Maa Swami    Chapters   

10. శిష్య స్వీకరణ

శ్రీచరణులు దక్షిణదేశ పర్యటనచేసి 22 జూన్‌ 1953లో కంచి వచ్చి చేరారు. పీఠానికి తమ్ము అనుగమించేందుకొక శిష్యుణ్ణి స్వీకరింపదలచారు. దక్షిణరైల్వేలో ఉద్యోగిగా ఉన్న మహాదేవయ్యర్‌ కుమారుడు సుబ్రహ్మణ్యం మఠంలోనే ఋగ్వేదాధ్యయనం చేస్తున్నారు. వడమశాఖకు చెందినవారు. 1935లో ఆషాఢమాసంలో ధనిష్ఠనక్షత్రంలో వీరిజననం వీరికి సన్యాసదీక్ష, మహావాక్యోపదేశం కంచిలో- 19నుండి 22మార్చి 1954లో జరిగినది. వేలకొలది జనం ఈ విశేషోత్సవాన్ని తిలకించడానికి వచ్చారు. సర్వతీర్ధంలో సన్యాసమిచ్చారు. పూర్వాశ్రమ చిహ్నాలు త్యజించి జయేంద్ర సరస్వతి అన్న పరివ్రాజక నామముతో కాషాయాన్ని స్వీకరించారు. విశ్వేశ్వరాలయంలో మహావాక్యోపదేశం జరిగినది. వారు ప్రస్తుతం పీఠాధిపతులుగా వున్నారు.

శ్రీవారి షష్ఠబ్ధిపూర్తి 18మే 1954లో జరిగినది. ఈ అవకాశంలో శంకరుల బ్రహ్మసూత్ర భాష్యము వివరణలతో కామకోటి కోశస్థానం ప్రచురించినది.

17 మార్చి 1957లో ఆచార్యులు కామకోటి పీఠాన్ని అధిష్ఠించిన స్వర్ణోత్సవం కలవైలో జరిగినది. అపుడు శ్రీచరణులు ఈ క్రింది ఆదేశం ఇచ్చారు.

Maa Swami    Chapters