Sri Sivamahapuranamu-I    Chapters   

అథ షోడశోధ్యాయః

విష్ణువు, బ్రహ్మ శివుని స్తుతించుట

బ్రహ్మోవాచ |

ఇతి స్తుతిం చ హర్యాది కృతమాకర్ణ్య శంకరః | బభూవాతి ప్రసన్నో హి విజహాస చ సూతికృత్‌ || 1

బ్రహ్మ విష్ణూ తు దృష్ట్వా తౌ సస్త్రీకౌ సంగతౌ హరః | యథోచితం సమా భాష్య పప్రచ్ఛాగమనం తయోః || 2

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు చేసిన ఈ స్తోత్రమును విని సర్వకారణ కారణుడగు శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై మందహాసమును చేసెను (1). బ్రహ్మ, విష్ణువులను భార్యలతో సహా చూచి శివుడు వారిని యథా యోగ్యముగా పలకరించి వారి రాకకు కారణమును అడిగెను (2).

రుద్ర ఉవాచ |

హే హరే హే విధే దేవా మునయశ్చాద్య నిర్భయాః | నిజాగమనహేతుం హి కథయస్వ సుతత్త్వతః || 3

కి మర్థ మాగతా యూయం కిం కార్యం చేహ విద్యతే | తత్సర్వం శ్రోతుమిచ్ఛామి భవత్‌ స్తుత్యా ప్రసన్న ధీః || 4

రుద్రుడిట్లు పలికెన -

హే విష్ణో! బ్రహ్మన్‌! దేవతలారా! మునులారా! మీరిపుడు భయమును వీడి మీ రాకకు గల కారణమును సుస్పష్టముగా చెప్పుడు (3). మీరు దేని కొరకు విచ్చేసితిరి? ఇచట మీకు గల పని యేమి? ఈ విషయమునంతనూ నేను వినగోరుచున్నాను. మీ స్తోత్రముచే నా మనస్సు ప్రసన్నమై నది (4).

బ్రహ్మోవాచ |

ఇతి పృష్టే హరే ణాహం సర్వలోకపితామహః | మునేsవోచం మహాదేవం విష్ణునా పరిచోదితః || 5

దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో | యదర్ధ మాగతావావాం తచ్ఛృణు త్వం సురర్షిభిః || 6

విశేషత స్తవై వార్థ మాగతా వృషభధ్వజ | సహార్థినస్సదా యోగ్యమన్యథా న జగద్భవేత్‌ || 7

కేచిద్భవిష్యంత్య సురా మమ వధ్యా మహేశ్వర | హరే ర్వధ్యాస్తథా కేచిద్భవతశ్చాపి కేచన || 8

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శివుడు ఇట్లు ప్రశ్నించగా విష్ణువు నన్ను ప్రేరేపించెను. సర్వలోక పితామహుడనగు నేను మహాదేవునితో నిట్లంటిని (5). దేవదేవా!మహాదేవా!కరుణా సముద్రా! ప్రభో! మేము దేవతలతో, ఋషులతో కలిసి ఇచటకు వచ్చుటకు గల కారణము వినుము (6). హే వృషభధ్వజా! మేమిద్దరము ప్రత్యేకించి నీ కొరకు మాత్రమే వచ్చితిమి. మనము ముగ్గురము కలిసి ఉండుట శ్రేష్ఠము. అట్లు గానిచో, ఈ జగత్తు మనజాలదు (7). హే మహేశ్వరా! కొందరు రాక్షసులు నాచే, మరికొందరు విష్ణువుచే, ఇంకొందరు నీచే సంహరింపబడెదరు (8).

కే చిత్త్వా ద్వీర్వ జాతస్య తనయస్య మహాప్రభో | మాయావధ్యాః ప్రభో కేచిద్భ విష్యంత్య సురాస్సదా || 9

తవైవ కృపయా శంభో సురాణాం సుఖముత్తమమ్‌ | నాశయిత్వాsసురాన్‌ ఘోరాన్‌ జగత్స్వాస్థ్వం సదాభయమ్‌ || 10

యోగయుక్తే త్వయి సదా రాగద్వేషవివర్జితే | దయా పాత్రైక నిరతే న వధ్యా హ్యాథవా తవ || 11

ఆరాధితేషు తేష్వీశ కథం సృష్టిస్తథా స్థితిః | అతశ్చ భవితా యుక్తం నిత్యం నిత్యం వృషధ్వజ|| 12

ఓ మహాప్రభో! కొందరు నీనుండి జన్మించిన కుమారునిచే వధింపబడెదరు. హే ప్రభో! మరికొందరు రాక్షసులను శక్తి వధించగలదు (9). హే శంభో! నీ కృప చేతనే భయంకరులగు రాక్షసులందరు నశించగా, దేవతలకు ఉత్తమ సుఖము, నిత్యము అభయము, జగత్తునకు స్వస్థత లభించినది (10).నీవు నిత్యము యోగపరాయణుడవై, రాగ ద్వేషములను విడనాడి, దయాసముద్రుడవు అయినచో వారిని నీవు సంహరించవు (11). హే ఈశ! వారిని ఈ విధముగా అనుగ్రహించినచో, సృష్టి స్థితులు ఎట్లు కొనసాగును? కావున, హే వృషధ్వజా! నీవి నిత్యము జగత్కార్యమునకు సహకరించుటయే యుక్తముగనుండును (12).

సృష్టిస్థిత్యంత కర్మాణి న కార్యాణి యదా తదా | శరీరభేదశ్చాస్మాకం మాయాయాశ్చన యుజ్యతే || 13

ఏకస్వరూపా హి వయం భిన్నా కార్యస్య భేదతః | కార్యభేదో న

సిద్ధ శ్చేద్రూపభేదోsప్రయోజనః || 14

ఏక ఏవ త్రిధా భిన్నః పరమాత్మా మహేశ్వరః | మాయాస్వాకారణాదేవ స్వతంత్రో లీలయా ప్రభుః || 15

వామాంగజో హరిస్తస్య దక్షిణాంగ భవో హ్యహమ్‌ | శివస్య హృదయాజ్ఞాతస్త్వ హి పూర్ణ తనుశ్శివః || 16

మనము సృష్టిస్థితి లయ కర్మలను చేయని నాడు మనకు మాయా ప్రభావముచే లభించిన శరీర భేదము ప్రయోజన రహితమగును (13). మన స్వరూపము ఒక్కటియే అయినా, కార్య భేదముచే మనలో భేదము కలిగినది. ఈ కార్య భేదము సిద్ధించనిచో, రూపభేదము నిష్ప్రయోజనమగును (14). మహేశ్వర పరమాత్ముడొక్కడే ముగ్గురిగా భేదమును పొందినాడు. స్వతంత్రుడగు ఆ ప్రభువు తన మాయాశక్తిచే ఈ లీలను నెరపినాడు (15). ఆయన ఎడమ భాగము నుండి విష్ణువు, కుడి భాగమునుండి నేను, హృదయము నుండి నీవు జన్మించినాము. పూర్ణ స్వరూపుడవగు శివుడవు నీవే కదా ! (16).

ఇత్థం వయం త్రిధా భూతాః ప్రభాభిన్న స్వరూపిణః | శివాశివసుతాస్తత్త్వం హృదా విద్ధి సనాతన || 17

అహం విష్ణుశ్చ సస్త్రీ కౌ సంజాతౌ కార్యహేతుతః | లోకకార్యకరౌ ప్రీత్యా తవ శాసనతః ప్రభో|| 18

తస్మాద్విశ్వహితార్థాయ సురాణాం సుఖహేతవే | పరిగృహ్ణీష్వ భార్యార్థే రామామేకాం సుశోభనామ్‌ || 19

అన్యచ్ఛృణు మహేశాన పూర్వవృత్తం స్మృతం మయా | యన్నౌపురః పురా ప్రోక్తం త్వయైవ శివరూపిణా || 20

మనము ఈ విధముగా త్రిమూర్తులు గా ఉన్ననూ చైతన్య స్వరూపములో మనకు భేదము లేదు. మనము పార్వతీ పరమేశ్వరుల పుత్రులము. హే సనాతనా! నీవీ సత్యమును నీ మనస్సులో నెరుంగుము (17). నేను, మరియు విష్ణువు కర్తవ్యములో భాగముగా వివాహమాడితిమి. హే ప్రభూ! మేము నీ ఆజ్ఞచే జగత్కార్యమును ప్రీతితో నిర్వహించుచున్నాము (18). కాన, జగత్కల్యాణము కొరకు, దేవతలకు సుఖమును కలిగించుట కొరకు ఒక అందమైన యువతిని భార్యగా గైకొనుము (19). ఓ మహేశ్వరా! ఇంతకు ముందు జరిగిన వృత్తాంతమొకటి నాకు స్మృతికి వచ్చినది. వినుము. పూర్వము శివరూపములో నున్న నీవు మా ఇద్దరికీ ఒక విషయమును చెప్పియుంటివి (20).

మద్రూపం పరమం బ్రహ్మన్నీ దృశం భవదంగతః | ప్రకటీ భవితా లోకే నామ్నా రుద్రః ప్రకీర్తితః || 21

సృష్టికర్తాsభవద్ర్బహ్మా హరిః పాలన కారకః | లయకారీ భవిష్యామి రుద్రరూపో గుణాకృతిః || 22

స్త్రియం వివాహ్య లోకస్య కరిష్యే కార్యముత్తమమ్‌ | ఇతి సంస్మృత్య స్వప్రోక్తం పూర్ణం కురు నిజం పణమ్‌ || 23

నిదేశస్తవ చ స్వామిన్నహం సృష్టికరో హరిః | పాలకో లయహేతుస్త్వ మావిర్భూతస్స్వయం శివః || 24

త్వాం వినా న సమర్థౌ హి ఆవాం చ స్వస్వకర్మణి | లోకకార్యరతో తస్మాదేకం గృహ్ణీష్వం కామినీమ్‌ || 25

ఓ బ్రహ్మా!ఇటువంటి నా శ్రేష్ఠ రూపము నీ దేహము నుండి ప్రకటమై లోకములో రుద్రనామముతో ప్రసిద్ధిని గాంచగలదు (21). బ్రహ్మ సృష్టిని చేసెను. విష్ణువు స్థితిని చేయుచున్నాడు. నేను గుణ సంబంధముచే రుద్రరూపమును స్వీకరించి లయమును చేయగలను (22). నేను ఒక స్త్రీని వివాహమాడి ఉత్తమమగు లోకకల్యాణమును చేసెదను. నీవిట్లు చెప్పియుంటివి. నీవీ సత్యమును గుర్తునకు తెచ్చుకొని, నీవు ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకొనుము (23). హే స్వామిన్‌! సృష్టిని చేసి నేను, స్థితిని చేసి విష్ణువు నీ ఆజ్ఞను పాలించినాము. శివుడే స్వయముగా నీ రూపముతో ఆవిర్భవించి లయకర్త అగుచున్నాడు (24). నీతోడు లేనిదే మేమిద్దరము మాకర్తవ్యములను నెరవేర్చ జాలము. కావున, నీవు జగత్కార్యమును నిర్వర్తించుటకై ఒక సుందరిని భార్యగా స్వీకరించుము (25).

యథా పద్మాలయా విష్ణో స్సావిత్రీ చ యథా మమ | తథా సహచరీం శంభో కాంతాం గృహ్ణీష్వ సంప్రతి || 26

ఇతి శ్రుత్వా వచో మే హి బ్రహ్మణః పురతో హరేః | స మాం జగాద లోకేశః స్మేరాననముఖో హరః || 27

హే శంభో! విష్ణువునకు లక్ష్మివలె, నాకు సరస్వతి వలె, నీకు తోడుగా నుండే సుందరిని ఇపుడు భార్యగా గ్రహింపుము (26). విష్ణువు సమక్షములో బ్రహ్మనగు నా ఈ మాటను విని, లోకేశుడగు శివుడు చిరునవ్వుతో నిండిన ముఖము గలవాడై నాతో నిట్లనెను (27).

ఈశ్వర ఉవాచ |

హే బ్రహ్మన్‌ హే హరే మే హి యువాం ప్రయత రౌ సదా | దృష్ట్వా త్వాం చ మమానందో భవత్యతి తరాం ఖ లు || 28

యువాం సురవిశిష్టౌ హి త్రిభవ స్వామినౌ కిల | కథనం వాం గరిష్ఠేతి భవకార్యరతాత్మనోః || 29

ఉచితం సురశ్రేష్ఠౌ వివాహకరణం మమ | తపోరతి విరక్తస్య సదా విదతయోగినః || 30

యో నివృత్తి సుమార్గస్థ స్స్వాత్మారామో నిరంజనః | అవధూతతనుర్‌ జ్ఞా నీ స్వద్రష్టా కామవర్జితః || 31

ఈశ్వరుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌!ఓ హరీ! మీరిద్దరు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైన వారు గదా! నిన్ను చూచినప్పుడు నాకు గొప్ప ఆనందము కలుగును (28). మీరిద్దరు దేవతలలో ప్రముఖులు, ముల్లోకములకు ప్రభువులు. జగత్కార్యమునందు లగ్నమైనన మనస్సు గల మీరు చెప్పిన మాట చాల యోగ్యమైనది (29). దేవతాశ్రేష్ఠులారా! నాకు వివాహము ఉచితము కాదు. నేను తపోనిష్ఠుడను. విరాగిని. సర్వదా యోగమార్గమునందుండు వాడను (30). నేను పవిత్రమైన నివృత్తి మార్గములో నిర్వికారముగా నాయందు నేను రమించుచూ ఉన్నవాడను. జ్ఞానినగు నా రూపము అవధూతను పోలియుండును. నాకు కామములు లేవు. నేను ఆత్మాలోకన పరుడను (31).

అవికారీ హ్యభోగీ చ స దాశు చి రమంగళః | తస్య ప్రయోజనం లోకే కామిన్యా కిం వదాధునా || 32

కేవలం యోగలగ్నస్య మామానందస్సదాస్తి వై | జ్ఞానహీనస్తు పురుషో మనుతే బహుకామకమ్‌ || 33

వివాహకరణం లోకే విజ్ఞేయం పరబంధనమ్‌ | తస్మాత్తస్య రుచిర్నో మే సత్యం వదామ్యహమ్‌ || 34

న స్వార్థం మే ప్రవృత్తిర్హి సమ్యక్‌ స్వార్థ విచంతనాత్‌ | తథాపి తత్కరిష్యామి భవదుక్తం జగద్ధితమ్‌ || 35

నేను వికారములు లేని వాడను, భోగముల అక్కర లేనివాడను, నేను సర్వదా అశుభ్ర అమంగళ వేషమును ధరించువాడను. అట్టి నాకిపుడు ఈ లోకములో భార్యతో నేమి ప్రయోజనము గలదో చెప్పుము (32). నిత్యయోగ నిష్ఠుడనగు నాకు ఆనందము నిత్యముగనుండును గదా! జ్ఞాన విహీనుడైన పురుషుడైతే అనేక కోర్కెలను మనస్సులో భావించుచుండును (33). లోకములో వివాహమును చేసుకొనుట ఇతరుల బంధములో చిక్కుకొనుటయేనని తెలియవలెను. కావున నాకు వివాహమునందు రుచి లేదు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (34). ఆత్మ నిష్ఠుడను, సమ్యగ్దర్శన నిష్ఠుడను అగు నా ప్రవృత్తి నా కొరకై ఉండదు గదా! అయినప్పటికీ లోకకల్యాణ కొరకై మీరు చెప్పినట్లు చేయగలను (35).

మత్వా వచో గరిష్ఠం వా నియోక్తి పరిపూర్తయే | కరిష్యామి వివాహం వై భక్తవశ్యస్సదా హ్యహమ్‌ || 36

పరం తు యాదృశీం కాంతాం గ్రహీష్యామి తథా పణమ్‌ | తచ్ఛృణుష్వ హరే బ్రహ్మన్‌ యుక్తమేవ వచో మమ || 37

యా మే తేజస్సమర్థాహి గ్రహీతుం స్యాద్విభాగశః | తాం నిదేశయ భార్యర్థే యోగినీం కామరూపిణీమ్‌ || 38

యోగయుక్తే మయి తథా యోగిన్యేవ భవిష్యతి | కామాసక్తే మయి తథా కామిన్యేవ భవిష్యతి || 39

సర్వదా భక్తులకు వశుడనై ఉండే నేను నీ మాటను గొప్ప మాటగా స్వీకరించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట కొరకై వివాహమును చేసుకొనగలను (36). కాని, నేను ఎటువంటి సుందరిని ఏ షరతులపై వివాహమాడెదనో చెప్పెదను. వినుము. ఓ బ్రహ్మా! విష్ణో! నేను యోగ్యమగు మాటను మాత్రమే చెప్పెదను (37). ఏ స్త్రీ నా తేజస్సును వివేకముతో ధరింప సమర్థురాలగునో, అట్టి యోగశక్తి గల, ఇచ్చవచ్చిన రూపమును ధరించగల యువతిని నాకు భార్యగా స్వీకరించుటకై చూపించుడు (38). నేను యోగనిష్ఠుడనై యుండగా ఆమె కూడ యోగ నిష్ఠురాలు గావలెను. మరియు,నేను కామాసక్తుడనైనచో, ఆమె కూడా కామసక్తురాలు కావలెను (39).

యమక్షరం వేదవిదో నిగదంతి మనీషిణః | జ్యోతిరూపం శివం తే చ చింతయిష్యే సనాతనమ్‌ || 40

తచ్చింతాయాం యదాsసక్తో బ్రహ్మన్‌ గచ్ఛామి భావి నీమ్‌ | తత్ర యా విఘ్నజననీ న భవిత్రీ హతాస్తుమే || 41

త్వం వా విష్ణురహం వాపి శివస్య బ్రహ్మ రూపిణః | అంశభూతా మహాభాగా యోగ్యం తదనుచింతనమ్‌ || 42

తచ్చింతయా వినోద్వాహం స్థాస్వామి కమలాసన | తస్మా జ్ఞాయాం ప్రాది శ త్వం మత్కర్మానుగతాం సదా || 43

తత్రాప్యేకం పణం మే త్వం శృణు బ్రహ్మంశ్చ మాం ప్రతి | అవిశ్వాసో మదుక్తే చేన్మయా త్యక్తా భవిష్యతి || 44

వేద వేత్తలగు విద్వాంసులు ఏ శివుని జ్యోతిస్స్వరూపమగు అక్షరపరబ్రహ్మమని వర్ణించెదరో, సనాతనుడగు శివుని ధ్యానించెదరో (40), అట్టి శివుని ధ్యానించని సమయములో నేను ఆమెతో విహరించెదను హే బ్రహ్మన్‌! నా ధ్యానమునందు విఘ్నమును కలిగించు స్త్రీ నాచే నశింపజేయబడును (41). నీవు, విష్ణువు మరియు నేను పరబ్రహ్మ యగు శివుని అంశములము. కాన, మనము మహాత్ములము. కావున మనము ఆయనను ధ్యానించుట ఉచితము (42). హే పద్మసంభవా! ఆయనను స్మరించుచూ నేను వివాహము లేకుండగనైననూ ఉండగలను. కావున, కర్మలలో నన్ను సదా అనుసరించి ఉండగలిగే భార్యను నాకు నీవు చూపెట్టుము (43). హే బ్రహ్మన్‌! ఆ విషయములో మరియొక షరతు గలదు. వినుము. ఆమె నా మాటయందు విశ్వాసమును కోల్పోయిన నాడు ఆమెను నేను త్యజించెదను (44).

బ్రహ్మోవాచ |

ఇతి తస్య వచశ్ర్శుత్వాహం స విష్ణుర్హరస్య చ | సస్మితం మోది తమనోsవోచం చేతి వినమ్రకః || 45

శృణు నాథ మహేశాన మార్గితా యా దృశీ త్వయా | నివేదయామి సుప్రీత్యా తాం స్త్రియం తాదృశీం ప్రభో || 46

ఉమా సా భిన్న రూపేణ సంజాతా కార్యసాధినీ | సరస్వతీ తథా లక్ష్మీర్ద్విధా రూపా పురా ప్రభో || 47

పాద్మా కాంతాsభవద్విష్ణోస్తథా మమ సరస్వతీ | తృతీయ రూపా సా నా భూల్లోక కార్యహితైషిణీ || 48

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివుని ఈ మాటలను విని నేను మరియు విష్ణువు ఆనందించిన మనస్సు గలవారమై వినయముగా చిరునవ్వుతో నిట్లు పలికితిమి (45). ప్రభో! మహేశ్వరా! వినుము. నీవు ఎట్టి స్త్రీని కోరితివో, సరిగా అదే లక్షణములు గల స్త్రీని నీకు నివేదించుటకు మేము చాల సంతసించుచున్నాము (46). హే ప్రభో! పూర్వము ఉమాదేవి లక్ష్మీ సరస్వతీ రూపములను ధరించి జగత్కార్య సాధనకు తోడ్పడియున్నది (47). లక్ష్మి విష్ణువునకు, సర్వతి నాకు అర్థాంగి అయినది. అపుడామె మూడవ రూపమును స్వీకరించలేదు. కాని ఇపుడామె జగత్తు యొక్క కల్యాణమును గోరి జగత్కార్యమును చేయగోరుచున్నది (48).

