Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

10. కాశీవాసము

గోవింద భగవత్పాదుల చేత భాష్యములు వ్రాయవలసినదిగా ఆజ్ఞాపించబడిన శంకరులు కాశీ చేరారు. కాశీ మొన్న మొన్నటివరకు భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని. అన్ని సిద్దాంతముల మహాపండితులకు అది ఆవాసము. ఇప్పుడు శంకరుల ప్రతిపాదనము ఔపనిషద ధర్మమే శ్రుతి హృదయమన్నది. ఈ ప్రతిపాదనమునకు సమర్ధవంతముగా పూర్వ పక్షము చేయగల ధీమంతులు కాశీలోనే ఉన్నారు. అద్వైత సిద్ధాంతముపై వాదప్రతివాదములు జరిగి సుస్ధిరత నేర్పరచాలంటే వారి కాశీవాసము అత్యావశ్యకము. అంతేకాదు. భారతదేశంలో ఉండే మహాపండితులందరూ కాశీ వస్తారు కాబట్టి తమ వాదమునకు దేశపు నలుమూలలా అత్యంత త్వరితగతిన ప్రచారమేర్పడుతుందనే ఉద్దేశ్యం కూడా ఉండి ఉండవచ్చు.

కాశీ సృష్ట్యాదిగా ఉన్న మహాపట్టణమని, పంచక్రోశ పరిమాణమైన భూభాగమంతా మహాజ్యోతిర్లింగమనీ పురాణాలు చెబుతున్నాయి. కాశీ పవిత్రమైన పొలిమేరలలోనికి ప్రవేశిస్తూనే పులికితులైపోయిన శంకరులు కాశీపంచకముతో నగరాన్ని కీర్తించారు. గంగాష్టకము, మణికర్ణికాష్టకములతో తీర్థమును ప్రార్ధించారు. కాశీ విశ్వనాధుని, అన్నపూర్ణను, కాలభైరవుని స్తుతించారు. కాశీక్షేత్రంలో నివసించినంత కాలంలో శంకరులు మణికర్ణికాఘట్టంలో మూడు పూటలా స్నానం చేసి సంధ్యావందనాది విధులను నిర్వర్తించుకొనేవారని శంకర విజయాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఔపనిషద సిద్దాంతంపై ఆచార్యులవారు ప్రసంగించేవారు. ఈ ప్రవచనాలు వినడానికి కాశీవాసులే కాక భారతదేశం నలుమూలల నుండి ఆరువేలమంది మహాపండితులు కాశీలో విడిది చేసి ఉన్నారట. దిగ్దంతులైన పండితులు శంకరులను సావధాన చిత్తులై వినేవారు. పూర్వపక్షాలు చేసేవారు. పాదాక్రాంతులయి శిష్యులుగా స్వీకరించమని ప్రార్ధించేవారు. అట్లు ఆశ్రయించిన శిష్యులలో చోళ##దేశమునకు చెందిన విష్ణుశర్మ మొదటివారు. బ్రహ్మచారి. ఆయనను తన శిష్యునిగా స్వీకరించి సదానందులనే పేరుతోసన్యాసమిచ్చారు. కాలక్రమేణ శంకరుల వద్ద అనేకమంది గృహస్తశ్రమంలో ఉంటూనే శిష్యులుగా ఉండేవారు. అనేకులు శంకరుల వద్ద నిత్యము ఉపనిషత్తులు మూలగ్రంధంగా ఉపదేశించే పాఠాలను చదువుకొనేవారు. వారిలో అప్పటి కాశీనృపాలులొకరు.

ఒకరోజు అనేకమంది శిష్యులు వెంటనడుస్తుడగా గంగాస్నానానికి బయలుదేరారు శంకరులు. దారిలో 'డుకృజ్ఞకరణ' అనే వ్యాకరణసూత్రాన్ని వల్లె వేస్తున్న వృద్ధుని చూచారు. అతడిపై కరుణ కలిగింది. 'ఏమయ్యా ఎంత కాలం వ్యాకరణ సూత్రాలు వల్లిస్తూ నీ భాషను సంస్కరించుకొంటూ కాలం గడుపుతావు. నీకు ఎల్లప్పుడూ సన్నిహితుడుగా ఉండే మృత్యువు నిన్ను కబళిస్తుంటే ఈ సూత్రాలు నిన్ను రక్షిస్తాయా? గోవిందుని స్మరించవయ్యా' అంటూ మోహముద్గర అని పిలవబడే పన్నెండు శ్లోకాలలో క్షణికములైన లౌకిక ఆనందముల నిష్ప్ర¸°జకత్వాన్ని, సంసారమూలమైన మోహాన్ని జయించవలసిన అవసరాన్ని గురించి వివరించారు. శంకరుల వెనుకనున్న 14 మంది ముఖ్యశిష్యులు తలకొక శ్లోకం చొప్పున అతడిని ఉపదేశం చేశారు. ఈ శ్లోకాలు చక్కటి ఛందస్సుతో, లయబద్దంగా ఉండి నిరంతరం మననం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. శంకరుల నుండి ఉపదేశం పొందిన వృద్ధ పండితుడు తరించాడనడంలో సందేహం లేదు.

అయితే మనకొక సందేహం. ఈ శంకరులు మీమాంసా శాస్త్రాన్ని ఒక చోట ఖండిస్తారు. తర్కశాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతారు. వీరు వ్యాకరణ, తర్క, మీమాంసాది శాస్త్రములు అభ్యసించడానికి వ్యతిరేకులా? అలా అనడానికి వీలు లేదు. ఆయాశాస్త్రముల బలంతోనే, పునాదిపైనే శంకరులు తన అద్వైత సిద్దాంతాన్ని సుప్రతిష్టితం చేశారు. గణితశాస్త్రం అభ్యసించడానికి ఎక్కాలు అవసరమనే విషయంలో మనకు సందేహం లేదు. కానీ యమ్‌.ఏ లో కూడా ఆశాస్త్రపు మెళుకువలను తెలుసుకోకుండా ఎక్కాలే చదువుతానంటే ఒప్పుకొంటామా? వ్యాకరణప్రయోజనము శ్రుత్యర్ధనిరూపణం. తర్కశాస్త్ర ప్రయోజనం శ్రుతివాక్యముల అనుసంధానం. మీమాంస పరమప్రయోజనము చిత్తశుద్ధి సముపార్జనము. యువకులుగా ఉన్నప్పుడు ఆయాశాస్త్రములలో పరిశ్రమ చేసి క్రొత్త క్రొత్త భావనలనభివృద్ధి చేసుకోవడానికి వారికి అభ్యంతరమేముంది. వీటన్నిటి ప్రయోజనం భగవత్సాక్షాత్కారము, ఆత్మానుసంధానము, జీవన్ముక్తి అన్న విషయం ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. వయస్సు ఉడిగిన పండితునకు భగవంతుని చేరడం ముఖ్యమని చెప్పారు. శంకరులకు సంస్కృత భాషపైగల అధికారం అనన్యసామాన్యమైనది. వారి పరమగురువులు గౌడ భగవత్పాదులు పతంజలి వద్ద నేరుగా మహాభాష్యం (వ్యాకరణం) చదివినవారు. గురువులు గోవింద భగవత్పాదులు వ్యాకరణంలో అతి కష్టమైన సూత్రములను ప్రయోగించడంలో నేర్పరులనే విషయం మనం గుర్తుంచుకోవాలి.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page