Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

9. గురుభక్తి

తల్లిగారి అనుమతితో క్రమసన్యాసం కోసం గురువులను వెతుక్కుంటూ నదులు, కొండలు, గుట్టలు, చెఱువులు, అరణ్యాలు, పట్టణాలు, పల్లెలు దాటుకుంటూ ఉత్తరాభిముఖులై సాగిపోతున్నారు శంకరులు. మనకొక అనుమానం రావచ్చు. దక్షిణ దేశంలో అప్పుడు సన్యాసులే లేరా! ఉండి ఉండాలి. శంకరులకు ఎనిమిదేళ్ళకే ఈ జగత్తు మిధ్య, జనన మరణ ప్రనాహం నుండి ముక్తులం కావాలంటే సన్యాసాన్ని స్వీకరించాలని ఆలోచన, ఆపత్సన్యాస విధీ, కేవలం శాస్త్ర పరిజ్ఞానంతో మనస్సుకు పట్టడం కష్టం. అయితే ఎవరికి ఏర్పడ్డ గురువులను వారు సందర్శించినప్పుడే మనస్సు స్పందిస్తుంది. అదీకాక శంకరులకై బదరి వీడి నర్మదా తీరంలో ఎదురు చూస్తున్నారు వారికి ఏర్పడిన గురువులు శ్రీగోవింద భగవత్పాదులు. గురువులకై శిష్యులు ఎంత వెతుక్కుంటారో సరియైన శిష్యునికై గురువులు కూడా అంత వెతుక్కుంటారు. ఎదురు చూస్తూ ఉంటారు.

నర్మదానదీ తీరంలో వింధ్య పర్వతాలలో ఉన్న అరణ్యంలో ఋషివాటికను చూశారు శంకరులు. అనేక మంది సన్యాసులు, బ్రాహ్మచారులు అక్కడ ఆవాసం చేస్తున్నారు. పరమ ప్రశాంతమైన ఆ వాతావరణానికి ముగ్ధులయ్యారు. వారంతకు ముందే ఇక్కడ ఆవాసం చేసే మహాపురుషుని గురించి విని ఉండుటనో, అంతఃకరణ ప్రబోధం చేతనో వారే తమ గురువులని నిశ్చయం చేసుకొన్నారు. అక్కడి బ్రహ్మచారులను గురువుగారు ఎక్కడ ఉన్నారని అడిగారు. గోవింద భగవత్పాదులవారు మనుష్యులు జొరబడటానికి ఏ మాత్రం వీలులేని గుహలో సమాధినిష్ఠులై ఉన్నారని తెలుసుకొని ఆ గుహ చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేస్తూ గురువులను స్తుతించారు. శంకరుల స్తుతికి సమాధినిష్ఠులై ఉన్న గోవిందయతి కనులు తెరచి చూశారు. తనను శిష్యునిగా స్వీకరించి తత్త్వోపదేశం చేయమని ప్రార్ధిస్తున్న శంకరులను 'నీవెవ్వరవు| అని ప్రశ్నించారు గోవిందయతి.

తాను నిర్దర్శకము, అద్వితీయము. అపరిచ్ఛిన్నము, బేధశూన్యము, సత్యాది లక్షణకము అయిన బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పడానికి శంకరులు నేతి శైలిలో నేను పంచభూతములలో దేనినీ కాదు. నేతాద్రి ఇంద్రియములను కాదు. ఆ నిషేధములకన్నింటికీ శేషించి ఉన్న పరమానంద స్వరూపణ్ణి నేను అంటూ పదిశ్లోకములలో ఔపనిషద సిద్దాంతమును గూర్చి చెబుతూ దానికి విరుద్ధముగా వాదించే వారి వాక్యములను నిరసిస్తూ సమాధానం చేప్పారు. అద్వైత సిద్దాంతవేత్తలలో తలమానికముగా కొనియాడపడే మధుసూదనానంద సరస్వతీ స్వామివారు ఈ దశశ్లోకికి వ్యాఖ్యానం చేస్తూ ఈ శ్లోకములు బాదరాయణుల వేదాంత సూత్రములను మరిపించేటట్లు ఎంతో భావగంభీరంతో ఉన్నాయని శ్లాఘించారు.

గోవిందభగవత్పాదులు పరమానంద భరితులయ్యారు. ఇంత కాలానికి వ్యాసులవారి ఆదేశముపైన తాను ఇచ్చట వేచియున్నదానికి ఫలితం సిద్ధించింది అనుకొన్నారు. వెంటనే గుహనుండి బయటకు వచ్చారు. శంకరులు సాష్టాంగంగా నమస్కరించారు. తన శిష్యుని యెడ అత్యంతానురక్తులైన గోవిందయతి ఉపనిషత్ప్రతిపాద్యమైన పరబ్రహ్మ తత్వప్రతిపాదకములైన మహావాక్యములన్నీ ఉపదేశించారు. విధివత్తుగా సన్యాసదీక్ష ననుగ్రహించారు.

ఆషాడ పౌర్ణమి నుండి నాల్గునెలలు సన్యాసులు ఒకే చోట నివసించి వేదాంత విచారం చేయవలెనని శాస్త్రం నిర్దేశిస్తోంది. హైందవ ధర్మంలో అహింస సన్యాసులకు మాత్రమే పూర్తిగా విధించబడి ఉంది. వారు సన్యాసం స్వీకరించేటప్పుడు ఏ జీవినీ హింసించను అనే ప్రతిజ్ఞ తీసుకుంటారు. వర్షాకాలంలో అనేక జీవరాసులు కాలి క్రిందపడి మరణిస్తాయనే ఉద్దేశ్యంతో వారు సంచారము చేయరు. ఆ సమయాన్ని వారు బ్రహ్మవిచారానికై వినియోగిస్తారు. శంకరుల సన్యాసానంతరము తమ మొదటి చాతుర్మాస్యమును గురువుల సమక్షంలో గడుపుతూ ప్రణిపాత పరిప్రశ్నములు చేత సమస్త వేదాంత సారమును గ్రహించారు. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఆత్మతత్త్వమును రూఢిగా అనుభవంలోనికి తెచ్చుకొన్నారు. తాము గోవింద భగవత్పాదుల వారి వద్ద ఏ విధంగా ప్రార్దించి, అనేక చక్కటి ప్రశ్నల ద్వారా వేదాంత విచారం చేసినది వివరించే గ్రంధమే వివేక చూడామణి అని కొందరు పండితుల అభిప్రాయం.

శంకరులు చాతుర్మాస్యాలకు గోవిందయతులతో ఆ గుహలో ఆవాసం చేసే కాలంలో నర్మద పొంగి గుహలోనికి నీరు ప్రవహించ నారంభించింది. గోవింద భగవత్పాదులు సమాధినిష్ఠలో బాహ్యస్మృతి లేని స్థితిలో ఉన్నారు. శంకరులు గుహవాకిలి వద్ద తమ కమండలముంచి నర్మదాష్టకము చదివేసరికి వరద ఉపశమించింది. బాహ్యస్మృతిలోనికి వచ్చిన గోవిందయతులు ఇది చూశారు. వారికి శంకరుల ప్రతిభ అతఃపూర్వమే అవగతమైనప్పటికీ తాను పూర్వము వ్యాసులవారిని సూత్రభాష్యమును వ్రాయమని ప్రార్ధించినప్పుడు, నీ వద్దకు మహామహిమాన్వితుడైన శిష్యుడు వస్తాడు. అతడి చేత సూత్రభాష్యం వ్రాయించు అని చెప్పిన వాక్యములు గుర్తుకు వచ్చినాయి.

శంకరులు తమ ప్రాణరక్షణకై ఈ మహిమ చూపలేదు. గురుభక్తి విశేషం చేత మాత్రమే వారీ మహత్తు చేయవలసి వచ్చింది. తన దశశ్లోకిలో ఉపనిషత్సిద్దాంతాన్ని అంతటినీ ప్రతిపాదించిన శంకరులు, నర్మద నీటిని తన కమండలంలో ఇంకింప చేయగల సామర్ధ్యమున్న శంకరులు ఎంతో వినయవిధేయతలతో తమ గురువుల వద్ద విషయ పరిగ్రహణం చేసిన తీరు, ఏమీ తెలియకుండానే తమ అధ్యాపకుల యెడ అవినయం చూపే ఇప్పటి విద్యార్ధులకు కనువిప్పు కావాలి. శంకరుల దేహ పరిరక్షణార్ధం వారి శిష్యులైన పద్మపాదులు చూపిన మహత్వాన్ని మనం ముందు ముందు చూస్తాము.

సరి! గోవింద భగవత్పాదులచే ప్రస్తానత్రయమని పిలవబడే ఉపనిషత్‌, భగవద్గీతా, బ్రహ్మసూత్రములకు శ్రుతి సమ్మతంగా భాష్యం వ్రాయమని ఆదేశించబడిన శంకరులు వినయంతో వారి వద్ద శలవు తీసుకొని వారణాసి ప్రయాణమయ్యారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page