Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

అయిదవయధ్యాయము - బంధాఖ్యాయిక

భార్గవుఁడు మిగుల హర్షము నొంది దత్తాత్రేయునితో నిట్లనెను. ''భగవానుఁడా ఈకథవలన ఎవఁడు ఎట్టిసంగమును పొందుచున్నాఁడో వాఁడు అట్టిఫలమునే పొందు నని, సత్పురుషులతోడి సంగమమువలన పరమశ్రేయస్సు కలుగు ననియు విశదమైనది. భార్యవలన ఉపదేశము నొందిన హేమచూడుఁడు ఏక్రమమున జీవన్ముక్తుఁ డయ్యెనో దయతో వివరింపుఁడు.''

దత్తాత్రేయుఁడిట్లు చెప్పెను. ''ఆమె మాటలను విన్నతరువాత హేమచూడుఁడు సకలవిషయములను విరసములనుగా చూచుచు మిగుల నిర్వేదము నొందెను. చాలకాలముగా విషయవాసనలకు లోఁబడియున్నవాఁ డగుటచే భోగములను వెంటనే వదలుకొనుటకుఁ గాని వెనుకటివలె అనుభవించుటకుఁ గాని చేతకానివాఁ డయ్యెను. అతఁడు సిగ్గుపడి ఆమెతో ఏమియు చెప్పలేదు. వికలమైనమనస్సుతో ఆతఁ డిట్లు కొన్నిదినములు గడపెను. భృత్యులు భోగములను సమకూర్చుచున్నప్పుడు ప్రియురాలు చెప్పినదానిని స్మరించుచు, తన్ను తాను ఏవగొంచుకొనుచుండియు. పూర్వవాసనాబలమున వానిని అనుభవించుచుండెను. తరువాత ఆభోగములయందలి దోషములనుగూర్చి చింతించుచు మాటిమాటికి దుఃఖము నొందుచుండెను. ఊగుచున్న యుయ్యెలయం దున్నట్లుగా అతని చిత్తము ఆందోళిత మగుచుండెను. శ్రేష్ఠమైన భోజనము వస్త్రము భూషణము వనిత వాహనము మిత్రులు మొదలుగా దేనివలనను అతఁడు సుఖమును పొందఁజాలకుండెను. భోగములను వదలలేక పూర్వమువలె అనుభవింపలేక అతఁడు సర్వమును పోఁగొట్టుకొన్నవానివలె దీనుఁడై యుండెను.

అతనిస్థితిని గమనించి హేమలేఖ ఒకనాఁడు ఏకాంతమునుందు ఇట్లనెను. ''నీవు ఎందువల్లనో వెనుకటివలె ఉల్లాసముతో నుండుట లేదు. దిగులుపడుచున్నట్లు కప్పించుచున్నావు. కారణ మేమి? భోగములవలన రోగములు కలుగు నని చెప్పుదురు. నీకు అట్టిబాధ ఏమియు కలుగలేదు కదా? సాధారణముగా సకల దేహములయందును. రోగములు ఉండునే యుండును. ఆహారము వస్త్రములు వాక్కు దర్శనము స్పర్శనము దేశకాలములు చేయుచున్నపని మొదలుగా దేని యందు వైపరీత్యము కలిగినను శరీరమున దోషములు ప్రకోపించును. కావుననే అవి మనకు తెలియకుండఁగనే రోగములను కలిగించుచున్నవి. అవి పైకి వచ్చినతరువాత వానికి చికిత్స చెప్పఁబడుచున్నది. పుట్టని రోగమునకు ఎవఁడును ఎక్కడను చికిత్సను చెప్పలేదు కదా! కావున నీకు దేనివలన దుఃఖము కలుగుచున్నదో చెప్పుము.''

హేమచూడుఁ డిట్లనెను. ''నీమాటలను విన్నప్పటినుండి వెనుకటివలె దేనివలనను నాకు సుఖము కలుగుటలేదు. ఉరిశిక్ష విధింపఁబడినవానికి ఏభోగమైనను ఎట్లు సుఖమును కలిగింపదో అట్లే నాకును మానాయనగారు సమకూర్చుచున్న భోగము లేవియు సుఖమును కలిగించుట లేదు. వెట్టిచాకిరి చేయుచున్నవానివలె ఇంద్రియ వాసనలకు లోఁబడి వర్తించుచున్నాను. ఏమిచేసినచో నాకు సుఖము కలుగునో చెప్పుము.''

అప్పుడు హేమలేఖ తనలో ఇట్లు అనుకొనెను. ''ఈతనికి నామాటలవలన గాఢమైన నిర్వేదము కలిగినది. ఈతనియందు శ్రేయస్సునకు బీజము ఉన్నది. కావుననే ఇట్లయ్యెను. ఎవరియందు శ్రేయస్సుయొక్క బీజము ఉండదో అట్టివారికి ఎట్టిబోధలవలన కూడ రవ్వంతయు మార్పు కలుగదు. స్వాత్మదేవతయైన త్రిపురాదేవిని ఎప్పుడో ఒకప్పుడు చిరకాలము ఆరాధించియున్న వారికే ఇట్లు భోగములందు వైముఖ్యము కలుగును.'' పిదప ఆమె ప్రియునకు తత్త్వమును బోధింపఁదలఁచి తనపాండిత్యము ప్రకాశింప నీయక ఇట్లు చెప్పెను.

పురాతనమైన నావృత్తాంతమును వినుము. పూర్వము మా అమ్మ నాకొక చెలికత్తె నొసంగెను. అది సహజముగా మంచిదే యైనను శూన్య అను దుష్టురాలితో సఖ్యము కలిగియుండెను. విచిత్రములు వివిధములును అయిన విషయములను ఆశ్చర్యకరముగ సృష్టింపఁగలయాదుష్టురాలు మాతల్లికి కన్నుగప్పి నాచెలికత్తెతో చేరుచుండెను. దానిని నాచెలికత్తె వీడఁజాలకుండెను. నేను కూడ నా చెలికత్తెను వదలలేకుంటిని. నేను దానియొక్క నిర్మలస్వభావమునకు లోనై దానిని వదలి క్షణము కూడ ఎచ్చటను నిలువఁజాలకుంటిని. ఆదుష్టురాలు రహస్యముగా నాచెలికత్తెను తనకుమారునితో కూర్చెను. వాఁడుసురాపానముచే మదించిన మూఢాత్ముఁడు. వాఁడు నాయెదుటనే ఆమెను ఆక్రమించి భోగింపఁజొచ్చెను. అది వానిచేత అనుభవింపఁడుచు నన్ను ఎప్పుడును వీడకుండెను. నేను కూడ దానిని వదలలేకుంటిని. తరువాత ఆమూఢునకు వానివంటివాఁడే అస్థిరుఁడు అను కొడుకు పుట్టెను. వాఁడు వెంటనే యువకుఁడై అతిచంచలుఁ డయ్యెను. తండ్రియొక్క మూఢత్వము నాయనమ్మయొక్క గుణము కలిగి వాఁడు అనేకములైన చిత్రవిషయములను నిర్మింప సమర్థుఁడై యుండెను. వాఁడు స్వయముగా పెక్కువిషయములలో విశారదుఁడయ్యును శూన్య అనుపేరుగల నాయనమ్మచేత మూఢుఁడు అనుపేరు గల తండ్రిచేత నిపుణతనుపొంది అత్యంతశీఘ్రము అకుంఠితమునైన గమనము కలవాఁడయ్యెను.

ఇట్లు జన్మచేత నాసఖి మంచిస్వభావము కలదయ్యును దుష్టురాలిసాంగత్యముచేత చాల మాలిన్యమును పొందెను. ఆమె ప్రియుని యందు పుత్రినియందు అత్తయందును దృఢమైన యనురాగమును పొంది నన్ను క్రమముగా విడిచిపెట్టెను. నేను సహజముగా సరళ##మైన స్వభావము కలదాన నగుటచే ఆమెను వదలిపెట్టఁజాలక ఆమెనే అనుసరించుచు నుంటిని. అంతట ఆమూఢుఁడు ఆమెను ఎల్లప్పుడు అనుభవించుచుండుటయే కాక నన్ను కూడ ఆక్రమించుటకు పూనుకొనెను. కాని నేను స్వభావముచేత పరిశుద్ధురాల నగుటచే వాస్తవముగా వానికి వశపడలేదు. అయినను నేను ఆమూఢునిచే అనుభవింపఁబడుచున్నా నని లోకములో అన్నియెడల పెద్దయపవాదు ప్రబలెను. నా స్నేహితురాలు అస్థిరుఁడను తనకుమారుని నాకు అప్పగించి నిరంతరము మూఢుని కౌఁగిలిలో మెలఁగుచు తత్పరురాలై యుండెను. పిమ్మట అస్థిరుఁడు నాచేత పెంచఁబడి నాయనమ్మయొక్క అనుమతితో ఒక ప్రౌఢురాలిని పొందెను. దానిపేరు చపల. అది వానియిష్టము ననుసరించి ప్రతిక్షణము భిన్నభిన్నములైన మనోహరరూపములను ధరించుచు వానిని వశపఱచుకొనెను. వాఁడుక్షణములో లెక్కలేనన్ని యోజనములు పోయి తిరిగివచ్చును. కాని రవ్వంతయు బడలికనొందఁడు. చపల కూడ వాఁడు ఎక్కఁడికి పోయినను వానివెంటనే అచ్చటికి పోయి వానికి యిష్టమైన రూపముతో వానిని సంతోషపెట్టుచుండెను. ఆమెకు వానివలన అయిదుగురు కుమారులు కలిగిరి. వారు మాతాపితృపరాయణులు. నాచెలికత్తె వారిని తెచ్చి నాదగ్గఱ ఉంచెను. నేను నాసఖియందలి యనురాగముచేత వారిని బలవత్తరులను గావించితిని. వారు తల్లిచేత చక్కఁగా పోషింపఁబడి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా విచిత్రములు విశాలములు శ్రేష్ఠములును అయిన స్థానములను ఏర్పఱచుకొని తండ్రిని తమవశ మొనర్చుకొనిరి. క్షణక్షణము వారు తండ్రిని తమస్థానములకు తీసికొని పోవఁజొచ్చిరి. అస్థిరుఁడు జ్యేష్ఠకుమారుని నిలయమునందు ఒక్కొక్క ప్రదేశమున ఒక్కొక్క విధముగా సుస్వరములు, విస్వరములు సంగీతము మంగళ వాద్యములు వేదమంత్రములు శాస్త్రములు ఆగమములు ఇతిహాసములు భూషణములసవ్వడి తుమ్మెదలపాటలు కోకిలలయాలాపములు మొదలుగా వివిధములైన శబ్దములను విని సంతోషించుచుండెను. అంతట కుమారుఁడు వేఱొకవైపునకు వానిని గైకొని పోయెను. అచ్చట అస్థిరుఁడు భయంకరములైన సింహాదిగర్జనలు మేఘములయుఱుములు పిడుగుల ధ్వనులు వినుచు చకితుఁ డగుచుండఁగా ఏడుపులు మూల్గులు కేకలు పెడబొబ్బలు మొదలగునవియు వినఁబడఁజొచ్చెను. అంతటితో అఁతడు వికలచిత్తుఁడై రెండవకుమారునివెంట వానిభవనమునకు పోయి దానియందు మెత్తగానున్న యాసనములను శయనములను, కఠినత వేడిమి చల్లదనము మొదలైన స్పర్శగుణములను కలిగిన పదార్థములను ప్రియములైనవానిని అప్రియములైనవానిని గూడ చూచి అటనుండి బయల్వెడలెను. మూఁడవకుమారుని యింటియం దతఁడు కంటికింపుగా అనేకవర్ణములలో మనోహరముగా నున్న పదార్థములను భయంకరములైనవానిని బీభత్సముగా నున్నవానిని చూచుచుండఁగా నాల్గవకుమారుఁడు తండ్రిని తన భవనమునకుఁ గొని పోయెను. అచ్చట అస్థిరుఁడు రసవంతములైన పుష్పములను ఫలములను మధురములైన భక్ష్యములను పానీయములను కటువుగా చేదుగా పుల్లగా ఉప్పగా ఉండుపదార్థములను కూడ రుచిచూడవలసివచ్చెను. అప్పుడు చివరికొడుకు అతనిని తనయింటికి తీసికొనిపోయెను. అక్కడ అఁతడు ఆహ్లాదమును ఏవగింపును వికారమును మూర్ఛను కలిగించునట్టి వాసనలుగల యనేకపదార్థములను అనుభవింపవలసివచ్చెను. ఇట్లు అతఁడు పుత్రులయొక్క భవనములందు నివసించుచు ఇష్టములైనవి లభించినప్పుడు సంతోషించుచు అప్రియములైనవి తటస్థించినప్పుడు దుఃఖించుచు రాకపోకలు చేయుచుండెను. ఆకుమారులును తండ్రియందున్న ప్రేమచేత ఎచ్చట నైనను ఏపదార్థము నైనను కొంచెముగా కూడ తండ్రి లేనప్పుడు తాకకుండిరి. అస్థిరుఁడు వారియిండ్లలో బహుపదార్థములను అనుభవించి కొన్నింటిని దొంగిలించి రహస్యముగ తెచ్చుకొని పుత్రులు లేకుండ భార్యతో కూడి నిత్యము అనుభవించుచుండెను.

చపలకు మహాశన అనుచెల్లెలు కలదు. ఆమెయును అస్థిరునేపతినిగా వరించెను. అతఁడు ఆమెయందు ఆసక్తుఁడై ఆమెయొక్క ప్రీతికొఱకు పెక్కుభోగములను సంపాదించుచుండెను. వాని నన్నింటిని ఆమె క్షణములో భక్షించి ఇంకను తెమ్మని పలుకుచుండెను. అతఁడును అయిదుగురు పుత్రులును ఎన్ని పదార్థములను సమకూర్చుచున్నను వాని నన్నింటిని క్షణములో భుజించుచు ఆమె ఎల్లప్పుడును ఆకలితోనే అల్లాడుచుండెను. ఆమె అల్పకాలముననే జ్వాలాముఖుఁడు నింద్య వృత్తుఁడు అనుకొడుకులను కనెను. వారిరువురు తల్లికి ప్రియతములుగా నుండిరి. అస్థిరుఁడు మహాశనయందు ఆసక్తుఁడై నంతనే జ్వాలాముఖునియొక్క జ్వాలలచే పీడితుఁడై గాఢమైనమూర్ఛ నొందుచుండెను. ఒక్కొక్కప్పుడు నిందవృత్తునితో కూడి ఎల్లరచే నిందింపఁబడుచు చచ్చినవానితో సమానుఁ డగుచుండెను. ఇట్లు అస్థిరుఁడు దుఃఖమును పొందుచున్నప్పుడు, నాచెలికత్తె స్వభావముచేత మంచిదే యైనను, పుత్రునియందలి అమిత వాత్సల్యముచేత వానితో చేరి తానును దుఃఖించుచు మనుమలైన జ్వాలాముఖుఁడు నింద్యవృత్తుఁడు వచ్చి కౌఁగిలించుకొను చుండఁగా ఒడల మండిపోవుచుండ లోకముచే నిందింపఁబడుచు చచ్చినదానితో సమాన యగుచుండెను. ఆమెతో ఎల్లప్పుడు కలిసియుండునేను కూడ ఇంచు మించుగా అట్లే అయితిని. ఇట్లు నాసఖియొక్క దుఃఖముచేత నేనును దుఃఖించుచుండఁగా చాల ఏండ్లు గడచిపోయెను.

మహాశనను పరిగ్రహించుటవలన అస్ఠిరుఁడు అస్వతంత్రుఁడయ్యెను. అతఁడేదో యొకకర్మ ననుసరించి ఒకచోట పదిద్వారములుగల పురమును పొందెను. దానియం దతఁడు భార్యాపుత్రాదులతో నివసించుచు రాత్రింబవళ్ళు సుఖమును కోరుచు దుఃఖము ననుభవించుచుండెను. భార్య లిద్దఱు ఇటునటు లాగుచుండఁగా జ్వాలాముక నింద్యవృత్తులచేత ఒడలు మండిపోవుచుండఁగా, ప్రతిదినము లోకులచే నిందింపఁబడుచు, వారిని వీడ్కొని అయిదుగురు కుమారులయొక్క భవనములకు పోవుచు తిరిగివచ్చుచు బడలిక నొందుచు ఎచ్చటను సుఖము పొందలేకుండెను.

కుమారుఁడిట్లు దుఃఖపడుచుండుటచేత వానితల్లియగు నాచెలికత్తెయు మిగుల దుఃఖముతో మూర్ఛనొందినదానివలె ఆపురమునందు పడియుండెను. జ్వాలాముఖ నింద్యవృత్తులతో కూడి మహాశన, శూన్యచేత (భర్త యొక్క నాయనమ్మ) మాయమైన మూఢునిచేత పోషింపఁబడుచు. సవతియైన చపలతో కూడి విజృంభించి అస్థిరుని తనవశము గావించుకొని ఆపురమునందుండెను. నాసఖియందలి ప్రీతిచేత నేను కూడ ఆమెతో కూడి అచ్చటనే యుంటిని. ఆమె యొక్క దుఃఖముచేత నేనును దుఃఖితురాలనై చచ్చినదానివలె నైనను వారి నందఱును రక్షింపవలయునని పూనుకొని యుంటిని. నేను అక్కడ ఒక్కక్షణము లేకున్నచో వారు ఎవ్వరును నిలువలేరు. నేను గదా సర్వమును రక్షించుచుంటిని.

నేను శూన్యతో కూడినప్పుడు శూన్యత్వమును, మూఢునితో మూఢత్వమును, అస్థిరునితో అస్థిరత్వమును, చపలతో చపలత్వమును జ్వాలాముఖునితో ప్రజ్వలనమును, నింద్యవృత్తునితో నింద్యమైన వర్తనమును పొందుచుంటిని, సఖియొక్క సంయోగమువలన నేను ఇట్లు ఆయారూపములను పొందుచుంటిని, నేను దానిని వదలినచో అది క్షణములో నశించును. వారితో కూడియున్న నన్ను చూచి మూఢులైన జనులందఱును వ్యభిచారిణి యని పలుకుచుండిరి; కాని నిపుణులైనవారు మాత్రము నన్ను నిర్మలమైన దానినిగానే గ్రహించుచుండిరి.

మాతల్లి మహాపతివ్రత పరిశుద్ధురాలు. నిర్మల మైన యాకృతి కలది. ఆమె ఆకాశముకన్నను విశాలమైనది. పరమాణువుకన్నను సూక్ష్మమైనది. ఆమెసర్వజ్ఞురాలైనను ఏమియు తెలియనిదిగా నుండును; సర్వమును చేయుచున్నను ఏమియు చేయనట్లే యుండును. సకలమునకు ఆమెయే ఆశ్రయ మయ్యును ఏయాధారము లేనిదానివలె నుండును. ఆమె సర్వమునకు ఆధారమై యుండియు ఎవ్వరికిని ఆశ్రయ మిచ్చినట్లు కన్పింపదు. అన్ని రూపములు ఆమెవే అయినను ఆమెకు ఏరూపములేదు. సర్వము ఆమెతో కూడియున్నను ఆమె దేనితోను కూడియుండదు. ఆమె ఎల్లయెడలను ప్రకాశించుచున్నను ఎవ్వనిచేతను ఎచ్చటను తెలిసికొనఁబడుటలేదు. ఆమె మహానందము కల దయ్యును ఆనందము లేనిదానివలె నుండును. ఆమె తల్లిదండ్రులను వదలిపెట్టెను. ఆమెకు నావంటి పుత్రికలు సముద్రములో తరంగములవలె లెక్కలేనంతమంది యున్నారు. వారందఱును నా వలెనే సఖీకుటుంబపరాయణలై యుండిరి. సఖీగణములతో కూడి యుండినను నేను ఒకమహామంత్రముయొక్క సామర్థ్యముచేత స్వరూపమునందు మాతల్లివలెనే యుంటిని.

నాసఖియొక్క పుత్రుఁడు ఆపురమునందు తిరిగి తిరిగి ఎప్పుడు బడలిక నొందునో అప్పుడు అస్థిరుడు తల్లియొక్క యొడియందు చేరి గాఢముగ నిద్రించును. అతఁడు నిద్రించినంతనే వానిపుత్రులు మొదలగు వా రందఱును నిద్రింతురు. ఎవ్వఁడును మేల్కొనియుండఁడు. అప్పుడు అస్థిరునియొక్క ప్రియమిత్రుఁడు ప్రచారుఁడు అను పేరుగలవాఁడు ముందున్న రెండుద్వారములో చరించుచు పురమును రక్షించుచుండును. అస్థిరుని తల్లియైన నాసఖి పుత్రునితో నిద్రించునప్పుడు ఆమెయొక్క అత్త చెలికత్తెయు నైన శూన్య పుత్రునితో కూడ వారి నందఱును ఆవరించి రక్షించుచుండును. ఇట్లు అందఱు నిద్రించిన తరువాత నేను మాతల్లిని చేరి ఆమెకౌఁగిటియందు ఆనందముతో నుందును. మరల వారందఱు లేచినవెంటనే వారివెంట పోవుచుంటిని.

అస్థిరునకు మిత్రుడైన ప్రచారుఁడు మహాబలము గలవాఁడు. వాఁడు ప్రతిదినము అస్థిరుఁడు మొదలగువారిని పోషించుచుండును. వాఁడు ఒక్కఁడే అనేకవిధములుగా రూపొంది పురమును పురవాసులను అందఱును పరస్పరసంబంధము కలవారినిగానొనర్చి రక్షించుచుండును. హారమునందు కూర్పఁబడినమణులు దారము తెగిపోయినచో ఎట్లు రాలిపోవునో అట్లేవాఁడు లేకున్నచో వారందఱును ఎవరికి వారుగా విడిపోయి నాశ మొందుదురు. వాఁడు నాతో కూడి నాచేత సంజీవితుఁడై నన్ను వారందఱతో కూర్చుచు ఆపురమున సూత్రధారుఁడుగ నున్నాఁడు. ఆపురము జీర్ణ మైనచో వాఁడు వారి నందఱను వేఱొక పురమునకుఁ గొనిపోవుచుండును. ఇట్లు ఆప్రచారుని ఆశ్రయించి అస్థిరుఁడు విచిత్రములైన పెక్కుపురములకు అధిపతి యయ్యెను. భార్యాపుత్రులున్నను మహాబలుఁడైన ప్రచారునియొక్క ఆశ్రయముండినను నేను అండగా ఉండినను అస్థిరుఁడు అన్ని విధముల దుఃఖమునే పొందుచుండెను. వాఁడు భార్యలచేత పుత్రులచేత నిరంతరము ఇటునటు లాగఁబడుచు రవ్వంతయు సుఖమును పొందలేక పోఁగా మహాక్లేశములను పొందుచుండెను. ఒక్కొక్కప్పుడు అయిదుగురు పుత్రులు వానిని అయిదువైపులకు లాగుచుందురు. చపలతో కూడినప్పడు మిగుల చంచఁలుడై ఖేదము పొందుచుండును. ఒకప్పుడు మహాశన కొఱకు ఆహారమును సంపాదించుటకు పరువెత్తుచుండును. వేఱొకప్పడు జ్వాలాముఖునితో కూడి విజృంభించి ఆపాదమస్తకము మంట పుట్టుచుండఁగా దానిని శాంతింపఁజేసికొనుటకు ఉపాయము నెఱుంగక పెద్దమూర్ఛను పొందుచుండును. నింద్యవృత్తునితో కూడినప్పుడ ఇతరులచే నిందింపఁబడి బెదరింపఁబడి దుఃఖింంచుచు తన్ను చచ్చిన వానితో సమానముగ తలంచుచుండును. దుష్కులమునందు పుట్టిన యాయస్థిరుఁడు దుష్టులైన భార్యాపుత్రులతో కూడి వారియందలి మోహముచేత ఎల్లప్పుడు వెంట తిరుగుచు ఒకప్పడు గొప్ప నగరములలో మఱియొకప్పుడు నీచప్రదేశములలో నివసించుచుండెను. క్రూర మృగములతో నిండిన యరణ్యములలో, ఎండలు మండిపోవుచుండు ఎడారులలో, నీరు గడ్డకట్టుచుండు శీతల ప్రదేశములలో, దుర్వాసన ప్రబలుచుండు తావులలో, చీఁకటిగుహలలో నివసించుచు అస్థిరుఁడు ఎంతో దుఃఖమును పొందుచుండును. కుమారుని దుఃఖముచేత నా సఖియు దుఃఖించుచుండును. సహజముగా పరిశుద్ధురాలినే యైనను ఆమెను ఆకుటుంబమును అనుసరించుచు నేను కూడ నిష్కారణముగా మూఢురాలివలె నైతిని. ఎడారిలో వేసవియందు ప్రయాణముచేయు వాఁడు దప్పికను ఎట్లు తీర్చుకొనలేఁడో అట్లే దుష్టసాంగత్యము కల వాఁడును ఎచ్చటను కొంచె మైనను సుఖమును పొందఁజాలఁడు.

ఇట్లు చాలకాలము గడచినతరువాత ఒకనాఁడు నాచెలికత్తె అత్యంత దుఃఖముచేత వికలచిత్తయై నన్ను రహస్యముగా కలిసికొనెను. ఆమె నన్నే ఆశ్రయించుకొని ఉపాయమును పొంది మంచి భర్తను గైకొని తనకుమారుని జయించి వానిపుత్రులు మొదలగు వారిని కొందఱను చంపి కొందఱను బంధించి నాతో కూడి మాతల్లి యొక్క పురమునకు వడిగా చేరెను. కల్మషమును తొలఁగించుకొన్న నాసఖి మాతల్లిని మాటిమాటికి కౌఁగిలించుకొనుచు ఆనందసముద్రమున మునిగినదానివలె నయ్యెను. కావున నాథా! నీవు కూడ ఇట్లే చెలికత్తెవలన పుట్టిన దుర్వర్తనుని నిగ్రహించి మీతల్లిని చేరి నిత్యమైనసుఖమును పొందుము. నేను అనుభవించిన వృత్తాంతమును సుఖమును కలిగించునట్టిదానిని నీకు చెప్పితిని.''

ఇది జ్ఞానఖండమున హేమచూడోపాఖ్యానమునందు బంధాఖ్యాయిక అనుపంచమాధ్యాయము.

బాలప్రియ

ఏవిషయము నైనను నేరుగా చెప్పినదానికన్నను చిత్రవాక్యములతో విషయమును స్ఫురింపఁజేయుచు చెప్పినచో ఎక్కువగా మనస్సునకు పట్టును. ఈకారణముచేతనే సాహిత్యమునందు రచయితలు వాచ్యముగ నిరూపించుపద్ధతికన్నను వ్యంగ్యముగ స్ఫురింపఁజేయు పద్ధతినే (Suggestive method) ఎక్కువగా ఆదరించుచున్నారు. వ్యంగ్యపద్దతిలో చెప్పినప్పుడు వినువాఁడు ఆవిషయమునుగూర్చి ఆలోచించుచు దానిస్వరూపము మనస్సునకు గోచరించినప్పుడు చాల సంతోషపడును. అప్రయత్నముగా పొందినదానికన్నను ప్రయత్న పూర్వకముగా సంపాదించినదే మనస్సునందు చిరకాలము హత్తుకొని యుండును. కావున హేమలేఖ తత్త్వమును నేరుగా చెప్పక కథారూపమున చెప్పినది.

ఈకథలో ''నేను'' అనఁగా జీవాత్మ. ఇది జీవాత్మయొక్క కథ. శుద్ధచైతన్యము జీవాత్మకు తల్లి. తల్లి యొసంగిన చెలికత్తె బుద్ధి. బుద్ధి సహజముగా శుద్ధమే. బుద్ధికి స్నేహితురాలు శూన్య. అజ్ఞానమే శూన్య. అజ్ఞానముతో కూడిన బుద్ధి ననుసరించుచు జీవుఁడు బహిర్ముఖుఁడై విషయములందు ప్రవర్తించుచుండును. అందువలన జీవుఁడు బుద్ధిని వదలియుండఁడు. అజ్ఞానము లేక అవిద్యయొక్క కుమారుఁడు మోహము లేక మహామోహుఁడు. అవిద్య బుద్ధికి మోహముతో సాంగత్యమును కలిగించును. మోహమువలన బుద్ధికి పుట్టినవాఁడు అస్థిరుఁడు. మనస్సే అస్థిరుఁడు. మోహము బుద్ధిని మాత్రమే ఆక్రమించినది జీవుని ఆక్రమింప లేదు చిదాత్మస్వరూపుఁడగు జీవుఁడు ఎప్పుడును శుద్ధుఁడే. బుద్ధియొక్క సంబంధమువలన జీవుఁడు కూడ మోహగ్రస్తుఁడైనట్లు కన్పించునే కాని యథార్ధముగా శుద్ధుఁడుగానే యుండును. "జీవుఁడు నిత్యశుద్ధబుద్ధస్వభావుఁడు" అని తెలియనివారు జీవుఁడు కూడ మూఢుఁడయ్యె నని తలంచుచుందురు. బుద్ధిని మోహము ఆక్రమించినప్పుడు జీవుండు మనస్సునకు అధీనమగును. మనస్సుయొక్క బార్య చపల, ఇది ఊహచేత విషయములను కల్పించుకొనఁగలశక్తి. మనస్సుయొక్క ఈకల్పనశక్తియే చపల. వీరికి కలిగిన పుత్రులు శ్రోత్రము. త్వక్కు. చక్షుస్సు, జిహ్వ, ఘ్రాణము అను నైదు ఇంద్రియములు. ఈయైదుగురును శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనువిషయములను తమస్థానములనుగా పెంపొందించుకొనిరి. మనస్సు ఒక్కొక్క యింద్రియము వెంట ఒక్కొక్క విషయమునందు ప్రవేశించి అనుకూలవిషయముల వలన సుఖము, ప్రతికూల విషయములవలన దుఃఖము పొందుచుండును. ఇట్లు మనస్సు ఇంద్రియముల కధీనమై సుఖదుఃఖములను పొందుచు వానియొక్క సంస్కారములను లేక వాసనలను హృదయమునందు చేర్చుచు వానిని స్వప్నములందు మరల అనుభవించు చుండును.

చపలయొక్క చెల్లెలు మహాశన ఇదియే కామము. ఆశన మనఁగా ఆహారము. మహాశన అనఁగా పెద్దఆహారము కావలసినది. కామమునకు ఎంత ఆహారమును సమకూర్చినను అది ఇంకను కోరుచునే యుండును. అందువలన అది మహాశన. ఇది మనస్సునకు రెండవభార్య. మనస్సునకు కామమువలన పుట్టిన కుమారులు క్రోధము, లోభము. క్రోధము జ్వాలాముఖుఁడు. క్రోధము అగ్ని జ్వాలవలె ప్రజ్వలించి మనస్సును తపింపఁజేయును. లోభము నింద్యవృత్తుఁడు. లోభము కలవాఁడు, ధృతరాష్ట్రునివలె, పాపవర్తనము కలవాఁడై లోకముచేత నిందింపఁబడును. క్రోధలోభములచేత మనస్సు మాత్రమే కాక బుద్ధి, జీవుఁడు కూడ దుఃఖముచేత మూర్ఛను పొందినట్లున్నారు. మనస్సు కామమునకు వశ##మై కర్మవశమున శరీరమును పొందును. అది పదిద్వారములుగల పురమువంటిది. రెండు కన్నులు, రెండు చెవులు, రెండు ముక్కులు, మూత్రద్వారము, మలద్వారము, బ్రహ్మరంధ్రము అనునవి పదిద్వారములు. మనస్సు ననుసరించి బుద్ధి, జీవుఁడు ఒకశరీరమునుండి మఱియొకశరీరమునకు చేరుచుండిరి. జీవుఁడు లేకున్నచో బుధ్ధి మనస్సు ఇంద్రియములు మొదలుగా ఏవియును పనిచేయవు. జీవునియొక్క చైతన్యమువలననే అవి పనిచేయుచున్నవి. వానివ్యవహారమును చూచి అది యంతయు జీవునిదే అని తలంచుచు కొందఱు "జీవుఁడు మూఢుఁడు, చంచలుఁడు"అనే మనస్సుయొక్క బుద్ధియొక్క లక్షణములను జీవునింయదు ఆరోపించుచున్నారు. నిజమునకు ప్రతిబింబములతో అద్దమునకు ఎట్లు సంబంధము లేదో అట్లే మనోబుద్ధుల వ్యవహారముతో జీవునకు ఎట్టిసంబధంము లేదు. జీవునితల్లి అనఁగా స్వరూపము శుద్ధచైతన్యము అందువలన జీవుఁడు ఎప్పుడును శుద్ధుఁడే అని తత్త్వజ్ఞులు గ్రహింతురు.

మనస్సు బడలిక నొందినప్పుడు బుద్ధియొక్క యొడియందు విశ్రమించును. అప్పుడు ఇంద్రియములు కూడ నిద్రించును. అప్పుడు మనస్సునకు మిత్రమైన ప్రాణము లేక ప్రచారుఁడు శరీరమును రక్షించుచుండును. అప్పుడు జీవుఁడు శుద్ధచైతన్యముతో ఏకీభవించుచు సుఖించుచుండును. ప్రాణము లేకున్నచో మనస్సు ఇంద్రియములు మొదలుగా ఏవియు నిలువజాలవు. వీనికి జీవునకును ప్రాణమువలననే సంబంధము కలుగుచున్నది. ప్రాణమునకు శక్తియంతయు జీవుని చైతన్యమువలననే కలుగుచున్నది. కర్మానుభవము పూర్తి యైనప్పుడు శరీరము శిధిలమై పడిపోవును. అప్పుడుప్రాణము ఆశరీరమును వదలిపెట్టి మనస్సును బుద్ధిని ఇంద్రియములను గైకొని మరల కర్మననుసరించి ఇంకొకశరీరమున ప్రవేశించును. ఇచ్లు జీవుఁడు మనస్సుతో ప్రతిశరీరములో ఏవో పుణ్యములను పాపములను చేయుచు వానియొక్క సంస్కారముల ననుసరించి దివ్యశరీరములను క్రిమికీటకాదశరీరములను పొందుచు పరిభ్రమించుచుండును. ఒకప్పటికి బుద్ధి విరక్తినొంది మోహమును వదలి మంచిభర్తను పొందును. అఁనగా బుద్ధి సద్గురువును ఆశ్రయించును. నిర్మలమైన బుద్ధి సద్గురుబోధ వలన రహస్యమైన జీవుని స్వరూపజ్ఞాననము గ్రహించి ఇంద్రియములను జయించి మనస్సును నిగ్రహించి శుద్ధచైతన్యముతో మాటి మాటికి కూడుచు మహానందమును పొందును. అనఁగా బుద్ధి శుద్ధచైతన్యమునుగూర్చి నిరంతరము మననము చేయుచు దానితో తాదాత్మ్యమును పొందును. అదియే జీవునకు ముక్తి.

శుద్ధచైతన్యమునందు హేమలేఖవంటి జీవులు లెక్కలేనంత మంది యున్నారు. అందఱికథ ఇట్టిదే. ప్రతిజీవుఁడు బుద్ధి మనస్సు అవిద్య అనువాని ననుసరించుచు సంసారి అగుచున్నాఁడు. కాని యథార్థముగ జీవు లందఱును సముద్రములోని తరంగములు, సముద్రముకన్న భిన్నముగా ఎట్లు లేవో, అట్లే శుద్ధచైతన్యముకన్న అన్యముగా లేరు. వారు. 'మేముసంసారులము. బద్ధులము' అని తలంచుచున్నప్పుడు కూడ వారి స్వరూపము శుద్ధచైదతన్యమే, అన్యముకాదు. త్రాడునందు పాము అను భ్రాంతి కలిగినప్పుడు ఆపాము ఎప్పుడు ఎట్లు లేదో అట్లే జీవునియందు సంసారిత్వము కూడ ఎప్పుడును లేదు. అందువలన జీవుఁడు యథార్థముగా ఎప్పుడును శుద్ధ చైతన్యరూపుఁడే.

సకేతములు

తల్లి = శుద్ధచైతన్యము లేక త్రిపురాదేవి

కూతురు = జీవుఁడు

తల్లి యొసంగిన చెలికత్తె = బుద్ధి

బుద్ధియొక్క స్నేహిరాతులు = శూన్య = అవిద్య

శూన్యయొక్క కొడుకు = మోహము (మహామోహుఁడు)

మోహమువలన బుద్ధికి పుట్టినకొడుకు అస్థిరుఁడు = మనస్సు

మనస్సుయొక్క మొదటిభార్య చపల = కల్పన

మనస్సువలన చపలకు పుట్టిన కొడుకులు పంచజ్ఞానేంద్రియములు -

ఇంద్రియములు: స్థానములు :

శ్రోత్రము శబ్దము

త్వక్కు స్పర్శము

చక్షుస్సు రూపము

జిహ్వ రసము

ఘ్రాణము గంధము

చపలయొక్క చెల్లెలు మహాశన = కామము = మనస్సునకు రెండవభార్య

మనస్సువలన కామమునకు పుట్టిన కొడుకులు-

(1) జ్వాలాముఖుఁడు = క్రోధము

(2) నింద్యవృత్తుఁడు = లోభము

పదిద్వారములుగలపురము = శరీరము

అస్థిరుని (మనస్సుయొక్క) ప్రియమిత్రుఁడు పురరక్షకుఁడు

ప్రచారుఁడు = ప్రాణము

బుద్ధి మంచిభర్తను పొందుట = సద్గురువు నాశ్రయించుట

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters