Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

21. ఆరు ఉపాసనా మార్గముల సమన్వయం

శంకరుల అద్వైత సిద్దాంతము ఏ మతమునకు వ్యతిరేకము కాదు. సర్వ మతములకూ, వైదిక మతములన్నిటికీ కూడా పరమావధి అయిన స్థితి. ఒక సందర్భములో శంకరులు 'పరస్పరం విరుధ్యంతే, తైదయం నవిరుధ్యంతే' (వారితో మాకేమీ విరోధం లేదు. వివిధ మతముల వారు వారిలో వారే విరోధించుకొంటున్నారు) అంటారు. జీవులందరూ వారు ఏ మతమునకు చెందిన వారైనా, ఏ జాతులకు చెందినవారైనా సరే అద్వైతానుభూతికి అర్హులే అనే విషయం వారనేక సందర్భాలలో నిర్ద్వందంగా ప్రకటించారు. అయితే శంకరుల పరమోద్దేశ్యం వైదికములైన మతముల మధ్య సామరస్య భావాన్ని, సమన్వయాన్ని సాధించడం. వారు అవైదిక దర్శనములను సందర్భానుసారం ఖండించారే తప్ప ఎక్కువగా పట్టించుకోలేదు. వేదము అపౌరుషేయము, పరమ ప్రమాణము అని నమ్మిన శంకరులకు కేవల బౌద్ధికములైన మత ప్రశంస అప్రస్తుతము.

అవైదిక దర్శనముల సంగతి అలా ఉంచితే సాంఖ్య, వైశేషిక, న్యాయ, యోగ దర్శనములకు చెందిన కపిలకాణాదాది మహాఋషులు, వైదిక ప్రామాణ్యతను ఒప్పుకొంటూనే, తమ సిద్ధాంత నిరూపణకు బౌద్ధికమైన వాదములను ఉపయోగించారు. సంస్కృతములో ఒక శ్లోకమున్నది. 'కపిలుడు (సాంఖ్య ప్రవర్తకులు) సర్వజ్ఞుడయితే కణాదుడు (వైశేషిక ప్రవర్తకులు) కారని ఏమిటి ఋజువు. ఇరువురూ సర్వజ్ఞులే అయితే వారి సిద్దాంతములో బేధము ఎందువలన?' అని ఆ శ్లోకభావం. ఈ రోజున మహాప్రతిభాశాలి, తిరుగులేని వాద పటిమలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిష్టిస్తే, రేపు ఇంకొక్కరు అంత కంటే తిరుగులేని తార్కిక ప్రజ్ఞతో ఆ సిద్ధాంతాన్ని తుత్తినియలుగా ఖండించవచ్చు. శంకరులు వేద ప్రమాణం లేని బౌద్ధిక వాదనలను తమ సూత్ర భాష్యంలో ఖండించారు.

శంకరులు తమ సిద్ధాంతాన్ని ప్రతిష్టించడంలో తర్కాన్ని ఉపయోగించలేదా? ఉపయోగించకేమీ? శంకరుల సిద్దాంతంలో అశేషశేమషీ వైభవం కనిపిస్తుంది. పూర్వపక్షములను త్రోసివేయడంలో మహాతార్కికుల శ్రుతివాక్యముల బలం ఉంటుంది. సోపాన పంచకంలో 'దుస్తర్కస్తు విరమ్యతాం శ్రుతిశిరస్తర్కోను సంధీయతాం' అంటారు వారు. శంకరులు తర్కములు శ్రుతిమతమును సుష్టుగా ప్రతిష్టించడానికి ఉపయోగించారు. ఎంతటి సునిశితమైన వాదములైనా ప్రమాణం మీద నిలబడకపోతే నేల విడిచి సాము వలె పరిణమిస్తాయి.. బ్రహ్మవస్తువు మనస్సు కందేది కాదు. మనస్సు కందని విషయాలను బోధించేది శ్రుతి. శ్రుతి కూడా బ్రహ్మవస్తువును శృంగగ్రాహికగా చెప్పగలిగిందా అంటే 'నేతి నేతి' (ఇది కాదు) వాక్యములచే మాత్రమే అందించగలిగింది. అటువంటి అనిర్వచనీయమైన వస్తువును నిర్వచించడానికి బుద్ధివాదాలు ఉపయోగిస్తాయా?'

ఇక పూర్వమీమాంసా శాస్త్రమున్నది. వేదప్రామాణ్యములు వేనోళ్ల చాటుతుంది. కానీ బ్రహ్మప్రతిపాదములైన వేదవాక్యములను అర్ధవాదములంటుంది. శంకరుల తరువాత వచ్చిన ఆచార్యులు కూడా శ్రుతివాక్యములకు మొత్తముగా సమన్వయం చేయలేకపోయారు. శ్రుతిని మొత్తంగా సమన్వయ బరచగలిగింది ఆదిశంకరులే! అంతేకాదు. ఆ దర్శనమునకు ఈశ్వరాస్థిత్వము ప్రధానము కాదు. కర్మల ఫలితంగా ఉద్భవించే అపూర్వము వలన క్షణికమైన స్వర్గాదులు సిద్ధించవచ్చు కానీ మోక్షం సాధ్యం కాదంటారు శంకరులు. అయితే కర్మకు అద్వైత శాస్త్రంలో ప్రయోజనం లేదా? లేకేమీ? పరమమైన ప్రయోజనమున్నది. దేహభ్రాంతి ఉన్నంత వరకూ కర్మ తప్పదు. కర్మ ఫలితం చిత్తశుద్ది. చిత్తశుద్ది లేనివారికి జ్ఞానమును పొందటం కుదరదు.

ఈ విధంగా శంకరులు ఏ దర్శనములు పూర్తిగా అసత్యమని కొట్టివేయలేదు. పైదర్శనములలోని వాదములనన్నిటినీ తమ అద్వైత సిద్దాంతము ప్రతిష్టించడానికి ఉపయోగించుకొని, మిగతా అన్ని దర్శనములనూవేదాంత దర్శలమును సజావుగా అర్ధం చేసుకొనే మార్గములుగా తీర్చిదిద్దారు. ఈశ్వరాస్థిత్వములే ఒప్పుకోని కర్మకాండను పరమేశ్వర ముద్ధిశ్య, పరమేశ్వర ప్రీత్యర్ధం అని ఆరంభింప చేసి తత్‌ సత్‌ బ్రహ్మార్పణమస్తు అని ముగింపజేశారు. ఈ దేహ భ్రాంతి ఉన్నంత వరకూ కర్మో, ఉపాసనో, యోగమో, విచారమో తప్పదు. వాటికి పై దర్శనములు ఉపయుక్తములు. అత్యంతిక మైనది మాత్రం జీవన్ముక్తత్వం. బ్రహ్మ సాక్షాత్కారం.

ఇక స్మృతులు 'షట్కర్మాభిరతో నిత్యం' అని సంధ్య, జప, హోమ, దేవతారాధన, ఆతిధ్య, వైశ్యదేవములనే షట్కర్మలు అనవతరమూ ఆవశ్యంగా చేయవలసినదని శాసిస్తున్నాయి. శంకరుల కాలంలో ఈ దేవతారాధనమనే కర్మ వెఱ్ఱి తలలు వేసింది. సమాజంలో, స్త్రీలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఆరాధించడానికి అనువుగా ఉపాసనా మార్గములు వచ్చాయి. ఈ మార్గములను వివరించే శాస్త్రములను ఆగమములంటారు. ఆగమములలో మంత్ర తంతాదులు వివరించబడి యుంటాయి. మొట్టమొదటి ఆగమ ప్రవర్తకులందరూ తమ ఆగమము వేదములనుండి గ్రహింపబడినదనే చెప్పుకొన్నారు. క్రమశః ఉపాసనలలో ఒకానొక విధమైన ఉద్వేగమును, విచిత్రమైన మనఃస్థితిని పొందటం కోసం చౌకబారు కర్మాచరణలు తంత్రములలో చొరబడ్డాయి.

దేశంలో బౌద్ద జైనములు ప్రచారమయి, వేదాధికారము ప్రశ్నించబడటంతో ఆయా ఉపాసనా మార్గానుయాయులు వేదములలో చెప్పబడిన దానికంటే తాము ఆచరించేవే ప్రమాణమైనవని చెప్పుకోనారంభించారు. మనుష్యులను బలి ఇచ్చే కాపాలికాది మతములు, మధ్యమాంసాదులతో పూజించే వామాచార పద్ధతులు, శరీరంపై తమ ఇష్టదేవతా చిహ్నంగా కాల్చుకొనే ఆచారాలు వంటి విపరీత ధోరణులు చోటు చేసుకొన్నాయి. వీరంతా తాము హిందూమతమునకు చెందిన వారమనే చెప్పుకుంటారు. వారిదే అసలైన హిందూమతమంటారు. ఈరకంగా శంకరుల కాలంనాటి 72 దుర్మతములు ఆచారంలో ఉన్నవని శంకరవిజయాలు చెబుతున్నాయి.

శంకరులు వేద పరిధిలో ఉన్నంత వరకూ ఏ ఉపాసనకూ, ఏ తంత్రమునకూ, ఏ మంత్రమునకూ వ్యతిరేకి కాదు సరికదా ప్రోత్సాహం కూడా చేసేవారు. అద్వైతం పరమోత్కృష్టమయిన సత్యం, చేరదగిన గమ్యం అని గుర్తించి తమకు విధించిన కర్మానుష్టానమో, నచ్చిన ఉపాసనమో చేయమనీ, అది అద్వైతానికి దారి తీస్తుందనీ వారు బోధించారు. ఈ రోజుకు కూడా శంకరాద్వైతములో ఉద్దండ పండితులైన పీఠాధిపతులు సైతం తాము స్వయంగా వారికి విధించబడిన కర్మానుష్టానం, ఉపాసన చేస్తూ ప్రజలకు కర్మోన్ముఖులను చేస్తుండటం మనం చూస్తున్న విషయమే! శంకరులు వివిధ ఆగమములను, తంత్రములను, ఉపాసన పద్ధతులనూ పరిశీలించి ఆరు కూటములుగా విభజించారు. ఉదాహరణకు గణపతిని తీసుకొంటే మహాగణపతి, ఉచ్ఛిష్ఠ గణపతి, నవనీత గణపతి, సువర్ణ గణపతి, సనాతన గణపతి మొదలైన గణపతి మూర్తులను ఆరాధించే తంత్రములన్నీ ఒక కూటము. ఈ విధంగా శైవము, శాక్తము, వైష్ణవము, సౌరము, ఈ మూర్తులను శంకరులు క్రొత్తగా ప్రవేశ##పెట్టలేదు. తంత్రములన్నీ పంచాయతన దేవతలతో ఎవరికో ఒకరికి సంబంధించినవిగా నిర్ణయించారు. వారు ఏకదేవతోపాసనకు వ్యతిరేకులు కాదు. ఎవరి ఇష్టదైవము వారు మహోన్నతమైనదనుకోవడంలో వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇతర దేవతలను కించబరచడానికి వారు ఒప్పుకోరు.

శంకరులు ఆయా సిద్దాంతాలకు సంబంధించిన వారినందరినీ విడివిడిగా సమావేశపరిచారు. పరమాత్మ వారికి ఇష్టమైన దేవతామూర్తి స్వరూపంలోనే ఉండనక్కరలేదు. ఏ దేవతా స్వరూపంలోనైనా ఉండవచ్చుననే సత్యానికి ఒడంబరిచారు. వివిధ తంత్రాలను పరిశీలించి అవైదిక సంప్రదాయాలను, తామసి పూజాపద్దతులను తొలగింపచేశారు. వారందరినీ వేదప్రామాణ్యాన్ని ఒప్పుకొనేటట్లు చేశారు. బహుపురాతనమైన పంచాయతన పూజా విధానాన్ని పునరుద్ధరించారు. వారికి ఇష్టమైన దేవతలు మధ్యలోనూ, మిగతా దేవతలను అంగదేవతలుగానూ ఉంచుకొని, ఒకే పరమాత్మ ఆయాకార్యాలలో ఆయామూర్తిగా దర్శనమిస్తాడనే భావనను పెంపొందింపజేశారు. జ్ఞానమునకు, అగ్నికి ప్రతీక అయినవాడు సుబ్రహ్మణ్యుడు (కౌమారం) ఆరవవాడు. అవసరమైనవారు ఆ మూర్తిని పెట్టుకొని ఉపాసన చేయవచ్చు. కానీ అద్వైత భావనా, అగ్న్యారాధనా ఉంటే విడిగా పెట్టుకోనవసరం కూడా లేదు. పంచాయతనమూర్తులు ప్రతిగృహంలోనూ జాతీయ సమైక్యతాభావాన్ని బోధిస్తాయి.

ఈ విధంగా భారతీయ సమైక్యతామూర్తి అయిన శంకరభగవత్పాదుల వారు అయిదు వైదిక దర్శనములను శ్రుతిమూర్ధన్యమైన వేదాంతంలోనికి, అయిదు ఉపాసనా మార్గములను అద్వైత స్పూర్తి, జ్ఞానమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు అధిష్టానంగా ఉన్న పంచాయతన పూజా విధానంలోనికి పర్యవసింప జేసి సనాతన హిందూ ధర్మ సమైక్యతను సాధించారు. పంచాయతన పూజ కూడా భారతదేశపు ఏకత్వాన్ని నిరూపిస్తుంది. శంకరులకు 'షణ్మతప్రతిష్టానాచార్య' అన్న పేరున్నది. నర్మదలో దొరికే బాణలింగము, నేపాళంలోని గండకిలో దొరికే సాలగ్రామం, కాళహస్తిలో ఉన్న స్వర్ణముఖిలో దొరికే అంబికా స్వరూపమైన శిల, గంగానదికి ఉపనది అయిన శోణభద్రలో దొరికే గణనాధుని స్వరూపమైన ఎఱ్ఱటిరాయి, తంజావూరు సమీపంలో ఉన్న నదిలో దొరికే స్పటిక రూపమైన సూర్యమూర్తి చేరి పంచాయతన మవుతోంది. మన సనాతన ధర్మంలోని ప్రతి అంశము భారతీయ సంస్కృతి, భారతదేశముల ఏకత్వమును చాటిస్తున్నాయి. దానిని అనేక సత్సంప్రదాయములను నెలగొల్పడం ద్వారా మరింత ప్రోది చేశారు భగవత్పాదులవారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page