Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

11. ఏషామనీషామమ

శంకరులు కాశీవాసం చేస్తున్న రోజులవి. వారు ఒకరోజు మధ్యాహ్న స్నానానికై మణికర్ణికా ఘట్టానికి వెళుతున్నారు. దారిలో ఒక ఛండాలుడు ఎదురయ్యాడు. వేదాలు నాల్గు కుక్కలుగా, గంగాదేవి కల్లుముంతగా, పార్వతీదేవి అతడి యువతిగా కాశీ విశ్వేశ్వరుడే అలా వచ్చాడని శంకర విజయాలు చెబుతాయి. అతడు కాశీ విశ్వేశ్వరుడు కాకపోయినా కథకు వచ్చే ప్రమాదం లేదు. సరి! శంకరులు అలవాటుగా అతనిని ప్రక్కకు తొలగమన్నారు. అతడీ విధంగా అన్నాడు. 'స్వామీ! నా శరీరమూ తమ శరీరమూ అన్నమయమయినట్టివే! పంచభూతాదులతో తయారు చేయబడినవే! నాలోనూ తమలోనూ ఒకే చైతన్యం ప్రకాశిస్తోంది. తాము తప్పుకోమంటూ దేని నుండి దేనిని దూరం చేయాలని వాంఛిస్తున్నారు? శరీరమయితే రెండింటికీ సార్థక్యము లేదు. చైతన్యమందామా ఉన్నది ఒకటే చైతన్యమవడాన అది పొసగదు' అని అతని భావం. తన వాదాన్ని మరింత విశదబరుస్తున్నాడు. 'ఏం స్వామీ! సూర్యుడు పవిత్రమైన గంగాంబువులందు ప్రకాశించినట్లే ఛండాల వాటిక యందు గల నీటిలో కూడా ప్రకాశిస్తున్నాడు కదా! రెండుచోట్లా ప్రకాశించేది ఒక సూర్యుడే కదా! మట్టి కడవలోని ఆకాశానికి బంగారు కడవలోని ఆకాశానికి వ్యత్యాసమేమన్నా ఉన్నదా? నిస్తరంగ సహజానంద సముద్రమగు ఆత్మయందు ఇతడు ఛండాలుడు, అతడు విప్రుడు అనే బేధ విభ్రమము తమకెలా కలిగింది స్వామీ'!

పరమేశ్వరునకూ మనకూ మధ్య అబేధాన్ని చూపడానికి వేదాంతంలో రెండు వాదాలున్నాయి. ఒకటి బింబ ప్రతిబింబవాదము. రెండవది అపరిచ్చిన్న వాదము. అద్దములలో తేడాలను బట్టి మన ప్రతిబింబము లావుగానో, సన్నగానో, బారుగానో, పొట్టిగానో కన్పించవచ్చు. బింబమొక్కటే కదా! అలాగే పరమాత్మ అంతఃకరణ ఉపాధి బేధాన్ని బట్టి వేరుగా కన్పిస్తున్నాడు. అద్దం పగిలిపోతే ప్రతిబింబము లుప్తమై, ఒక బింబమే ఎలా మిగులుతుందో, మనస్సు అంతఃకరణ) లయమయిపోతే బింబ భూతుడైన పరమాత్మ ఒక్కడే మిగులుతాడు. 'కిం గంగాంబుధి' అంటూ అతడు సూచించినది ఈ బింబ ప్రతిబింబ వాదము.

ఇదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్పేది అపరిచ్ఛిన్న వాదము. బావిలో నీరున్నది. దానిని చిన్నముంతలో గ్రహిస్తాము. రెండూ నీరే అయినా ఉపాధి బేధముంది. అలాగే కుండలో ఉండే ఆకాశం, మహాకాశం (బయట ఉన్న ఆకాశం) రెండూ ఒకటే. కుండలో ఉన్నది కాబట్టి ఘటాకాశం అంటున్నాము. అంతటా వ్యాపించి ఉంది కాబట్టి మహాకాశమంటున్నాము. కుండ బద్దలు కొడితే ఆ కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో లీనమవుతుంది. అంతటా నిండి ఉన్న మహాచైతన్యం ఆయా ఉపాధుల్లో ఉన్నప్పుడు ఆయా పేర్లతో పిలువబడుతోంది. ఆ ఉపాధి - అంతఃకరణ-మనస్సు లయమయిపోతే మహాచైతన్యం అయిపోతుంది. ఈ విషయాన్నే బంగారు కడవ, మట్టి కడవలోని ఆకాశం ఒకటే కదా! పై చెప్పబడిన చైతన్యం అన్ని ఉపాధుల్లోనూ వ్యాపించి ఉన్నది. అదిలేని చోటు లేదు. అది అవధులు లేని ఆనంద సముద్రము. అవధులు లేనందున అలలుండవు. అంతటా నిండి ఉన్న పూర్ణమైన వెలితిలేని చైతన్యాంబుధి అది. 'స్వామీ! ఇట్టి సర్వవ్యాపకమైన పదార్ధంలో వ్యత్యాసాన్ని తామెలా చూశారు' అనేది అతడి ప్రశ్న.

శంకరులు విధివత్తుగా కర్మానుష్టానం జరగవలెననే శాసించారు. దాని ద్వారా చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం సిద్ధిస్తాయని వారు ఉపదేశించారు. కర్మానుష్టానం మార్గమే కానీ గమ్యం కాదు. గమ్యం చేరిన వానికి కర్మానుష్టానంతో పనిలేదు. ఈ నియమాలు లేవు. త్రిగుణాతీతులైన వారికి - విధినిషేధములే మిన్నవి. అయితే ఇంద్రియాలు కల్పన చేసిన వ్యత్యాసం ఉన్నంత వరకూ నియమాలు పాటించవలసినదేనని వారి కట్టడి. ఒకదానిపై ఇచ్ఛ వేరొకదానిపై అనిచ్ఛ ఉన్నంత వరకూ కర్మానుష్టానం తప్పదు. వారు బింబరూపమైన పరమాత్మైక్యము పొందుతారు. ఒకరికి దేహభావం నష్టమయితె వారు బింబరూపమైన పరమాత్మైక్యము పొందుతారు. ఇక్కడ ప్రశ్న జ్ఞానమార్గంలో ఉన్నది. అలాంటి ప్రశ్న వేయగలిగారంటే పృచ్చకులు జ్ఞాని అయి ఉండాలి. శంకరులు జ్ఞాన మార్గంలోనే సమాధానం చెప్పారు. 'జాగ్రత్వప్న సుషుప్తుల యందు ఏ విజ్ఞానము అనవరతమూ ప్రకాశిస్తోందో, బ్రహ్మ నుండి చీమ వరకూ సర్వజీవుల యందు వ్యాపించి యున్నదో, సర్వసాక్షిగా యున్నదో - అట్టి విజ్ఞానము తానే యనియెడి ధృడమైన అనుభవమెవ్వరికి కలదో అతడు ఉపాధి చేత ద్విజుడైనా, ఛండాలుడైన నాకు గురువే. ఇది నా నిశ్చయము'. మరి నాల్గు శ్లోకములతో వేదాంత శాస్త్ర ప్రతిపాదన చేస్తూ, అట్టి ఆత్మజ్ఞులు తమకు గురువులే అని మరల మరల తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బ్రహ్మజ్ఞాన స్థితిలో బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు. ఛండాలుడు ఛండాలుడు కాదని శ్రుతి ఘోషిస్తోంది. దూరంగా తొలిగిపొమ్మని తరిమినదీ ఆచార్యులవారే! తరువాత అతని జ్ఞానవైభవము చూచి ప్రణమిల్లిన వారు కూడా ఆచార్యులే 'మొదట మిమ్ము మేము గుర్తించలేదు. బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు - మీకు నమస్కారము' అని శంకరాచార్యులవారు వారికి నమస్కరించారు. 'బ్రహ్మ విద్భ్రహ్మైవ భవతి' అన్న ఉపనిషద్వాక్యాన్ని అనుసరించి బ్రహ్మవేత్త బ్రహ్మే కాబట్టి అట్టి బ్రహ్మవేత్త ఎట్టి ఉపాధితో ఉన్ననూ పరమగురువులే అని శంకరుల నిశ్చయము. వైదిక మతానుయాయులమైన మనందరకూ ఇది వారి అనుశాసనము. శంకరవిజయములు ఛండాల వేషధారి అయిన కాశీ విశ్వనాధుడు సాష్టాంగ నమస్కారము చేసిన శంకరులకు నిజరూపంతో దర్శనమిచ్చి వారి నిశ్చయబుద్ధికి మెచ్చి ఉపనిషత్తులకు, గీతకు, బ్రహ్మసూత్రములకు భాష్యం వ్రాయవలసిందిగా ఆదేశించాడని చెబుతున్నాయి. ఆ ఆదేశం పాటించడానికి ప్రశాంతమైన వాతావరణం బదరికాశ్రమంలో ఉంటుందనీ, అక్కడి మహర్షులకు దర్శించి వారి అభిప్రాయములను కూడా స్వీకరించ వచ్చనీ శంకరులు బదరికాశ్రమము వైపు ప్రయాణం సాగించారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page