Paramacharya pavanagadhalu    Chapters   

14. తిండి వనం నుండి దండధారణానికి

శ్రీకంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతి శంకరాచార్యులు వారు (66వ పీఠాధిపతి) కలవై గ్రామంలో యాత్రలో వుండగా 1907లో సిద్ధిపొందారు. తరువాత 67వ ఆచార్యులుగా పీఠాన్ని ఎక్కినవారు. శ్రీమహదేవేంద్ర సరస్వతి. పూర్వాశ్రమంలో ఆయన స్వామినాథన్‌ పెత్తల్లి కొడుకే. ఆ పెత్తల్లికి పెనిమిటి పోయాడు. ఉన్న ఒక్క కొడుకూ సన్యసించే సరికి ఆమె తట్టుకోలేకపోయింది. అందుకని స్వామినాథన్‌ తల్లి, తన పిల్లలను తీసికొని తన అక్కగారి దగ్గరకు బయలుదేరింది. అక్కను పరామర్శించి, ఆమెను వోదార్చి, ధైర్యం చెప్పాలని ఆమె అభిప్రాయం. శాస్త్రిగారు కూడా వెళ్ళాలనుకున్నారు. కాని అర్జంటుగా ఆఫీసుపని తగలటంతో ఆయన వెళ్లలేక కుంటుంబాన్ని పంపించారు. అంతా కంచి వరకు రైల్లో వెళ్లి అక్కడ శంకరమఠంలో బస చేశారు.

అక్కడ ఒక చిత్రం జరిగింది. కలవైలో జరుగుతున్న స్వర్గీయ శంకరాచార్యుల దశాహ్న మహాపూజకు కావలసిన సంబారాలు కొని తేవటానికి కంచికి కొందరు మఠాధికారులు వచ్చారు. వారిలో ఒకరు స్వామినాథన్‌ ను పిలచి తనతో కలవై రమ్మని కోరాడు. స్వామినాథన్‌ తనతో తన బండిలో వస్తే, మిగతా కుటుంబసభ్యులంతా మరో బండిలో వస్తారని చెప్పాడు. స్వామినాథన్‌ సరేనని అతనితో కలిసి ఆ బండిలో కలవై బయలుదేరాడు.

దారిలో ఆ మఠాధికారి ఆ మాటా యీ మాటా మాట్లాడుతూ స్వామినాథన్‌కు బహుశా యిక తిండివనం తిరిగి వెళ్లే పని వుండదని నెమ్మదిగా బయటపెట్టాడు.''ఇక నువు ఎప్పటికీ మఠంలోనే వుంటావు'', అని ఆయన చెప్పాడు. అసలు తాను స్వామినాథన్‌ కోసం తిండివనం వెళ్లాలనుకున్నానని, కాని కంచిలోనే అనుకోకుండా స్వామినాథన్‌ తటస్థపడినందున యింకా తొందరగానే కలవై పోగలుగుతున్నామనీ ఆయన అన్నాడు. స్వామినాథన్‌ పెత్తల్లి కొడుకూ, శ్రీ మహదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో ఆచార్య స్వామి అయిన పిల్లవాడు (పూర్వాశ్రమంలో లక్ష్మీకాంతం) జ్వరపడి, సన్నిపాతంతో బాధపడుతున్నాడట. స్వామినాథన్‌ను పీఠాధిపతి చేయడం కోసం వెంటనే తీసికొని రమ్మంటే వచ్చి, తీసికొని వెళుతున్నట్లు చెప్పాడు.

స్వామినాథన్‌కు ఏమీ తోచలేదు. బండిలోనే మోకరిల్లి 'రామ, రామ' అని రామనామ స్మరణం చేసికొంటూ కూర్చున్నాడు.

ఆ తరువాత బండి కలవై చేరటం, స్వామినాథన్‌ను కంచి కామకోటి పీఠానికి పరాభవనామ సం. ఫాల్గుణ శు. విదియ (1907 ఫిబ్రవరి 13) నాడు కలవై లోనే 68వ పీఠాధిపతిగా అభిషేకించటం జరిగిపోయాయి. 67వ పీఠాధిపతి అయిన స్వామినాథన్‌ పెత్తల్లి కొడుకు అప్పటికే సిద్ధిపొందారు. స్వామినాథన్‌ సన్యసించటానికి ఆయన తండ్రి అనుమతి కోరుతూ తిండివనానికి తంతి పంపటం, అనుమతి కూడా తంతి ద్వారా రావటంతో అందుకు ఏ ఆటంకం రాలేదు.

నూతన ఆచార్యుడుగా శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి అని 66వ ఆచార్యుని నామాన్నే స్వామినాథన్‌ తన సన్యాసనామంగా స్వీకరించారు. ఆ తరువాత నెమ్మదిగా కలవై చేరిన మహాలక్ష్మికి (స్వామివారి పూర్వాశ్రమంలో తల్లి) సన్యాసం స్వీకరించి కూర్చున్న తన రెండవ కొడుకు కన్పించాడు. ఎంత చిత్రం! కొడుకు సన్యసించినందుకు అక్కగారికి ధైర్యం చెప్పటానికి వచ్చిన తాను తన కొడుకు గూడ సన్యసించటంతో తనకే తను ధైర్యం చెప్పుకోవలసిన పరిస్థితి కల్గింది.

తను ఏ పరిస్థితిలలో సన్యసించవలసి వచ్చిందీ వివరిస్తూ జగద్గురువులు వొకసారి ఇలా అన్నారు:

'కాషాయ వస్త్రాలను నేను స్వయంగా వైరాగ్య పూర్వకంగా గ్రహించకపోయినా అవి వాటంతట అవి వచ్చాయి. దాని వల్ల జరిగిందేమిటంటే గురువుకు శుశ్రూష చేస్తూ బోధనందే భాగ్యం నాకు లేకపోయింది...'

ప్రత్యక్షంగా గురుసాన్నిధ్యం ఆయనకు ప్రాప్తించకపోయినా సారం గ్రామంలో స్వామినాథన్‌గా ఆయన 66వ ఆచార్యులను కలిసినపుడే ఆచార్యస్వామి వారి అనుగ్రహ వీక్షణం ఆయనపై పూర్తిగా ప్రసరించింది. నిజానికి స్వామినాథన్‌ను కంచికామకోటిపీఠంపై అధివసింపజేయాలన్న సంకల్పం ఆచార్యులకు ఆనాడే కలిగింది., తపస్సంపన్నుల సంకల్పం ఆమోఘం కదా!

ఆయనకు స్వామినాథన్‌పైగల అపార వాత్సల్యం ఎట్టిదో కాని తన పీఠాన్నే గాక తన పవిత్ర నామాన్ని (చంద్రశేఖర సరస్వతి) కూడా ఆయన స్వామినాథన్‌ పరం చేశారు.

ఆయన గురువైన మహాదేవేంద్రులు ఏడు రోజులు మాత్రమే పీఠాధిపతిగా వుండి చిన్న వయసులోనే సిద్ది పొందారు. 'పోతూ, పోతూ ఆయన తన ఆయుస్సు కూడా నాకే యిచ్చిపోయినట్లుంది', అంటూ పరమాచార్య అప్పుడప్పుడు ఛలోక్తిగా అంటుండేవారు.

Paramacharya pavanagadhalu    Chapters