Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ నవోత్తరద్విశతతమో7ధ్యాయః

అథ దానపరిభాషాకథనమ్‌.

అగ్నిరువాచ :

ధానధర్మాన్‌ ప్రవక్ష్యామి భుక్తిముక్తిప్రదాన్‌ శృణు |

దానమిష్టం తథా పూర్తం ధర్మం కుర్వన్‌ హి సర్వభాక్‌. 1

వాపీకూపతటాకాది దేవతాయతనాని చ | అన్నప్రదానమారామాః పూర్తం ధర్మం చ ముక్తిదమ్‌. 2

అగ్నిహోత్రం తపః సత్యం వేదానాం చానుపాలనమ్‌ |

అతిథ్యం వైశ్వదేవం చ ప్రాహురిష్టం చ నాకదమ్‌. 3

గ్రహోపరాగే యద్దానం సూర్యసంక్రమణషు చ | ద్యాదశ్యాదౌ చ యద్దానం పూర్తం తదపి నాకదమ్‌. 4

దేశే కాలే చ పాత్రే చ దానం కోటిగుణం భ##వేత్‌ | అయనే విషువే పుణ్య వ్యతీపాతే దినక్షయే. 5

యుగాదిషు చ సంక్రాన్తౌ చతుర్దశ్యష్టమీషు చ | సితపఞ్చదశీసర్వద్వాదశీష్వష్టకాసు చ. 6

యజ్ఞోత్సవవివాహేషు తథా మన్వన్తరాదిషు | వైధృతౌ దృష్టదుఃస్వప్నే ద్రవ్యబ్రాహ్మణలాభతః. 7

శ్రద్దా వా యద్దినే తత్ర సదా వా దానమిష్యతే | అయనే ద్వే విషువే ద్వే చతస్రః షడశీతయః. 8

చతస్రో విష్ణుపద్యశ్చ సంక్రాన్తో ద్వాదశోత్తమాః | కన్యాయాం మిథునే మీనే ధనుష్యపి రవేర్గతిః. 9

షడశీతిముఖాః ప్రోక్తా షడశీతిగుణాః ఫలైః | అతీతానాగతే పుణ్య ద్వే ఉదగ్దక్షిణాయనే. 10

త్రింశత్కర్కటకే నాడ్యో మకరే వింశతిః స్మృతాః | వర్తమానే తులామేషే నాడ్యస్తూభయతో దశ. 11

షడశీత్యాం వ్యతీతాయాం షష్టిరుక్తాస్తు నాడికాః | పుణ్యాఖ్యా విష్ణుపద్యాం చ ప్రాక్పశ్చాదపి షోడశ. 12

శ్రవణాశ్విధనిష్ఠాసు నాగదైవతమస్తకే | యదా స్యాద్రవివారేణ వ్యతీపతాః స ఉచ్యతే. 13

అగ్నిదేవుడు పలికెను: మునిశ్రేష్ఠా! ఇపుడు భుక్తిముక్తిప్రదములగు దానధర్మములను గూర్చి చెప్పెదను. ఇష్టము పూర్తము అని దానము రెండు విధములు. దానధర్మముల నాచరించువాడు సర్వమును పొందగలడు. దిగుడుబావి, కూపము, చెరువు దేవాలయము, అన్నసత్రము-వీటిని స్థాపించుట -ఉద్యానాది నిర్మాణము-వీటికి పూర్త మని పేరు. ఇది ముక్తి ప్రదము. అగ్నిహోత్రము సత్యభాషణము, స్వాధ్యాయము, అతిథిసత్కారము, బలి వైశ్వదేవము -వీటికి ఇష్ట మని పేరు. ఇది స్వర్గప్రదము. గ్రహణసమయమునందును, సూర్యసంక్రాంతియందును, ద్వాదశ్యాదితిథులందును చేయు దానము 'పూర్తము' స్వర్గఫలప్రదము. దేశకాలప్రాతలందు చేయబడిన దానము కోట్ల రెట్టింపు ఫలము నిచ్చును. సూర్యుని ఉత్తరాయణ-దక్షిణాయన ప్రవేశకాలములందును, పుణ్య మగు విషువకాలమునందును, వ్యతీపాత - తిథిక్షయ- యుగారంభ- సంక్రాంతి - చతుర్దశీ- అష్టమీ-పూర్ణిమా ద్వాదశీ-అష్టకాశ్రాద్ధ- యజ్ఞ ఉత్సవ-వివాహ-మన్వంతరా రంభ- వైధృతియోగ-దుఃస్వప్వదర్శన-ధనప్రాప్తి-సద్‌బ్రాహ్మణప్రాప్తులందును దానము చేయవలెను. ఏ దినమున శ్రద్ధ కలుగునో ఆ దినమునను, లేదా ఎల్లపుడు దానము చేయవలెను. రెండు అయనములు, రెండువిషువలు అను నాల్గు సంక్రాంతులందును షడశీతిముఖము లని ప్రసిద్ధమైన నాలుగు సంక్రాంతులందును 'విష్ణుపద' అను నాలుగు సంక్రాంతు లందును-- ఈ పండ్రెండు సంక్రాంతులందును దానము ఉత్తమము. కన్యా - మిథున-ధనూ రాశులలో సూర్యసంక్రాంతికి 'షడశీతిముఖ' అని పేరు. ఇవి ఎనుబదియారు రెట్ల ఫలము నిచ్చును. ఉత్తరాయణ-దక్షిణాయన సంక్రాంతులందు అతీత- అనాగతఘటికలు పవిత్రమైనవి. కర్కసంక్రాంతి ఇరువది ఇరువది ఘడియలు పుణ్యకార్యములు చేయుటకై ఉత్తమమైనది. తులా -మేషసంక్రాంతులందు వెనుక ముందు పదిపది ఘడియలు పుణ్యకాలము. షడశీతిముఖా సంక్రాంతి అయిన పిమ్మట అరువది ఘడియలు పుణ్యకాలము. విష్ణుపదాసంక్రాంతులందు ముందు వెనుక పదునారు ఘడియలు పుణ్యకాలము. శ్రవణ అశ్వనీ ధనిష్ఠా నక్షత్రములందును, ఆశ్లేషప్రథమచరణమునందును రవివారసంబంధ మున్నపుడు "వ్యతీపాతయోగము"

నవమ్యాం శుక్లపక్షస్య కార్తికే నిరగాత్కృతమ్‌ | త్రేతా సితతృతీయాయాం వైశాఖే ద్వాపరం యుగమ్‌. 14

దర్శే వై మాఘమాసస్య త్రయోదశ్యాం నభస్యకే | కృష్ణే కలిం విజానీయాద్‌జ్ఞేయా మన్వన్తరాదయః. 15

ఆశ్వయుక్ఛుక్లనవమీ ద్వాదశీ కార్తికే తథా | తృతీయా చైవ మాఘస్య తథా భాద్రపదస్య చ. 16

ఫాల్గునస్యాప్యమావాస్యపౌషసై#్యకాదశీ తథా | ఆషాడస్యాపి దశమీ మాఘమానస్య సప్తమీ. 17

శ్రావణ చాష్టమీ కృష్ణా తథాషాఢే చ పూర్ణిమా | కార్తికే ఫాల్గునే తద్వజ్జ్యేష్ఠే పఞ్ఛదశీ తథా. 18

కార్తిక శుక్లవవమినాడు కృతయుగ ప్రారంభము. వైశాఖశుక్లతృతీయనాడు త్రేతాయుగప్రారంభము. ఇపుడు ద్వాపరమును గూర్చివినుము. మాఘపూర్ణిమనాడు ద్వాపరము. భాద్రపదకృష్టత్రయోదశినాడు కలియుగము ప్రారంభమగును. మన్వంతరప్రారంభకాలమును ఈ విధముగా గ్రహించవలెను. ఆశ్వయుజశుక్లనవమి, కార్తికద్వాదశి, మాఘ-భాద్రపదములు తృతీయాతిథులు, ఫాల్గుణ అమావాస్య, పౌషఏకాదశి, ఆషాఢదశమీ, మాఘ సప్తమి, శ్రావణకృష్ట అష్టమి, ఆషాఢ పూర్ణిమ, కార్తిక - ఫాల్గుణ - జ్యేష్ఠపూర్ణిమలు.

