Paramacharya pavanagadhalu    Chapters   

105. అంతర్దృష్టితో ఆదిలాబాద్‌ దర్శనం

1983లో కర్నూలులో కంచి స్వాములు చాతుర్మాస్యం చేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.టి.రామారావు గారు చాతుర్మాస్యం ముగిసే రోజుకు కర్నూలు వచ్చి వీడ్కోలు చెప్పాలని తలచారు కాని అలా చేయటం వారికి కుదరలేదు. అప్పుడాయనకు పౌరసంబంధ శాఖాధికారిగా వున్న నన్ను ఒక సందేశంతో స్వాముల వారి వద్దకు పంపారు. అలా స్వాముల వారలను ముగ్గుర్నీ సకుటుంబంగా వెళ్లి దర్శనం చేసుకొనే భాగ్యం అనుకోకుండా మాకు లభించింది.

మేమంతా వెళ్లి అక్కడ కూచున్న తరువాత ఆయన నాపేరు, వూరు, గోత్రం, ఎక్కడ పని చేస్తున్నదీ - యిలాంటి వన్నీ అడిగారు. తరువాత శిష్యులొకరు స్వామికి ముఖ్యమంత్రి పంపిన లేఖ చదివి వినిపించారు. అందులో ఆ సంవత్సరం కలిగిన వరదల ప్రసక్తి వుంది.

అది విని స్వామి వరదలెక్కడొచ్చాయి అని అడిగారు. నాకు వరదలు వచ్చిన జిల్లాల పేర్లు వెంటనే గుర్తుకు రాలేదు. నేను ఆలోచించుకొంటుంటే కలక్టరు గారు టక్కున ఎనిమిది జిల్లాల పేర్లు చెప్పేశాడు. దానిపై స్వాముల వారు 'ఆదిలాబాద్‌' అన్నారు. ఆదిలాబాద్‌లో వరదలు లేవన్నాడు కలక్టరు అగర్‌వాల్‌ గారు. స్వామి మళ్లీ 'ఆదిలాబాద్‌' అన్నారు. ఇక మేము మౌనం వహించి వూరుకున్నాము.

మర్నాడు నేను హైదరాబాదు తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయంలో వరదల పరిస్థితిని సమీక్షించటానికి ఒక సమావేశం జరిగింది. అందులో అప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా వున్న కాశీపాండ్యన్‌ గారు మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బ తిన్న జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌ను కూడా చేర్చాలని సూచించారు. వరదలు వచ్చిన సమయంలో తాను ఆదిలాబాదులో వున్నానని, అన్ని సంబంధాలు తెగిపోవడంతో వరదలపై కలక్టరు పంపిన నివేదిక ప్రభుత్వానికి చేరలేదని, తాను వొక కాపీ తెచ్చానని తెలియచేశారు. అప్పుడు నాకు స్వాముల వారు పదే పదే ఆదిలాబాద్‌ అన్న సంగతి గుర్తుకు వచ్చింది. కర్నూలులో కూర్చుని ఆయన ఆదిలాబాద్‌ వరదల సంగతి ఎలా చెప్పగలిగారో ఇప్పటికీ అర్థం కాదు.

నేను కర్నూలుకు స్వాముల వారి దర్శనార్థం బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి గారి వద్ద ఆచార్యులను గురించి కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు తనకు కంచి పరమాచార్య అంటే ఎంతో భక్తి, గౌరవం అనీ, వారు ఆంధ్రప్రదేశ్‌లోనికి ప్రవేశించేటప్పుడు తాను వెళ్లి రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం చెప్పగలగటం తన అదృష్టం అనీ అన్నారు.

దానిపై నేను కంచి స్వామి ఏమీ మహిమలు (మిరకిల్స్‌) చేయరని అయినా ఆయన అంటే అందరికీ భ##క్తేనని అన్నాను. నిజానికి స్వాముల వారి గురించి ఏమాత్రం తెలియని నేను ఆ విధంగా చెప్పి నా అజ్ఞానం వెల్లడించుకున్నాను. అందుకే ఆచార్య స్వామి నాకు ఆదిలాబాద్‌ విషయంలో తన మహిమ చూపి నా కన్నులు తెరిపించారేమో!

అద్దంలో మన ముఖం మనకు కన్పిస్తుంది. మన ముఖానికి తిలకం పెట్టుకుంటే అద్దంలో ముఖానికి తిలకం దిద్దినట్లవుతుంది. అలా కాక అద్దంలో ముఖానికి తిలకం దిద్దితే, అది అద్దంపై మరక పడుతుంది గాని ప్రయోజనం వుండదు.

మనం పరమాత్మ ప్రతిబింబాలం; మనకు మేలు కలగాలంటే పరమాత్మను సేవించాలి. పరమాత్మకు చేయబడ్డ కైంకర్యం సర్వలోక కళ్యాణదాయకం.

ఈ విషయాన్నే ఆదిశంకరులు లక్ష్మీ నృసింహస్తోత్రంలో చెప్పారు.

''ఓ మానస భృంగమా! ఎందుకు వృధాగా యీసంసారమనే ఎడారిలో తిరుగుతావు? నరసింగుని పాద పద్మాలలోని తేనెను ఆస్వాదించు''.

మనస్సుకు ప్రభువు జీవుడు. జీవునకు మేలు కలగాలంటే నృసింహుని పాదాలను శరణుపొందాలి.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters