Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

13. ఆర్యాంబ అంత్యక్రియలు

వ్యాసులవారి ఆజ్ఞానుసారం శంకరులు వైదికధర్మ ప్రచారానికై బదరి నుండి బయలదేరబోతూ తమ గురువులను సందర్శించారు. వారు చలికాలంలో స్నానం చేయడానికి అనువుగా ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారని శంకర విజయాలు చెబుతాయి. గురుపరమగురువుల వద్ద శలవు తీసుకొని బయలుదేరేంతలో కాలడి నుండి శంకరుల మాతృమూర్తి ఆర్యాంబ పంపగా పెద్దమొత్తంలో ద్రవ్యాన్ని తీసుకొని అగ్నిశర్మ అనే నంబూద్రి ఆమె ఆరోగ్యం బాగాలేదనే వార్తను మోసుకొని వచ్చారు. ఆమె శంకరులకిష్టమైన రీతిలో ఆ ద్రవ్యాన్ని వెచ్చించవలసినదిగా కోరారట. అంతకు ముందే శంకరులకు అలకానందనదిలో అత్యంత మనోహరమైన నారాయణుని విగ్రహం దొరికింది. తల్లిగారు ఇచ్చిన ద్రవ్యాన్ని బదరీనారాయణుని దేవాలయం కట్టడానికి వినియోగించమని పద్మపాదుని ఆదేశించి, ఆ దేవాలయపు అర్చకునిగా ఈ అగ్నిశర్మ అనే నంబూద్రిని నియోగించి, తాము యోగమార్గంలో కాలడి చేరారు. ఈనాటికీ బదరీనారాయణాలయంలో పూజారులు నంబూద్రి కుటుంబానికి చెందినవారే.

పుత్రుని చూచి అమందానందం పొందారు ఆర్యాంబ. ఆమెకు శంకరులు స్మరించినంతనే తప్పక వస్తారని తెలుసు. సామాన్యుడైన కొడుకా వారు. శిశువుగానే కనకధార కురిపించిన వారు. తనకై చూర్ణానదీ గమనాన్నే మార్చినవారు. వచ్చిన శంకరులు 'అమ్మా! నీకిచ్చిన మాట ప్రకారం నీవు తలచినంతనే నేనొచ్చాను' అన్నారు. 'నాయనా అవసాన సమయంలో నిన్ను చూచాను. కృతార్థను' అన్నది ఆ తల్లి. శంకరులు ఆమెకు ఆత్మబోధ చేశారు. ఆమెకు అవగతమవలేదు. మహేశ్వర ప్రార్థన చేశారు. అత్యంత ప్రీతుడైన మహేశ్వరుడు ఆర్యాంబను తోడ్కొని వెళ్ళడానికి ప్రమధ గణాన్ని పంపాడు. ఆర్యాంబ వారిని చూచి భయపడింది. అమ్మకు విష్ణువంటే ప్రీతి. అది వారికి తెలుసు. ఆమె కొరకై తామేకదా కృష్ణాలయాన్ని పునరుద్ధరించి వెళ్ళారు. ఆమె ద్రవ్యం ఆమెకిష్టమైన నారాయణుని దేవాలయ నిర్మాణానికి వెచ్చించారు. శంకరులు విష్ణుప్రార్థన చేశారు. విష్ణుదూతలు వచ్చారు. పరమానంద భరితయై శ్రీకృష్ణపాదములపై లగ్నమైన మనస్సుతో అపరశివుని తల్లి ఆర్యాంబ విష్ణులోకాన్ని చేరారు. పరమ ప్రయోజనమైన సన్యసాశ్రమ స్వీకారం కోసం, తల్లిగారికి తాను అంత్యక్రియలు చేస్తానని చేసిన వాగ్దానం నిర్వర్తించడానికి సమకట్టారు శంకరులు. ఏ సత్యవాక్పరిపాలన కోసం దశరథుడు నిశ్చేష్ఠుడై చూస్తూ ఉండగారామచంద్రులవారు అడవులకు వెళ్ళడానికి సమకట్టారో ఆ సత్యవాక్పరిపాలన కోసం శంకరులు తల్లిగారికి అంత్యక్రియలు చేయ నిశ్చయించారు. ఆత్మసాక్షాత్కారము పొందటానికి సత్యబ్రహ్మచర్యములు చాలా ముఖ్యమైనవని శంకరులు చాందోగ్యోపనిషద్భాష్యంలో వక్కాణించారు కదా! తానుగా అంత్యక్రియలు చేయడానికై పూర్వాశ్రమ బంధువులైన నంబూద్రిలను సహాయానికై అర్ధించారు.

'నిసై#్త్రగుణ్య పథి విచరితో కోవిధిః కోనిషేధః' సత్త్వరజస్తమోగుణములకు అతీతమైన మార్గంలో చరించే బ్రహ్మవేత్తలకు విధి నిషేధము లేమున్నవి. ఊరివారికి శంకరుల బ్రహ్మణ్యత, వారి ఈ నిర్ణయము వెనుకనున్న సత్యసంధత అర్ధం కాలేదు. అర్ధం కాలేదనడం కంటే అర్థం చేసుకోవడానికి నిరాకరించారని చెప్పుకోవచ్చు. వారి ఉద్దేశ్యంలో శంకరులు సన్యాసి - సన్యాసికి సంస్కారం చేసే అధికారం లేదు. శంకరులు తమ నిర్ణయం నుండి చలించలేదు. సన్యాసులకు అగ్నిని రగిలించే అధికారం లేదు. ఊరివారు తల్లి శరీరాన్ని దహించడానికి చితుకులు ఈయలేదు సరికదా నిప్పులు ఈయడానికి కూడా నిరాకరించారు. శంకరులు తల్లిగారి మృతదేహాన్ని పెరటిలో చేర్చి అక్కడున్న అరటిబాదులపై ఉంచి, తన కుడిభుజం నుండి అగ్నిని మధించి, అగ్నిని ప్రార్ధించగా ఆయన తల్గిగారిని తనలో ఐక్యం చేసుకొన్నాడు.

ఎక్కువభాగం శంకర విజయాలు పాషాణ హృదయులైన ఆ ఊరి నంబూద్రులకు శంకరులు వారికి వేదశాస్త్రములు అంటవనీ, ఆ ఊరిలో సన్యాసి ఎవరైనా వసించినా, భిక్షచేసినా పతితులవుతారనీ శపించారని చెబుతున్నాయి. ఇంకా శవాలను కూడా పెరట్లో తగలపెట్టుకొనే వారవుతారని కూడా శంకరులు శపించారని కొన్ని శంకర విజయాలు చెప్పినా, ఆ దేశపు రాజుగారు విషయం తెలుసుకొని ఎంతో బాధపడి, వారి మౌఢ్యానికి గుర్తుగా ఆ నియమం చేశారని కొన్ని శంకర విజయాలు చెబుతున్నాయి. మనం రెండో పక్షమే గ్రహిద్దాం. అయితే దరిదాపు అన్ని శంకర విజయాలూ చెబుతున్న మొదటి రెండు శాపాల గురించి కొంచెం పరిశీలిద్దాం. శంకరులు తమ భాష్యాలలో ఎంతటి మహాపండితుడయినా సంప్రదాయమును పాటించకపోతే వారిని లక్ష్యపెట్టవలసిన అవసరం లేదని చెప్పారని మనం ముందే చెప్పుకొన్నాం కదా! నిజమే! వారు జ్ఞానులు. వారి వరకూ వారికి విధినిషేధములు లేవు. కానీ సామాన్య సన్యాసి తన తల్లి ఉత్తరక్రియలు చేయడం తప్పు అవునా కాదా? సంప్రదాయమును ఎంతో గౌరవించిన శంకరులు ఊరివారు ఆ విధంగా ఎదిరించడాన్ని చూచి సంతోషించి ఉండాలి కదా? దానికి నాకు ఒకే సమాధానం తోస్తుంది. స్నానమునకు పోతూ ఉమ కావలి ఉంచిపోయిన వినాయకుడు తనను లోపలికి పోనీయలేదని శిరస్సు తురిమివేశాడు శివయ్య! తమను లక్ష్మీనారాయణుల అంతరంగిక మందిరం లోనికి పోనీయ లేదన్న దోషానికి జయవిజయులను శపించారు సనకాది మహామునులు. మరి మహాత్ముల మహాత్త్వం గుర్తించకపోవడం కూడా అపరాధమేనేమో! ఆ మునుల శాపం విష్ణుమూర్తికూడా వారిని కాపాడలేక పోయాడు కదా! ఏదో తరుణోపాయం సూచించాడనుకోండి. శంకరవిజయముల ననుసరించి అప్పటికే శంకరుల మహత్త్వము దశదిశలా ప్రసిద్ధమని మనం గుర్తించాలి. ఏదో త్వరితగతిన రావాలని యోగమార్గంలో వచ్చారు కానీ, లేకుంటే వారిని అనుగమించి ఆరేడువేలమంది శిష్యులుండేవారని తెలియవస్తోంది. అంతటివారు తాము చేసేది ధర్మసూక్ష్మమని చెబుతున్నప్పుడు మౌఢ్యాన్ని చూపడం అపరాధమే! ఏమయినా తల్లిగారిపై శంకరులకు గల భక్తి అనన్యసామాన్యమైనది. వారి సత్యసంధత్వము, తన నిర్ణయంపై ధైర్యంగా నిలబడటం అనే లక్షణములు ఈ సంఘటనలో వెలువరించబడినాయి.

తల్లిగారిని కడతేర్చిన భగవత్పాదుల వారు తిరిగి బదరీ చేరి అప్పటికి పూర్తి అయిన దేవాలయంలో బదరీ నారాయణుని సేవించి నిరంతరం పెరుగుతున్న పరివార శిష్యగణంతో అఖిల భారత విజయయాత్రనారంభించారు. కొన్ని శంకర విజయములు శంకరులు కాలడి నుండి నేరుగా ప్రయాగ చేరారని, అక్కడ శిష్యగణం వారిని చేరిందనీ చెబుతాయి.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page