Siva Maha Puranam-3    Chapters   

శ్రీగణశాయ నమః

శ్రీ శివ మహాపురాణము

కోటి రుద్ర సంహితా

అథ ప్రధమో%ధ్యాయః

జ్యోతిర్లింగములు - వాటి ఉపలింగములు

యో ధత్తే నిజమాయయైవ భువనాకారం వికారోజ్ఘితో యస్యాహుః కరుణాకటాక్షవిభవౌ స్వర్గాపవర్గాభిధౌ |

ప్రత్యగ్బోధసుఖాద్వయం హృది సదా పశ్యంతి యం యోగినః తసై#్మ శైలసుతాంజితార్ధవపుషే శశ్వన్నమస్తేజసే || 1

కృపాలలితవీక్షణం స్మితమనోజ్ఞవక్త్రాంబుజం శశాంకకలయోజ్జ్వలం శమిత ఘోరతాపత్రయమ్‌ |

కరోతు కిమపి స్ఫురత్పరమసౌఖ్యసచ్చిద్వపుః ధరాధరసుతాభుజోద్వలయితం మహో మంగలమ్‌ || 2

ఏ పరమాత్మ వికారరహితుడై ఉండియు తన మాయచే జగద్రూపమున ధరించియున్నాడో, స్వర్గమోక్షములు ఎవని దయ మరియు కటాక్షముల మహిమలు మాత్రమే అగుచున్నవో, ఎవనిని సచ్చిదానంద-అద్వితీయ- ఆత్మరూపముగా యోగులు హృదయములో దర్శించెదరో, పార్వతీదేవిచే అలంకరింపబడిన అర్ధాంగముగల తేజస్స్వరూపుడగు ఆ శివునకు అనేక ప్రణామములు (1). దయతో సుందరమైన చూపులు గలది, చిరునగవుతో సుందరమైన పద్మమువంటి ముఖము గలది, చంద్రరేఖతో ప్రకాశించునది, భయంకరమగు తాపత్రయమును శమింపజేయునది, ప్రకాశించే సచ్చిదానందవిగ్రహము, పార్వతీభుజముల ఆలింగనముతో కూడినది అగు ఒకానొక వర్ణింప శక్యము కాని జ్యోతిస్సు మంగళమును కలిగించుగాక! (2)

ఋషయ ఊచుః |

సమ్యగుక్తం త్వయా సూత లోకానాం హితకామ్యయా | శివావతారమాహాత్మ్యం నానాఖ్యానసమన్వితమ్‌ || 3

పునశ్చ కథ్యతాం తాం శివమాహాత్మ్యముత్తమమ్‌ | లింగసంబంధి సుప్రీత్యా ధన్యస్త్వం శైవసత్తమః || 4

శృణ్వంతస్త్వన్ముఖాంభోజాన్న తృప్తాస్స్మో వయం ప్రభో | శైవం యశో%మృతం రమ్యం తదేవ పునరుచ్యతామ్‌ || 5

పృథివ్యాం యాని లింగాని తీర్థే తీర్థే శుభాని హి | అన్యత్ర వా స్థలే యాని ప్రసిద్ధాని స్థితాని వై || 6

తాని తాని చ దివ్యాని లింగాని పరమేశితుః | వ్యాసశిష్య సమాచక్ష్వ లోకానాం హితకామ్యయా || 7

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! నీవు లోకముల హితమును గోరి అనేకగాథలతో గూడియున్న శివావతారముల మహిమను చక్కగా చెప్పియుంటివి (3). ఓ తండ్రీ! నీవు మరల శివలింగము యొక్క ఉత్తమమగు మాహాత్మ్యమును అతిశయించిన ప్రీతితో చెప్పుము. శివభక్తులలో శ్రేష్ఠుడవగు నీవు ధన్యుడవు (4). ఓ ప్రభూ! నీ ముఖపద్మమునుండి శివయశస్సు అనే రమ్యమగు అమృతమును ఆస్వాదించుచున్న మాకు తృప్తి కలుగుట లేదు. కావున అదే గాథను మరల చెప్పుము (5). ఓ వ్యాస శిష్యా! భూమండలములో వివిధ తీర్థక్షేత్రములలో మరియు ఇతరస్థలములలో శుభకరములు, ప్రసిద్ధములు, దివ్యములు అగు పరమేశ్వరుని ఏయే లింగములు గలవో, వాటిని గురించి లోకముల హితమును గోరి చెప్పుము (6, 7).

