Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

జ్ఞానమే పరాశక్తి - అదియే ప్రజ్ఞ

మా కిచ్చిన స్వాగతపత్రములో శ్రీకామకోటి పీఠాధీశ్వరులు. పరదేవతా స్వరూపు లనినారు, ఇది స్తుతిపరముగా ఉపచారవాక్యమైనను ఒక విధంగా నిజమే. కీటకము మొదలు గజమువరకు మధ్యలో మనష్యుడు అందరు, సర్వవస్తువులు పరదేవతా స్వరూపులే. ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అని వేదములు సర్వశాస్త్రములు చెబుతున్నాయి. అదే సత్యమని సర్వవిజ్ఞాన ప్రబంధాలు చెబుతున్నాయి. జ్ఞానులందరు ఆమాటనే చెబుతున్నారు, ''నేను నేను'' అని అనుకొనేది. అది పురుగైనా, ఏనుగైనా, ఒకే శక్తి నుండి వచ్చినవే, శక్తి ఒక్కటే మిల్లులు, ఫ్యానులు, గాలిని చల్లబరచే ఏయిరుకండిషన్‌ యంత్రాలు. వీటినన్నిటిని ఆడించే వస్తువు ఒక్కటే, అదేశక్తి. (ఎనర్జీ) చూడబడేది దృశ్యం, శక్తి అనేకవిధాలుగా వుంటుంది. దృశ్యములే అదృశ్యములై పోతాయి, విద్యుచ్ఛక్తి, కంటికి కనబడదు, కనులతో చూడలేము ఒకే శక్తి అన్నిరూపాలుగా ఉంటుంది-అని విజ్ఞానశాస్త్రవేత్తలు చెప్పినారు. దృక్కు కనబడదు, దృశ్యమే కనబడును. చూడబడేదానిని వారు నిర్ణయించినారుగాని చూచేదానిని వారు నిర్ణయించలేదు. ''శ##క్తేమేటరు'' అవుతుంది అంటారు. కొబ్బరిచెట్టు, మామిడిచెట్టు మొదలైనవి. మట్టి, నీరు వీనితో ఏర్పడినవి, అదేవిధంగా శరీరంకూడా మట్టి నీటితోనే ఏర్పాటు అవుతుంది, తినే పదార్థములు జీర్ణమైపోయిన తర్వాత అదే రూపమును పొందుతాయి. జడవస్తువు లన్నిటికి ఒక్కశక్తి కారణమని భౌతికవిజ్ఞానులు చెబుతారు, మట్టిద్వారా శరీరం అని ఉపనిషత్తులు చెపుతున్నాయి. చూడబడేవి అన్నీ శక్తి స్వరూపములే అయినపుడు జీవులలో పురుగులు లగాయతు ఏనుగువరకు ఎన్నో శరీరములు శాస్త్ర గ్రంథములలో చెప్ప బడియున్నవి. సూక్ష్మదర్శినిలో చూస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా కనుపిస్తాయి. ''నేను నేను'' అనేది చిచ్ఛక్తి స్వరూపము, అదే జ్ఞానరూపంగాను విజ్ఞానరూపంగాను వ్యవహరింపబడుతుంది.

పరదేవతాస్వరూపులు అంటే, ''యాదేవీ సర్వభూతేషు'' అన్నట్లు అన్ని పురుగులు పరదేవతా స్వరూపములే. నేనునేను అనే వస్తువు ఏవస్తువును చూస్తున్నామో దానికంటే భిన్నం కానిది అన్ని వస్తువులు అయినది. అది ప్రజ్ఞారూపంగా ఒకటే అని శాస్త్రంలో చెప్పబడియున్నది, చూచేది చూడబడేది అన్నీ ఒక్కటే-జ్ఞానమే పరాశక్తి, దానికి ''ప్రజ్ఞ'' అని పేరు. కామకోటిపీఠాధిపతి పర దేవతా స్వరూపులని స్తుతిస్తున్నారుకదా! మనముకూడా పరదేవతా స్వరూపులము అనుకుంటే స్తుతిచేయము. నిజమైన స్తుతి ఏమంటే సూక్ష్మదర్శినితో చూస్తే చిన్నపురుగులో ఉండే శక్తికూడా పరదేవతా స్వరూపమని భావించుటయే, అట్లు భావించుటకు అనుభవం కావాలి. చూడబడే వస్తువులలో చూచే స్వరూపం ఉన్నదని, ఉపనిషత్తులు చెప్పుచున్నవి. అయితే ఎందుకు చూడడంలేదు. అజ్ఞాన మనే తెర ఏర్పడియుండుటచే ఆ తెలివి లేకపోవుచున్నది. ఆ తెర కూడా ఏర్పడినది, ఆ చిత్స్యరూపమునుండే సూర్యకిరణములు నీటిని గ్రహింపగా ఏర్పడిన మేఘము. ఏ సూర్యునినుండి ఏర్పడినదో ఆసూర్యునే కనబడకుండ చేయుచున్నది, పాజిటివ్‌, నెగటివ్‌, లేకుంటే ప్రపంచమేలేదు. పెద్దలకు, దేవునికి సేవజేయుట, గురుభక్తి, ఈశ్వరభక్తి, పతిభక్తి, చేస్తుంటే ఆ తెర తొలగుతుంది. ఆవిద్య-విద్య, శివం-శక్తి. సుందరం అన్ని పరమాత్మస్వరూపమే, దేవుడు (శాట్రన్‌) రెండు ద్వంద్వం. సత్యం-అసత్యం, ఆవిధంగా పెట్టకపోతే అజ్ఞానం పోగొట్టుకుని ఒకే వస్తువని అనుభవమునకు వచ్చినపుడు పొందే ఆనందానికి అంతు ఉండదు. ఎండలో నడచిన తరువాత కోనసీమ కొబ్బరితోటలో ప్రవేశిస్తేనే ఆనందము కలుగును కష్టాలు యుద్ధాలు అనుభవించిన తరువాతనే సుఖానుభవం కలుగుతుంది-

