Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ఇరువదిరెండవయధ్యాయము -

శాస్త్రార్థసఁగ్రహము

భార్గవరాముఁడు దత్తాత్రేయని మరల వినయముతో నిట్లు ప్రశ్నించెను. ''శాపముక్తి నొందిన యాబ్రాహ్మణుఁడు హేమాంగదుని మరల దేనినిగూర్చి ప్రశ్నించెను? ఆతఁడు ఏమి సమాధానము చెప్పెను. ఆబ్రాహ్మణుఁడు మహాపండితుఁడు కదా! ఆతఁడు అడిగినది అల్పవిషయమై యుండదు. అందువలన దానిని తెలిసికోవలయునని మిగుల కుతూహలముతో నున్నాను. అది యేమో దయతో చెప్పుము.''

దత్తాత్రేయుఁడిట్లు చెప్పెను - ''వసుమంతుఁడు హేమాంగదునితో ఇట్లనెను. 'నేను అష్టకునివలన నీవలన కూడ పరమపదమును చక్కఁగా తెలిసికొంటిని. కాని సందేహ మొకటి కలుగుచున్నది. తత్త్వము నెఱింగిన నీవు ఈస్థితియందు ఎట్లున్నావు? తత్త్వము నెఱింగినవాఁడు వ్యవహారపరాయణుఁడు ఎట్లగును? వెలుఁగున్నచోట చీఁకటియుండదు కదా! మఱి జ్ఞాన మున్నచోట వ్యవహారము ఎట్లుండును? రాజపుత్రా! దీనికి సమాధానము ఉన్నది యున్నట్లుగా చెప్పుము.'

ఆబ్రాహ్మణునకు హేమాంగదుఁడు ఇట్లు చెప్పెను. 'అయ్యా! నీకు భ్రాంతి ఇంకను పూర్తిగా పోలేదు. ఆత్మస్వరూపమైన జ్ఞానము వ్యవహారముచేత ఎట్లు భంగపడును? వ్యవహారముచేత జ్ఞానము భంగపడినచో అది స్వప్నములో కలిగిన జ్ఞనమువంటిదే అగును. అట్టి జ్ఞానమువలన ప్రయోజన మేమున్నది? ఎవఁడు ముక్తిని కోరుచున్నాఁడో వానికి స్వరూపము జ్ఞానమే. అది వ్యవహారముచేత నశించినచో మోక్షమును కోరువాఁడే యుండఁడు. ఇంక మోక్ష మను ఫలమును ఎవఁడు పోందును? కావున వ్యవహారముచేత జ్ఞానమునకు బాధలేదు. ప్రతిబింబములకు అద్దమువలె సకలవ్యహారమునకు జ్ఞానము ఆధారము. ప్రతిబింబములవలన అద్దమునకు ఎట్లు భంగము సంభవము కాదో అట్లే వ్యవహారమువలన జ్ఞానమునకు భంగము సంభవము కాదు. దేనియందు ఈజగత్తు అంతయు భాసించుచున్నదో అదియే జ్ఞానము. సంకల్పమువలననే జ్ఞానమునందు సర్వవ్యవహారము ప్రకాశించుచున్నది. వ్యవహారమునుగూర్చి సంకల్ప మేదియు చేయకుండ నిర్మలమైనబుద్ధితో శాస్త్రమునందు చెప్పఁబడిన లక్షణముల ననుసరించి స్వరూపమైన జ్ఞానమును గుర్తించినవాఁడు బంధనిర్ముక్తుఁడై కృతార్థుఁడగును. ఇది నిశ్చయము.'

వసుమంతుఁడు మరల ఇట్లనెను. 'రాజకుమార! ఇది నిజమే. నేను కూడ ఇట్లే నిశ్చయించుకొంటిని. వికల్పములేని జ్ఞానమే స్వరూపుమని చెప్పఁబడుచున్నది. కాని ఆ జ్ఞానమునందు వికల్పము కలిగినంతనే భ్రాంతి ఏల కలుగదు? త్రాడునందు పాము తోఁచుట వికల్పమే కదా! అది భ్రాంతియే కదా! కావున జ్ఞానియైనను భ్రాంతి లేకుండ ఎట్లు వ్యవహరించును?'

హేమాంగదుఁ డిట్లు చెప్పెను. 'అయ్యా! భ్రమ యథార్థము అను రెండింటియొక్క స్వరూపము నీకు తెలియలేదు. ఆకాశము యొక్క స్వరూపము తెలిసినవారికి కూడ ఆకాశము నీలముగనే భాసించును. ''నల్లనియాకాశము'' అని వారు అప్పుడప్పుడు చెప్పుటయు కలదు. అంతమాత్రముచేత వారిజ్ఞానము భ్రాంతి అని చెప్పఁబడుట లేదు ఆకాశముయొక్క స్వరూపము నెఱుంగనివాఁడు ''ఆకాశము నల్లనిది'' అని చెప్పినచో వానిజ్ఞానమును భ్రాంతి యని చెప్పుదురు. ఆకాశముయొక్క స్వరూపము తెలిసినవానికి ఆకాశము నల్లగా కన్పించుచున్నను అది యథార్థము కాదని రూఢిగ తెలియును. అందువల వానిదృష్టిలో ఆకాశముయొక్క నల్లఁదనము మరణించినమహాసర్పము వలె నిష్ర్కియము. జ్ఞానమునకు ''ఇది యథార్థము'' అను ప్రమాణ బుద్ధియే జీవము. అది లేనప్పుడు ఆ జ్ఞానము నిర్జీవ మగును. పండితులకు ''ఆకాశము నల్లగా నున్నది'' అను జ్ఞానమునందు ప్రామాణ్య బుద్ధి యుండదు. అందువలన ఆ జ్ఞానము నిర్జీవమై నిష్ర్పయోజకమగును. అది భ్రాంతి కాదు. కాని ఆకాశముయొక్క స్వరూపము తెలియనివాని కది భ్రాంతియే యగును. ఎండమావులలో నీరున్నట్లు తోఁచుట తెలిసినవానికి తెలియనివానికి సమానముగానే యుండును. అది నీరు కాదని తెలిసివాఁడు భ్రాంతి నొందఁడు; దానికై పరువెత్తఁడు. తెలియనివానికి అది భ్రాంతియే యగుటచే ఆనీటికై పరువెత్తును. ఎండమావులలో నీరువలె జగత్తు ఉన్నట్లు కన్పించుచున్నదే కాని నిజముగా లేదు; యథార్థముగ ఉన్నది జ్ఞానమే అని రూఢిగ తెలిసికొన్నజ్ఞానికి వ్యవహారమంతయు జ్ఞానరూపమే అగును. ఆజగత్తు వలన తనకు సుఖదుఃఖములు కలుగుచున్నట్లు జ్ఞాని ఎప్పుడును తలంపఁడు. అజ్ఞాని దృష్టిలో జగత్తు యథార్థమే కావున అతఁడు జగత్తు వలన తనకు సుఖదుఃఖములు కలుగుచున్నట్లు తలంచుచు భ్రాంతితో వ్యవహరించుచుండను. ఇరువురకును వ్యవహారము సమానముగనే కన్పించుచున్నను జ్ఞానికి అది జ్ఞానమే అగుచుండఁగా అజ్ఞానికి భ్రాంతి యగుచున్నది.

త్రాడును చూచి పామని యనుకొని భయపడుచున్నవానికి ''ఇది పాము కాదు; త్రాడే'' అని తెలిసినతరువాత పాము కన్పింపదు; త్రాడే కన్పించుచుండును. అట్లే ఆత్మజ్ఞానము కలవానికి ఆత్మయే కన్పింప వలెఁగాని జగత్తు ఎట్లు కన్పించుచున్నది? తిమిరమను కంటిజబ్బు కలవానికి ప్రతివస్తువు రెండుగా కన్పించుచుండును. ఆకాశమునందు వానికి ఇద్దఱు చంద్రులు కన్పించుచుందురు. తెలిసినవాఁడు ''ఇద్దఱు చంద్రులు లేరు? ఒక్కఁడే చంద్రుఁడున్నాఁడు'' అని చెప్పినప్పుడు వానికి ఆ భ్రాంతి తొలఁగిపోయి చంద్రుఁడొక్కడే అని వాఁడు గ్రహించును. వానికి భ్రాంతి తొలఁగిపోయినను వాఁడు చంద్రునివైపు చూచునపుడు మరల ఇద్దఱు చంద్రులు కన్పించుచునే యుందురు. అజ్ఞానముచేత కలిగిన భ్రాంతి జ్ఞానముచేత పోయినను, కంటిజబ్బు వలన కలుగుచున్న దోషము ''ఒకవస్తువు రెండుగా కన్పించుట''యను నది తొలఁగదు. దానికి కారణమైన జబ్బు పోయినప్పుడే అది పోవును. అట్లే జ్ఞానులకు కూడ ఆత్మజ్ఞానమువలన ''జగత్తు సత్యము'' అను భ్రాంతి తొలఁగిపోయినను ప్రారబ్దకర్మయొక్క దోషమువలన జగత్తు భాసించుచునే యుండును. అందువలన వారికి ప్రారబ్ధకర్మ నశించు వఱకు వ్యవహారము జరుగుచునే యుండును. అది ముగిసినంతనే జ్ఞానికి ఆత్మ తప్ప జగత్తు భాసింపదు. కాఁబట్టి జ్ఞానులకు ఎప్పుడును భ్రాంతి యన్నది యుండనే యుండదు'

వసుమంతుఁడు మరల ఇట్లనెను. 'రాజకుమారా! జ్ఞానులకు కర్మ ఎట్లు మిగిలియుండును? జ్ఞానాగ్నిచేత కర్మ అనుదూతి దగ్ధము కాక ఇంకను మిగిలియుండునా?'

హేమాగందుఁడిట్లు చెప్పెను. 'అయ్యా! వినుము, అందఱకు ఉన్నట్లే జ్ఞానులకు కూడ అపక్వము పక్వము హతోదితము అని కర్మమూఁడువిధములుగా నుండును. వీనినే సంచితము ప్రారబ్ధము ఆగామి అని చెప్పుదురు. వీనిలో ప్రారబ్ధము తప్ప తక్కిన రెండును జ్ఞానము చేత నశించును. ''ఈకర్మ ఇంతకాలమునకు పరిపాకము నొందవలె'' అను భగవంతునియొక్క నియతి (Law) ననుసరించి కాలము కర్మలకు పరిపాకమును కలిగించుచుండును. కాలముచేత పరిపాకదశకు తీసికొనిరాఁబడిన కర్మ పక్వ మని చెప్పఁబడుచున్నది. పరిపాకస్థితికి రానిది అపక్వ మని చెప్పఁబడుచున్నది. జ్ఞానము కలిగినతరువాత చేయఁబడుచున్న కర్మ హతోదితము. జ్ఞానమువలన ఆకర్మకు ఫలము నొసంగునట్టి శక్తి హత మగును. అట్లు మొలకెత్త లేనిగింజవలె పైకి వచ్చుచున్న యాకర్మను హతోదితము అని చెప్పుచున్నారు. పక్వమైఫలము నిచ్చుటకు ప్రారంభ##మైన కర్మ, ధనుస్సునుండి వెలువడిన బాణమువలె, దానివేగము ఎంతవఱకు ఉండునో అంతవఱకును అది ఫలమును ఇచ్చుచునే యుండును. అది జ్ఞానముచేత నశింపదు. దాని వలననే జ్ఞానికి జగత్తు భాసించుచుండును. కాని జ్ఞానస్థితియందలి భేదములనుబట్టి ఫలమునందు భేదములు కలుగుచున్నవి. మందజ్ఞానులకు జగత్తు భాసించుచున్నప్పుడు సుఖదుఃఖములు స్ఫుటముగనే కలుగుచుండును. మధ్యజ్ఞానులకు అవి స్ఫుటముగా నుండవు. ఉత్తమజ్ఞానులకు సుఖములు దుఃఖములు స్ఫుటముగా కలుగుచున్నట్లు లోకులకు తోఁచుచున్నను, వారికి స్వదృష్టిలో అవి కుందేటికొమ్ములవలె మిథ్యగానే తోఁచుచుండును. అందువలన అది ఫలముగా చెప్పఁబడుటలేదు.

అజ్ఞానులయందు కర్మఫలము పుష్టి నొందచుండును. సుఖము కలుగుటకు పూర్వము ''నాకు ఇట్టిసుఖము రాఁగలదు'' అని. దానిని అనుభవించినతరువాత ''ఇట్టి సుఖము కలిగినది'' అని అజ్ఞానులు చాల కాలము గాఢముగ భావించుచుందురు. ఆ భావన సంస్కారరూపముగ మనస్సునందు నిలచి కర్మఫలమునకు పుష్టిని కలిగించుచు రాగద్వేషదులను పుట్టించుచుండును. మందజ్ఞానులకు సుఖదుఃఖములు కలుగుచున్నను ఆఫలములకు సంబంధించిన భావన ఆత్మానుసంధానమువలన కొనసాగదు. అందువల అజ్ఞానులకువలె మందజ్ఞానులకు ప్రారబ్ధకర్మఫలము పుష్టి నొందదు.

కలఁతనిద్రలో దోమలు మొదలగువానివలన కలుగుబాధ ఎట్లు సూక్ష్మముగా నుండునో అట్లే మధ్యాజ్ఞానులయొక్క కర్మఫలానుభవము కూడ సూక్ష్మముగానే యుండును.

ఉత్తమజ్ఞానులకు ఆత్మానునంధానము ఎల్లప్పుడును ఉండును. ఆ యనుసంధానముయొక్క బలమువలన వారికి కర్మఫలము ఎప్పుడో జరిగిపోయినదానివలె తోఁచుచుండునే కాని అప్పుడు జరుగుచున్నదాని వలె సుఖదుఃఖములను కలిగింపదు. కాలిపోయినత్రాడు ఎట్లు బంధింపఁజాలదో అట్లే కర్మఫలము ఉత్తమజ్ఞానికి బంధమును కలిగింపఁజాలదు. స్త్రీవేషమును ధరించి నటించుచున్న పురుషుఁడు నాటకము నందు భర్తృవియోగము సంభవించినప్పుడు దుఃఖమును, పుత్రప్రాప్తి యందు సంతోషమును, ఎంతగా ప్రదర్శించినను, వానికి యథార్థముగా ఎట్లు దుఃఖము గాని సుఖము గాని కలుగదో, అట్లే ఉత్తమజ్ఞానియు రాజ్యప్రాప్తి, పుత్రవియోగము మొదలగు సంఘటనములలో సంతోషమును దుఃఖమును ప్రకటించుచున్నను వానికి యథార్థముగా సంతోషము గాని దుఃఖము గాని కలుగదు. అతఁడు సకలసంఘటనములను అద్దమునందువలె ఆత్మయందు తోఁచుచున్న ప్రతిబింబములనుగా చూచుచుండును. అందువలన అతఁడు సంతోషించుచున్నట్లు దుఃఖపడుచున్నట్లు ఇతరులకు కన్పించుచున్నను అంతరంగమున ఎట్టి వికారమును పొందఁడు. అందువలన అతనికి ప్రారబ్ధకర్మఫలము కుందేటి కొమ్ముతో సమానము.

అజ్ఞానులకు ఆత్మస్వరూపమే తెలియదు. కావున వారు దేహాభిమానముతో జగత్తును సత్యముగా తలంచుచు సుఖదుఃఖములను పూర్ణముగా అనుభవింతురు. మందజ్ఞానులకు ఆత్మ శుద్ధచిన్మయ మని జగత్తు అసత్య మని దృఢముగా తెలియును. అయినన ఆత్మానుసంధానముయొక్క అభ్యాసము అల్పమగుటవలన పూర్వవాసలయొక్క ప్రాబల్యముచేత అప్పుడప్పుడు దేహాభిమానము జగత్తు సత్య మను భ్రాంతియు కలుగుచుండును. మరల వెంటనే వారు జ్ఞానాభ్యాసము యొక్క సంస్కారమువలన దేహాభిమానమును జగత్తు సత్య మను భ్రాంతిని తొలఁగించుకొందరు. ఇవి ఒకదానితరువాత ఒకటిగా సంభవించుచున్నను రెండును సమానములు కావు. ఆత్మజ్ఞానవాసన భ్రాంతి వాసనను బాధించును. భ్రాంతి జ్ఞానమును భాదింపఁజాలదు. అందువలన అప్పడప్పుడు భ్రాంతి కలుగుచున్నను మందజ్ఞాని మరల యథాపూర్వముగ సంసారమునఁబడఁడు. అతఁడు క్రమముగా భ్రాంతి వాసనను తొలఁగించుకొనుచు ఆత్మజ్ఞానమునందే నిలుచును.

మధ్యమజ్ఞానికి ఆత్మజ్ఞానము ఎప్పుడును విస్మృతము కాదు. అతఁడు బుద్ధిపూర్వముగా కోరితెచ్చుకొనినట్లుగా అప్పుడప్పుడు అతనికి మిధ్యాజ్ఞానము కలిగి వ్యవహారము జరుగుచుండును. ఇది జ్ఞానయోగ సిద్ధుని లక్షణము. ఇంక సాధకునిలక్షణము వినుము. సాధకుఁడు ఎంతగా సమాధిని అభ్యసించుచుండునో అంతగా వానికి ఆత్మజ్ఞానము దృఢముగ భాసించుచుండును. సమాధియొక్క అభ్యాసము పూర్ణమైనంతనే ఇంతఁడును సిద్ధుఁడై మిధ్యాజ్ఞానమును వ్యవహారముకొఱకు ఇష్టమైనప్పుడు తెచ్చుకొనుచుండును.

ఇంక ఉత్తమజ్ఞానియందు సమాధికి వ్యవహారమునకును కొంచెము కూడ భేదము లేదు. ఎందువల్ల ననఁగా వానికి ఎప్పుడును ఆత్మ విస్మృతి యుండదు. అట్లయినచో మధ్యమునకు ఉత్తమునకు భేద మేమి? మధ్యమజ్ఞానులలో సిద్ధుఁడు మిత్యాజ్ఞానముతో వ్యవహరించునపుడు వాని యాత్మజ్ఞానము ఎండకు వాడిపోయిన పుష్పమువలె నుండును. ఉత్తమునకు వ్యవహారదశయందు కూడ ఆత్మజ్ఞానము కసుగందని పుష్పమువలెనే యుండును. అయ్యా! వాస్తవముగా వీరి కిరువురకును స్వదృష్టియందు ప్రారబ్ధమే లేదు. ఎందువల్ల ననఁగా వీరు ఇద్దఱును పూర్ణత్వమును పొందివారగుటచే వీరికి ఆత్మకు అన్యముగా ఏదియు భాసింపదు. ఐంద్రజాలికుఁడు చేయునింద్రజాలమువలె వీరిరువురియొక్క వ్యవహారము ఇతరులకు మాత్రము యుథార్థముగా తోఁచుచుండును. వారిదృష్టిలో అది అంతయు మిథ్యయే. నీకు సారభూతమైన రహస్యమును చెప్పెదను. వినుము. పరమశివునకు ఏజ్ఞానదృష్టికలదో అదియే జ్ఞానులకును దృష్టి. శివుని దృష్టికి జ్ఞానిదృష్టికి భేదము లేదు. ఇందు సందేహము లేదు. అందువలన మధ్య మోత్త మజ్ఞాలనుకు ప్రారబ్ధకర్మములేదు.'

ఇట్లు హేమాంగదుఁడు వివరింపఁగా వసుమంతుఁడు సందేహములను వీడి ఆత్మజ్ఞానమును విశదముగా గ్రహించి రాజపుత్రులచే పూజితుఁéడై తననివాసమునకు పోయెను. రాజపుత్రులు కూడ తమ నగరమునకు చేరిరి.''

దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పఁగా విని పరశురాముఁడు మరల ఆయనను ఇట్లు ప్రార్థించెను. ''భగవానుఁడా! నీవలన ఆత్మజ్ఞానమును గూర్చి వింటిని. సందేహము లన్నియు నశించినవి. ఆత్మస్వరూపము తెలిసినది. ఎల్లయెడల సర్వాంతర్యామియై జ్ఞానమాత్రముగ ఆత్మయే భాసించుచున్నది. అయినను నీవు మొదటినుండి చెప్పిన విషయమున కంతకును సారమైనదానిని నేను ఎల్లప్పుడును జ్ఞప్తియందుంచుకొనుటకు వీలుగా సంక్షేపముగా చెప్పుము.''

