Sri Sivamahapuranamu-I    Chapters   

రుద్ర సంహితా - సృష్టిఖండః

ప్రథమోsధ్యాయః

ముని ప్రశ్న వర్ణనము

శ్రీ గణశాయ నమః | గౌరీ శంకరాభ్యాం నమః | అథ ద్వితీయా రుద్ర సంహితా ప్రారభ్యతే ||

విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితతత్త్వమనంత కీర్తిమ్‌ |

మాయాశ్రయం విగతమాయ మచింత్యరూపం బోధస్వరూపమమలం హి శివం నమామి || 1

వందే శివం తం ప్ర కృతే రనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి |

స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా న భోవదంతర్బహి రాస్థితో యః || 2

వందేతరస్థం నిజగూఢ రూపం శివం స్వత స్స్రష్టు మిదం విచష్టే |

జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలో హవత్తమ్‌ || 3

శ్రీ గణశునకు, శ్రీ గౌరీ శంకరులకు నమస్కారము. ఇపుడు రెండవది యగు రుద్ర సంహిత ఆరంభింపబడుచున్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు ఏకైక కారణము. గౌరీ దేవికి భర్త, తత్త్వముల నెరింగిన వాడు. అనంతమగు కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైన వాడు, మాయచే ప్రభావితుడు కాని వాడు, మనస్సుచే ఊహింపశక్యము గాని రూపము గలవాడు, జ్ఞాన స్వరూపుడు, నిర్దోషుడునగు శివునకు నమస్కరించెదను (1). ప్రకృతి కంటె అతీతుడు, ఆది లేని వాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడునగు శివునకు నమస్కరించుచున్నాను. ఆయన ఈ జగత్తు నంతనూ తన మాయచే సృష్టించి,జగత్తునకు లోపల, బయట ఆకాశమువలె వ్యాపించి యున్నాడు (2). శివుడీ జగత్తును తన స్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి యున్నవాడై, తన గూఢ రూపమునందు ప్రతిష్ఠితుడై యున్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహశకములు వలె, ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగాడుచున్నవి. అట్టి శివుని నమస్కరించుచున్నాను (3).

వ్యాస ఉవాచ |

జగతః పితరం శంభుం జగతో మాతరం శివామ్‌ | తత్పుత్రం చ గణాధీశం నత్వైత ద్వర్ణయామహే || 4

ఏకదా మునయస్సర్వే నైమిషారణ్య వాసినః | పప్రచ్ఛుర్వరయా భక్త్యా సూతం తే శౌనకాదయః || 5

వ్యాసుడిట్లు పలికెను -

జగత్తునకు తండ్రియగు శివుని, తల్లియగు పార్వతిని, వారి కుమారుడగు గణపతిని సమస్కరించి, ఈ గాథను వర్ణించుచున్నాము (4). ఒకప్పుడు నైమిషారణ్యము నందు నివసించే శౌనకుడు మొదలగు మునులందరు గొప్ప భక్తితో సూతుని ప్రశ్నించిరి (5).

ఋషయ ఊచుః |

విద్యేశ్వర సంహితాయాః శ్రుతా సా సత్క థా శుభా | సాధ్య సాధన ఖండాఖ్యా రమ్యాద్యా భక్త వత్సలా || 6

సూత సూత మహా భాగ చిరంజీవ సుఖీ భవ | యచ్ఛ్రావయసి నస్తాత శాంకరీం పరమాం కథామ్‌ || 7

పిబంతస్త్వన్ముఖాంభోజ చ్యుతం జ్ఞానామృతం వయమ్‌ | అవితృప్తాః పునః కించిత్‌ ప్రష్టు మిచ్ఛా మహే s నఘ || 8

వ్యాస ప్రాసాదాత్సర్వజ్ఞో ప్రాప్తోsసి కృతకృత్యతామ్‌ | నాజ్ఞాతం విద్యతే కించిద్భూతం భవ్యం భవచ్చ యత్‌ || 9

ఋషులు ఇట్లు పలికిరి -

మంగళ కరము, సాధ్యసాధన ఖండ యను పేరు గలది, సుందరమైనది, భక్తులకు అనుగ్రహ కారమునగు విద్యేశ్వర సంహితా ప్రసంగమును వినియుంటిమి (6). ఓ సూతా!మహాత్మా!చిరకాలము సుఖివై జీవించుము. వత్సా! నీవు మాకు శంకరుని దివ్య గాథను వినిపించుచున్నావు గదా! (7) ఓ పుణ్యాత్మా! నీ ముఖ పద్మము నుండి ప్రసరించు జ్ఞానామృతమును మేము పానము చేసినాము. కాని మాకు తృప్తి కలుగుట లేదు. మేము నిన్ను ఒక విషయమును ప్రశ్నించగోరుచున్నాము (8). నీవు వ్యాసుని అనుగ్రహముచే సర్వజ్ఞుడవు, కృతార్థుడవు అయినావు. భూత , వర్తమాన , భవిష్యత్‌ కాలములలో నీకు తెలియనిది లేదు (9).

గురోర్వ్యాసస్య సద్భక్త్యా సమాసాద్య కృపాం పరామ్‌ | సర్వం జ్ఞాతం విశేషేణ సర్వం సార్థం కృతం జనుః || 10

ఇదానీం కథయ ప్రాజ్ఞ శివరూపమనుత్తమమ్‌ | దివ్యాని వై చరిత్రాణి శివయోరప్యశేషతః || 11

అగుణో గుణతాం యాతి కథం లోకే మహేశ్వరః | శివతత్త్వం వయం సర్వే న జానీమో విచారతః || 12

సృష్టేః పూర్వం కథం శంభుస్స్వరూపేణావతిష్ఠతే | సృష్టి మధ్యే స హి కథం క్రీడన్‌ సంవర్తతే ప్రభుః || 13

నీవు గొప్ప భక్తిచే గురువు యొక్క పరమకృపను పొంది, సర్వమును వివరముగా తెలుసుకొంటివి. నీ జన్మ సార్థకమైనది (10). ఓ గొప్ప జ్ఞానీ! ఇపుడు సర్వశ్రేష్ఠమగు శివుని స్వరూపమును, శివ పార్వతుల దివ్య చరిత్రలను సంపూర్ణుగా చెప్పుము (11).మహేశ్వరుడు నిర్గుణుడైననూ, లోకములో సగుణుడుగ నున్నాడు. ఇది యెట్లు? విచారించినచో, మాకెవ్వరికీ శివుని తత్త్వము తెలియదు (12). శంభుడు సృష్టికి పూర్వము స్వరూపములో నుండుట యెట్టిది? స్థితి కాలములో ఆ ప్రభువు క్రీడించు విధమెట్టిది ?(13).

తదంతే చ కథం దేవస్స తిష్ఠతి మహేశ్వరః | కథం ప్రసన్నాతాం యాతి శంకరో లోక శంకరః || 14

స ప్రసన్నో మహేశానః కిం ప్రయచ్ఛతి సత్ఫలమ్‌ | స్వభ##క్తేభ్యః పరేభ్యశ్చ తత్తసర్వం కథయస్వ నః || 15

సద్యః ప్ర సన్నో భగవాన్‌ భవతీ త్యునుశుశ్రుమ | భక్త ప్రయాసం స మహాన్న పశ్యతి దయాపరః || 16

బ్రహ్మ విష్ణుర్మ హేశశ్చ త్రయో దేవాశ్శి వాంగజాః | మహేశస్తత్ర పూర్ణాంశస్స్వయమేవ శివోsపరః || 17

ఆ మహేశ్వరుడు లయకాలమునందెట్లుండును ? లోకములకు శుభమును కలుగజేయు ఆ శంకరుడు ప్రసన్నుడగు విధమెయ్యది? (14). ఆ మహేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులకు మరియు ఇతర భక్తులకు ఇచ్చే మహా ఫలము ఏది ? ఈ విషయములనన్నిటినీ మాకు చెప్పుము (15). భగవానుడు వెనువెంటనే ప్రసన్నుడగునని వింటిమి. దయామయుడగు ఆ మహాదేవుడు భక్తుల కష్టమును చూడజాలడు (16). బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలు శివుని దేహము నుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణాంశము కలవాడు గనుక, సాక్షాత్తుగా శివస్వరూపుడే (17).

తస్యావిర్భావమాఖ్యాహి చరితాని విశేషతః | ఉమావిర్భావమాఖ్యాహి తద్వివాహం తథా ప్రభో || 18

తద్గార్హస్థ్యం విశేషేణ తథా లీలాః పరా అపి | ఏతత్సర్వం తదన్యచ్చ కథనీయం త్వయానఘ || 19

హే ప్రభూ! ఆ శివుని ఆవిర్భావమును, చరిత్రలను, ఉమ యెక్క ఆవిర్భావమును, మరియు వారి వివాహమును వివరముగా చెప్పుము(18). ఓ అనఘా! శివుని గృహస్ధాశ్రమ గాధలను, ఇతర లీలలను వివరముగా చెప్పుము. ఇదంతయూ మాత్రమే గాక, ఇంకను చెప్పదగిన విశేషములను కూడ చెప్పవలెను(19).

వ్యాస ఉవాచ |

ఇతి పృష్టస్తదా తైస్తు సూతో హర్షసమన్వితః | స్మృత్వా శంభు పదాంభోజం ప్రత్యువాచ మునీశ్వరాన్‌ || 20

వ్యాసుడిట్లు పలికెను -

ఈ విధముగా ఆ ముని వరులచే ప్రార్థింపబడిన సూతుడు శంభుని పాదపద్మములను స్మరించి వారికి ఇట్లు బదులిడెను (20).

సూత ఉవాచ |

సమ్యక్‌ పృష్టం భవద్భిశ్చ ధన్యా యూయం మునీశ్వరాః | సదాశివ కథాయాం వో యజ్జాతా నైష్ఠికీ మతిః || 21

సదాశివ కథా ప్రశ్నః పురుషాన్‌ స్త్రీన్‌ పునాతి హి | వక్తారం పృచ్ఛకం శ్రోతృన్‌ జాహ్నవీ సలిలం యథా || 22

శంభోర్గుణానువాదాత్కో విరజ్యేత పుమాన్‌ ద్విజాః | వినా పశుఘ్నం త్రివిధజనానంద కరాత్సదా || 23

సూతుడిట్లు పలికెను -

ఓ మునిశ్రేష్ఠులారా! మీరు చక్కగా ప్రశ్నించితిరి. మీ మనస్సులలో సదాశివుని గాథయందు నిష్ఠ కలిగినది. మీరు ధన్యులు (21). సదాశివుని కథలను గురించి ప్రశ్న గంగా జలమువలె స్త్రీలను , పురుషులను, చెప్పు వానిని, మరియు వినువానిని పవిత్రము చేయును (2). ఓ ద్విజులారా! శంభుని గుణముల ప్రసంగము సాత్త్వికులను, రాజసులను, తామసులను కూడా సర్వదా ఆనందింపజేయును. అట్టి ప్రసంగమునందు పశు హింసకునకు తప్ప మరెవ్వరికి విరక్తి కలుగును? (23)

గీయమానో వితృష్ణైశ్చ భవరో గౌషధోsపి హి | మనః శ్రోత్రాభిరామశ్చ యతస్సర్వార్ధదస్స వై || 24

కథయామి యథా బుద్ధి భవత్ర్పశ్నానుసారతః | శివలీలాం ప్రయత్నేన ద్విజాస్తాం శృణుతాదరాత్‌ || 25

భవద్భిః పృచ్ఛ్యతే యద్వత్తత్తథా నారదే న వై | పృష్టం పిత్రే ప్రేరితేన హరిణా శివరూపిణా || 26

బ్రహ్మ శ్రుత్వా సుతవచశ్శివ భక్తః ప్రసన్నధీః | జగౌ శివయశః ప్రీత్యా హర్షయన్‌ మునిసత్తమమ్‌ || 27

సూతోక్తమితి తద్వాక్యమాకర్ణ్య ద్విజసత్తమాః | పప్రచ్ఛుస్తత్సుసంవాదం కుతూహల సమన్వితాః || 28

శంభుని గుణములను నిష్కామ భావనతో గానము చేయు భక్తునకు సంసారమనే రోగము తొలగిపోవును. ఈ గుణగానము మనస్సునకు ఆహ్లాదకరముగను, చెవులకు ఇంపుగను ఉండుటయే గాక, సర్వకార్యములను సిద్ధింపజేయును (24). మీ ప్రశ్నకు సమాధానముగా నేను శివలీలను నా బుద్ధికి తోచినంతలో శ్రద్ధతో వర్ణించెదను. ఓ ద్విజులారా! మీరు ఆదరముతో వినుడు (25). ఒకప్పుడు నారదుడు శివస్వరూపుడగు విష్ణువుచే ప్రోత్సహింపబడినవాడై, తండ్రిని ఇదే ప్రశ్నను అడిగినట్లే అడిగెను (26). శివభక్తుడగు బ్రహ్మ గారు కుమారుని ప్రశ్నను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై, నారదునకు ఆనందము కల్గు విధముగా ప్రీతితో శివుని కీర్తిని గానము చేసెను (27). సూతుడు పలికిన ఈ మాటలను విని ఆ మునివరులు కుతూహలము గలవారై ఆ సంవాదమును చెప్పుమనని ఆయనను కోరిరి (28).

ఋషయ ఊచుః |

సూత సూత మహాభాగ శైవోత్తమ మహామతే | శ్రుత్వా తవ వచో రమ్యం చేతో నస్సుకుతూహలమ్‌ || 29

కదా బభూవ సుఖకృద్విధి నారదయోర్మహాన్‌ | సంవాదో యత్ర గిరిశ సులీలా భవమోచినీ || 30

విధి నారద సంవాద పూర్వకం శాంకరం యశః | బ్రూహి నస్తాత తత్ర్పీత్యా తత్తత్ర్పశ్నాను సారతః || 31

ఇత్యాకర్ణ్య వచస్తేషాం మునీనాం భావితాత్మనామ్‌ | సూతః ప్రోవాచ సుప్రీత స్తత్సంవాదానుసారతః || 32

ఇతి శ్రీ శివమహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యు పాఖ్యానే ముని ప్రశ్న వర్ణనం నామ ప్రథమోsధ్యాయః (1).

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ సూతా! మహాత్మా! నీవు శైవులలో గొప్పవాడివి. మహాబుద్ధి శాలివి. నీమధురమగు పలుకులను వినుటకై మా మనస్సులు కుతూహలముతో ఉవ్విళ్లూరుచున్నవి (29). బ్రహ్మకు, నారదునకు రమ్యమగు ఆ గొప్ప సంవాదము ఎప్పుడు జరిగెను? కైలాసగిరివాసుని లీలా సంవాదము సంసారము నుండి విముక్తిని కలిగించును (30). హేసూతా! శంకరుని కీర్తిని గానము చేయు బ్రహ్మనారద సంవాదమును ప్రీతితో మా ప్రశ్నలకను రూపముగా మాకు వివరింపుము (31). పవిత్రాంతః కరణులగు ఆ మహర్షుల పలుకులను విని సూతుడు మిక్కిలి సంతసించినవాడై ఆ సంవాదము యొక్క వివరములను వర్ణించెను (32).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియుగు రుద్రసంహితయందలి సృష్ట్యుపాఖ్యానమను మొదటి ఖండములో ముని ప్రశ్న వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

Sri Sivamahapuranamu-I    Chapters