Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పదునొకండవయధ్యాయము- జగత్స్వభావనిరూపణము

అద్భుతమైన హేమచూడుని కతను విని భార్గవరాముఁడు తనకు తోఁచిన సందేహములను దత్తాత్రేయునితో నిట్లు చెప్పెను. ''భగవానుఁడా! నీవు చెప్పిన యీజ్ఞానము మహాద్భుతముగా నున్నది. కాని ఇది అనుభవమునకు విరుద్ధముగా అసాధ్యముగా నాకు తోఁచుచున్నది. దృశ్యముగా కన్పించుచున్న యీజగత్తు అంతయు దృక్కు మాత్రమే ఎట్లగును? ఇట్లే లోకములో కన్పించుటలేదు. చూచుచున్నవాఁడు వేఱుగా వానిచే చూడఁబడుచున్న దృశ్యములైన పదార్థములు వేఱుగా కన్పించుచున్నవి. మీరు చెప్పునది కేవలము మీయందున్న శ్రద్ధచేత నమ్మవలసియున్నది, దృశ్యమును వదలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికిని అనుభవమునందు లేదు. ఇది ఏవిధముగాను సహేతుకముగా కుదురుట లేదు. ఇది మనస్సున కెట్లు పట్టును? దీనిని మీరు సకలవిధముల దయతో బోధింపవలయును.''

దత్తగురువు ఇట్లనెను. ''భార్గవా! దృశ్యముయొక్క తత్త్వమును చెప్పెదను వినుము. మనకు కన్పించుచున్న యిది యంతయు మనయొక్క దృక్కే; దానికన్న భిన్నముగా లేదు. దీనికి హేతువును చెప్పెదను శ్రద్ధతో వినుము, మనము చూచుచున్న ప్రతిపదార్థము ఏదో నొక కారణమునుండి పుట్టి కార్య మగుచున్నది. మట్టి కారణము దానినుండి పుట్టినకుండ కార్యము. క్రొత్తగా కన్పించుటయే పుట్టుట. మట్టియే కుండయొక్క ఆకారముతో క్రొత్తగా కన్పించినప్పుడు కుండపుట్టిన దనుచున్నాము. ఇట్లు పదార్థములు ప్రతిక్షణము క్రొత్తగా కన్పించుచుండుటవలననే జగత్తు భాసించుచున్నది. కుండ కన్పించినప్పుడు కుండయొక్క ఆకారము, అందులో రేగుపండ్లు కన్పించి నప్పుడు వానియొక్క ఆకారము వలన మన విజ్ఞానమునందు రూపొందుచున్నవి. అసలు మన విజ్ఞానము అఖండము(Undivided) ఏకరూపము అని, దానియందు ప్రతిక్షణము క్రొత్తగా భాసించుచున్న పదార్థములయొక్క ఆకారములవలన ఈజగత్తు మనకు ఇట్లు కన్పించుచున్న దని కొంద ఱందురు. మట్టియందు కుండ చట్టిమూకుడు మొదలుగా ఎన్ని పదార్థములను మనము క్రొత్తగా చూచుచున్నను మట్టి మట్టిగానే అఖండముగా ఏకరూపముగా ఎట్లున్నదో అట్లే విజ్ఞానము నందు కూడ ఎన్ని యాకృతులు తోచినను మన విజ్ఞానము మాత్రము ఎప్పుడును అఖండముగ ఏకరూపముగనే యుండును.

మఱికొందఱు స్థిరములు చరములు అను పదార్థములయొక్క సముదాయమే జగత్తు అని చెప్పుదురు. ఆకాశము మొదలగు పదార్థములు స్థిరములు. కుండలు మొదలగునవి చరములు.

ఎట్లు చెప్పినను మొత్తముమీఁద ఈజగత్తు పుట్టుక కలదియనుట నిశ్చితము. ఈవిషయమున, కారణముతో సంబంధము లేకయే కార్యము పుట్టు నని, అట్లే పుట్టుటయే దానిస్వభావ మని జగత్తు కూడ అట్లే కారణము లేకుండ, దానిస్వభావముచేతనే పుట్టు చున్నదని, కొందఱు చేయుచున్నవాదము సమంజసము కాదు. ఎందువల్ల ననఁగా మట్టి అనుకారణముతో సబంధము లేకుండ కుండ పుట్టు నని చెప్పుచో, మట్టినుండి వస్త్రము కూడ పుట్టవచ్చు నని చెప్పవలె, అట్లు చెప్పుట కుదురదు. మఱియును మట్టియున్నప్పుడే కుండ ఏర్పుడుట, మట్టి లేనప్పుడు కుండ ఏర్పడ కుండుటయు ప్రసిద్ధిమే. కావున కారణము లేకుండ కార్యము పుట్టదు. ''మఱి ఒక్కొక్కప్పుడు ఆకస్మికముగా శుభములు అశుభములు వచ్చిపడుచున్నవి. వానికి ప్రత్యక్షముగా ఏదియు కారణముగా కన్పింపదు. అట్టియెడల కారణము లేకుండ కార్యము పుట్టదు అని చెప్పుట పొసఁగదు'' అని స్వభావవాదిఅన్నచో ఆమాట నిలువదు. ప్రాయికముగా ప్రతికార్యమునకు మనకు తగినకారణము కన్పించుచుండఁగా, ఎక్కడేన ఒకానొక కార్యమునకు కారణము కన్పింపకున్నచో, అది మనకు తెలియకపోయినను ఉన్న దనియే చెప్పవలెఁగాని లేదనుటకు వీలు లేదు. శరీరముపై గడ్డ లేచినపుడు దానికి కారణమైన రక్తదోషము మనకు కన్పింపదు. అయినను గడ్డనుబట్టి దానికారణమును గ్రహించుచున్నాము. అట్లే శుభమో అశుభమో వచ్చినప్పుడు దాని కిప్పుడు కారణము మనకు కన్పింపకున్నను పూర్వమెప్పుడో చేసిన పుణ్యమె పాపమో కారణముగా ఉన్న దని గ్రహింపవలె. అది కన్పింపనంతమాత్రమున లేదని చెప్పుటకు వీలులేదు. అదియును గాక లోకములో ఎల్లరును తగిన కారణముల నవలంభించి కార్యములను సాధించుకొనుచున్నారు. రాజుసేవ చేసినవాఁడు రాజువలన సంపదలను పొందుచున్నాఁడు. ఎక్కడేని ఒకానొకఁడు అట్లు పొందకుండినచో కారణమైన సేవ సమగ్రముగ లేదని చెప్పవలె. అట్లు కాక కార్యమునకు తగినకారణము ఉండ నక్కఱ లేదన్నచో లోకప్రవృత్తియే కుదురదు. కావున కారణము లేకుండ ఆకస్మికముగా ఏకార్యమును పుట్టదు; జగత్తులో ప్రతిది సకారణముగా పుట్టునే కాని నిష్కారణముగా పుట్టదు. అందువలన స్వభావవాదము అసమంజసము.

కొందఱు జగత్తు అనుకార్యము పరమాణువులవలన పుట్టు నని ఇట్లు చెప్పుచున్నారు. అత్యంతసూక్ష్మములై అగోచరములైన పరమాణువులు సృష్టికి పూర్వమున శక్తిమంతములై స్థిరములై యుండును. సృష్టియొక్క ఆరంభమునందు పరిపక్వమైయున్న జీవుల కర్మయొక్క సహకారముతో ఈశ్వరుని యిచ్చవలన ఆపరమాణువుల యందు క్రియ (Movement or Action) ఆరంభమగును. ఆక్రియ వలన రెండేసి పరమాణువులు (Atoms) ఒక్కొక్క జంటగా సంయుక్తము లగును. ఆద్వ్యణుకములలో(Molecules of two atoms) మరల ఈశ్వరుని యిచ్ఛవలననే క్రియ ఆరంభమగును. అప్పుడు మూఁడేసి ద్వ్యణుకముల సంయుక్తములై త్రసరేణువులు (Component of three molecules or six atoms) రూపొందును. కిటికీలో నుండి ప్రసరించు సూర్యకిరణములందు గోచరించు సూక్ష్మకణములను (Particles of matter) త్రసరేణువు లందురు. అట్టి త్రసరేణువుల సంయోగమువలన క్రమముగా నీరు నిప్పు మొదలుగా జగత్తులోని సకలపదార్థములు రూపొందుచున్నవి. కావున పరమాణువులు కారణముగా ద్వ్యణుకముల మొదలైనకార్యములు పుట్టుచున్నవి. కారణములైన పరమాణువులకన్న కార్యములైన పదార్థములు భిన్నములు. నశించినతరువాత పదార్థములు కుందేటి కొమ్ములవలె అత్యంతము అసత్తు లగును. (Non existent)

ఈపరమాణువాదము కూడ సమంజసము కాదు. కుండ పుట్టక పూర్వము మట్టి ఉన్నది. కుండ తాను పుట్టక పూర్వము లేదు నశించిన తరువాత లేదు. కావున అసత్తు. దానికి కారణములైన మట్టి పరమాణువులు అసత్తు కాదు. సత్యమైన పరమాణువులనుండి అసత్యమైన కుండ ఎట్లు పుట్టును? ఒకపదార్థమునందే కుండ ఉండుట లేక పోవుట అను విరుద్ద ధర్మముల ఎట్లుండును? తెల్లగానున్నవస్తువు నల్లగా కూడ ఉండు ననుట అసంబద్ధము కదా! వెలుఁగు చీఁకటి ఒకటి కానేరవు. అట్లు విరుద్ధధర్మములు ఒక పదార్థమునందే యుండునన్నచో ఇంక ఏపదార్థముకూడ తనకు సోంతమైనధర్మముతో ప్రత్యేకముగ నుండునని చెప్పుటకు వీలుండదు. కావున పరమాణువులవలన వానికన్న భిన్నమైన కార్యము పదార్థముగా పుట్టునని చెప్పుటకు వీలులేదు. మఱియును పరమాణువులు అచేతనములు. వానియందు ఈశ్వరునియిచ్ఛవల్ల క్రియ ఎట్లే కలుగును? లోకములో ఎవనియిచ్ఛా మాత్రముచేతనే ఏయచేతనపదార్థమునందును క్రియ పుట్టుట లేదు. అట్టిది సంభవమే యైనచో రాజుయొక్క ఇచ్ఛామాత్రముగనే ఆయన యొద్ద నున్న యాయుధములు బయలుదేరి పోయి శత్రువులను సంహరించి తిరిగి రావలసియుండును. కావున ఈశ్వరుని యిచ్ఛవలన పరమాణువులందు సృష్టి ఆరంభ మగుననుటయు యుక్తముగా లేదు.

మఱికొందఱు ఇట్లు చెప్పుచున్నారు. సత్త్వరజస్త మోగుణములయొక్క సామాన్యవస్థయే(State of equilibrium) ప్రకృతి. అదియే ఆగుణములయందు కలుగునట్టి వైషమ్యమువలన, అనఁగా హెచ్చుతగ్గులవలన, జగత్తుగా పరిణమించుచున్నది. ఈపరిణామవాదము కూడ యుక్తము కాదు. ప్రకృతి జడము. దానియొక్క సామ్యావస్థయందు వైషమ్యము కలుగుటకు హేతు వేమి? అట్లే ప్రళయము సంభవించినపుడు అవైషమ్యము పోయి సమస్థితి కలుగుటకు హేతువేమి? లోకములో బండి యంత్రము మొదలుగా అచేతనము లను చేతనుఁడు నడపుట కలదు. గాని, అచేతనము తనయంతట తాను మార్పు నొందుట ఎచ్చటను లేదు. కావున జడమైనప్రకృతి జగత్తునకు కారణ మనుట కుదురదు.

ఇంక జగత్తనకు కారణమును నిశ్చయించుటకు వేదమే ప్రమాణము కాని ఇతరము కానేరదు. మనకు జ్ఞానము కలిగించుటలో మొదటి ప్రమాణము ప్రత్యక్షము, ఇంద్రియములవలన ''ఇది యిల్లు, వీఁడు రాముఁడు'' మొదలుగా సన్నిహితములైన విషయములనుగూర్చి మనము పొందు జ్ఞానము ప్రత్యక్షము. అజ్ఞానములలో ఒకదానినిబట్టి వేఱొకవిషయములను ఊహించి పొందుజ్ఞానము అనుమితి. పొగ ప్రత్యక్షముగా కన్పించుచున్నప్పుడు ఆపొగయున్న ప్రదేశమున నిప్పు ఉన్న దని యూహించుట అనుమితి. ఈరెండు ప్రమాణములను జగత్తుయొక్క కారణమును గ్రహించుటకు ఉపయోగింపవు. జగత్తుయొక్క ఆరంభము ఎవని యింద్రియములకును సన్నిహితము కాదు. అందువలన జగత్తుయొక్క కారణము మనకు ప్రత్యక్షము కాదు. అందువల్ల ప్రత్యక్షముమీఁద ఆధారపడిన యనుమానప్రమాణము కూడ దానిని గ్రహించుటకు సాధనము కానేరదు. కావున ఈశ్వర ప్రవర్తితమైన వేదమే ప్రమాణముగా మనము దానిని గ్రహింపవలసియున్నది.

జగత్సృష్టియొక్క ఆరంభమునందు ఈశ్వరుఁడున్నాడనుట కేమి ప్రమాణమున్నది? లోకములో ప్రతికార్యము చేతనుఁడైన కర్తవలననే ఏర్పడుచున్నది. అట్లే జగత్తు కూడ చేతనుఁడై న కర్తవలననే ఏర్పడుచున్న దని గ్రహింపవచ్చును. జగత్తు సామాన్య కార్యము కాదు. అది అచింత్యము(Unimaginable). అట్టి జగత్తునకు కర్తయైన యీశ్వరుఁడు అచింత్యమైనశక్తి(Unimaginalble power) కలవాఁడే యగును. ఆయనయొక్క వాక్కులే వేదములు. వానివలననే మనము తత్త్వమును తెలిసికోవలయును. ఆయన సర్వశక్తిమంతుఁడు సర్వజ్ఞుఁడును అగుటచే వేదములు సకలశాస్త్రములలో శ్రేష్ఠములు. అవి ఏయితరప్రమాణములచేతను కుంటుపడవు. అట్టి వేదములందు సృష్టికి పూర్వము మహేశ్వరుఁ డొక్కఁడే యుండినని, ఆయన తనస్వాతంత్ర్యముయొక్క మహిమవలన పదార్థముతో (Matter) పనిలేకుండా తనస్వరూపమునందే విలాసముగా జగత్తు అను చిత్రమును భాసింపఁజేసె నని చెప్పఁబడియున్నది. స్వప్నమునందు మనకొకదేహము కల్పింపఁబడుచున్నది. అప్పడు ఆదేహమే నేను అని వ్యవహరించుచున్నాము. అట్లే మేల్కొనియున్నప్పుడు కూడ మనస్సు ఏవో ఊహలు చేయుచున్నప్పుడు ఆయూహాలోకములనందు కూడ మన కొకదేహము ఏర్పడుచున్నది. అప్పుడు కూడ ఆదేహమే నేను అని వ్యవహరించుచున్నాము. ఆవిధముగానే పరమేశ్వరుఁడు కూడ విలాసముగా తాను భాసింపఁజేయుచున్న జగత్తు తానుగా వ్యవహరించుచున్నాఁడు. మనకు ఊహాలోకములో కన్పించుచున్న శరీరము స్వస్నములో ఉండదు; స్వప్నములో కన్పించుచున్న శరీరము జాగ్రత్తులో ఉండుట లేదు. కావున ఆశీరీరములు మనస్వరూపము కావు. అట్లే పరమేశ్వరునకును విలాసకల్పితమైన యీజగత్తు ప్రళయమునందు ఉండదు. కావున ఇది ఆయనకు స్వరూపము కాదు. ఎన్ని దేహములు మాఱుచున్నను ఆదేహముల నన్నింటిని చూచుచున్న దృక్కు మాత్రమే నీస్వరూప మైనట్లు, విలాసమాత్రమైన యీజగత్తు ప్రళయములో నశించినపుడు మిగిలియుండు దృక్కు మాత్రమే పరమేశ్వరునకు కూడ స్వరూపము. ఆదృక్కునందే ఆయనచేత ఈజగత్తు ఒక చిత్రముగా భాసింపఁజేయఁబడుచేన్నది. సృష్టికి పూర్వము దృక్కు తప్ప రెండవది ఏదియును లేదు, అట్టియెడ జగత్తు అనునీచిత్రము దృక్కునందు తప్ప ఎచ్చట భాసించును? దృక్కే చైతన్యము. అది లేకుండ ఎప్పుడైనను ఎక్కడైనను ఏదియైనను ఎట్లుండును? ఒకచోట ఎచ్చట నైనను నీవు చైతన్యము లేదని చెప్పుదువేని ఆప్రదేశ##మే ఉండదు. ఎందువల్ల నఁనగా చైతన్యమువలననే సకలమునకు ఉనికి(Existence), ప్రకాశము (Appearance) కలుగుచున్నవి. నీకును పరమేశ్వరునకును స్వరూపమై సర్వవ్యాపకముగా నున్న చైతన్యము లేదని ఎట్లుచెప్పగలవు? కావున పరమము (Supreme)కేవలము (Absolute) అయిన యాచైతన్యమే సకల జగత్తుయొక్క ఉనికికి ఆధారమై (Cause of the existence of the universe) సర్వవ్యాపకమై (All pervading) పూర్ణమై (Indvisible whole) ప్రకాశించుచున్నది. సముద్రము లేకుండ తరంగములు, సూర్యుఁడు లేకుండ ఎండ ఎట్లుండదో అట్లే చైతన్యము లేకుండ జగత్తు ఉండదు. ఎవనియందు ఈజగత్తు భాసించుచున్నదో ఆమహాదేవునకు శుద్ధచైతన్యమే (Pure consciousness)స్వరూపము.

సృష్టికి పూర్వము ఆమహాదేవుఁడే ఉన్నాఁడు, చరాచరమైన యీజగత్తు ఆయనవలననే పుట్టి ఆయనయందే ఉండి తుదకు ఆయన యందే విలీన మగుచున్నచి. ఇది వేదములయందు ప్రసిద్ధమైన విషయము. ప్రత్యక్షముగాఁ గాని ఊహచేతఁ గాని తెలిసికొనుటకు సాధ్యముగాని విషయములందు మనకు వేదమే ప్రమాణము. సర్వజ్ఞుఁడైన యీశ్వరునిచే చెప్పఁబడినదగుటచే మనకు అగోచరములైన సకలవిషయములందును ఆవేదమే ప్రమాణము. దానిని కాదసఁగలిగినది మఱియొకటి లేదు. ఎందువల్ల ననఁగా మణులు మంత్రములు మొదలగువానియొక్క మహాఫలములనుగూర్చి అల్పమైన ప్రజ్ఞకల మానవుఁడు తెలిసికొనలేఁడు. సమస్త జగత్తునుగూర్చి మానవుల ప్రజ్ఞకు అగోచరములైన విషయములను బోధించుచున్న వేదము సర్వజ్ఞుఁడైన యీశ్వరునిచేతనే చెప్పఁబడినదనుట నిశ్చితము, ఈ జగత్తుయొక్క సృష్టికి పూర్వము దేవుఁ డొక్కఁడే యుండెనని, పూర్ణము(Complete) స్వచ్ఛము(Natural, not obtanied from any cause) అయిన స్వాతంత్ర్యము(Power of freewill) కలవాఁడగుటచే, ఆదేవుఁడు ఏద్రవ్యము లేకుండఁగనే సమస్త జగత్తును సృష్టించెను. కుమ్మరివానికి కుండచేయుటకు మట్టి కావలసినట్టు. ఆయనను ఏద్రవ్యము అక్కఱలేదు.

చైతన్యరూపమైన తనయందే ఆయన గోడమీఁద బొమ్మను వలె ఈజగత్తును భాసింపఁజేసెను. ఈశ్వరుఁడు అంతటను నిండి పూర్ణుఁడై యండుటచేత ఆయనకు భిన్నముగ వెలుపల వేఱొకతావులేనేలేదు. కావున ఈజగత్తు ఆయనయందే భాసించుచున్నది. చైతన్యమే ఆయన అగుటచే ఆయనకు భిన్నముగా ఎచ్చటను ఏదియు ప్రకాశించుటకు వీలు లేదు. అద్దమునందు ప్రతిబింబమువలె ఈజగత్తు ఆయనయందు కన్పించుచున్నదనుట సర్వవిధముల సమంజసము. ద్రవ్య మేదియు లేకుండఁగనే సంకల్పమాత్రముచేతనే యోగి పదార్థములను ఎట్లు సృష్టించుచున్నాఁడో ఈశ్వరుఁడును అట్లే తనయందు జగత్తును భాసింపఁజేయుచున్నాఁడు. కావున ఈసృష్టి దేవునియొక్క సంకల్పనగరముతో సమాన మనుట ఎల్లరకును సమ్మతము. భార్గవా! దీనిని నీయనుభవనమును అనుసరించి కూడ విచారింపుము నీవు ఆలోచించునప్పుడు నీమనస్సునందు ఎంతోమంది వ్యక్తులు, వారిచేత గ్రహింపఁబడుచున్న యెన్నో పదార్థములు గోచరించుచున్నవి. అది యొకలోకమే కదా! ఆలోకమునదు స్త్రీలు పురుషులు నదులు కొండలు మొదలుగా ఎన్నియో భేదములు కన్పించుచుండును. ఎన్ని భేదము లున్నను ఆలోక మంతయు కేవలము మనోమయమే(Absoulutely a phase of the mind). మనస్సునందు పుట్టి, అందే ఉండి, దానియందే లీనమగుచున్న యాయాలోచనాప్రపంచము అంతయు కేవలము మనోరూపమే. అట్లే శివునియందు పుట్టి అందే ఉండి ఆయనయందే లీనమగుచున్న యీప్రపంచము కూడ కేవలము శివరూపమే, చైతన్యమే శివునిరూపము, చైతన్యమునకు శరీరము లేదు.

త్రిపుర అనంతశక్తి సర్వసాక్షిణి అని చెప్పఁబడుచున్న యా చైతన్యము అంతటను నిండి పూర్ణముగానున్నది. దానియందు విభాగములు లేవు. లోకమున కాలముచేత దేశముచేత విభాగములు ఏర్పడును. ఆకారముచేత ఏర్పడునది దేశము. క్రియచేత ఏర్పడునది కాలము. పొడవు వెడల్పు వైశాల్యము వర్తులత్వము మొదలగు లక్షణములతో ఏర్పడునాకారమే దేశము. రాముఁడు పుట్టెను. పుట్టు చున్నాఁడు పుట్టగలఁడు అను క్రియలయొక్క భావనచేత ఏర్పడునదికాలము. ఆకారము క్రియ అను రెండును చైతన్యమునే ఆశ్రయించియున్నవి. చైతన్యమును వదలినచో అవి ఉండుట (Existence) మనకు కన్పించుట (Appearence) జరుగదు. అట్టి ఆకారాత్మకమైన దేశము, క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైనచైతన్యమునందు విభాగములను ఎట్లు కల్పింపఁగలవు? చైతన్యములేని దేశము కాని కాలము కాని ఏదైనా కలదా? చెప్పుము. ఎక్కడ నీవు చైతన్యము లేదని చెప్పుదువో అది అస లెట్లుండును? పదార్థములకు అస్తిత్వము(Existence) చైతన్యము వలననే కలుగుచున్నది; మఱిదేవివలనను కాదు. చైతన్యమే చితి దృక్కు అని పెక్కుపేర్లతో చెప్పఁబడుచున్నది. అది లేనిచో ఏపదార్థమునకు కూడ ప్రకాశముండదు. జడములు స్వయముగా ప్రకాశింపవు. అవి చితివలననే ప్రకాశించుచున్నవి. సకలమును ప్రకాశింపఁజేయుచున్న యాచితి స్వయముగా ప్రకాశించుచు స్వతంత్రముగా నున్నది.

''అస్తిత్వమునకు (Existence) ప్రకాశమునకు (Appearence) సంబంధ మేమున్నది? ఒకవస్తువు ఉండవచ్చును; అది మనకు కన్పింపకపోవచ్చును'' అని నీవు అడుగవచ్చును. సమాధానము వినుము. మనకు ప్రకాశింపని పదార్థము, అనఁగా మనకు తెలియని పదార్థము కూడ ఉండు నని యొప్పుకొన్నచో, మనకు కన్పించుచు ఉన్న వస్తువునకు, లేని వస్తువునకును భేద మెట్లు చెప్పఁగలవు. ఒకపదార్థము మనకు కన్పించుచున్నప్పుడు అది ఉన్న దనుచున్నాము. వేఱొకటి మనకు కన్పింపనప్పుడు దానిని లేదనుచున్నాము. నీవు చెప్పినట్లుగా కన్పింపనిదానిని కూడ ఉన్నదని చెప్పవలె నన్నచో, ''ఇది ఉన్నది; అది లేదు'' అను వ్యవహారము ఎట్లు జరుగును. ఒక చోట నారింజపండు ఉన్నది. అది కన్పించినప్పుడు ''ఇదిగో నారింజపండు ఉన్నది'' అనుచున్నాము. అప్పుడు మామిడిపండు కన్పింపకుండినచో''మామిడిపండు లేదు'' అను చున్నాము. ''మనకు ఇప్పుడు మామిడిపండు కన్పింపకపోయినను ఇంకొకచోట ఉండదా?'' అన్నచో ఆమాట నిలవదు. ఇప్పడు నారింజపండునకు ఉన్నయస్తిత్వము ఇక్కడ మామిడిపండునకు లేదు. ఈనారింజపండు ఉండి మనకు కన్పించి మనచేత అనుభవింపఁబడుచున్నది. మామిడిపండు మనచేత అనుభవింపఁబడుట లేదు మనకు కన్పించుటకూడ లేదు. కావున ''నారింజపండు ఉన్నది. మామిడిపండు కూడ ఉన్నది'' అని ఎట్లు చెప్పగలవు? అదియును గాక నీకు ప్రకాశింపనిది, అనఁగా నీకు తెలియనది, చెప్పుమన్నచో ఎవవఁడై నను చెప్పగలఁడా? అనఁగా నీకు ఏది తెలియదో అది నీకు లేదు. అది తెలిసినవారికి ఇతరులకు ఉన్నను నీకు లేదు. ఎవనికి ఉది ఉన్న ను వానికి తెలిసియే యుండును. అనఁగా పదార్థము ముందుగా మనజ్ఞానమునందు ప్రకాశించి తరువాత ఉన్నవిగా వ్యవహారమునకు ఉపయోగపడుచున్నది. కావున పదార్థములయొక్క అస్తిత్వము (Existence) ప్రకాశము (Appearance) రెండును జ్ఞానముపైననే ఆధారపడి యున్నవి. జ్ఞానమే చితి. చితివలననే పదార్థములకు అస్తిత్వము ప్రకాశము కలుగుచున్నవి. కావున ప్రతిబింబములయొక్క అస్తిత్వము ప్రకాశము. దర్పణము యొక్క అస్తిత్వముకన్న ప్రకాశముకన్న ఎట్లు భిన్నము కావో, అట్లే పదార్థములయొక్క అస్తిత్వము చితియొక్క ప్రకాశముకన్న భిన్నముకాదు. అట్లే చితియే జగత్తుయొక్క అస్తిత్వము. అందువలన సర్వము చితియే.

చితియే సర్వమైనచో అదియే భాసింపవలె కాని, చెట్టు గోడమొదలుగా వివిధములైన యాకారములు ఎట్లు భాసించుచున్నవి? ఆ చితిలోని నిర్మలత్వముయొక్క మహిమవలననే ఈయాకారములన్నియు అందు భాసించుచున్నవి. అద్దము యొక్క కఠినత్వముచే నిర్మల త్వముచేతను దానియందు ప్రతిబింబము లేర్పడుచున్నవి. ఆరెండు గుణములయొక్క హెచ్చుతగ్గులచేత ప్రతిబింబములు స్పష్టముగా నుండుట అస్పష్టముగా నుండుట ఏర్పడుచున్నది. నిర్మలమైన జలమునందు కాఠిన్యము లేకుండుటచే ప్రతిబింబము అస్పష్టముగా నుండును. నిర్మలత్వము అసలే లేకుండుటచే గోడయందు కాఠిన్యము బొత్తిగా లేకుండుటచే ఆకాశమునందును ప్రతిబింబము ఏర్పడుటలేదు. అద్దము జడము అస్వతంత్రము అగుటచేత దానికన్న భిన్నముగా పదార్థము లున్నప్పుడే అవి దాని యందు ప్రతిబింబంచును. పదార్థము లేకున్న అద్దమును ప్రతిబింబము లుండవు. కాని సర్వవ్యాపకము స్వతంత్రమును అయిన చితి అద్దమువంటిది కాదు. దానికి తనకున్న భిన్నములైన పదార్థములతో పనిలేదు. స్వప్నమునందు మనస్సులోనే జరుగుసంఘటనమువలె, చితి తనయందే జగత్తును ప్రకాశింపఁజేయుచున్నది. అద్దము మొదలుగా అన్నింటిలోకన్నను చితియందు నిర్మలత్వము కఠినత్వము అధికముగా నున్నవి. పదార్థములు అవయవముల సముదాయముచే రూపొందును. అప్పుడు అవయవముల మధ్యలో ఇతర పదార్థముల యవయవములు చేరినచో మాలిన్యమేర్పడును. అద్దముపై దుమ్ముచేత మాలిన్య మేర్పడుచున్నది. అవయవముల కూర్పుయొక్క గాఢతను బట్టి(Closeness) పదార్థములయొక్క కఠినత్వము ఏర్పడును. అవయవముల కూర్పుయొక్క గాఢతచేతనే రాయి కఠిన మగుచున్నది. ఆకూర్పు విరళ మగుట చేత నీరు పల్చగా నున్నది. చితి ఆకాశమువలె సదా నిర్మలము అఖండము ఏకరూపమై ఆవయవములులేని దగుటచే దానియందున్న నిర్మలత్వము కఠినత్వము అనుగుణములు అన్ని పదార్థములలో కన్న అధికముగా నున్నవి. అందువలన చితియందు జగత్తు అద్భుతమైన చిత్రముగా ప్రతిబింబించుచున్నది.

మనకు ప్రత్యక్షముగా కన్పించుచున్న యీజగత్తు ప్రతిబింబమెట్లగును? అసలు ప్రతిబింబ మనఁగా నేది? అద్ద మున్నప్పుడు దానియందు ఎదురుగా ఉన్నకలశముయొక్క ప్రతిబింబము ఏర్పడును. అద్దము లేకున్నచో కలశప్రతిబింబము ఉండదు. కావున తాను స్వయముగా భాసింపక ఇతరముయొక్క సంబంధముచేత భాసించునట్టిది అనఁగా ఏర్పడునట్టిది ప్రతిబింబము. జగత్తు స్వయముగా భాసింపక చితివలననే భాసించుచున్నది. అందువలన అద్దములో ప్రతిబింబము వలె చితిలో జగత్తు ప్రతిబింబముగా ప్రకాశించుచున్న దనుట సమంజసము. అద్దమునుందు ఎన్నివిధములైన పదార్థముల వర్ణములు భాసించుచున్నను ఆరంగు లేవియు కొంచెముకూడ అద్దమునకు అంటుకొనవు. దానిస్వరూపమునందు ఎప్పుడును మార్ప కలుగదు. అట్లే జగత్తులోని విశేషము లేవియు కొంచెము కూడ చితికి అంటుకొనవు. దాని స్వరూపమునందు ఎప్పడును మార్పు కలుగదు. ప్రతిబింబములు అద్దముకన్న భిన్నముగా ఎట్లుండవో అట్లే జగత్తు కూడ చితికన్న అన్యముగా లేదు. బింబమైన పదార్థము కారణముగా అద్దమున ప్రతిబింబము ఏర్పడుచున్నది. కాని చితియొక్క స్వాతంత్రమే కారణముగా చితియందు జగత్తుయొక్క ప్రతిబింబము ఏర్పడుచున్నది. స్వాతంత్ర్యమువలన ప్రతబింబ మేర్పడునా అని శంకింపకుము. భార్గవా! చూడుము. నీసంకల్పమువలన నీమనస్సునందే ఎన్నోభావములు ప్రతిబింబించుచున్నవి. వానికి బింబములైన పదార్థములు ఎక్కడ నున్నవి? అద్దమున వస్తువులు ప్రతిబింబించుటకు సూర్యుని వెలుఁగు కాని దీపపుకాంతి గాని ఏదోనొకటి యుండవలె. అట్టి వెలుఁగుతో నిమిత్తము లేకుండనే నీమనస్సునందు భావములు ప్రతిబింబించుచున్నవి. కావున వెలుపలి పదార్థముతో దేనితో నిమిత్తము లేకుండనే చిదాత్మయందు జగత్తు ప్రతిబింబించుచున్నది.

చిదాత్మకు స్వాతంత్ర్య మనుశక్తి యున్నది. ఆశక్తివలన అత్యంతము సూక్ష్మమైన యాచిదాత్మ స్థూలమై దృశ్య మగుచున్నది. అట్లు కాఁగలిగిన స్వాతంత్ర్యమే చితియొక్క సంకల్పము. నీయొక్క స్వాతంత్ర్యమే సంకల్పరూపమై నీమనస్సునందు అనేకభావములను ఎట్లు ప్రతిబింబింపఁజేయుచున్నదో అట్లే చిదాత్మయొక్క స్వాతంత్ర్యమే సంకల్పరూపమై జగత్తును భాసింపఁజేయుచున్నది. సంకల్పములేని దశయందు చిదాత్మ ప్రతిబింబరహితమై స్వచ్ఛముగ ఏకరూపముగ చిన్మాత్రముగ నుండును. ఇట్లు సృష్టికి పూర్వము విశుద్ధముగ ఏకరూపముగనున్న చిదాత్మకు గొప్పస్వాతంత్ర్యశక్తి ఉండెను (Potentially existent) అదియే సంకల్పమై దానివలన ప్రతిబింబాత్మక మైన జగత్తు చిదాత్మయందు భాసించుచున్నది. అట్లయినచో మన సంకల్పమువలన మనమనస్సునందు కలుగుచున్న భావములు ఎట్లు అస్థిరములుగా నున్నవో అట్లే చిదాత్మయొక్క సంకల్పరూపమైన జగత్తు కూడా ఆస్థిరమగునా? చిదాత్మయొక్క సంకల్పశక్తి అత్యంతము గొప్పది యగుటచే ఆజగత్తు కూడ సుస్థిరముగా భాసించుచున్నది. మనసంకల్పమువలన కలిగిని భావములు మనమనస్సులందే తోఁచును కాని యితరులకు తోఁపవు. ఎవరిభావములు వారివిగా నుండును. అవి అందఱకు సాధారణములుగా (Common to all) నుండవు. మన స్వాతంత్ర్యము సంకల్పము అపూర్ణము లగుటయే (Incomplete) ఇందులకు హేతువు. చిదాత్మయొక్క స్వాతంత్ర్యము సంకల్పము పరిపూర్ణము లగుటచే వానివలన భాసించుచున్న జగత్తు కూడ ఎల్లరకును సాధారణముగా (Common to all) కన్పించుచున్నది.

జీవులలో కూడ కొందఱయందు ఈస్వాతంత్ర్యము హెచ్చుగా కన్పించుచున్నది. మణులు మంత్రములు మొదలగువానిచేత మనస్సుయొక్క సంకోచము (Limitedness) తగ్గుకొలఁది స్వాతంత్ర్యము పెరుగుచుండును. ఆస్వాతంత్ర్యముయొక్క ఆధిక్యముచేత వారు గావించు సృష్టియు పులువురకు సత్యముగా భాసించుచున్నది. భార్గవా! ఇందజాలికుని చూడుము. వాడు పదార్థ మేదియు లేకుండనే సంకల్పమువలననే గుఱ్ఱములు ఏనుఁగులు మొదలగువానితో ఒకప్రపంచమును భాసింపఁ జేయుచున్నాఁడు. అది అందఱకును సాధారణమై (Commonly visible) స్థిరమై గజము నారోహించుట గుఱ్ఱముపై స్వారిచేయట మొదలగు వ్యవహారములు కలది యగుచున్నది. ఆ ప్రపంచము అతఁడు మరల తనయందు ఉపసంహరించుకొనచున్నాఁడు. ''నేను చిదాత్మను'' అని తెంపులేకుండ అభ్యసించు చున్నట్టి యోగికి ఈస్వాతంత్ర్యశక్తి ఇంకను హెచ్చుగా నుండును. అట్టి యోగులయొక్క సృష్టిని చూడుము. అది ఇంద్రజాలముకన్నను పూర్ణమై స్థిరమై యొప్పుచున్నది. కాని వారియొక్క స్వాతంత్ర్యము కూడ పరిమితమే (Limited). అందువలన వారిసృష్టికూడ వారికి వెలుపలనే గోచరించుచున్నది. చిదాత్మయొక్క స్వాతంత్ర్యము అపరిమితము (Unlimited) అగుటచే జగత్తు అంతయు చిదాత్మయందే పూర్ణముగా స్థిరముగా వ్యవహారరూపముగా భాసించుచున్నది. కావుననే అద్దమునకు భిన్నముగా ప్రతిబింబమునకు ఎట్లు సత్యత్వము లేదో అట్లే చిదాత్మకు భిన్నముగా జగత్తునకు సత్యత్వము లేదు.

చక్కఁగా విచారించినప్పుడే జగత్తు అసత్యమని తెలియును. మఱి యేసాధనముచేతను తెలియదు, ఎప్పటికిని మాఱనిది సత్యము. ఎప్పటి కైనను మాఱునది అసత్యము. ఈదృష్టితో జగత్తును చూడుము. ఇది అతిచంచలము. అద్దములోని ప్రతిబింబముయొక్కదృష్టాంతము ననుసరించి సకములనందును సత్యాసత్యములను విభజించి గ్రహింపుము. అద్దము అచలము. దానిలోని ప్రతిబింపము చలము. ఇప్పుడన్న ప్రతిబింబము కొంచెము సేపటికి ఉండదు. అట్లే జగత్తు నిరంతరము మాఱుచుండును. కాని దాని కాధారమైన చిదాత్మకు మార్పు లేదు. కావుననే జగత్తులోని పదార్థముల సత్యత్వము విచారించినచో నిలువదు. చూడుము. సూర్యునికాంతి వస్తువులను ప్రకాశింపఁజేయును గదా! ఆవెలుఁగులో గుడ్లగూబలకు వస్తువులు కనఁబడవు. చీఁకటిలో గుడ్లగూబలకు వస్తువులు కన్పించుచుండఁగా మనుష్యులకు కనఁబడవు. అట్టియెడల వస్తువులను ప్రకాశింపఁజేయునది వెలుఁగు అని చెప్పుదువా? చీఁకటి అని చెప్పుదువా? ఇట్లే ఒకనికి విషమైనది మఱియొకనికి ఆహార మగుచున్నది. పర్వతములు సముద్రములు గమనమునకు ప్రతిబంధకములై మనుష్యులకు భయమును కలిగించుచున్నవి. కాని యోగులకు గంధర్వులకు అవి ప్రతి బంధకములు కావు. మనుష్యులకు దీర్ఘముగా కన్పించు దేశము కాలము యోగులకు దేవతలకు స్వల్పముగా కన్పించుచున్నది. కావున విచారించినచో జగత్తు యొక్క స్వభావము ఏవిషయమునందును స్థిరము (Constant) కాదు. ఆశ్రయమైన చిదాత్మలేక జగత్తులో ఏదియు లేదు. ఏది జగత్తులో ఉన్న దని కన్పించుచున్నదో అద యంతయు చితియే. ఈవిధముగా చితికి లేక దృక్కునకు అన్యముగా చేత్యము లేక దృశ్యము లేదని నిరూపింపఁబడినది.

జ్ఞానఖండమునందు జగత్తుయొక్క స్వభావనిరూపణ మన్నది ఏకాదశాధ్యాయము.

బాలప్రియ

హేమలేఖ హేమచూడునకు తత్త్వమును బోధించుచు తుదకు ఇట్లు నిశ్చయించి ఉపదేశించెను. ''కన్పించుచున్న జగత్తు నేను కాదు అన్న భేదగ్రంథిని కూడ ఖండింపుము, అద్దములో ప్రతిబింబమును వలె అఖిలమును నీస్వరూపమునందే చూడుము.'' విశాలనగరము నందలి పంజరములలోని చిలుకలు కూడ దృశ్యమును వదలి ద్కక్స్వరూపమైన యాత్మను పొందుఁడు. ''ప్రతిబింబము అద్దముకన్న భిన్నముగా ఎట్లు లేదో అట్లే దృక్కునందు ప్రతిబింబించుచున్న దృశ్యము కూడ దృక్కునకు భిన్నముగాలేదు. దృక్కే దృశ్యముగా కన్పించుచున్నది.'' అని పలుకుచుండె నని దత్తాత్రేయుఁడు చెప్పెను.

ఇది విని పరశురాముఁడు గురువు నిట్లుప్రశ్నించెను. ''దృశ్యముగా కన్పించుచున్న యీజగత్తు అంతయు దృక్కు మాత్రమే ఎట్లగును?..... చూచుచున్నవాఁడు వేఱుగా వానిచే చూడఁబడుచున్న దృశ్యములైన పదార్థములు వేఱుగా కన్పించుచున్నవి. దృశ్యమును వదలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికిని అనుభవమునందు లేదు.''

ఈసందేహమునకు సమాధానముగా దత్త గురువు దృగ్దృశ్యములతత్త్వమును అనేకవిధముల వివరించెను. దానిసారము నిట్లు గ్రహింపవచ్చును. దృక్కు అనఁగా కంటిచూపు మాత్రమే కాదు. గ్రహించునది దృక్కు; దానిచే గ్రహింపఁబడునది దృశ్యము. ''ఇది మామిడిచెట్టు'' అని చెట్టును చక్షురింద్రియము గ్రహించుచున్నది. ''ఈసంగీతము మధురముగా నున్నది'' అని శబ్దమును శ్రోత్రేంద్రియము గ్రహించుచున్నది. అందువలన చెట్టు దృశ్యము చక్షుస్సు దృక్కు అగుచున్నది. అట్లే శబ్దము దృశ్యము దానిని గ్రహించుచున్న శ్రోత్రము దృక్కు అగును. ఈవిధముగా ఇంద్రియము లన్నియు దృక్కులు, వానిచేత గ్రహింపఁబడుచున్న విషయము లన్నియు దృశ్యము లగుచున్నవి. ''వెనుక చూపు బాగుండెను. ఇటీవల చూపు మందముగా నున్నది. ఇప్పుడు అస లేమియు కన్పించుట లేదు'' అని చక్షురింద్రియముయొక్క విశేషములను మనస్సు గ్రహించుచున్నది. అట్లే ''రుచులలో సూక్షభేదములను కూడ జిహ్వ గ్రహించుచుండెను. ఇటీవల అంతగా రుచి తెలియుట లేదు, ఇప్పుడు బొత్తిగా రుచియే తెలియుట లేదు'' అని జిహ్వేంద్రియము యొక్క విశేషములను కూడ మనస్సు గ్రహించుచున్నది. అందువలన మనస్సు దృక్కు, దానిచేత గ్రహింపబడుచున్న యింద్రియములు దృశ్యము లగును. ''వెనుక నాబుద్ధి చాల చుఱుకుగా నుండెను. ఇటీవల మనస్సు బాగుగాలేక బుద్ధి మందగించినది. ఇప్పు డస లది పనిచేయుటయే లేదు'' అని మనస్సుయొక్క బుద్ధియొక్క విశేషములను మనము గ్రహించుచున్నాము. అప్పుడు మనస్సు బుద్ధి దృశ్యములై వానిని గ్రహించుచు మనయందున్న చైతన్యము దృక్కు అగుచున్నది. ''నేను'' అని మనయందు స్ఫురించుచున్న చైతన్యము దేనిచేతను గ్రహింపఁ బడుటలేదు. దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఎన్నిమార్పులను పొందినను, అది మాత్రము మార్పును పొందక ఆమార్పులను అన్నింటిని చూచుచు జాగ్రత్తు స్వప్నము నిద్ర బాల్యము కౌమారము వృద్ధత్వము మొదలుగా సకలదశలలో ఏకరూపముగనే స్ఫురించుచున్నది. కాఁబట్టి అది ఎప్పుడును దృక్కే. అది ఎప్పుడును దృశ్యము కాదు. తక్కిన వన్నియు దృశ్యములే.

కావున దృక్కు దృశ్యము అని ప్రధానముగా రెండు పదార్థములే యున్నవి. ఈరెండింటికిని అవినాభావసంబంధ మున్నది. అనఁగా దృక్కు లేకున్నచో దృశ్యము ఉండదు. కాని దృశ్యము లేనప్పుడ కూడ దృక్కు ఉండును. ''చెట్టు ఉన్నది'' అన్నమాట ఎవఁడో ఒకఁడు ఒకచెట్టును చూచినప్పుడే చెప్పుట సంబవించును. ఎవఁడును ఏచెట్టును చూడనప్పుడు ఆమాటయే పుట్టదు. కావున ఎవఁడు ఏవిషయము నైనను ''ఉన్నది'' అని చెప్పినప్పుడు, ''అదిముందు వానిచేత గ్రహింపఁబడి తరువాత ఉన్నది'' అన్నమాట. అనఁగా ఏది మనచేత గ్రహింపఁబడదో అది మనకు ఉండదు. ''నీకు తెలియని వస్తువును చెప్పుము'' అన్నచో ఎవఁడును చెప్పలేఁడు. ఎవడు ఏది చెప్పినను తనకు దెలిసినదానినే చెప్పును; తెలియనిదానిని చెప్పలేడు. ఒకవస్తువు మనకు తెలియకున్నంతమాత్రమున అసలదిలేకుండ పోవునా? ఉండవచ్చును. ఎవఁడు దానిని తెలిసికొను చున్నాఁడో వాని కది యుండును. నీకు తెలియనంతవఱకు అది నీకు లేదు. ఒకఁడు తల్లితో తండ్రితో భార్యతో పుత్రినితో కూడి కొండపైకి పోవుచున్నాఁడు. పులివలె ఒకమృగము వానికి దూరమున కన్పించినది. వాఁడు వెంటనే భయముతో వణఁకుచు మూర్ఛిల్లినాఁడు. ఆక్షణమునందు వానికి తల్లి తండ్రి భార్య పుత్రుఁడు కొండ పులి మొదలుగా ఏదియును లేదు. ఎందువలన? ఆసమయమున దృక్కురూపమైన వానియొక్క చైతన్యమునందు ఇది ఏదియు ప్రతిబింబించుట లేదు. మూర్ఛనుండి తేఱుకొన్నంతనే మరల వానికి తల్లి తండ్రి మొదలుగా వ్యవహార మేర్పడుచున్నది. ఎందువలన? అప్పుడు దృక్కు రూపమైన వానిచైతన్యమునందు ఇది యంతయు ప్రతిబింబించుచున్నది. నిద్రలో సమాధిలో కూడ దృక్కు దేనిని గ్రహింపకుండుటచే దృశ్యమైన జగత్తు ఉండుట లేదు. కావునేసమయమునందైనను నీచేత గుర్తింపఁబడని లేదా గ్రహించపఁబడని జగత్తు నీకు లేదు. కావున నీకు దృశ్యమైన నీజగత్తు దృక్కుగా నున్న నీయందే యున్నది. ''నేను వేఱు జగత్తు వేఱు'' అని అనుకొనుట అనేక జన్మలుగా పేరు కొనియున్న అజ్ఞానముయొక్క ముడి అనుట స్పష్టము.

లోకములో మనుష్యు లందఱు దుఃఖమును తొలఁగించుకొనుటకు సుఖమును సంపాదించుకొనుటకు యత్నించుచున్నారు; అందులకై ప్రతికూలములైన విషయములను తొలఁగించుకొనుచు అనుకూల విషయములను సమకూర్చుకొనుచున్నారు. కాని సుఖము తనయందున్నదా విషసయములందున్నదా? రుచికరములైన పదార్తములు సుందరులైన యువతులు మొదలైన మొదలైన విషయములందు సుఖ మున్నచో అవి ఎప్పుడును సుఖమునే కలిగించుచుండవలె. కాని అవి యొకప్పుడు సుఖకరముగా నున్నను కొంతసేపైన తరువాత వానిని వదలుకొనుటయే సుఖ మగుచున్నది. చాలసేపు విషయములతో సుఖ మనుభవించిన తరువాత ఒకప్పటికి కన్నులు చూడవు; చెవులు వినవు; ఇంద్రియము లన్నియు స్థబ్ధత నొందును. అదే నిద్ర. ఆనిద్ర ఎంతగాఢముగా నున్నచో అంత సుఖము కలుగుచున్నది. అప్పుడు దేనివలన అంత సుఖము కలుగుచున్నది? మనోరూపముగానున్న చైతన్యము ఏదృశ్యమును గ్రహింపక దృక్కుమాత్రముగా ఉండుటచేత అంత సుఖము కలుగుచున్నది. సమాధియందు కూడ మనస్సు ఏదృశ్యమును గ్రహింపక దృక్కుగా నిశ్చలమగా ఉండుటచేతనే సుఖము కలుగుచున్నది. దృశ్యమైన జగత్తుతో సంబంధమున్నప్పుడు దుఃఖము దానితోపాటు కొంచెము సుఖము కలుగుచున్నది. దృశ్యమును వదలి దృక్కురూపముగా నున్నప్పుడు దుఃఖము అసలు లేకుండుటయే కాక మహాసుఖము కలుగుచున్నది. కావున ''దృశ్యమును వదలి మీస్వరూపమైన దృక్కునే భజింపుఁడు'' అని విశాలనగరమున చిలుకలు పలుకుచుండుట సమంజసముగానే యున్నది.

''లోకములో ఎవనియిచ్ఛామాత్రముచేతను ఏయచేతన పదార్థమునందును క్రియ పుట్టుట లేదు .... కావున ఈశ్వరుని యిచ్ఛవలన పరమాణువులందు సృష్టి ఆరంభ మగు ననుట యుక్తముగా లేదు'' - దీనిని సిద్దాంతముగా గ్రహింప నక్కఱలేదు. కేవలము సంకల్పము యొక్క బలముచేతనే కొందఱు దూరముగానున్న అచేతనపదార్థములయందు కదలికను కలిగింపఁగలిగియున్నారు. అట్టియెడల పరమేశ్వరుఁడు సంకల్పమాత్రముచేత అచేతనములైన పరమాణువులయందు క్రియను కలిగించుట అసంభవము కాదు. అట్లు ఈశ్వరుని సంకల్పమువలన సృష్టిక్రియ సంభవించుచున్నప్పుడు ఆసృష్టికిపరమాణువు లతో పనియే లేదు. ఆయన పరిమితమైనశక్తి గల కుమ్మరివంటివాఁడు కాడు. కుమ్మరి మట్టి లేకున్నచో కుండను సృష్టింపలేఁడు. ఇంద్రజాలికులు యోగులు పదార్థము లేకుండనే ఎంతో సృష్టిచేయుచున్నారు. ఇంక అనంతశక్తి కలిగిన పరమేశ్వరునకు సృష్టిచేయునపుడు పరమాణువులతో పని యేమున్నది? కావున పరమాణులు స్వయముగా సృష్టిని ఆరంభింపలేవు. ఈశ్వరుఁడు సృష్టిని ఆరంభింపవలసివచ్చినచో ఆయనకు పరమాణువులతో పని లేదు, అని చెప్పుటయే పై వాక్యమునకు తాత్పర్యము.

''అట్టి యాకారాత్మకమైన దేశము క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు ఎట్లు విభాగములను కల్పింపఁగలవు?'' కుండ చట్టి మొదలగువానివలన వానికి ఆధారమైన మట్టి యందు, ఇంతవఱకు ఈమట్టి కుండయైనది. ఇంతవఱకు ఈమట్టి చట్టి యైనది. అని విభాగము లేర్పడు చున్నవి. అట్లే నిన్న అది జరిగినది, ఇప్పుడు ఇది జరుగుచున్నది, రేపు మరియొకటి జరుగును, అని ఆక్రియలచేత వాని కాధారమైన మనభావనయందు విభాగము లేర్పడుచున్నవి. కావున దేశము కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు కూడ విభాగములను ఏర్పఱచు నని ఏల చెప్పరాదు? అనుసందేహము కలుగవచ్చును. కాని చైతన్యము మట్టివంటిది మసభావనవంటిది కాదు. అది అఖండము (Undivided) అద్వితీయము (Only one without a second) అనిక్రియము (Unchangeable) కావున దానియందు ఎట్టియాకారము ఏర్పడుదు. అందువలన దేశవి భాగము లేదు. అట్లే దానియందు ఏక్రియ కూడ సంభవము కాదు. అందువలన కాలవిభాగము ఏర్పడదు. ఈకారణముచేత దేశకాలములు చైతన్యమునందు విభాగములను ఏర్పఱుపఁజాలవు.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters