Maa Swami    Chapters   

భారతావనిలో వేదాధ్యయనం

3. కంచికామకోటిపీఠం అనన్యకృషి

ఎస్‌. అన్నాదురై అయ్యంగార్‌.

ప్రపంచములోని సర్వధర్మములకు మూలం వేదం. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గల హిందువులు, వారి ఆహార, వేషభాషలు విభిన్నమైనప్పటికి ఐకమత్యంతో సౌభ్రాతృత్వంతో ఇరుగు పొరుగువారివలె ఇంతకాలం వెలుగుతూ వచ్చారు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకగల భారతీయులను ఐక్యంచేసే ఒక అనుసంధాన సాధనం ఉండటమే దానికి కారణం. అవి మహాపండితులచే శ్లాఘించబడిన అతి పవిత్ర భారతీయ విజ్ఞాన నిక్షేప్తాలైన వేదములు.

ప్రాచీనకాలంలో లోకానికి ఐహిక, ఆముష్మిక సంపదల నొనగూర్చే దివ్యమంత్రాక్షర సంయుక్తమైన వేదాలకు రెండు ప్రయోజనాలు ఉన్నట్లు సుస్పష్ట మవుతున్నది.

1. పారాయణ--మంత్రార్ధాలను గ్రహించినా, గ్రహించకపోయినా నిత్యపారాయణం చేసే వ్యక్తికి, ప్రజా బాహుళ్యానికి శ్రేయోదాయకము. ( ఆ అర్ధాలను గ్రహిస్తే వాటికి ఎంతో ప్రభావం వుంటుంది.)

2. యజ్ఞ క్రతువులలో వేదమంత్ర వినియోగం--ఎవరైతే పరిపూర్ణంగా ఆత్మార్పణ గావించుకొని కఠినమైన వైదిక నియమాలతో ఈ క్రతువులను పరమేశ్వర ప్రీత్యర్ధం చేయడం జరుగుతుందో, వారికి సమస్త శాంతి, సౌభాగ్యాలు ఒనకూరుతాయి.

మానపూర్వ మహర్షుల వంశస్థులు తమ విధ్యక్తధర్మంగా భావించి వేదమంత్రాలకు ఈ విధమైన ప్రభావయుత ప్రయోజనాలను ఆపాదించే బాధ్యతను స్వీకరించారు. 5000 సంవత్సరాలకు పూర్వం వసించిన భగవానుడగు వేదవ్యాసుడు వేదసంరక్షణ బాధ్యత వారికి అప్పగించాడు.

సాంప్రదాయంగా యోచిస్తే, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతు అను నలుగురు ఋషులు ప్రప్రధమ వేద రక్షకులు. ఇవే జనసామాన్యానికి తెలిసిన ఋక్‌, యజుర్‌, సామ అధర్వణ వేదాలు. ఈ ఋషులు ఈ శాఖలగూర్చి తమ శిష్యులకు బోధించారు.

అప్పుడు వేదాలలో 1,131 శాఖలు గలవని, 21 శాఖలు ఋగ్వేదంలోనూ, 101 శాఖలు యజుర్వేదంలోనూ, 1000 శాఖలు సామవేదంలోనూ, 9 శాఖలు అధర్వణ వేదంలోను గలవని విష్ణుపురాణం వెల్లడి చేస్తున్నది. దీనినిబట్టి ఆనాడు ఎంతమంది విద్యార్ధులు శిక్షణ పొందుతున్నదీ విశదమవుతుంది. 19వ శతాబ్దంలో తంజావూరు జిల్లాలోని తిరువాయూరులోని ముత్తుగణపతిగళ్‌ అను పండితునివద్ద--- 200-300 విద్యార్ధులు ఉండేవారు. రానురాను ఈ సంఖ్య తగ్గజొచ్చింది.

గత 100 ఏళ్ళలో వైదిక విద్యకాని, విద్యవలనే బ్రతుకుతెరువు లభ్యమవుతుందనే భావన ప్రజలలో వ్యాపించడంతో వైదిక సంప్రదాయం క్రమక్రమంగా అంతరించి పోతున్నది. ఈ కారణంగా నేడు మనకు 10శాఖలు (ఋక్‌ 1, యజుర్‌ 4, సామ 3, అధర్మణ 2) మాత్రమే మిగిలాయి. వేదపారాయణకు సంబంధించిన నిబంధనలుగల గ్రంధాలను 'ప్రాతిశాఖ్యలు' అని అంటారు. వీటివలన వైదిక మంత్రశక్తి సంరక్షిత మవుతుంది. నేడు వీటిలో ఒక ప్రాతిశాశ్యలో విజ్ఞానాన్ని కలిగియున్న వ్యక్తులుకూడా చాలా అరుదుగా వున్నారు.

మహత్తరమైన ఈ వైదిక సంప్రదాయం అంతరించకుండా 1942 నుండి, కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్యలవారు ఎంతో కృషి చేస్తున్నారు. దీనికై వారు అనేక సంస్థలను రూపొందిస్తున్నారు. ఇవి ఈ సమస్యను వివిధ స్థాయిలలో పరిష్కరిస్తాయి. వారుచేసిన కృషికి నిదర్శనాలు:-

1. మద్రాసులోని వేదధర్మశాస్త్ర పరిపాలనాసభ ఆధ్వర్యాన భారతదేశంలో అనేకస్థానాలలోను, ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలోని దక్షిణప్రాంతాలలో సమ్మేళనాలు ఏర్పాటు అయినవి. పశ్చిమ రాజ్యాల నాగరికతచే ప్రభావితులైన భారతీయులు నవీన పద్ధతులలో వైదిక జీవనవిధానాన్ని అనుసరించే విధంగా ఇది రూపొందించడం జరిగింది.

గృహస్థులైన వారికి కొన్ని ముఖ్యమైన హైందవ వ్యవస్థలందు, నియమాలయందు ఉత్సాహము కలిగించి, ఆర్షమతం పాటించే వారియెడల, వైదిక కర్మల నాచరించే వారియెడల ఆ గృహస్థులకు భక్తిప్రవత్తులు కలుగజేయటం వీటి ముఖ్యోద్దేశం.

2. 1955లో భారతదేశంలోని లక్షణవిద్వాన్‌లకు ధన, కనక, బహుమానాదుల నిచ్చి సన్మానించారు.

1945 లో స్థాపితమైన 'కలలై బృందావన పరమగురు వేదవిద్యానిధి,' ఆదాయం సహాయంతో వేదపండితులకు జీవితాంతము బహుమానాలు ఇవ్వటం జరిగింది.

3. 1954లో స్థాపితమైన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి షష్ట్యబ్ద పూర్తి నిధివలన వచ్చే ఆదాయం (రు.30,000) 5 ఏళ్ళవరకు వేదభాష్యం నేర్చుకొనడానికి ఉద్దేశితమైనది. వేదభాష్యాలలో పరీక్షలు జరిగాయి. విద్యార్ధులకు సంవత్సరానికి రు.200 నుండి 300 వరకు సత్కారం ఇవ్వడం జరిగింది. ఉచితంగా గ్రంథాలుకూడా సరఫరా చేయబడ్డాయి. ఇదిగాక నెలకు రు.35లు వారికి లభ్యమవుతాయి. పరీక్షలో ఉత్తీర్ణులయిన ప్రతి విద్యార్ధికి రు.3000 ల నుండి రు.7000ల వరకు ఇస్తూ 'భాష్యరత్న,' 'భాష్యమణి' అనే బిరుదులు కూడా ప్రదానం చేశారు. వేదభాష్యం నేర్చుకొనడానికి 7 సంవత్సరాలు అవసరం. పరీక్షకు హాజరు కావడానికి ఉచితబోధకూడా ఏర్పాటు చేశారు. 1961-66ల మధ్య 27 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులైనారు. మరి వారికి రు.5000ల నుండి రు.7000వు గ్రాంటు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన గ్రాంట్లు మొత్తం రు.1,47,000.

4. పాఠశాలల్లోగాని, వేదరక్షణనిధి పథకం క్రిందగాని 'ఘన' వరకు వేదాధ్యయన శిక్షణ పూర్తిచేసిన విద్యార్ధులకు మరింత ప్రోత్సహాన్నిచ్చి, వారి సంఖ్య తగ్గకుండ అతిముఖ్యమైన చర్య తీసుకోవడం జరిగింది. 'వికృతుల'ను వదలివేసి ఒక శాఖను పూర్తిచేసిన విద్యార్ధికి రు. 1200 లు, 'క్రమం' వరకు పూర్తిచేసినవారికి మరో రు.1200లు ఇవ్వడానికి ఈనిధి ఏర్పటుచేసింది.

ఈ పద్ధతిపై 'క్రమం' పూర్తిచేసిన విద్యార్ధికి శిక్షణ పూర్తిఅయిన తర్వాత బహుమాన రూపేణా రు.2000 లు లభ్యమైనది. గ్రాంట్లు ఇవ్వవలసిందని పాఠశాలలకు విజ్ఞప్తిచేశారు. 'క్రమం' పూర్తిచేసిన విద్యార్ధికి రు.4000లు లభ్యమవుతుంది. 'ఘన' లక్షణాలకు అదనంగా రు.1000లు బహుమానం ఏర్పాటు అయింది. 10 ఏళ్ళు అధ్యయనం తర్వాత ఒక ఘనపాఠి' రు.5000లు పెట్టుబడితో సామాన్య జీవితాన్ని ఆరంభించడానికి వీలువుంటుంది.

గురుకుల పద్ధతిలో అధ్యయనం నేర్చుకొన్న ఏ విద్యార్ధికైనా గ్రాంట్లుకు రెట్టింపు అనగా రు.4000 నుండి రు.10,000 లు వరకు లభ్యమవుతుంది.

సంస్కృతభాష, తర్కం, మీమాంస, వ్యాకరణం, శాస్త్రాలు, నిరుక్తి-వీటిలో జ్ఞానాన్ని సముపార్జించిన విద్యార్ధి షష్ట్యబ్దపూర్తినిధి పథకం క్రింద జరుపబడే వేదభాష్య పరీక్షలకు హాజరు కావచ్చును.

వీరికి ఉపకారవేతన సౌకర్యం వుంటుంది. పూర్తి అయిన తర్వాత రు.3000 నుండి రు.7000ల వరకు గ్రాంట్లు లభ్యమవుతాయి.

ఈ విధంగా వేదములందు కుతూహలంగల విద్యార్ధుల ఆర్ధికస్థితి అభివృద్ధి చేయడం జరిగింది. ఏ విధమైన వ్యయంలేకుండా ఈ వేదాధ్యనం గావించిన విద్యార్ధికి సామాన్య జీవితం గడపడానికి అవసరమైన ధనాన్ని (రు.5000-12000) అతను పొందవచ్చును. 10-17 ఏళ్ళలో అతడు వేదభాష్య పండితుడవుతాడు.

పుత్రునికి తండ్రి గురువై గురుకుల పద్ధతిలో అధ్యయనం బోధించడం ప్రాచీన ఆర్షమత సంప్రదాయం.దీనిని ప్రత్యేకపద్ధతిలో స్వాములవారు మలచారు. నియమ అధ్యయన విద్యార్ధి రక్షణపథకాన్ని ఆయన ఏర్పాటుచేశారు. దీనిక్రింద, 10 ఏళ్ళపాటు తండ్రివద్ద గురుకుల పద్ధతిలో అధ్యయనం పూర్తిచేసిన విద్యార్ధికి (ఇది గాకుండా ఈ పథకం క్రింద జరిగే పరీక్షకు హాజరవడానికి వేదాంగాల లోని జ్ఞానం అతనికి వుండాలి) 10 ఏళ్ళకు రు.10,000లు మాత్రమే గాకుండా, అతని జీవితానికి సరిపడా ఇవ్వబడిన పెట్టుబడి రు.10,000లపై వచ్చే ఆదాయం కూడా లభ్యమవుతుంది. ఈ సౌకర్యం అతను మరణించిన తర్వాత అతని సతికి, వంశానికి వుంటుంది లేదా తగిన అర్హతలుగల అతని ప్రతినిధికి ఈ సౌకర్యం వుంటుంది. అటువంటి 12 కుటుంబాలకు ఈ సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఇంకా మరికొన్ని కుటుంబాలకు ఈ సౌకర్యాలు కల్పించడానికి కృషి జరుగుతున్నది.

ఈ పథకం 1959లో ప్రారంభ##మైనది. అప్పుడు 113 మంది విద్యార్ధులు, 18మంది గురువులుగల 17 పాఠశాలలకు రు.8590-94లు, 1960-61లలో 210 మంది విద్యార్ధులు, 41 మంది గురువులు గల 31 పాఠశాలలకు రు.23,578-98లు సంభావనలు ఇవ్వడం జరిగింది. 1961-62లలో 41 పాఠశాలలకు రు.25,807-72లు ఇవ్వడం జరిగింది. 1965 వరకు రు.99.603-99లు గ్రాంట్లు ఇవ్వబడ్డాయి.

రానురాను విద్యార్ధులు చాలమంది చేరుతున్నారు. అఖిలభారత స్థాయిలో కూడా స్వాములవారు వేదాల పునరుద్ధరణకై చర్యలు తీసుకున్నారు.

1962 అక్టోబర్‌లో ప్రప్రధమ అఖిలభారత వైదిక విద్యార్ధుల సమావేశాన్ని న్యూఢిల్లీలో ఆయన ఏర్పాటు చేశారు. భారతదేశంలోని పలుచోట్లనుండి విద్యార్ధులను, గురువులను ఒకచోట కలుసుకునేటట్టు చేయడానికి తగుచర్యలు తీసుకొన్నారు.

వింధ్యపర్వతాలకు దక్షిణంగాగల ప్రాంతాలలోనే గురుముఖంగా లభ్యమయ్యే అధ్యయనం ఇంకా కొనసాగుతున్నట్లు వీటి దర్యాప్తుకై ఏర్పడిన సంఘాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్‌ లో గల మూడు కేంద్రాలలో 20 మంది విద్యార్ధులు మాత్రమే వేదాలను అభ్యసిస్తున్నారని తేలింది. మద్రాసులో 50, ఆంధ్రలో 11, మహారాష్ట్రలో 10, మైసూరులో 4, కేరళలో 1, ఉత్కళలో 1, ఉత్తరప్రదేశ్‌లో 1, పాఠశాలలు ఉన్నాయి. మొత్తం దేశంలో 800 మంది విద్యార్ధులు ఉన్నారు.

అధర్వణ వేదంలోని శౌనకశాఖలో ప్రస్తుతం ఒక విద్యార్ధి ఉన్నాడు. యజుర్వేదపండితులు ముగ్గురు, అధర్వణవేద(పిప్పాలద) పండితులు 9 మంది, జైమిని సామవేదపండితులు కొద్దిగానువున్నారు.

దేశంలో వివిధ వేదశాఖలు ఎక్కడెక్కడ వున్నాయో పరిశీలించడం జరిగింది.

బెంగాల్‌లో గౌతమసామం, ఉత్కళలో పిప్పలాద అధర్వణం, ఉత్తరప్రదేశ్‌లో మధ్యందిన, కణ్ణ శాఖలు, ఆంధ్ర, మైసూరులలో తైత్తిరీయ యజుర్వేద శాఖలు, మహారాష్ట్రలో ఋగ్వేదం, మలబారులో జైమిని సామం, నర్మద కిరుప్రక్కలా అధర్వణవేదం ఇంకా ప్రభావం కల్గి ఉన్నాయని తేలింది.

గుజరాత్‌, నాసిక్‌, శ్రీరంగం, కలకత్తాలలో పాఠశాలలు ప్రారంభించి శౌనక అధర్వణ, మైత్రాయణ యజుర్వేదం, జైమినిసామం, గౌతమసామాలను సంరక్షించడానికి చర్యలు తీసుకున్నారు.

కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సహకారంతో శ్రీస్వాములవారు విద్యార్ధులకు, గురువులకు ఈ సంస్థలలో ధనసహాయంకూడా ఏర్పాటు చేశారు. ఇదంతా మొదటి వైదిక విద్యార్ధి సమావేశం జరిగిన పిమ్మట జరిగినది.

ఋగ్వేదంలోని బాశ్కల శాఖవలె సామశాఖగూడా వున్నట్లు పరిశీలన వలన తేలింది.

వేదపండితులను సన్మానించే ఉద్దేశంతో వేదాధ్యయన పరులకు శుభాశీస్సులు భారతప్రజలకు అందజేయాలనే దృష్టితోను ద్వితీయవైదిక సమావేశాన్ని శ్రీస్వాములవారు 1965 ఫిబ్రవరి 24 నుండి 28 వరకు మద్రాసులోని శివవిష్ణు ఆలయాలలో ఏర్పటు చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలనుండి 550 మంది వేదపండితులు దీనికి హాజరైనారు.

1966లో స్వాములవారు తిరుపతి దేవస్థానంవారిచే తృతీయ అఖిలభారత వైదిక సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. దీనిలో అనేకమంది పండితులు, భాష్యకారులు ఉత్సాహంతో పాల్గొన్నారు.

ఈ సమ్మేళనాలు వైదికసభలలో భాగంగా పిప్పాలదశాఖకు పాఠశాలలు స్థాపించడానికి చర్యలు తీసుకున్నారు. వేదపండితులకు సంభావనలు పంపారు. మద్రాసులో అధ్యయన తరగతులు ప్రారంభించారు.

బెంగాల్‌లోని గౌతమ సామవేదశాఖను కంఠోపాఠం చేసినవారు లేరు. అందువలన శ్రీస్వాముల వారు 1964లో కలకత్తాలో బెంగాలీ బాలురకై వేదపాఠశాలలు నెలకొల్పారు. ఇప్పుడు 10మంది విద్యార్ధులు అధ్యయనం నేర్చుకుంటున్నారు. 1965లో కామకాటిపీఠం కలకత్తాలో ఒక వేదభవనం నెలకొల్పింది. ఇక్కడ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం బోధిస్తారు.

జమీందారీల రద్దుతో వేదపండితులను ధన, కనక, వస్తువులతో సన్మానించే ఆచారంకూడా అంతరించిపోయింది.

శ్రీ స్వాములవారు తిరిగి ఈ ఆచారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు. కాళహస్తిలో ఆయన 1986లో ఇక విద్వత్‌ సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో 57 మంది వేదపాఠకులకు శాస్త్రపారంగతులకు బహుమానాలిచ్చి సత్కరించారు.

ఈ మహత్కార్యాన్ని శాశ్వతంగా కొనసాగించడానికి తిరుపతి దేవస్థానంవారు సాలీనా లక్ష రూపాయల వ్యయంతో కూడిన ఒక పథకాన్ని రూపొందించడానికి నిశ్చయించారు.

ఆ పథకం క్రింద సంభావనలు తదితర బహూకృతుల నివ్వడానికి ప్రతిఏడాది సదస్సులు ఏర్పాటు అవుతాయి.

1. ఋక్‌, యజుర్‌, సామవేదాలలో క్రమాంతం, రహస్యాంతములకు, ఇతర శాఖలలోని సంహితులకు (గృహ్య సూత్రాలతో సహా) రు. 300లు శాలువలు.

2. ఋక్‌, యజుర్‌, సామవేదాలలో గణాంతం, వదాంతములకు, ఇతర శాఖలలో (ప్రాతిశాఖ్యలతో పాటు) క్రమాంతమునకు రు. 500లు, 2 శాలువులు.

3. పై వాటిలో ఉత్తీర్ణులైన వ్యక్తులకు జీవితాంతం సాలీనా సంభావనలు ఇవ్వబడతాయి.

మఠాలు, ఇతర సంస్థలలో తాత్కాలికంగా అధ్యయనాలకు శ్రీస్వాములవారు అవకాశాలు కల్పించారు. మద్రాస్‌, ఆంధ్రప్రదేశ్‌, మైసూర్‌లలో గల వేదవిద్యార్ధులకు పండితులకు ఉపకారవేతనాలు, బహుమతులు కూడా ఏర్పాటు చేశారు.

వేదాధ్యయనం, వేదపఠనం-వీటిని సంరక్షిస్తూ ప్రజలలో వాటిపై ప్రోత్సాహం కలిగిస్తూ యావద్భారతావనిని నూతనోత్తేజంతో పునరుజ్జీవింపజేసి, విదేశ నాగరికతా ప్రభావంచేత మనం కోల్పోయిన సనాతన హైందవసంస్కృతి ఆచంద్రార్కం శోభాయమానంగా విద్యవిజ్ఞాన దీప్తులను ప్రసరింపజేస్తూ చిరంతనమైన ఈ పరమపవిత్ర ఆర్యభూమిపై పునర్వికాసం చెందడానికి తమ ఆధ్యాత్మిక జీవన సంపత్తిని అనుక్షణం ధారపోస్తూ, వేదములు అపౌరుషేయములే కాదు, అవి అన్ని యుగాలకు చెందినవి. ఆ సందేశాలు, అతి ప్రాచీనాలే కాదు, అతినవ్యమూ, నవనవోన్మేషములని నిరూపించి జీవితాన్ని చరితార్ధం చేసుకొన్న కంచి కామకోటి పీఠాధిపతులకు కృతజ్ఞతా పూర్వక నమోవాక్కులను అందజేసి, ఆమహోజ్వల ఔన్నత్యం ముందు నమ్రశిరస్కులు కానివారు ఎవరూ కానరారు.

Maa Swami    Chapters