Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

3. నివేదనము

శంకరుల చరిత్రను వివరించిన పురాతన గ్రంధములలో శివరహస్యమొకటి. శివరహస్యము లక్షశ్లోకములున్న ఇతిహాసము. పార్వతీదేవికి పరమేశ్వరునిచే చెప్పబడినట్లున్నదీ గ్రంధము. అందులో తొమ్మిదవ అంశంలో పదునారవ అధ్యాయం శంకరాచార్య చరిత్రను వివరిస్తుంది. శంకరుల కైలాస యాత్ర మూలముగా లభించిన యోగ, భోగ, వర, ముక్తి, మోక్ష లింగముల ఆరాధన వలన వారికి అశేషమైన ప్రజ్ఞ లభించిందనీ, వారి దిగ్విజయానికి కారణమీ ఉపాసన అనిన్నీ ఈ గ్రంధం వివరిస్తుంది. మరి ఇది శివమహాత్మ్యాన్ని వివరించే గ్రంధం కదా! పరమేశ్వరుడు పార్వతీదేవికి శంకరులు తమ అంశావతారమని వివరిస్తారు. శంకరుడు సకల విద్యలకు ఆధారమైనవాడు. ఆయనకు సర్వజ్ఞుడన్న పేరున్నది. ఆదిశంకరులు సకల శాస్త్రములు లయం చెందే అద్వైతశాస్త్ర ప్రవర్తకులు. సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసినవారు. మనకు శంకరుల చరిత్ర గురించి లభించే గ్రంధములలో శివరహస్యము మొదటిది అని చెప్పుకోవచ్చునేమో!

అంతే పురాతనమైన గ్రంధం మార్కండేయ సంహిత. బ్రహ్మండ పురాణాంతర్గతమైనది. డెబ్బయి రెండవ ఖండంలో 7, 8 పరిస్పందములలో ఆచార్యులవారి చరిత్ర సంగ్రహంగా ఉన్నది. శివరహస్యంలో చెప్పబడిన పంచలింగములను ఆచార్యులవారు ఎక్కడెక్కడ ప్రతిష్టించినదీ ఈ గ్రంధం చెబుతుంది. నేరుగా ఆచార్యులవారి చరిత్రను చెప్పడానికై కాక వేరొకరి చరిత్ర గురించి చెబుతూ ఆచార్యులవారి చరిత్రను ప్రస్తావించిన గ్రంధాలలో పతంజలి చరిత్రము ఒకటి. ఇది పదిహేడవ శతాబ్దంలో రామభద్రదీక్షితుని చేత వ్రాయబడింది. శంకరుల చరిత్రతోపాటు గురువులైన గోవింద, గౌడ భగవత్పాదుల చరిత్రలు కూడా ఇందున్నవి. పై మూడు గ్రంధములు శంకరులు కాంచీక్షేత్రంలో తమ తుది కాలం గడిపి సిద్ధి పొందినట్లు చెబుతున్నాయి.

శంకర విజయాలలో బహుళ ప్రచారమొందినవి ఆనంద గిరీయము, మాధవీయము. ఇవికాక శంకరుల చరిత్రపై పుంఖానుపుంఖంగా అనేక గ్రంధములు అనే భాషలలో ఉన్నాయి. శంకరుల చరిత్ర అధ్యయనం చేద్దామనీ, ఆ మహాపురుషుని గురించి మరింత తెలుసుకొందామనీ ప్రయత్నం మొదలు పెట్టి, శివరహస్యంలోనూ, మార్కండేయ చరిత్రలోనూ, పతంజలి చరిత్రలోనూ శంకర చరిత్ర ఘట్టములు, ఆనందగిరీయము (మద్రాస్‌ యూనివర్శిటీ), మాధవీయము (ఏర్పేడు ఆశ్రమం) లతో పాటు ఆధునికులు వ్రాసిన అనేక శంకర చరిత్రలు చదివాను. తెలియనివీ, అర్ధం కానివీ శిష్యవత్సలురైన అనేక మంది పండితులను అడిగి చెప్పించుకొన్నాను. అన్నిటికీ మకుటాయమానంగా కంచిమహాస్వామివారు శ్రీ శంకరులపై చేసిన అనేక ఉపన్యాసమును పదే పదే చదివాను. శంకరుల గురించి ఈ శంకరులు తప్పితే ఎవరు చెప్పగలరు?

ఆధునిక చరిత్రకారులు వ్రాసిన పుస్తకాలలో ఆంధ్ర ప్రభుత్వంలో పురాతత్వ శాఖతో పాటు అనేక శాఖలలో ఉన్నతాధికారిగా పనిచేసిన ప్రముఖ ఐ.ఏ.యస్‌. అధికారి యన్‌. రామేశన్‌ వ్రాసిన 'శ్రీశంకరచార్య', 1988లో శంకర జయంతి మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారిచే కోరబడి ఆచార్య యస్‌.శంకర నారాయణన్‌ గారిచే వ్రాయబడిన 'శ్రీశంకర' పుస్తకములు నన్నెంతో ఆకర్షించాయి.

నేను చదివిన ఈ గ్రంధాల మూలంగా శంకరుల యెడ నా మదిలో చెలరేగిన భావ పరంపర స్థిరపరచుకోవడానికి, ఒకచోట వ్రాసిపెట్టుకుందా మనుకొన్నాను. అలా పుట్టినవే ఈ వ్యాస పరంపర. ఇవి నాకై నేను వ్రాసుకొన్నవి. చూసిన మిత్రులు బాగున్నాయన్నారు. ఏదైనా పత్రికకు పంపితే బాగుంటుందన్నారు. ఆంధ్రభూమివారు తమ దిన పత్రికలో ప్రచురించారు. కొన్ని 'ఋషిపీఠం' మాస పత్రిక వారు ప్రచురించారు. ఇంతకీ నే చెప్పవచ్చినదేమంటే అజ్ఞుడను అయిన నేను ఎవరికీ చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ గ్రంధం వ్రాయలేదు. సర్వజ్ఞుడైన శంకరుల గురించి వ్రాయగలిగే సమర్ధత నాకున్నదని చెప్పే దుస్సాహసం నాకు లేదు. వారిని గురించి నేను చేసుకొన్న మనన ఇలా రూపుదిద్దుకొంది. అంతే! కంచి మహాస్వామివారు తమ అనే ఉపన్యాసములలో శంకరులవారి సమన్వయం గురించి పదే పదే చెబుతూ ఉంటారు. శంకరులు శ్రుతి మొత్తంగా ప్రమాణంగా స్వీకరించారు. వారికి సమన్వయమవని శ్రుతి వాక్యం లేదు. మిగతా మతాచార్యులలా కాదు. వారి మతములకు అనుకూలమయినవే స్వీకరించి మిగతావి అర్ధవాదములని త్రోసి పుచ్చారు. వారు వైదికమైన ఏ మతమునూ, దర్శనమునూ, ఉపాసనా మార్గమునూ వ్యతిరేకించలేదు. వాటిని మెరుగుబరచి వాటి గమ్యము అద్వైతమని నిరూపించారు. ఆసేతు హిమాచలం ముమ్మారు పర్యటించి భారతీయులలో ఏక సూత్రతను ప్రవర్తింపజేశారు. అందువలననే ఈ గ్రంధమునకు 'భారతీయ సమైక్యతామూర్తి - ఆదిశంకరులు' అన్న పేరుంచబడింది.

ఏప్రియల్‌ నాల్గయిదు తారీఖుల్లో తిరుమలలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీమజ్ఞయేంద్ర సరస్వతీ సంయమీంద్రుల దర్శనం చేశాను. వారు మాటల సందర్భంలో ఆదిశంకర చరిత్ర సంక్షిప్తంగా తయారు చేయమని ఆదేశించారు. ఆ ఆదేశానుసారం ఆంధ్రభూమి, ఋషి పీఠములలో పడిన వ్యాసములను సేకరించి కొంత సవరించి ఏప్రియల్‌ ఇరవై రెండవ తారీఖు సికిందరాబాదులో స్వామివారికి సమర్పించాను. వారు వెంటనే మహాస్వామివారికి, కంచిపీఠానికి అత్యంత భక్తులైన శ్రీసముద్రాల కృష్ణమూర్తి, కంచి కామకోటి పరమాచార్య మెమోరియల్‌ ట్రస్ట్‌ వారికి ప్రచురణార్ధం అనుగ్రహించారు. శంకరాద్వైత సిద్ధాంతము గురించి మహాస్వామివారు తమిళములో చేసిన ప్రసంగములు అయిదింటికి మహాస్వామివారి ఉపదేశములను జగద్గురు బోధలను పేర పది సంపుటములుగా, ఆచార్యవాణి ప్రధమ సంపుటముగా శ్రీవిశాఖగారు అనువదించారు. ఇవి ఋషిపీఠంలో ప్రచురించబడినవి. శంకరుల సిద్ధాంతంపై ఎంతో సులభ##మైన రీతిలో స్వామివారు చేసిన వివరణ పాఠకుల ప్రయోజనార్ధం ఇందు చేర్చబడినది. శ్రీవిశాఖ గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు.

నేను చదివిన అనేక గ్రంధముల గ్రంధకర్తలకూ, నా వ్యాసములను ముద్రించిన పత్రికలవారికి, ప్రచురణకు ముందు కొచ్చిన శ్రీకృష్ణమూర్తిగారికి నా కృతజ్ఞతా పూర్వక నమస్కారములు. చాలా తక్కువ కాలంలో కంప్యూటర్‌ డి.టి.పి. చేసి పెట్టి, శుద్ద ప్రతిని అందజేసిన మా తమ్ముడు చి|| చల్లా సురేష్‌, గాయత్రీ దంపతులకు ఇతోధికాభివృద్ది ప్రసాదించుగాక యని మా ఆచార్యదైవమయిన కంచి మహాస్వామి వారిని ప్రార్ధించుచున్నాను.

నాపై అవాజ్యమైన కృపను ప్రసరింపజేసే కంచి కామకోటి పీఠాధిపతులు, జగద్గురు శంకరాచార్యులు అయిన శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారల చరణ పద్మమునకు సాష్టాంగముగా నమస్కరిస్తున్నాను.

- చల్లా విశ్వనాధ శాస్త్రి

చెన్నై

26-07-2002త

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page