Maa Swami    Chapters   

5. స్వామితో సంభాషణ

(ఆర్థర్‌ ఐసెన్‌బర్గ్‌)

కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మద్రాసు సమీపం నుంబల్‌ గ్రామంలో ఉన్నపుడు నేను వారిని కలుసుకొన్నా. శ్రీవారికి అరవైఐదేళ్ళు ఉంటాయి.ఉపవాసంతో శుష్కించిన శరీరం, పూర్ణవపనమయిన శిరోభాగం, చిబుకముపై అపుడపుడే వస్తున్న తెల్లని వెంట్రుకలు, తెల్లని కనుబొమలు, కాషాయంతో కప్పుకొన్న దేహం.

ఐతే, ఇవి ప్రధానమా అంటే కావు. ప్రధానమైనది నైర్మల్యం తొణికిసలాడే వర్చస్సుతో కూడిన ఆయన ముఖం- ముఖాన్నిమించి దీప్తివంతములైన ఆయన కన్నులు, ఆ కనులలో ప్రతిబింబించే కరుణా, జాలీ- ఆ రెంటినీ పెనవేసుకొన్న ధీవికాసం, పెదవులపై లలితలలితమైన మందహాసం.

ఆయన యొదుట కూచోగానే అనవతర ప్రశాంత వీచికలలో ఓలలాడే పరమ ఋషి ముందు కూర్చున్నామన్న భావన నాలో మెదిలింది.మూడున్నర గంటలసేపు ఆయనతో చేసిన సంభాషణతో ఈ భావం భావంగా నిలిచిపోక సిద్ధాంతమై పోయింది.

సమావేశంలో నాతోబాటు ఇరువురు ఉన్నారు. ఒకరు స్వామివారివద్ద దీక్ష పుచ్చుకొని స్వామికి పరిచర్యచేస్తూ ఆయనతోబాటు ఉన్న అనంతానందస్వాములు పూర్వాశ్రమమంలో హైకోర్టులో ఉద్యోగం చేసేవారట. సంభాషణ పూర్తి అయ్యేంతవరకూ ఆయన నిలుచునే ఉన్నారు. రెండవ ఆయన నా మిత్రుడు డాక్టరు రాఘవన్‌. ఈ సమావేశం ఏర్పాటుచేసి స్వామి చెప్పినది అనువదించి చెప్పడానికి పూనుకొన్నవారు.

స్వాములవారు, తాను ఇంగ్లీషు చదివి అర్ధం చేసుకోగలిగినా ఆ భాషలో మాట్లాడటానికి, సాహసించమన్నారు. ఇంగ్లీషును అర్ధం చేసుకోవడానికి వినికిడి. అరవములో సంభాషించిననూ, మధ్య మధ్యలో ఆయన వాడిన ఇంగ్లీషు పదాల ఉచ్చారణమాత్రం నిర్దుష్టంగానే ఉండినది.

స్వాములవారిలో ఒక విశిష్టమైన గుణం గమనించాను. ఒకరు మాట్లాడుతుంటే వారు మధ్యలో అడ్డురారు. ఎవరైనా ప్రశ్నించారంటే- ఆ ప్రశ్నకు కనీసం ఒక నిముషమన్నా ఆగి, ఆలోచనా పూర్వకంగా కొంత విరామంతో కూడిన బదులు ఇస్తారు. వారిచ్చిన ప్రత్యత్తరం గమనిస్తే అది అడిగిన ప్రశ్నను ధారణచేసి ఇచ్చిన సమాధానంగా ఉంటుంది. అంతేకాదు జవాబు క్లుప్తంగానూ, విషయానికి సంబంధించిందిగానూ ఉంటుంది.

మా సంభాషణ చాలవరకు వ్యక్తిగతంగా ఉన్నా, విషయేతరాలను కూడ చర్చించినాము.

ప్ర:- మీ ఉద్దేశంలో ఒక విదేశీయ ప్రభుత్వం లేదా ఒక విదేశీయ సంస్థ భారతదేశాభ్యుదయం కాంక్షించి చేయగల సాహాయ్యం ఏదై ఉంటుంది?

తమ అలవాటు ప్రకారం స్వాములవారు ఒక నిముషం ఆగి ఇలా బదులు చెప్పారు.

ఉత్త:- మీ ప్రశ్నకు సమాధానం సహాయం పొందేపక్షంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్న భారత ప్రభుత్వం వారికివస్తే వారు బహుశా విద్యారంగంలోనో వ్యవసాయ రంగంలోనో సహాయం అర్ధించవచ్చు. మీరు నన్ను అడుగుతున్నారు కనుక నాజవాబు ఇస్తున్నాను.

''నా ఉద్దేశంలో ఒక విదేశీయ ప్రభుత్వంగానీ, సంస్థగానీ ఈ దేశంయొక్క సంస్కృతి విషయంలో సహాయం చేయవచ్చు. నృత్యం, వాజ్మయం, కళలు, దర్శనశాస్త్రాలూ వీనినిగూర్చి మా దేశంచేసే పరిశోధనల్లో, పరిశ్రమలలో తోడ్పడి దానిలో కృతకృత్యతకు సాయం చేయవచ్చు''.

భారత మహిళల విషయంలో స్వాములవారి అభిప్రాయాలు ఈ కాలానికి అనుగుణంగా లేవు. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించ లేకపోయినా, ఆ అభిప్రాయాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం గౌరవిస్తాను.

స్వాములవారి ఉద్దేశంలో స్త్రీయొక్క ముఖ్య ప్రయోజనం గృహసీమలో స్త్రీ గృహిణియై తన భర్త, పిల్లల బాగోగులు చూచుకొని జీవితం గడుపుతూ, ఏ కొలది వ్యవధి మిగిలివుంటే ఆ సమయం కుటీర పరిశ్రమలలో వినియోగించవచ్చునని స్వామివారు అభిప్రాయపడుతారు. బాలబాలికలు కలిసి చదవటానకీ పన్నెండేళ్ళపైన బాలికలు బడులలో చదువడానికీ స్వాములవారు సుముఖులుకారు. ఐతే ఈ ఉద్దేశాలు నవభారత లక్ష్యానికి అనుగుణంగా లేవు. ఈ విషయం ఆయనకూ తెలుసు. కాని స్త్రీకి కలిగే దురవస్థలన్నిటిలోనూ అవివాహితగా ఉండటంకంటె మించిన దురవస్థ ఏదీలేదని వారి నమ్మకం. పెళ్ళికాని పిల్లలకు ఏళ్ళు ఎక్కువయ్యేకొద్దీ వివాహమయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుచేత కన్యక రజస్వలకాగానే దేశంలోని చట్టం ఎంత తక్కువ వయస్సులో వివాహం ఆమోదించిందో, అంత తక్కువ వయస్సులో పెళ్ళిచేయటం యుక్తం అని వారి మతం. గృహిణులై తమ తమ సంసారాలను చక్కబెట్టుకొంటూ దాంపత్యానురాగంలో సుఖించే మహిళలకున్న కృతకృత్యతా భావం పురుషులను అనుకరిస్తూ పురుషులతో సమానంగా ఉద్యోగాలుచేసే స్త్రీలలో మృగ్యమని వారి భావం. శ్రీవారి అభిప్రాయాలు పౌరాణికమైనా భారత మహిళల అభ్యుదయంలో వారి ఆసక్తిని ఎవరూ కాదనలేరు.

భారతదేశంలో జాతీయైక్యత గురించి మీ అభిప్రాయమేమన్నాను- దేశంలో రాజకీయపక్షాలు పరస్పరం సుహృద్బావంతో మెలిగితే జాతీయైక్యతకు అనుకూలంగా ఉంటుందని జాగరూకతతో కూడిన ఆశాభావం ఆయన ప్రకటించారు.

ఈ సమావేశాన్ని ఎదురుచూచి ఒక ప్రశ్న వేయాలని సిద్ధంచేసుకొని వచ్చాను. వారిచ్చిన జవాబుతో స్వామివారు చమత్కరించటంలో కూడ తీసిపోరని తేలింది.

ప్రశ్న:- సరియైన ప్రశ్న వేయటమే జ్ఞానోదయానికి ప్రాతిపదిక అని అంటారుకదా! నేను జ్ఞానినని అనుకొందాం. అప్పుడు నేను మిమ్ములను అడుగవలసిన ప్రశ్న ఏది?

నేను ప్రశ్న అడుగుతున్నపుడూ, రాఘవన్‌ అనువదిస్తున్నపుడూ స్వాములవారు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నారు.

ప్రశ్నను మరొకసారి అడుగవలసినదని రాఘవన్‌ కోరారు. తర్వాత తమ అలవాటు ప్రకారం ఒక నిముషం ఆగి ఇలా అన్నారు.

మీరు జ్ఞానులే ఐతే ఏప్రశ్నా అడుగరు.

ఈ జవాబువిని నవ్వటం నావంతైంది.

నిజమే కానీ జ్ఞానంలో అర్భకుడననీ, విచారణలో మొదటి మెట్టులో ఉన్నాననీ అనుకొందాం. అపుడు నేను మిమ్మల్ని ఏమి అడగాలి?

ఆలాంటపుడు నా కర్తవ్యం ఏమిటి? అని అడుగవచ్చు.

ఆ ప్రశ్ననే అడిగానని అనుకోండి. మీ జవాబు?

దానికి వారి జవాబు సందిగ్ధంగా ఉంది.

మీరు ఏ త్రోవలో వెడుతున్నారో దానిలోనే వెళ్ళండి.

నా స్వభావమూ అంతే. మంచికైనా చెడ్డకైనా నేను జ్ఞానపక్షపాతిని. శ్రద్ధకూ (Faith) నాకూ చాలాదూరం.

ఔను. అన్ని మార్గాలలోనూ జ్ఞానంను మించినది ఏదీ లేదు. నిజానికి ఉన్నమార్గమే అది. భక్తి కర్మలు జ్ఞానానికి అనుషంగికాలే. జ్ఞానమార్గంలో భక్తికర్మలు మజిలీలవంటివి. అన్నీ జ్ఞానంలో పరిసమాప్తి కావలసిందే.

ఒకప్రశ్న:- జ్ఞానం ఒకవిధమైన మానసిక అహంకారం- గర్వం- కాదా?

ఔను. 'కానీ మీకు ఈ ప్రశ్న ఎలా ఉదయించింది. మీ బుద్ధి ద్రష్ట అనుమంత విమర్శకుడూ కాకపోతే ఈ ప్రశ్న ఉదయించదుకదా!'

'ఐతే జ్ఞానమార్గంలో ఒకడు తాను పురోగమిస్తున్నాడా? ఎక్కడివాడు అక్కడే ఉన్నడా? లేక వెనుకకు జారిపోతున్నాడా అనే విషయం ఎట్లా తెలుసుకోవటం?'

ఒక్కొక్క సంవత్సరమూ తాము చేసే పనులలో కామకారకమైనవీ, క్రోధకారకమైనవీ- ఎక్కువౌతున్నవా, తగ్గుతున్నవా అని గమనించాలి. తగ్గుతూవస్తే పురోగమిస్తున్నట్లు అర్ధం. ఒకే రకంగా ఉంటే నిలకడ అని అర్ధం. ఎక్కువైతూ ఉంటూ నిర్దిష్ట పథంనుంచీ వెనుకకు జారుతున్నాడని అర్ధం.

'ఈ మార్గంలో నిజమైన తృప్తీ - నిజమైన - ఆనందం సౌఖ్యం ఏదైనా ఉందా?'

'చేసే అన్వేషణయే ఆనందమూ సుఖమూ, ఒక సుఖం పొందినాము అని అంటే అది సుఖం కాదు. సుఖస్వరూపంగా ఉండటమే సుఖం'.

మా సంభాషణలో విషయాంతరాలువచ్చినా, స్వాములవారు భౌతికశాస్త్ర విషయాలలో చాల ఆసక్తి చూపించారు. భౌతికశాస్త్ర నిర్ణయాలు అద్వైతానికి భిన్నంకాదని శ్రీవారి అభిప్రాయం. ఈ విషయంగా వారు వ్రాయుటమూ, చెప్పటమూ జరిగింది.

స్వాములవారు 'మళ్ళా కలుసుకొందాములే' అని అన్నారు. నా అభిలాషా అదే. కాని ఆ ప్రశాంత సంధ్యలో ప్రశాంతమూర్తియైన ఆ సంయమీంద్రునితో గడిపినకాలం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం.

Maa Swami    Chapters