సూత ఉవాచ |

సాధు పృష్టమృషిశ్రేష్ఠ లోకానాం హితకామ్యయా | కథయామి భవత్‌ స్నేహాత్తాని సంక్షేపతో ద్విజాః || 8

సర్వేషాం శివలింగానాం మునే సంఖ్యాన విద్యతే | సర్వా లింగమయీ భూమిస్సర్వం లింగమయం జగత్‌ || 9

లింగమయాని తీర్థాని సర్వం లింగే ప్రతిష్ఠితమ్‌ | సంఖ్యా న విద్యతే తేషాం తాని కించిద్ర్బ వీమ్యహమ్‌ || 10

యత్కించిద్దృశ్యతే దృశ్యం వర్ణ్యతే స్మర్యతే చ యత్‌ | తత్సర్వం శివరూపం హి నాస్య దస్తీతి కించన || 11

తథాపి శ్రూయతాం ప్రీత్యా కథయామి యథాశ్రుతమ్‌ | లింగాని చ ఋషిశ్రేష్ఠాః పృథివ్యాం యాని తాని హ || 12

పాతాలే చాపి వర్తంతే స్వర్గే చాపి తథా భువి | సర్వత్ర పూజ్యతే శంభుస్సదేవాసురమానుషైః || 13

త్రిజగచ్ఛంభునా వ్యాప్తం సదేవాసురమానుషమ్‌ | అనుగ్రహాయ లోకానాం లింగరూపేన సత్తమాః || 14

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నీవు లోకముల హితమును గోరి చక్కగా ప్రశించితివి. ఓ బ్రాహ్మణులారా! మీయందలి ప్రేమచే వాటిని గురించి సంక్షేపముగా చెప్పుచున్నాను (8). ఓమునీ! శివలింగములన్నింటికి సంఖ్య లేదు. ఈ భూమి అంతయు లింగమయము. ఈ జగత్తు అంతయు లింగమయము (9). తీర్థములు లింగమయములు. సర్వము లింగమునందు ప్రతిష్ఠితమై యున్నది. లింగములకు సంఖ్య లేదు. నేను వాటిని గురించి కొద్దిగా చెప్పెదను (10). ఎయ్యది చూడబడుచున్నదో, వర్ణింపబడుచున్నదో, మరియు స్మరించబడుచున్నదో ఆ సర్వము శివస్వరూపమే. శివుని కంటే భిన్నముగా ఏదియూ లేదు (11). ఓ మహర్షులారా! అయిననూ, పృథివిలో ఏయే లింగములు గలవో వాటిని గురించి నేను విన్నంతవరకు చెప్పుచున్నాను. ప్రీతితో వినుడు (12). శివలింగములు భూమియందు మాత్రమే గాక, స్వర్గపాతాళములలో కూడ గలవు. దేవతలు రాక్షసులు మరియు మానవులు సర్వత్రా శంభుని పూజించెదరు (13). ఓ సత్పురుషులారా! దేవతలతో, రాక్షసులతో, మరియు మానవులతో కూడియున్న ఈ ముల్లోకముల అనుగ్రహము కొరకై శంభుడు సర్వత్రా వ్యాపించియున్నాడు (14).

అనుగ్రహాయ లోకానాం లింగాని చ మహేశ్వరః | దధాతి వివిధాన్యత్ర తీర్థే చాన్యస్థలే తథా || 15

యత్ర యత్ర యదా శంభుర్భక్త్యా భ##క్తైశ్చ సంస్మృతః | తత్ర తత్రావతీర్యాథ కార్యం కృత్వా స్థితస్తదా || 16

లోకానాముపకారార్థం స్వలింగం చాప్యకల్పయత్‌ | తల్లింగం పూజయిత్వా తు సిద్ధిం సమధిగచ్ఛతి || 17

పృథివ్యాం యాని లింగాని తేషాం సంఖ్యాన విద్యతే | తథాపి చ ప్రధానాని కథ్యంతే చ మయా ద్విజాః || 18

ప్రధానేషు చ యానీహ ముఖ్యాని ప్రవదామ్యహమ్‌ | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవః క్షణాత్‌ || 19

జ్యోతిర్లింగాని యానీహ ముఖ్యముఖ్యాని సత్తమ | తాన్యహం కథయామ్యద్య శ్రుత్వా పాపం వ్యపోహతి || 20

మహేశ్వరుడు లోకములననుగ్రహించుటకొరకై ఈ భూలోకములో తీర్థములయందు మాత్రమే గాక ఇతరస్థలములయందు కూడ వివిధలింగరూపములను దాల్చుచున్నాడు (15). ఎక్కడెక్కడైతే భక్తులు భక్తితో శంభుని స్మరించెదరో, అక్కడక్కడ ఆయన అవతరించి కార్యమును చక్కబెట్టిన తరువాత అచటనే స్థిరముగా నుండెను (16). ఆయన లోకోపకారముకొరకై స్వయంభూలింగరూపములో కూడ అవతరించి యున్నాడు. ఆయా లింగములను పూజించిన మానవుడు సిద్ధిని బడయును (17). భూమండలమునందు గల లింగముల సంఖ్యను గణించుట అసంభవము. ఓ బ్రాహ్మణులారా! అయిననూ, నేను ప్రధానమైన వాటిని చెప్పెదను (18). ఈ లోకములోని లింగములలో ప్రధానమైన వాటిలో కూడ మరల ముఖ్యమైన వాటిని నేను చెప్పుచున్నాను. ఈ విషయమును విన్న మానవుడు వెనువెంటనే పాపములన్నింటినుండియు విముక్తుడగును (19). ఓ మహాత్మా! ఈ లోకములో అత్యంతప్రముఖమైన జ్యోతిర్లింగములను గురించి నేను ఇప్పుడు చెప్పుచున్నాను. దీనిని విన్న చో, పాపములు నశించును (20).

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీ శైలే మల్లికార్జునమ్‌ | ఉజ్జయిన్యాం మహాకాలమోంకారే పరమేశ్వరమ్‌ || 21

కేదారం హిమవత్పృష్ఠే డాకిన్యాం భీమశంకరమ్‌ | వారాణస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే || 22

వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే | సేతుబంధే చ రామేశం ఘుశ్మేశం చ శివాలయే || 24

ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్‌ | సర్వపాపవినిర్ముక్తస్సర్వ సిద్ధిఫలం లభేత్‌ || 24

యం యం కామమపేక్ష్యైవ పఠిష్యంతి నరోత్తమాః | ప్రాప్స్యంతి కామం తం తం హి పరత్రేహ మునీశ్వరాః || 25

యే నిష్కామతయా తాని పఠిష్యంతి శుభాశయాః | తేషాం చ జననీగర్భే వాసో నైవ భవిష్యతి || 26

ఏతేషాం పూజనేనైవ వర్ణానాం దుఃఖనాశనమ్‌ | ఇహ లోకే పరత్రాపి ముక్తిర్భవతి నిశ్చితమ్‌ || 27

సౌరాష్ట్ర దేశములో సోమనాథుడు, శ్రీశైలములో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలుడు, ఓంకారములో పరమేశ్వరుడు (21), హిమవత్పర్వతములలో కేదారేశ్వరుడు, డాకినిలో భీమశంకరుడు, వారాణసిలో విశ్వేశ్వరుడు, గోదావరీతీరమునందు త్ర్యంబకేశ్వరుడు (22), శ్మశాన భూమియందు వైద్యనాథుడు, దారుకా వనమునందు నాగేశ్వరుడు, సేతుబంధమునందు రామేశ్వరుడు, శివాలయమునందు ఘుశ్మేశ్వరుడు (23) అను ఈ పన్నెండు నామములను ఎవడైతే ఉదయమే లేచి పఠించునో, వాడు పాపములన్నింటి నుండియు విముక్తుడై సర్వసిద్ధుల ఫలమును పొందును (24). ఓ మహర్షులారా! మానవశ్రేష్ఠులు ఏయే కామనలనపేక్షించి దీనిని పఠించెదరో, వారు ఆయా కామనలను ఇహపరలోకములలో పొందెదరు (25). శుద్ధమగు అంతఃకరణముగల ఏ మానవులు దీనిని నిష్కామముగా పఠించెదరో, వారికి మరల జన్మ ఉండదు (26). ఈ లింగములను పూజించినంత మాత్రాన సర్వవర్ణములవారికి ఈ లోకములో దుఃఖములు నశించుటయే గాక, పరలోకములో మోక్షము నిశ్చితము (27).

గ్రాహ్యమేషాం చ నైవేద్యం భోజనీయం ప్రయత్నతః | తత్కర్తుస్సర్వపాపాని భస్మసాద్యాంతి వై క్షణాత్‌ || 28

జ్యోతిషాం చైవ లింగానాం బ్రహ్మాదిభిరలం ద్విజాః | విశేషతః ఫలం వక్తుం శక్యతే న పరైస్తథా || 29

ఏకం చ పూజితం యేన షణ్మాసం తన్నిరంతరమ్‌ | తస్మ దుఃఖం న జాయేత మాతృకుక్షిసముద్భవమ్‌ || 30

హీనయోనౌ యదా జాతో జ్యోతిర్లింగం చ పశ్యతి | తస్య జన్మ భ##వేత్తత్ర విమలే సత్కులే పునః || 31

సత్కులే జన్మ సంప్రాప్య ధానడ్యో వేదపారగః | శుభకర్మ తదా కృత్వా ముక్తిం యాత్యనపాయినీమ్‌ || 32

వ్లుెచ్ఛో వాప్యంత్యజో వాపి షణ్ఢో వాపి మునీశ్వరాః | ద్విజో భూత్వా భ##వేన్ముక్తస్తస్మాత్తద్దర్శనం చరేత్‌ || 33

జ్యోతిషాం చైవ లింగానాం కించిత్ర్పోక్తం ఫలం మయా | జ్యోతిషాం చోపలింగాని శ్రూయంతామృషిసత్తమాః || 34

సోమేశ్వరస్య యల్లింగమంత కేశముదాహృతమ్‌ | మహ్యాస్సాగరసంయోగే తల్లింగముపలింగకమ్‌ || 35

మల్లికార్జున సంభూతముపలింగముదాహృతమ్‌ | రుద్రేశ్వరమితి ఖ్యాతం భృగుకక్షే సుఖావహమ్‌ || 36

మహాకాలభవం లింగం దుగ్ధేశమితి విశ్రుతమ్‌ | నర్మదాయాం ప్రసిద్ధం తత్సర్వపాపహరం స్మృతమ్‌ || 37

ఈ జ్యోతిర్లింగముల నైవేద్యమును స్వీకరించి శ్రద్ధాపూర్వకముగా భక్షించవలెను. అట్టు చేసినవాని పాపములన్నియు వెనువెంటనే భస్మమగును (28). ఓ బ్రాహ్మణులారా! జ్యోతిర్లింగార్చనా ఫలమును బ్రహ్మాదులైననూ విశేషముగా వర్ణించలేరు. ఇతరుల గురించి చెప్పనేల? (29). ఎవడైతే ఒక లింగమును నిరంతరముగా ఆరు మాసములు పూజించునో, వానికి పునర్జన్మదుఃఖము లేదు (30). హీనయోనిలో జన్మించిన ప్రాణి జ్యోతిర్లింగమును దర్శించినచో, ఆ ప్రాణి మరు జన్మలో పవిత్రమగు సత్కులములో జన్మించును (31). ఆ జీవుడు సత్కులములో జన్మించి ధనవంతుడు మాత్రమే గాక వేదవేత్తయై పవిత్రకర్మలనాచరించి శాశ్వతమగు మోక్షమును పొందును (32). ఓ మహర్షులారా! వ్లుెచ్ఛుడు గాని, నపుంసకుడు గాని జ్యోతిర్లింగమును దర్శించినచో, బ్రాహ్మణుడై పుట్టి ముక్తిని పొందును. కావున, జ్యోతిర్లింగమును దర్శించవలెను (33). ఓ మహర్షులారా! నేను జ్యోతిర్లింగముల ఫలమును కొంతవరకు చెప్పితిని. జ్యోతిర్లింగముల ఉపలింగములను గురించి వినుడు (34). మహానది సముద్రములో కలియు చోట గల అంతకేశ్వరుడను లింగము సోమేశ్వరుని ఉపలింగము (35). భృగుకక్షమునందు గల, సుఖములనిచ్చే రుద్రేశ్వరలింగము మల్లికార్జునుని నుండి ఉద్భవించుటచే దానికి ఉపలింగమగును (36). మహాకాలేశ్వరునినుండి ఉద్భవించి నర్మదానదీతీరమున దుగ్థేశ్వరుడని ప్రఖ్యాతిని గాంచిన లింగము సర్వుల పాపములను పోగొట్టునని ఋషులచే చెప్పబడినది (37).

ఓంకారజం చ యల్లింగం కర్దమేశమితి శ్రుతమ్‌ | ప్రసిద్ధం బిందుసరసి సర్వకామఫలప్రదమ్‌ || 38

కేదారేశ్వరసంజాతం భూతేశం యమునాతటే | మహాపాపహరం ప్రోక్తం పశ్యతామర్చతాం తథా || 39

భీమశంకరసంభూతం భీమేశ్వరమితి స్మృతమ్‌ | సహ్యాచలే ప్రసిద్ధం తన్మహాబలవివర్ధనమ్‌ || 40

నాగేశ్వరసముద్భూతం భూతేశ్వర ముదాహృతమ్‌ | మల్లికాసరస్వతితీరే దర్శనాత్పాపహారకమ్‌ || 41

రామేశ్వరాచ్చ యజ్జాతం గుప్తేశ్వరమితి స్మృతమ్‌ | ఘుశ్మేశాచ్చైవ యజ్జాతం వ్యాఘ్రేశ్వరమితి స్మృతమ్‌ || 42

జ్యోతిర్లింగోపలింగాని ప్రోక్తానీహ మయా ద్విజాః | దర్శనాత్పాపహారీణి సర్వకామప్రదాని చ || 43

ఏతాని సుప్రధానాని ముఖ్యతాం హి గతాని చ | అన్యాని చాపి ముఖ్యాని శ్రూయతాంమృషిసత్తమాః || 44

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం జ్యోతిర్లింగ తదుపలింగ మాహాత్మ్య వర్ణనం నామ ప్రథమో%ధ్యాయః (1)

ఓం కారేశ్వరునినుండి ఉద్భవించి కర్దమేశుడని ప్రసిద్ధిని గాంచిన లింగము బిందుసరస్సునందు ఉన్నదై సర్వుల కోర్కెలను ఈడేర్చుచూ ఫలములనిచ్చుచున్నది (38). యమునాతీరమునందు కేదారేశ్వరునినుండి ఉద్భవించిన భూతేశ్వరుడు తనను దర్శించినవారికి, అర్చించినవారికి మహాపాపములను పోగొట్టునని చెప్పబడినది (39). సహ్యపర్వతమునందు భీమశంకరుని ఉద్భవించిన భీమేశ్వరుడు గొప్ప బలమును వర్ధిల్లజేయునని మహర్షులచే చెప్పబడినది (40). మల్లికారసరస్వతీ తీర మునందు గల, నాగేశ్వరునినుండి ఉద్భవించిన భూతేశ్వరుడు దర్శనము చేతనే పాపములను పోగొట్టునని చెప్పబడినది (41). రామేశ్వరుని నుండి ఉద్భవించిన లింగము గుప్తేశ్వరుడనియు, ఘ్ముశ్మేశ్వరుని నుండి వ్యాఘ్రేశ్వరుడు ఉద్భవించెననియు మహర్షులు చెప్పినారు (42). ఓ బ్రాహ్మణులారా! దర్శన మాత్రముచే పాపములను పోగొట్టి కోర్కెలనన్నిటినీ ఈడేర్చే జ్యోతిర్లింగ- ఉపలింగములను గురించి చెప్పితిని (43). ఇవి మిక్కిలి ప్రధానమైనవని ప్రసిద్ధిని గాంచినవి. ఓ మహర్షులారా! ఇంకనూ మరికొన్ని ముఖ్యలింగములను గురించి వినుడు (44).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు జ్యోతిర్లింగములను, వాటి ఉపలింగములను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).

Siva Maha Puranam-3    Chapters