దయాశాలియైన దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పెను. ''ఈవిజ్ఞానమున కంతకును పరమసారమును మరలచెప్పుచున్నాను. వినుము. చిదాత్మికయైన పరమేశ్వరియొక్క స్వాతంత్ర్యమునకు మాయ యనిపేరు. దానికి దుర్ఘటములను సుసంఘటితములుగా అసంభవములను సంభవములనుగా చేయుసామర్ధ్యము కలదు. ఆ సామార్ధ్యముచేతనే అది అద్దమునందు బ్రతిబింబమువలె, చిదాత్మయందు జగత్తును భాసింపఁజేయుచున్నది. ఆ క్రమమును వినుము. స్ఫురణము చైతన్యమునకు లక్షణము. 'నేను' అను స్ఫురణము లేక భావము అహంత. 'అంతయు నేనే' అనుస్ఫురణము పూర్ణాహంత. చిదాత్మయొక్క స్వరూపము పూర్ణాహంత. చిదాత్మ సృష్టిచేయవలయు నని తలంచినప్పుడు పూర్ణాహంతయందు రెండుభాగము లేర్పడును. అందు ఒకభాగమునకు పరిమితమై 'నేను' అనుస్ఫురణము ఉండును. రెండవభాగమునందు 'నేను' అనుస్ఫురణము వ్యాపింపదు. అందువలన మొదటిభాగము అపూర్ణమైన యహంతయగును. ఈ అపూర్ణమైన యహంతకు రెండవ భాగము బాహ్యముగా గోచరించును. ఇదియే అవ్యక్తము. అపూర్ణా హంతయే సదాశివుఁడు. తనకన్న భిన్నముగ అవ్యక్తమును చూచుచున్నను, 'నేను ఇది' అని ఎప్పుడును భావించుచునే యుండును. దేహమును మనకన్న భిన్నముగ చూచుచుండియు, 'నేను ఇది' అని ఎట్లు అభిమానించుచున్నామో అట్లే సదాశివుఁడు అవ్యక్తమును 'నేను ఇది' అభిమానించుచుండు నన్నమాట. ఆ అవ్యక్తమునే తనదేహమునుగా 'ఇది నేను' సదాశివుఁడు అభిమానించునప్పుడు ఈశ్వరుఁడగును. 'నేను ఇది' భావించునప్పుడు సదాశివునియందు చైతన్యమునకు ప్రాధాన్యము ఉండఁగా, 'ఇది నేను' అని అవ్యక్తమును అభిమానించునప్పుడు ఈశ్వరునియందు మాయకు ప్రాధాన్యము ఏర్పడుచున్నది. ఈశ్వరుఁడు తనస్వాతంత్ర్యముయొక్క మహిమవలన అవ్యక్తమునందు తమస్సు రజస్సు సత్త్వము అనుగుణములను భాసింపఁజేసి ఆగుణములయందలి యభిమానముతో రుద్రబ్రహ్మవిష్ణువులుగా భాసించెను. వారితోపాటు దృశ్యములైన అనేకబ్రహ్మాండములు, వానిని చూచుచున్న జీవులును భాసించిరి. ఈబ్రహ్మాండములయం దుత్పత్తికి స్థితికి సంహారమునకు కారణభూతులైన బ్రహ్మలు విష్ణువులు రుద్రులు ఎందఱో ఏర్పడిరి.

భార్గవా! జగత్తుయొక్క విధానము ఇది. ఇది అంతయు అద్దమునందు ప్రతిబింబమువలెనే భాసించుచున్నది. ఇది ఇట్లు కేవలము భాసించుచున్నదే కాని ఇందు ఏదియు పుట్టుట లేదు. ఈ జగత్తు అంతయు ఎంతగా భాసించుచున్నను దీనికి అద్దమువలె ఆధారముగానున్న చిదాత్మ ఎప్పుడును మార్పునొందక పూర్ణాహంతాస్వరూపముతోనే యున్నది. చిదాత్మయందు ఎంతగా అనేకత్వము భాసించుచున్నను అది ఎప్పుడు పూర్ణముగా ఆఖండముగానే యుండును. నీవు నీ దేహమునందు అంతటను 'నేను' అను భావముతో వ్యాపించియుండియు ప్రత్యేకముగా కన్ను చెవి మొదలగువానిని అవలంభించి చూచుట వినుట మొదలగుపనులను ఎట్లు నిర్వహించుచున్నావో అట్లే చిదాత్మికయగు పరమేశ్వరియు పూర్ణాహంతారూపమున నుండియు సదాశివుఁడు మొదలుగా క్రిమికీటకాదులవఱకును సకలజీవులయందును అపూర్ణాహంతారూపమైన జీవభావముతో వ్యవహరించుచున్నది. వాస్తవముగా అన్నింటియందును భాసించుచున్నచైతన్యము ఆమెయే. 'దేహము నేను' అను భావముతో ఉన్ననీవు స్వయముగా వస్తువులరూపమును రుచిన గ్రహింపలేవు. నీవు చక్షుస్సు మొదలగు నింద్రియములతో తాదాత్మ్యమును పొందినప్పుడే ఆ యింద్రియములద్వారమున రూపము రుచి మొదలుగా సకలవిషయములను గ్రహించుచున్నావు. అట్లే సదా శివుఁడు కూడ సర్వాంతర్యామియై యుండి బ్రహ్మనుండి క్రిమికీటకాదులవఱకును సకలజీవులతో తాదాత్మ్యమును పొంది ఆయాజీవులద్వారమున జగద్వ్యవహారమును నిర్వహించుచున్నాఁడు. అద్దము తనయందు ప్రతిఫలించుచున్న యేప్రతిబింబముయొక్క విశేషమును గ్రహింపదు. అది ఎప్పుడును శుద్ధముగ నిర్వికల్పముగానే యుండును. అట్లే శుద్ధము నిర్వికల్పము అయిన నీస్వరూపము కూడ దేనిని చూచుట లేదు, దేనిని వినుట లేదు, దేనిని గ్రహించుట లేదు, నిద్రయందు ఇది అనుభవసిద్ధమే. అట్లే ఆ పరమచైతన్యము సకల జగత్తునకు ఆధారముగా నుండినప్పటికిని పదార్థముల భేదములను కొంచెము కూడ గ్రహింపదు; ఏకార్యమును చేయదు. పరమచైతన్యరూపిణియైన పరమేశ్వరియొక్క స్వాతంత్ర్యవైభవమువలననే ఈజగత్తు అంతయు, అద్దమునందువలె, ఆమెయందు ప్రతిబింబించుచున్నది. అద్దము యొక్క ప్రకాశ##మే ప్రతిబింబములకు ప్రకాశ##మైనట్లు, జగత్తు యొక్క ప్రకాశ మంతయు ఆమె ప్రకాశ##మే.

ఈజగత్తునందు నీవు నేను ఇతరులు దృశ్యములను చూచుచు ద్రష్టలముగా (Seers) ఉన్నాము. ద్రష్టలుగా ఉన్నవీరందఱును దృశ్యములతో సంబంధములేక వానిని గ్రహింపకుండ దృక్కు మాత్రముగా ఉన్నప్పుడు అంతఱయొక్క స్వరూపము శుద్ధచైతన్యమే యుగుచున్నది. నిద్రయొక్క దృష్టాంతము ననుసరించి దీనిని గ్రహింపవచ్చును. నిద్ర యందు ఏద్రష్టయు ఏదృశ్యమును గ్రహించుట లేదు. అందువలన అప్పు డీ ద్రష్ట లందఱును సమానమైనస్థితినే పొందుచున్నారు. నిద్రలో రాజ్యము కన్పింపదు కనుక రాజు, 'నేను రాజును' అని అనుకొనుట లేదు. అట్లే పేదఱికము తోఁచదు కనుక పేదవాఁడు 'నేను పేదవాఁడను' అని అనుకొనుట లేదు. శరీరములు కన్పింపవు కనుక ఎవరును 'నేను పురుషుఁడను, నేను స్త్రీని, నేను కుంటివాఁడను, నేను గ్రుడ్డివాఁడను' అని అనుకొనుట లేదు. ఇట్లే జాగ్రద్దశలో కూడ స్వరూపానుసంధానముయొక్క బలముచేత దృశ్యములతో సంబంధము లేకుండ ఉన్నప్పుడు ద్రష్టల కందఱకును శుద్ధచైతన్యమే స్వరూపమగును. ప్రతిబింబములు లేకున్నచో అద్దము ఎట్లు శుద్ధముగ ప్రకాశించునో అట్లే దృశ్యములతో సంబంధములేని చైతన్యము కూడ శుద్ధముగ ప్రకాశించుచుండును. ఆ శుద్ధ చైతన్యము మహానందఘనము. (Solid mass of absolute bliss) సకలజీవులు విషయభోగములచే ఏయే ఆనందములను పొందుచున్నారో ఆయా యానందముల కన్నింటికిని అది నిలయము. అందువలననే దానిని అందఱు కోరుచున్నారు.

ఆత్మస్వరూపమే సుఖము. కావుననే ప్రతివ్యక్తియు దేహమును కూడ స్వరూపసుఖమును కోరియే సాధనముగా వినియోగించుచున్నాఁడు. దేహమును కష్టపెట్టి స్వర్గాదులను కోరుచున్నా రన్నచో దేహము కూడ స్వరూపమైన సుఖమునకు లేక ఆనందమునకు సాధనమగుచున్న దనుట స్పష్టము. విషయసుఖములవలన కలుగునానాందము లన్నియు స్వరూపానందమునందు అల్పములైన యంశములు. నిద్రావిషయముననే ఇది స్పష్టముగ తెలియుచున్నది. ఎవఁడు ఏవిషయమువలన ఎంత సుఖపడుచున్నను కొంత సేపైన తరువాత దానిని వదలి నిద్రను పొందుచునేయున్నాఁడు. అన్నము పానము స్త్రీభోగము మొదలుగా ఏవిషయము నిద్రలోలేదు. అయినను అప్పుడు నిర్విషయముగానే సుఖము కలుగుచున్నది. అది యథార్థముగా స్వరూపమువలనిసుఖమే. కాని అప్పుడు స్వరూపము తమస్సుచేత ఆవరింపఁబడుచున్నది. అట్టి నిద్రచేతనే అంత సుఖము కలుగుచుండఁగా ఆవరణరహితమై శుద్ధ చైతన్యరూపమున ప్రకాశించు స్వరూపమువలన ఎంతయానందము కలుగునో యూహింపుము. ఆ స్వరూపానందమే లోకమున పెద్ద బరువును తలమీఁదనుండి దించినప్పుడు, అన్నపానాదిభోగ్యవిషయములవలన, నిద్రవలన, కొంచెము కొంచెముగా లభించుచున్నది, మూఢులు ఆత్మసుఖమునే వివిధములైన విషయములవలన కలుగుచున్నట్లుగా తలంచుచున్నారు. హృదయములందు మానవులకు అనంతములైనవాసన లున్నవి. వానిలో ఒకటి పైకి వచ్చి దానికి సంబంధించిన కోరిక తీవ్రముగా ఉన్నప్పుడు తక్కినవాసన లన్నియు వెనుకఁబడియుండును, కోరిక తీవ్రమగు కొలఁది దుఃఖము ప్రబలుచుండును. కోరినవిషయము లభించినంతనే తలమీఁదనుండి పెద్దబరువు దింపినట్లుగా స్వరూపసుఖమే కొద్దిగా భాసించుచున్నది. మఱియొకవాసన పైకివచ్చి దానివలన కోరిక ప్రబలమైనంతనే ఈసుఖము మరల మఱుఁగునఁబడుచున్నది. కోరిన విషయము లభించినతనే, కోరిక వలన కలుగుచున్న తాపము పోయి, మరల స్వరూపసుఖమే లేశమా త్రముగ భాసించుచున్నది. కావున ఎల్లరకును సకల విషయములవలనను స్వరూపమే సుఖముగా తోఁచుచున్నది.

అద్దమునుగూర్చి తెలియుంతవఱకు పామరులకు ప్రతిబింబములు ప్రత్యేకవస్తువులుగా ప్రకాశించుచున్నట్లు తోఁచుచుండును. కాని అద్దమునుగూర్చి తెలిసికొన్నతరువాత వారుకూడ ఆ ప్రతిబింబముల యొక్క ప్రకాశమంతయు అద్దమునకు సంబంధించినదే అని గ్రహింతురు. అట్లే తత్త్వము నెఱింగినవాఁడు జగత్తునందు తోఁచుచున్న చైతన్యము ఆనందము అంతయు తనస్వరూపము మాత్రమే అని గ్రహించును. మట్టియందు కుండలు మొదలగునవి, బంగారమునందు ఆభరణములు, ఱాతియందు ప్రతిమలు ఎట్లున్నవో అట్లే చిదాత్మయందు జగత్తు ఉన్నది. జగత్తు అసలే లేదనుట అపూర్ణమైనజ్ఞానమే. అద్దముయొక్క ప్రకాశముతప్ప ప్రతిబింబములకు వేఱుగా ప్రకాశము లేదు అని తెలిసినతరువాత కూడ ప్రతిబింబములు కన్పించుచునేయున్నవి. అవి మాయమగుట లేదు. అట్లే చిదాత్మకన్న భిన్నముగా జగత్తు లేదు అని స్పష్టముగా తెలిసినతరువాత కూడ జగత్తు భాసించుచునేయున్నది. అది మాయమగుట లేదు. వ్యవహారమున గోచరమగుచున్న జగత్తును. 'ఇది లేదు' అని శపించినంత మాత్రమున అది నశింపదు. కావున జగత్తు చిదాత్మయందు ప్రతిబింబమువలె ఉన్నదనుట సత్యము. దృశ్యము దృక్కు అను రెండింటియందు, 'దృక్కే ఉన్నది. దృశ్యము లేదు' అని తలంచునప్పుడు దృశ్యము లేకుండుట అను సంకోచము ఏర్పడుచున్నది. అట్లు కాక 'దృశ్యము దృక్స్వరూపముగా ఉన్నది' అని తలంచునప్పుడు సంకోచమునకు అవకాశము లేదు. కావున ఇట్లు గ్రహించుట పూర్ణవిజ్ఞానము.

దృక్కే తనమహిమయొక్క అతిశయమువలన దృశ్యత్వమును పొందియున్నది. ఇదియే సకలశాస్త్రార్థమునకు సారము. కావున బంధము లేదు. మోక్షము లేదు. సాధకుఁడు లేఁడు. సాధనము లేదు. అఖండము అద్వయము చిచ్ఛక్తియునైన త్రిపురాదేవి ఒక్కతయే భాసించుచున్నది. ఆమెయో అవిద్య, విద్య, బంధము, మోక్షసాధనము కూడ ఆమెయే. తెలిసికోవలసిన దిదియే. ఇంతకు మించి ఏదియును లేదు. భార్గవా! నీకు ఈ విజ్ఞానక్రమ మంతయు మొదటినుండియు చెప్పితిని. దీనిని చక్కఁగా తెలిసికొన్నవాఁడు ఎచ్చటను దుఃఖమును పొందఁడు.''

ఇట్లు భార్గవరామదత్తాత్రేయులసంవాదమును చెప్పి హారితాయనుఁడు నారదునితో ఇట్లనెను. ''మహర్షివర్యా! హేతువులతో అను భవముతో వివరింపఁబడిన యీజ్ఞానఖండమును విన్నచో ఎవనికైనను అజ్ఞానమువల కలుగుచున్నభ్రాంతి ఎట్లు నశింపకుండును? దీనిని విన్నతరువాత కూడ ఎవనికైనను భ్రాంతి తొలఁగకున్నచో వాఁడు బండ వంటివాఁడనియే చెప్పవలె, అట్టివానికి ఇంక ఏవిధముగ జ్ఞానము కలుగును? ఒక్కసారి విన్నంతమాత్రముననే ఈజ్ఞానఖండము వలన జ్ఞానము దృఢముగా ఏర్పడును. మందబుద్ధి కలవానికి రెండవ సారికి కాని మూఁడవసారికి కాని పాపము నశించి విజ్ఞానము తప్పక కలుగును.

ఈగ్రంథమును లఖించినచో రాగద్వేషాదిరూపమైన దృష్టిదోషము నశించును. దీనిని పూజించినచో చిత్తశుద్ధి కలుగును. దీనిని ఎల్లప్పుడు పరిశీలించుచున్నచో కర్మవాసన లన్నియు నశించును. స్థావరజంగమాత్మకమైన సర్వమునకు ఏది స్వరూపమై యున్నదో దేనిని చక్కఁగా విచారించి స్పష్టముగా గ్రహించినచో ముక్తి గలుగునో లేకున్నచో బంధమే కలుగునో, ఆ చిచ్ఛక్తియే త్రిపురాదేవి. ఆమెయే ''హ్రీమ్‌.''

ఇది ఇతిహాసములలో ఉత్తమమైన త్రిపురారహస్యమునందు పండ్రెండువేల శ్లోకములుగల గ్రంథమునందు జ్ఞానఖండమున శాస్థ్రా సంగ్రహము అన్నది ఇరువది రెండవయధ్యాయము.

జ్ఞానఖండసారము సంపూర్ణము.

బాలప్రియ

శుష్కతర్కమునందలియభిమానమువలన ఎంత అనర్థము సంభవించునో వసుమంతునివృత్తాంతమున స్పష్ట మగుచున్నది. వసుమంతుఁడు అష్టకుని ఆక్షేపించినప్పుడు ఆయన జ్ఞాని యగుటచే శుష్కతార్కికునితో ప్రసంగించుట వ్యర్థ మని సాంతుఁడై యూరకుండెను. కాని శిష్యుడఁగు కాశ్యపుఁడు క్రుద్ధుఁడై వసుమంతుని శపించెను. అతఁడు శపింపఁగలిగె నన్నచో తపశ్శక్తిసంపన్నుఁడే అని గ్రహింపవలసియున్నది. అట్టితపస్వి ఏల కోపించెను? అట్లు కోపించుట అయుక్త మని ఎవరును అనలేదు. తంగణుఁడు కుమారుని మందలించినట్లు అష్టకుఁడు శిష్యుని మందలింప లేదు. ఎందువలన? గురువునకు అవమాసము జరుగుచుండఁగా చూచి సహించియుండుట సమర్థుఁడైన శిష్యునకు తగదు. వసుమంతుని తర్కమున జయించుట అసాధ్యమని నిశ్చితమైనది. అట్టియెడల వాదమును విరమించి మౌనమును వహించియున్న జ్ఞానిని, తమయాచార్యుని, ఆక్రమముగా ఆక్షేపించుచున్న వసుమంతుని నిలుపుటకు శపించుట తప్ప వేఱుమార్గము లేదు. సమర్థుఁడై యుండియు గురువు అవమానింపఁబడుచుండఁగా చూచుచు సూరకుండుట శిష్యునకు అధర్మము. అధర్మము పాపమును కలిగించును. అందువలన అధర్మమునకు వెఱచి కాశ్యపుఁడు గురునిందను నిరోదించుటకై వసుమంతుని శపించెను. ఆకారణముచేత ఎవరును కాశ్యపుని ఆక్షేపింపలేదు.

వసుమంతుఁడు తన్ను శపించిన కాశ్యపుని ప్రార్థింపక అష్టకుని ప్రార్థించుట గమనింపఁదగియున్నది. గురువుయొక్క సమక్షమున శిష్యుని ప్రార్థించుట అసంగతము. తపై#్పనను ఒపై#్పనను శిష్యుని చర్యను చక్కఁపెట్టవలసినవాఁడు గురువు. అందువలన ఆయననే ప్రార్థించుట మర్యాద. అట్లు కాక కాశ్యపునే ప్రార్థించినను అతఁడు, ''అయ్యా! నేను నాకొఱకు నిన్ను శపింపలేదు. మాగురువులకు నీవు కష్టము ఁలిగించుటచే నిన్ను శపించితిని, వారే అనుగ్రహింపవలె. నాదేమియును లేదు'' అనియే చెప్పును. మఱియును కొందఱకు, పరీక్షీత్తువిషయమున శృంగికివలె, శపించుశక్తి యుండునే కాని దానిని మరలింపఁగలశక్తి యుండదు. అందువలన వసుమంతుఁడు అష్టకునే ప్రార్థించెను.

చెట్టుపై బ్రహ్మరాక్షసుఁడున్నాఁడని. అతఁడు పండితులను శాస్త్రమున ఓడించి భక్షించుచున్నాఁడని విన్నప్పుడు శాస్త్రవాదము చేయవలయు నని రుక్మాంగదుఁదు కుతూహలము నొందెను. హేమాంగదుఁడు కుతూహలపడక ఊరకయే యుండెను. అన్నగారు బయలు దేరినప్పుడు హేమాంగదుఁడు అతనిని అనుసరించెనే కాని వారింపలేదు. మఱి అది చాల సాహసకృత్యము. ఓడినచో అన్నగారు రాక్షసునిచే భక్షింపఁబడును, అయినను హేమాంగదుఁడు అన్నను వారించుటకు ప్రయత్నము కూడ చేయలేదు. ఎందువలన? బ్రహ్మరాక్షసునిచేత పండితులు భక్షింపఁడుచున్నా రని విన్నతరువాత క్షత్రియులుగా ఆ బ్రహహ్మరాక్షసుని ఎదుర్కొనవలసిన ధర్మము రాజకుమారులయందున్నది. అయినను ఆ బ్రహ్మరాక్షసునితో యుద్ధముచేయుటకు వీలు లేదు. ఆతఁడు శాస్త్రవాదమును నిమిత్తముగా చేసికొని పండితులను భక్షించుచున్నాఁడు. కావున వానిని శాస్త్రవాదముననే జయింపపలె. ఈ కారణముచేత హేమాంగదుఁడు అన్నను వారింపలేదు.

వసుమంతుఁడు హేమాంగదునితో శాస్త్రవాదమునకు పూనుకొనక గూఢములైన తత్త్వప్రశ్నలను అడిగెను. శాస్త్రవాదమున అతఁడు అమితకౌశలము కలవాఁడు; అష్టకుని జయించినవాఁడు. ఇప్పుడు రుక్మాంగదుని కూడ జయించెను. అట్టివానికి హేమాంగదుని జయించుట కష్టము కాదు. అయినను అతఁడట్లేల చేయలేదు? అతఁడు రుక్మాంగదునితో వాదము చేయుచుండియు హేమాంగదునిచర్యను కనిపెట్టుచునే యున్నాఁడు. అన్నగారు ఓడిపోయి పట్టుబడినపుడు హేమాంగదుఁడు పామరులవలె దుఃఖింప లేదు; ఆవేశపడ లేదు. పైఁగా అతఁడు క్షత్రియోచితముగా, ''నన్ను కూడ వాదమున జయించి మాయన్నతో కలిపి భక్షింపుము'' అని పలికెను. అన్నను విడిపించుటకు ఉపాయ మేమైన నున్నదేమో యని అతఁడు ప్రయత్నింపపఁజొచ్చెను. ఆతని మాటలలో చర్యలలో కొంచెము కూడ ఉద్వేగము కన్పింపలేదు. అందువలన వసుమంతుఁడు, ''ఇతఁడు తత్త్వజ్ఞుఁడై యుండును. లేకున్నచో ఇంత స్థెర్యము ధైర్యము ఉండవు. ఇది స్థితప్రజ్ఞుని లక్షణము. కావున ఇతఁడు నాగూఢప్రశ్నలకు సమాధానము చెప్పఁగలిగి యుండును. అట్లయినచో నాకు శాపవిముక్తి కలుగును. ఇతఁడు చెప్పలేకున్నచో ఎట్లయినను భక్షింతును గదా'' అని యనుకొని గూఢప్రశ్నలను అడిగెను. అతఁడు ఆశించినట్లే హేమాంగదుఁడు ఆ ప్రశ్నలకు సమాధానములను చెప్పెను. శాస్త్రవాదమే యైనచో హేమాంగదుఁడు ఓడిపోయియుండును. హేమాంగదుఁడు జ్ఞానియే. జ్ఞానికి సకల శాస్త్రములు వచ్చియుండవలయు నను నియమము లేదు. జ్ఞాని సర్వజ్ఞుఁడు కదా! అతనికి అన్నివిషయములు తెలిసియుండవా? తెలిసియుండవు. ''ఆత్మకన్న అన్యముగా ఏదియును లేదు. ఆత్మవలననే సర్వమునకు అస్తిత్వము (Existence) జ్ఞానము (Knowledge), ఆనందము (Bliss) కలుగుచున్నవి'' అని రూఢిగా తెలిసికొనుటయే జ్ఞానియొక్క సర్వజ్ఞత్వము. వస్తువిశేషములు భూతభవిష్యద్వర్తమానములు తపస్సిద్ధులైన జ్ఞానులకు, వసిష్టాదిమహర్షులకు కొందఱకు తెలిసియుండ వచ్చును. బ్రహ్మజ్ఞానముకలవా రందఱికి అట్టి శక్తిలు ఉండవలయు ననునియమము లేదు

హేమాంగదునివలన తత్త్వోపదేశమును పొందినను వసుమంతుఁడు అతనికి నమస్కరింప లేదు. హేమాంగదుఁడే వసుమంతునకు నమస్కరించెను. వ్యవహారమునందు ధర్మమే ప్రమాణముకానిజ్ఞానము కాదు. అందువలన జ్ఞానియైనను హేమాంగదుఁడు బ్రాహ్మణుఁడైన వసుమంతునకు నమస్కరించెను. అతఁడు రాజకుమారులనుదీవించెను.

గ్రంథము సమాప్తమైనది. మహాత్మ్యఖండమునందు దత్తగురువు సృష్టిక్రమమును చెప్పునప్పుడు వరశురాముఁడు కొన్నిసందేహములను అడిగెను. ఆయన వానికి అప్పుడు సమాధానము చెప్పక ''తరువాత చెప్పెదను. ఇప్పుడు చెప్పరాదు'' అని కువలునికథను ఉదాహరించెను. జ్ఞానఖండమునందు ఆప్రశ్నలకు ఇవి సమాధానములని ఎక్కడను చెప్పఁబడ లేదు. అయినను పరశురాముఁడు వానిని మరల అడుగలేదు.అనఁగా ఆయనకు అసందేహములు తీరె నన్నమాట. ఆసందర్భ మిది. దేవి త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుని జగత్సృష్టి గావింపు మని ఆదేశించెను. ఆయన చుట్టును చూచెను. మొదట అనంతమైనయాకాశ##మే కన్పించెను. తరువాత ఆయన చూచుచుండఁగా పంచభూతములు పైకి వచ్చెను. ఈ భూతములు అప్పటికే సిద్ధమై యున్నచో వీనిని సృష్టించినది ఎవరు? సిద్ధములైయున్న యా భూతములు మొదట బ్రహృదేవునకు ఏల కన్పింపలేదు? భూతసృష్టికి పూర్వమే త్రిమూర్తులకు దేహములు ఎట్లు కలిగినవి? బ్రహ్మ దేవితో మాటాడుటకు శబ్ద మెక్కడిది? ఇవి ఆయన అడిగిన సందేహములు.

వానికి సమాధానములు మనమిట్లు గ్రహింపవచ్చును. దేవి తిమూర్తులను అపంచీకృతములైన సూక్ష్మభూతములతో సృష్టించి యుండును. ఆ మూఁడు శరీరములు కాక తక్కినది అంతయు ఆకాశ మాత్రముగా సర్యవ్యాపకమై యుండెను. సూక్ష్మభూతముల సృష్టితో త్రిమూర్తులయందు శబ్దమే కాక ఇంద్రియవ్యాపారము కూడ ఆరంభమయ్యెను. అందువలననే వారు ఇంద్రియములను నిగ్రహించి తపస్సుచేయుట సంభవమయ్యెను. పిదప బ్రహ్మ సృష్టిచేయఁదలంచుకొని చుట్టును చూచినంతనే సూక్ష్మభూతములయందు చలన మారంభ##మై అవి పరస్పరసమ్మేళనమున స్థూలభూతములుగా రూపొందెను. ఆస్థూలభూతములతో ఆయన జగత్తును సృష్టించెను. కావున స్థూలభూతములు బ్రహ్మయొక్క వీక్షణముచేతనే సిద్ధము లయ్యెను. అంతకు పూర్వము లేవు. అందువలననే ఆయనకు అవి మొదట కన్పింపలేదు. ఆయనయే వానికి కర్త.

''సృష్టియొక్క ఆరంభమునందు ఆదేవి చైతన్యరూపిణియై ప్రకాశించుచుండెను. అప్పుడు ఆమె ఒక్కతయే యుండెను. ఇతర మేదియు లేదు. అట్లున్న ఈశక్తి తనస్వాతంత్ర్యముచేత సృష్టిచేయుటకు ఉన్ముఖురాలు కాఁగానే ఇచ్ఛ కలిగెను'' అని దత్తగురువు చెప్పెను. దేవి చైతన్యరూపిణిగా ఉండె ననఁగా చైతన్య మొక్కటియే యుండి నన్నమాట. చైతన్యమే బ్రహ్మము లేక ఆత్మ. ''రెండవవస్తువు లేకుండ బ్రహ్మ మొక్కటియే మెదట ఉన్నది'' అని వేదము కూడ చెప్పుచున్నది. ఒక్కటిగానున్న వస్తువునుండి రెండవది ఎట్లు పుట్టును? ఆత్మనుండి ఆకాశము పుట్టె నన్నప్పుడు, అకాశము అంతకు పూర్వము అవ్యక్తముగా (Unmanifest) ఉండి అప్పుడు ప్రకాశించినదా (Manifest) లేక క్రొత్తగా పుట్టినదా? అది అంతకు పూర్వము లేక అప్పుడు పుట్టిన దనుట శాస్త్రవిరుద్ధము. అభావమునుండి లేక శూన్యమునండు వస్తువుపుట్టదు. (A thing can not come out of nothing) ఉన్నది నశింపదు. లేనిది పుట్టుదు (నాసతో విద్యతే భావో నాభావో విద్యతే పతః) అట్లయినచో ఆకాశము అంతకు ముందే ఉండి సృష్టియారంభమున ప్రకాశించిన దని చెప్పవలె. అట్లయినచో ఆత్మ అద్వితీయముగ ఒక్కటిగా నున్న దని చెప్పుట కుదురదు. కావున ఆత్మ ఒక్కటే యున్నది. ఆకాశము దానితో సమానమైన రెండవవస్తువు కాదు. అది అద్దములో ప్రతిబింబమువలె ఆత్మయందు తోఁచుచున్నది. ప్రతిబింబము అద్దముకన్న భిన్నముగా ఒకవస్తువు ఎట్లు కాదో అట్లే ఆకాశము కూడ ఆత్మకన్న భిన్నముగా వేఱొక వస్తువుకాదు. ఆకాశమునకేవస్తుత్వము లేనప్పుడు దానినుండి పుట్టినట్లుగా తోఁచుచున్న తక్కిన భూతములకు వాని గుణములకు కార్యములకు వస్తుత్వము (Reality) సంభవమే కాదు. ఇంద్రజాలములో చెట్టు యథార్థమైన వస్తువు కానప్పుడు దానియందు కన్పించు ఆకులు కొమ్మలు పూలు పండ్లు అన్నియు మిథ్యయే కదా! కావున ఆత్మ యొక్కటే యున్నది. అదియే దృక్కుదానియందే జగద్రూపమైన దృశ్య మంతయు తోఁచుచున్నది. ఎన్ని ప్రతిబింబములు ఎట్లు మాఱుచున్నను అద్దమునకు మార్పులేనట్లు. దృశ్యమైన జగత్తు ఎట్లు మాఱుచున్నను దృక్కు మాఱదు. ఆదృక్కు లేక ఆత్మయే మనయందు ''నేను'' అని స్ఫురించుచున్న చైతన్యము. ఆ చైతన్యమునకు తనయందు ప్రతిబింబించుచున్న జగత్తుతో సంసారముతో ఎప్పుడును ఎట్టి సంబంధమును లేదు. అందువలన మనయాత్మ నిత్యశుద్ధము, నిత్యముక్తము. అది ఎప్పుడును సంసారముచేత బద్ధము కాలేదు. ''నేను సంసారముచేత బద్ధుఁడనై యున్నాను. ఇంకను ముక్తుఁడను కాలేదు'' అని యనుకొనుటయే అజ్ఞానము. ''నేను ఎప్పుడును బద్ధుఁడను కాను. ఎల్లప్పుడును ముక్తుఁడనే. ఆనందమే నాస్వరూపము'' అని రూఢముగా తెలిసికొని ఆస్థితియం దుండుటయే జీవన్ముక్తి. ఇదియే సకలశాస్త్రమునకు సారము. తాను మార్పునొందక తనయందు జగత్తును భాసింపఁజేయుచున్న ఆత్మయొక్క శక్తియే దాని స్వాతంత్ర్యము. జగత్తుచేత ఎప్పుడును కొంచెము కూడ ప్రభావితము కాకుండుటయే అత్మకు స్వాతంత్ర్యము. ఆత్మయే త్రిపుర. త్రిపురయే హ్రీమ్‌.

గద్య: కౌండిన్యసగోత్రుఁడు ఆపస్తంబసూత్రుఁడు పోలూరి నరసాంబా నారాయణామాత్య పుత్రుఁడు అయిన హనుమజ్ఞానకీరామ శర్మచే రచింపఁబడిన బాలప్రియవ్యాఖ్యాసమేతమైన త్రిపురారహస్య జ్ఞానఖండసారము సమాప్తము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters