Maa Swami    Chapters   

6. సద్గురూ!

(రాబర్డు వాల్సెర్‌)

సద్గురూ!

మీతో గడిపిన ముపై#్పనిమిషాలు మనస్సులో మెదలుతూనేవుంది. భారతదేశానికి మూడుసార్లు వచ్చాను. దేశమంతా తొమ్మిదినెలలు తిరిగాను. నేను చూచిన వారిలోకెల్లా, నా మనస్సు చూరగొనినది మీరొక్కరే. మీలో ఏదో అనిర్వచనీయమయిన మహత్త్వం ఉండటంచేతనే మిమ్ములను మీ అనుచరులందరూ అంత గౌరవంగా చూడగల్గుతున్నారు. మిమ్ములను వదలిపెట్టగానే ఏదో నాకు తెలియని క్రొత్త ప్రేమ నన్ను ఆవేశించింది. మీ అనుగ్రహమూ ప్రస్ఫుటంగా గోచరించింది. మీకు ప్రశ్నలు అడుగవలసిన అక్కర లేకపోయింది. నన్ను చూడకపూర్వమే నాగూర్చి మీకు తెలిసియుండవలె. అందుచేతనే నాకు దర్శనం ఇవ్వడానికి అంగీకరించారు. మీ దర్శనం నా జీవితంలో ఒక గొప్ప ఘట్టం. భారతదేశంలో మీబోటివారు ఇంకా మరికొందరు ఉంటే ఎంత బాగుండేది?

నేను భారతదేశం వదలి యూరోపుకు వెళ్ళిపోతున్నా. విమానంలో ఎక్కడానికి ముందు మీకు వ్రాస్తానని మాట ఇచ్చానుకదూ! అది చెల్లించుకొంటున్నా. భారతదేశంలో నాకు వేరే గురువు- బాహిరంగా- కనబడలేదు. కాని నా అంతర్యామి నా ఆంతరంగిక గురువు మేల్కొన్నాడు. 'ఈశ్వరుడికోసం హిందూదేశంలో వెదకాను. నేనే ఈశ్వరుణ్ణి అని గ్రహించగలిగాను' నా గురువు నాలోనే ఉన్నాడు. అతనికోసం నేను ఎక్కడా వెదుకుతూ వెళ్ళనక్కరలేదు. నేను నా గురువుతోనే ఉన్నా. అందుచేత విఫలమనోరథంతో నేను ఈ దేశంనుంచి వెళ్ళటం లేదు. ఒక దివ్యానుభూతి పొంది, నా ఐశ్వర్యాన్ని నాతోబాటు తరలించుకొని, మరీ వెడుతున్నా.

'నీవు దేనిని ఆచరిస్తున్నావో, అనుసరిస్తున్నావో దానినే ఆచరించు, అనుసరించు' అన్న మీబోధ ఎంత ఉత్తేజకరంగావుంది? ఔను. భగవంతుని సారథ్యంతో నేను తప్పు త్రోవలకు వెళ్ళనన్న ధైర్యం కలుగుతూవుంది. భగవానుడు మిమ్ములను సదా రక్షించుగాక. నేను ఎక్కడ ఉన్నా, మీ మనోనేత్రం నాపై ఉంచండి. నా లక్ష్యాన్ని చేరుకొనుటకు మీరు అనుగ్రహించండి. నా భవిష్యత్తు ఎలావుంటుందో నాకు తెలియదు. నా జీవితంలో నేను ఏ కార్యాలు చేయాలో కూడ నిర్ణయించుకోలేదు. కానీ భగవంతుడు అడుగడుగుకూ తోడునీడయై దారుచూపుతాడన్న ధైర్యం నాకు కలిగింది. మీరు ఏదైనా అనుగ్రహించి సలహా ఇచ్చారంటే అది తప్పక పాటిస్తాను. అది మంచి సలహాగా ఉంటుందన్న నమ్మకం నాలో రూఢిగావుంది. నేను ఏంచేయాలో నాకు తెలపండి.

నా వందనాలు అందుకోండి-

రాబర్టు వాస్లెరు.

(రాబర్టు వాస్లెరు, యోగాస్కూల్‌- జ్యూరిచ్‌, స్విట్జర్లాండు.)

Maa Swami    Chapters