్క ద్వారమువద్ద పాతెదరో ఆ కన్యను మరెవరికి ఇవ్వజాలరు. ''దేవసవితః'' (11-7) అనుమంత్రముతో హోమము చేసినవాడు అన్నవంతుడగును.

అగ్నౌస్వాహేతి జహుయాద్భల కామో ద్విజోత్తమః | తిలైర్య వైశ్చ ధర్మజ్ఞ తథాపామార్గతండులైః. 23

సహస్రమంత్రితాం కృత్వా తథా గోరోచనా ద్విజ | తిలకంచ తథాకృత్వా జనస్య ప్రియతామియాత్‌. 24

రుద్రాణాం చ తథా జప్యం సర్వాషు వినిషూదనమ్‌ | సర్వకర్మకరో హోమస్తథా సర్వత్ర శాంతిదః. 25

అజావికానామశ్వానాం కుంజరాణాం తథాగవామ్‌ | మనుష్యాణాం నరేంద్రాణాం బాలానాం యోషితామపి.

గ్రామాణాం నగరాణాంచ దేశానామపి భార్గవ | ఉపద్రుతానాం ధర్మజ్ఞ వ్యాధితానాం తథైవచ. 27

మరకేసమను ప్రాప్తే రిపుజే చ తథాభ##యే | రుద్రహోమః పరాశాంతిః పాయసేన ఘృతేనచ. 28

కూష్మాండ ఘృత హోమేన సర్వాన్పాపాన్వ్యపోహతి | సక్తుయావక భైక్షాశీ నక్తం మనుజసత్తమ. 29

బహిః స్నానరతో మాసాన్ముచ్యతే బ్రహ్మహత్యయా | మధువాతేతి మంత్రేణ హోమాదితో7ఖిలంలభేత్‌. 30

దధిక్రావ్ణేతి హుత్వాతు పుత్రాన్ర్పాప్నోత్య సంశయమ్‌ | తథాఘృతవతీత్యేతదాయుష్యం స్యాద్ఘృతేన తు. 31

స్వస్తిన ఇంద్ర ఇత్యేతత్సర్వ బాధావినాశనమ్‌ | ఇహగావః ప్రజాయధ్వమితిపుష్టివివర్ధనమ్‌. 32

ఘృతాహుతి సహస్రేణ తథా7లక్ష్మీ వినాశనమ్‌ | స్రువేణ దేవస్య త్వేతి హుత్వాపామార్గతండులమ్‌. 33

ముచ్యతే వికృతాచ్ఛీఘ్ర మభిచారాన్న సంశయః |

రుద్రపాతు (ద్రంయత్తే) పలాశస్య పమిద్భిః కనకం లభేత్‌. 34

శివో భ##వేత్యగ్న్యుత్పాతే వ్రీహిభిర్జుహుయాన్నరః | యాః సేనా ఇతి చైతచ్చ తస్యరేఖ్యో భయాపహమ్‌. 35

యో అస్మభ్య మవాతీయాద్ధుత్వా కృష్ణతిలాన్నరః | సహస్రశో7భిచారాచ్చ ముచ్యతే వికృతాద్‌ద్విజః. 36

అన్నేనాన్నపతే త్యేవం హుత్వా చాన్న మవాప్నుయాత్‌ | హంసః శుచిషదిత్యేతజ్జప్తం తోయే7షు నాశనమ్‌.

చత్వారి శృంగే త్యేతత్తు సర్వపాపహరం జలే | దేవాయజ్ఞేతి జప్త్వాతు బ్రహ్మలోకే మహీయతే. 38

వసంతేతిచ హుతవ్‌ఆజ్యమాదిత్యాద్వ రమాప్నుయాత్‌ | సుపర్ణో సీతి చేత్యస్య కర్మవ్యాహృతి వద్భవేత్‌. 39

నమః స్వాహేతి త్రిర్జప్త్వా బంధనాన్మోక్ష మాప్నుయాత్‌ | అంతర్జలే త్రిరావర్త్య ద్రుపదాసర్వ పాపముక్‌.

(అ) 2 /19

బల కాముడగు ద్విజుడు ''అగ్నౌస్వాహా'' అనుమంత్రముతో తిలలు యవలు, అపామార్గ సమిధలు తండులములు హోమము చేయవలెను. ఈ మంత్రముతో వెయ్యిపర్యాయములు అభిమంత్రించిన గోరోచనమును తిలకముగా ధరించినచో లోకప్రియుడగును. రుద్రమంత్రముల జపము సర్వపాద వినాశకము. వానితో చేసిన హోమము సర్వకర్మ సాధకము. అంతటను శాంతిప్రదాయకము. మేకలు, గొఱ్ఱలు, గుర్రములు, ఏనుగులు, గోవులు, మనుష్యులు, రాజులు, బాలురు, స్త్రీలు, గ్రామములు, నగరములు, దేశములు, వివిధోపద్రవ పీడితములై రోగగ్రస్తులైనను మహామారీ భయము కాని శత్రుభయము కాని వచ్చినను ఘృతమిశ్రితమగు పాయసముతో రుద్రదేవతనుద్దేశించి హోమము చేసినచో గొప్పశాంతి లభించును. ఓ నరశ్రేష్ఠా! రాత్రియందు మాత్రమే సక్తువులు యవల గంజి భిక్షాన్నము భుజించుచు ఒక మాసముపాటు బయటస్నానము చేయువాడు బ్రహ్మహత్యా పాపవిముక్తుడగును. ''మధువాతా'' (13-17) ఇత్యాది మంత్రముతో హోమాదులు చేసినచో సర్వము లభించును. ''దధిక్రావ్‌ణో'' (23-32) అను మంత్రముచే హోమముచేయు గృహస్థుడు నిస్సంశయముగా పుత్రులను పొందును. ''ఘృతవతీ భువనానామఖి'' (34-45) అను మంత్రముతో ఘృతహోమము చేసినచో ఆయుర్వృద్ధి కలుగును. ''స్వస్తినః ఇంద్రః'' (25-19) అనుమంత్రము సమస్తబాధలను నశింపచేయును. ''ఇహగావః ప్రజాయధ్వం'' అను పుష్టివర్ధక మంత్రముతో వెయ్యి ఘృతహోమములు చేసినచో దారిద్ర్యము నశించును. ''దేవస్యత్వా'' అను మంత్రముతో సృఉవముతో అపామార్గ సమిధలను, తండులములను హోమము చేసినవాడు శీఘ్రముగా అభిచారవిముక్తుడగును. సంశయము లేదు ''రుద్రయత్తే'' (10-20) అను మంత్రముతో పలాశసమిధలను హోమము చేసినచో సువర్ణము లభించును. అగ్ని ప్రమాదము కల్గినపుడు ''శివోభవ'' (11.45) అనుమంత్రముతో వ్రీహి హోమము చేయవలయును. ''యాఃసేనాః'' అను మంత్రము చోరభయము తొలగించును. ''యో అస్మభ్యమరాతీయాత్‌ '' (11-80) అను మంత్రముతో వెయ్యి తిలహోమములు చేయువాడు భయంకరమగు అభిచారము నుండి విముక్తుడగును. ''అన్నపతే'' (11-83) అను మంత్రముతో అన్నహోమమును చేసినవానికి అన్నము లభించును. నీటిలో నిలచి ''హంసః శుచిషత్‌'' (11-24) అను మంత్రమును జపించినచో సర్వపాపములు నశించును. నీటిలో నిలచి ''చత్వారిశృంగా'' (17-91) అను మంత్రమును జపించినచో సర్వపాపములు నశించును. ''దేవాయజ్ఞ మతన్వత'' (19-12) అను మంత్రమును జపించువాడు బ్రహ్మలోకమున పూజితుడగును. ''వసంతో7స్యాసీత్‌'' (31-14) అనుమంత్రముతో ఆజ్యహోమము చేయువానికి సూర్యుడు వరముల నిచ్చును. ''సువర్ణో7సి'' (17-22) అనుమంత్రముతో వ్యాహృతి మంత్రములతో చేసినట్లే కర్మ చేయవలెను. ''??స్వాహా'' ఇత్యాది మంత్రమును మూడు పర్యాయములు జపించినవాడు బంధవిముక్తుడగును నీటిలో నిలచి ''దృఉపదాదివ'' (20-20) అనుమంత్రమును మూడు పర్యాయములు చెప్పువాడు సర్వపాపవిముక్తుడగును.

ఇహగావః ప్రజాయధ్వం మంత్రోయం బుద్ధివర్దనః | హుతంతు సర్పిషాదధ్నా పయసా పాయసేవవా. 41

శతం య ఇతి చైతేన హుత్వా పూర్ణఫలానిచ | ఆరోగ్యం శ్రియమాప్నోతి జీవితం చచిరం తథా. 42

ఓషధీః ప్రతిమోదధ్వం వషనే లవనే7ర్థకృత్‌ | అశ్వావతీ పాయసేన హోమాచ్ఛాన్తి మవాప్నుయాత్‌. 43

తస్మా ఇతి చ మంత్రేణ బంధనస్థో విముచ్యతే | యువా సువాసా ఇత్యేవ వాసాంస్యాప్నోతి చోత్తమమ్‌. 44

ముంచంతు మాశపథ్యాని (ది) సర్వాన్తక వినాశనమ్‌ | మామాహింసీ స్తిలాజ్యేన హుతం రిపు వినాశనవ్జు.

నమో7స్తు సర్వసర్పేభ్యో ఘృతేన పాయసేనతు | కృణుధ్వం రాజ ఇత్యేతదభిచార వినాశనమ్‌. 46

దూర్వాకాండాయుతం హుత్వా కాండాత్కాండేతి మానవః |

గ్రామే జనపదే వాపి మరకం తు శమం నయేత్‌. 47

రోగార్తో ముచ్యతే రోగాత్తథా దుఃఖాత్తు దుఃఖితః | ఔదుంబరీశ్చ సమిధో మధుమాన్నో వనస్పతిః. 48

హుత్వా సహస్రశో రామ ధనమాప్నోతి మానవః | సౌభాగ్యం మహదాప్నోతి వ్యవహారే తథాజయమ్‌. 49

అపాం గర్భమితి హుత్వాదేవం వర్షాపయేద్ధృవమ్‌ | అపః పిబేతి చ తథా హుత్వా దధిఘృతం మధు. 50

ప్రవర్తయతి ధర్మజ్ఞ మహావృష్టి మనన్తరమ్‌ | నమస్తే రుద్ర ఇత్యేతత్స్వోపద్రవ నాశనమ్‌. 51

సర్వశాంతికరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌ | ఆధ్యవోచ దిత్యనేన రక్షణం వ్యాధితస్యతు. 52

రక్షోఘ్నం చ యశస్యంచ చిరాయుః పుష్టివర్ధనమ్‌ | సిద్ధార్థకానాం క్షేపేణ పథి చైతజ్జపన్సుఖీ. 53

అసౌ యస్తామ్ర ఇత్యేతత్పథన్నిత్యం దివాకరమ్‌ | ఉపతిష్ఠేత ధర్మజ్ఞ సాయంప్రాతర తంద్రితః. 54

అన్నమక్షయమాప్నోతి దీర్ఘమాయుశ్చ విన్దతి | ప్రముంచ ధన్వన్నిత్యేతత్షడ్బిరాయుధ మంత్రణమ్‌. 55

రిపూణాం భయదం యుద్ధే నాత్రకార్యావిచారణా | మానో మహాన్త ఇత్యేవం బాలానాం శాంతికారకమ్‌. 56

నమో హిరణ్యబాహవే ఇత్యనువాకసప్తకమ్‌ | రాజికాం కటుతైలాక్తాం జుహుయాచ్ఛత్రునాశినీమ్‌. 57

నమోవః కిరికేభ్యశ్చ పద్మలక్షైర్హుతైర్నరః | రాజలక్ష్మీమవాప్నోతి తథా బిల్వైః సువర్ణకమ్‌. 58

ఇమారుద్రాయేతి తిలైర్హోమాచ్చ ధనమాప్యతే | దూర్వాహోమేన చాన్యేన సర్వవ్యాధి వివర్జితః. 59

ఆశుః శిశాన ఇత్యేతదాయుధానాం చరక్షణ | సంగ్రామే కథితం రామ సర్వశత్రునిబర్హణమ్‌. 60

రాజసామేతి జుహుయాత్సహస్రం పంచభిర్ద్విజ | అజ్యాహుతీనాం ధర్మజ్ఞ చక్షూరోగాద్విముచ్యతే. 61

''ఇహగావః ప్రజాయధ్వం'' అను మంత్రముతో నెయ్యి, పెరుగు, పాలు లేదా పాయసము హోమము చేసినచో బుద్ధి వృద్ధి చెందును. ''శంన్నో దేవీః'' అను మంత్రముతో పలాశఫలములను హోముమ చేసినవానికి ఆరోగ్యము, లక్ష్మి చిరజీవనము లభించును. ''ఓషధిఃప్రతిమోదధ్వం'' (12-17) అను మంత్రముతో విత్తనుముల చల్లునపుడు, పంటకోయునపుడు హోమము చేసినచో అర్థప్రాప్తి కలుగును. ''అశ్వావతీః'' (34-40) అను మంత్రముతో పాయస హోమము చేసిన శాంతి లభించును. ''తస్మాఅరం'' (36-16 ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో బందియైన వాడు విడువబడును. ''యువాసువాసా'' (తై||బా|| 3-6-13) అను మంత్రముతో హోమము చేసిన వస్త్రము లభించును. ''మంచన్తు మాశపథ్యాత్‌'' (12-90) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో శాపాదులు నశించును. ''మామాహింసీజనీతాః'' (12-102) అను మంత్రముతో ఘృతమిశ్ర తిలలు హోమముచేయగ శత్రవులు నశింతురు.'' నమో7స్తు సర్వేభ్యః'' (13-6) అనుమంత్రముతో ఘృత హోమము ''కృణుధ్వం రాజ'' అను మంత్రముతో దూర్వాకాండములను వెయ్యిపర్యాయములు హోమము చేసినచో గ్రామములో గాని జనపదములోగాని వ్యాపించిన మహామారి శాంతించును. రోగపీడితుడు రోగవిముక్తుడగును. దుఃఖితుడు దుఃఖవిముక్తుడగును. ''మధుమాన్నోవనస్పతిః'' (13-29) అను మంత్రముతో వెయ్యి ఉదుంబర సమిధలు హోమము చేయుటచే ధనము గొప్ప సౌభాగ్యము, వ్యవహారములో విజయము లభించును. ''అపాంగర్భంసీద'' (వా||13-30) అనుమంత్రముతో హోమముచేయువాడు తప్పక పర్జన్య దేవునిచే వర్షముకుర్పింప చేయును. ''అపఃపిబన్‌'' (14-8) ఇత్యాది మంత్రముతో దధిఘృత మధువులను హోమము చేసినచో వెంటనే గొప్పవర్షము కురియును. ''నమస్తేరుద్ర'' (16-1) అను మంత్రము సర్వోపద్రవనాశకము, సర్వశాంతికరము, మహాపాతకములను నశింపచేయును. ''అధ్యవోచ దధిపక్తా'' (16-5) అను మంత్రముతో హోమము చేసినచో వ్యాధిగ్రస్తుడు రక్షింపబడును, రాక్షసులు నశింతురు, యశస్సులు లభించును. చిరాయువు పుష్టివృద్ధికలుగును. ఈమంత్రము చదువుతూ మార్గమునందు తెల్లఆవాలను చల్లు బాటసారి సుఖవంతుడగును. ''అసౌయస్తామ్రః'' (16-6) అనుమంత్రమును చదువుచూ, నిత్యము సాయం ప్రాతఃకాలములందు, ఆలస్యరహితుడు సూర్యోపస్థానము చేయుడు అక్షయమైన అన్నమును, దీర్ఘాయువును పొందును. ''ప్రముంచధన్వన్‌'' (16-9-14) ఇత్యాదిమంత్ర షట్కముతో ఆయుధములను అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులకు భయము కలుగును. ఈ విషయమున మరియొక విధముగా ఆలోచింప పనిలేదు. ''మానోమహాంతం'' (16-15) అను మంత్రము బాలలకు శాంతికారకము. ''నమోహిరణ్యవాహవే'' అను ఏడు అనువాకములతో తైలము కలిపిన రాజికలను హోమము చేసినచో శత్రువులు నశింతురు. ''నమోవఃకిరికేభ్యః'' (16-46) అను మంత్రముతో ఒకలక్ష కమలములను హోమము చేసినవాడు రాజ్యలక్ష్మిని, ఒక బిల్వఫలముల హోమము చేసినవాడు, సువర్ణ రాశిని పొందును. ''ఇమారుద్రాయ'' (16-48) అనుమంత్రముతో తిలహోమము చేసినచో ధనములభించును. ఈ మంత్రముతోనే దూర్వాహోమము చేసినచో సర్వవ్యాధులు నశించును. ''అశుఃశిశానః'' (17-33) అను మంత్రముతో ఆయుధములకు రక్ష, యుద్ధములందు సర్వ శత్రువినాశము కలుగును. ''వాజశ్చమే'' (18-15-19) ఇత్యాది మంత్రపంచకముతో అజ్యాహుతులు వెయ్యి చేసినచో నేత్రరోగములనుండి విముక్తుడగును.

శన్నోవనస్పతేగేహే హోమః స్యాద్యవాస్తు దోషనుత్‌|

అగ్న ఆయూంషి హుత్వాజ్యం ద్వేషం నాప్నోతి కేనచిత్‌. 62

అపాంఫేనేతి లాజాభిర్హుత్వా జయమవాప్నుయాత్‌ | భద్రా ఇతీంద్రియైర్హీనో జపన్స్యాత్సకలేంద్రియః. 63

అగ్నిశ్చపృథివీ చేతి వశీకరణ ముత్తమమ్‌ | అధ్వనేతి జపన్మంత్రం వ్యవహారే జయీభ##వేత్‌. 64

బ్రహ్మరాజన్యమితిచ కర్మారంభేతు సిద్ధికృత్‌ | సంవత్సరో7సీతి ఘృతైర్లక్షహోమాదరోగవాన్‌. 65

కేతుం కృణ్వన్నిత్యే తత్సంగ్రామే జయవర్ధనమ్‌ | ఇంద్రోగ్నిర్ధర్మ ఇత్యేతద్రణ ధర్మనిబంధనమ్‌. 66

ధన్వా నాగేతి మంత్రశ్చ ధనుర్గ్రాహణికః పరః | యుంజీతేతి తథామంత్రో విజ్ఞేయోహ్యభిమంత్రణ. 67

మంత్రశ్చాహి రథేత్యేతచ్ఛరాణాం మంత్రణ భ##వేత్‌ | వహ్నీనాం పితరిత్యేతత్తూణమంత్రః ప్రకీర్తితః. 68

యుంజ న్తీతి తథాశ్వానాం యోజనేమంత్ర ఉచ్యతే | ఆశుః శిశాన ఇత్యేతద్యాత్రారంభణ ముచ్యతే. 69

విష్ణోః కర్మేతి మంత్రశ్చ రథారోహిణికః పరః | ఆజంఘేతీతి చాశ్వానాం తాడనీయ ముదాహృతమ్‌. 70

యాః సేనా అభిత్వరీతి పరసైన్య ముఖేజ పేత్‌ | దుందుభ్య ఇతి చాప్యేతద్దుందుభీతాడనం భ##వేత్‌. 71

ఏతైః పూర్వహితైర్మంత్రైః కృత్వైవం విజయీభ##వేత్‌ | యమేన దత్తమిత్యస్య కోటి హోమాద్విచక్షణః. 72

రథముత్పాదయేచ్ఛీఘ్రం సంగ్రామే విజయప్రదమ్‌ | ఆకృష్ణేతి తథైతస్య కర్మవ్యాహృతివద్భవేత్‌. 73

శివసంకల్ప జాపేన సమాధిం మనసో లభేత్‌ | పంచసద్‌ః పంచలక్షం హుత్వాలక్ష్మీమవాప్నుయాత్‌. 74

యదా వధూ దాక్షాయణం మంత్రే ణానేన మంత్రితమ్‌ | సహస్రకృత్వః కనకం ధారయేద్రిపువరణమ్‌. 75

ఇమం జీవేభ్య ఇతిచ శిలాం లోష్టం చతుర్థిశమ్‌ | క్షి పేద్గృహే తదా తస్యన స్యాచ్చోర భయం నిశి. 76

పరిమే గామనేనేతి వశీకరణ ముత్తమమ్‌ | హన్తుమభ్యాగతస్తత వశీభవతి మానవః. 77

భక్ష్యతాంబూల పుష్పాద్యం మంత్రితం తుప్రయచ్ఛతి | యస్యధర్మజ్ఞ వశగః సో7స్య శీఘ్రం భవిష్యతి. 78

శన్నోమిత్ర ఇతీత్యేతత్సదా సర్వత్రా శాంతిదమ్‌ | గణానాంత్వా గణపతిం కృత్వా హోమం చతుష్పథే. 79

వశీకుర్యాజ్జగత్సర్వం సర్వధాన్యైర సంశయమ్‌ | హిరణ్యవర్ణాః శుచయో మంత్రో7య మభిషేచనే. 80

శన్నోదేవీరభిష్టయే తథా శాంతికరః పరః | ఏక చక్రేతి మంత్రేణ హుతేనాజ్యేన భాగశః. 81

గృహేభ్యః శాంతి మాప్నోతి ప్రసాదం చన సంశయః |

గావోభగ ఇతి ద్వాభ్యాం హుత్వాజ్యంగా అవాప్నుయాత్‌. 82

ప్రవాదాంషః సోపదితి గ్రహయజ్ఞే విధీయతే | దేవేభ్యో వనస్పత ఇతి ద్రుమయజ్ఞే విధీయతే. 83

గాయత్రీ వైష్ణవీ జ్ఞేయా తద్విష్ణోః పరమం పదమ్‌ | సర్వపాపప్రశమనం సర్వకామకరం తథా. 84

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యజుర్విధానం నామ షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

''శంనో వనస్పతే'' (19-38) అనుమంత్రముతో ఆజ్యహోమము చేయువానికి ఎవ్వనితోను వైరముండదు. ''అంపాంఫేనేన'' (19-71) అను మంత్రముతో లాజహోమము చేసినవాడు విజయము పొందును. ''భద్రాహుత'' (14-39) అను మంత్రమును జపించిన ఇంద్రియహీనుడు, లేనా దుర్బలేంద్రియుడు ఇంద్రియశక్తి సంపన్నుడగును. ''అశిశ్చపృథివీచ'' (26-1) అను మంత్రము గొప్ప వశీకరణ మంత్రము. ''అధ్వనా'' (5-33) అనుమంత్రమును జపించువాడు వ్యవహారమున జయమును పొందును. కార్యప్రారంభమున ''బ్రహ్మక్షత్రంపవతే'' (19-5) అనుమంత్రమును జపించినచో కార్యసిద్ధికలుగును. ''సంవత్సరో7సి'' అను మంత్రముతో లక్ష ఆజ్యహోమములు చేసినవాడు రోగవిముక్తుడగును. ''కేతుంకృణ్వన్‌'' (29-37) అను మంత్రము యుద్ధమునందు జయవర్ధకము. ''ఇంద్రో7గ్నిధర్మః'' అనుమంత్రము యుద్ధమునందు ధర్మసమ్మతమైన విజయము నిచ్చును. ధనుస్సును ధరించునపుడు ''ధన్వనాగా'' (29-39) అను మంత్రమును జపించుట ఉత్తమము. ''యజీత అను మంత్రముచే ధనుస్పునభిమంత్రించవలెను. ''అహిరివ'' (29-51) అను మంత్రముచే బాణములను అభిమంత్రించ వలెను ''వహ్నీనాం పితః (29-42) అను మంత్రమును తూణీరమును అభిమంత్రించవలెను. ''యుంజన్త్యస్యా'' (23-6) అను మంత్రమును చదువుచు గుర్రములను రథములకు కట్టవలెను. యాత్రారంభ సమయమున ''ఆశువుశిశానః' (17-35) అను మంత్రమును చదువవలెను. రథారోహణసమయమున ''విష్ణోఃక్రమోసి'' (12-5) అను మంత్రమును గుర్రములను తొలిసారిగా తోలునపుడు ''అజంఘన్తి'' (29-50) అను మంత్రమును, శత్రుసేనెదుట ''యాస్సేనాఅభిత్వరీః'' (11-77) అను మంత్రమును, దుందుభివాయించునపుడు ''దుందుభ్యః'' అను మంత్రమున పఠించవలెను. ముందుగా ఈమంత్రములతో హోమముచేసి, తరువాత ఈ విధముగ చేసినచో విజయము లభించును. ''యమేనదత్తమ్‌'' (29-13 అను మంత్రముతో కోటిహోమములు చేసినచో యుద్ధమునందు వెంటనే విజయమునిచ్చు రథము ఆవిర్భవించును, ''ఆకృష్ణేన'' అను మంత్రము వ్యాహృతులతో చేసిన కర్మల వంటికర్మలను చేయవలయును. ''మజ్జాగత్రః'' (34-1) ఇత్యాది శివసంకల మంత్రములను జపించుటచే మనస్సుకు ఏకాగ్రత లభించును ''పంచపద్యః'' (34-11) అనుమంత్రముతో ఐదు లక్షల హోమము చేసినవాడు లక్ష్మిని పొందును. ''యదాబధ్నన్‌ దాక్షాయణాః'' (34-52) అను మంత్రముతో వెయ్యిపర్యాయములు అభిమంత్రించిన సువర్ణమును ధరించినచో అది శత్రునివారణము. ''ఇమంజీవేభ్యః (35-15) అనుమంత్రమును చదువుచు రాళ్లులని మట్టిపెడ్డలు గాని అభిమంత్రించి ఇంటినలువైపుల విసిరినచో రాత్రిచోరభయము ఉండదు. ''ప్రమేగామరేషత్‌'' (35-18) ది ఉత్తమమై వశీకరణ మంత్రము. చంపుటకు వచ్చినవాడు కూడ లొంగిపోవును ఓధర్మజ్ఞుడా! ఈ మంత్రముతో అభిమంత్రించిన భక్ష్యములు తాంబూలములు పుష్పములు మొదలగు నవి ఎవనికైన ఇచ్చినచో డు శీఘ్రముగా వశ##మై పోవును ?? నోమిత్రః ''( 36-9) అను మంత్రము అంతటను ఎల్లవేళలను శాంతిప్రదము ''గణానాత్వాగణపతిం'' (23-19 అను మంత్రముతో చతుష్పదమునందు సర్వధాన్యములను హోమము చేసినవాడు జగత్తునంతను వశము చేసుకొనును. సందేహము లేదు. అభిషేక సమయమున ''హిరణ్య వర్ణాః శుచయః'' అను మంత్రమును పఠించవలెను. ''శంనోదేవీంభీష్టయే'' అను మంత్రము పరమ శాంతికారకము. ఏకచక్ర ఇత్యాదిమంత్రముతో ఆజ్యభాగపూర్వకముగా గృహమునకు ఆజ్యహోమము చేసినచో గ్రహముల అనుగ్రహము శాంతి లభించును. సందేహములేదు. ''గావుపావతాపం'' (33-29) ''భగపణతః '' (34-36-37) అనుమంత్రత్రయముచే ఆజ్యహోమము చేసినవానికి గోవులు లభించును. ''ప్రవాదాంశః సో?త్‌ '' అను మంత్రమును గృహయజ్ఞమున ఉపయోగించవలెను. ''దేవేభ్యోవనస్పతే'' ఇత్యాదిమంత్రములను వృక్షయజ్ఞములందు వినియోగించవలెను. గాయత్రి విష్ణురూప మైనదిని తెలుసుకొనవలెను సమస్త పాపములలను శమింపచేయునది, సమస్తకామములను తీర్చునదియగు విష్ణుపరమపదము కూడ గాయత్రియే

అగ్నిమహాపురాణమునందు యజుర్విధానమను రెండువందల అరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page