Maa Swami    Chapters   

3. వేదము మన పెన్నిధి

శ్రీ స్వాములవారు వేదమాతృస్తవమును విని యందలి యంశముల భక్తజనుల కందర కనగా హనమగురీతిని వివరించి చెప్పుచు వేదసభను ప్రారంభించిరి.

శ్రీ స్వామివారు సంస్కృతమున సభను ప్రారంభించుచు నిట్లనిరి: 'వాంచం ధేను మపాసీత' వేదవాక్కును ఉపాసనచేసిన కొలది యది వారిపాలిట కామధేనువగును. అట్టి కామధేనువు నుపాసించి దానిని నిలుపుటకై తద్ధర్మరక్షణకై ప్రత్యేకముగ నొక వర్ణ మేర్పడియున్నది.

''బ్రాహ్మణన నిష్కారణో షడంగో

వేదో ధ్యేయోజ్ఞేయశ్చ-

బ్రాహ్మణుడు ఎట్టిఫలము నపేక్షింపకయే షడంగ సహితమగు వేదము నధ్యయనము చేయవలెను. ఇతర కార్యములు నొనర్చునపుడు ఫలాపేక్ష యుండును, ఫలాపేక్షలేకయే యవశ్యము చేయదగినది వేదాధ్యయనము. వేదముల నధ్యయనము జేయుచు వానిని పాలింపవలసినది బ్రాహ్మణవర్ణము. కాలక్రమమున వేదాధ్యయనము లోపించుటచే వైదికధర్మ వ్యవస్థాపనరూపములయిన వివిధ కులవృత్తులను రూపుమాసి పోవుచున్నవి.

ధర్మము పురుషబుద్ధి కల్పితమయ్యెనేని దానికి నిలుకడ యుడదు. ఆయా సాంఘిక రాజకీయ పరిస్థితులనుబట్టి అది ఎప్పటికప్పుడు మారుచుండును.నేటి ధర్మము రేపు అధర్మము కావచ్చును. అట్టి ధర్మము పురుషార్ధసాధక మెట్లగును? ధర్మము పురుషార్ధసాధకము కావలెననిన అది పురుషబుద్ధి కల్పితము కాగూడదు. శాశ్వతమయినది గావలెను. అట్టి ధర్మమును బోధించునది వేదము. కాన దేశకాల పరిస్థితుల ప్రభావమునకు లోనుగాక, వేదమును, తద్వారా ధర్మమును, తద్విరుద్ధములగు అనాది భారతీయ కులవృత్తులను పునరుద్ధరించుకొనవలెను.

వేదము నిధివంటిది. ఆ నిధి గోపచిహ్నమే. మేము ధరించు ఈ దండము, నిధిని రక్షించుటకు పురుషునిచేతిలో నొక దండముండును. ఉపనయన సంస్కారము పొందగనే బ్రాహ్మణుడు నిధిరక్షకుడగును. బ్రాహ్మణుడు రక్షింపవలసిన నిధి వేదనిధియే. బ్రాహ్మణునకు బైల్వ, పాలాశ, దండములు విహితములు. న్యగ్రోధాదులు క్ష్రతియాదులకు విహితములు. బ్రాహ్మణుడు దండమును స్వీకరించుచు ''బ్రహ్మణో నిధిగోపో భూయసం'' అని చెప్పును. ఆ వేదనిధిని రక్షింపని నాడు బ్రహ్మణుని బ్రహ్మణత్వము తనకుగాని, ఇతరులకుగాని సుఖదాయకము కాకపోగా ఉభయులకును దుఃఖదాయకమే కాగలదు.

ఉచ్చైర్గతి ర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్‌

తస్యప్రమా చ వచనైః కృత కేతరశ్చేత్‌

తేషాం ప్రకాశన దశా చ మహీ సురైశ్చేత్‌

త నంతరేణ నిపతే త్క్వనమత్ప్రణామః

లోకమున యున్నతస్థితిని కోరనివాడుండడు. అట్టి స్థితి అధర్మమువలనగాక ధర్మముచేతనే సిద్ధించునట్లయితే అట్టి ధర్మమును అపౌరుషేయమగు వేదముగాక మరి యేది బోధింపజాలును! అట్టి వేదమును లోకమున బ్రకాశింపజేయునది భూసురులగుచో మరియెవ్వరికి నేను నమస్కరింతును.

ఈ శ్లోకము భోజరాజకృత చంపూరామాయణము లోనిది. భోజుడు క్షత్రియుడు. భోజకాళిదాసాది మహాకవులను ఆయా దేశప్రభావ కాలములకుగాని, ఈర్ష్యాద్వేషాదులకుగాని లోనుగాక, లోకమున ఉన్నతస్థితికి మూలమైనది అనాదిసిద్ధమైన వైదికధర్మమనియే జెప్పిరి. అట్టి ధర్మమును రక్షించుకొనవలెననిన వేదసంరక్షణము గావించుకొనవలెను.

వేద సంరక్షణకై యేర్పడినది బ్రాహ్మణవర్గము. వేదసంరక్షణ జేయని నాడా వర్ణమే యనవసరము. కాన బ్రాహ్మణ వర్గమువారు వేదమును మొదట తమపిల్లలచే నధ్యయనము జేయించి పిదప మిగిలినవారికి జెప్పవలెను.

వేదమునకు శ్రుతి యనిపేరు. ఇది యితరగ్రంధ విలక్షణమయినది. ఇతరగ్రంధములు క్రిమిదుష్టములయినను, ప్రచురించినవారు లేకపోయినను లుప్తములు గావచ్చును. వేదము లట్లుగావు. ఉచ్చారణా నూచ్చారణా పూర్వకముగ గురుశిష్యపరంపరా ప్రాప్తములు. కాన వీనికి శ్రుతులని పేరు. దీనిని యితరగ్రంధములవలె స్వయముగా గాక గురుముఖముననే వల్లించి ధారణ చేయవలెను.

Maa Swami    Chapters