Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

దశమాధ్యాయము-హేమచూడుని జీవన్ముక్తి

అట్లు సమాధిస్థితి నొందియున్నభర్తను చూచి ఆతనిని కదలింపకుండ హేమలేఖ ప్రక్కన కూర్చుండి యుండెను. అతఁడు కొంత సేపటికి కనులు తెఱచి ప్రియురాలిని జగత్తును చూచెను. కాని అతఁడు మరల ఆసమాధిస్థితిలోనికి పోయివిశ్రాంతిసుఖమును పొందవలయునని తొందరపడుచు కనులు మూసికొనుచుండెను. అప్పుడుహేమలేఖ నవ్వుచు ఆతనిపై చేయివైచి తనవైపు త్రిప్పుకొని మధురముగా నిట్లనెను ''నాథా! నీవు ఏమి నిశ్చయించుకొంటివో చెప్పుము. కనులు మూసికొనుటవలన లాభముకాని తెఱచుటవలన నష్టము కాని ఏమి కలుగుచున్నదో చెప్పుము. కనులు తెఱచినప్పుడు నీవు పొందకున్నది యేది? కనులు మూసికొనినప్పుడు పొందుచున్న దేమి? నీస్థితి ఏమోచెప్పుము.''

అప్పు డాతనికి ఆమెతో మాటాడుటకు కూడ ఇష్టము లేకుండెను. వెంటనే సమాధిసుఖమును పొందవలయు నను తొందఱతో నుండి ఆలస్యమును భరింపలేక మదమత్తునివలె ఇట్లనెను. ''ప్రియురాలా! చిరకాలమునకు నేను అత్యంతమైన విశ్రాంతిని పొందితిని దుఃఖభూయిష్ఠమైన యీబాహ్యప్రపంచమునందు ఎక్కడను నాకు విశ్రాంతి లేదు. పిప్పియైన చెఱకుముక్కను నమలినట్లుగా రుచిలేని యీప్రపంచవ్యవహారము ఇంక చాలును. దౌర్భాగ్యముచేత అంధుఁడైన ఇప్పటివఱకును ఆత్మసుఖము నెరుంగనైతిని. తన యింటి యందే పెద్దలు నిక్షేపించిననిధిని ఎఱుంగంక ఒకఁడు భిక్షాటనము చేసెనఁట. అట్లే నేనును నాయందేయున్న సుఖసముద్రమును తెలిసికొనక దుఃఖపరంపరలతో సంకీర్ణమైనయున్న విషయసుఖములకొఱకు ప్రాకులాడుచుంటిని. మెఱపుతీగవలె క్షణములో మాయమగునట్టి సుఖములను కోరుచు దుఃఖములచేత కొట్టఁబడుచు విశ్రాంతిని పొందకుంటిని. అహో ఏమి యీజనులవర్తనము. వీరు సుఖ మేదియో దుఃఖమేదియో కూడ తెలిసకొనలేక నిరంతరము సుఖమును కోరుచు దుఃఖములను ప్రోవుచేసుకొనుచున్నారు. ప్రయత్నపూర్వకముగా దుఃఖమును తెచ్చుకొని అనుభవించుట ఇంక చాలును. ప్రియురాలా! నీకు అంజలిచేసి ప్రార్థించుచున్నాను. నాయందు దయచూపుము. సుఖ రూపమైన నాయాత్మయందు చాల విశ్రాంతిని కోరుచున్నాను. నన్ను కదలింపకుము. నీవు ఆత్మానందము నెఱింగియు దానియందు మిశ్రమింపక దుఃఖమును కలిగించు వ్యవహారమందు ఉండుటను చూడఁగాదైవహతురాల వని (Unfortunate) తో ఁచుచున్నది.

ఆమాటలు విని హేమలేఖ మందహాసముతో నిట్లెనెను. ''నాథా! పరమపావనమైన యాత్మపదము నీకు తెలియలేదు. ఆత్మస్థితియందుండి అది తప్ప వేఱమియు లేదని రూఢిగ నెఱింగిన పండితులుకనులు మూసికొన్నచో ఒకవిశేషము తెఱచినచో ఇంకొక విశేషము కలుగు నని భ్రాంతి నొందఱు. నీవు కొంచెము తెలిసికొంటివి. తెలిసి యా కొంచెము తెలియనిదానితో సమానముగా నున్నది. ఆత్మ పదము కనులు మూసికొనుటచేఁగాని తెఱచుటచేఁగాని గోచరించునదికాదు. అట్లే ఒకపని చేయుటవలనఁగాని చేయకుండుటవలనఁగాని, ఒకతావునకు పోవుటవలనఁగాని పోకుండుండుటవలనఁగాని అది లభించునది కాదు. ఒకపని చేసియో లేక చోటికి పోవుటవలననో మన మొకదానిని పొందినచో అదిపూర్ణ మెట్లుగును? మనకంటి ఱప్పలు ఎనిమిదివడ్లగింజలు వరుసగా పేర్చినచో ఎంత పొడవుండునో అంతపొండవుగా కూడ నుండవు. అట్టి యీఱప్పలు తెఱచినంతనే అంతర్థానము నొందునట్టి యాత్మ పూర్ణవస్తు వగునా? అహో! నీకు ఎంత భ్రాంతి కలిగినది! కోట్లకొలఁది బ్రహ్మాఁడములు దేనియందొకమూల నొదిగియున్నవో అట్టి పూర్ణమైన యాత్మ అంగుళము పొడవు కూడ లేని కనుఱప్పలు తెఱచుటవలన మాయ మగునా?

తత్త్వసారమును చెప్పెదను వినుము. గ్రంథులు తెగనంత వఱకు ఎవనికి సుఖము కలుగదు. మోహము అను త్రాడునందు కోట్లకొలఁది ముడులున్నవి. స్వరూపము నెఱుంగకుండయే మోహమనుత్రాడు. వస్తుస్థితికి విరుద్ధముగా మనము చేయుభావనలే అముడులు. దేహేంద్రియాదులను ఆత్మగా తలంచుచుండుట మొదటిముడి. ఈదేహాత్మబుద్ధి అను ముడివలననే ఈసంసారము అనివార్యముగా సిద్ధిమగుచున్నది. అట్లే జగత్తు వేఱు నేను వేఱు అనుతలంపు మఱియొకముడి. ఈవిధముగానే జీవుఁడు వేఱు ఈశ్వరుఁడు వేఱు, ఒక జీవునకన్న మఱియొక జీవుఁడు భిన్నుఁడు-మొదలైన తలంపులన్నియు ముడులే. స్వరూపము నెఱుంగకుండుట అను నీయజ్ఞానము అనాదికాలమునుంలడియు త్రాడువలె ఏన్నో మెలికలు తిరిగి ముడులుపడి పురుషుని చుట్టుకొనియున్నది. ఆముడులు విచ్చిపోయి ఆత్రాడు జాఱి పోయినచో పురుషుఁడు ముక్తుఁడగును. నీవు కనులు మూసికొని దేనిని పొందుచున్నావో అది నీస్వరూపమే. ఆదియే శుద్ధమైనజ్ఞానము. దానికి పైది ఏదియులేదు. అదియే సకలప్రపంచము ప్రతిబింబించుటకు ఆధారమైన యుద్దముగా నున్నది. అది ఎచ్చట ఎప్పుడు ఏరూపమున లేదో చెప్పుము. ఏప్పుడైనను ఏరూపముతో నైనను ఎందైనను నీ నిజరూపమైన సామాన్యచైతన్యము లేదని నీవు చెప్పుదువేని ఆకాలము ఆదేశము ఆపదార్థము గొడ్రాలి బిడ్డవలె లేనివేఅగును. ఎందువల్ల ననఁగా అద్దము లేకుండ ప్రతిబింబములు ఎట్లుండవో అట్లే చైతన్యము లేకుండ ఏపదార్థము ఉండదు, ప్రకాశింపదు. చైతన్యమును వలననే జగత్తు అంతయు భాసించుచున్నది. చైతన్యమును వదలినచో ఎచ్చటను ఏదియును భాసింపదు. అట్టి సర్వవ్యాపకమైన చైతన్యము నీవు కనులు తెఱచినంతమాత్రముగ మాయమగునా

''నేను చిత్తనిరోధముచేత ఆత్మను తెలిసికొనుచున్నాను'' అని నీవు ఎంతవఱకు తలంచుచుందువో అంతవఱకు ఆయభిమానమే ఒక గ్రంథిగా రూపొంది గట్టిపడును. ''ఆత్మ నాస్వరూపముగా నాకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నది'' అని నీకు తోఁచువఱకు ఆయాత్మ పదము నీకు ప్రాప్తింపనట్లే. కనులు మూసికొని గాని తెఱచి గాని ఏపదమును పొందితి నని తలంచుచున్నావో అది పూర్ణమైన(All pervading) పదము కాదు. ఎందువల్ల ననఁగా నీవు చిత్తమును నిరోధించినపుడు ఆసమయమున అది నీలోపలనే భాసించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లే కదా! ఒకక్రియచేత ఒకసమయమునందు ఒకచోటనే ప్రకాశించునట్టిది పూర్ణ మెట్లగును? ప్రళయకాలాగ్ని జ్వాలవలె ప్రకాశించుచున్న యామహాచైతన్యము ఎక్కడ లేదు? కాలాగ్ని జ్వాల ఎట్లు ప్రతిపదార్థమును తనదిగా చేసికొనునో అట్లే మహాచైతన్యము కూడ సకలజగత్తును తనదిగా చేసికొని దానికి స్వరూపముగా నున్నది. ఆచైతన్యమును గ్రహించినచో నీకు చేయవలసినపని ఏదియు నుండదు. ''నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూచుచున్నాను'' అన్న యీయభిమానగ్రంథిని ఛేదింపుము. ''కన్పించుచున్న యీజగత్తు నేను కాదు'' అన్న భేదగ్రంథిని కూడ ఖండింపుము. అఖండమైన యానందరూపముగా నున్న యాత్మను ఎల్లయెడలను చూడుము. అద్దములో ప్రతిబింబమునువలె అఖిలమును నీస్వరూపము నందే చూడుము. ''ఎల్లయెడలను సర్వమునను నాస్వరూపమే చూచుచున్నాను'' అని ముందు నిశ్చయింపుము. ఆనిశ్చయుమునందు రెండు భాగములు కలవు. ''సర్వము నాస్వరూమే'' అనుభావన మొదటిది. దానిని భావించుచున్న నీవు రెండవభాగము. భావనారూపమైన మొదటిభాగమును వదలి దానిని భావించుచున్న నీస్వరూపమైన సామాన్యచైతన్యమును అవలంబించి దానిని వదలకుండ స్వస్థుఁడవు కమ్ము.''

హేమలేఖ చెప్పినది గ్రహించి హేమచూడుఁడు భ్రాంతిరహితుఁడై సర్వవ్యాపకమైన తనపూర్ణస్వరూపమును తెలిసికొని క్రమముగా ఆభావనయందు స్థిరత్వము నొందెను. అంతకు పూర్వము ''దేహమే నేను'' అని దేహముతో తాదాత్మ్యము ఎంత దృఢముగా నుండెనో, అంత దృఢముగానే ''కేవలచైతన్యమే నేను'' అని చైతన్యముతో తాదాత్మ్యము (Identification) ఏర్పడెను. పిమ్మట నతఁడు హేమలేక మొదలైన యువతుల సముదాయముతో విహరించుచు శత్రువులను జయించి రాజ్యమును పాలించుచు శాస్త్రములను వినుచు ఇతరులకు వినిపించుచు ధనములను సంపాదించుచు అశ్వమేధము రాజసూయము మొదలైన మహాయజ్ఞములను చేయుచు ఇరువది వేలసంవత్సరములు ఈలోకమున జీవన్ముక్తుఁడై యుండెను.

అట్లున్న హేమచూడుని చూచి తండ్రియగు ముక్తాచూడుఁడు. సోదరుఁడు మణిచూడుఁడును ఇట్లు అనుకొనిరి. ''ఏవిధముగాఁ జూచినను వీడు వెనుకటివలె కన్పించుటలేదే! వీఁడు సుఖము కలిగినప్పుడు పొంగిపోవుట లేదు; దుఃఖము కలిగినప్పుడు కృంగుటయు లేదు. వీఁడు ఎందువల్లనో లాభనష్టములను లెక్కపెట్టుట లేదు; శత్రువులకు మిత్రులకు భేదమును గణించుట లేదు. రంగస్థలమున నటునివలె వీఁడు రాజకార్యము లన్నియు నిపుణముగా నిర్వహించుచున్నాఁడు. మద్యముచేత మత్తు పొందినవానివలె ఎల్లప్పుడు పరధ్యానముతో ఏమియును పట్టించుకొనక తాను చేయవలసినకృత్యమును మాత్రము ఎంత వఱకు ఎట్లు చేయవలయునో అంతవఱకు అట్లు చేసి ఫలితమునుగూర్చి అనుకొనుటయే లేక వెడలిపోవుచేన్నాఁడు.'' ఇట్లు అనుకొనుచు వారిరువురు అతనిని ఏకాంతమునందు కలిసికొని ప్రశ్నించిరి. హేమచూఁడుడు వారికి జరిగిన వృత్తాంతమును క్రమముగా చెప్పి తనస్థితిని వివరించెను. అతని బోధనమువలన వారిద్ధఱు పరతత్త్వమును పొంది జీవన్ముక్తులైరి. అంతట మంత్రులు కూడ మహారాజువలన జగత్తుయొక్క స్థితిని గతిని ఆత్మయొక్క స్వరూపమును విచారించి తెలిసికొని జ్ఞానులైరి. ఈవిధముగా క్రమక్రమముగా విశాలనగరములో ఆబాలగోపాలముగా స్త్రీలు పురుషులు యువకులు వృద్ధులు దాసదాసీ జనములు కూడ ఒకరివలన ఒకరు ఉపదేశమును పొందుచు అందఱును తత్త్వమును తెలిసికొనిరి.

వారి కెవరికిని దేహాభిమానము లేకుండెను. బాలునకుఁ గాని వృద్ధునకుఁ గాని, వారికి తెలియకుండ, కామము క్రోధము లోభము కలుగుటయే లేదు. వారు తమకు కావలసినప్పడు కామక్రోధాదులను పొందుచు వ్యవహారమును జరుపుకొనుచుండిరి. తల్లి బిడ్డను తత్త్వమునకు సంబంధించినమాటలతో ఆడించుచుండెను. పరతత్త్వప్రసంగములతో దాసదాసీజనులు యజమానులను సేవించుచుండిరి. తత్త్వప్రసంగములు గల పాత్రలతో నటులు నాటకములను ప్రదర్శించుచుండిరి. వివేకమును బోధించుగీతములను గాయకులు గానముచేయుచుండిరి. విదూషకులు ఎల్లప్పుడును లోకవ్యవహారమును దూషించుచుండిరి. పరతత్త్వవిచారమునకు అర్హములైన యుదాహరణములతో విద్వాంసులు శాస్త్రములను శిష్యులకు బోధించుచుండిరి. ఈవిధముగా అచ్చట దాసదాసీజనములు నటులు విటులు భృత్యులు భటులు శిల్పులు వారాంగనలు కూడ తెలిసికొవలసిన తత్త్వమును తెలిసికొని అంతకు పూర్వము ఏర్పడియున్న సంస్కారములు బలముచేతనే వ్యవహారములను జరుపుకొనుచుండిరి. వారు జరిగిపోయిన శుభమును గాని అశుభమును గాని స్మరింపకుండిరి. అట్లే వారు జరుగుచున్న సంఘటనములనుబట్టి కలుగబోవు సుఖమును దుఃఖమును ఊహింపకుండిరి. సుఖమునో దుఃఖమునో అనుభవించుచున్నప్పుడు వారు నవ్వుచు సంతోషించుచున్నట్లు దుఃఖించుచున్నట్లు కోపించుచున్నట్లు వ్యవహరించుచు మద్యపానమత్తులవలె ఏదియు పట్టకుండిరి.

అట్లున్న విశాలనగరమునకు సనకాదిమహర్హులు వచ్చి చూచి, ''ఇది ప్రసిద్ధ విద్యానగరము'' అని కీర్తించిరి. అక్కడ పంజరముల యందున్న చిలుకలు ఇట్లు పలుకుచుండెను. ''దృశ్యమును వదలి దృక్స్వరూపమైన యాత్మను పొందుఁడు. ప్రతిబింబము అద్దముకన్న భిన్నముగా ఎట్లు లేదో అట్లే దృక్కునందు ప్రతిబింబించుచున్న దృశ్యము కూడా దృక్కునకు భిన్నముగా లేదు. దృక్కే దృశ్యముగా కన్పించుచున్నది. ఆదృక్కే నేను. అదియే చరాచరమైన సర్వముగా గోచరించుచున్నది. దృక్కువలననే సర్వము భాసించుచున్నది. కాని దృక్కు మాత్రము స్వతంత్రముగా భాసించుచున్నది. కావున జనులారా! భ్రాంతినివీడి సకలమునకు ఆధారమై సకలమును భాసింపఁజేయుచున్న దృక్కును దానియందే దృష్టకలవారై భజింపుఁడు.''

పక్షులు సైతము ఇట్లు పలుకుచుండు ఆపురమును ఇప్పటికిని ప్రసిద్ధ విద్యానగర మని చెప్పుచున్నారు. ఇట్లు హేమలేఖవలన వారు అందఱు జీవన్ముక్తు లైరి. కావున శ్రేయస్సును కలిగించుటలో మొట్టమొదటి సాధనము సత్సంగము. అందువలన శ్రేయస్సును కోరువాఁడు సత్పరుషులను ఆశ్రయించుటకే నిరంతరము ప్రయత్నించుచుండవలయును.

ఇది జ్ఞానఖండమున హేమచూడుఁడు జీవన్ముక్తుఁ డగుట యన్నది దశమాధ్యాయము.

బాలప్రియ

హేమచూడునకు జ్ఞానము కలిగిన ప్రకారము గమనింపఁదగి యున్నది. అతఁ డొక సామాన్యుఁడైన రాజపుత్రుఁడు. అతఁడు సజ్జనుఁడే కాని యతనికి తత్త్వమునుగూర్చి ఆలోచనయే లేదు. అతఁడు హేమలేఖయొక్క సౌందర్యమును చూచి ముగ్ధుఁడై ఆమెను ప్రేమించి పెండ్లిచేసికొని ¸°వనమునందు సహజముగా నుండు తీవ్రమైనయభిలాషతో ఆమెతో కూడి భోగములను అనుభవింపఁజొచ్చెను. ఆమెకు అట్టియభిలాష లేదు. ఆమె ఆత్మజ్ఞానమువలన నిరంతరము ఆనందరూపిణియై యుండెను. ఆమెయొక్క సహజస్థితి ఎట్టిదో అతనికి తెలియదు. ఎంతకాలము ఎంత గాఢముగ స్నేహముతో నున్నను సామాన్యులకు తమతో కూడియుండు వారియొక్క మహత్త్వము తెలియదు. శ్రీకృష్ణుఁడు పరబ్రహ్మ మని ఆయనతో కూడియున్న మిత్రులు గాని భార్యలు గాని పుత్రులు గాని ఎంతమంది గుర్తింపఁగలిగిరి? ''నేను నీకు శిష్యుఁడను; నన్ను శాసింపుము'' అని శరణాగతిచేసిన యర్జునుఁడు కూడ స్థితిప్రజ్ఞుఁడెన శ్రీకృష్ణుని చూచుచు''స్థితిప్రజ్ఞుడెట్లుండునో చెప్పుము'' అని ప్రార్థించెను. అర్జునునకు విషాదము కలుగకపోయినచో, శ్రీకృష్ణుఁడు తత్త్వమును ఉపదేశించపకున్నచో అర్జునుఁడు ఆయనయొక్క యథార్థమైన మహత్త్వమును ఎప్పటికిని గుర్తించియుండక పోవచ్చును. తత్త్వజ్ఞులు లోకమున సామాన్యులవలెనే వర్తించుచుందురు. తత్త్వమును ఎఱింగినవారు మాత్రమే ఆమహాయోగులయొక్క యథార్థస్థితిని గుర్తింపఁగలుగుదురు కావున హేమలేఖ జీవన్ముక్తురాలని హేమచూడుఁడు గుర్తింపలేకపోవుట సహజము.

హేమలేఖ అతనినిగూర్చి పట్టించుకొనక ఊరకున్నచో హేమచూడుఁడు తుదివఱకు అజ్ఞుడుగానే యుండియుండును. కాని తన్ను మిగుల ప్రేమించుచున్న యతనియందు ఆమెకు దయ కలిగెను. అందువలన ఆమె అతనికి ఆత్మజ్ఞానమును కలిగింప నెంచెను. అది ఆతని పూర్వపుణ్యఫలము. తెలిసికోవలయు నని యాదరముతో ఎదుటివాఁడు అడిగినప్పడే ఏవిషయము నైనను చెప్పవలయును కాని ఊరక చెప్పరాదు. తత్త్వమునుగూర్చి అసలే చెప్పరాదు. అట్లు చెప్పఁబూనినబాఁడు పరిహాసము పాలగును. అందువలన ఆమె ముందుగా ఆతని యందు ఆలోచనమును రేకెత్తింపఁజేయుటకై తనకు భోగములు యందు అభిలాషలేకపోవుటను అతఁడు గుర్తించునట్లు చేసినది. ఆమెకు ఆతలంపే లేకున్నచో, శ్రీకృష్ణుఁడు భార్యలతో క్రీడించినట్లు. ఆమె కూడా అతనితో సమానముగ భోగాభిలాష యున్నట్లే వర్తించియుండెడిది, కాని ఆమె అతనియందు ఆలోచనమును విమర్శను కలిగించుటకే తనకు భోగములయందు అభిలాష లేకుండుట అతనికి స్ఫురించునట్లు వర్తించినది. ''నీవు ఎందులకు భోగములయందు ఆసక్తిని చూపుట లేదు?'' అని అతఁడు అడిగినపుడు ఆమె ప్రియము ఆప్రియము అనువానినిగూర్చి చర్చ ఆరంభించి, అందమన్నది శరీరములయందు లేదని, మనకు అయావ్యక్తులయందున్న అభిమానమే అట్లు కన్పించుటకు కారణ మని నిరూపించినది. తుదకు ఆమె శరీరమునుగూర్చి ''ఇది నాడీసముదాయములయల్లికతో రక్తమాంసములు పూతతో చర్మముతో కప్పఁబడి గాదెవలె మలమూత్రములతో నిండియున్నది. ఇట్టి బీభత్సమైన శరీరమునందు మనుష్యులు ఆసక్తులగుచున్నా రన్నచో మలముపైకి ప్రాకుచున్న కృములకును వీరికిని భేద మేమున్నది?'' అని భోగములయెడ వైముఖ్యము కలుగునట్లు చేసినది.

ఇంతవఱకును జగత్తునుగూర్చి జీవితమునుగూర్చి విమర్మయే లేకుండ సాధారణ యువజనులవలె వర్తించుచున్న హేమచూడునకు ఈమాటలవలన మొదటిసారిగా విమర్శనాత్మకమైన యాలోచనము ఆరంభమయ్యెను. ఇది జీవన్ముక్తి అనునున్నతమైన సౌధమును చేరుటకు మొదటిమెట్టు. ఈమెట్టుపై నిలిచి ఆలోచింప మొదలు పెట్టఁగా అతనికి భోగవిషయము లన్నియు విరసములుగా తోఁపఁజొచ్చెను. కాని పూర్వవాసనలయొక్క బలముచేత వానిని వదలుకొనలేక వానివలన పూర్వమువలె సుఖమును పొందలేక హేమచూడుని మనస్సు కలఁత నొందెను. ఆతనియవస్థను ఆమె గ్రహించి నెమ్మదిగా అతనిని లాలించి, ''నీవు దిగులుపడుచున్నట్లున్నావు? కారణమేమి?'' అని యడిగెను. అప్పు డతఁడు సంకోచమును వీడి తన స్థితిని వివరించి, ''ఏమి చేసినచో నాకు సుఖము కలుగునో చెప్పుము'' అనెను.

అప్పు డామె తాను జీవన్ముక్తిని పొందినప్రకారమును సంకేతములతో గూఢముగ ఒకకథగా చెప్పెను. అది యతనికి అభూతకల్పనగా తోఁచి, ''నీవు దయ్యము పట్టినవానివలె మాటాడుచున్నావు'' అని అతఁడు ఆమెను పరిహసించెను. ఎదుటివారు చెప్పుచున్నది ఏమాత్రము ఆసమంజసముగా తోఁచినను దానినిగూర్చి ఆలోచింపకుండఁగనే వారి మాటలను తిరస్కరించుచుండుట మానవులకు సహజము. ఆప్తుల విషయమున ఇట్టితిరస్కారబుద్ధి పనికిరాదు. వారు చెప్పునది ఇప్పుడు సహేతుకముగా సమంజసముగా తోఁచకపోయినను కొంతకాలమునకు ఆమాటలయొక్క అభిప్రాయము తప్పక బోధపడఁగలదు అను విశ్వాసము గురువులయెడ శిష్యులకు అత్యంతము ఆవశ్యకము. అట్టి విశ్వాసము లేకున్నచో ఎంతటి గొప్ప యుపదేశ##మైనను ఫలింపదు. శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నిరూపించుటకొఱకు ఆమె యిట్టి గూఢమైన కథను చెప్పెను. ఆమె యూహించినట్లే అతఁడు పరిహసించెను. ఆతని పరిహాసము ఎంత అయుక్తమో ఆమె సహేతుకముగా నిరూపించి ''శుష్కమైన యంతులేని తర్కముతో ఎవఁడును శ్రేయస్సును పొందఁజాలఁడు. శాస్త్రానుకూలమైన తర్కముతో ఆప్తులవాక్యముల యందు శ్రద్ధతో నీకు దేవివలన శ్రేయస్సు కలుగునో నిశ్చించుకొనుము'' అని బోధించెను. అప్పటికి అతఁడు ఆమె ఏమి చెప్పినను అర్థరహితముగా అసమంజసముగా ఉండదు అని నమ్మి, ''నీవలన నేను ధన్యుఁడ నైతిని. దేనియందు శ్రద్ధ ఉంచవలయునో చెప్పుము'' అని యడిగెను. అప్పుఁ డామె, ''శ్రేయస్సును పొందుటకు వివిధ సాధనములుకలవు. వానిలో నీకు ఏది అన్నివిధముల సులభసాద్యమో అదియే నీకు ఉత్తమము. దానియందే నీవు శ్రద్ధవహింపవలె. సాధనము ఏది యైనను ఈశ్వరానుగ్రహము లేక ఫలింపదు'' అని చెప్పెను.

ఈప్రసంగమువలన అతఁడు, ''సంసారమునందు సుఖముకన్న దుఃఖమే అధికముగా నున్నది. ఇది వలదు. కేవల సుఖరూపమైన శ్రేయస్సే కావలె'' అను నిశ్చయమునకు వచ్చెను. ఇది రెండవమెట్టు ఈమెట్టుమీఁద నిలిచి యతఁడు, ''అట్లయినచో బ్రహ్మాది దేవతలలో ఎవనిని పరమేశ్వరునిగా ఆరాధింపవలె? నిశ్చియించి చెప్పు'' అని యడిగెను. అప్పడు డామె, ''పరమేశ్వరునకు రూపము లేదు. భక్తులు తన్ను ఏలోకమునందు ఏరూపము కలవానినిగా ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆరూపముతో ప్రత్యక్ష మగును. ఆయన చైతన్యమాత్రుఁడు. ఆచైతన్యరూపిణియే త్రిపురామహేశ్వరి. శివుఁడు విష్ణువు మొదలగు దేవతామూర్తులయందున్న చైతన్యశక్తి ఆమెయే.'' అని చెప్పెను.

అప్పు డతఁడు పెద్దలవలన త్రిపురాదేవియొక్క ఆరాధనదీక్షను గైకొని ఆమెను కొన్నిమాసములు ఉపాసించెను. ఈయుపాసనము మూఁడవమెట్టు. ఈయుపాసనమువలన దేవియొక్క అనుగ్రహము కలిగి ఆతనిమనస్సు పూర్తిగా భోగములనుండి విముఖమై ఆత్మవిచారమునందు ఆసక్త మయ్యెను.

ఒకనాఁ డతనికి ఆమె చెప్పినకథ స్మృతికి వచ్చెను. తనకు నిర్వేదము కలిగినప్పుడు ''ఏమి చేసినచో సుఖము కలుగునో చెప్పుము'' అని అతఁ డామెను అడిగెను. అప్పుఁ డామె ఆకథను చెప్పెను. ఆ కథలోని తాత్పర్యము కేవలసుఖరూపమైన శ్రేయస్సును పొందుటకు ఉపాయమై యుండవలె. కావున ఆమె నడిగి ఆయుపాయ మేదియో తెలిసికోవలె అనుతలంపుతో అతఁడు ఆమె యొద్దకు పోయెను. ఆమె ఎంతో అనురాగముతో ఆతనిని కౌఁగిలించుకొని ఆతనియెడఁఁబాటునకు ఖిన్నురాలైనట్లుగా నుండెను. దేవియొక్క అనుగ్రహముచేత పూర్తిగా భోగములయదు వైముఖ్యమును పొందియుండుటచే అతఁడు ఆమె యొక్క కౌఁగిటియందు కూడ నిర్వికారముగ నుండి, ''నేను నిన్ను శరణుపొందుచున్నాను'' అని నిస్సంకోచముగా ఆమెను గురువునుగా స్వీకరించి ఆకథయొక్క తత్త్వమును చెప్పుమని ప్రార్థించెను. అప్పటికి ఆతనికి సంపూర్ణమైన గురుభక్తి కలిగినది. ఇది నాల్గవమెట్టు. ఇది దేవియుపాసనకు ఫలము. అప్పు డామె, ''కేవలచైతన్యమే నా తల్లి. ఆమెతో నేను కూడియుండుటయే మోక్షము'' అని ఆకథయొక్క తాత్పర్యమును సంగ్రహముగా చెప్పెను. ఇది తత్త్వపదేశమున వినుట (శ్రవణము) అను నైదవమెట్టు.

విషయము నాతఁడు ఆమెవలన విన్నతరువాత దానినిగూర్చి ఆలోచించుచు, ''ఆచైతన్యరూపిణి యెవరు? ఆమెనుండి మన మెట్లు జన్మించితిమి? మనము ఎవరు?'' అని అడిగెను. అప్పుడామె, ''నీకు నీస్వరుపము తెలిసినచో ఆమెను కూడ తెలిసికొనఁగలవు. గోచరించుచున్న దేదియు నీస్వరూపము కాదు. కావున గోచరించుచున్న దానినంతను త్రోసివేసి, అట్లు త్రోసివేయుటకు వీలులేక ఇతరమును త్రోసివేయుటకు సాధనమై మిగిలియున్న జ్ఞానమును నీస్వరూపముగా గ్రహింపుము'' అని చెప్పెను. వెంటనేఅతఁడు ఏకాంతప్రదేశమునకు పోయి తనస్వరూపము ఏమి అని తీవ్రముగ ఆలోచించెను. ఇది మననము అనునాఱవమెట్టు.

ఇట్లు మననము చేయుచు అతఁడు తనచేత గుర్తింపఁబడుచున్న ప్రపంచము తనశరీరము, ప్రాణము, మనస్సు బుద్ధి మొదలుగా ఏదియు తనకు స్వరూపము కాదని గ్రహించెను. అయినను తన స్వరూప మేదో దాని నెట్లు గుర్తింప వీలగునో తెలియలేదు. ''ఆత్మ నాస్వరూపమే. కావున నాకు అది సదా ప్రాప్తించియే యుండవలె. అది సదా భాసించునదికూడ అయి యుండవలె. కాని ఇతర పదార్థములు ఏవో ఎప్పుడును భాసించుచుండుటవలన నాస్వరూపము భాసించుట లేదేమో! కావున మనస్సునందు ఏదియు భాసింపకుండునట్లు చేయుదును'' అని నిశ్చయించి అతఁడు చిత్త వృత్తులను నిరోధించెను. ఈచిత్తవృత్తి నిరోధమునే పతంజలిమహర్షి యోగ మని చెప్పెను. దీనిని నిదిధ్యాసన మనియు చెప్పవచ్చును. ఇది ఏడవమెట్టు. ధ్యానింపవలయు నని కోరుట దిధ్యాసనము. నిరంతరముగా ధ్యానించపవలయునని కోరుట నిదిధ్యాసనము. చిత్తవృత్తులను అన్నింటిని నిరోధించి, అనఁగా ఏవిషయమునుగూర్చియు ఆలోచింపకుండ స్వరూపమాత్రమున గ్రహించుటకై మనస్సును నిలిపివేయుట నిదిధ్యాసనము.

అతఁడు ఇట్లు చిత్తవృత్తిని నిరోధించినప్పుడు మొదట చీఁకటి తరువాత వెలుఁగు, పిమ్మట నిద్ర స్వప్నము అతనికి గోచరించెను. అవి కూడ మనస్సుయొక్క వృత్తులే కావున స్వరూపము కాదని మరల అతఁడు మనస్సును నిరోధించి శాంతిసుఖమును పొందెను. నిరోధమును వదలినంతనే ఆసుఖము తొలగి పోయెను. ఆసుఖము తనస్వరూప మగునో కాదో అతనికి తెలియలేదు. వెంటనే అతఁడు హేమలేఖను పిలిపించి తన యనుభవమును చెప్పి సంశయమును తీర్పుమనెను. అప్పు డామె ఇట్లు చెప్పెను. ''ఆత్మ మనస్వరూపమగుటచే మనకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నది. దానిని పొందుటకు చిత్త నిరోధము కారణము కాదు, ఏది మనచేత వేఱొకపదార్థమువలె పొందఁబడునో అది మనస్వరూప మెట్లగును? ఎంతవఱకు దానిని గూర్చి అన్వేషణము మననము జరుగుచుండునో అంతవఱకును దానియొక్క అనుభవము కలుగదు. మనస్సును నిద్రలోనికి పోకుండ నిలిపి, విషయములపై ప్రసరింపకుండ ఆపి, ''నాస్వరూపమును చూచుచున్నాను'' అనుతలంపుకూడ లేకుండ ఊరకుండుము. అదియే స్వరూపస్థితి.''

వెంటనే అతఁడు ఆమె చెప్పినట్లే చేసి స్వరూపస్థితిని పొంది చాలసేపు విశ్రాంతి నొందెను. ఇది విశ్రాంతి యను నెనిమిదవమెట్టు. ఈవిశ్రాంతిసుఖమును పొందినవారు అనేకులు ఇదియే ఆత్మసాక్షాత్కారమని అపరోక్షానుభూతి అని స్వరూపస్థితి అని భ్రాంతిపడి అందే నిలిచి పోవుచుందురు. ఆభ్రాంతిని తొలఁగింపవలయు ననుతలంపుతో హేమలేఖ ఆతనియొద్దనే యుండెను. ఆమె ఊహించినట్లే అతఁడు ఆసమాధిస్థితినుండి ఒకసారి వెలుపలికివచ్చి ఆమెను చూచియు ఆవిశ్రాంతి సుఖమును వదలుకొనుటకు ఇష్టములేక మరల సమాధిస్థితి నొందుటకై కనులు మూసికొనుచుండెను. నిద్రించుటకు వీలులేక పనిచేయుచు అలసిపోయినవానికి విశ్రాంతి లభించినంతనే నిద్ర ఎట్లు ముంచుకొనివచ్చునో, అట్లే చిరకాలము ఇంద్రియములవెంట పరువెత్తి పరువెత్తి అలసిపోయిన మనస్సునకు స్వరూపస్థితియందు కొంచెము విశ్రాంతి లభించినంతనే సుఖానుభూతి (Experience of happiness) సాధకుని ముంచి వేయును. గాఢనిద్రలో నున్నవాఁడు నిద్రనుండి లేచుటకు ఎట్లు ఇష్టపడఁడో అట్లే సమాధియందు విశ్రమించిన సాధకుఁడు కూడ ఆసమాదిని వదలి వ్యవహారములోనికి వచ్చుటకు ఇష్టపడఁడు, అందువలననే హేమచూడుఁడు కూడ మరల వెంటనే సమాధిస్థితి నొందుటకు ప్రయత్నింపఁజొచ్చెను.

అప్పుడు హేమలేఖ అతనిపై చేయివైచి తనవైపునకు త్రిప్పుకొని, ''నీవు ఏమనుకొనుచున్నావో చెప్పుము. నీకు కనులు మూసికొనుటవలన కలిగినలాభ మేమి? కనులు తెఱచుటవలన కలిగిననష్టమేమి? చెప్పుము'' అని మధురముగా అడిగెను. అతఁడు మద్యముచేత మత్తిల్లినవానివలె ఆమెవంక చూచుచు ఇట్లనెను. ''ఇప్పటివఱకును ఆత్మసుఖము నెఱుంగనైతిని. ఇప్పటికి పొందితిని, ఇప్పుడు దీనిని వదలుకొని దుఃఖభూయిష్ఠమైన ప్రపంచవ్యవహారములోనికి ఏల రమ్మనుచున్నావు? నీకు మ్రొక్కెదను. నన్ను కదలింపకుము. ఇట్టి సుఖము నెఱింగియు నీవు ఇంకను వ్యవహారమునందే యుండుట చూడఁగా నీవు దైవోపహతురాల వనియే తలంచుచున్నాను.

అప్పుడు ఆమె చెప్పిన మాటలు గమనింపఁదగి యున్నవి. ''పరమపావనమైన ఆత్మపదము నీకు తెలియలేదు. నీవు కొంచెము తెలిసికొంటివి. ఆకొంచెము తెలియనిదానితో సమానముగా నున్నది.'' సమాధి సిద్ధించి సుఖము కలిగినంతమాత్రమున ఆత్మజ్ఞానము కలుగదని యామె స్పష్ట మొనర్చెను. ఎందువలన? ఎంతగాఢముగ నిద్రించినను మనస్సుయొక్క సంస్కారములయందు కొంచెము కూడ మార్ప కలుగదు. నిద్రనుండి లేచినవాఁడు అంతకు పూర్వము ఎట్లు వర్తించెనో అట్లే వర్తించును, ఆవిధముగానే సమాధినుండి లేచిన వాఁడు కూడ అంతకు పూర్వము ఎట్లుండునో అట్లే యుండును. దేహాత్మ బుద్ధి, జగత్తు వేఱు, నేను వేఱు, జీవుఁడు వేఱు, ఈశ్వరుఁడు వేఱు, ఒకజీవునికన్న మఱియొకఁడు భిన్నుఁడు మొదలుగా ఆజ్ఞానమువలన ఏర్పడిన హృదయ గ్రంథులు రాగద్వేషాదివాసనలు ఏవియును ఈసుఖానుభవముచేత నశింపవు. అజ్ఞానము జ్ఞానము చేత తప్ప మఱియొక విధముగా నశింపదు. కొందఱు జీవితాంతము వఱకు సమాధియందే నిలిచియుందురు. ఆసమాధిస్థితికి పూర్వము వారికి ఆత్మజ్ఞానము ఉన్నచో మరల జన్మింపరు. కాని ఆత్మజ్ఞానము కలుగకముందే సమాధిస్థితి నొందినవారు, ఆదేహము పడిపోయిన తరువాత మఱియొక జన్మమును తప్పక పొందుదురు. అప్పుడు మరల ఆత్మవిచార మొనర్చి జ్ఞానమును పొంది వారు ముక్తులు కావలసియుండును.

ఆత్మవిచారమువలననే కాక ప్రాణామాయాదిసాధనమువలన కూడ సమాధి సిద్ధించును. తపస్సుచేసి సిద్ధిని పొందినవారందఱు ఈసమాధిని పొందుదురు. ప్రాణశక్తిని నియమించినచో మనస్సు, కుండలో నుంచిన దీవమువలె, నిశ్చలముగా ప్రకాశించుచుండును. అదియే సమాధి. ఆమనస్సునందు తమ యిష్టము ననుసరించి బ్రహ్మనో విష్ణువునో ఈశ్వరునో ధ్యానించుచుందురు. అట్లే తపస్సులో నిశ్చలముగా వందలకొలఁదిసంవత్సరము లుందుడు. అప్పుడు వారి శరీరములచుట్టును పుట్టలు కూడ ఏర్పడును. వాల్మీకి చ్యవనుఁడు హిరణ్యకశిపుఁడు మొదలగువారి వృత్తాంతములలో ఇది ప్రసిద్దము. అప్పుడు వారిచే ఆరాధింపఁబడిన బ్రహ్మయో విష్ణువో ఈశ్వరుఁడో ప్రత్యక్షమై వారికి వరము లోసంగును. వారికి అట్లు దేవుఁడు ప్రత్యక్షమైనను వారి చిత్తవృత్తులలో ఏమాత్రము మార్పు కలుగదు. అంతకు పూర్వమున్న రాగద్వేష్వాదిభావములన్నియు అట్లే యుండును. అర్జునునకు ఈశ్వరుఁడు ప్రత్యక్షమైనను పాశుపతము లభించినదే కాని ఆత్మజ్ఞానము కలుగలేదు; కనీసము ఆత్మనుగూర్చి తెలిసికోవలయునను కోరిక కూడ కలుగ లేదు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుఁడే యుద్ధసమయమున తత్త్వమును బోధించినప్పుడు కూడ అర్జునునకు అది మనస్సునకు పట్టలేదు. వెంటనే అతఁడు యుద్ధకార్యమున నిమగ్నుఁ డగుట వలన విన్న తత్త్వమును మనననింధ్యాసనములతో చక్కఁగా గ్రహించుటకు అతనికి అవకాశము కలుగలేదు, అందువలననే అతఁడు, ''నీవు యుద్ధమునకు ముందు బోధించిన విజ్ఞానవిషయములను నేను కార్యవేగమున మరచితిని. మఱల బోధింపుము'' అని శ్రీకృష్ణుని ప్రార్థించెను. అప్పు డాయన మరల అతనికి తత్త్వమును బోధించెను. ఆసందర్భము అనుగీత అనుపేరుతో మహాభారతమున ప్రసిద్ధమై యున్నది. కావున ఆత్మవిచారమువలన కాక సమాధివలన జ్ఞానము కలుగ దనుట నిశ్చితము. ఈకారణముచేతనే రాక్షసులు తపస్సు వలన వరములను పొందినవెంటనే రాగద్వేషములతో విజృంభించి అక్రమముగా పదవులను భోగములను పొందుటకే ప్రయత్నించుచుండిరి. కావున సమాధివలన కలుగుశక్తులు ఆత్మజ్ఞానమును కలిగింపకపోఁగా అహంకారమును రాగద్వేషాదులను పెంచి వినాశమును కలిగించుటకు కూడ అవకాశమున్నది. ఈకారణముచేతనే ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు గ్రంథములలో ఆత్మవిచారపూర్వకముగ జ్ఞానమును పొందుపద్ధతియే ప్రశంసింపఁబడినది, కాని ప్రాణాయామాదులవలన లభించు సమాధిస్థితి ప్రశంసింపఁబడ లేదు.

ఈకారణముచేతనే సమాధిస్థితియందే నిలచిపోవుటకు సిద్ధముగా నున్న హేమచూడుని బలవంతముగా నైనను తనవైపునకు త్రిప్పుకొని హేమలేఖ ఆత్మతత్త్వమును భోధించెను. ''నీవు కనులు మూసికొని దేనిని పొందుచున్నావో అది నీస్వరూపమే. అదియేజ్ఞానము, శుద్ధచైతన్యము. ఆచైతన్యమే సకల జగత్తునకు కూడ ఆత్మ. కావున నీస్వరూపమైన యాత్మ ఎచ్చట ఎప్పుడు ఏరూపమున లేదో చెప్పుము. అది లేనిచో జగత్తే లేదు. అదియే జగత్తునకు ఆధారము. అట్టి సర్వవ్యాపకమైన నీస్వరూపచైతన్యము నీవు కనులు తెఱచినంత మాత్రమును మాయమెట్లగును? కనులు మూసికొని గాని తెఱచిగాని ఏపదమును పొందితి నని తలంతువో అది పూర్ణ మెట్లగును? ఎందువల్ల ననఁగా నీవు చిత్తమును నిరోధించినప్పుడు ఆసమయమున అది నీ లోపలనే భాసించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లేకదా! ఒక క్రియచేత ఒకసమయమునందు ఒకచోటనే భాసించునట్టిది పూర్ణ మెట్లగును? ''నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూచుచున్నాను'' అన్న యీయభిమానగ్రంథిని భేదింపము. 'ఈజగత్తు నేను కాదు' అన్న భేదగ్రంథిని కూడ ఖండిపుము. అఖండమై ఆనందరూపముగా నున్న యాత్మను ఎల్లయెడలను చూడుము.''

ఆమె చెప్పినది గ్రహించి హేమచూడుఁడు భ్రాంతిని వీడి సర్వవ్యాపకమైన స్వరూపమును తెలిసికొని క్రమముగా ఆభావనయందు స్థిరత్వము నొందెను. అంతకు పూర్వము ''దేహము నేను'' అనుభావము ఎంత దృఢముగా నుండెనో'' ''కేవలచైతన్యమే నేను'' అనుభావము అంత దృఢ మయ్యెను. అది ఆత్మసాక్షాత్కారమను తొమ్మిదవమెట్టు.

ఈమెట్టుపైనుండి అతఁడు జీవన్ముక్తి అను సౌధమున ప్రవేశించెను. జీవించుచుండియు ముక్తుండైనవాఁడు జీవన్ముక్తుఁడు. సుఖదుఃఖములను అనుభవించుచుండుటయే జీవించుట. సుఖము గాని దుఃఖము గాని ఏది సంభవించినను అతది దేహమునకో ఇంద్రియములకో మనస్సుకో సంబంధించినదిగా చూచుచు సాక్షిగా నుండి ఏభావముచేతను బద్ధుఁడు కానివాఁడు ముక్తుఁడు. ఆత్మజ్ఞానము కలిగినంతనే సంచిత కర్మలు నశించును. దేహాభిమానము లేకుండుటవలన ఇప్పుడు చేయుచున్న కర్మలవలన ఆగామి పుట్టదు. ప్రారబ్దముమాత్రము మిగిలియుండును. దానివలన కలిగిన దేహవ్యవహారము జరుగుచునే యుండును. ఆవ్యవహారము జరుగుచున్నను దానిని లీలా మాత్రముగ చూచుచు జీవన్ముక్తుఁడు స్వరూపస్థితియందే యుండును.

జీవన్ముక్తులు ప్రపంచమును తమ స్వరూపముగనే చూచుండదురు. అందువలన వారు కోరఁదగినది పొందవలసినది యేదియు నుండదు. ప్రారబ్దము ననుసరించి వారికి వ్యవహారము జరుగుచుండును. ఒకదిక్కునందు ప్రయెగింపఁబడిన బాణము ఆదిక్కునందే పోవుచు వేగము తగ్గినప్పుడు పడిపోవును. దానికి దిక్కు గాని లక్ష్యము గాని లక్ష్యము గాని మాఱదు. అట్లే ప్రారబ్దవేగముచేత జరుగుచున్న దేహవ్యవహారము జ్ఞానము కలుగుటకు పూర్వము ఎట్లుండునో తనువాత కూడ అట్లే యుండును. రాజు రాజుగానే యుండును. మంత్రి మంత్రిగానే యుండును. గురుశిష్యులు, భార్యాభర్తలు వెనుకటివలెనే యుందురు. తాము ఏకులమునందు ఏవర్ణమునందు జన్మించిరో ఆ కులమునకు వర్ణమునకు శాస్త్రముచేత లోకాచారముచేత విహితములైన ధర్మములను, వానివలన తమకు ఏఫలము లేకున్నను, చక్కగా నిర్వర్తించుచుందురు. జ్ఞానియైన ధర్మవ్యాధుఁడు కులవృత్తియైన మాంసవిక్రయమును మానుకొనలేదు. క్షత్త్రియులుగా జన్మించిన శ్రీరాముఁడు శ్రీకృష్ణుఁడు జ్ఞాను లయ్యెను. యుద్దము చేయవలసివచ్చినప్పుడు, అది ఎంత హింసాకృత్య మైనను, దానిని నిర్వర్తించుటకు వెనుఁదీయ లేదు. అర్జునుఁడు యుద్ధకృత్యమును ఏవగించుకొని భిక్షావృత్తిని అవలంభించుట మేలని తలంచుచుండఁగా శ్రీకృష్ణుఁడు ''యుద్ధము క్షత్రియునకు స్వధర్మము. క్షత్త్రియుఁడ వైననీవుయుద్ధమును వదలుకొనుట, భిక్షావృత్తిని అవలంభించుట తప్పు'' అని దృఢముగా బోధించెను. కావున జీవన్ముక్తుల తమ వర్ణములకు ఆశ్రమములకు విహితములైన ధర్మములను చక్కఁగా పాటించుచుండుటయే గాక యితరులను కూడ వారికి విహితములైన ధర్మములయందు ప్రవర్తింపఁజేయుదురు. వారు ఎప్పుడును ధర్మమును అతిక్రిమింపరు; అధర్మమును ప్రోత్సహింపరు. లోకములో అజ్ఞానుల కామవేగమునకో క్రోధవేగమునకో లోఁబడి ఏదియో సాధింపవలె నను నావేశముతో ధర్మమును తాము అతిక్రమించుచు ఇతరులను కూడ అందులకు ప్రోత్సహింతురు. మఱి, ప్రపంచమును ఆత్మస్వరూపమునుగా చూచుచున్న జీవన్ముక్తులకు అజ్ఞానము ఉండదు; కామక్రోధముల వేగము కూడ ఉండదు. కోరఁదగినది పొందఁదగినది ఏదియు లేనప్పుడు వారు దేనికొఱకై ధర్మమును అతిక్రమింతురు? వారు శరీరమున్నంతవఱకు లోకక్షేమముకొఱకై శాస్త్రవిహితమైన ధర్మమున తాము వర్తించుచు ఇతరులను ప్రవర్తింపఁజేయుచుందురు.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters