Maa Swami    Chapters   

9. సనాతన ధర్మప్రచారము

శ్రీవారి విజయయాత్ర సనాతన ధర్మప్రచారమునకు ఎంతో దోహదకారి ఐంది. ఈకాలంలో వేదాధ్యనం, ధర్మనుష్ఠానం, అనాధరక్షక ఇత్యాది విశ్వశ్శ్రేయస కార్యక్రమాలను శ్రీవారు ఎంతో ప్రోత్సహించారు.

ప్రజాసేవకై ముద్రాధికారి సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈసంఘం పర్వదినాలలో పురాణకాలక్షేపాలను ఏర్పాటుచేయడం, ఆలయోద్ధరణ, ఇష్టాపూర్తాలనే వాపీ కూపతటాక నిర్మాణం, రధోత్సవాలను నడపటం ఇత్యాది కార్యాల విషయంలో పాటుపడసాగినది.

1941లో బంగరుకామాక్షీ దేవాలయ పునరోద్ధరణ,కుంభాభిషేకం తంజావూరులో జరిగినది. 1943లో జంబుకేశ్వరంలో ఈలాగే పంచముఖేశ్వరాలయోద్ధరణా, కుంభాభిషేకమూ జరిగినది. కామాక్షికి 70వేల రూపాయల ఖర్చుతో వెండిరధాన్ని తయారు చేయించారు. మధ్యార్జునక్షేత్రంలో శివాలయపునరుద్ధారణ జరిగినది.

చాలకాలంగా జరుగుతున్న కామాక్షీ ఆలయ పునరుద్ధారణ 7-2-1944 పూర్తిఅయి, కుంభాభిషేకం జరిపించారు. సుమారు యాభైవేలమంది ఆ ఉత్సవాన్ని చూచారు. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని మూకపంచశతి అనే గ్రంధాన్ని కామకోటి కోశస్థానం ప్రచురించింది.

రెండవ ప్రపంచయుద్ధం శాంతించడానికి 1942లో రుద్రాభిషేకాలు విష్ణుసహస్రనామ జపమూ చేశారు. అతిరుద్రయాగము శ్రీవారి సమక్షంలో జరుపబడినది. 1949లో తిరువడైమరుదూరులో అతిరుద్రహోమం జరిగింది. 1949లో స్వాములు కుర్తాళంలో ఉన్నారు. అక్టోబరు, నవంబరు నెలలు తులాస్నానంకోసం మయూరం వెళ్ళివచ్చేవారు.

శ్రీవారు వేదపాఠశాలల స్థాపనం, వేదాధ్యయనం విశేషంగా ప్రోత్సహించారు. 1955లో వేదసమ్మేళన నొకటి జరిపింది. ప్రసిద్ధులైన ఋగ్యజుస్సామ వేదాధ్యయనం చేసిన పండితులను విశేష సమ్మానములతో సత్కరించారు.

శ్రీవారి పరమగురువులు 1894లో కుంభకోణంలో అద్వైతసభను స్థాపించారు. ఈ సభ బ్రహ్మ విద్య అనే పత్రికనొకటి నడిపేది. అధ్యయన, అధ్యాపనా ప్రబోధములు ఈ సభయొక్క ముఖ్య కార్యక్రమములు. ఇందు చాలమంది పండిత ప్రకాండులు పాల్గొన్నారు. పరీక్షలుపెట్టి బహుమతులనిచ్చేవారు.

1945లో ఈ సభ స్వర్ణోత్సవ సందర్భంలో అద్వైతాన్నిగూర్చి వ్రాసిన 51 వ్యాసములతో అద్వైత అక్షరమాలిక అనే గ్రంధం ప్రచురింపబడినది.

శివవైష్ణవాభేదమైన ఈశ్వరారాధన స్వాములు ప్రోత్సహించారు. తిరుప్పావై తిరువెంబావై ప్రచారణకు ఆలిండియా రేడియోవారి సహకారమూ అభించింది. మన సంస్కృతికి మూలమైనది ఆధ్యాత్మికత- దానికి సహకారులు శిల్ప నృత్యములు. 1962లో ఇలయాత్తంగుడిలో అఖిలభారత ఆగమశిల్పసదస్సు నొకటి ఏర్పాటుచేశారు. దీనిలో పాండిత్యం, వ్యుత్పత్తీకల పండితులనేకులు పాల్గొన్నారు. ఇందు నృత్యాది జానపద కళలు ప్రదర్శించారు. 1963 నుండి 1968 దాకా వరుసగా ఈ సదస్సులు మధురై, కంచి, మద్రాసు, కాళహస్తి, రాజమండ్రి, సికింద్రాబాదులలో నిర్వహింపబడినవి.

అడుగడుక్కూ స్వామి చెప్పేది హరిహరాభేద అద్వైతం, 'ఏకంసత్‌ విప్రా బహుధావదంతి' మోక్షకారణమైన సత్యమేమో ఒకటే.

మృత్పిండ మేకం బహు భాండరూపం

సువర్ణమేకం బహు భూషణాని

గోక్షీర మేకం బహుధేనుజాతం

పరమాత్మ మేకం బహునామరూపం.

మట్టి ఒక్కటే. దానిచేత నిర్మంచే కుండలు ఎన్నో రకాలు. బంగారు ఒక్కటే కాని ఆభరణాలు అనేకాలు. ఎన్ని ఆవులనుండి పిండినా ఆవుపాలు ఒక్కటే. పరమాత్మ- ఎన్నో నామరూపములు దాల్చినా ఒక్కడే.

శివపురాణాలు శివాధిక్యాన్నీ, విష్ణు పురాణాలు వైష్ణవాధిక్యతను చాటుతాయి. కానీ సమ్యగ్విచారణ చేసేవారికి ఏ విధమైన అపోహ ఉండదు. దైవమొక్కటైనపుడు న్యూనాధికతలకు తావేది? ఆపదలో ఇష్టదైవమన్న ఒక వాడుక ఉన్నది. పరమాత్మ విభిన్ననామ రూపాలలో ఎవరికి ఏది రుచియో ఆ స్వరూపాన్ని అరాధించి తరించిన మహాత్ములున్నారు. ఉపాసనా మూలకంగా భేదరహితమైన అద్వైతస్థితిని అందరూ అందుకొంటారు.

యధాశివమయోవిష్ణ రేవం విష్ణమయశ్శివః

యధాన్తరం న పశ్వామి తథా మేస్వస్తిరాయుషి.

తరువాత అనాథప్రేత సంస్కారం. కొందరు జీవితంలోనూ అభాగ్యులు. చావులోనూ అభాగ్యులు. సంపన్నగృహస్థులు ఈ అనాధప్రేత సంస్కారంలో తమ బాధ్యతను గుర్తించాలి.

'అనాధప్రేత సంస్కారాత్‌ అశ్వమేధఫలంలభేత్‌'

అనాధప్రేత సంస్కారము అశ్వమేధఫలానికీడైనది. ఈ విషయంగా జీవాత్మ కైంకర్యసంఘం ఏర్పరుపబడినది.

రోగగ్రస్తులకు హాస్పిటలుకువెళ్ళి తులసి, విభూతి, గంగాజలంలాంటి ప్రసాదాలనివ్వడం. వైద్యోనారాయణోహరిః. నిజమైన వైద్యుడు నారాయణుడు. ఈ కైంకర్యం రోగులకు ఆత్మవిశ్వాసం కలిగించి త్వరలో రుజువిముక్తులను చేయగలదు.

Maa Swami    Chapters