Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

12. వ్యాస సందర్శనము

బదరికాశ్రమము చేరిన శంకరులు అక్కడ గోవింద భగవత్పాదులవారు విడిది చేసి ఉండటంతో వారిని దర్శించి, వారి అనుగ్రహం వలన పరమగురువులైన గౌడ భగవత్పాదుల వారి దర్శనం చేశారు. గౌడ భగవత్పాదులు మాండూక్యోపనినషత్తుకు అద్వైత పరమైన కారికలు వ్రాసినవారు. గౌడ భగవత్పాదులవారిని శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంతో నమస్కరించారు. వారు శంకరుల విషయ పరిగ్రహణలో నేర్పుకు, బుద్ది కుశలతకు ఎంతో సంతసించి భాష్య రచనకు ప్రోత్సహించారు. పూర్ణానదీ తీరాన ఎనిమిది సంవత్సరాలకు సన్యాసం స్వీకరించిన శంకరులు గోవింద భగవత్పాదుల నుండి శలవు తీసుకొని కాశీనగరం ఏ తొమ్మిదేళ్లకో చేరినా కనీసం మూడు సంవత్సరముల పాటు కాశీలోని అనేకమంది విద్వాంసులతో చర్చలు జరిపి ఔపనిషద సిద్దాంతము మీద స్థిరమైన సుస్పష్టమయిన అవగాహన ఏర్పరచుకొన్నారు.

సనాతన వైదికధర్మానికి ప్రమాణములు వేదములు స్మృతులు, పురాణములు. వేదమతము ఔపనిషద మతమేననడంలో సందేహం లేదు. అయితే అనంతములైన వేదశాఖలు ఉన్నట్లే అనంతములైన ఉపనిషత్తులు ఉన్నవి. వీటిలో వేటిని ప్రధానంగా తీసుకోవాలి? ఉపనిషత్తులను సమగ్రంగా పరిశీలించిన శంకరులు ఈశ, కేశ, కథ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకములకు భాష్యం వ్రాస్తే ఉపనిషత్తులన్నిటికీ భాష్యం వ్రాసినట్లేనని తీర్మానించుకొన్నారు. వీటిని దశోపనిషత్తులు అంటారు. వీటిపై శంకరులు వ్రాసిన భాష్యమునకు శ్రుతి ప్రస్థానమని పేరు. మహాభారతములోని భగవద్గీత, సనత్సుజాతీయము, విష్ణు సహస్రనామములకు శంకరులు వ్రాసిన భాష్యమునకు స్మృతి ప్రస్థానమని పేరు. స్మృతులు అనంతములైన వేదములను సాకల్యంగా పరిశీలించి దానిలో చెప్పబడిన పండితార్ధాన్ని స్పష్టీకరిస్తాయి కదా! ఇక మనకు అనువుగా సమస్త వేదాంత సారాన్ని బాదరాయణవేదవ్యాసుల వారు వేదాంతసూత్రములు వ్రాసి పెట్టారు. ఏ సూత్రాన్ని స్మరిస్తే ఏ విషయం గుర్తుకు రావాలో చక్కగా అర్ధమవడానికి శంకరులు సూత్రభాష్యం వ్రాశారు. దీనిని తరువాత వచ్చిన శ్రీమద్రామానుజులవారు కానీ, శ్రీమధ్వాచార్యులవారు గానీ తమ తమ సిద్దాంతానుసారంగా మూడు ప్రస్థానములకు వ్యాఖ్యానం చేశారు. విశేషమేమంటే ఇప్పుడున్న సమస్త వైదిక సాంప్రదాయములను ఇది ఈ విధంగా ఉండాలి అని పరిశీలించి వ్యవస్థ చేసిన వారు శ్రీశంకరులే. వేదాంత సిద్దాంతమును శ్రుతిసమ్మతంగా సమన్వయపరిచిందీ శ్రీశంకరులే.

ప్రస్థానత్రయ భాష్యాన్ని వ్రాసి బదరికాశ్రమములోనున్న తన గురు, పరమ గురువులు మొదలుగాగల మహానుభావులకు చూపి వారి ఆమోదముద్ర పొందటానికి శంకరులకు నాలుగేళ్లు పట్టింది. వారికిప్పుడు పదునారు వర్షములు. వృషాచలేశ్వరుడు ఎనిమిది వర్షముల ఆయుర్దాయముతో వారికి జన్మను అనుగ్రహించాడు. సన్యాసాశ్రమ స్వీకారము వలన ఆ గడువు మరొక ఎనిమిది సంవత్సరములు పొడిగించబడింది. చేయవలసిన మహత్కార్యము అయిపోయింది. తృప్తులైన శంకరులు విదేహ ముక్తికై యోచన చేస్తున్నారు. అప్పుడొక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఇది కాశీలో జరిగిందని కొన్ని చరిత్రలు చెబుతుంటే బదరిలో జరిగిందని మరి కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. అసలు భాష్యరచన కూడా కాశీలో జరిగిందన్నవారు ఉన్నారు. ఏ క్షేత్రంలో జరిగినా కథకు వచ్చిన ఆపత్తు ఏమీ లేదు. అయినా వ్యాసభగవానులు బదరికాశ్రమంలో చిరాయువులుగా ఇప్పటికీ వసించి ఉన్నారని నమ్ముతాం కాబట్టి వారికి కాశీలో ప్రత్యక్షమవడం కూడా పెద్ద లెక్కలోని విషయం కాకపోయినా ఈ సంఘటన బదిరిలోనే జరిగిందని చెప్పుకొందాం. నర్మదానది వరదలను తన కమండలంలో నిగ్రహించే అపర శంకరులైన శంకరులకు మంత్రోపదేశం చేయమని నిర్దేశించి, గోవిందభగవత్పాదుల వారిని నర్మదా తీరానికి పంపిన వ్యాసులవారు ఇప్పుడు ఆ శంకరులు వ్రాసిన భాష్యము యొక్క ఔన్నత్యాన్ని లోకానికి చాటటానికి ఆయుర్దాయం నిండిన శంకరులకు మరొక్క 16 ఏళ్ల జీవితాన్ని ప్రసాదించడం ద్వారా వారి భాష్యములను బహుళ ప్రచారంలోనికి తీసుకొని వచ్చే ఏర్పాటు చేయడానికి ఒకరోజు భాష్యపాఠం చెబుతున్న శంకరుల వద్దకు వృద్ద బ్రాహ్మణ రూపంలో దయ చేశారట. భాష్యపాఠం ముగించబోతున్న శంకరుల వ్యాఖ్యానంపై ప్రచండమైన పూర్వపక్షం చేశారట. ప్రకరణం పైన ఈ ప్రచండమైన పూర్వపక్షం కొనసాగింది. శంకరులు సమర్దవంతంగా పూర్వపక్షాన్ని పరాస్తము చేసి సిద్దాంతీకరించ బోయేంతలో సిద్దాంతములోని సూక్ష్మాంశములను విమర్శిస్తూ, దానిలో వంద దోషాలను చూపుతూ మళ్ళీ పూర్వపక్షం చేశారట వ్యాసులవారు. దానికి వెయ్యి రకములైన ఖండనలు చేయనారంభించారు శంకరులు. ఇరువురు మహాపురుషులు అనేక శ్రుతి, స్మృతి, పూరాణతిహాసములలోని ప్రమాణ వాక్యములను తమ వాదనకు బలంగా గుచ్చెత్తి పోస్తున్నారు. శిష్యులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనయ్యారు. ఇంత వరకూ ఒకసారి సిద్దాంతం చేసిన తరువాత తమ గురువుగారి వాదంలో లోపములు చూపిన వారే లేరు.

ఈ వాదం నాలుగు రోజులు సాగింది. వ్యాసులవారి వాదం వరదల్లో విజృంభిస్తున్న గంగానదీ ప్రవాహంలా ఉన్నది. శంకరుల వాదం సాగర గంభీరంగా ఉంది. పద్మపాదుల వారికి అనుమానం వచ్చింది. శంకరుల కెదురుగా వాదం చేయగల సమర్దులు బదరికాశ్రమ వాసియైన బాదరాయణులు తప్ప వేరెవరున్నారు. ఆ వచ్చిన మౌని వ్యాసుడని గ్రహించారు. ఇరువురి నడుమ నిలబడి నమస్కారం చేసి 'శంకరులు సాక్షాత్‌ శివావతారము. వ్యాసులు నారాయణావతారము. వీరిరువురూ వాదం చేస్తుంటే కింకరుడనైన నేనేమి చేయగలను' అని పలికారు. శంకరులు వ్యాసభగవానులే తమ ముందున్నారని గ్రహించి ప్రాంజలి బద్దులై తమ భాష్యమును ఆమూలాగ్రము పరిశీలించి వ్యాస హృదయము సవ్యముగా ఆవిష్కరించబడినదీ లేనిదీ దయచేసి చెప్పమని కోరారు. వ్యాసులవారు శంకరభాష్యము సూత్రములకు యాదార్ద్యమైన అర్ధాన్ని స్పురింపచేసేదిగా ఉన్నదని బహుధా శ్లాఘించారు.

శంకరులు తమ కార్యం ముగిసింది కాబట్టి వారి సన్నిధిలోనే విదేహ ముక్తిని పొందెందుకు అనుమతి కోరారు. 'భాష్యం వ్రాస్తే సరిపోయిందా? దానిని ప్రచారం చేయాలి. ఎవరైనా ఆక్షేపణ చెబితే సమాధానం చెప్పాలి. భాష్యంలోని వివాదాలను సుస్పష్టంగా సిద్దాంతీకరించాలి. ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తూ జైత్రయాత్ర చేయాలి' అని నిర్దేశిస్తూ బ్రహ్మదేవుని ప్రార్దించి మరొక్క పదునారు సంవత్సరములు ఆయుర్దాయం పొడిగించారు.

శంకరుల తరువాత వచ్చిన విశిష్టాద్వైత, ద్వైత ఆచార్యులిరువురూ కూడా వ్యాస సూత్రములను ఆధారంగా తమ సిద్ధాంతమును ప్రతిపాదించారని చెప్పుకున్నాం. వారు కూడా వ్యాస సందర్శనం చేసి వారి సిద్దాంతానికి వ్యాసులవారి ముద్ర పొందారనీ, వారి వారి చరిత్రలలో వ్రాయబడి ఉంది. అయితే వ్యాసులవారి హృదయం ఏమిటి? ఈ విషయాన్ని తిరువిసైనల్లూర్‌ అయ్యన్న దీక్షితుల వారు వేరొక దృక్కోణంలో పరిశీలించారు. వ్యాసతాత్పర్యనిర్ణయమనే చిన్న పుస్తకం వ్రాశారు.

శంకరులకు పూర్వము సాంఖ్య, మీమాంస, న్యాయదర్శనములు, జైన, బౌద్ధ సిద్ధాంతాలు, కాశ్మీర, శైవాదిశైవ సిద్ధాంతాలు, వైష్ణవ సిద్ధాంతాలు ఉన్నవి. వీరంతా వ్యాసుల బ్రహ్మసూత్రములను ఖండించారు. పూర్వకాలంలో ఎవరైనా ఒక సిద్దాంతాన్ని ఖండించాలంటే ఆ సిద్దాంతాన్ని ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకొని, ఆ సిద్ధాంతాన్ని చెప్పి ఖండించాలి. పై సిద్ధాంత కర్తలందరూ వ్యాసమతమని దేనిని చెప్పి ఖండించారో అవి వారి గ్రంధముల నుండి ఎత్తి చూపి, వారు ఖండించినది అద్వైత సిద్ధాంతమే కాబట్టి వ్యాస హృదయం అద్వైతమేనని నిర్ధారించారు అయ్యన్న దీక్షితులవారు. దీని వల్ల వేదాంత సూత్రములో వ్యాసులు ప్రతిపాదించినది అద్వైతమేనని అర్ధం అవుతోంది.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page