రెండవవస్తువు ఉంటుందని ఆసించినప్పుడే దానియందుమనకు భయంగాని, భక్తిగాని కలుగుతుంది, రాగద్వేషములు కలుగుతాయి, ఉన్న వస్తువు ఒక్కటే అయినప్పుడు రాగద్వేషము లుండవు. మంచివారు. పాపులుకూడ ఒక్కస్వరూపంలోని వారే, అంతా ఒక్కటే అయినప్పుడు ఆనందమేకాని దుఃఖ ముండదు.

అఖండానందానుభవం కలగడానికే ఈసృష్టి, అందరు పరమాత్మ స్వరూపమే అయితే పూజ ఎందుకు? మనం అజ్ఞానమనే తెరతీయడానికే, సాలెపురుగు తనలో నుండి బయలుదేరిన దారములతో గూడు కట్టుకొని, దానిలోనుండి బయటికి రాలేక అందులోనే యుండి నశిస్తున్నది. పట్టుపురుగు తన దారాలతో గూడు తానే కట్టుకుంటుంది. అది పూర్తిఅయిన తరువాతనైతే దానంతట అది ఎగిరి పోగలదు. మన మట్లా పూర్తికాకుండానే ఆపురుగులతో గూళ్లను వేన్నీళ్లలో పోసి లక్షలకొలది ప్రాణులను హింసిస్తున్నాము. ఎద్దుతోలు, జింకతోలు, పులితోలు ఇవి ఒక్కజీవికి మాత్రమే హింస, ఒకపట్టు బట్టకు పదిలక్షలపురుగుల హింస జరుగుతున్నది. ఒకే పట్టుపురుగు తనంతట తాను పెరిగి బయటికి వస్తుంది. అది బయటికి వచ్చాక ఆదారములతో తయారుచేసిన పట్టుబట్టను ''అహింసా పట్టువస్త్రము'' అంటారు. అది సున్నితంగా ఉండదుగాని దాని నిర్మాణంలో హింసలేదు. అదే మడుగునవస్త్రం, దానినే ధరింపవలెను.

ప్రజలు అహింసను పాటించుటలేదు. మన బంధాన్ని మనమే కల్పించుకుంటాము. దానిని భేదించుకుంటే అఖండానందాన్ని అనుభవిస్తాము. కొన్ని విషయాలకు మనకు ఒకప్పుడు అర్థం తెలియదు. తెలియనప్పుడు చాలా భారంగా వుంటుంది. శ్రమపడి ఆ అర్థాన్ని తెలుసుకొన్నప్పుడు మనకు కలిగే ఆనందానికి అంతు ఉండదు. మట్టితో బొమ్మలు చేస్తారు. ఏనుగు, పోలీసు, గుమ్మడికాయ మొదలయినవి తయారవుతాయి. పిల్లలు వాటిని చూచి ఇది గుమ్మడికాయ, ఇది పోలీసు అని నిజంగా అనుకుంటారు. కొందరు పంచదారతో బొమ్మలు చేస్తారు. అందులో రూపాన్ని, రంగును బట్టి ఇది కాకరకాయ, ఇది బెండకాయ అని తెలుస్తుంది. అది అనుభవిస్తే తీపి ఒక్కటే తెలుస్తుంది. కాకరకాయచేదుకాదు. బెండకాయ వగరుకాదు. అని జీవులు పరమాత్మ స్వరూపం అని అనుభవానికి వచ్చినపుడు ఏ దుఃఖం అనిపించదు.

భక్తి, జ్ఞానం అనేవి కొంతవరకైనా వుంటే కష్టాలను తేలికగా దాటగలుగుతాడు. అదే ఎక్కవగా వుంటే క్రోధము, దుఃఖము, హింస అనేవి వుండవు. రెండవ వస్తువు ఉన్నప్పుడే అవి వుంటాయి.

అంతా ఒకేస్వరూపమయితే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? ఈశ్వరపూజ చేయుట ఎందుకు? దేవుడు మనము ఒకటేకదా? చూచేవాడు చూడబడేవాడు, ఒకడే అన్నిటికి పృథివియే కారణము. బీజరూపంగా ఉండే సుగంధము, దుర్గంధమునుబట్టి, నీరు ఈ రెండిటి సమ్మేళనంతో బయటికి వస్తుంది. అయినప్పుడు దేవుణ్ణి పూజచేయడ మెందుకు? అని అడుగుతున్నాము గానీ, ఒకర్ని కొట్టడం మెందుకు? కోర్టులెక్కడ మెందుకు? అన్నం తినడమెందుకు? పెండ్లి ఎందుకు? అని అడుగుటలేదు. ఒక్కదేవుని పూజచేయడ మెందుకు అని అడుగుతున్నాము. అంతా పరమాత్మ స్వరూపమే అని అనుభవానికి వచ్చినపుడు ఏ ప్రవృత్తి కూడ ఉండదు. కామ క్రోధాదులకు లోనయి అన్నీ నేను అని తలవడంలేదు. ఈ భావమే ఉంటే తప్పులు చేయము, మనకు భేదబుద్ధి ఉన్నప్పుడే కామక్రోధాదు లేర్పడుతాయి.

8-11ొ

తప్పుచేస్తాము అంటే మనకు భయం లేదన్నమాట, భగవంతు డున్నాడనుకంటే తప్పు చేయము, అన్నిటిలోను భగవంతుడున్నాడనే అనుభవం వచ్చినపుడు దేవపూజ అక్కరలేదు, ఆ భావం ఏపాటియైన అనుదినం కలగడానికే దేవాలయమునకు పోయి దేవతామూర్తిని దర్శించుట, పుణ్యక్షేత్రాలలో మహరులు దేవతామూర్తులను ప్రతిష్టచేసి వారి తపస్సును ధారపోశారు. ఆ మూర్తి దర్శనము చేస్తే అంతా పరమాత్మయే అనే భావం దృఢమవుతుంది, ద్రాక్షారమం, శ్రీశైలం మొదలయిన పుణ్యక్షేత్రాలలో దేవతామూర్తులను దర్శిస్తే భగవంతు డున్నాడనే భావం వస్తుంది. ఈశ్వర సాక్షాత్కారం గల మహరులు తపస్సు ధారపోసి, భక్తులు తరించుట కేర్పాటుచేసిన ప్రదేశములే. క్షేత్రములంటే మనం ప్రార్థనచేయడం లేదు. అందుచే ఆ దేవతల అనుగ్రహం మనకు కలగడం లేదు.

సర్వవ్యాపకమైన పరమాత్మ శివాలయంలోకి వెళ్లినపుడు ఒకరాతిలోనైనా ఉన్నట్లు ధ్యానంచేస్తే, అన్ని శిలలలోను, అంతటా ఈశ్వరుడున్నాడని ధ్యానం చేయడానికే మహరులు ఈ దేవతా మూర్తులను క్షేత్రాలలో తపస్సు ధారపోసి నిలిపారు. ''ఆత్మానం శివరూపం భావయేత్‌'', ''ఆత్మానం దేవీరూపేణ భావయేత్‌'' అని అభేద భావన చేస్తే, ఆభావనా దార్ఢ్యమువలన మనకు ఆమందానందానుభవం కలుగుతుంది. మనకు ఎన్నో కోరికలున్నాయి, అవి తీరడానికే ఈశ్వరునకు అర్ఘ్యం, పాద్యం, ఆసనం, ధూపం, దీపం, నైవేద్యం, ఛత్రం, చామరం, మొదలయిన ఉపచారాలు చేయడం, అంతా ఈశ్వరస్వరూపమైనపుడు, ఈశ్వరుడిచ్చిన వాటిని, అతడినుండి మనకు రావలెనంటే, అతడీయకుండా ఎలావస్తాయి? అందుచే ఆ భగవంతుడి కర్పిస్తేనే మనకు వస్తాయి.

బొంబాయి ప్రాంతములో వరము కురిస్తే గోదావరికి వరదలువచ్చి, కాలవలద్వారా వచ్చేనీటిని సస్యాలకి సప్లయి చేసే ఇంజనీరు మొదలయిన వారికే, నీరిచ్చినందులకు కృతజ్ఞత తెలుపు కుంటున్నాము గదా! అయినప్పుడు అసలు మనకు నీరు తద్వారా అన్న, వస్త్రాదులు యిచ్చే భగవంతునికి మనమెంత కృతజ్ఞులమై వుండాలి.

పరమేశ్వరుడు సచ్చిదానందస్వరూపుడన్నారు. సత్స్వరూపము శివుడు, చిదానంద స్వరూపము పరదేవత, అదే అర్థనారీశ్వరుడు. ''మురమళ్లలో నిత్యకళ్యాణం పచ్చతోరణం'' అదే ఈశ్వర దాంపత్యం, అప్పయదీక్షితులవారి మనుమలు ''చిదానందలహరి'' అనే గ్రంథాదిని అప్పయ్యదీక్షితుల వారినే పరాశక్తి స్వరూపంగా భావించి స్తుతించారు. అందుచే ప్రపంచములో అందరు పరదేవతాస్వరూపులే.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page