Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

1. అంకితము

ఇలయాత్తం గుడిలో కంచి మహాస్వామివారు విడిది చేసి ఉన్నప్పుడు లక్ష్మణావదాన్లుగారు సాష్టాంగంగా నమస్కరించి తమకు సన్యాసం అనుగ్రహించమని కోరారట. స్వామివారు మౌనంగా కొంతకాలముండి 'కాలేస్మారయామః' కాలం వచ్చినప్పుడు గుర్తు చేస్తామన్నారట. అంతే! లక్ష్మణావుధాన్లుగారు మళ్ళీ స్వామివారికి ఈ విషయం మనవి చేయలేదు. స్వామివారూ ఈ విషయం ప్రస్థావించలేదు. స్వామివారు తమ జీవితమంతా వేదశాస్త్రముల ఉద్ధరణకు అనవతరమైన కృషి సలిపారన్న విషయం జగద్విదితం కదా! వారి పధకాలన్నిటినీ అవుధాన్లుగారు త్రికరణశుద్ధిగా అమలు పరిచేందుకు నిత్య సన్నద్దులుగా ఉండేవారు.

లక్ష్మణావుదాన్లుగారు కృష్టానదీ తీరంలో ఉభయ రామేశ్వర క్షేత్రమైన చెవులూరు గ్రామంలో జన్మించారు. 'ఈశ్వరాదనుగ్రహేణ పుంసామద్వైత వాసనా' 'జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్‌' వంటి అనేక ప్రమాణ వాక్యములు ఈశ్వరుని జ్ఞానప్రదాతగా నిర్ణయిస్తున్నారు. అట్టి మహేశ్వరునికి అనుగ్రహపాత్రమైన త్రిలింగక్షేత్రములో, 'కృష్ణా కృష్ణ తమస్సాక్షాత్‌' కృష్ణ పరమాత్మ రాధికల భక్తికి కరిగి కృష్ణగా ప్రవహించడని చెప్పబడుతున్న కృష్ణానదీ తీరంలో జనించిన అవుదాన్లుగారికి పుట్టుకతోనే అద్వైత వాసన, ఆత్మగుణములు స్వాభావికంగా సిద్ధించాయి.

గుంటూరు మండలంలో వేదవిద్య అంతరించి పోతున్న కాలంలో - కంచి మహాస్వామివారిచే అపరమత్స్యావతారంగా కొనయాడబడిన అప్పావుధాన్లు స్వామివారు (రామభ##ద్రేంద్ర సరస్వతీస్వామివారు) గుంటూరు మండల వేద విద్వత్ప్రవర్థక సభనొకదానిని స్థాపించారు. దానిలో ప్రప్రధమంగా వేదపట్టా తీసుకున్నవారు అవధాన్లుగారు. ఎంత శుభారంభమో చూడండి. ఈనాడు గుంటూరు జిల్లా వేదవిద్యలో కోససీమను ఢీకొంటున్నది. ఆంధ్రదేశంలో ఆ కాలంలో విద్యారణ్యభాష్యమంత ప్రసిద్ధిగా లేదు. లక్ష్మణావుధాన్లుగారెలా సాధించారో ఏమో! షడంగములతో వేదాధ్యయనంతో పాటు వేదభాష్యాన్ని కరతలామలకం చేసుకున్నారు. షడ్దర్శనములలో అనన్యసామాన్యమైన ప్రతిభ సాధించారు. ఈ రోజున ఆంధ్రదేశంలో ఉన్న వేదభాష్య పండితులందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవధాన్లుగారి శిష్యులో, శిష్యతుల్యులో అని చెప్పుకోవచ్చు. శ్రౌతంలో విశేష ప్రజ్ఞ సంపాదించి అనేక యజ్ఞములను అధ్యయనం చేశారు. సాంగస్వాధ్యాయ భాస్కరులు వారు. అయితే ఇంతటి పాండిత్యమున్నవారూ సన్మానములకు బద్ధ వ్యతిరేకులు. రాష్ట్రపతి బహుమానానికి పైరవీలు చేసుకొనే కాలంలో ఆ సన్మానాన్ని తనను వరించినా వదులుకున్న వినయశీలి.

వారు నిర్లిప్తులు. పరమతృప్తులు. నిరంతరము తాము చదివిన వేద వేదాంగ, దర్శన, దర్శశాస్త్ర, పురాణతిహాసాది శాస్త్రములను బ్రహ్మవిద్యతో సమన్వయం చేసుకొంటూ ఆనందాంబుధి మగ్నులై ఉండేవారు. వారు ఉపన్యాసములీయటం కంటె పాఠములు చెప్పడానికి ఎక్కువ ఉత్సాహం చూపారు. వారి జీవితంలో ఎక్కువభాగము అధ్యాపనంలో గడించింది. తమకై తాము ఎవరినీ యాచించేవారు కాదు. కానీ వేద పండితులకు ఉపకారములు చేయించడంలో వారికి వారే సాటి. పరోపకారంలో శిబిచక్రవర్తి, కృతజ్ఞతలో రామభద్రుని అంతటి వారని చెబితే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. శిష్యుల యెడ అమితమైన కరుణ గల అవధాన్లుగారు వేదవిద్యలను తమ వద్ద అధ్యయనం చేసే వారి విషయంలోనే కాక లౌకిక వృత్తులలో ఉంటూ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే వారి విషయంలో కూడా ఎంతో శిష్యవత్సలత చూపి విషయములను విడమరచి చెప్పేవారు. కవిసామ్రాట్‌ విశ్వనాధ లక్ష్మణావుదాన్లుగారికి తమ గురువులుగా స్తుతించడంలో అమితమైన ఆనందాన్ని పొందేవారు.

ఇటువంటి అనర్ఘరత్నము ఆధ్యాత్మిక సార్వభౌముని దృష్టిలో పడింది. 'రత్నహరీతు పార్థివ' అన్న ప్రసిద్ధోక్తిని నిజం చేయడానికా అన్నట్లు కంచి మహాస్వామివారు లక్ష్మణావుదాన్లుగారి హృదాయాన్ని హరించి వేశారు. తమ వానిగా చేసుకొన్నారు. కంచి మహాస్వామివారు వేదాభివృద్దికై వేసిన అన్ని పధకములలోనూ లక్ష్మణావుదాన్లుగారు ప్రధాన పాత్ర వహించారు. స్వామివారిపై వీరికున్న ప్రమాణ బుద్ధి అనితర సాధ్యమైనది. 1966-69 లలో కంచి మహాస్వామివారు ఆంధ్రదేశ యాత్రకు రావడానికి కారకులైన అతి కొద్ది మంది మహాపురుషులలో అవధానిగారొకరు. తొమ్మిదవ దశకంలో స్వామివారు సతారాలో బస చేసి ఉన్నప్పుడు లక్ష్మాణావుధానిగారు దర్శనానికి వెళ్లారు. అకస్మాత్తుగా స్వామివారు 'నీవు సన్యాస మడిగావే!' అన్నారు. ఎప్పటిమాట. ఇరవై అయిదేళ్ళ క్రితం అన్నమాట. చకితులైన అవదాన్లుగారు 'చిత్తం' అన్నారు. అమ్మగారు లక్షవర్తి వ్రతం, గోదానం చేయాలనుకున్నారే? పూర్తి అయిందా? అని ప్రశ్నించారు స్వామివారు. పోయి ఆ కార్యములన్నీ పూర్తి చేసుకొని రమ్మన్నారు. విజయవాడ తిరిగి వచ్చిన ఆవుదాన్లుగారు యుద్ధ ప్రాతిపదిక మీద లక్షవర్తి వ్రతము చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇంత తొందరేమొచ్చింది అని ఆశ్చర్యపోయారు అమ్మగారు. మరి తొందరే వచ్చిందనుకొన్నారు అవుదాన్లుగారు.

లక్షవర్తి వ్రతం అతి వైభవంగా జరిగింది. అవధాన్లుగారు నిదానంగా తమ ధర్మపత్నితో సన్యాస ప్రస్తావన చేశారు. హైదరాబాదు వెళ్ళి శ్రాద్ధాదులన్ని ముగించుకొని, పుత్రుల బాధ్యతలో ధర్మపత్నిని వదిలి బయలుదేరారు. అమ్మగారు సంచి సర్ది, భర్త చేతి కందించి తుదిసారిగా భర్తృ పరిచర్యలో భాగంగా ఏ మాత్రం చెదిరిపోని ఆత్మస్ధైర్యంతో వీడ్కోలు చెప్పారు. వారి మహోన్నత వ్యక్తిత్వం గురించి ఎంతో చెప్పాలని ఉన్నా లక్ష్మణావుదాన్లుగారి తగిన గృహిణి అని చెబితే నే చెప్పవలసినవన్ని సంపూర్ణంగా చెప్పబడినవవుతాయి.

తమకు అత్యంత ప్రీతిపాత్రులైన ఉగార్‌ స్వామివారి వద్ద లక్ష్మణావుధాన్లుగారికి సన్యాసమిప్పించే ఏర్పాటు చేశారు మహాస్వామివారు. అవుదాన్లుగారి సన్యాస నామము జనార్దనానందస్వామి అయినా వారు అవధాని స్వామివారుగానే ప్రసిద్ధులు. కంచి చేరి మహాస్వామివారి సన్నిధిలో బహుకాలముండి తాము శాస్త్రములలో చదివిన జీవన్ముక్తత్వ లక్షణములను మహాస్వామిలో ప్రత్యక్షంగా చూస్తూ అనందానందాన్నను భవించేవారు. తరువాత కొంతకాలం విశాఖ మఠంలో శంకర మఠాన్ని అభివృద్ధి చేశారు. వారణాసిలో కొంత కాలమావాసం చేశారు. ఎక్కడెన్నిరోజులున్నా మనస్సు మాత్రం శ్రీశైల శృంగ కుహరములలో విహరిస్తూ ఉండేది. మహాస్వామివారికి తమ తుదికాలం శ్రీశైలంలో గడపాలనే సంకల్పం ఉండేదని చెప్పుకొంటారు. ఆ సంకల్పం వారికత్యంత ప్రీతిపాత్రులైన శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామివారిచే పూర్తి చేయబడినది. శ్రీజనార్దనానంద సరస్వతీ స్వామివారు వైశాఖ శుద్ధ విదియ మంగళవారం రాత్రి (ది.14.5.2002) 10గం|| సమయంలో శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మీభూతులైనారు.

అవధాని స్వామివారు మహాపండితులు. వారు వ్రాసిన వ్యాసమైనా, పుస్తకమయినా ఎంతో నిర్దుష్టంగా ఉంటే గానీ సమాధానపడే వారు కాదు. ఏ విషయాన్నైనా పటిష్టంగా ప్రతిపాదించటం వారి లక్షణం. నేను ఏ సామర్ధ్యమూ లేనివాడను. ఏదో శంకర భగవత్పాదులపై భక్తితో వారి చరిత్ర అధ్యయనం చేసే సందర్భంలో కలిగిన అబ్బురపాటును వ్యక్తికరించుకోవడానికి వ్రాసిన వ్యాసములు వారికి అంకితమివ్వడానికి నేనెలా సాహసం చేయగలిగాను? వ్రాసిన తీరెలా ఉన్నా, భగవత్పాదుల వారి గురించి వ్రాశాను కాబట్టి వారికి ఆనంద దాయకంగా ఉంటుంది. వారికి బాలురను వారి తప్పులన్నిటినీ సహించి ప్రోత్సహించే ప్రసాదలక్షణము ఉన్నది. పసి ప్రాయం నుండి వారిని అనేక పర్యాయములు దర్శించినప్పుడు, సదుపదేశములు చేసే అనుగ్రహము వారికి నాపై ఉన్నది. మీదుమిక్కిలి వారితో నాకొక చిక్కటి సంబంధమున్నది. మహాస్వామివారి కంఠమునలంకరించే దివ్యకుసుమం వారయితే, మహాస్వామివారి పాదములనంటటానికి ప్రయత్నించే గడ్డిపువ్వును నేను. బ్రహ్మీభూతులైన మహాస్వామివారిలో ఐక్యత నొందిన శ్రీ జనార్దనానంద సరస్వతీస్వామివారు నాపై అనుగ్రహ భావంతో ఈ చిన్న గ్రంధమును స్వీకరించగలరు గాక యని ప్రార్దించుచున్నాము.

రచయిత

Bharatiya Samaikyatha Murthy   ఈఠశూష|స    ంశష శగ|