Nadichedevudu   Chapters  

 

10. దేవుడు చేసిన పెళ్ళి

''ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, తమ ఆశీస్సులు అర్థిస్తున్నాము.''

1967 మే మాసంలో విజయవాడ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ప్రార్థించాము నేనూ, నా భార్యా, కుమార్తె లక్ష్మిని వెంటబెట్టుకు వెళ్ళి.

''అట్లా కూచోండి, పిలుస్తా'' అన్నారు స్వామి. భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తరువాత స్వామి మమ్మల్ని రమ్మన్నారు. అది మామిడిపళ్ళ కాలం. బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడిపండూ, ఇన్ని అక్షింతలూ లక్ష్మి దోసిట్లో పోసి 'శుభం. వెళ్ళిరాండి' అన్నారు.

సంతోషంతో ఇంటికి వచ్చాము. పిండివంటలతో పండగ చేసుకున్నాము.

మా లక్ష్మి విజయవాడ మేరిస్టెల్లా కాలేజీలో ఆ సంవత్సరం బి.ఎ. పూర్తిచేస్తున్నది. కాలేజికి సెలవులు కావడంవల్ల రోజూ స్నేహితురాళ్ళతో కలిసి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి స్వామివారు చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తుండేది. సాయంత్రం వారి ప్రవచనాలు వింటూఉండేది.

ఒకరోజు ఉయ్యూరునుండి ఒక భక్తురాలు స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి మా లక్ష్మిని చూసింది. ''ఎవరమ్మాయివి? ఏం చదువుతున్నావు? నీకు వివాహమయిందా? ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మి నడిగింది. కొన్నిటికి లక్ష్మి సమాధానం చెప్పింది. కొన్నిటికి మౌనం వహించింది.

విదేశాల్లో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఆ భక్తురాలి కుమారుడు సెలవుపై స్వదేశానికి తిరిగివచ్చాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లండుకు వెళదామనుకుంటున్నాడు. హైద్రాబాదులో అన్నదమ్ములంతా కలిసి, తగిన సంబంధాలు వెతుకుతున్నారు.

జగద్గురువును సందర్శించి ఇల్లుచేరిన ఆ భక్తురాలు హైద్రాబాదుకు ఫోనుచేసి, తన కుమారులతో మాట్లాడింది. ''విజయవాడలో నిన్న శ్రీ శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి, అక్కడ ఒక అమ్మాయిని చూశాను. 'ఆంధప్రభ' ఎడిటరుగారి కూతురట. బి.ఏ. చదువుతున్నది. మనవాడికి ఇంతవరకు చూచిన సంబంధాలలో ఏదీ ఖాయం చేసుకోకపోతే, ఈ అమ్మాయి సంగతి విచారించండి. నీలంరాజు వారట. మనశాఖే ననుకుంటా''

* * *

ఆ మర్నాడు ఉదయం ఇంటివద్ద నేను పేపరు చూసుకుంటున్నాను. హైద్రాబాద్‌నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ''మాది ఉయ్యూరు. ఇతడు మా తమ్ముడు. ఇంగ్లండులో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వివాహం చేసుకుని తిరిగి వెళదామని సెలవుపెట్టి స్వదేశానికి వచ్చాడు.''

''మిమ్మల్ని గురించి విన్నాము. మీతో వియ్యమందాలని కోరుతున్నాము'' అంటూ తమను గురించీ, తమ వంశ గౌరవాన్ని గురించీ, తమ ఆస్తిపాస్తులను గురించీ వివరాలు చెప్పారు, కాస్త అట్టహాసంగానే.

అంతవరకు మా లక్ష్మి వివాహం సంగతి ఎన్నడూ మేము యోచించలేదు. అయినవారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా, అమ్మాయి చదువు ముగిసేవరకూ పెళ్ళిమాట తలపెట్టదలచలేదు.

కాని, ఇప్పుడు ఆలోచనలో పడ్డాను. ఇదేదో మామూలు ధోరణిగా లేదు. దైవికంగా నెట్టుకవస్తున్నట్టు అనిపించింది.

''నిదానంగా, సావకాశంగా మాట్లాడుదాము, మళ్ళా కలుద్దా''మన్నాను వారితో.

ఒకరిద్దరు ఆప్తమిత్రులతో ఆలోచించాను.

''ఉయ్యూరులో వారి కుటుంబం మేము ఎరిగి ఉన్నాం. యోగ్యతగల సంబంధం. ఎందుకు సందేహిస్తారు? ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన మనువులు దొరకడం అంత సులభంగా లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అన్నీ అనుకూలంగా వున్నా, వేలకువేలు కట్నాలు కుమ్మరించాలి.''

''పైగా, మనం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరగడానికి బదులు వారికివారే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు. కాదనకండి! ఎంత చదువులు చదివినా, ఆడపిల్లలకు మరీ అంత ఈడు మించడం కూడా మంచిది కాదు'' అంటూ సలహాయిచ్చారు.

కాస్త మెత్తపడ్డాను. ఉయ్యూరు వారితో ఇలా అన్నాను. ''మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమేగాని, వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నవి. వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది.

''వధూవరుల జాతకాలు సరిపోవాలి. నేనివ్వదలచిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నిటినీమించి, మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామివారి అనుమతి నాకు లభించాలి.''

కాస్త రాయబారం జరిగిన తరువాత ఉభయులకూ అన్నిటిపై సమాధానం కుదిరింది.

స్వామివా రప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి, జరిగినదంతా సంగ్రహంగా విన్నవించాను. మౌనదీక్షలో ఉంటూనే, మంత్రాక్షతలు ప్రసాదించి, వరదాభయహస్తంతో అనుమతించారు.

ఆనందంతో ఇంటికి తిరిగివచ్చాను.

పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదు. ఆదరాబాదరాగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాము.

గబగబా శుభ##లేఖలు అచ్చువేయించాము. సన్నాహాలన్నీ త్వరత్వరగా జరుగుతున్నవి.

అయినా ఒక్క సందేహం నన్ను వదలకుండా పీడిస్తూనే ఉన్నది. తన పెళ్ళి విషయం మా అమ్మడితో స్వయంగా నేను ప్రస్తావించలేదు. ఏమైనా, యుక్తవయస్సు వచ్చిన బిడ్డకదా! నేనేమి చేసినా, తన క్షేమంకోరి చేస్తానని ఎంత నమ్మకం నామీద ఉన్నా, ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చెయ్యడం భావ్యం కాదు. ఆమె అభిమతం తెలుసుకోకుండా వరుడి తరపు వారితో గంభీరంగా మాట్లాడాను. తీరా, ఆమెతో ముచ్చటిస్తే, ''నాన్నగారూ, నా చదువు పూర్తికాకుండా పెళ్ళి జరగడం నాకు ఇష్టంలేదు'' అంటే?

మధనలో పడ్డాను.

ఆరోజు రాత్రి. ఆలోచనతో చాలాసేపు నిద్రపట్టలేదు. పన్నెండు దాటింది. కాస్త కునుకుపట్టింది.

''నాన్నగారూ, నాన్నగారూ'' అంటూ మా లక్ష్మి వచ్చి నన్ను నిద్రలేపింది.

''ఏమమ్మా, ఈ అర్థరాత్రి నిద్రపోకుండా ఎందుకిలా వచ్చావు తల్లీ?''

మాట తడబడుతూ ఇలా అన్నది. ''నాకిప్పుడు వివాహం చెయ్యడమే మీ నిశ్చయమైతే, ఎవరైనా సరే, స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చెయ్యండి నన్ను'' అన్నది.

అర్థరాత్రి లక్ష్మి ఇలావచ్చి, నన్ను నిద్రలేపి, తన అభిప్రాయం ఇలా తెలుపుతుందని ఎన్నడూ నేను ఊహించలేదు.

మనస్సు నొచ్చకుండా మా లక్ష్మికి ఎంత నచ్చజెప్పవలసి వస్తుందో, నా ఆంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమెకు తెలియజేయాలో అని ఆందోళన చెందుతున్న నాకు ఆమె మాటలు అమృతప్రాయమైనవి. నా గుండెలమీద బరువు తొలగింది.

''పిచ్చితల్లీ, ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎన్నడైనా, ఏ పనిగాని నేను చేస్తానా? వెళ్ళి నిశ్చింతగా నిద్రపో!'' అంటూ మరేమీ చెప్పకుండా పంపించాను.

ఆ రాత్రి స్వామినీ, నా ఇష్టదైవం రామునీ తలచుకుంటూ సుఖంగా నిద్రించాను.

మా లక్ష్మి ఇలావచ్చి ఎన్నడూ నాతో మాట్లాడి ఎరగదు. ఏ విషయమైనా తన తల్లిచేత చెప్పించేది. అలాంటిది, ఆనాడు అంత ధైర్యంగా నాతో అట్లా మాట్లాడిందంటే, ఆ మాట మా లక్ష్మి మాట కాదు. గురుదేవుని వాణి!

ముఖ్యబంధువు లందరూ ముందుగానే వచ్చారు. మిత్రులన్నిటా సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్ళి ముచ్చటగా జరిగింది. వేదవిదులూ, పండితులూ వధూవరులను ఆశీర్వదించారు.

తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురు కటాక్షమే తప్ప, మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయింది.

* * *

ఇదే ఒక లీలగా కనిపిస్తే, అంతకంటే అద్భుతావహం ఆ తరువాత జరిగిన ఘట్టం!

వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి, శ్రీవారి ఆశీస్సులు అందజెయ్యాలి అనుకున్నాను. స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది. తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాను.

ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. డ్రైవరు కారు వేగం హెచ్చించాడు. స్వామి పల్లకిలో కూర్చున్నాడు. బోయిలు పల్లకిని బుజాల కెత్తుకుని బయలుదేరబోతున్నారు. గబగబా నేను పల్లకి వద్దకు నడిచాను. నమస్కారం చేసి, ''అల్లుణ్ణీ, అమ్మాయినీ వెంటబెట్టుకువచ్చాను'' అన్నాను.

మందహాసం చేశారు స్వామి. పల్లకి ఆపారు బోయిలు.

అల్లుడూ, కూతురూ స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోశారు. పల్లకి బయలుదేరింది గోదావరి నదికేసి.

నా మనోరధం ఈడేరింది. అన్నీ సలక్షణంగా జరిగాయి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము.

మంచిరోజు చూసి, వధూవరులిరువురూ ఇంగ్లండుకు పయనమైనారు. ఇంగ్లండు చేరినట్టు కేబుల్‌కూడా వచ్చింది.

* * *

ఆ తరువాత అల్లుడిగారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనమప్పుడు పురోహితుల వద్ద నేర్చుకుని, ఎన్ని రోజులు సంధ్యవార్చారో ఏమోగాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారు లనేకుల ధోరణిలో, ఈయనగారుకూడా అటు తరువాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది.

అలాంటి యువకుడు వివాహానంతరం, స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో రెండు వేళలా సంధ్యవార్చడం ప్రారంభించాడు!

కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబైలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ కంపెనీవారు, ఇంగ్లండ్‌లో చదివిన ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి, ఇండియాకు పిలిపించుకున్నారు. ఆ విధంగా సెలెక్టు అయిన వారిలో మా అల్లుడు ఒకరు.

స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకొని, ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ, ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు ఆరు గంటలు అనుష్ఠానంలో ఉంటారు.

పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి, వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణ భూతులెవ్వరో ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు.

స్వామి ప్రకృతి శక్తులను వశపరచుకుంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు. విశేషించి, మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు. నరుడు నారాయణుడౌతాడు!





మతప్రాధాన్యం

మత మొక్కటే ప్రజాసమూహాన్ని, దేశాన్నీ కూడగట్ట గలదు. ఏకాత్మభావం, ఏకధర్మం - వీని నుండి శాశ్వతమైన ఐక్యత పుట్టి వర్థిల్లుతుంది. మానవేతిహాసాన్ని పరిశీలిస్తే, మతం కంటె అధికమైన సంఘటన శక్తి మరొకటి లేదని తెలుస్తుంది.



Nadichedevudu   Chapters