Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

8. సన్యాసము

లేక లేక కలిగిన సంతానమవడంతోనూ, భర్త కూడా మరణించడంతోనూ కనులన్నీ శంకరుని మీదనే పెట్టుకొని జీవించింది అమ్మ ఆర్యాంబ. పిల్లవాడు సామాన్యుడా! మూడేండ్లకే జగన్మాతను దర్శించి దేవీ భుజంగ స్తోత్రం చేశారు. అయిదేండ్లకు కనకవృష్టి కురిపించారు. తన కోసమై పూర్ణానదిని తన ఇంటి పెరటిలోనికి తెప్పించారు. ఏడేండ్ల వయసులో ఆ దేశపు రాజును పాదాక్రాంతులను చేసుకొన్నారు. విద్యలలో వామనమూర్తి వలే విజృంభించి ఎనిమిదేళ్ళకు సకల శాస్త్రములను ఔపోసన పట్టారు.

ఇంత మేధావి, ప్రయోజకుడు అయిన పిల్లవాని చుట్టూ ఎంతో గర్వంగా, అబ్బురంగా ఊహలు అల్లుకొంది ఆర్యాంబ. శంకరుణ్ణి ఒక ఇంటి వాణ్ణి చేయాలనుకొందట. ఎనిమిదేళ్ళకే పెళ్ళి ఏమిటంటారేమో! వయస్సు ఉడిగిన కాలంలో కలిగిన సంతానం శంకరులనే విషయం మనం మరచిపోరాదు. ఆ తల్లికి కొడుకు పెళ్ళి, కోడలు, మనవల గురించి ఆలోచించడం కంటే ముఖ్యమైనదేమున్నది. అదీకాక ఆ రోజుల్లో బాల్య వివాహాలు సహజమే అయి ఉండాలి.

శంకరుడో! ఈ జనన మరణ ప్రవాహం నుండి తాను బయట పడటమే కాక సమస్త మానవాళికీ ఆ ప్రవాహం నుండి బయటపడే మార్గం చూపడానికి ఉద్భవించిన వారు కదా! తల్లీ కొడుకుల మధ్య ఈ చర్చ జరిగి ఉండాలి. శంకరులు సన్యాసేచ్ఛ అమ్మగారి ముందు ప్రస్తావించారు. ఆమె ఒప్పుకోక పోవడం సహజమే కదా! తల్లి అనుమతి లేకుండా సన్యాసం పుచ్చుకోరాదు. వారిని ఎలా ఒప్పించాలో అని తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు శంకరులు. శంకరులకు ముందు వారైన బుద్ధులు ప్రక్కనున్న భార్యకో, పుత్రునికో, తల్లికో, తండ్రికో చెప్పకుండా అంతఃపురాన్ని వదిలి వెళ్లిపోయారు. బుద్ధునికి సంసారంపై రోత కలిగింది. పపంచంపై వైరాగ్యం జనించింది. అయితే పొందదగిన వస్తువేది అనే పరోక్ష జ్ఞానముపై (శాస్త్ర జ్ఞానము) వారికి రూఢి అయిన అభిప్రాయము లేదు. వారు తపస్సు ద్వారా పొందదగిన వస్తువుకై అన్వేషణ చేశారు. శంకరులలా కాదు. వారికి శాస్త్రబలం ఉంది. సనాతన వైదిక శాస్త్ర విచారం ద్వారా పొందదగిన వస్తువేదో రూఢిగా తెలుసుకొని మననాదులచే గట్టి పరచుకొని తీవ్ర వైరాగ్యంతో సన్యసించాలి అని చెబుతోంది. వెల్లువ వలె వచ్చిన వైరాగ్యం ప్రమాద హేతువు. విరాగులు కూడా తన కుటుంబం యెడ, సంఘం యెడ బాధ్యతలున్నట్లయితే జనకాదుల వలె తన ధర్మాన్ని నిర్వర్తించాలి. వైరాగ్యం మాత్రం పెంపొందించుకొంటూ సాక్షీమాత్రంగా సంసార బాధ్యతలు వహించాలి. అయితే అలాంటి తీవ్ర ముముక్షత్వము కలవారి బంధవిముక్తికై పరమేశ్వరుడు సహాయం చేస్తాడు. అదికూడా ఏ విధంగా? మగ్గిన దోసపండు తీగను వదిలిన చందాన వీరిని సంసార బంధాలనుండి విడి చేస్తాడు.

ఒకరోజు పెరటిలో ఉన్న చూర్ణానదికి స్నానానికి వెళ్లారు శంకరులు. కొంచెం లోతుకు దిగారో లేదో వారి కాలిని ఒక మొసలి పట్టుకొని లోపలికి ఈడ్చుకు పోనారంభించింది. పెనుగులాడుతూ వారు వేసిన కేకలకు తల్లిగారు లోపలనుండి నది ఒడ్డుకు పరుగెత్తుతూ వచ్చారు. మునిగిపోతున్న పుత్రుని చూచి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. 'అమ్మా! ఎలానో ప్రాణం పోయేలా ఉంది. నీవనుమతిస్తే సన్యాసం స్వీకరిస్తా'నన్నారు శంకరులు. ఆర్యాంబ ఆలోచించారు. పండితుల కుటుంబంలో నుండి పండితుల కుటుంబంలోనికి మెట్టిన ఆమెకు శాస్త్రసంప్రదాయం తెలియంది కాదు. పుత్రుని మోక్షేచ్ఛకు అడ్డం రాకూడదరు. అదీకాక, సన్యాసం మరుజన్మ వంటిది కాబట్టి సన్యాసో, సంసారో! కొడుకు జీవితునిగా తన ఎదుట ఉంటాడనే వ్యామోహంతో ఒప్పుకొన్నారు. శంకరులు జందెం తెంపుకొని, బుద్దివృత్తులన్నిటినీ కేంద్రీకరించుకొని 'సన్యస్యోహం' అంటూ మూడుసార్లు ఉచ్ఛరించి ఆతుర సన్యాసం స్వీకరించారు. ఆపత్కాలంలో ఈ విధంగా సన్యాసం స్వీకరించడాన్ని ఆపత్సన్యాసం, లేక ఆతుర సన్యాసం అంటారు. ఇలా సన్యాసం తీసుకొన్నవారు ఒకవేళ ఆ ఆపద దాటిపోతే తగిన గురువును వరించి క్రమసన్యాసం తీసుకోవాలని శాస్త్ర సంప్రదాయం. మరి ఆతుర సన్యాసానికి కూడా తల్లి అనుమతి కావాలా? ఏమో! కానీ ఎదురుగా ఉన్న తల్లిగారిని అడిగితే తప్పు మాత్రం లేదు కదా!

ఆశ్చర్యంగా శంకరుల కాలు పట్టుకొన్న మొసలి వదిలి వేసింది. ఆ మొసలి శాపమూలాన నదిలో చరిస్తున్న గంధర్వుడని శంకర విజయాలు చెబుతున్నాయి. ఒడ్డున చేరిన కొడుకును చూసిన తల్లిగారి ఆనందానికి అవధులు లేవు. అంతలోనే తన పుత్రుడు తనను వదిలి వెళ్ళి పోతాననడంతో దుఃఖం వచ్చింది. 'అమ్మా! ఇంతవరకు నీకొక్కడికే కొడుకుని. ఇప్పుడు నాకు భిక్ష వేసేవారందరూ తల్లులే! వెళ్ళి సరియైన గురువును వెతుక్కొని క్రమ సన్యాసం తీసుకొంటాను. అనుజ్ఞ ఇవ్వు' అన్నారు.

అంతేకాదు. 'నిన్ను చూసేందుకు ఎవరూ లేరనుకోవద్దు. తండ్రి ఇచ్చిన ఆస్తి వదిలేసి వెళుతున్నాను కదా! దానికోసమైన జ్ఞాతులు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. చక్కగా అంత్యక్రియలు చేస్తారు' అన్నారు. 'ఎంతో కష్టపడి నిన్ను కన్నది ఎవరో అంత్యక్రియలు చేయడానికా? నీవే వచ్చి అంత్యక్రియలు చేయా'లన్నది ఆర్యాంబ. నిజమే! ఏకైక పుత్రుడైన శంకరులకు అంత్యక్రియలు చేయవలసిన విధి ఉన్నది. లోకానికి, తనకు తాను మహోపకరాం కోసం వెళ్ళబోయే శంకరులు సన్యాసధర్మానికి భంగమే అయినా పుత్రధర్మాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత తనకున్నదని అనుకొన్నారో ఏమో! అంత్యదశలో తనను స్మరించిన మాత్రన వచ్చి ఆమెను కడతేరుస్తానని మాట ఇచ్చారు. అంతే కాదు. 'నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాననుకుంటున్నావేమో! నీ దగ్గర ఉన్నదానికన్నా వందరెట్లు శ్రేయస్సు నీకు కలుగుతుందని' నమ్మబలికారు. జ్ఞాతులందరికీ వేరు వేరుగా వరుసన తల్లిగారిని జాగ్రత్తగా చూసుకోమని అంపకాలు పెట్టారు. తన తల్లి నిత్యమూ దర్శించే శ్రీకృష్ణాలయమునకు పునరుద్దరణ చేయించి అచ్యుతాష్టకము చెప్పి తన తల్లిని కాపాడవలసినదిగా ప్రార్ధన చేసి ఉత్తర దిశగా సాగిపోయారు. మహావిరాగి, ఆత్మజ్ఞాని అయిన శంకర భగవత్పాదులు తమ తల్లిగారి విషయంలో చూపిన ఆదరణ, బాధ్యత ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమైనది.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page