దక్షస్య తనయా యాభూత్సతీ నామ్నా తు సా విభో | సైవేదృశీ భ##వేద్భార్యా భ##వేద్ధి హితకారిణీ || 49

సా తపస్యతి దేవేశ త్వదర్థం హి దృఢవ్రతా | త్వాం పతిం ప్రాప్తుకామావై మహాతేజోవతీ సతీ || 50

దాతుం గచ్ఛ వరం తసై#్య కృపాం కురు మహేశ్వర | తాం వివాహయ సుప్రీత్యా వరం దత్త్వా చ తాదృశమ్‌ || 51

హరేర్మమ చ దేవానా మియం వాంఛాస్తి శంకర | పరిపూరయ సద్దృష్ట్యా పశ్యామోత్సవ మాదరాత్‌ || 52

హే ప్రభో! ఆమె సతియను పేర దక్షుని కుమార్తెగా జన్మించినది. ఆమె యందు నీవు కోరిన లక్షణములు గలవు. ఆమె నీకు భార్యయై హితమును చేయగలదు (49). హే దేవదేవా! దృఢవ్రతయగు ఆమె నీ కొరకై తపస్సును చేయుచున్నది. మహాతేజశ్శాలినియగు ఆ సతీదేవి నిన్ను భర్తగా పొందగోరుచున్నది (50). హే మహేశ్వరా! నీవు దయచేసి ఆమెకు వరమునిచ్చుటకు వేంచేయుము. ఆమె కోరిన వరమునిచ్చి, ఆమెను ప్రీతితో వివాహమాడుము (51). హే శంకరా! ఇది విష్ణువు యొక్క, నా యొక్క మరియు దేవతల యొక్క అభీష్టము. నీవు కృపాదృష్టితో మా కోర్కెను పూర్తి చేయుము. మేము వివాహమహోత్సవమును ఆదరముతో తిలకించెదము (52).

మంగలం పరమం భూయాత్త్రి లోకేషు సుఖావహమ్‌ | సర్వజ్వరో వినశ్యేద్వై సర్వేషాం నాత్ర సంశయః || 53

అథవాస్మద్వచశ్శేషే వదేత్తం మధుసూదనః | లీలా జాకృతి మీశానం భక్తవత్సల మచ్యుతః || 54

ఇది గొప్ప మంగళ##మై ముల్లోకములకు సుఖమునీయగలదు. అందరికీ అన్ని దుఃఖములు నశించుననుటలో సంశయము లేదు (53). నేను చెప్పగా మిగిలిన మాటలను మధుసూదనుడగు అచ్యుతుడు, లీలచే రుద్రాకృతిని దాల్చిన పరమశివుడవగు నీకు చెప్పగలడు. నీవు భక్తవత్సలుడవు గదా! (54).

విష్ణు రువాచ |

దేవ దేవ మహాదేవ కరుణాకర శంకర | యదుక్తం బ్రహ్మణా సర్వం మదుక్తం తన్న సంశయః || 55

తత్కురుష్వ మహేశాన కృపాం కృత్వా మమోపరి | సనాథం కురు సద్దృష్ట్యా త్రిలోకం సువివాహ్య తామ్‌ || 56

విష్ణువు ఇట్లు పలికెను -

దేవ దేవా!మహాదేవా! కరుణామూర్తీ! శంకరా! బ్రహ్మ చెప్పిన మాటలన్నియూ నేను చెప్పినట్లుగనే స్వీకరింపుము. దానిలో సంశయము లేదు (55). ఓ మహేశ్వరా! నీవు నాపై దయవుంచి అటులనే చేయుము. ఆమెను వివాహమాడి, ముల్లోకములను కృపాదృష్టితో సనాథులను చేయుము (56).

బ్రహ్మో వాచ |

ఇత్యుక్త్వా భగవాన్‌ విష్ణు స్తూష్ణీమాస మునే సుధీః | తథా స్తుతిం విహస్యాహ స ప్రభుర్భక్తవత్సలః || 57

తతస్త్వావాం చ సంప్రాప్య చాజ్ఞాం సమునిభిస్సురైః | అగచ్ఛావ స్వేష్టదేశం సస్త్రీ కౌ పరహర్షితౌ || 58

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే విష్ణుబ్రహ్మకృత శివప్రార్థనా వర్ణనం నామ షోడశోsధ్యాయః (16).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! బుద్ధిశాలియగు విష్ణు భగవానుడు ఇట్లు పలికి ఊరకుండెను. భక్త వత్సలుడగు ఆ శివ ప్రభువు మేము చేసిన స్తోత్రమును విని చిరునవ్వు నవ్వెను (57). అపుడు మేమిద్దరము భార్యలతో, మునులతో మరియు దేవతలతో గూడి శివుని ఆజ్ఞను పొంది మాకు ఇష్టమైన స్థానములకు మిక్కిలి ఆనందముతో చేరుకుంటిమి (58).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసంహితలో రెండవది యగు సతీఖండమునందు విష్ణుబ్రహ్మకృత శివప్రార్థనమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

Sri Sivamahapuranamu-I    Chapters