ఊర్ధ్వే చైవాగ్రహాయణ్యా అష్ఠకాస్తిస్ర ఈరితాః | అష్టకాఖ్యా చాష్టమీ స్యాదాసు దానాని చాక్షయమ్‌. 19

గయా గజ్గా ప్రయాగాదౌ తీర్థే దేవాలయాదిషు | అప్రార్థితాని దానాని విద్యార్థకన్యకాని చ. 20

దద్యాత్పూర్వముఖో దానం గృహ్ణీయాదుత్తరాముఖః | ఆయుర్వివర్ధతే దాతుర్గ్రహీతుః క్షీయతే న తత్‌. 21

నామ గోత్రం సమూచ్చార్య సంప్రదానస్య చాత్మనః | సంప్రదేయం ప్రయుచ్ఛన్తి కన్యాదానే పునస్త్రయమ్‌.

స్నాత్వాభ్యర్చ్య వ్యాహృతిభిర్దద్యాద్దానం తు సోదకమ్‌ | కనకాశ్వతిలా నాగా దాసీరథ మహీ గృహాః. 23

కన్యా చ కపిలా ధేనుర్మహాదానాని వై దశ | శ్రుతశౌర్యతపఃకన్యాయాజ్యశిష్యాదుపాగతమ్‌. 24

శుల్కం ధనం వా సకలం శుల్కం శిల్పానువృత్తితః | కుసీదకృషివాణిజ్యప్రాప్తం యదుపకారతః. 25

పాశకద్యూతచౌర్యాది ప్రతిరూపకసాహసైః | వ్యాజేనోపార్జితం కృత్స్నం త్రివిధం త్రివిధం ఫలమ్‌. 26

అధ్యగ్న్యధ్యావాహనికం దత్తంచ ప్రీతికర్మణీ | భ్రాతృమాతృపితృప్రాప్తం షడ్విధం స్త్రీధనం స్మృతమ్‌. 27

బ్రహ్మక్షత్రవిశాం ద్రవ్యం శూద్రసై#్యషామనుగ్రహాత్‌ |

బహుభ్యో న ప్రదేయాని గౌర్గృహం శయనం స్త్రియ ః 28

కులానాం తు శతం హన్యాదప్రయచ్ఛన్‌ ప్రతిశ్రుతమ్‌ |

దేవానాం చ గురూణాం చ మాతాపిత్రోస్తథైవ చ. 29

పుణ్యం దేయం ప్రయత్నేన యత్పుణ్యం చార్జితం క్వచిత్‌ | ప్రతిలాభేచ్ఛయా దత్తం యద్దనం తదపార్థకమ్‌.

శ్రద్ధయా సాధ్యతే ధర్మో దత్తం వార్యపి చాక్షయమ్‌ | జ్ఞానశీలగుణోపేతః పరపీడా బహిష్కృతః. 31

అజ్ఞానాం పాలనాత్త్రాణాత్తత్పాత్రం పరమం స్మృతమ్‌ | మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే.

అనన్తం దుహితుర్దానం సోదర్యే దత్తమక్షయమ్‌ | అమనుష్యే సమం దానం పాపే జ్ఞేయం మహాఫలమ్‌. 33

వర్ణసంకరే ద్విగుణం శూద్రే దానం చతుర్గుణమ్‌ | వైశ్యే చాష్టగుణం క్షత్రే షోడశత్వం ద్విజబ్రువే. 34

వేదాధ్యాయే శతగుణమనన్తం వేదబోధకే | పురోహితే యాజకాదౌ దానమక్షయముచ్యతే. 35

శ్రీవిహీనేషు యద్ధత్తం తదనన్తం చ యజ్వని | అతపాస్త్వనధీయానః ప్రతిగ్రహరుచిర్ద్విజః. 36

అమ్భస్యశ్మప్లవేనేవ సహ తేనైవ మజ్జతి | స్నాతః సమ్యగుపస్పృశ్య గృహ్ణీయాత్‌ ప్రయతః శుచిః. 37

ప్రతిగ్రహీతా సావిత్రీం సర్వదైవప్రకీర్తయేత్‌ | తతస్తు కీర్తయేత్సార్థం ద్రవ్యేణ సహ దైవతమ్‌. 38

ప్రతిగ్రాహీ పఠేదుచ్చైః ప్రతిగృహ్య ద్విజోత్తమాత్‌ |

మన్దం పఠేత్‌ క్షత్రియాత్తు హ్యుపాంశు చ తథా విశః. 39

మనసా చ తథా శూద్రాత్‌ స్వస్తివాచనకం తథా |

మార్గశీర్షపూర్ణిమ తరువాత వచ్చు మూడు అష్టములకు అష్టకా అని పేరు. అష్టమియే అష్టక. ఈ అష్టకలందు చేసిన దానము అక్షయఫలము. గంగా - యమునా - ప్రయాగాది తీర్థములందును దేవాలయమునందును అడుగకుండ ఇచ్చిన దానము ఉత్తమము. కన్యాదానవిషయమున ఇది వర్తించదు. దాత పూర్వాభిముఖుడైదానమీయవలెను. ప్రతిగ్రహీత ఉత్తరాభిముఖుడై గ్రహించవలెను. దానము ఇచ్చువాని ఆయుర్దాయమును వృద్ధి పొందించును. అయితే తీసుకొనువాని ఆయుర్దాయము క్షీణించదు. తన పేరును, ప్రతిగ్రహీత పేరును చెప్పుచు దాన మీయవలెను. కన్యాదానమునందు ఈ విధముగ మూడు సార్లు చేయవలెను. స్నానపూజాదులు చేసి, చేతజలము గ్రహించి పై సంకల్పము చేయవలెను. సువర్ణ అశ్వ-తిల-గజదాసీ-రథ-భూ-గృహ-కన్యా - కపిలగోవుల దానములు దశమహాదానములు. విద్యా - పరాక్రమ - తపః కన్యా - యజమాన - శిష్యులవలన లభించినది దానము కాదు - శుల్కము, శిల్పకలాదులవలన లభించిన ధనము కూడ శుల్కమే. వడ్డీ, వ్యవసాయము, వాణిజ్యము, ఇతరులకు ఉపకారము చేయుట - వీటివలన లభించిన ధనము సాత్త్వికము. ద్యూతము, దొంగతనము, వేషము వేయుట, సాహసకర్మ - వీటివలన లభించిన ధనము రాజసము. మోసగించి సంపాదించినది తామసము. వీటివలన వచ్చు ఫలము గూడ సాత్త్విక -రాజస - తామసరూపమున నుండును. వివాహసమయమున లభించినది. అత్తవారింటికి వెళ్ళు నపుడు ప్రీతితో ఇచ్చినది. భర్త ఇచ్చినది, సోదరుడు ఇచ్చినది, తల్లిదండ్రులు ఇచ్చినది, ఈ ఆరు విధములైన ధనము స్త్రీధనము. శూద్రునకు బ్రాహ్మణ - క్షత్రియ, వైశ్యుల అనుగ్రహముచే లభించినది ధనము. గోవు, గృహము, శయ్య, స్త్రీ - ఇవి అనేకులకు దానము చేయరానివి. అట్లు ఇచ్చుట పాపహేతువు. మాట ఇచ్చి తరువాత దానము చేయని వాని నూరుకులములు నశించును. ఎక్కడ సంపాదించిన ధనమునైనను పుణ్యదేవతలకు ఆచార్యులకు, తలిదండ్రులకు ప్రయత్నపూర్వకముగా సమర్పించవలెను. ఏదోలాభమును అపేక్షించి ఇచ్చిన దానము నిష్ఫలము. ధర్మము శ్రద్ధచేత సిద్ధించును. శ్రద్ధతో ఉదకమిచ్చినను అది అక్షయమగును. జ్ఞాన - శీల - సద్గుణసంపన్నుడును, ఇతరుల కెన్నడును పీడ కలుగజేయనివాడును దానము చేయుటకు సత్పాత్ర. అజ్ఞానవంతులైనవారిని పాలించి రక్షించుటచే వారు పాత్రలని చెప్పబడుచున్నారు తల్లి కిచ్చిన దానమునకు నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయు రెట్లు ఉండును. పుత్రికిని, సహోదరునకును ఇచ్చిన దానము అనంతము అక్షయ్యము. మనుష్యేతరప్రాణుల కిచ్చిన దానము న్యూనాధికము కాక సమముగా నుండును. పాపాత్మున కిచ్చినది పూర్తిగ నిష్ఫలము. వర్ణసంకరుని కిచ్చిన దానము రెట్టింపు ఫలమును శూద్రున కిచ్చినది నాలుగు రెట్లును వైశ్యునకుగాని క్షత్రియునకు గాని ఇచ్చినది ఎనిమిది రెట్లును, నామమాత్రబ్రాహ్మణున కిచ్చినది పదునారు రెట్లును, వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణున కిచ్చినది నూరు రెట్లును ఫలము నిచ్చును. వేదార్థవేత్త యగు ఆచార్యున కిచ్చినది అనంతఫలము. పురోహిత-యాజకాదుల కిచ్చినది అక్షయఫలము. దరిద్రుడైన బ్రాహ్మణునకును, యజ్ఞము చేసిన బ్రాహ్మణునకును ఇచ్చినది అనంతఫలదాయకము. తపోహినుడును, స్వాధ్యాయరహితుడు, ప్రతిగ్రహప్రియుడును అగు బ్రాహ్మణుడు ఱాతినావమీద కూర్చున్నవానితో సమానుడు. ఆత డా నావతో కూడ మునిగిపోవును. బ్రాహ్మణుడు స్నానాచమనాదులచే శుద్ధుడై ప్రతిగ్రహము చేయవలెను. దానము పట్టువాడు గాయత్రీజపము చేయవలెను. దానితో పాటు ప్రతిగ్రహించిన ద్రవ్యమును, దేవత పేరును ఉచ్చరించవలెను. ప్రతిగ్రహము చేయువాడు శ్రేష్ఠబ్రాహ్మణునుండి ప్రతిగ్రహించి నపుడు ఉచ్చైఃస్వరమునను, క్షత్రియునినుండి గ్రహించినపుడు మందస్వరమునను వైశ్యునినుండి ప్రతిగ్రహించినపుడు ఉపాంశువుగను జపము చేయవలెను. శూద్రునినుండి ప్రతిగ్రహము చేసినపుడు మానసిక జపమును, స్వస్తివాచనమును చేయవలెను.

అభయం విష్ణుదైవత్యం భూమిర్వై విష్ణుదేవతా. 40

కన్యా దాసస్తథా దాసీ ప్రాజాపత్యాః ప్రకీర్తితాః | ప్రాజాపత్యో గజః ప్రోక్తస్తురగో యమదైవత. 41

తథా చైకశఫం సర్వం యామ్యశ్చ మహిషస్తథా | ఉష్ట్రశ్చ నైరృతో ధేనూ రౌద్రీ ఛాగో7నలస్తథా. 42

ఆప్యో మేషో హరిః క్రోడ ఆరణ్యాః పశవో7నిలాః | జలాశయం వారుణం స్యాద్వారిధానీ ఘటాదయంః. 43

సముద్రజాని రత్నాని హేమలోహాని చానలః | ప్రాజాపత్యాని శస్యాని పక్వాన్నమపి సత్తమ. 44

గాన్ధర్వం గన్ధమిత్యాహుర్వస్త్రం బార్హస్పతం స్మృతమ్‌ |

వాయవ్యాః పక్షిణః సర్వే విద్యా బ్రాహ్మీ తథాజ్గకమ్‌. 45

సారస్వతం పుస్తకాది విశ్వకర్మా తు శిల్పకే | వనస్పతిర్ద్రుమాదీనాం ద్రవ్యదేవా హరేస్తమః. 46

మునిశ్రేష్ఠా! అభయమునకు దేవత సర్వదేవతాగణము. భూమికి దేవత విష్ఠువు. కన్యకును, దాసీదాసులకును గజములకును ప్రజాపతి, అశ్వమునకు యముడు. ఒక డెక్కగల పశువులకు సర్వదేవతాగణము, మహిషమునకు యముడు, ఉష్ట్రమునకు నిరృతి, ధేనువునకు రుద్రుడు. మేకకు అగ్ని, గొఱ్ఱ, సింహము, వరాహము -- వీటికి జలదేవత, వన్యపశువులకు వాయువు, జలపాత్ర - కలశాదిజలాశయములకు వరుణుడు, సముద్రమునుండి ఉత్పన్నము లైన రత్నములకు, స్వర్ణలోహాదిధాతువులకును అగ్ని, పక్వాన్నమునకును, ధాన్యమునకును ప్రజాపతి, సుగంధములకు గంధర్వుడు, వస్త్రములకు బృహస్పతి, అన్ని పక్షులకును వాయువు, విద్యా విద్యాంగములకుబ్రహ్మ, పుస్తకాదుల సరస్వతి, శిల్పమునకు విశ్వకర్మ వృక్షములకు వనస్పతి దేవతలు. ఈ సమస్తద్రవ్యములును దేవతలును శ్రీమహావిష్ణువునకు అంగములే.

ఛత్రం కృష్ణాజినం శయ్యా రథ ఆసనమేవ చ | ఉపానహౌ తథా యానముత్తానాజ్గిర ఈరితమ్‌. 47

రణోపకరణం శస్త్రం ధ్వజాద్యం సర్వదైవతమ్‌ | గృహం చ సర్వదైవత్యం సర్వేషాం విష్ణుదేవతా. 48

శివో వా న తతో ద్రవ్యం వ్యతిరిక్తం యతోస్తి హి | ద్రవ్యస్య నామ గృహ్ణీయాద్దదానీతి తథా వదేత్‌.

తోయం దద్యాత్తతో హస్తే దానే విధిరయం స్మృతః | విష్టుర్దాతా విష్ణుర్ద్రవ్యం ప్రతిగృహ్ణామి వై వదేత్‌. 50

స్వస్తి ప్రతిగ్రహం ధర్మం భుక్తిము క్తిఫలద్వయమ్‌ | గురూన్‌ భృత్యానుజ్జిహీర్షురర్చిష్యన్దేవతాః పితౄన్‌.

సర్వతః ప్రతిగృహ్ణీయాన్న తు తృప్యేత్స్వయం తతః |

శూద్రీయం న తు యజ్ఞార్థం ధనం శూద్రస్య తత్ఫలమ్‌. 52

ఛత్రకృష్ణచర్మ - శయ్యా - రథ-ఆసన - పాదుకా - వాహనములకు ఊర్ధ్వాంగిరసులు దేవత - యుద్ధమునకు ఉపయోగించు సామగ్రికిని, శస్త్రములకును, ధ్వజాదులకును సర్వదేవగణములు దేవత - గృహమునకు గూడ వారే దేవత - సకలపదార్థములకు దేవత విష్ణువు లేదా శివుడు. ఏల ననగా, ఏ పదార్థము కూడ ఆ దేవతలకంటె భిన్నముగ లేదు. దానము చేయు సమయమున ముందుగా ద్రవ్యము పేరు చెప్పి, పిదప దదామి అనిచెప్పి, సంకల్పజలమును ప్రతిగ్రహీతచేతిలో విడువవలెను. ప్రతిగ్రహీత - విష్ణువే దాత; విష్ణువే ద్రవ్యము; నేను ఈ దానము గ్రహించుచున్నాను. ధర్మానుకూల మగు ఈ ప్రతిగ్రహము కల్యాణప్రద మగు గాక" అని పలుకవలెను. మతా పితృ-భృత్యాదీపోషణార్థము, దేవతాపితృపూజార్థము అందరినుండియు దానము స్వీకరించవచ్చును. కాని దానిని తనకొరకై వినియోగించరాదు. శూద్రధనమును యజ్ఞకార్యము నందు వినియోగించరాదు; అట్లు చేసినచో ఆ యజ్ఞఫలము ఆతనికి చెందిపోవును.

గుడతక్రరసాద్యాశ్చ శూద్రాద్బాహ్యానివర్తినా | సర్వతః ప్రతిగృహ్ణీయాదవృత్తాకర్శితో ద్విజః. 53

నాధ్యాపనాద్యాజనాద్వా గర్హితాద్వా ప్రతిగ్రహాత్‌ | దోషో భవతి విప్రాణాం జ్వలనార్కనమా హి తే. 54

కృతే తు దీయతే గత్వా త్రేతా స్వానీయ దీయతే | ద్వాపరే యాచమానాయ కలౌ త్వనుగమాదృతే. 55

మనసా పాత్రముద్దిశ్య జలం భూమౌ వినిక్షిపేత్‌ | విద్యతే సాగరస్యాన్తో నాన్తో దానస్య విద్యతే. 56

అద్య సోమార్కగ్రహణసంక్రాన్త్యాదౌ చ కాలకే | గజ్గాగయాప్రయాగాది తీర్థదేశే మహాగుణ. 57

తథా చాముకగోత్రాయ తథా చాముకశర్మణ | వేదవేదాజ్గయుక్తాయ పాత్రాయ సుమహాత్మనే. 58

యథా నామ మహాద్రవ్యం విష్ణురుద్రాదిదైవతమ్‌ | పుత్రపౌత్రగృహైశ్వర్యపత్నీధర్మార్థసద్గుణాః. 59

కీర్తివిద్యామహాకామసౌభాగ్యారోగ్యవృద్ధయే | సర్వపాపోపశాన్త్యర్థం స్వర్గార్థం భుక్తిముక్తయే. 60

ఏతత్తుభ్యం సంప్రదదే ప్రీయతాం మే హరిః శివః | దివ్యాన్తరిక్షభౌమాదిసముత్పాతౌఘఘాతకృత్‌. 61

ధర్మార్థకామమోక్షాపై#్త్య బ్రహ్మలోకప్రదోస్తుమే | యథానామ సగోత్రాయ విప్రాయాముకశర్మణ. 62

ఏతద్దానప్రతిష్ఠార్థం సువర్ణం దక్షిణా దదే | అనేన దానవాక్యేన సర్వదానాని వై దదేత్‌. 63

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దానపరిభాషా నామ నవాధిక ద్విశతతమోధ్యాయః.

వృత్తివిహీను డైనచో బ్రాహ్మణుడు శూద్రునినుండి గుడము, మజ్జిగ, రసము మొదలగుపదార్థములను గ్రహించ వచ్చును, జీవిక నడవని బ్రాహ్మణుడు అన్నింటిని గ్రహించవచ్చును. ఏలనన బ్రాహ్మణుడు సహజముగ సూర్యాగ్నుల వలె పవిత్రుడు. అందు ఆపత్సమయమునందు నిందితులకు చదువు చెప్పుట, యజ్ఞము చేయించుట, దానము గ్రహించుట-వీటివలన ఆతనికి పాపము రాదు. కృతయుగమునందు బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి దాన మిచ్చెడివారు. త్రేతాయుగమున తమ యింటికి పిలచి యిచ్చెడివారు. ద్వాపరమువ అతడు అడిగినచో ఇచ్చెడివారు. కలియుగమున వెంబడించిననే దానము చేయుదురు. సముద్రపారము పొందవచ్చును గాని దానమునకు అంతము పొంద శక్యము కాదు. దాత తన మనస్సులో ఈ క్రింది విధముగ సత్పాత్రనుద్దేశించి సంకల్పించి, జలము నేలపై విడువవలెను. "నేను ఈ రోజున సూర్యగ్రహణసమయమున లేదా చంద్రగ్రహణసమయమున లేదా సంక్రాంతిసమయమున గంగా-గయా-ప్రయాగాద్యనంత గుణ సంపన్న మగు తీర్థదేశమున అముక (ఫలాన) గోత్రము కలవాడు, వేదవేదాంగవేత్త, మహాత్మ, నత్పాత్రము అయిన అముకశర్మకు విష్ణువునకు లేదా శివునకు లేదా మరొక దేవతకు సంబంధించిన అముకద్రవ్యమును, కీర్తి - విద్యా - మరోరథ - సౌభాగ్య - ఆరోగ్యాదుల ప్రాప్తికొరకును, సమస్త పాపశాంతి కొరకును, భుక్తిముక్తుల కొరకును దానము చేయుచున్నాను. ద్యు - అంతరిక్ష భూలోకసంబంధి సమస్తోత్పాతములను నశింపచేయు శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై నాకు ధర్మార్థకామోక్షములను ప్రసాదించి బ్రహ్మలోకమును ఇచ్చుగాక". పిదప - "అముకగోత్రము గల బ్రాహ్మణుడైన, అముకశర్మకు ఈ దానము సఫలమగుటకై సువర్ణదక్షిణ ఇచ్చుచున్నాను" అని చెప్పి సమస్తదానములును చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు దానపరిభాషాదివర్ణన మను రెండువందలతొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters